కవిత్వం

ఉదయ గీతం

నవంబర్ 2013

ప్రతి ఉదయం ప్రపంచ సృష్టి జరుగుతుంటుంది
సూర్యుని ఎర్రని ఎండు పుల్లల కింద బూడిదైన
రాత్రి భస్మ రాసులు మల్లీ ఆకులై అలవోకగా
వృక్ష శాఖలకు అతుక్కు పోతుంటాయి.

నల్లని వలువల వంటి కొలనుల మీద
వేసవి లిల్లీల ద్వీపాలు ముద్రించ బడుతుంటాయి.

నిత్య సంతోషం నీ నైజ మైతే
నీవా మెత్తని జాడల గుండా కదలిపోతుంటావు
నీ భావ జాలం మీద కాలూనుకుంటూ
నిరంతరంగా ఈదుకుంటూ
బరువెక్కిన నీ భావనలు లోన గుచ్చుకుంటున్నా
నీరసంగా కాల్లీడ్చుకుంటూ నడవక తప్పకున్నా.
నీ అంతరాంతరాల్లో అడవి జంతువేదో అరుస్తుంటుంది
‘తద్వతు తాను కోరుకున్నట్టుగానే ఉండిపోయింది పుడమి’ అంటూ.

అప్పుడు ప్రతి ఉదయం
లిల్లీలు జ్వలిస్తున ప్రతి పూలకొలను
ఒక ఉదాత్త దైవ ప్రార్థన, ఒక ఉదార దేవుని దీవన;
నీవు ప్రార్తించాలని ప్రయత్నించినా, లేకున్నా
నీవు ఆనందంగా ఉండాలని అనుకున్నా,లేకున్నా.

 

మూలం: మేరీ ఆలివేర్, అమెరికన్(ఓహియో) కవయిత్రి, ‘డ్రీమ్ వర్క్ -1986′ నుండి.
అనువాదం: నాగరాజు రామస్వామి