కవిత్వం

ఏదోక క్షణాన…

నవంబర్ 2013

నీకూ నాకూ మధ్య ఒక భూగోళం అడ్డు
నీకూ నాకూ మధ్య ఒక సూర్యచంద్రులు అడ్డు
అన్నిటికీ మించి ఒక అహం అడ్డు

ఎన్ని అణువులు కలుస్తున్నాయో
కొలవలేని దూరాన్ని అడ్డేయడానికి
ఎన్ని వనాలు కాచుకొనున్నాయో
ఒక సంగమాన్ని హరితవర్ణంచేయడానికి

అయిదేళ్ళ మీద లెక్కించే మహాసముద్రాలేనా
వానకు హేతువయ్యేది
జంట నయనాలెన్నిటినో మర్చిపోయావేం !?
నిన్నూ నన్నూ తడిపే అన్ని వేల వాన చుక్కల్లో
అశ్రుధారలెన్నో

ఏదోక క్షణాన
భూమండలం అంచుల్లో ఒకే అలై పుడతాం
ఎగసిపడే జీవానికి ఒకే అభినయమవుతాం

ఇదిగో ఇక్కడే
సరిహద్దురేఖల్ని చెరుపుకుని
ప్రహారికి పట్టనంత విశాలమవ్వాల్సిందిక్కడే
ఎల్లరాయిల్లేని ఆకాశాన్ని చూసినప్పుడల్లా ఆశ ఇదే!
ఆ నీలపు కాన్వాసుపైన గీయాల్సిన చిత్రమిదే!

 

 

Painting: Vincent van Gogh
Credit: wikimedia.org