కవిత్వం

నిర్ విరామం

సెప్టెంబర్ 2013

సుర నర మునులా…
ఖండిత నదులా…
ఈ పద జగాలు…
మునుపటి ముచ్చట్లా
కనరాని ఏకాంత ధ్వనులా
బాగా మాగిన
మామిడి పండులాంటి నిశ్శబ్దం
ఆవరించిన
తోటలోని
నల్లరేగడి జువ్వలా…
ఈ పద పాదాలు

ఎప్పుడైనా ఈ నిశ్శబ్దం విరిగిపోతుందా
కూలిపోతుందా…
దగ్ధ ధూళి పూలదండ అవుతుందా…
వెన్నెల
దీపసరోవరమవుతుందా…
కనని విషయాలా… ఇవి
ఉత్త మనోచాంచల్యాలా…
కవిగా
ఊపిరిని తాపడమే…
శాపమా
నేరమా…
ఒక స్వకపోల వనవాసం
జీవ శిక్షాకాలం
death sentence
life sentence

కల నిజమైతే ఏం మిగులుతుంది
నీలాకాశం గోడలా గడ్డకట్టి
నిలిచిపోతే…
ఏమెగురుతాం పిట్టలాగానో
బెదురు కంజులాగానో…
నన్ను ఒక చోటనే ఆగిపొమ్మంటే
ఎట్లనే తల్లీ…
కుడుకల గౌరమ్మా…

నేను ఎగిరే సున్నాని
నేను మండే వాన మబ్బును
గంధపు చెదను
కూలిపోయేదాకా… ఊగుతూనే ఉంటాను
చెద లోపల కుమిలే వనపురుగును
నా కాళ్ళకు చక్రాలుంటయ్
కండ్లకు రెక్కలుంటయ్
గుండెలో సూదులుంటయ్
రక్తంలో కాంతి రవ్వలుంటయ్
అవున్నేను
ఎగిరే సున్నానే…
సమాధానం ఎవ్వనికి గావాలె
సంక్షోభం బిక్కజచ్చి మునగదీసుకుని
చీకట్లో … దాక్కుంటే
నాకెందుకే … చెల్లెలా …
రోజూ…
పచ్చటి కూరగాయలు మీదపోసుకుని
తిరిగే గంపగావాలె దేహం
గల్లీ గల్లీలో … తిరుగుతుండాలె …
విషాద విరహమూ
మోహకోపమూ …
పరిమాణం మార్చుకునే నీడలాగా
కదుల్తూ … పోవాలె …
దాహం తీర్చని చేతులెందుకు…
నిలబడే చూపులెందుకు

నాకు నమ్మకమొకటే కావాలె …
నేను నమ్ముతూనే ఉంటాను
నమ్మకంగా ఆడుతూనే పోతుంటాను
ఒక నమ్మకం నుంచి
మరో పెను నమ్మకంలోకి…

విత్తనాలు కళ్ళు మూసుకుని ఉంటాయి
విభ్రమంగా … వర్షానికి…
అది ఋతుపవనం కాదు
అల్పపీడనమని తెలియక కూడా
నేనయినా
అలాగనే కదా