కవిత్వం

చిలిపి చినుకులు

అక్టోబర్ 2013

1

సూర్యుడు గోడదూకి ఇంట్లోకి రాగానే
చీకటి చీర విప్పి లోకం మీద పరిచింది.
కళ్ళు మిటకరిస్తూ
చుక్కలు.

 

2

చీకటి కొమ్మ నుంచి
రాత్రిగ్లాసులోకి విరిగిపడ్డ
ఓ ఐస్ క్యూబ్ లాంటి
కల.

అబ్బ!
ఎప్పుడూ అంతే
మత్తెక్కేలోపే కరిగిపోతుంది.

 

3

ఆకు చాటున నిలబడి
పూర్తిగా విప్పకనే
మత్తెక్కించే లోకాలని చూపిస్తుంది.
బొద్దు బొండుమల్లె.

 

4

సిగ్గుతో విచ్చుకున్న పువ్వు నడుం చుట్టూ
మరీ చిన్నదై బిగుసుకుపోయిన సిగ్గు బిళ్ళలా…
అది తొడిమేనా?!

 

5

రాత్రినదిలో చీకటితో కొంగు ముడివేసుకొని
సరిగంగ స్నానాలు చేసినట్టుంది పువ్వు.
ఆకు చాటుగా ఇంకా గుడ్లప్పగించి చూస్తున్న
మంచు బిందువులు.

 

6

శిశిరం కన్నుగీటింది. ప్రకృతి పచ్చ పైట జార్చింది.
ఇక రాత్రిని పొడిగించుకుంటూ
శీతాకాలం అక్కణ్నుంచి కదలనే కదలదు.

 

7

అంత పెద్ద ఆకాశంలో పుట్టినా
ఈ చిన్ని ఆకు నడుమొంపునే ఊగడం ఇష్టం
చిలిపి చినుకుకి.

 

8

అప్పుడు
పాపికొండల మధ్య పారే సన్నని పాయలా ఉండేది
ఇప్పుడు
సువిశాలమైన ఇసుక మీద పరుచుకున్న గోదారైంది.
నడుం కాదండోయ్!

 

9

కొండల్లోంచి
కొంగు బిగించి
తిప్పుకుంటూ తిప్పుకుంటూ
నీల్లెత్తుకు పోతుంది.

గలగల మంటున్న గులకరాళ్ళ పట్టీలు.
ఒడ్డును ఒరుసుకుంటూ తెల్లలంగా కుచ్చిళ్ళు.

లోతులు కొలవకుండా చెప్పొచ్చు
అది ఖచ్చితంగా గోదారే.

 

10

లోకంలోని వెలుగునంతా నూరి
ఆకాశం కంటికి కాటుక అద్దుతూ
మళ్ళీ
చీకటే.