ముఖాముఖం

ప్రత్యామ్నాయ కవిత్వం ద్వారానే అణచివేతను ఎదుర్కోగలం – జూపాక సుభద్ర.

సెప్టెంబర్ 2013

తెలంగాణ అస్తిత్వానికీ, దళిత అస్తిత్వానికీ నిలువెత్తు కవితా రూపం జూపాక సుభద్ర. ఈ రెండు అస్తిత్వాలకు తన స్త్రీ అస్తిత్వం కూడా తోడయ్యి ఆధునిక తెలుగు కవిత్వంలో ఒక వినూతనమైన, విలక్షణమైన సొంత గొంతుకగా సుభద్ర మార్మోగుతున్నది. పైటను తగలెయ్యాలన్న ఆధునిక అర్బన్ స్త్రీవాదానికి ప్రత్యామ్నాయంగా దళిత శ్రామిక స్త్రీవాద దృక్పథాన్ని తెలంగాణ గొంతుతో వినిపించింది సుభద్ర . 1989-95 ల మధ్య వామపక్ష ఉద్యమాలలో చురుకుగా పనిచేసిన సుభద్ర తనదైన అస్తిత్వాలని కనుక్కున్నది. నిజానికి ఇవాళ్ళ తెలంగాణ, దళిత, స్త్రీవాద అస్తిత్వాలతో రాస్తున్న సుభద్ర లాంటి కవులు, రచయితల ఆవిర్భావం వెనుక 90 వ దశకం మలిభాగంలో మారోజు వీరన్న కృషి ఎంతో ఉన్నది. వీరన్న రాజేసిన శ్రామిక దళిత బహుజన తెలంగాణ అస్తిత్వాల నిప్పురవ్వ ను సాహిత్యంలో రాజేస్తున్న సుభద్ర గత దశాబ్ద కాలంగా తెలంగాణ భాషలో అద్భుతమైన కవిత్వం రాస్తున్నది, ఆమె కవితా సంకలనం ‘అయ్యయ్యో దమ్మక్కా!’ లో శ్రామిక దళిత తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ మూలాలని తెలంగాణ భాషలో ఆవిష్కరించింది. సహచరుడు కృపాకర్ తో జీవితాన్నీ, సాహిత్యాన్నీ, ఆచరణనూ పంచుకుంటూ… సమకాలిక అస్తిత్వ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టి స్తున్న సుభధ్ర గారు తన జీవిత, సాహిత్య విశేషాలని మనతో పంచుకుంటున్నారిలా …

 

 

1. బాల్యం – నేపధ్యం- జీవిత ప్రయాణం

మాది వరంగల్. మా యింట్ల నేను పదకొండో సంతానం. ఎవ్వరికి చదువుల్లేవు. నా బాల్యమంతా సింగరేణి బొగ్గు గనుల చుట్టూ బంకరై తిరిగి పెరిగింది. నీళ్ళ కాడ, నిప్పుల కాడ , ఆట కాడ, మాట కాడ అంతటా అంటరాని వివక్షలతో సాగిన జీవితం. అట్లా కొనసాగిన అణచివేతల దారిలో అణగారిన వర్ణాలకు సంబంధించిన రాజకీయ ఉద్యమాల మార్గాన ఇంకా అనేక వాదాల ప్రవాహం లో నా గుర్తింపును నిర్మించుకునే క్రమంలో గుచ్చుకున్న ముళ్ళు, రాళ్ళు, ఎండిన ఎడారులు, నీటి సెలిమల్లా ఊరిస్తూ ఆకర్షించిన రొచ్చుగుంటలు, మొగలి వాసనల విషపు కాటులతో పాటు తీయని వసంతాలు, పచ్చని శిశిరాలు, చల్లటి గ్రీష్మాలు, వెచ్చని శరత్తులు, పైకెగసిన గాలి పటాలు నేలకరిగిన చినుకులు వున్నాయి. అవన్నీ నన్ను నిద్ర పోనివ్వని జ్ఞాపకాల అల్లిక అలజడులే! ఆ అల్లికలో, ఆ అలజడుల్లో కుటుంబీకులు, కుల, వర్గ సంబంధీకులు గురువులు, శత్రు మిత్రుత్వాలు కలెగలిసిన సహచరులు, మేధావులు, ఆప్తులు, స్నేహితులు, అనేక వైరుధ్యాల వైవిధ్యాల సాహిత్యాలు, కవులు, తత్త్వాలు, ధోరణులు, తాత్పర్యాలు దేనికదే ఒడ్డున బెట్టినట్లు గాక అన్నీ కలిగెంబులిగెంగ విడదీయ లేనంతగా అనేక విధాలుగా నన్ను ప్రభావితం చేసి రచనల వైపు నడిపించాయి.

తెలంగాణ సాయుధీ రైతాంగ పోరాటం మా ప్రాంతంలోనే జరిగింది. కాని పోరాటం తర్వాత మా వూరి, వాడ, ప్రాంత దళిత బహుజనులకు జరిగిన దేమి కనిపించ లేదు. లక్షల ఎకరాల భూపంపకంలో మా వాళ్ళు ‘ఎద్దడుగు’ జాగా కూడా పొందలేదు. హెచ్చు తగ్గుల్ని సమర్ధిస్తున్న కౄరమైన ‘కుల’ నియమాన్ని పోగొట్టుకో లేదు. మా వాళ్ళంతా పాలేర్లు, జీతగాళ్ళ స్థానం నుంచి ‘కూలి గాల్లు’గా మిగిలిండ్రు. కాని పోరాట ఫలితమైన లక్షల ఎకరాల భూమిని రెడ్లు, వెలమలు, వలసొచ్చిన అంధ్రా కమ్మోల్లు పంచుకొన్నారు. రెడ్లు వెలమలు ఆ భూముల్ని అంధ్రా కమ్మోల్లకు కొంత అమ్ముకొని, కొంత కౌలుకిచ్చి ఆ డబ్బుతో పట్నాలల్ల రియల్ ఎస్టేటర్లుగా, బిల్డర్లుగా, రాజకీయ వ్యాపారులుగా, పారిశ్రామిక వేత్తలుగా అవతారాలెత్తితే, అంధ్రా కమ్మోల్లు మా తెలంగాణ ప్రాంతపు పంటలన్నింటిని నాశనం చేసి మా భూముల మీద వ్యాపార పంటలు వేసి ఫెస్టిసైడ్ విప్లవ ప్రయోగాలు చేసి వెన్నముద్దసొంటి మా రేగడి భూముల్ని ఎర్ర నేలల్ని ధ్వంసం చేసిండ్రు. ఒక భూమి పరంగానే కాక, నీటి పరంగా, విద్యా, ఉపాదుల పరంగా, భాషా పరంగా మొత్తం మా సంస్కృతినంతా అడుగు పట్టించిన ఆంధ్ర వలస వాద ఆవరింపుల రాజకీయములో మా వూల్లు పల్లెలన్ని వట్టి పొయినయి.

