చలువ పందిరి

यारा सीली सीली

అక్టోబర్ 2013

“The Hungry stones” అని విశ్వకవి రవీంద్రుడు రచించిన ప్రఖ్యాత కథ ఒకటి ఉంది. ఆ కథను టాగూర్ వందేళ్ళ జయంతి ఉత్సవాల సందర్భంలో ప్రముఖ బెంగాలి దర్శకుడు తపన్ సిన్హా “Khudito Pashan” అనే పేరుతో సినిమాగా తీసారు. చిత్రానికి జాతీయపురస్కారం లభించింది. మరో ముఫ్ఫై ఏళ్ల తరువాత ఈ కథ ఆధారంగానే గేయరచయిత గుల్జార్ “Lekin..” పేరుతో ఓ సినిమా తీసారు. ఈ చిత్రానికి కూడా జాతీయ పురస్కారం లభించింది. ఈ చిత్రంలోని “యారా సీలీ సీలీ” అనే పాట గురించి ఈసారి చెప్పబోతున్నా..!

“లేకిన్..” చిత్ర కథలో కథానాయకుడు రాజస్తాన్ లో ఉన్న మారుమూల ఊరికి డిపార్ట్మెంట్ పనిమీద వెళ్తాడు. అక్కడ ఉన్న ఒక పాత కోట తాలుకూ ఆస్తులను ప్రభుత్వమ్యూజియంకు తరలించటానికి. అక్కడ అతనికి కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురౌతాయి. ఆ సంఘటనల తాలూకూ రహస్యాన్ని అతను ఎలా ఛేదించాడన్నదే కథాంశం. ప్రధానపాత్రల్లో వినోద్ ఖన్నా, అందమైన ఆత్మ రూపంలో డింపుల్ కపాడియా హృద్యంగా నటిస్తారీ సినిమాలో. “లేకిన్” ని ఒక సినిమా అనేకన్నా గుల్జార్ తెరపై చిత్రీకరించిన ఓ అందమైన కవిత అనచ్చు. కథనంలో కొద్దిపాటి లోటుపాట్లు ఉన్నా, ఓ కవితాత్మకమైన చిత్రాన్ని చూసామన్న భావం మిగిలిపోతుంది.

మరణించినా శరీరం నుండి ముక్తి లభించని ఒక ఆత్మ; కథానాయకుడికి మాత్రమే అప్పుడప్పుడూ కనిపిస్తూ, తనకు అన్యాయం జరిగిన ప్రదేశంలోనే తిరగాడుతూ ఉంటుంది. అలా తిరగాడే సమయంలో ఈ పాట పాడుతుంది. గడచిన కాలంలో తాను పడ్డ బాధనీ, వేదననీ, ఆమె ఇన్నాళ్ళూ అనుభవించిన విరహాన్నీ, ఒంటరితనాన్నీ.. అన్నింటినీ కలగలిపిన పాట ఇది. తీవ్రమైన మనోవేదన, ఒంటరితనం, విరహాగ్నీ ప్రతి పదంలోనూ అనుభూతికొచ్చేలా గుల్జార్ అక్షరబధ్ధం చేసిన ఈ పాట ఒక అద్భుతం! లతా కాక ఇంకెవరన్నా పాడి ఉంటే పాట ఇంత అందంగా ఉండేది కాదేమో అనిపిస్తుంది నాకు. ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ అందించిన బాణీ కూడా చాలానాళ్ళు వెంటాడుతూ ఉంటుంది. తన సృష్టికర్తలు ముగ్గురికీ ఈ పాట 1991లో ఒకేసారి జాతీయ పురస్కారాలను అందించడం విశేషం.

ఉత్ప్రేక్షాలంకారాలను (metaphors) తన రచనలలో గుల్జార్ చాలా ఎక్కువగా వాడుతూంటారని చెప్పాలి. అలానే ఓసారి వాడిన కొన్ని పదాలనే తన ఇతర పాటల్లో మళ్ళీ మళ్ళీ గుల్జార్ వాడటం కూడా చూస్తూంటారు. ఈ పాట పల్లవిలో ఆ రెండు ప్రయోగాలు చేసారు ఆయన… “సీలీ” అనే పదంతో! ఈ పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. నెమ్మది, చెమ్మ. గుల్జార్ రాసినదే “सीली हवा छू गयी, सीला बदन छिल गया” అని ‘లిబాస్’ చిత్రంలో ఓ పాట ఉంది. ఆ పాటలో ‘सीली हवा’ అంటే తేమ ఎక్కువగా ఉన్న చల్లనిగాలి అనే ఒకే అర్థం. “యారా సీలీ సీలీ” లో మాత్రం రెండు అర్థాలూ అన్వయించుకునేలా రాసారు. “మీరు ఏ అర్థాన్ని తీసుకుంటారో మీ ఇష్టం…” అని ఒక ఇంటర్వ్యూలో గుల్జార్ చెప్పారు కూడా :)

గమనిక: ఇంతటి భావగర్భితమైన పాటలో చిత్ర కథ కూడా మిళితమై ఉంది కాబట్టి ఈసారి పాటకు వాక్యార్థం రాయడం లేదు. రాసినా అర్థమంతా మారిపోతుంది కూడా! కాబట్టి స్వేచ్ఛానువాదం మాత్రమే ప్రయత్నించాను.

