నీరెండ మెరుపు

జిన్నీ భూతం

డిసెంబర్ 2013

ఈ మధ్య నేను చదివిన కొన్ని మంచి కవితల్లో కత్తి మహేష్ కుమార్ గారి నా జిన్నీ భూతం ఒకటి. పైకి ఒక వ్యసనానికి బానిస అయిన వ్యక్తి, యథాప్రకారం, తాగిన తర్వాత, అంతర్ముఖుడై, చేసిన తాత్త్విక వివేచనలా బయటకి కనిపిస్తుంది. గడుసైన కవులు చేసే కొన్ని చిలిపి ప్రయోగాల్లో ఇదొకటి. కానీ, ఈ కవిత సందేశం వేరే అని నాకు అనిపిస్తుంది.

నన్ను నేను సీసాలోకి ఒంపుకుని, బిరడా బిగించి, టై కాప్స్యూల్ లో పడేసుకున్నాను.”
ఈ ఎత్తుగడ ఒకసారి గమనించండి. మనిషికి వాడి విశ్వాసాలను మించిన మత్తు మందు మరొకటి ఉండదు. అది వ్యక్తి Comfort Zone. మనందరమూ, ఏ మినహాయింపులూ లేకుండా, చాలమందిమి తెలియకా, కొద్దిమందికి తెలిసీ కూడా ఈ వ్యసనానికి బానిసలమే. ఈ విశ్వాసాలు … ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సామాజిక విషయాలు మొదలుకుని తాత్త్విక విషయాలు ఏవైనా కావొచ్చు…

పక్కనే చెప్పిన మాటలు : ” నాకు అనుభవం ఉంది, జ్ఞానం ఉంది, కానీ నేను మాత్రం సీసాలోనే మిగిలిపోయాను.”

ఈ అనడంలో, మనం కొన్ని సందర్భాలలో ఎంత Dogmatic గ ( దానివల్ల కలిగిన నిస్సహాయతలో) ఉంటామో దాని సూచన ఉంది. మన అనుభవాలకంటే, మన జ్ఞానం కంటే, మనం మన విశ్వాసాలకే ప్రాధాన్యత ఇస్తాం జీవితంలో నిజమైన పరీక్ష ఎదురైనప్పుడు.ఆ విశ్వాసాలే సీసా. మన నమ్మకాలు దాటి ఆలోచించకపోవడమే బిరడా బిగించుకోవడం. ఏ మాత్రం ఇంగితం ఉన్నవాడికైనా “శాశ్వతం” అన్నది ఒక మిధ్య అని తెలుస్తుంది. కానీ, అదొక మాయలేడి. దాని Infatuation నుండి ఎవ్వడూ తప్పించుకో లేడు. కొందరికి బాగా తాగిన తర్వాత తత్త్వాలు నోటికి వచ్చినట్టు, మనకి అప్పుడప్పుడు మన ఆలోచనలు తప్పేమో నన్న భయం (అదికూడా ఈ శాశ్వతత్త్వపు బండిలో మనకి చోటు దొరకదేమో నన్న భయం వల్లే) వెంటాడుతుంటుంది. మనం తప్పు చేస్తున్నామేమో అన్న భయం అయితే ఉంటుంది గానీ, మన నమ్మకాలని పరీక్షించుకుని, తప్పైతే సరిదిద్దుకునే Openness ఉండదు. అందుకే భయం. బెంగ. మ్యూజియంలో వస్తువుగా మిగిలిపోతానేమో, అసలు గుర్తింపే లేకుండా, కాలం అనే ఇసకలో ఇంకిపోతానేమో నని. కొన్నాళ్ళు అలా సీసాలో మిగిలిపోతే, మనం Outdated అయిపోతాం. బిరడా తియ్యడమన్నది సాహసమైన చర్యే. అందులోంచి కరడుగట్టిన నమ్మకాలన్న భూతాలు విరుచుకుపడతాయి… (కాకపోతే మనందరికీ అల్లా ఉద్దీన్ అద్భుత దీపం లాగ సేవచేసే భూతాలొస్తే బాగుండునని అనిపిస్తుంది). మనకి పాత ఆనవాళ్ళే తప్ప కొత్తవి దొరకవు. ఇవి ప్రస్తుతానికి (బిరడా వేసుకున్ననాటికి భవిష్యత్తు) పనికొస్తాయో లేదో తెలీదు. మనందరం రిప్ వాన్ వింకిల్ లా ఉంటాం. కానీ, మనం మాత్రం పనికొచ్చినా రాకపోయినా, ఒక కాల శకలంగా మిగులుతాం.

కవి గానీ, తాత్త్వికుడు గానీ, భవిష్యత్తుపై ఆశావహమైన దృక్పథం ఉండగోరే వాడు గానీ, వదుల్చుకోవలసిన లక్షణాలు చెబుతోంది, పరోక్షంగా, ఈ కవిత. విశ్వాసాల మత్తులో పడకపోవడం, అవి తప్పైతే సరిదిద్దుకుని కాలంతో పాటు ప్రవహించేగుణం అలవరచుకోవడం (దాని వల్ల మనం currencyలో ఉంటాం). ఈ రకమైన మత్తులో పడ్డవారు తప్పకుండా  భూతాల్ని పైకి తరమ వలసిందే.

***

నా జిన్నీ భూతం
—————-
నన్ను నేను సీసాలోకి ఒంపుకుని
బిరడా బిగించి, టైం కాప్స్యూల్ లో పడేసుకున్నాను.
అనుభవం ఉంది. జ్ఞానం ఉంది.
కానీ నేను మాత్రం ఆ సీసాలోనే మిగిలిపోయాను.
నన్ను నేను వృధా చేసుకున్నానా!
రాబోయేకాలానికి నమూనాగా మలుచుకున్నానా
లేక ఒక మ్యూజియం పీస్ గా మిగిలిపోతానా
అసలు గుర్తింపేలేకుండా ఇంకిపోతానో తెలీదు
కొన్ని బిరడాలు తీస్తే భూతాలు వస్తాయి
కానీ ఈ సీసాలోంచీ భూతకాలపు అనవాళ్ళు
వర్తమానపు జ్ఞాపకాలు వస్తాయి
అవిభవిష్యత్తుకు పనికొస్తాయోలేదో తెలీదు
కానీ నన్ను కోల్పోయిన నేను కాలంగా మిగిలాను

-కత్తి మహేష్ కుమార్

***

The Translation:

Emptying myself into the bottle
Putting the lid, I sealed myself into a time-capsule.
I had experience; and knowledge enough.
But I settled in the bottle.
Did I waste myself?
Or moulded into a model for the future?
Shall I reduce to an exhibit in a museum ultimately?
Or shall I dry up without trace? I don’t know.
Devils come out, if you open some lids.
But out of this bottle come the signatures of the past
And the memories of the present.
I am not sure if they be of any use to future.
But losing me to myself, I remained as time itself.

-Mahesh Kumar Kathi