సిలికాన్ లోయ సాక్షిగా

ఫుడ్డు- వేస్టు ఫుడ్డు

అక్టోబర్ 2013

“ఓర్నాయనో ఆపిల్ చెట్టు” దాదాపుగా చెట్టుకేసి పరుగెత్తుతూ అన్నాను.

“చిన్నప్పటి నించీ ఆపిల్ చెట్టుని చూడాలని ఎంతగానో అనిపించేది. అసలు ఆపిల్ చెట్టుని నేను మామిడిచెట్టులా ఒక్కో కొమ్మకి ఒక్కో ఆపిల్ వేళ్లాడుతూ ఊహించుకున్నాను. తీరా చూస్తే జాం చెట్టులా ఉందిది. కానీకాయలు ఇలా కణుపులకి గుత్తులు గుత్తులుగా కాసి ఉసిరి చెట్టులా భలే తమాషాగా ఉందే” దగ్గరగా వెళ్లి చెట్టుని తడుముతూ ఏవిటేమిటో మాట్లాడుతున్న నా వైపు నవ్వుతూ చూసేడు సూర్య.

ఇక్కడ ప్రతీ అపార్ట్ మెంటుకీ ఒక లీజింగ్ ఆఫీసు అదే ప్రాంగణంలో ఉంటుంది. వందల సంఖ్యలో ఉండే అపార్ట్ మెంటు కాంప్లెక్సులకి ఉన్న కామన్ స్విమ్మింగ్ పూల్, జిం, క్లబ్ హౌస్ ల వంటి అదనపు సౌకర్యాలను బట్టి కూడా అపార్టు మెంట్ల అద్దె ఆధార పడి ఉంటుంది. మా అపార్టుమెంటుకి స్విమ్మింగ్ పూల్ తప్ప మరే సౌకర్యమూ లేదు. అయినా అద్దె ఎక్కువ, అదేం విచిత్రమో! బహుశా: పెద్ద పెద్ద షాపులకి దగ్గరగా ఉండడం వల్లనేమో.

ఇంతకీ ఆపిల్ చెట్టు మా అపార్టుమెంటులో ఆఫీసుకి వెనకగా, స్విమ్మింగ్ పూల్ కి మరో వైపుగా ఉంది. ఇన్నాళ్లూ కాయలు కాయక అదేం చెట్టో తెలియలేదు. హఠాత్తుగా అలా విరగ కాసి ఉన్న ఆపిల్ చెట్టుని చూసి భలే ఆనందం వేసింది.

“ఇంతకీ ఈ చెట్టుకి ఇన్ని కాయలు… ఏం చేస్తారంటావ్?” సాలోచనగా అన్నాను.

“నువ్వు మాత్రం కోసే పని పెట్టుకోకు, ఇక్కడిలా పళ్ళనీ, పూలనీ అడగా పెట్టకుండా కోసెయ్యడం నిషిద్ధం”అన్నాడు సూర్య.

“ఒక్క కాయ” అని ప్రాధేయ పడ్డట్టు చూసినా వీల్లేక పోయింది.

నిజానికి అవి సపోటా ల కంటే పెద్దగా లేని తుప్ప ఆపిల్ కాయలు. అయినా అలా వృధాగా నేల మీద రాలి పడి, చెట్టుకి వందలుగా ఊరిస్తూ ఉంటే మనసుకి అదోలా అనిపించింది. సూర్య ఆఫీసుకి వెళ్లగానే అపార్టుమెంటు లీజింగ్ ఆఫీసు కెళ్లి, వాళ్ల పర్మిషన్ సంపాదించి నాలుగు కాయలు తురిమి తెచ్చుకునే వరకు మనసు శాంతించలేదు నాకు. పుల్ల రేగు కాయల్లా ఉన్న వాటి రుచి కంటే తిన్నానన్న తృప్తి ఎక్కువగా కలిగింది.

***

“సరుకులకి వెళ్లొద్దాం వస్తావా?” అడిగింది అలీసియా.

అలాగేనని కారు తీసాను. ఇంటి నుంచి నాలుగు మైళ్ల దూరం లో ఉన్న “కాస్ట్ కో” కి వెళ్లాం. దారిలో ఇళ్ల బయట చెట్ల నిండా పండి రాలిపోతున్న నిమ్మపళ్లు, నారింజ పళ్లు చూపిస్తూ “చూసేవా!” అంది.

