నా మానాన నన్ను నడవనివ్వకుండా
దుర్భిణీ చేత సారించి
వెంట వెంటే తిరుగుతున్నావెందుకూ?
నడకలో ఏ తప్పటడుగు పట్టించాలని
ఆలోచనల్లో ఏ దృష్టికోణాన్ని ఫోకస్ చేయాలని
మాటల్లో ఏ ప్రాంతీయతని ఎత్తి చూపాలని
అక్షరాల్లో ఏ వర్ణపు పోగుల్ని సాగదీయాలని
జీవితాన్ని ఏ చట్రం లో బంధించాలని
ఇలా భూతద్దం తో నావెంట పడ్డావ్?
చల్లని వెన్నెల్లో చంద్రికల్ని అద్దుకొని
మిలమిల మెరిసే మంచుబిందువుల్ని
ఆత్మీయంగా సేకరించే చంద్రచకోరాన్నై
రాత్రిపొడవునా సాహితీపచ్చికబయ్యళ్ళలో
స్వేచ్చావిహారం చేయాలనుకుంటే
నీడలా నీ చూపుల్ని నావెనకెనకే పరిగెట్టిస్తావెందుకు?
నా చేతనైనట్లు నాకోసం నేను
అచ్చం గా నాదనుకొనే స్వంత గడ్డపై కూడా
స్వతంత్రం గా తిరగలేని బతుకైపోయిన
అక్షరాల్ని ఏరుకొనే పిట్టని- అర్భకపు పక్షిని
ఇంట్లోపనులు చేసుకొంటూ
బాధల్నో బరువుల్నో దింపుకుంటూ
బియ్యం లో రాళ్ళతో పాటూ
కష్టాల్నో కన్నీళ్ళనో విదిలిస్తూ
పూలమాలల్ని అల్లుకుంటూ
నవ్వుల్నో అనుభూతుల్నో విరజిమ్ముతూ
పెరటిగుమ్మం లో కూచుని
ముచ్చట్లని కలబోసుకునే ఇల్లాళ్ళని గమనిస్తూ
చెమ్మగిల్లిన గింజల్ని ఏరుకున్నట్లు
పదాల్ని ఏరుకోవడమేకదా నేను చేస్తున్నది?
దారిపక్కన బీడైన పొలాల్నో
వరద తాకిడికి కొట్టుకుపోయిన పంటల్నో
తడిమి చూసుకుంటున్న బక్కరైతుల కంటతడో
అహంకారానికో అధికారానికో
జీవితాన్ని తాకట్టుపెట్టిన జీవచ్ఛవాలలో-
దానవుడైన మనిషి మానవత్వాన్ని
కాల్చినుసి చేసిన స్వార్ధపుమంటలో_
ఏదైతేనేం ఎవరైతేనేం
దృశ్యమానమైనప్పుడు కన్నీటితోనో
చెమటతోనో రక్తంతోనో తడిసిన పరకల్ని
ముక్కుతో వొడిసి పట్టినట్ట్లుగా
చూపుల్ని చాచి
దృశ్యాల్నో సంఘటనల్నో మోసుకొస్తూ
సాహిత్యాన్ని అల్లుకునే గూటిపక్షిని
మనిషి సృష్టించిన డబ్బుకి మకిలివుంటుందేమో కానీ
ఎప్పటికప్పుడు జీవితరేఖలు
మేధస్సుని పుటంపెడ్తుంటే ఎగసిపడే జ్వాలల్లా వెలువడే అక్షరాలు
అక్షరాలా స్వచ్ఛమైనవే కదా
వాటికి ఏ రంగో వాసనో ఎందుకు వెతుకుతావు?
ఏ సాహిత్యరాజకీయాల్తోనో
ఎక్కడికక్కడ ముఠాలు కట్టి
స్వార్ధప్రయోజనాల్ని మడిగానో దడిగానో
పరిధులు చుట్టుకుని
కూర్చున్నప్పుడుమాత్రమే
అక్షరాలు కూడా మసిబారి రంగు తేలిపోతాయ్
అలా కానప్పుడు
ఏ అక్షరాలైనా పదాలపక్షులై
ఆకాశకాగితం నిండా పంక్తులుపంక్తులుగా
విహంగయానం చేస్తూనే వుంటాయ్
అదే కదా నేను చేస్తున్నది
గూటిపక్క ఆకుపచ్చని కొమ్మపై కూర్చుని
ఆలోచనల్ని ఆలపిస్తున్న నన్ను
ఏ పంజరం లోనో బంధించి
ఏ చూరుకో వేలాడదీయాలని చూస్తావెందుకు?
నా స్వేచ్ఛకు హద్దులు పెట్టకు.
మేడం గారు ..మీ పోయం చాలా బాగుంది.నిరంతరం అనుమానింపబడడం నిజంగా వేదన కలిగిస్తుంది.ఇవాళ రాష్ట్రములో పరిస్థితులు యిలా మారడం దురదృష్టకరం.
ఎవరి మానాన వారిని నడవనివ్వకుండా (ముఖ్యంగా గిట్టని వారి విషయంలో)
తప్పటడుగు పట్టించాలని, లేదా ఎప్పుడు దొరుకుతారా అనీ కాచుకు కూచున్న గుంటనక్క(ల)లా
స్వేచ్చను కబ్జా చెయ్యాలనుకునే భూతద్దం గాళ్ళ కాలమిది.
చక్కని విషయం కవితగా వ్రాశారు.
అభినందనలు.
నారాయణ.