స్వేచ్ఛానువాదం:
यारा सीली सीली बिरहा की रात का जलना
यारा सीली सीली यारा सीली सीली
((ऒ यारा सीली सीली , ढॊला सीली सीली
यारा सीली सीली, बिरहा की रात का जलना))
ये भी कोइ जीना हैं.. (2)
ये भी कोइ मरना?
((यारा सीली सीली ..))

ప్రియతమా, చెమ్మగిల్లిన విరహపు రాత్రి అతి నిదానంగా రగులుతోంది
ఇదీ ఓ జీవితమేనా?
ఇదీ ఓ మరణమేనా?
—————-
ప్రియతమా, ఈ విరహపు రాత్రి మెల్లమెల్లగా రగులుతోంది
ఇదీ ఓ జీవితమేనా?
ఇదీ ఓ మరణమేనా?

భావం: పల్లవిలో వచ్చే “సీలీ” అనే పదానికున్న రెండు అర్థాలను బట్టి ఈ రెండు భావాలనూ తీసుకోవచ్చు.
1) రాత్రి చెమ్మగా ఉన్నదట. ప్రియుని ఎడబాటు వల్ల విరహాగ్నిలో కాలిపోవాల్సిన రాత్రి, చెమ్మగిల్లి ఉండడం వల్ల చాలా మెల్ల మెల్లగా రగులుకుంటోందిట! తడిగా ఉండే చెక్కకు నిప్పంటిస్తే పొగ వస్తుంది కానీ కాలదు కదా.. అలాగన్నమాట! అసలు విరహపు రాత్రి గడవడమే లేదు అని ఒక అర్థం.
2) నెమ్మదిగా అన్న ఒక్క అర్థమే తీసుకుంటే, విరహపు రాత్రి చాలా నెమ్మది నెమ్మదిగా రగులుతోంది.. అని అర్థం. ఇక్కడ కూడా కాలం కదలడం లేదు అన్న అర్థమే వస్తుంది కానీ ఆ మొదటి అర్థంలో ఉన్న తియ్యదనం కాస్త తగ్గుతుందిక్కడ.
ఇంకా పల్లవిలో ఆ అమ్మాయి అంటుందీ.. ఇటువంటి కాలం కదలని విరహపు రాత్రిళ్ళతో గడిపే జీవితమూ ఓ జీవితమేనా? ఒకవేళ ఇది మరణమే అయితే ఇలా విరహవేదనలో రగిలిపోయే ఒంటరిమరణమూ ఓ మరణమేనా.. అంటుంది.

1చ: टूटी हुई चुडीयों से, जोडू ये कलाई मैं
पिछली गली में जाने, क्या छोड़ आयी मैं
बीती हुई गलियों से..(2)
फिर से गुजर ना
((यारा सीली सीली ..))

విరిగిన గాజులతోనే చేతిని అలంకరించుకుంటున్నాను నేను
వెనుకటి కాలంలో ఏం వదిలి వచ్చానో ఏమో..
ఆ గతించిన కాలంలోకి
మరోసారి వెళ్ళనీకు

భావం: చరణంలో విరిగిన గాజులు అంటే ముక్కలైన జ్ఞాపకాలు. ఆ స్మృతులసాయంతోనే బ్రతుకు వెళ్లదీస్తోందట. पिछली गली అంటే గడిచిపోయిన కలం. ఆ గడచిన కాలంలో ఏ జ్ఞాపకాల అనవాళ్ళను వదిలివచ్చానో తెలీదు గానీ తిరిగి ఆ పూర్వస్మృతుల్లోకి నన్ను వెళ్లనీయకు ప్రియతమా అంటుంది ఆమె.

2చ: पैरों में ना साया कोइ, सर पे ना साई रे
मेरे साथ जाए ना, मेरी परछाई रे
बाहर उजाला हैं.. (2)
अन्दर वीराना
((यारा सीली सीली ..))

साई=దేవుడు
वीराना=బంజరు, పాడుబడ్డ

పాదాల క్రింద ఏ నీడా లేదు, నాకెవరి అండదండలూ లేవు
నా నీడైనా నా వెంట రాదు..
ఈ వెలుగంతా వెలుపలే
లోనంతా ఏడారే!

భావం: ఈ చరణం పూర్తిగా ఆమె ఒంటరితనాన్ని తెలుపుతుంది. తన పాదాల క్రింద నీడైనా లేదనీ అంటే తనకు ఓ నివాసమంటూ లేదనీ; ఏ దేవుని ఆశీర్వాదమూ తనకు లభించలేదనీ, తన నీడ కూడా తన వెంట రావడానికి నిరాకరించేంతటి ఏకాకినని చెప్తుంది.
తరువాతి రెండు వాక్యాలకూ రెండు అర్థాలు ఉన్నాయి.
1)ఒకప్పుడు వెలుగు వెలిగిన ఓ రాజుగారి ఆస్థానం(కోట) దగ్గర తిరుగుతూ ఈ పాట పాడుతుంది ఆమె. అక్కడ బయటంతా బోలెడు వెలుతురు ఉంది కానీ లోపలంతా పాడుబడిపోయింది.. అని ఒక అర్థం.
2) నా దేహపు కాంతిని చూసి మోసపోకు ప్రియతమా… నా మనసంతా ఎడారయిపోయింది.. అన్నది రెండవ అర్థం.

ఇంత అద్భుతమైన గీతాన్ని రచించిన గుల్జార్ కు సలామ్ అనాలనిపించడం లేదూ….

ఈ పాటను ఇక్కడ చూడవచ్చు:
http://www.youtube.com/watch?v=Jz7nJErmsbE