కిటికీలో ఆకాశం

చివరి పద్యం చెప్పకనే పోతామే ‘మో’ ?!

జనవరి 2014

లోకం లోని దుఃఖాన్ని, లోకుల ఆగ్రహాన్నీ పద్యం గానం చేస్తుందనీ, లోకం వేదనలకు పద్యమొక ముక్తిదాయని అనీ… ఇలా ఏమేమో చెప్పారు గానీ, పద్య రచనకు ఉపక్రమించినపుడు కదా సత్యమేదో కవి కళ్ళ ముందు నగ్నంగా కదలాడేది !

అప్పుడు కదా కవి గ్రహించేది, తన లోపల్లోపల సుడులు సుడులుగా తిరుగుతోన్న కొన్ని చింతనా శకలాలని దోసిట్లో పట్టుకుని ఒక చీకటి సొరంగం లోపల ప్రయాణానికై ఒక నిస్సహాయుడిలా బిక్కు బిక్కుమంటూ ఆ సొరంగము ఎదుట తాను నిలబడినానని!

కవీ, ఎలాంటి స్థితి అది ?

ఆ స్థితి ఎలాంటిదో తెలుసుకోవడానికి ఒక సాధారణ కవి దగ్గరికి వెళ్లగలమా? బహుశా, దీనినొక గంభీరమైన అంశంగా మార్చి మరింత గంభీరమైన మాటలతో భయపెడితే?
అందుకే, ‘కవులకే కవి’ అయిన ఈ ‘మో’ పద్యాన్ని కాసేపు ఆశ్రయిద్దాము.

నా సాహిత్య అనుభవాలలో ఒక విచిత్రమైన అనుభవం ఏమిటంటే, నేను ‘మో’ కవిత్వాన్ని విస్తృతంగా చదవడానికి ముందే ఆయన కవిత్వం పైన ప్రచారంలో వున్న విమర్శ నన్ను బలంగా తాకడం. చాలా కాలానికి, ఆయన ‘చితి – చింత’, ‘బతికిన క్షణాలు’, ‘రహస్తంత్రి ‘, ‘పునరపి’ చదివాను. లేటుగా చదవడం ప్రారంభించానన్న దిగులుతో ఒక ఉన్మాదిలా చదివాను. నా జ్ఞాన పరిమితుల వలన ‘మో’ రాసిన చాలా పద్యాలని అందుకోలేక పోయిన మాట నిజమే గానీ, నాకు అందనంత దూరంగా వున్నా నక్షత్రాలు నక్షత్రాలే కదా!

‘మో’ ని ఆధునిక కవి అనీ, ఆత్మాశ్రయ కవి అనీ , ‘ఆబ్స్ట్రాక్ట్ కవి’ అనీ ఏమేమో అంటారు గానీ, ‘చితి – చింత’ తో మొదలు పెట్టి , ఆయన తదుపరి పద్యాలని చదువుకుంటూ పోయినపుడు అనిపించింది-
‘మో కవిత్వం- తన అమాయక ఆఫ్రికా అడవిలో హాయిగా తిరుగుతోన్న ఒక కుర్రవాడిని అకస్మాత్తుగా ఒక పెద్ద నగరంలో పడదోస్తే, సొమ్మసిల్లి పడిపోయిన ఆ కుర్రవాడు తాను కోల్పోయిన జీవితాన్ని తలచుకుంటూ అపస్మారక స్థితిలో పాడిన వేదనా గీతాలు’

లేకపోతే, ‘పద్యంలో ప్రతి పాదం / చీకట్లో మలుపు దూసుకుపోయే / నల్ల లారీ ఎర్ర కళ్ళు’ అంటాడా ?
లేకపోతే , ‘నువ్వు వెయ్యి చెప్పు / చివరికి మనందరం చిన్తాక్రాంతులమయ్యే వుంటాం ‘ అంటాడా ?

తన జ్ఞానాన్నీ , అనుభవాన్నీ , అక్షరాలనీ పద్యంలో కలగా పులగం చేస్తాడని మనం ‘మో’ కవిత్వం పైన ఫిర్యాదు చేస్తాము గానీ, లోకం పట్ల సవాలక్ష ఫిర్యాదులున్న ఈ కవి ఆ లోకాన్ని తన పద్యం లోకి ఆవాహనం చేసినపుడు తన కసినంతా చూపించకుండా ఉంటాడా? అలా చేయడానికి ‘మో’ కే కాదు, ఏ కవికైనా వున్న ఆయుధాలు అక్షరాలే కదా !

సరే! ఇంతకీ ‘మో’ ఏ సందర్భంలో ఎందుకు ఈ పద్యం (‘ద్విభాష్యం’) రాసాడో గానీ, ఒకే ఒక్క కవితా వాక్యం కోసం ఈ పద్యాన్ని ప్రేమించాను. పద్య రచనకు సంబంధించిన గంభీరమైన విషయాలని అలా భుజమ్మీద చేయి వేసి ‘రా… పోదామ్మరి’ అని తనదైన శైలి లో చెప్పినందుకు ప్రేమించాను?

