(వయసు పెరుగుతున్నకొద్దీ మనం స్పష్టంగా దర్శించగలిగేది లోచూపుతోనే…)
“To philosophize is no other thing than for a man to prepare himself for death” …Cicero.
“That is the reason why study and contemplation does in some sort withdraw our soul from us, and severally employs it from the body which is a kind of apprenticeship and resemblance of death”… Montaigne.
(నౌడూరి మూర్తి)
18వ శతాబ్దంలో స్కాట్లండులో తాత్త్విక చింతన, శాస్త్రీయ ఆవిష్కారాలతో ఒక కొత్తశకానికి తెరలేచింది. గ్లాస్గో, ఎడింబరో, ఏబర్డీన్ వంటి ప్రాచీనమైన విశ్వవిద్యాలయాలలోనూ పదిమంది కలుసుకునే కూడళ్ళలోనూ, ఎక్కడపడితే అక్కడ మేధోపరమైన చర్చలు జరుగుతుండేవి. అదే కాలంలో యూరోపులో ప్రచారంలో ఉన్న మానవతావాదం, హేతువాదాలతో ఆలోచనలను పంచుకుంటూ, స్కాట్లండుకు చెందిన మేధావులు మానవ వివేచనాశక్తికి అధిక ప్రాధాన్యతనిస్తూనే, తర్కానికి నిలబడని ఏ ప్రాచీన సంప్రదాయాన్నైనా నిర్దాక్షిణ్యంగా త్రోసిపుచ్చేరు. ఇతర యూరోపియన్ దేశాలవారికి భిన్నంగా కేవలం వివేకము ద్వారానే మానవాళి ప్రకృతిలోనూ, సమాజంలోనూ మేలైన మార్పులు తీసుకురాగలదన్న ఆశావహమైన దృక్పథం కలిగి ఉండేవారు. దాని పర్యవసానమే, తత్త్వవేత్త జాన్ లాకే … “మనిషికి జ్ఞానం ఇంద్రియాలద్వారానే ప్రాప్తిస్తుందనీ, ప్రతిదాన్నీ అనుభవంద్వారానో, పరీక్షద్వారానో ప్రామాణీకరించాలితప్ప సంప్రదాయం దానంతట అది ప్రమాణం కాద”ని చెప్పిన అనుభవైక వాదానికి (Empiricism) కొనసాగింపు డేవిడ్ హ్యూం సమర్థవంతంగా చేసిన తత్త్వవివేచన. జీవిత చరమాంకంలో మరణం పట్ల డేవిడ్ హ్యూం కనబరచిన నిర్భీతి మనకు సోక్రటీసును గుర్తుచేస్తుంది. దానికి తగ్గట్టుగానే, ప్లేటో సోక్రటీసు మరణం గురించి వ్రాసినంత హృద్యంగా డేవిడ్ హ్యూం గురించి, తన Wealth of Nations ద్వారా ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థని రూపుకట్టిన ఆర్థిక శాస్త్రవేత్త, అతని మిత్రుడు ఏడం స్మిత్ (Adam Smith), William Strahan, Esq. కి స్వయంగా వ్రాసిన ఉత్తరం కళ్ళకు కట్టినట్టు మన ముందు ఉంచుతుంది..
జీవితంపట్ల, అద్భుతమైన రాగాన్నీ, మృత్యువుపట్ల అంతే వైరాగ్యాన్నీ కనబరిచిన డేవిడ్ హ్యూం మన ఋషులు చెప్పిన స్థితప్రజ్ఞతకి అచ్చమైన నిదర్శనం అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాన్ని ప్రగతి మార్గంలో తీసుకుపోగల ఏ భావజాలమూలేని ఈ రోజుల్లో, అటువంటి వాళ్ళ జీవిత చిత్రాలు, కొందరికైనా స్ఫూర్తినిస్తాయేమోనన్న చిన్న ఆశ.
———————————————————————————————–
విలియం స్ట్రేహాన్, ఎస్క్వైర్
కిర్కాల్డీ, ఫైఫ్ షైర్,
నవంబరు 9, 1776.
ఆర్యా,
ఉదాత్తుడైన మనిద్దరి సన్నిహిత మిత్రుడు హ్యూం, ఈ మధ్య అతని అనారోగ్య పరిస్థితిలో ప్రవర్తించిన తీరు ప్రస్తావించడానికి మనసులో విషాదం ఉన్నా, సంతోషంగానే, ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.
