చర్చ

ఇప్పటి జీవితం ఇప్పటి కథల్లో ఉందా?

జనవరి 2014

కథ అంటే చెవి కోసుకోని వారెవారుంటారు చెప్పండి. అమ్మో, అమ్మమ్మో, నాన్నమ్మో, తాతయ్యో మరింకెవరైనానో కథలు చెప్తుంటే, వింటూ ఊ కొడుతూ నిద్దురపోవడం చిన్నప్పటి నుండీ మనకు తెలిసిందే. అనుభవమే. మనమే కాదు కథ చెప్పుకోవడం అనాదిగా ఉన్నదే. నలుగురూ ఒక దగ్గర చేరి కాలక్షేపం కబుర్లు-కథలు చెప్పుకోవడం, నీతిని, సమాజ పోకడని అంతర్వాహినిగా నింపి కథలు చెప్పుకోవడం ఉన్నదే. మౌఖికంగా చెప్పుకునే కథలు ముద్రణా సదుపాయాలు వచ్చాక అచ్చులో రావడం ప్రారంభం అయింది.

దిన, వార, మాస పత్రికలు పెరిగిపోయాయి. కథలను ఆహ్వానించాయి. ప్రోత్సహించాయి. ఫలితంగా పుంఖాను పుంఖాలుగా కథలు వచ్చాయి. ఎందఱో రచయితలు , రచయిత్రులు పుట్టుకొచ్చారు. మంచినీళ్ళ ప్రాయంగా కథలు రాసేస్తున్నారు. ఇప్పుడు ముద్రణలో వచ్చే పత్రికలకు అంతర్జాల పత్రికలు తోడయ్యాయి. ప్రింటు పత్రికల్లోనూ, అంతర్జాల పత్రికల్లోనూ కథా రచయిత్రులు/రచయితలు ఇబ్బడి ముబ్బడిగా సాహితీ సృష్టి చేసేస్తున్నారు.

ఆధునిక సాహిత్యంలో కథ ఒక ప్రత్యేక రూపాన్ని, సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. గడచిన వందేళ్ళ కాలంలో వైవిధ్యం గల వేలాది కథలు వెలువడ్డాయి. వివిధ పత్రికల్లో వచ్చినవే కాకుండా కథా సంకలనాలూ వచ్చాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట కథల పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూనే ఉన్నాయి.

ప్రేమ, కుటుంబం, అపార్ధాలు , వియోగం, విషాదం, సుఖాంతం ఇవేనా నేటి కథకి ముడిసరుకు ? మారుతున్న సమాజంలో మారే సామాజికాంశాల్ని, సామాజిక-ఆర్ధిక పరిస్థితుల్ని, ఆధునిక జీవన విధానంలో మారుతున్న జీవన శైలిని చోటు చేసుకుంటున్న కొత్త పోకడల్ని, జీవితానుభవాల్ని, మానవ సంబంధాల్ని ఇప్పుడు వస్తున్న కథలు చిత్రిస్తున్నాయా? ఒకవేళ వాస్తవ చిత్రణ చేసినా అవి ఆ పాత్ర స్వభావానికీ, స్వరూపానికి సంబంధం కలిగి ఉంటున్నాయా? అసలు ఆ అవసరం ఉందా?

చర్చని ఆహ్వానిస్తున్నాం…4 Responses to ఇప్పటి జీవితం ఇప్పటి కథల్లో ఉందా?

 1. srinivas
  January 13, 2014 at 9:33 pm

  నేను కథలు చదివేది తక్కువే. కానీ చదివినంత వరకు చుస్తే కొన్ని కథలు ఎందుకు రాసారో తెలియడం లేదు . అచ్చులో తమ పేరు చూసుకోవాలని రాసేవాళ్ళు రాస్తూ పోతున్నారేమో కాని నామటుకు నాకయితే iకథలు మనముందు జరిగే వాటిని రాస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు సాహిత్యానికి సంబంధించిన జ్ఞానం తక్కువే . నాకు తోచిన విషయం చెప్పాను