తెలంగాణ ప్రాంతమయినందుకు ప్రాంతీయంగా, ఆ ప్రాంతంలో మాదిగ అయినందుకు కుల పరంగా, వర్గపరంగా, ఆ కులంలో స్త్రీ అయినందుకు జెండర్ పరంగా, ఆ జెండర్ లో కింది కులం అయినందుకు మాదిగ స్త్రీగా, ‘బాంచె గాళ్ళకి బాంచ’గా మూకుమ్మడి అవమానాల అణచివేతల దాడి నా ప్రతి కదలికల మీదా మోపబడింది. నా బాల్యమంతా సింగరేణి కాలరీస్ బొగ్గు గనుల చుట్టూ బంకరై తిరిగింది. ఆ గనులకి లాగానే నాకు కూడా తవ్వినా కొద్దీ వెల్లబోసేదంతా మండే ఇంధనమే! ఆ గనుల పొరల్లో వున్నట్టు నీళ్ళు, అగాధాలూ, చీకట్ల సామ్యం నాకూ వుంది.

సింగరేణి కాలరీస్ లో మా ఇళ్ల పక్కనే ప్రైమరీ స్కూలు నాల్గవ తరగతి దాకా వుండేది. రెండు గదుల్లో నాలుగు క్లాసులు జరిగేవి. అది తడ్కలతో కట్టింది గనక అందరూ దాన్ని తడ్కల బడి అనేటోళ్ళు. మాకున్న ఒకే వొక్క సారు నాలుగు క్లాసులకు పాఠాలు చెప్పేవాడు. ఒక్కొక్క క్లాసుకు వారానికి రెండు పాఠాలు జరిగితే మహా ఎక్కువ. వారంలో జరిగే రెండు క్లాసులు మినహా మిగతా టైమంతా మగపిల్లలు సెరువులో ఈతలకూ, పరికి పండ్లకూ, రెగ్గాయల సెట్లల్లకూ, సైకిల్ తొక్కనీకి గ్రౌండ్లకు పోయేవాల్లు. కానీ మా ఆడపిల్లలం బొమ్మరిల్లాటలూ, గురుగులాటలూ, బొమ్మల పెండ్లి ఆటలూ, సిన్న సిన్న పటువలతో నీళ్ళు మోసుడు, గిన్నెలు తోమడం, వాకిలూడ్చే పనులు చేసెటోల్లం. మాక్కూడా దోస్తులతోని సెరువుకి బోయి ఈత కొట్టాలని, చెట్లెక్కాలని, పండ్లు తెచ్చుకోవాలని, సైకిల్ తొక్కాలని చాలా కోరికగా వుండేది. ఒక సారి దొంగతనంగా నేనూ మా దోస్తు గ్రౌండులో సైకిల్ తొక్కితే, అది బయటపడి, మా అన్నలతోని చావు దెబ్బలు తిన్నాము. ఈ మొగ పోరగాండ్లను గాలికి వదిలేసినట్టు మా ఆడపోరగాండ్లని కూడా వదిలేస్తే వాళ్ళ తాత సోమ్మేం బోయేదోననిపించేది

నాల్గవ తరగతి వరకూ చెప్పీ చెప్పని, వినీ వినని పాఠాలతో, చదివీ చదవని పరీక్షలతో, బయటపడి, మా ఇండ్లకి రెండు కిలో మీటర్ల దూరమున్న హైస్కూల్లో చేర్పించిండ్రు. నాల్గో తరగతి దాకా చదివిన పది, పదిహేను మంది నా క్లాసు ఆడ పిల్లల్లో ముగ్గురం మాత్రమే కొత్త స్కూల్లో (హై స్కూల్లో) చేరినాము. ఆ స్కూలు ఊరు, వాడకు దూరంగా ఆఫీసర్ల కాలనీ మధ్యలో వుండేది. సింగరేణి బొగ్గుబావులు తవ్వే కార్మికుల పిల్లలు అక్షరాన్ని అందుకోవాలంటే రోజూ నాలుగు కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. ఆఫీసర్ల కాలనీ వాళ్ళు, మా స్కూల్ టీచర్లు, ఆ కాలనీ పిల్లలు ‘అండీ’ ‘గారు’ అని ప్రతీ మాటకు వాడేవారు. ఆ పదాలు నాకు కొత్తగా వింతగా అనిపించేవి. వాటిని పట్టుకోవాలని ప్రయత్నించాను కానీ నా భాషకు యిప్పటి వరకు అతకలేదు.