“అవును, నాకూ అర్థం కాదు అవన్నీ ఇక్కడ ఇలా ఎందుకు వదిలేస్తారో!” అన్నాను.

“బహుశా: తినే మనుషులు తక్కువ, చెట్లెక్కువ అయిపోతే ఇంతేనేమో.”అంది.

“మా లాంటి వాళ్లకు ఇస్తే వాడుకుంటాం కదా” అంది మళ్లీ.

అదే కదా ఇక్కడి ప్రాబ్లం. ఇక్కడ మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. అతి పరిమితమైన సామాజిక జీవనం. ఎవరికి ఏది అవసరమో ఎలా తెలుస్తుంది?ఆ ఇంటామెకి కోసి నలుగురికీ ఇవ్వాలనుకున్నా ఎవరు పుచ్చుకుంటారో తెలియదు.

అదే చెప్పాను తనతో. “ఇక్కడి చెట్లు ఇళ్లల్లో వేజుల్లోని బోనసాయ్ చెట్ల లాంటివి, అందానికే తప్ప ఎందుకూ పనికి రావు. మొన్నోమైందో తెలుసా?” అని ఆపిల్ చెట్టు ఉదంతం చెప్పాను తనకి. ఇద్దరం నవ్వుకున్నాం.

కాస్ట్ కో గుమ్మం దగ్గర నా మెంబర్ షిప్పు కార్డు చూపించేను. అలీసియా కార్టు తోసుకుని నా వెనకే వచ్చింది. గుమ్మం దగ్గర చెక్ చేసే ఆమె అలీసియాని స్పానిష్ భాష లో ఏదో అడిగింది. తను ఒక్క నిమిషం అక్కడ ఆగి సమాధానంగా ఏదో చెప్పింది.

“ఏవిటట” అన్నాను.

“నేను నీ దగ్గర పనిచేస్తున్నానా, అని అడిగింది, అవునని చెప్పాను” అంది.

“అదెందుకు, నా ఫ్రెండునని చెప్పక పోయావా?” అన్నాను.

“ఎందుకులే, మనం ఫ్రెండ్సంటే ఎవ్వరూ నమ్మరు.” అని నవ్వింది.

మా మనవలకి ఇక్కడి ప్రత్యేకమైన బ్రెడ్డు, వాఫిల్సు, మాంసమూ ఇష్టం. కానీ ఏం చేస్తాం అని నిట్టూర్చి”మెంబరు షిప్పు సంరానికి 50 డాలర్లు మరీ దారుణంగా” అంది.

“సర్లే. మాకీ మెంబరు షిప్పు నిజానికి దండగ, నువ్వు నా కార్డు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు” అన్నాను.

కారు ఎక్కే ముందు దూరంగా చూపించి “చూసేవా, డస్టు బిన్ లలో బ్రెడ్లు ఎలా కుప్ప పోసేరో” అంది.

“నిజమే, డేట్ అయ్యిపోయినవనుకుంటా.. అయినా” అని నేనేదో చెప్పబోతుండగా

“నాకీ దేశం లో ఫుడ్డునిలా వేస్టు చేస్తూంటే భలే బాధగా ఉంటుంది తెలుసా? ఆ తిండి లేకే మా దేశం నించి పొట్టపట్టుకుని ఇలా పరాయి దేశాలకు ప్రాణాలకు తెగించి వచ్చిపడే వారెందరో.”బాధగా అంది.

“సర్లే, నువ్వు మా దేశాన్ని చూడలేదు, అక్కడిలాంటి రొట్టెముక్క కోసం అర్రులు చాచే వారెందరో” అన్నాను.

నాకూ ప్రాణం ఉసూరుమంది.

“మీ దేశంలో కూడా అంత పేదరికం ఉంటుందా?!” ఆశ్చర్యపడింది.

“బోల్డు. అసలిలా రోడ్లు ఖాళీగా ఉంటాయేంటి!? ఎక్కడేనా తినే వస్తువులు ఇలా కనిపిస్తాయా! ఈ దేశమే మరీ విడ్డూరం.” అని, మళ్లీ అంతలోనే

“అయినా ఫుడ్డు వేస్టేజీ లో మా వాళ్లూ ఏమీ తీసి పోయిన వాళ్లు కాదు. అక్కడి పెళ్లిళ్లల్లో వచ్చిన అతిథులు తినే దాని కంటే వృథా చేసేదే ఎక్కువ. అవసరం లేని ఆడంబరాలకు పోయి బాగా డబ్బున్న వాళ్లు చేసే ఆర్భాటాలలో కనిపిస్తాయవన్నీ. ఒక పెళ్ళి భోజనం లో జరిగే వృథాతో వందల మంది పేద వాళ్ల కడుపు నింపొచ్చు. ఇక్కడ మాత్రం తిండి లేని వాళ్లకు వీళ్లు అవన్నీ ఇవ్వొచ్చు కదా” సాలోచనగా అన్నాను మళ్లీ.