వ్యాధి కుదరదనీ, చనిపోవడం ఖాయం అనీ అతని అభిప్రాయం అయినప్పటికీ, అతని మిత్రుల ప్రోద్బలం కారణంగా, బహుశా సుదీర్ఘమైన ప్రయాణపు పరిణామంగా వచ్చిన అనారోగ్యానికి చికిత్సచేసుకుందికి అంగీకరించేడు. అతను ఎడింబరోనుండి బయలుదేరే ముందు అతని స్వీయచరిత్ర వ్రాసి, మిగతా కాగితాలతో పాటుగా దాన్ని మీ దగ్గర భద్రపరిచిన సంగతి విదితమే. కనుక, ఈ లేఖ అతను ఎక్కడితో తనస్వీయచరిత్ర ఆపేడో, అక్కడనుండి ప్రారంభమవుతుంది.
ఏప్రిల్ నెల చివరలో అతను లండను ప్రయాణం కట్టేడు. ఎడింబరోలో ఉంటాడనుకుని అతన్ని కలవడానికే ప్రతేకంగా లండనునుండి బయలు దేరిన నేనూ, జాన్ హోం ఇద్దరం దారిలో Morpeth వద్ద అతన్ని కలిసేము. హోం అతనితో వెనక్కి తిరిగి వచ్చి ఇంగ్లండులో అతనున్నంతకాలం ఒక నిజమైన మిత్రునిదగ్గరనుండి ఏ అభిమానం ఆప్యాయతా ఆశిస్తామో దానికి తగ్గట్టుగా అతని అవసరాలు పర్యవేక్షించేడు. స్కాట్లండులో తనని కలుస్తానని మా అమ్మగారికి నేను ముందుగా ఉత్తరంవ్రాసి ఉండడం వల్ల, నా ప్రయాణం మాత్రం నేను ముందుకి కొనసాగించడం తప్పనిసరి అయింది. గాలిమార్పుకీ, వ్యాయామానికీ అతని అనారోగ్యం లొంగినట్టు కనిపించింది; ఎడింబరోలో బయలుదేరినప్పటికంటే అతను లండను చేరేటప్పటికి ఆరోగ్యం మెరుగయినట్టు కనిపించింది. అందుకని అతన్ని Bath వెళ్లమనీ అక్కడి నీళ్ళు త్రాగమనీ వైద్యులు సలహా ఇవ్వడమూ, అక్కడికివెళ్ళి కొంతకాలం ఉన్నాక, ఎప్పుడూలేనిది అతనుకూడా అతని ఆరోగ్యం బాగుపడిందని అనుకునేంతగా ఆ వాతావరణం అతనికి బాగా సరిపడడమూ జరిగింది. కానీ తొందరలోనే, వ్యాధి లక్షణాలన్నీ పూర్వపు తీవ్రతతో తిరగబెట్టాయి; ఆ క్షణంనుండీ అతను వ్యాధి నయంకావడం అన్న ఆలోచనకి స్వస్తి పలికి అనంతరపరిణామాలని స్వీకరించడానికి ఆనందంతో, పరిపూర్ణమైన నిర్వికారముతో, ప్రసన్నతతో సంసిధ్ధుడయ్యాడు. ఎడింబరో తిరిగివచ్చిన తర్వాత అతను బాగా నీరసించిపోయినప్పటికీ అతనిలో హుషారు ఎంతమాత్రమూ తగ్గలేదు; యధాప్రకారం అతను రాబోయే ముద్రణలకు తన రచనలు సరిదిద్దుకుంటూనో, మనసుకి ఆహ్లాదంకలిగించే పుస్తకాలు చదువుకుంటూనో, స్నేహితులతో మాట్లాడుతూనో, ఒక్కొక్కసారి వాళ్లతో సాయంత్రం వేళల్లో Whist ఆడుతూనో పొద్దుపుచ్చుతుండేవాడు. అతను ఎంత ఉల్లాసంగా ఉండేవాడంటే, అతని సంభాషణలూ ఛలోక్తులూ ఎప్పటి ధోరణిలోనే సాగుతూ, అతని వ్యాధిలక్షణాల తీవ్రత ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ, ఎవరికీ అతను నెమ్మది నెమ్మదిగా చనిపోతున్నాడంటే నమ్మబుధ్ధి అయ్యేదికాదు. ఒకరోజు అతనికి చికిత్స చేస్తున్న డా. డండాస్, అతనితో “అలాగయితే, కల్నల్ ఎడ్మాన్స్టోన్ (Colonel Edmonstone)తో