వీడ్కోలు తరవాత
*************
వొక వంతెన మీంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఆమె
ఇంకో పూవుని తన మెత్తని చేతులతో తాకినట్టు
ఇంకో రెమ్మని ఎరుపెక్కిన తన చెంపకి ఆనించుకున్నట్టు-
వొక వసంతంలో మునిగి తేలుతుంది వంతెన
తానే వొక పూవై,
ఆకుపచ్చ రెమ్మయి-
ఆ వంతెన దాటాక
వొక్క క్షణం ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది
చకచకా వెళ్ళిపోతుంది తన దారిన తానై!
ఆమె చూపుని తన వొంటి మీద వలయంలా చుట్టేసుకుని
ఆ వలయమ్మీద ఆకాశాన్ని కప్పేసుకుని
ఇక్కడితో జీవితం అంతమైతే చాలని
మొండికేసి అలాగే నిల్చుంది వంతెన.
ఇది చూడడానికి ప్రేమ కవితలా కనిపిస్తుంది కాని, నాకైతే ఇది కాలానికీ, వయసుకీ సంకేతంలా కనిపిస్తుంది. అఫ్సర్ ఇప్పుడు ప్రేమకవితలు రాస్తాడని అనుకోను… అది పెద్ద నేరమో అపరాధమో కాకపోయినా. మనకు తెలియకుండనే వయసు మీద పడ్డట్టు, మనకి తెలియకుండానే పెద్దరికంకూడా వచ్చేస్తుంది. మన ఆలోచనలూ, మన రచనల్లో వస్తువూ మనకు తెలియకుండానే ఒక్కొక్కమెట్టు ఎక్కుతుంటాయి. నిన్నటివరకూ మనకి మంచి కవితా వస్తువుగా కనిపించినది ఈరోజు అలా కనిపించకపోవచ్చు. మానసిక పరిణతి, పరివర్తనలకి అనుగుణంగా వస్తువుల్ని, వ్యక్తుల్నీ వేర్వేరు కోణాలలో చూడడం తటస్థిస్తుంది. దానికనుగుణంగానే మన అభివ్యక్తికూడా మారుతుంటుంది. సరిగ్గా ఆ సందర్భం పురస్కరించుకునే, అఫ్సర్ ఇప్పుడు ప్రేమకవితలు రాస్తాడని అనుకోను అని నేనన్నది.
ఇక్కడ ‘ఆమె’ మన యవ్వనం అవొచ్చు,మన మాతృత్వం (పితృత్వం) కావొచ్చు మన జీవితంలో ఒకానొక మధురమైన సంఘటనో, అద్భుతమైన సందర్భమో కూడా కావొచ్చు. ఆమె … మన యవ్వనం అనుకుంటే, వంతెన మన శరీరం;ఆమె ఒక సంఘటనో, సందర్భమో అనుకుంటే, వంతెన మన జీవితంలో అలా వెళిపోయిన మధురమైన క్షణం…మనం తల్లిదండ్రులమైనప్పటికంటే, మనం తాతలమూ అమ్మమ్మలమూ అయినప్పుడు ఆ మాతృత్వ మధురిమ ఇంకా ఎక్కువగా అవగాహన వుతుంది.
ఆ నేపధ్యంలో ఇప్పుడు ఈ కవితని మరొక సారి చదివితే, మనమీంచి యవ్వనం ఒక మెత్తని పూవు తాకినట్టు వెళిపోతుంది.మనమే ఒక ఆకుపచ్చని రెమ్మలమైపోతాము… మనకి తెలియకుండా. నిజానికి ఆ ప్రాయం మనమీదనుండి వెళుతున్నప్పుడు దాని గొప్పదనం మనం గ్రహించలేకపోవచ్చు. ఆ వంతెన దాటిన తర్వాత, అంటే… యవ్వనం తిరోన్ముఖమైనప్పుడో, లేక ఆ మధురమైన సంఘటనో, సందర్భమో ముగింపుకి వచ్చినపుడో… వెనక్కి తిరిగి చూడడం అన్నది, మనం చేసుకునే సింహావలోకనం. ఇప్పుడు ఆ గడచిన సమయమంతా ఒక Nostalgic Memory అవుతుంది. అందుకనే దాన్ని మనం వలయంలా కప్పుకుని జీవితం అక్కడితో అంతమయితే బాగుండునని కోరుకుంటాం.