 2. March 16, 2014 at 12:06 pm

  లేదనే చెప్పాలి

 3. మంగు శివ రామ ప్రసాద్
  March 30, 2014 at 11:58 pm

  నేటి పత్రికలలో వస్తున్న కథలకంటే అలనాటి భారతి, ఆంధ్ర పత్రిక సంవత్సరాది సంచికలలో వచ్చిన కథలు సమకాలిక జీవితాన్ని, మానవతా విలువల్నీ, మానవ సంబంధాల్నీ కళాత్మకంగా ప్రతిబింబించాయని చెప్పవచ్చు. కథ ఒక ప్రధాన సాహిత్య ప్రక్రియగా అగ్రస్థానాన్నిఏనాడో అలంకరించినా, మారుతున్న మానవ సమాజంలో మారుతున్న విలువల్ని, బ్రతుకు పోరాటాన్ని, జీవిత వాస్తవికతని చిత్రించిన కథలు నేడు చాలా అరుదుగానే వస్తున్నాయి. దాదాపు అన్నీ తెలుగు పత్రికలు సంధర్భోచితంగా కథల పోటీలు నిర్వహించి ఉత్సాహవంతులైన నవతరం కథకులను ప్రోత్సాహిస్తున్నా, ప్రచురితమైన కథలు వస్తు, శైలి, శిల్ప దృష్ట్యా మెరుపులు మెరిపించడంలేదని అంగీకరించక తప్పదు. పత్రికలకు ఎంతసేపు వ్యాపార దృష్టే తప్పరచనా ప్రమాణాలను పట్టించుకోవాలనే తలంపే లేకపోవడం దురదృష్టకరం. సాంకేతికంగా, ముద్రణపరంగా పత్రికలు విప్లవాత్మకమైన ప్రగతిని సాధించినా, కథా రచనా ప్రమాణాలను ఉన్నతీకరించడంలో దారుణంగా విఫలమయ్యాయి. స్వాప్నిక, ఊహా జగత్తు మత్తునుంచి మేల్కొని వాస్తవ ప్రపంచంలోకి దృష్టి సారించే రచనలలో కూడా సమస్యలను ఎత్తి చూపడమే కానీ వాటికి పరిష్కారాలను సూచించే పధ్ధతి అంతగా కనబడటం లేదు. కొన్ని కథలు రచయిత తన గోడు వినిపిస్తునట్టుగా ఉంటాయి. కథలోని ప్రతి సంఘటన, ప్రతి సన్నివేశం, కేంద్రీయ ఇతివృత్తానికి, ప్రధాన పాత్రోన్మీలనానికి వస్తువైక్యతకి దోహదకారి కావాలి. నేటి కథలలో ఫోటోఫినిష్ టచ్ అంతగా కనబడదు. ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అని పెద్దలు ఊరికే అనలేదు. కావ్యానికే కాదు, కథా రచనకు కూడా రస సృష్టి ఉండలనే విషయాన్ని కథకుడు విస్మరించడం లేక నిర్లక్ష్యం చేయకూడదు. కథకు ఒక లక్ష్యం, దాన్ని సాధించడా నికి ద్రుఢమైన సంకల్పం, అచంచలమైన కృషి ఉండాలి. కథలో తరంగితమయ్యే సందేశం వాచ్యంగా, ఉపదేశంగా కాక వ్యంగ్యంగా , ధ్వని రూపంలో ఉండాలి. కథ ఒక మెరుపు మెరిసి వర్షం కురిసినట్లుండాలి ఆ జడివాన సహృదయుడైన పాఠకుని మనోఫలకంపై ముద్రాంకితమై హృదయాన్ని ఆర్ద్ర పరచాలి. హృదయానికి హత్తుకుపోయినప్పుడే కథ పాఠకుని కదిలిస్తుంది. అతనిలో జిజ్ఞాసను రేకెత్తించి, ఆలోచింపజేస్తుంది. చదివిన తరువాత చాలాకాలం వరకు గుర్తుండిపోయేదే మంచి కథ. అట్టి మంచి కథలు పుంఖానుపుంఖాలుగా రావలసిన ఆవశ్యకత ఈనాడు ఎంతైనా ఉంది.