నేను ఇక్కడ బయలుదేరేవేళకి మీ ఆరోగ్యం మెరుగ్గా ఉందనీ, త్వరలో పూర్తిగా కోలుకునే దిశలో మీరున్నారనీ చెబుతాను,” అన్నాడు. దానికతను, “డాక్టర్! మీరు నిజం తప్ప ఇంకేదీ చెప్పరని నా గాఢమైన నమ్మకం. నాకు శత్రువులంటూ ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళు కోరుకునేంత త్వరగానూ, నా ఆప్తమిత్రులు నేను ఎంత సునాయాసంగా, ఉల్లాసంగా చనిపోవాలని కోరుకుంటారో అంత సునాయాసంగానూ మరణిస్తున్నానని అతనికి చెప్పండి,” అన్నాడు. తర్వాత కల్నల్ ఎడ్మాన్స్టోన్ అతన్ని చూడడానికి వచ్చి, వెళిపోతున్నప్పుడు మార్గమధ్యంలో ఉత్తరం రాయకుండా ఉండలేకపోయాడు. మరొక్కసారి అతనికి తుదివీడ్కోలు చెబుతూ అందులో Abbe Chaulieu తనకు మరణ ఆసన్నమైనదని తెలిసి, తన మిత్రుడైన Marquis de la Fare నుండి దూరమైపోతున్నానన్న బాధతో వ్రాసిన ఫ్రెంచి కవితని అతనికి అనువర్తిస్తూ ఉదహరించేడు. హ్యూం యొక్క ఔదార్యమూ, గుండెదిటవూ ఎంత గొప్పవంటే, అతనికి అత్యంత ఆప్తులైన మిత్రులకి తెలుసు, అతనితో ఒక మరణిస్తున్న వ్యక్తితో మాట్లాడుతున్నట్టు మాటాడినా, ఉత్తరం వ్రాసినా, దానివల్ల తాము ఏ విపత్తూ అతనికి తీసుకురావడం లేదని; అలా ఉన్నదున్నట్లు రాస్తున్నందుకు బాధపడకపోగా, మీదుమిక్కిలి, అతను అదొక పొగడ్తగా భావించి, సంతోషించేవాడు. అప్పుడే వచ్చిన ఆ ఉత్తరం అతను చదువుతున్న సమయంలోనే నేను గదిలోకి అడుగుపెట్టడం, అతను నాకు అది వెంటనే చూపించడం జరిగింది. నే నతనితో, అతను ఎంతగా నీరసించిపోయాడో చూస్తున్నాననీ, అతని రూపు రేఖలు ఎంతగా కళతప్పి ఉన్నాయో కూడా గ్రహించాననీ, అయినప్పటికీ, అతనిలో ఇంకా హుషారు ఎంతమాత్రం తగ్గకపోడంవల్ల అతనిలో జీవశక్తి చాలా గట్టిగా ఉందనీ, అందువల్ల నాకు ఇంకా కొంత చిగురాశ ఉందనీ అన్నాను. దానికతను, “నీ ఆశలు కేవలం నిరాధారమైనవి. ఏ వయసులోనైనా ఏడాదిపాటు కొనసాగుతున్న అతిసారవ్యాధి (డయేరియా) ప్రమాదకరమైనది; నా వయసులో అయితే అది మరణ హేతువు. నేను రాత్రి పడుక్కునేటప్పుడు, ఉదయం లేచినప్పటికంటే నీరసంగా అనిపిస్తుంది; నేను ఉదయం లేచేటప్పుడు రాత్రి పడుక్కున్నప్పటికంటే నీరసంగా ఉంటుంది. అదిగాక, నాకు తెలుస్తూనే ఉంది, నా ముఖ్యమైన అవయవాలు ఒక్కటొకటీ దెబ్బతినడం. కనుక నేను త్వరలోనే మరణించడం ఖాయం,” అన్నాడు. నే నన్నాను, “సరే! అదే నిశ్చయమైనప్పుడు, నీకు నీ మిత్రులందరినీ, ప్రత్యేకించి నీ సోదరుడి కుటుంబాన్ని, మంచి అభివృధ్ధిలో ఉండగా చూస్తూ వెళుతున్న సంతృప్తి అయినా దక్కుతుంది,” అన్నాను. దానికతను, ఆ సంతృప్తిని చాలా స్పష్టంగా అనుభవించేనని చెబుతూ, కొద్దిరోజులు ముందు “Lucian’s Dialogues of the