గల్పిక

పరామర్శ

సెప్టెంబర్ 2013

“ఏం బాబు బాగున్నావా?”

“ఎవరూ!… ఎం.ఎల్.ఎ.గారా!..”

“కులాసే గదా బాబూ!… మీనాన్న నాకు బాగా తెలుసు బాబూ .ఆయన అప్పట్లో నాకోసం చాలాసార్లు తిరిగాడు పాపం!.ఏం చెస్తాం..నేనైతే పదవిలోనే ఉన్నాను గాని ప్రభుత్వం మనది కాదుగదా!,అంచేత కొంచెం యిబ్బంది పడ్డాడు….”

” అంతా అయిపోయింది లెండి.తనమీద లేనిపోని ఆరోపన్లు వచ్చాయని,తనసర్వీసులో అపనిందపడాల్సివచ్చిందని బాధపడ్డారు , ఎవరో ఒక నాయకుడుట.. అతను చేసిన తప్పును తనమీదకు తోసేసాడని బాధపడి….ఆవిషయమై మీదగ్గరకు చాలాసార్లు తిరిగారు.ఏమి చేయలేక మనోవ్యాధితో చని పోయారు.”

“అదే బాబు చెప్పాను గదా!,నేనైతే పదవిలోనే ఉన్నాను గాని….”

“ప్రభుత్వం మనది కాదు అంటారు…”

“అంతేబాబు..అంతే..అంతే…”

“సరేలెండి,యింతకీ తమరు యిప్పుడెందుకొచ్చినట్టో!.. చెప్పలేదు.”

“అదేమిటి బాబు అలా అంటావు. మీ నాన్నపోయాడని తెలిసి ఓ మారు పలకరించి పోదామనే వచ్చాను.చాలా రోజులే అయిందనుకో,కానీ..ఏం చేయడం ఢిల్లీకి హైదరాబాదుకి ఆ విమానాల్లో తిరగలేక చస్తున్నాననుకో… ఓపక్కప్రజల పనులు..మరోపక్క పార్టీ పనులు… అబ్బబ్బబ్బా….ఊపిరాడదనుకో….అంచేతే అప్పట్లో రాలేక పోయాను.ఎంతైనా మనం మనం కావలిసిన వాళ్ళం గదా!..

మీకు అన్యాయం జరిగిందని. మీకూ రేపు ఏదైనా జరగొచ్చని,ఊరిలో కుర్రాళ్ళందరిని కూడదీసి యువజన సంగం పెట్టావని తెలిసింది. నీకెందుకు బాబు శ్రమ..నేనులేనూ.. నువ్వదేమీ మనసులో పెట్టుకోకు.అప్పుడేదో అలా జరిగిపోయింది. ఈ సారి ఎలాంటి పనైనా నేనే దగ్గరుండి చేయిస్తాను.ఆమాటే చెప్పిపోదామని వచ్చాను.

అలాగే పనిలో పనిగా చిన్నమాట కూడా నీతో అనిపోదామని…మరేమీ లేదు బాబు…ఎలక్షన్లు దగ్గరకొస్తున్నాయి నీకూ తెలుసుగదా,అవతల కులం వాళ్ళకు దక్కకూడదని,ఎంతైనా మనకులానికే దక్కాలని పట్టు పట్టి అధిస్టానం తో పోట్లాడి మరీ టిక్కెట్టు తెచ్చాను.మనవాళ్ళందరికీ చెప్పి ఈసారి కొంచెం సాయపడితే తప్పకుండా మళ్ళీ నేనే గెలుస్తాను.మరేం లేదు మనకులం పరువు నిలబడాలి,అదీ పట్టుదల.

నాన్న గురించి బాధపడకు..మహానుభావుడు..చాలాకష్టపడ్డాడు.పాపం ఎంతోమంచివాడు.
అదేమిటో బాబు …భగవంతుడు మంచివాళ్ళనే వేగంగా తీసుకు పోతుంటాడు.ఏం చేస్తాం.. అంతా భగవతుడిలీల..వస్తానుమరి..కొంచెం నామాట గుర్తు పెట్టుకో..”

” మీరు చాల మంచివాళ్ళుసార్..”

— *** —