కాశీ మజిలీలు

సెవిరింగు సెకోడీ

ఫిబ్రవరి-2014

“మెట్రో తంబానికి మేకులు కొట్టే పేసూ నువ్వూనూ … మచ్చెబ్బరెదవా పయానమప్పుడు ఓ గంట ముందుగా పయనమాడాలని తెలీదా నీకు? ఏ పనికైనా లేటే ఎదవకానా ఎదవకానా” తెళ్లమీసాలేసుకుని కొడుకుని తిడతానే ఉన్నాడామహానుబావుడు. ఆయన తిట్టే తిట్లకి మళ్ళీ రైల్లో నుంచి దిగేత్తాడేమో అనిపించింది నాకు అతని మొకం సూత్తే. కుచ్చోడం మానేసి బెల్టు బద్దుల్లోంచి సెలప్పోను ఎడ్ సెట్టు తీత్తన్నాడు. ఆ పెద్దయానికి మళ్ళీ తిక్కరేగింది కామాలు మళ్ళీ అందుకున్నాడు దండకం. ఎంతాపుకున్నా నవ్వొచ్చేసింది నాకు. అచ్చం సిన్న పిల్లాడిలాగ ఉప్పుడేమయ్యింది నానా టయానికొచ్చేశా కదా ఇంక తిట్టకన్నాడు. “ఆ సాల్లే “ అన్నట్టు కొడుకొంక సూసి ఊరుకున్నాడా తెల్లజుట్టూ, తెల్ల మీసాలూ, తెల్ల బట్టలున్న పెద్దాయన.

కిటికీ దగ్గర నుంచూని “ ఒరేయ్ ముసలోడా ఉడకబెట్టిన పల్లీల్లేవు” మొత్తం ప్లాటు ఫారమంతా తిరిగాను. ఇంకేమన్నా తేనా? అనడిగాడు నానిగాడు. నాకయ్యి తప్పితే ఇంకేమీ తినబుద్ధి కాదు, ఒద్దులేరా అన్నాను. ఆడు మాటాడకుండా ఎలిపోయి ఆడిక్కావాల్సినయన్నీ తెచ్చుకున్నాడు. ఒచ్చి సీట్లో కుచ్చూని ఓ వోటర్ బాటులిసిరాడు నామీదకి . ఇసురుతున్నట్టు జడిపిస్తాడనుకుని నేను పట్టుకోలేదు.సరిగ్గా ఒల్లో పడి, హైదరాబాద్లో బాంబు పేలినట్టనిపించింది. అమ్మా ! అని మెల్లగా అరిసి తేరుకుని సర్దుకూని కుచ్చున్నాను. కంపార్ట్మెంట్లో అందరూ కాత జాలిగా సూశారు.ఆ మసలాయన మరీనూ. తిండిపోతునాయేల నానిగాడేమో ఏమీ పట్టనట్టు తెచ్చుకున్నాయన్నీ ఓ మూలనేసుకుని బిస్కెట్లపేకట్టు సించి తిండి మొదలెట్టాడు. ఎదవ కుర్ కురే పేసూ ఆడూను. తిక్కరేగింది నాకు. అందరున్నారని కాత కంట్రోల్ సేసుకుని పల్లీలకెటెల్లావ్ నానీ ? అనడిగాను ఇలా టేశనుముందేరా అన్నాడు. ఇటేప్పక్క ఇనాయకుడి గుడికేసెల్లావా అనడిగితే , ఎల్లలేదేమో సమాధానం సెప్పలేదాడు. ఇంత సేపూ ఆ ముసలోడి కోపం సూసి నవ్వుకున్నాను. కానీ ఇప్పుడు నాదీ అదే పరిత్తితి. కొడుకుని తిట్టేసిన ఆయన సేనా శాంతంగా ఉన్నాడు. కొడుకూ ఆయనా జోకులేసుకుంటున్నారు నవ్వుకుంటున్నారు. నాకలా లేదు, కాలిపోతుందో పక్క ఆడేమో ఏమీ పట్టనట్టు తింటానే ఉన్నాడు. ఆన్ని తిట్లేను, తింటా ఉంటే సూల్లేను. “ ఒరేయ్ లపూట్ గా నాకూ ఏదన్నా పేకట్టు పడేయ్యని అడిగాను ఆగలేక.