నీకో ప్రదేశం చూపిస్తాను రేపు అంది.

***

మర్నాడు తను చెప్పిన ప్రదేశానికి రోడ్డుకావలగా పార్కు చేసాను. నన్ను కారులో ఉండమని తను దిగి వెళ్లి లైనులో నిలబడింది.

10 నిమిషాల తర్వాత అసలదేమిటో చూద్దామని అదే ఆవరణ లో ఎదురుగా ఉన్న ఆఫీసు వైపు నడిచేను. అది కమ్యూనిటీ సెంటర్ వాళ్ల ఫుడ్ సెంటర్.

ఇక్కడ కమ్యూనిటీ సెంటర్ లు కనీస అవసరాలు తీరని వారికి సహాయం చేస్తాయి. కమ్యూనిటి సెంటర్ లకు పెద్ద పెద్ద స్టోర్లు ఫుడ్ ని ఇలా డొనేట్ చేస్తుంటాయి. ఇలా డొనేట్ చెయ్యడం వల్ల టాక్సు లో బెనిఫిట్ వస్తుంది వాళ్లకు. ఈ ఫుడ్ సెంటర్లలో సహాయం పొందడానికి చాలా నిబంధనలుంటాయని ఎక్కడో చదివాను. అన్ని సందర్భాల లోనూ అందరూ అర్హులు కారు ఇలాంటి వాటికి. అయితే ఆదాయం తక్కువ ఉన్న వాళ్లలో రకాలను బట్టి, పిల్లల సంఖ్యని బట్టి అర్హతా పరిధులుంటాయి. అక్కడ ఆర్నెల్లకు నామక: అయిదారు డాలర్లు కట్టించుకుని ప్రతీ రోజూ ఉచితంగా తిండి సామాన్లు ఇస్తుంటారు. అయితే ప్రతీ రోజూ కేవలం కొన్ని నిర్ణీత సమయాల్లో మాత్రమే రెండు, మూడు గంటల పాటు తెరిచి ఉంటుందా దుకాణం.

వివరాల కోసం వచ్చిన వాళ్లకి, ఏమేం ఫారాలు పూర్తి చెయ్యాలో, సంబంధిత డాక్యుమెంట్లు ఏం తేవాలో చెప్పే క్లర్కు నా వైపు ప్రశ్నార్థకంగా చూసింది.

నేనొక చిరునవ్వు నవ్వి, “ఊరికే వివరాలు తెలుసుకుందామని వచ్చాన”ని చెప్పాను.

అక్కడ కుర్చీలో చతికిల బడ్డాను.

అక్కడి నుంచి అలీసియా నిలబడ్డ లైను కనిపిస్తూంది.

లైను లో 30 మంది కంటే ఎక్కువ లేరు. ఒకళ్లో, ఇద్దరో ముసలి వాళ్లు ఉన్నారేమో. మిగతా అందరూ చక్కగా మేకప్పులు చేసుకుని, శుభ్రమైన బట్టలు తొడుక్కుని, చూడడానికి ఆరోగ్యంగా, బలిష్టంగా ఉన్నారు.

అలీసియానే ఒక మాదిరి బట్టలతో, మామూలు చెప్పులతో ఉందక్కడ. అధిక భాగం మెక్సికన్లు, కొందరు చైనీ ముఖ కవళికలున్నవారు, ఒకళ్లిద్దరు తల నెరిసిన తెల్లవాళ్లు, నల్లవాళ్లు, ఒకతను ఇండియా చుట్టుపక్కల దేశస్థుడిలా ఉన్నాడు.

అరగంటైనా అలీసియా రాక పోయేసరికి బయటికి వచ్చి కారు దగ్గర చెట్టు కింద నిలబడ్డాను.