పుస్తకం లో వున్న భాషకు, ఈ ‘అండీ’ ‘గారు’ భాషకు తేడా ఏమీ కనిపించక పోయేది. ఆ భాష నాకు నోరు తిరగనట్లుండేది. నేనల్లుకునేట్లుగా లేకపోయేది. పేరుకు తెలుగే కానీ మా యింట్ల వాళ్ళు, మా పరిసరాల వాళ్ళు మాట్లాడే భాషే కాదు. అంతా అయోమయంగా వుండేది. యింట్లడిగితే ‘సదువంటే గట్లనే వుంటది బిడ్డా, అండ్ల మన మాటుండది ముచ్చెటుండది’ అనే మా ముసలవ్వ మాటలు వేరే దిక్కు లేదు అనే రాజీ అర్థం తో సముదాయించినట్టుండేది. ఆ భాష అర్థం చేసుకోవడానికి అలవాటుపడడానికి ఎంత అవస్థ పడ్డానో. ఒక్క భాషే కాదు, పాఠ్యపుస్తకాల్లో, బయటి పుస్తకాల్లో, చందమామ కథల్లో, రెడియోలల్ల, పేపర్లల్ల, సినిమాలల్ల, సినిమా పాటలల్ల ఎక్కడ విన్నా, చదివినా మా భాషగానీ, మా వాళ్ళ పేర్లు గానీ, మా దేవుళ్ళ పేర్లు గానీ, మా పండుగల పేర్లు గానీ, మా వంటకాల పేర్లు గానీ, మా వాళ్ళ కట్టుబొట్టున్న బొమ్మలు గానీ చూద్దామన్నా కనబడక పోవడానికున్న కారణాలు, అడ్డంకులేమిటో తెల్వక పోయేది.

ఆంధ్రవంటలు, తెలుగు వంటల్లో దద్దోజనం, ఆవడ, గోంగూర, పూతరేకులు, బొబ్బట్లు, ఇడ్లి, దోశ లాంటివన్నీ టీచర్ చెప్పే పాఠాల్లో వినుడే గానీ అవెట్లుంటాయో తెల్వక పోయేది. మరి మా పల్లెల్లో, మా ప్రాంతంలో వండుకునే ఉల్లిగడ్డలకూర, పచ్చి పులుసు, సింతపండు తొక్కు, బొక్కల సోరువ, వంకాయ వట్టిచాపలు, సియ్యల కూరలు, బెల్లం బువ్వ, పాషం బువ్వ, బెల్లపప్పలు, రొట్టెలు, కుడుములు, పేలాలు, గుడాలు వాటి రుచి తెలుగు వంటల్లో ఎందుకు చేరలేదు. యిక నోరు తిరగని, అలవాటు లేని సుబ్రహ్మణ్యం, మీనాక్షి, పంకజం, సుబ్బారావు, గాయత్రి, పద్మనాభ శాస్త్రి లాంటి పేర్లే గానీ మాకలవాటైన మా ప్రాంతపు ఎల్లమ్మ, మల్లన్న, సమ్మక్క, సారక్క, లింగయ్య, ఐలయ్య, కొమురయ్య, భద్రక్క, పోశమ్మ, ఉప్పలమ్మ పేర్లు నేను చదివే పుస్తకాలల్లుంటే బాగుండేదనుకునేది. ఆకరికి మా దేవుళ్ళు గూడ పుస్తకాల్ల, సినిమాలల్ల కనబడకుంట రేడియోల్ల వినబడకుండా వుండేది. రామేసుడు, బద్దిపొశమ్మ, కట్టమైసమ్మ, కొమురెల్లి దేవుడు, మల్లన్న దేవుడు, సమ్మక్క, సారక్క, పోశవ్వ, ఉప్పలమ్మ దేవుల్లు మా పుస్తకాలల్లుంటే వాళ్ళకు నెమలీకలు బెట్టి మొక్కుకుంటే మంచి గుండే దనుకునేది,సదువు బాగోస్తాదనుకునేది.

యింకా మా పుస్తకాల్ల తెలుగు వాళ్లవని చాలా బొమ్మలుండేవి. కానీ ఆ బొమ్మల కట్టు బొట్టుకు మా వాళ్ళ కట్టు బొట్టుకు పోలికే కనబడక పొయెది. మా ఆడోల్ల గోసి కట్టు,యేలి సిగె, గంటీలు, సెవు పుల్లలు, ముక్కు పోగులు, పక్క పుల్లల్లు, మీది పుల్లలు, నల్ల పూసల గుండ్లు, పట్టెడ, కాళ్ళ కడాలు, సాలం కడాలు, తోడాలు, దండె కడాలు, ముంజేతి కడాలు పెట్టుకున్న బొమ్మలు మా ప్రాంతపు మొగోల్ల పంచె కట్టు, సెవు పోగులు, చేతులక్కడాలు, తలకు రుమాలు, భుజాన కండువా , కాళ్ళకు దేవుని బేడీలు, మొలపట్ట, చెవుల సుట్ట వున్న బొమ్మలు ఆ తెలుగు వాళ్ళంటున్న బొమ్మల్లో వుండక పోడానికున్న అభ్యంతరాలేంటివో తెలువక పొయ్యేది. మేము పెద్దగా చేయని సంక్రాంతి వంటి పండుగల మీద ఏకంగా పాఠాలే వుండేది గాని మా వూల్లె, ప్రాంతంల చాలా గొప్పగా, పెద్దగా చేసుకునే ‘సద్దుల’ పండగ గూర్చి వుండక పోవడం మనసు చిన్నబోయేది.