అంకుల్ చిప్స్ అంట నా ఉడుకుమోతు మొకం ఆడికి తెలిసిపోతాది నవ్వుకుంటూ నామీదకిసిరాడు. ఎటుపక్క సించినా సిరగట్లేదది. నానిగాడు లాక్కుని పుటుక్కున సించేశాడు. మళ్ళీ అందరూ నేను ఎర్రిపప్పనన్నట్టు నాయొంకు సూశారు. సూత్తే సూసార్లే అనుకుని అంకుల్ చిప్స్ అన్నీ తినేశాను. ఈ సారి నీళ్ళ బాటిల్ కోసం తీసుకుంటే పక్కన పెట్టుకుంది దొర్లి కిందపడింది. ఏరా రిమ్ లో పెట్టచ్చు కదా అన్నాడు నానిగాడు.కూని నీలు పుక్కులించి బయటకూశాను. మిగతాయి గుటకేసి సరుదుకూని కుచ్చున్నాను. “కొహుతీ కొమ్మొచ్చి, కొమ్మకు రెమ్మొచ్చి. రెమ్మకు పువ్వొచ్చి , పువ్వుకు నవ్వొచ్చి,నవ్వుకు నువ్వొచ్చి, నీకు నేనొచ్చి కోతి కొమ్మొచ్చి” ….. అంటూ రమణ గారి హడావుడి చదూతుండగానే ఎప్పుడు కునుకట్టిందో తెలీలేదు.

మొత్తం గోల గోల సేనా హడావుడుంది బైట. ఇజయవాడొచ్చేసిందేమోనని తలబైటెట్టిసూశాను.తరవాత ఎంటనే కంగారయ్యా! అయ్ బాబోయ్ అప్పుడే అప్పుడే గొదారొచ్చేసినట్టుంది అనుకునేలోపు ఆ హడావుడీ ఆ మనుషులు అది రాయమండ్రేనని కన్పామ్ శేసేశారు. మా ఇద్దరి టిక్కట్టూ కాకినాడకి. మా ఊరికి కాకినాడనుండే ఎక్కువెళ్తాను. రాయమండ్రి నుండి కూడా ఎల్లచ్చనుకో! నానిగాడిని మొదటిసారి మా ఇంటికి తీసుకెళ్తున్నాను కదా ఈడికి ఎక్కువూల్లు సూపించి తీసుకెళ్దామని రాయమండ్రి లో దిగిపోయాం.

ఒరేయ్ సన్నాసి ఆ సంటిపిల్లని మీయమ్మకిచ్చి ఈ లగేజీ పట్రా అన్నాడు. రాత్రి కొడుకుని తిట్టిన ముసలాయన. ఆ మాట గుర్తు పట్టేసి అటేపు సూసాన్నేను. బాబూ ఇది కాకినాడ కాదు రాయమండ్రి. దిగాల్సింది ఇక్కడ కాదు. అన్నాడు రాత్రి మాటల్లో కాకినాడ ఎల్లాలని సెప్పింది గుర్తెట్టుకున్నాడు కాబోలు. ఆ మాకు తెలీదులే! అన్నట్టు అతనైపుసూసినా ఆ పెద్దరికం ముందు నా ఒంకర బుద్ది పనిసెయ్యలేదు. ఇక్కడ నుండి కూడా ఎల్లచ్చు సార్ అన్నాన్నేను. “ ఒరేయ్ బ్రెష్ చేశాం కదా టిఫిన్ సేద్దామా అన్నాడు నానిగాడు. నన్ను తినేయ్ రా అన్నట్టు సూసేసరికి మళ్ళీ మాటాడలేదాడు.

ఆ ఏంగిరి ఏంగిరి , కడియం కడియం రాంపురం రాంపురం అని అరుస్తున్నాడు టేశన్ బైట ఆటోవోడు . బుర్ర మీసాలతో అచ్చం పెండ్లాం దుంపలాగున్నాడతను. ఆ తమ్ముడూ రండి కూకోండి అన్నాడు. ఆ ఆగాగు టిఫిన్ సెయ్యోద్దేటి? అన్నాడు నానిగాడు. ఇమిటేట్ సేత్తున్నట్టు. నవ్వుకున్నాన్నేను. నానీ రాంపురంలో తిందామ్లే ఆటో ఎక్కన్నాను. ఒరేయ్ నాకు తెలుసు మీ ఇంటికెల్లేదాకా ఏమీ పెట్టవు నువ్వన్నాడు. ఈ లోపు ఆ పెద్దాయన తిన్నగా మా ఆటోకాడికొచ్చి ఆళ్లందర్నీ పిలిశాడు. మీరు ఇదే ఆటో ఎక్కరా బాబూ అన్నాక, కాదు మీరే మేము ఎక్కింది ఎక్కారు అనబోయి ఆగాను. నా సిరాకు గమనించిన పెద్దాయన కొడుకు ఏ ఊరు తమ్ముడూ అన్నాడు. రాంపురం దగ్గర అన్నాను. అక్కడేవూరు అన్నాడు. గంగారం కేసి సిన్న పల్లెటూరండి అన్నాను. ఆదేలే ఏ ఊరేంటీ? అన్నాడు. నానిగాడికి సీను అరదమయ్యింది. నేరెల్లంక అని ఆడే సమాదానం సెప్పాడు.

