కవిత్వం

జీవితం చాలా చిన్నది

జనవరి 2014

పరుగెత్తి పాలు తాగే పాకులాటలకి
నిలబడి నీరు తాగే నిరడంబరాలకీ
జాగింగ్ చేస్తూ జావ తాగొచ్చని
చేసి చూపించేయ్..

కొరడాతో తనే కొట్టుకు ప్రదర్శించే
నడివీధి గాడి నుండి అందుకుని
కొట్టుకుంటుంటే భుజాలెగరేసుకు పండగ చేసుకునే
వాళ్ళందరినీ అలా వదిలేసెయ్..

ఇంద్రధనుసునొకటి అందిపుచ్చుకుని
రంగురంగుల రిబ్బన్లు తుంచి
ఆడపిల్లలందరకూ పంచిపెట్టేసేయ్.
జడలలో వాలమని సీతాకోకలకు కబురెట్టేసేయ్..

బతికించే ప్రాణవాయువూ
ఊపిరులూదే మనుషులు పరిసరాలు పరిస్థితులూ
ఎక్కడ కనిపించినా
మట్టి నీరులతో నేసిన శాలువాలు కప్పి మరీ సన్మానాలు చేసేసేయ్..

నిలువెత్తులను కూల్చడం కన్నా
నిలవలుంచే కట్టడాల మీదే దృష్టంతా పెట్టేసేయ్..

జీవితం చాలా చిన్నది

జీవలాలస తొణికిసలాడేలా
బతికి జీవించేసేయ్ – జీవించి బతికేసేయ్.