యిక అంధ్ర ప్రదేశ్ భౌగోళిక చరిత్రలో నదుల ప్రస్తావనొచ్చి కృష్ణ, గోదావరి, పెన్నా, తుంగ భద్ర నదులున్నాయని చదూకున్నపుడు, మరి మా వూరు పక్క నుంచి చాలా వూళ్ళ పొంటి పెద్దగా పారే మా ‘గంగ’ పేరు లేదేంది? అదే టీచెర్నడిగితే ‘గంగేంటి గంగా? అది వారణాసిలో వుంటది, నోర్మూసుకొని కూర్చో’ అన్నది చాలా కసురుకొంటూ. స్పష్టత కోసం పడే నా ఉత్సాహాన్ని కూడా నోర్మూయించింది. మా మంచిరాల ‘గంగే’ గోదావరి నది నా కప్పటి వరకూ, ఇంకా చాలా రోజుల వరకు తెల్వలేదు. యిట్లా వా చదువంతా నాకు నా కుటుంబానికి వా పరిసరాలకు సంబంధించని, సామరస్యం లేని, సమన్వయం కాని, అలవాటులేని , అలవికాని పేర్లని పదాలని గుర్తు పెట్టుకోడానికి, తిరిగి అవి పేపరు మీద పెట్టడానికే నా బాల్యపు శక్తి యుక్తులన్నీ ధార పోశాను. మా వూల్లో ఆడోల్లు వ్యవసాయం పనులన్ని చేసినా ఆ ఆడోల్లల్ల లేకూడ్వనీకి పోయేది మా ఇండ్లల్ల, మా కులపాడోల్లె పోయేది. కోతలయి, కల్లం లేసినంక ఆటిలో సిల్లిన వడ్లను వూడ్చి సెరిగి, కోడి మట్టి నుంచి గింజల్ని విడదీసే పద్దతిని ‘లేకూడ్వడం ‘ లేకి పని ‘ అంటరు. కాని అది వేరే కులపాడోల్లు ఎందుకు చేయరో, ప్రత్యేకించి మా కులము వాళ్ళే ఎందుకు చేస్తరో అర్ధం కాక పోయేది. అట్లనే ‘దప్పు’. యీ దప్పు తయారీ లో మా మామ తోలుకు సున్నం, ఉప్పు రాసిస్తే దప్పు మూసే వరకు మా అత్త దాన్నిపొతం జేస్తే దప్పు కొట్టేది మాత్రం మా మామ యింకా మా మొగోల్లు కొట్టేది. దప్పు మా ఆడోల్లే కాదు వూల్లె మిగతా కులాల మొగోళ్ళు కొట్టంగ చూల్లేదు.

అట్లనే సింగరేణి బొగ్గు బావుల్లో పనికి ఆడోల్లను తీసుకోరు. బాయిలకు దిగుడు, బొగ్గెత్తుడు, మోసుడు, తవ్వుడు అంతా మొగవాల్లె చేస్తరు. ఒక్క ఆడపురుగు చూద్దామన్నా కనబడక పోయేది. కాని ఊల్లల్ల పెద్ద పేద వ్యవసాయం బావులను తవ్వే దాంట్ల ఆడోల్లు కూడా వుండేది. తవ్వడం, మట్టీ రాళ్ళు మోసుడు ఎత్తుడు యివన్నీ చేసేది. మరి యీ సింగరేణి బావులకు మాత్రం ఎందుకు ఆడోల్లను రానియ్యక పోయేదో అంతుపట్టక పోయేది. మా అక్క వాళ్ళు చెప్పేది ‘బాయిల బాయి మైసమ్మ వుంటదని, ఆడోల్లకు ‘నెల’ అంటు ముట్టుంటదని, అంటు తగిలితే బాయిని ‘ఆగం’ జేస్తరని దిగనీయరంట ఆడోల్లని. యిట్లా అన్నింటికి యేవో కారణాలు చెప్పి యింకా ముందుకు వెళ్ళకుండా చేయడం జరిగేది.

మా ఇంట్లో వ్యవసాయం నాకూహ తెలిసి నప్పట్నించి మా అయ్య ప్రాణం బాగలేక మూలబడ్డడని మా అవ్వే చేసేది. ఒక్క నాగలి దున్నడం దప్పించి మిగతా పనులన్నిచేసేది. కాని పంటమ్ముడు, పంపకాలు, లెక్కలు, పంట పైసలు దగ్గరుంచుకోవడం అంతా మా అయ్య చేసేది. కొడుకులను పని చేయించనీకి బిడ్డలకు పనులు నేర్పుడు వాళ్ళ కదలికలను పర్యవేక్షించడం చూసేవాడు . మా అవ్వ పనుల్లో కొంచెం అటిటు తేడా కనబదిందంటే ‘సెట్టును దులిపి నట్లు దులిపేటోడు. తిట్టేదానికి పెద్ద కారణాలేముండక పోయేది. పప్పుల ఉప్పెక్కువయిందని, కూరల కారమెక్కు వైందని,బువ్వల రాయొచ్చిందని, యెంటికొచ్చిందని, తినేప్పుడు కంచం కాడ సెంబుతోని నీళ్ళు బెట్టలేదని తిట్టేటోడు . కోపమొస్తే ఏది దొరికితే దాంతో కొట్టేటోడు. మా అయ్య కోపాన్ని ఎదురిం చలేక, వ్యతికేరేకించలేక కుక్క మీద, నక్క మీద, ఎద్దు, బర్రె మీద పెట్టి తిట్టి ఉపశమనం పొందేది. కాని మా అవ్వ బైటి లొల్లీలల్ల ముందట్నె వుండేది . భూముల కాడ, జాగాల కాడ, నీళ్ళు పారడం కాడ, సేను దొంగతనాలు జరిగినప్పుడు వాళ్ళతో జగడం బెట్టుకొని సమస్య చక్క దిద్ది సాధించే మా అవ్వ యింట్లో మా అయ్యకు మాత్రం ఎదురు చెప్పక, కోళ్ళ, కుక్కల మీద కోపం తీర్చుకోవడం ప్రధానంగా పితృ స్వామ్యాధిపత్యమేనని అప్పుడు తెలిసేది కాదు.

యిట్లా నా పరిసరాల జ్ఞానం ప్రచార జ్ఞానం, దాంట్లో వున్న వైరుధ్యాలు వైవిధ్యాలు అర్ధం చేసుకునే ఘర్షణ లో ప్రచార జ్ఞానమే నన్ను కబళించింది, తరాలుగా అణచ బడి అడుగున బడిన నా కులం, ప్రాంతం, జెండర్, వర్గం, భాష, సంస్కృతి రాశికి రాకుండా రంగానికెక్కకుండా నిరోధింపబడ్డ దారుల నుండే నా రచనలు మొదలైనవి.

ఇంటర్ చేసేటప్పుడు మా హాస్టల్లో గోడల మీద ‘చదువు-పోరాడు’ అనే నినాదం, ‘మారాలీ మన సమాజము, రాజుల సంస్కృతి ప్రజలది అంటే చెల్లదు చెల్లదు చెల్లదులే, హక్కులకై పోరాడుదామురా చెల్లెమ్మా!’ వంటి పాటలు వాటి సాహిత్యం నన్ను విద్యార్ధి ఉద్యమాల వైపు నడిపించాయి.