Dead” అన్న పుస్తకం చదువుతుండగా, షరోన్ (Charon) నావలోకి వెంటనే ఎక్కడానికి నిరాకరిస్తూ జీవులు చెప్పే సవాలక్ష కుంటిసాకుల్లో తనకి సరిపడినది ఏదీ లేదని అంటూ, తనకి పూర్తిచెయ్యవలసిన ఇల్లుగాని, జీవనాధారము కల్పించవలసిన కూతురుగాని, తను పగతీర్చుకోవలసిన శత్రువులుగాని లేరని అన్నాడు. మళ్ళీ తనే, “షరోన్ దగ్గర కొద్దికాలం వాయిదా సంపాదించడానికి తగిన కారణం ఊహించలేకపోతున్నాను. ‘దీనివల్ల ఫలితం ఉంటుంది, ఇది తప్పకుండా చెయ్యాలి’ అనుకున్న ప్రతి పనీ నేను పూర్తిచేశాను; ఇప్పుడున్న పరిస్థితికంటే మెరుగైన పరిస్థితుల్లో నా మిత్రుల్నీ, బంధువుల్నీవిడిచివెళ్ళే అవకాశం ఊహించలేను. కాబట్టి నేను సంతృప్తిగా కన్నుమూయడానికే తగిన కారణం కనిపిస్తోంది,” అన్నాడు. తనే మళ్ళీ మాటమారుస్తూ, హాస్యస్ఫోరకమైన కొన్ని కుంటిసాకులు షరోన్ కి చెప్పాలని వెదుకుతూ, షరోన్ అతని స్వభావానికి తగ్గట్టుగా చిరచిరలాడుతూ తనకి ఏమని సమాధానం చెబుతాడోకూడా తనే ఊహించి చెప్పడం ప్రారంభించేడు. “బాగా పునరాలోచన చేసిన తర్వాత” అంటూ అతను ప్రారంభించేడు, “నేనూ ఇలా చెప్పడానికి ప్రయత్నిస్తాను, ‘నాయనా షరోన్! నా పుస్తకాలు పునర్ముద్రణకోసం కొన్ని దిద్దుబాట్లు చేస్తున్నాను. నాకు కొంచెం సమయం ఇవ్వు. ఈ లోగా నా దిద్దుబాట్లని ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారో చూడనీ.’ అని. కానీ షరోన్ అంటాడు: ‘ఒకసారి వాటి ప్రభావం చూసేక నువ్వు మరికొన్ని దిద్దుబాట్లను చెయ్యడానికి పూనుకుంటావు. ఇలా ఈ దిద్దుబాట్లుకి అంతూ పొంతూ ఉండదు. కనుక ప్రియ మిత్రమా, పడవలోకి వేంచేయీ’ అంటాడు. అయినా, అప్పటికీ నేను మరో ప్రయత్నం చెయ్యొచ్చు. ఈ సారి, ‘మిత్రమా, షరోన్! కొంచెం ఓపిక పట్టవయ్యా!. ప్రజల కళ్ళు తెరిపించాలని నేను ఎంతగానో తాపత్రయపడుతున్నాను. నేను మరికొన్ని సంవత్సరాలుగాని బ్రతకగలిగితే, ఇప్పుడున్న మూఢనమ్మకాలు కొన్ని పతనమవడం చూసేనన్న సంతృప్తి నాకు దక్కుతుంది,’ అంటాను. దానితో షరోన్ సహనం కోల్పోయి, సభ్యతా, మర్యాదలన్నీ పక్కనబెట్టి, “ఓరి కాలయాపనచేసే ధూర్తుడా! అది కొన్నిసంవత్సరాలు కాదుగదా వందసంవత్సరాలకైనా జరిగేదికాదు. ఏం? నీకు అన్ని సంవత్సరాల వాయిదా ఇస్తానని అనుకుంటున్నావా? తక్షణం నావలోకి ఎక్కు, పనిలేక, నా సమయం వృధాచేసే పోకిరీ వాడా!’ అని అంటాడు.”
(రెండవ భాగం వచ్చే సంచికలో…)
నేను జీవితాన్ని ప్రేమిస్తాను.నేను మరణాన్ని ప్రేమిస్తాను.మరణం జీవితాన్ని ప్రేమించినంతగా నేను నిన్ను (కవిత్వం )ప్రేమిస్తాను.అన్నట్లుంది రచయిత(హ్యుమ్ ) అభిప్రాయం.గొప్ప ఫిలాసఫీ.బాగుంది
nauduri murthy —hats off!