తెల్ల మీసాలాయన, ఆయన కుటుంభమంతా దాదాపు మా పక్కూరిదాకా వొచ్చేశారు. మేమూ అక్కడే దిగి నడిసెల్లాలి మా ఊరికి . ఓసోస్ ఈ ఊరోడివేనా అన్నాడు ఆటో దిగాక. అవునండీ నామాడోళ్ళ పేట సత్తియ్య కొడుకుని అన్నాను. మానాన పేరు ఇన్నట్టు లేదు. ఏమనుకున్నాడో ఏమో ! ఏ సత్తియ్యా ? అని మళ్ళీ అడగలేదు. కానీ ఈసారి నేనే సెప్పాను.కాసోల్ల సత్తియ్యండి కొత్తరాయుగారి దగ్గర సేత్తాడు కదా అతనన్నాను. ఏమోలే బాబూ కొత్తరాయుగారి మనుషులు సేనామంది మారారు. మీ నాన తెలీదేమోలే అన్నాడు. సరేనండీ ఎల్లోత్తానని సెప్పి ఆటోవొడికి డబ్బులిచ్చేశాం.
కోలంక కాలవగట్టున నడుత్తా సాకలోళ్ల కొంపలు దాటాక, ఇదేంట్రా ఊళ్ళో కొబ్బరి సెట్లున్నాయా? కొబ్బరి సెట్టుల్లో ఊరుందా?అనడిగాడు. ఇంత పచ్చదనం ఎప్పుడూ సూసుండవు కదరా అన్నాన్నేను. నిజాంబాద్ జిల్లా కామారెడ్డి దగ్గర ఓ సిన్న తండా ఆడిది. అన్నీ ఇంతగానే సూశాడు. మా కాలవగట్నే ఓ కిలోమీటరు నడిశాక, ఇల్లులన్నీ ఎలిపోతున్నాయ్ కదరా? మీ ఊరెప్పుడొత్తాది అనడిగాడు. నేను మాట్లాడకుండా అంబెట్టిగారి బొమ్మకాడ బేగ్గు పెట్టి కాళ్ళు కడుక్కుందాం రమ్మన్నాను. ఓహో ఇదేనా నేరేడులంక అన్నాడు నానిగాడు.

ఒరేయ్ అల్డూ! ఇదేనా రాడాం? అనడిగాడు మా సలాది సుబ్బయ్య. అవును మాయా అనేలోపు రాత్రి బండికొచ్చావా? అన్నాడు. ఎవడేటీ ఈ అబ్బిగాడు అనడిగాడు. మా పెండని సెప్పాక, ఆన్ని ఇంటరాగేట్ సేయడం మొదలెట్టాడు.ఎవూరబ్బీ? ఆడు సెప్పేలోపు ఏం సేత్తావేటీ? అనడిగాడు. ఆడు సెప్పేలోపు మా రాయు నీకేలా తెలుసు అనడిగాడు. ఈ సారైనా కచ్చితంగా మాటాడదాం అనుకుంటున్నాడు నానిగాడు. అయినా ఆడు సెప్పకుండానే రూం మెంట్లా ? ఆఫీసు మెంట్లా అనడిగాడు. నవ్వోచ్చేసి నాఐపు తిరిగాడు. మాయా వొదిలేరా అలా ఇంటికి రా సెప్తాను అని, కాలవ రేవులో కాళ్ళు కడుక్కుని సెప్పులేసుకోకుండా నడిసాం మా ఇంటికి. ఇంతకు ముందెప్పుడూ లేని సిమెంటు రోడ్డు మూలంగా నేమో! ఊరంతా కొత్తగా అనిపించింది నాకు. బెలేగుందిరా మీవూరన్నాడు నానిగాడు.