 

2. మీరు కవిత్వంలోకి, సాహిత్యం లోకి ఎట్లా వచ్చారు? మీకు ఏది ప్రేరణ కలిగించింది? మిమ్మల్ని కదిలించిన బాధించిన విషయమేది?

నే చదూకునేప్పుడు క్లాసు వాళ్ళ మీద, స్నేహితుల మీద, టీచర్ల మీద క్లాసు సబ్జెక్టుల మీద, పూల మీద, పళ్ళ మీద, గాలి మీద నేల మీదంతా కవితలు రాసి క్లాసులో చదివి ఆనంద పడేది. వాటి ప్రయోజనం కూడా దోస్తుల వరకు క్లాసు రూము వరకే వుండేది. కాని బైట విషయాలకు స్పందించి రాసింది రైలు ప్రమాదంలో అమరుడైన కామ్రేడ్ సాంబన్నను గూర్చి బాధ పడి రాసింది. అది ఉద్యమ మిత్రుల మధ్య చదివాను. తర్వాత యింద్రవెల్లి ఘటన మీద బ్యాలే రాసాను. అది కూడా అచ్చు వేడుక నెక్కలెదు. మా ఉద్యమ మిత్రులు కూడా ఈమె చోటా మోటా కవి అనే వాళ్ళు కాని సరైన ప్రోత్సాహం సీరియస్ గా ఏవైపు నుంచి దొరక్కపోగా ‘విరసంలో రాసేవాళ్ళు చాలానే వున్నారు గాని నువ్వు సంఘంల సంఝాయిస్తే చాల్లే ‘ అనే నిరుత్సాహ వాతావరణంలో రాయడానికి మనస్కరించేది కాదు. అయినా అప్పుడప్పుడు ఏదైనా చూసినప్పుడు, చదివినప్పుడు, జరిగినప్పుడు నన్ను తీవ్రంగా బాధించిన విషయాల్ని పెన్ను పేపర్ కి పంచి ఉపశమించేది. రాజ్యహింస, దొరల దోపిడీ దౌర్జన్యాల మీద రాసిన చిన్న చిన్న రచనలు చెసేది. ఓసారి విద్యార్ధి ఉద్యమ సావనీర్లో నాదొక పెద్ద వ్యాసం రావడం నా పట్ల నాకు నమ్మకమేర్పడింది. నేను సమాజంలో కులంగా, జెండర్ గా ఎదుర్కొంటున్న సమస్యల్ని, భావాల్ని బాహాటంగా మాట్లాడే పరిస్తితులు కాని, రాసే వాతావరణం కనిపించక పోయేది. ఇవన్నీ రాస్తే హేళన చేస్తారేమోనని, ద్రోహ సమస్యలుగా చూస్తారేమోనని రాసినవి కూడా చూపించడానికి భయపడేది. ఎందుకో మా ఉద్యమ సహచరులు, నాయకులూ ‘మెచ్చుకొని మెడల మీదేసుకునే సాహిత్యం రాయడం నా వల్ల కాక పోయేది. గుండెను ఎంత కొట్టినా, కడుపు నెంత తన్నినా, మెదడు నెంత కోసినా కూడా విప్లవ సాహిత్యం రాయలేక పోయేది. నా సమస్యలకు ఉద్యమ నాయకత్వ నిర్దేశత్వానికి పొత్తు కుదరని లంకెలు, నా రచనకు సంకెలలయ్యేవి.

యిక ఉద్యమ సాహిత్యంలో పాటలది ప్రధాన స్థానమని చెప్పొచ్చు. ‘రండిరో కూలన్నా సంఘం బెడదాము సంగతేందో సూద్దాము’ పొయి కిందికి లేకపాయె పొయి మీదికి లేకపాయె’ అనే పాట తెలంగాణ ప్రాంతంలో వచ్చిన స్పందన, ఉద్వేగం, ఊపు కోస్తాంధ్రలో రాక పోవడం చాలా నిర్లిప్తంగా విని ‘మాకు పొయి మీదికి పొయి కిందకున్నయి గాని మీరెల్లండి’ అనే మాటలు నాకు చేదుగా మింగుడు పడక పోయినయి. తేడా ఎక్కడ వచ్చిందో అర్ధం కాక పోయింది.

మా క్లాసుల్లో, కాలేజీల్లో, ఉద్యమాల్లో నాయకురాళ్ళను చూస్తే మా వూరి దొరసాండ్రు యాదికోచ్చేది. పేరుకు తోటి స్త్రీలే కాని వాళ్ళ భాష తిండి, అలవాట్లు, చదువు, కట్టుబొట్టు, జీవన విధానం శ్రమ, లైంగికతలో మా కింది కులపాడోల్లకే మాత్రం పోలిక కనబడేది కాదు. ఎంత రాసుకొని పూసుకొని తిరిగినా దగ్గరి తనమనిపించక పోయేది.

యిట్లా అనేక విధాలుగా యింట్ల, బైట ఘర్షణ పడి అర్ధం కాని అభిప్రాయాల్తో వాటికి సమాధానాలు వెతికే క్రమంలో భంగ పడి, బాధ పడి నా బుర్రని తోడి మనసును తొలిచి మొత్తంగా నా ఆలోచనలు ఎత్తి పోతలయ్యేవి. యీ ప్రాంతం, జెండర్,వర్గం, కులం సంబంధాలకు అతీతంగా అంటనట్లున్నా కూడా నా సమస్యలకు అణచివేతలకు సామ్యము వెతికే క్రమంలో సాహిత్యంతో చాలా సాన్నిహిత్యమేర్పడింది. అట్లా చలం సాహిత్యంలో జెండర్, శ్రీ శ్రీ, చాసో, కారా సాహిత్యంలో వర్గం జాతీయోద్యమ సాహిత్యంలో ప్రాంతం, గురజాడ, కందుకూరి సంస్కరణ సాహిత్యంలో నా కులాన్ని, సాహిత్య చరిత్రల్లో, రచయిత్రుల సంకలనాల్లో, నాకులపోల్లు వేసిన దళిత సంకలనాల్లో లేని కింది కులాల ఆడవాళ్ళ సాహిత్యం లేదు.