ఒక సమాంతర చిత్రణద్వారా చెపుతున్నదానితో వేరే విషయాన్ని స్ఫురింపజెయ్యడం(Allusion) ఒక మంచి సాహిత్య ప్రక్రియ. ఇది మానసిక పరిణతీ, సాహిత్యంపై కొంత అవగాహనా ఉంటే తప్ప అంత సుళువుగా పట్టుబడదు.
ఈ కవితని నేను ఇలా విశ్లేషించుకుని ఆనందించాను. అది నిజం కూడ కానక్కరలేదు. అయితే అటువంటి అనుభూతి కలిగించిన కవికి అభినందనలు చెప్పకుండా ఉండలేను.
*** * ***
ఇంగ్లీష్ అనువాదం:
http://teluguanuvaadaalu.wordpress.com/2013/10/18/after-bidding-adieuafsar-telugu-indian/
ఒక సమాంతర చిత్రణద్వారా చెపుతున్నదానితో వేరే విషయాన్ని స్ఫురింపజెయ్యడం(Allusion) ఒక మంచి సాహిత్య ప్రక్రియ. ఇది మానసిక పరిణతీ, సాహిత్యంపై కొంత అవగాహనా ఉంటే తప్ప అంత సుళువుగా పట్టుబడదు – అక్షర సత్యం . చక్కని విశ్లేషణను అందించిన మూర్తి గారికి కృతజ్ఞతాంజలులు .
బాగుంది మూర్తి గారూ మీ పరిచయం
చాలా బాగా చెప్పారు మూర్తి గారు.
‘ఒక సమాంతర చిత్రణద్వారా చెపుతున్నదానితో వేరే విషయాన్ని స్ఫురింపజెయ్యడం(Allusion) ఒక మంచి సాహిత్య ప్రక్రియ. ‘ చాలా చక్కగా చెప్పారు.
మూర్తి గారు, మరీ ఫార్మల్ గా ధన్యవాదాలు చెప్పలేను. ఎవరైనా నా వాక్యాల మనసుకి దగ్గిరగా వచ్చినప్పుడు సంతోషంగా వుంటుంది. మీరు చాలా సార్లు అలా వచ్చారు. ఇది వొక తాజా నిదర్శనం మాత్రమే!
చాలా బాగా చెప్పారండి మూర్తిగారు.
తరతమ స్థాయిల్లో అర్ధమైనదే గొప్పకవిత్వం కాగలుగుతుందనుకుంటాను.వయస్సుని బట్టి తమతమ ఆలోచనా పరిధిని బట్టి ఒక్కొక్కరు ఒక్కోలా అన్వయించుకుంటారు.మీ అన్వయం చాలాబాగుందిసార్ మూర్తిగారూ..నా ఆలోచనా పరిధిని మరికొంత విస్తృతపరిచింది.
నిజానికి ఏ ఆలోచనలేకపోయినా కూడా సున్నితంగా,సుకుమారంగా మనస్సుమీంచి వెళ్ళిపోతోంది.అఫ్సర్ గారికి అభినందనలు
మనసులో మరో వాకిలిని తెరిచి ఒక సుందర దృశ్యాన్ని అఫ్సర్ గారు చూపితే, మూర్తిగారు మరింత ఆత్మీయం గా పచ్చదనం లోని ప్రకృతిని ఆవిష్కరించారు. రెండు విధాలా కవితకి నిండుదనమె వొచ్చింది.
Murthy gariki, Afsarji.. ki.. naasathakoti.. ABINANDHANULU. .