 4. Murthy
  December 19, 2014 at 3:28 pm

  ఇప్పటి జీవితం ఇప్పటి కథల్లో ఉందా ?
  “ఇప్పటి జీవితం” అంటే ఎప్పటి జీవితం ? మీరు ఈ ప్రశ్న అడిగినప్పటి జీవితమా ? లేక నేను చదివినప్పటి జీవితమా ? కాక ఈ రెండింటి మధ్య సాగిన జీవితమా ? మీ జీవితమా ? నా జీవితమా ? లేక మీకూ నాకూ మధ్య గల దూరం ఎంత ఉందో అంతమేరా విస్తరించిన ప్రదేశంలోని జీవితమా ? ఆ ప్రదేశంలోని ప్రాణుల జీవితమా ? ప్రజల జీవితమా ? ఆ ప్రజల్లోని స్త్రీల జీవితమా ? పురుషుల జీవితమా ? పిల్లల జీవితమా ? స్త్రీ అయితే ఎటువంటి స్త్రీ ? పురుషుడైతే ఎటువంటి పురుషుడు ? ఉద్యోగా ? కూలీనా ? వ్యాపారా ? దొంగా ? దొరా ? ఇలా ప్రశ్నించుకుంటూ పొతే చివరికి ఆ ప్రశ్నలన్నీ ఎక్కడ ఆగిపోతాయో అక్కడ కథ మొదలవుతుంది. అది ఎక్కడ మొదలైనదో అక్కడి జీవితాన్ని, ఏ కాలంలో జరుగుతోందో ఆ కాలాన్నీ ఏ ఎటువంటి వ్యక్తీ గురించి చెబుతోందో అటువంటి వ్యక్తులందరినీ తనలో ఇముడ్చుకుంటుంది. ఖచ్చితంగా ప్రతి కథలోనూ అప్పటి జీవితం ఉంటుంది. దీనికి ఇప్పటి అప్పటి ఎప్పటి వంటి వంటి ప్రశ్నలతో సంబధం లేదు. ఎప్పటి కథల్లో అయినా అప్పటి జీవితమే ఉంటుంది. అది చారిత్రకం కావచ్చు, పౌరాణికం కావచ్చు. జానపదం సైన్సు ఫిక్షన్, కాల్పనికం లేదా అభూత కల్పనా కావచ్చు. ఉదాహరణకి ఎన్నో వేల సంవత్సరాలుగా భారత దేశంలో అడుగడుగునా వినిపించే రామాయణ భారత కథలని అన్ని వేల సంవత్సరలుగానూ ఎంతోమంది తమ కాల్పనికతను ఊహా శక్తినీ ఉపయోగించి ఎంతోమంది ఎన్నో తిరగ రాశారు. అయినప్పటికీ ఆయా రచయితలు వాడిన భాష, పదాలు, పద చిత్రాలు, వాడిన సామెతలు, అప్పటికి ప్రచలితంగా ఉన్న భావజాలాల ఆధారంగా ఆయా రచయితల స్థల కాలాదుల్ని అంచనా వేయవచ్చు. ఉదాహరణకి ఓల్గా లాంటి రచయిత్రులు స్త్రీవాద దృక్పథంతో రాసిన, రాస్తున్న పౌరాణిక పాత్రల తాలూకూ కథలని చదివితే వాటిలో కూడా సమకాలీన దృష్టే కనిపిస్తుంది తప్ప ఆయా పురాణ పాత్రలు పుట్టిననాటి జీవితం కనపడదు. మహా భారతాన్ని లెక్కలేనన్నోసారి తిరగరాసిన ఎస్ ఎల్ భైరప్ప రాసిన పర్వ పుస్తకం గురించి ఇప్పటి ప్రమాణాలతో అప్పటి కాలాన్ని ఎలా కోలుస్తారనే చర్చ గత దశాబ్ద కాలంగా దేశవ్యాప్తంగా కొనసాగుతోనే ఉందంటే అందుకు కారణం ఎప్పటి కథ రాసినా అందులో రాసినప్పటి జీవితం ఏదో ఒక రూపంలో ప్రతిఫలించడమే. కాబట్టీ ఇప్పటి కథల్లో ఇప్పటి జీవితం ప్రతిబింబించడం అనివార్యం. అయితే ఆ జీవితం మన జీవితాన్ని తీర్చి దిద్దుకోవడానికి ఏ మేరకు ఉపకరిస్తుందనేదే ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం కూడా రాసిన రచయిత లక్ష్యాలు, ఉద్దేశించిన ప్రయోజనాలని అనుసరించి మాత్రమే కాదు, చదువుతున్న పాఠకుల ఆసక్తులు అవసరాలనుబట్టి అనుక్షణం మారిపోతూ ఉంటుంది. అయితే ఎక్కువ మందికి ఎక్కువ ప్రయోజనాన్ని కలిగించే కథలు ఏ కాలంలో అయినా తక్కువే ఉంటాయి. అందుకే ఎక్కువ మంది పాఠకులు ఆ తక్కువ కథల కోసమే పరితపిస్తూ ఉంటారు. వారికి సంతృప్తిని కలిగించే కథలే విలువైన కథలు.

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)