ప్రాంత పరంగా చూస్తే తెలంగాణ రచయిత్రులు అందులో దళిత రచయిత్రులు సాహిత్యంలో అసలు కనబడరు. అంధ్ర వలస నీతి, వర్గ నీతి, కుల నీతి, జెండర్ నీతి, ఆ జెండర్ లో ఆధిపత్యకుల జెండా నీతి, కింది కులాల స్త్రీ రచన ల్ని సాహిత్య సంకలనాలు, వూరికి దూరంగానే వుంచిన నియమం కనబడ్తుంది. తెలుగు సాహిత్య చరిత్ర కోస్తాంధ్ర ఆధిపత్య పితృ స్వామిక విలువల పట్టుతో మొదలైంది. ఆ విలువల్లో భాగంగానే సాహిత్యమంటే కేవలం హిందూ ఆధిపత్య పురుషులు రాసిందే మేటి సాహిత్యమనేది. దళిత బహుజనులు స్త్రీలు రాసిన సాహిత్యాన్ని కుక్క ముట్టిన పాయసంగా పారేసిన క్రమం నుంచి దళిత మైనారిటీ గిరిజన స్త్రీల సాహిత్యాన్ని ‘దయ్యం పియ్యండుకుంటెంది డక్కలిది పాశామండితెంది’ ఆ నీతే అమలవుతున్న కారణంగానే దళిత గిరిజన స్త్రీల సాహిత్యం సాహిత్యంగా యింకా గుర్తింపబడడం లేదు.

 

3. మీ కవితా సంకలనం ‘అయ్యయ్యో దమ్మక్క’ గురించి, దాని తర్వాత రాసిన రాస్తున్న కవిత్వం గురించి …?

నా చుట్టూత సమాజం అల్లిన అనేక రకాల అణచి వేతలు,వివక్షలు, సంతోషాలు, దుక్కాలు, కోపాలు, నిరసనలు, నా గూడెం నుడికారాలతో రాసిన కవితల దొంతి ‘అయ్యయ్యో దమ్మక్క’ . దీనిలో నా తరాల తల్లుల తండ్లాటలున్నాయి. వృత్తి కులాల మహిళలు, దళిత కులాల మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న బాదలు ‘ఔటాఫ్ కవరేజ్ ఏరియాలుగా వున్నవి. పోలీసులు అత్యాచారం చేస్తే సమాజం చట్టం స్పందించి న్యాయం చేయని అన్యాయాల మీద ‘మా అడివి పంచకురాండ్రి’ మారుస్తామన్న వాకపల్లి ఆది వాసుల శోకాలు, కైర్లాంజి దళిత తల్లిబిడ్డల మీద అగ్రకులాలు అత్యాచారాలు చేసి చంపేస్తే కనీసం ‘వార్త’గా కూడా చేయని మీడియాల్ని, అట్లనే ‘మా అవ్వ దుక్కాల్నిదున్ని పోసుకున్న తొక్కుడు బండని, మమ్మల్ని ఏడిండ్ల పిల్లి కూనల్ని జేసిన మా అయ్యను నా కవిత్వం లో కన్నీల్లు తోడుకున్న.

యిక ‘అయ్యయ్యో దమ్మక్క’ అనే టైటిల్ కవిత మాదిగ మహిళలు అనేక శ్రమల కోర్చి దప్పును రూపొందిస్తే, అది రూపొందినంక ఆ డప్పును కొట్టే అధికారాన్ని కోల్పోవడం చాలా బాధైంది. తోలు డప్పుగా మార్చే శ్రమంతా మాదిగ మహిళలు చేస్తే మాదిగ మొగోల్లు దాన్ని వాయించానికి ముందుంటరు. కాని ఆమె కొట్టడానికి లేదు. దాన్ని వాయించుకుంటూ పాడే సంతోషాలకు, ఉప్పసలకు దూరం జేసినా మాదిగ మగ వివక్షల మీద రాసిన కవిత ‘అయ్యయ్యో దమ్మక్క’.

యింక – కొంగును బొచ్చె మీద ఆచ్చాదనగా ఏసుకునే ముచ్చట మా దళిత ఆడవాల్లకు, ఆదివాసీ బీసీ ఆడ వాల్లకు లేదు. ఆ కొంగు పేల్కతో సబ్బండ పనులు చేస్తరు. అట్లాంటి కొంగును ఫెమినిస్టులు (అగ్రకుల స్త్రీ వాదులు) చెప్పినట్లు తగిలేస్తే ఈ శ్రమంతా ఎట్లా, ఏం గావాలెనని ‘కొంగు మా బొచ్చె మీద కావలుండే బొంత పేగ్గాదు’ అని రాసిన. యిట్లా నా పర్యవరణంలో నా ప్రపంచానికి, మెయిన్ స్ట్రీమ్ ప్రచారానికి మధ్య వుండే యీ వేల మైళ్ళ దూరంలో మా జాతులన్ని మట్టి పోరల్లోనే ఇంకా బువ్వకుండ చుట్టు తిరిగే ఆకలిలోనే వున్నారు. రాసింది కొంచమే రాయాల్సింది బోలెడు బొచ్చెడుంది. సాహిత్యంలో, చరిత్రలో దళిత మహిళలు ఎట్లా బతికారు అనేది విస్మరించబడింది. వాల్ల జీవితాల్ని సాహిత్యాల్ని, పోరాటాల్ని అనుభవాల్ని వారి సంస్కృతిని వారి కోణం లోనే రాస్తున్నను. అందుకు కవిత్వము, కధ, వ్యాసంను వాడుకుంటున్నాను. భూమికలో ఆరు సంవత్సరాలనుంచి కాలం రాస్తున్నాను. అచ్చు మాదిగ అనుబంధ కులాల మహిళల మీద రాసిన ‘నల్ల రేగడి సాల్లు’ కధా సంకలనం యింకో దళిత మహిళతో కలిసి వేయడ మైంది. ‘మాన్యమ్’ అనే కధా సంకలనం కొద్ది రోజుల్లో బైట కొస్తుంది.