ఆ ఆవరణలో మొదటగా లైనులోంచి వచ్చినామె లడ్డూల్లాంటి ముగ్గురు పిల్లలతో అక్కడే బయట గడ్డిలో బెంచీ మీద కూలబడి చేతిలో పట్టేంత క్రీం కేకులు, మఫిన్లు తినడానికిచ్చింది వాళ్లకి.

అది కాగానే దాదాపు అర లీటరు పాల డబ్బా సంచీ లోంచి తీసి గడగడా తాగి, విసిరేసి ఆట మొదలెట్టారు వాళ్లు. దాదాపు గంట తర్వాత స్టోరులోంచి బయటకు వచ్చి గొణుగుతూ కారెక్కింది.

“చూసేవా! ఎంత ఫుడ్డు ఇక్కడ వేస్ట్ అవుతుందో!” అంది మా కళ్ల ముందు నుంచి ఒకతను పెద్ద బండి తోసుకు వెళ్ళి పొడవాటి ఫ్రెంచ్ బ్రెడ్లని బిన్ను లో అప్పటికే ఉన్న బ్రెడ్ల మీద కుప్ప పోసాడు.

నేను తెచ్చిన సరుకులు చూడు, ఇవన్నీ ఇక ఒకటి, రెండు రోజులలో డేట్ అయిపోయేవి. ఇవేళ్టితో డేట్ అయిపోయేవి ఇలా స్టోర్ మూసేసే వేళకి ఇక డస్టుబిన్నులలో పడేస్తారు. అవన్నీ వృథానే. మొదట లైను లో నిలబడ్ద వాళ్లకి పాలు, కేకుల వంటి కాస్త మంచి సరుకులు వస్తాయి. నేను వెళ్లే వేళకి ఇదో ఈ బ్రెడ్డు, టిన్నుల్లో ఉన్న కొన్ని కాయగూరలు, ఏవో సిరియల్సు వంటివి తప్ప ఏవీ లేవు. కానీ తప్పనిసరిగా వాళ్లేవి ఇస్తే అవి పుచ్చుకోవలసిందే. ఈ సిరియల్సు మా పిల్లలు అస్సలు తినరు. ఇక ఈ నూడుల్సు ఏం చేసుకుంటాం?

నిజానికి మాకు ఎక్కువగా బ్రెడ్డు అవసరం. ఇలా పడెయ్యనైనా పడేస్తారే గానీ కుటుంబాన్ని బట్టి లిమిట్ దాటి ఇవ్వరు. ఏవిటో పిచ్చి నిబంధనలు. అక్కడున్న మనుషులెందరున్నారు? ఎంత వృథా అవుతూంది అన్నది లెక్కబెట్టరు.”

నేను ఇదంతా విచిత్రంగా చూసే లోగా “ఈ బియ్యం చూసేవా?” అని బహుశా: అరకిలో ఉన్న పేకెట్టు చూపించింది. ఇంత చవక రకం బియ్యం ఎవరైనా తినగలరా? తిన్నా ఇన్ని కాసిన్ని ఎవరికి పెట్టను?” అంది నిట్టూరుస్తూ.

నాకు అప్పట్లో మన దేశంలో రేషన్ షాపుల్లో మొత్తం నూకలు, రాళ్లల్లో కొన్ని బియ్యం కలిపినట్లుండే చవక రకం బియ్యం గుర్తుకొచ్చాయి. పేదల కేదో గొప్ప సహాయం చేస్తున్నట్లు నటించే రేషన్ వ్యవస్థ గుర్తుకొచ్చింది. ఇక్కడి పరిస్థితి ఇదన్న మాట.

“నయమే, ఇక్కడి బియ్యంలో బియ్యమే ఉన్నాయి, రాళ్లు కాకుండా” అన్నాను.

“అక్కడున్న వారిని చూసేవుగా. వాళ్ళెవ్వరూ నిజంగా సహాయం అవసరమైనవాళ్లలా ఉన్నరా?” అనేసి, తన మనసులో ఎన్నాళ్లుగానో దాచుకున్నది చెప్పినట్లు దీర్ఘంగా నిట్టూర్చింది.

“మరిక్కడికి ఎందుకొచ్చావు?” అని అడుగుదామనుకుని అలీసియా ముఖం లోని ఒక రకమైన నిర్వేదం చూసి ఊరుకున్నాను.

