కవిత్వం

నిష్కృతి లేని నిర్జీవంలో…

సెప్టెంబర్ 2013

కళ్ళముందు నా పాత్ర ముగిసినట్టు
నీ స్వర్ణకమలపు సరస్సులోకి
నువ్వు జారుకుంటుంటే
అమృతం వొంపుకున్న మట్టిగుండెను
శూన్యపు చేష్టలు ఆక్రమించేసినప్పుడు
అనంతాకాశంలో ఒంటరిగా వేలాడటమే
మిగిలిన బహుమతి నాకు.

వీధులలో నీ విచిత్ర చిత్రాలన్ని
నా పక్కనుంచే ఎగిరిపోతుంటాయి…
అపుడు నాలోంచి వెలువడే ఒక
పారదర్శకపు వ్యక్తిత్వపు యానకం
ద్వారానే నీ ప్రయాణం మొదలౌతుంది…
ఆకులు రాలిన శిశిరం నాకు కన్నుగొడుతుంది…
రుతువులు పిశాచనాట్యాలు చేసుకుంటున్నప్పుడు
నువ్వు కలగా జ్ఞాపకాల పైకప్పుమీద వాల్తావు…
ఆవిరి అయిపోయిన రక్తమాంసాలు
అస్థి పంజరానికి అతుక్కోవడం మొదలౌతుంది…
“నాతిచరామి”  చేసిన దిశానిర్దేశంలోకి
మిగిలినబంధనాలు జీవితాన్ని ఎక్కుపెడతాయి…
ఇవన్నీ నీ జ్ఞాపకపు మేఘం పరదా కింద జరిగిపోతుంటాయి…
గుండెతలుపులు మూతబడి కళ్ళు గ్రహాంతరయానం
మొదలుపెట్టే విఛ్ఛిన్న క్షణాలలో నా
చివరి బంధకపు తాడు నీకోసం నిరాధార చత్రంలా
సాగుతూ…సాగిపోతూ….!!!