కవిత్వం

ఒక నిశీధి తలపులా…

11-అక్టోబర్-2013

ఠాత్తుగా
ఏదో పేజీ దొరుకుతుంది
నన్ను నేను చదూకుంటా
బోర్లించిన పుస్తకంలోంచి
సంగతుల్ని దొర్లిస్తూ నిశ్శబ్ధం
మదిని వడకట్టేస్తూ వేళ్ళ చివర్లు
ఇంకేం రాయను ఈ క్షణం మీద

కొన్ని క్షణాలు రచింపబడవు !

అయినా రాయడానికేదో ఉంది
పగలు-భూమి-నిజమే కాకుండా
రాత్రి-ఆకసము-ఊహే కాకుండా ఏదో వుంది…

బరువైన రేయి రెప్పల్లో జారే
రెండవ జాములో
తలకిందులవుతున్న లోకంలాంటిదేదో…

వేవేల కిరణాలోకేసారి విడుదలయ్యే తీరులో
జననమరణంలాంటిదేదో…

మళ్ళీ వెళ్ళొద్దామనుకుంటూ
వెనక్కి తిరక్కుండానే తిరిగొచ్చేసిన దారిలో
ఒక జీవిత పయనంలాంటిదేదో…

ఏదో వుంది…
అది గమ్యమైతే కాదు

అందుకునే రాగం కన్నా
రాయాలనుకునే భావం కన్నా
అద్భుతమైన ఆరా ఏదో వుండే వుంటుంది
ఎటు నుండో రాలే రహస్య చినుకులా
తెల్లారితే మరపుకొచ్చే ఒక నిశీధి తలపులా !

ఎప్పటికీ అలానే ఉండిపోయే
అది ఒక మాటో, మరి పాటో!

 

Painting: Mandira Bhaduri, University of Chicago.

 

మోహన తులసి గారి బ్లాగు: http://vennela-vaana.blogspot.com/