కల నిజమయి ఎదురుగా నడుచుకుంటూ వస్తే?! అంతకన్నా ఇంకేం కావాలి! కొన్ని కలలు నిజమవుతాయి! సరిగ్గా ఏడాది క్రితం ఒక అందమైన కలతో పుట్టిన వాకిలి సగర్వంగా పన్నెండు సాహిత్యపుటడుగులు ముందుకేసి ఈ రోజు వార్షిక సంచికగా మరింత కొత్తగా అలంకరించుకుని మీ ముందుకు వచ్చింది.
వాకిలి లేని ఇల్లును ఊహించుకోలేం! అలాగే సందడి లేని ఇల్లు ఆత్మ లేని దేహం లాంటిది. ఏ ఇంటి వారి అభిరుచికి తగ్గట్టుగా ఆ ఇంటి వాకిలి ఉంటుంది. కానీ ఈ ‘వాకిలి’ ఒక్కింటి వాకిలి కాదు. అనేక తెలుగు ముంగిళ్ళను కలిపి కుట్టిన అచ్చమైన స్వచ్ఛమైన సాహిత్య వేదిక. ఎలాంటి అరమరికలు లేని సాహిత్య సంభాషణలను ఆహ్వానిస్తూ, మీ అందరి సాహిత్య అభిరుచులకు తగ్గట్టుగా రూపుదిద్దుకుంటూ, నెల నెలా మీ ముందుకు వస్తూంది. నిజానికి మేము ఈ వాకిలిని ఊడ్చి కల్లాపి చల్లే వాళ్ళము మాత్రమే! ఈ వాకిలికి అసలైన ఆత్మ, అందమైన ముగ్గుల్లాంటి మీరే, పాఠకరచయిత(త్రు)లే!
ఐదువందలయాభైకి పైగా రచనలు, రెండువందలయాభై మంది రచయితలు, ౩ మిలియన్ వెబ్ హిట్స్… ఇదీ వాకిలి మొదటి సంవత్సరం రిపోర్ట్ కార్డ్. మీరు పంచిన ప్రేమ, మీనించి లభించిన స్పందన, మీ ప్రోత్సాహం కారణంగానే ఈ రోజు వాకిలి ఇలా నిలబడింది. అందుకు మీకందరికీ ధన్యవాదాలు!
వాకిలిని మరింత మెరుగుపరుస్తాయన్న నమ్మకంతో ఈ వార్షిక సంచిక నుంచి వాకిలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తున్నాము. ఈ మార్పులు మీకు కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాం.
వాకిలి ఇకనుంచి మాసపత్రిక గానే వస్తుంది. ‘ఈ వారం కవిత’కు మేము అనుకున్న స్థాయిలో రచనలు రాకపోవడం వలన ఆ శీర్షికను ఇంకా కొనసాగించాలా లేదా అని ఆలోచిస్తున్నాము.
వాకిలి ముందునుంచీ కవిత్వానికి పెద్దపీట వేస్తూ వస్తుంది. ఇకనించి కూడా కవిత్వాన్ని ప్రేమించేవారికోసం నెల నెలా కవిత్వంతో పాటూ ఒక ‘తెలుగు అనువాద కవిత’, ఒకటి రెండు ఇంగ్లీష్ అనువాదాలు, ‘నీరెండ మెరుపు’ లాంటి కవిత్వానికి సంబంధించిన శీర్షికలు, కవిత్వ సమీక్షలు, కవులతో ముఖాముఖం ప్రచురిస్తాము. ఇంతే కాకుండా నారాయణ స్వామి గారి ‘కవిత్వ ప్రపంచం’, కోడూరి విజయ కుమార్ గారి ‘కిటికీలో ఆకాశం’ ఉండనే ఉన్నాయి.
సాహిత్యానికి సంబంధించిన అన్ని అంశాలను స్పృశిస్తూ, వివిధ కోణాలు ప్రతిఫలించేట్టుగా వాకిలిని తీర్చిదిద్దే దిశగా ఈ సంచిక నుండి కొన్ని ప్రయోగాత్మకమయిన కొత్త కాలమ్స్ మొదలవుతున్నాయి. నవలా సాహిత్యాన్ని స్పృశిస్తూ మైథిలి అబ్బరాజు గారు రాసే ‘కడిమిచెట్టు’, గోదావరి జ్ఞాపకాలను పంచుతూ కాశీ రాజు గారు రాసే ‘కాశీ మజిలీలు’, మోహన తులసి గారి కలం నుంచి జాలువారే మ్యూసింగ్స్ ‘మోహన రాగం’తో పాటు సమకాలీన తెలుగు కథల మీద చర్చకి నాందీ పలికే మరో రెండు కొత్త శీర్షికలు ‘చర్చ’, ‘కథా కథనం’ ఈ సంచిక నుండి వస్తున్నాయి.