ఎన్ని ఉద్యమాలు దళితోద్యమాలు, ఫెమినిస్టు ఉద్యమాలు విప్లవోద్యమా లొచ్చినా దళిత బీసీ ఆదివాసి మహిళల సమస్యల్ని పట్టించు కోలేదు. సాహితీకరించడం జరగలేదు. అందుకని ‘మట్టిపూలు’ (ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ రచయిత్రుల వేదిక) ఏర్పాటు చేయడం జరిగింది.

 

4. స్త్రీ వాద ఉద్యమ సాహిత్యం దళిత బహుజన మహిళలను పట్టించుకుందని అనుకుంటున్నారా? మీ ప్రత్యేకమైన గొంతుని ఏరకంగా వినిపిస్తున్నారు?

స్త్రీ వాద ఉద్యమ సాహిత్యం దళిత బహు జన మహిళల్ని పట్టించుకుంటే ‘మట్టి పూలు’ ఆవిర్భావం అయివుండక పోవచ్చు. ముప్ఫై సంవత్స రాల స్త్రీ వాద ఉద్యమం దళిత మహిళా సమస్యల్ని నిశ్శబ్దంలోకి నెట్టి వేసింది. స్త్రీ వాద ఉద్యమం సీమాంధ్ర నుండి కాదు కోస్తాంధ్ర అగ్రకుల ఆడవాల్ల సమస్యల్నే ఎజెండా చేసుకొని యిప్పటిదాకా సాగుతుంది. వారి ‘పితృ స్వామ్య విముక్తినే స్త్రీ విముక్తి’ అనే సిద్దాంతం సమాజం లో వృత్తి కులాల ఉత్పత్తి మహిళలకు అంటదు. యీ మహిళలకు శ్రమ విముక్తి, కుల విముక్తి, ఆసామి విముక్తి తమ మగ వాల్ల నుంచి కూడా విముక్తి జరగాలి. కాని యివన్నీ స్త్రీ వాదులు చీకట్లో పెట్టారు.

స్త్రీ వాద సాహిత్యం పునాదులు కుల హిందూ పితృ స్వామ్యాల అణచివేత పునాదుల్నించే వచ్చినయి. అట్లా బహు జన మహిళల్ని నిర్లక్ష్యం చేసినయి. జ్యోతిరావు పూలే, సావిత్రీ బాయీ పూలే, నారాయణ గురు, పెరియార్ నుంచి అంబేద్కర్ దాకా హేతువాద సామాజిక వైతాళికుల భావ జాలాన్ని ఆధిపత్య కులాల స్త్రీ వాదం ఆదర్శం గా తీసుకోలేదు. స్త్రీ విద్యకై స్త్రీ దురాచారాల నిర్మూలనకై పోరాడిన చైతన్యాల్ని, చరిత్రల్ని స్త్రీ వాదులు ముందుకు తీసుకొని పోలేదు. స్త్రీ విముక్తి పాటు బడిన బహు జన వైతాళికుల జయంతులు, వర్ధంతులు సంస్మరణలు కూడా స్త్రీ వాదులకు అంటరానివే అయినయి.

‘మనుస్మృతి’ అనేది కుల హిందూ, కుల జెండర్ అణచివేత చట్టము, అట్లాంటి మను స్మృతిని తగల బెట్టిన అంబేద్కర్ స్పూర్తి చైతన్యాల్ని యిప్పటికి బహుజన వర్గాలు కొనసాగిస్తూ మను స్మృతిని దహనం చేస్తున్నరు. కానీ స్త్రీ వాదులు బ్రాహ్మణ సంస్కర్తలైన వీరేశ లింగాన్ని, గురజాడ అడుగుల్ని దాటి బైట పడని అప్రజా స్వామికాల్నే పాటిస్తున్నరు.

సమాజాభివృద్ధి అంచుకు నెట్టేయ బడిన సమూహాలు , జెండర్లూ ఇప్పుడిప్పుడే కొల్పోయిన హక్కుల స్పృహ లోని కొస్తున్నాయి. వాటి ప్రత్యేకతల్ని కవిత్వం లోకి, కధల్లోకి , వ్యాసాల్లోకి మలచడమే నా ప్రత్యేక గొంతు.

కొంగు పద్యం నేపధ్యం :

అమెరికాలో శ్వేత జాతి స్త్రీలు బ్రాలని తగలేస్తే, ఇక్కడి ఫెమినిస్టులు పైటలు తగలేయమని రాశారు. (కాని నిజంగా పైటలు బాగానే కాపాడుకున్నరు) వాస్తవానికి పైటలు పవిత్రము అనుకోని దాని చుట్టూఅల్లిన మిత్ ని తగల బెట్టాల్సిందే! పైటకు పవిత్రమైన విలువల్ని ఆపాదించి అది చాతి మీదనుంచి అటు యిటు గుడిబండలాగ కదలనివ్వ కుండా వుంటే ఆ పట్టు పైటల్ని తగలబెట్టాల్సిందే! యిది సమాజంలో పది పర్సెంట్ స్త్రీలది. కాని 90% దళిత, ఆదివాసి, బీసీ మహిళలకు పైట కొంగు పవిత్రమనే విలువల్లేవు. ఆ కొంగు వాల్ల ఛాతిమీదనే కప్పుకొని వున్న ఆచరణ కూడా నేను చూడలే మా వూల్లల్ల. పైగా ఆ కొంగుతో చెయ్యని పనంటూ వుండదు. అదెప్పుడు నడుముకే చుట్టబడుతుంది. కానీ బొచ్చె మీద వుండక పోవడం చూసి నేను కొంగు కవిత రాసిన. అగ్ర కులాల ఆడవాళ్ళకు పైటకున్న విలువల్ని అగ్గేసి తగిలేయడంలో బహుజన కులాల స్త్రీలు మద్దతిస్తాం. కానీ 90% బహుజన మహిళలకు పైటలు లెవు. వాటికొక విలువగా, అది చాతి వరకే పరిమితమైన పవిత్రం అనేవి యీ సమాజాలకు లేవనే బహుజన సంస్కృతిని, శ్రమ, ఉత్పత్తిని చెప్పదలుచుకొని కొంగు పద్యం రాసాను.