తను మాత్రం ఏం చేస్తుంది? నెలకొకసారి అయితే మంచి ఫుడ్ పేరుతో కొంత ఖర్చు పెట్టుకోగలరేమో కానీ రోజూ ఎక్కడ ఖర్చు పెట్టగలరు? అనుకున్నాను.

“ఈ చోటికి నెలకు ఒకట్రెండు సార్ల కంటే రాలేను. ఇక్కడికి బస్సు లేదు, ఎక్కడో దిగి నడిచి రావాలి. నా నడుం సంగతి తెలిసిందేగా బరువులు ఎత్తలేను. ఇవేళ నీకు ఫుడ్ వేస్టు ఇలాంటి చోట్ల కూడా ఎలా జరుగుతుందో చూపిద్దామని తీసుకు వచ్చాను. స్టోర్ ల వాళ్లు డొనేట్ చేసినవీ ఇక్కడి డస్ట్ బిన్నుల్లోకి, చెయ్యనివి అక్కడి డస్టు బిన్నుల్లోకి. అంతే తేడా. చాలా సమయం నా కోసం ఇక్కడ ఎదురు చూడవలిసి వచ్చింది. సారీ “అంది.

“ఫర్వాలేదులే” అని “ప్రపంచం లో తిండి లేక బాధ పడే వాళ్లందరినీ అమెరికాకి తీసుకొచ్చేస్తే బావుణ్ణు” అప్రయత్నంగా పైకి అన్నాను.

“మనిద్దరికీ అమెరికా ఇమ్మిగ్రేషన్ అప్పగించిన నాడు అలాగే చేద్దాములే. “అని

“ఒక్క నిమిషం ఇక్కడాపుతావా” అంది.

రోడ్డు వారగా ఉన్న చర్చి ఆవరణలోకి కారు తిప్పాను. అక్కడ ఉన్న ఫుడ్ డొనేషన్ డబ్బాలో తనకు అవసరం లేని టిన్ డ్ పుడ్ వంటి వన్నీ వేసి వచ్చింది.”

మనకైతే రేషను షాపుల్లోనివి తిరిగి షాపు వాళ్లే కొనుక్కుంటారు.

తిరిగి కారెక్కాకా “మా పిల్లలకి బాగా జంక్ ఫుడ్ అలవాటు. సోడా లు, చిప్స్ పాకెట్లు, బర్గర్లు, పీజాలు తినే వాళ్లకి ఇలాంటివన్నీ ఎక్కడ నచ్చుతాయి చెప్పు?! ఇంట్లో నేను వండే రైస్, బీన్స్ వంటి సంప్రదాయ ఆహారం మా ఆయనా, నేను తప్ప ఎవరూ తినరు. మా పిల్లలు ఎవరి సంపాదన లో వాళ్లు ఇంటద్దె కట్టంగా మిగిలినదంతా తినడానికే సరిపోతుంది. ఇక్కడ నాకవసరం లేనివి తిరిగి డొనేట్ చేసేస్తే కనీసం నేను ఫుడ్ ని వృధా చెయ్యడం లేదన్న సంతృప్తి మిగులుతుంది. ” అని నవ్వింది.

“దగ్గర్లో సేఫ్ వే కి తీసుకెళ్తావా ఛీజ్ పేకెట్లు, మాంసం, లెటస్, టమాటాలు కొనుక్కుని వెళ్దాం. సాయంత్రం పిల్లలకి స్నాక్ గా సేండ్ విచ్ లు చేస్తే ఎగబడి తింటారు. అసలే స్కూళ్లలో తగ్గింపు రేటుకో, ఫ్రీఫుడ్ పేరుతోనో వాళ్లు పెట్టే చవక రకం తిండి తినలేక ఉదయం నించీ అర్థాకలితో ఉంటారు వాళ్లు” అంది.

మరి డబ్బులు సరిపోతాయా మీకు అనగానే “నెలంతా తినడానికి ఒక మనిషికి 200 డాలర్ల కంటే ఎక్కువ కావు.

కానీ ఇక్కడి పెద్ద ఖర్చు ఇంటి అద్దెనే కదా! ప్రియా! సంపాదించేది ఎందుకు? కడుపు నిండా తినడానికే కదా!”

అని, “అదిగో సేఫ్ వే వచ్చింది” అంది.

“ఎస్ మేం” అని నేను కారు తిప్పగానే

“నా బంగారం నువ్వు. నా కోసమే అమెరికాకి వచ్చావు” అని తడి కళ్లతో చూసింది నా వైపు.

*** * ***