వాకట్లో మట్టి నానబెట్టి పేడేసి కుమ్ముతుంది మాయమ్మ. ఇల్లాలకడానికికామాలు. నన్ను సూత్తానే ఒలే పిల్లా ఇలారా రాజొచ్చాడని పామొల్ల పొట్టిదాన్నిపిలిసింది. అయ్ మయా బోన్నావా? అని నవ్వుతూ కాళ్ళు కడుక్కుంటావా అని నీలివ్వబోయింది కడుకున్నట్టు తెలిసిందేమో! రేవులో కెళ్ళోచ్చావా అనడిగితే తలూపాను. అమ్మ నానిగాడికేసి సూసి. పెండా అన్నాది. అవునమ్మా మాది నిజాంబాద్ అన్నాడు. తెలుసు బాబూ సెలప్పోనులో మాటాడతావ్ నువ్వే కదా అన్నాది. బలే గుర్తు పట్టారమ్మా అన్నాడు నానిగాడు. కుచ్చోండి బాబూ అని కాళ్ళూ , సేతులూ కడుక్కూనొచ్చింది. ఎళ్ళు దేముణ్ణి సూసొచ్చి నీ బుల్లి కొడుకుని సూస్కోరా అన్నాది. ఎహే ఆడే దేముడు కధే అని సూడ్డానికి పురిటి మంచం దగ్గరకెల్లాను. పది గంటలవుతున్నా చలేస్తుంది కామాలు. దుప్పటి కప్పుకూనుంది మాయొదిన. కొంచుం దుప్పటెత్తి సూశాను. అచ్చం పగిలిపోయిన పత్తికాయ వానొచ్చి తడిచాక ముడుసుకున్నట్టు. మా యొదిన పక్కలోకంటా జరిగి పడుకున్నాడు. మాంచి ఎర్రగా మా ఇంట్లో ఎవడూ లేనంత రంగుతో ఓ పావుకేజీ పైనుంటాడు బరువు. ఆగలేక చెయ్యెస్తే, సలిపుట్టికామాలు. కాత బెదిరినట్టు పొజిచ్చి ఇంకాత ముడుచుకున్నాడు.”రాజూ” వొచ్చేశావా? అంది మాయొదిన. అవును నా కొడుకు బోన్నాడు. అన్నానేను. ఎత్తుకోనా అనడిగితే వొద్దు సేతులు సల్లగా ఉన్నాయన్నాది.

బట్టలిడిసేసి నానిగాడూ నేనూ తానానికెళ్ళోచ్చాం.అన్నం తినేసాక ఆడు పడుకుంటానన్నాడు. నేనూ అమ్మతో మాటాడతా పయాణంలో అలిసిపోయానేమో తెలీకుండా నిద్దరోయాను. సందాల నాలుగ్గంటలకి లేపి, రాజూ గోడకి ఎల్లెయ్యాలిరా అన్నాదమ్మ. తెల్లారితే పండక్కదా! లేనోపిక తెచ్చుకూని సరేనన్నా. ఎల్లేయడం అయ్యాక నానిగాన్ని తీసుకుని మసకపెళ్ళి రేవుకెల్లాను. ఆ టైం లో అక్కడ లంకలో నుండెచ్చేజనాలనీ ఇంకా మా సూరీడు మా గోదాట్లో మునిపోదాం నానిగాడు సూసి, సేలా ఆనంద పడ్డాడు. ఒరేయ్ ఈ ఊళ్ళో పుట్టి నువ్వదృస్టవంతుడివన్నాడు. బుజ్జమ్మీద సెయ్యేసి సాల్లేర అని ఆన్ని మా ఇంటికి తీసుకొచ్చేసాను . అచ్చం మా బుజ్జిదడిగినట్టే పామోల్ల పొట్టిదడిగింది. హైదరాబాదెల్లాక కొన్ని అలవాట్లు మరసిపోయాను. బయటకెల్లొచ్చినపుడు జేబులో సేకోడీలు ఏసుకురాడాం అలవాటు నాకు . నా పైజేబులో సెయ్యెట్టి నాలుగు సేకోడీలు తీసి సేతికిచ్చాడు నానిగాడు. అప్పుడు గుర్తొచ్చింది గార్లెంకట్రావ్ కొట్టుకాడ నానిగాడికి సిగరెట్టు తీసుకుంటే సిల్లర లేదని సెకోడీలిచ్చాడు. అయ్యి ఇద్దరం ఏదో అడావుడిలో ఉండి తినలేదు జేబులో ఏసుకున్నాను. ఒరేయ్ నానిగా నిన్ను సిగరెట్ మానమని ఎప్పుడూ తిట్టను. అన్నాన్నేను ఆ సిగరెట్ సేసిన సాయానికి . మాయా! నా సెవిరింగు సూడు అంటా పరిగెట్టుకొచ్చింది పొట్టిది . తీరాసూత్తే సకోడీలు ఏలాడుతున్నాయి. అంత తీరిగ్గా కొరికి ఆ సందుల్లోంచి సకోడీల్ని సెవులకి తగిలించుకూని, అది సేసిన ముచ్చటకి కళ్ళు తడిసి పోయాయ్. రెండు సుక్కలు నా కంట్లో నుంచి పడే సరికి నానిగాడూ ఏడుస్తున్నాడు. పొట్టిది మా ఇద్దరి మోకాలూ సూసి తుర్రుమని పారిపోయింది.