ఇప్పటివరకు ప్రచురితమైన ప్రతీ సంచికకి మేము అడిగిన వెంటనే రచనలు పంపిన రచయిత(త్రు)లందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. వాకిలికి ఇలాగే రచనలు పంపిస్తూ, మనసు విప్పి మీ అభిప్రాయాలు రాస్తూ, చర్చల్లో పాల్గొంటూ, ముందు ముందు కూడా మీరు ఇలాంటి సహకారాన్నే అందిస్తారని ఆశిస్తూ,
నూతన సంవత్సర శుభాకాంక్షలతో,
మీ
వాకిలి సంపాదకబృందం.
వాకిలి సంపాదక బృందానికి ,
వ్యాపార దృక్పధం లేని సాహిత్య సేవ ఊహించలేనిది. కానీ మీరు ఆ కత్తిమీద సాము చెయ్యడానికి నిశ్చయించుకున్నారు. ఒక ఏడు పత్రికల జీవనప్రమాణంలో ఎక్కువ కాకపోయినా మరీ తక్కువేం కాదు. తెలుగు సాహిత్య సేవ ఒక రకంగా చెప్పాలంటే Thankless Job. ఎవరూ గుర్తించరు. అయినా దీన్ని ధైర్యంగా ఎదిరించి నిలబడి పట్టుదలతో పనిచేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. 2014 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
అభివాదములతో
మీ సంపాధక వర్గానికి హృదయపూర్వక అభినందనలు. 2014 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
వాకిలి సంపాదక బృందానికి, రచయిత్రు/త లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
రాధ
రవి గారూ!
సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ‘వాకిలి’కీ, మీకూ అభినందనలు. నవ్యతకూ, వైవిధ్యానికీ ‘వాకిలి’ తలుపులు మూయకపోవటం సంతోషకరం. కవిత్వ విభాగంలో ఈ విషయం ప్రత్యేకంగా స్పష్టంగా గోచరమౌతున్నది. దీన్ని ఇలాగే సాగించండి.
ఎలనాగ
Ravi and Team,
Congratulations!
అందరికీ ధన్యవాదాలు! మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. వాకిలి పైన మీకున్న అభిమానానికి కృతజ్ఞతలు!
రవీ …. & వాకిలి టీం !
కేవలం సాహిత్యం మీది ప్రేమతో, ‘టైం ఈస్ మనీ ‘ లాంటి అమెరికా లో వుండి కూడా ఇంత అందంగా, సమగ్రంగా ఈ అంతర్జాల పత్రిక తీసుకు రావడం అభినందనీయం …. ఈ పత్రిక ని ఇలాగే ఇంకా చాన్నాళ్ళ పాటు కొనసాగించే శక్తి, సమయం, సాహిత్యం పట్ల ప్రేమ మీకు ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటున్నాను -
నూతనత్వము , ఖచ్చితత్వము, నిబద్దతత్వము వెరసి వాకిలి. చాన్నాళ్ళు మనగలగాలి అని కోరుకుంటూ…అభినందనలు
సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు అనువాదం “Bangle Sellers ” – గాజుల వాళ్లము మేము
పబ్లిష్ చెయ్యగలరా ?
ధన్యవాదములు
…..శ్రీనివాస్
“వాకిలి” నూతన సంవత్సరంలో వార్షిక సంచికగా ముస్తాబై ముందుకు తావదమ్ హర్షదాయకం. చిన్న చిన్న మార్పులతో మెరుగులు దిద్దుకొని సర్వాంగ సుందర బంధురమై మాస పత్రికగా అలరించబొతున్నందుకు ధన్యవాదాలు. సాహిత్యంలోని వివిధ ప్రక్రియలు –కవిత, కథ, నవల, నాటకం, సాంప్రదాయ సాహిత్యం, ఆధునిక సాహిత్యం, అనువాద సాహిత్యం, సాహిత్యంలో దృక్పధాలు ధోరణులు, నూతన పోకడలు, వగైరా అంశాలపై విశ్లేషనాత్మక, ఆలోచనాత్మక వ్యాసాలు వసతీ బాగుంటుందని ఆకాంక్షిస్తూ, హృదయపూర్వక అభినందనలు అందజేస్తూ.
మంగు శివ రామ ప్రసాద్
, విశాఖపట్నం.
ప్రారంభించిన తరువాత తక్కువకాలం లోనే విభిన్న శీర్షికలతో అందరి వాకిలి గా మారిన వాకిలి పత్రిక పురోగతి ప్రశంసనీయం.
ఇటీవల తెలుగువెలుగులో కాళీపట్నం రామారావు మాష్టారు, అంతర్జాల పత్రికలలో వస్తున్న సాహిత్యాన్ని కూడా కొనియాడారంటే దానికి కారణం వాకిలి వంటి పత్రికలలో వస్తున్న సాహిత్యసంపదేనని అనిపిస్తోంది. తప్పటడులేవీ వేయకుండానే నెలనెల (లేదా వారవార) ప్రవర్ధమానంగా ఎదుగుతున్న వాకిలి మున్ముందు తెలుగు సాహిత్యపు రంగవల్లులతో కళకళలాడాలని, కొలువుతీరాలని ఆశిస్తూ శ్రేయోభిలాషి…
గరిమెళ్ళ నారాయణ.