 

5. యిప్పుడొస్తున్న కవిత్వం గూర్చి మీ అభిప్రాయమ? . కవిత్వం సాహిత్యం ఎలా వుండాలని ఆకాంక్షిస్తున్నారు?

ఇప్పుడొస్తున్న అస్తిత్వ కవిత్వం చాలా బలంగా వస్తుంది. అయితే తెలుగు సాహిత్యం లో ఆధిపత్య కులాల రచనలే సాహిత్యం గా చెలామణి అవుతుంది. అగ్రవర్ణ రచయితలు కవులు చచ్సిపోయి కూడా సాహిత్యాన్ని శాసిస్తున్నారు. అణగారిన కులాలపై ఆధిపత్య కులాలు చేసే రచనలకే పెద్ద పీట వేస్తుండటం జరుగుతుంది. కాని అణగారిన సమూహాలు జెండర్లు తమ జీవితాల్ని సంఘర్షణల్ని, పోరాటాల్ని తామే సాహిత్యంగా మలిచి రచనలు చేస్తే అవి సాహిత్యం కాదని (ఎంత గొప్పగా వున్నప్పటికీ శిల్పం లేదనీ, అర్ధం కాని భాషనీ, బూతుగా వుందనీ అవాచ్యం చేయడం, చిన్న చూపు చూడ్డం జరుగుతుంది. యింకా అస్తిత్వ ఉద్యమాలు యింత ఉధృతంగా జరుగుతున్నా, వాటి ప్రభావంగా అస్తిత్వ సాహిత్యం ఇంత పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ- తమ సాహిత్య పీఠాల్లో, అకాడమీల్లొ ‘ తమ బాధలు, అనుభవాలు సాహిత్యీకరించుకోడం అవి స్థానిక రచనలుగానే వుండి పోతాయిగానీ అవి ప్రాపంచిక సాహిత్య విలువల్లోకి చేరావు’ అని చర్చ చేస్తుంటరు.

(జనవరి / 13 ఉర్దూ యూనివర్సిటీ లో జరిగిన సాహిత్య సమావేశం)

స్త్రీల గురించి పురుషులు రాసినా, దళితుల గురించి దళితేతరులు రాసినా తెలంగాణ మీద ఆంద్రోల్లు రాసినా, ఒక మతం గూర్చి యింకో మతం వాల్లు రాసినా అది సంపూర్ణం కాదనీ ఏ సమూహాల అస్తిత్వ గాయాలు దుక్కాలు లోతులు వారికే అనుభవమని అణగారిన అస్తిత్వ సమూహాలు అంటున్నాయి. వీరు బలంగా సామాజిక బాధ్యతతో రాస్తున్నా వీరి రాతలు విస్తృత వ్యాప్తి లోకి రావడానికి అంతులేని అడ్డంకులు నియంత్రణలు. అదే అగ్రకులాల సాహిత్యం విస్తృత వ్యాప్తి లోకి రావద్దనికి కారణం వారికున్న వనరులు మీడియాలు వాల్లవి గనక. యీ అవకాశాలు అణగారిన కులాలకు లేవు. అయినప్పటికీ పొన్నాల బాలయ్య , తైదల అంజయ్య, సిద్దెంకి యాదగిరి, నూతన్, దుగ్గినపల్లి ఎజ్రా, వేముల ఎల్లయ్య, వినోదిని, చల్లపల్లి స్వరూపరాణి, గోగు శ్యామల, జాజుల గౌరి,, జ్వలిత, కొలిపాక శోభ, కన్నారం ఝాన్సి, షాజహాన్, పరిమళ, మెర్సి మార్గరేట్ మొదలైన రచయితలు, రచయిత్రులు కోకొల్లలుగా రాస్తున్నరు. వీళ్ళు వర్తమాన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు కుల, జెండర్, మత ప్రాంత అణచి వేతల ధిక్కార స్వరాల్ని బాగానే వినిపిస్తున్నరు.

అయితే ఆధిపత్య సమూహాల్నించి వచ్చి సాహిత్య రాజ్యాలు పాలిస్తున్న వ్యక్తుల శక్తులే యిప్పటికీ సాహిత్య, సాంస్కృతిక అధికారాల్ని చలాయిస్తున్నారు. ప్రత్యామ్నాయ కవిత్వం సాహిత్యం ద్వారానే దోపిడీ శక్తుల సాంస్కృతిక, సాహిత్యాలని ఎదుర్కోగలం. బహు జన కవులు, రచయితలు రచయిత్రులు ఇది గమనించాలని ఆశిస్తాను.

(Feb 6, 2013)4 Responses to ప్రత్యామ్నాయ కవిత్వం ద్వారానే అణచివేతను ఎదుర్కోగలం – జూపాక సుభద్ర.

 1. Kumar N
  September 1, 2013 at 6:42 am

  Very Interesting!
  Thank you!

 2. Thirupalu
  September 1, 2013 at 11:42 pm

  ఓ వైపు దలితుల జీవితాలని ఐలైట్‌ చేస్తూ ఇంకో వైపు దలిత స్త్రీ ల ఐడెంటిటీ కొరకు ఫొరాడుతున్న సుబద్ర గారు అబినందనీయులు. నిజమే! సమాజ అట్టడుగన ఉన్న వారు దలిత స్త్రీలే.

 3. buchi reddy gangula
  September 7, 2013 at 4:00 am

  విప్లవాలకు పుట్టినిల్లు— మా వరంగల్ జిల్లా అడపడుచు –సుభ ద్రా గారు–ఎెక్స్‌లెంట్ ఇంటర్‌వ్యూ–
  ———————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

 4. kanneganti.venkataiah
  September 7, 2013 at 9:08 pm

  chakkati vyasam chadivaanna samtosham kaligindi

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)