ద్విభాష్యం (చితి – చింత సంకలనం నుండి)

పద్యంలో ప్రతి పాదం
చీకట్లో మలుపు దూసుకుపోయే నల్ల లారీ ఎర్ర కళ్ళు
పద్యమ్మొత్తం
సర్కసు వాళ్లాకాశంలో వేసే దొంగల్ని పట్టే గొప్ప వెల్తురు

నువ్వు వెయ్యి చెప్పు
చివరికి మనందరం చింతా క్రాంతులమయ్యే వుంటాం
ఒరబ్బాయ్
ఇదంతా రామదాసు చెరసాల ; ఎండా వానా నర్తన శాల
మరేం చేస్తాం
మరిగే నీళ్ళల్లో పటిక బెల్లం రాయివేసి ఆవిరి పట్టు
నెట్టు – యిది మరీ లంఖణాల బోటు
తెలుసులో – సర్వ నామాలూ గర్వ నామాలే

తూచి చూచి వెయ్యి పోపులోకి గరం మసాలా
లాగిపెట్టి కొట్టు లెంపకాయి – వాడాకతాయి
సొరంగ మార్గంలో రైలు బండిలో దురంతం
ఈ భూమిక్కొంచెం పైగా నిల్చుని వెల్గును నియోన్
పోలీసు వాడి అర్థగజం టార్చి అరమైలు పర్వెట్టును
ఆనందంలో మనిషి అంత దూరమూ గెంతును

విలయంలోంచి లయంలోకి అవలోకించి
తనలోని వికలం లోకి కలాన్ని ముంచి
సత్యాన్నీ సౌందర్యాన్నీ తుంచి
సర్వ జనాన్నీ ఏకాన్నీ చీల్చి
దుః ఖించి దుఃఖ మూలాల్ని యోచించి
అక్కసు కొద్దీ శపించి కృంగి కృశించి నశించి
ఇత్యాదులీతి బాధలు పడి నీ వాడిగా నా వాడిగా
మనందరి సొదల్నీ వ్యథల్నీ తన పద్యాలుగా అచ్చు వేసి
నాలుగు రాళ్లుచ్చుకుని
దుః ఖాన్వేషణలో మళ్ళీ పద్నాలుగు టీ కప్పుల్ని తన్ని
నిరంతరం వ్యధ పొంది
గుండె పగిలో మెదడు నెత్తురు కక్కో వక్షం చీలో
విధి చీకటి వీధిలోకి తాటాకు టపాకాయలా పేలి
నారాయణా … చివరి పద్యమైనా చెప్పకుండానే
డ్దాంమని చచ్చేసేవాడు కవి
పాపం పద్యవూ అంతే
అడవి లేని చెట్టు లేని గూడులేని పిట్ట
ఆకాశంలోకదే పోత
నువ్వెంత సర్కసు వాళ్ళ వెల్తుర్ని నొక్కినా దాని రెక్కల్ని కాల్చదు
సరి కదా పిట్ట నేల మీద మరి వాలదు
గగనంలో ఆనంద దుః ఖ హేతువు లనంతాలు అనవగాహనాలు
రా పోదామ్మరి”

‘విలయంలోంచి లయంలోకి అవలోకించి / తనలోని వికలం లోకి కలాన్ని ముంచి’ ఎట్సెట్రా చేసిన కవి చివరాఖరికి ఏమవుతున్నాడు ? నిధి తాలూకు రహస్యమేదో తన కొడుకైన ‘నారాయణ’ అన్న వాడికి చెప్పడానికి చరమాంకం లో నోరు పెగల్చిన లోభి అయిన వ్యాపారి చివరికి ‘నారాయణ’ అన్న ఒక్క మాట మాత్రం పలికి తనువు చాలించినట్టుగా, చివరి పద్యమైనా చెప్పకుండానే పోతాడు!

మనకు అర్థమవుతూ వుంది – ‘ఇదంతా రామదాసు చెరసాల ; ఎండా వానా నర్తన శాల’ అన్న విషాద రహస్యం !
మరి వూర్కుంటామా?
ఊర్కోవొద్దనే కదా పెద్దాయన చెబుతున్నాడు -’ మరిగే నీళ్ళల్లో పటిక బెల్లం రాయి వేసి ఆవిరి పట్టి , ఈ లంఖణాల బోటుని నెట్టమని’

ఇదంతా సరే గానీ కవీ!
చీకటి మలుపుల్లోంచి అలా ఆకాశంలోకి దూసుకెళ్లిన పక్షి ఇక ఎప్పటికీ నీది కాదు.  ’గగనంలో ఆనంద దుః ఖ హేతువు లనంతాలు అనవగాహనాలు ‘
ఇంకా దాని కోసం సమయం వృధా చేయకు… “రా పోదామ్మరి”

* * * *