కవిత్వం

చిరునామ

డిసెంబర్ 2013

అంతర్లీన సరిహద్దు రేఖేదో
చెరిగిపోతోంది లోనెక్కడో…
సంతోషం తరువాత దు:ఖంలా
స్నేహం తరువాత సాంత్వనలా

కనులు పారేసుకున్న
చూపుల నవ్వులేవో జారిపడ్డట్టు

కొన్ని వింజామరలా తలపులేవో
తనుసీమలపై నుండి తరలిపోయినట్టు

చేతివేళ్ళతో పారే నీటి
ఉపరితలాన్ని స్ప్రుసించినట్టుగా

ఎనలేని ప్రేమామృత పరిదిలేని
పరువాలను మనసుతోనే శోదిస్తూ
శాశ్వత చరితల తయారిలో
వాడిపారేసిన వచనంలా
వేచిచూస్తోంది ఈ క్షణం.

నిన్ను కనలేని ఈ కనులెందుకు
నీ పేరు పలుకని పెదవులెందుకు
తీసుకెళ్ళు నీతోనే…
కనీసం నువ్వెళ్ళే దారిలో
నీకు కాపలాగ పడుంటాయి

నేను కనిపించని నాలో
నీవు దాగి నన్ను నీలోకి
మార్చుకొన్నావెప్పుడో
అర్ధంకాని వలపువేదంలా.