జర్నలిజం, సాహిత్య విమర్శ, కవిత్వం, కథా రంగాల్లో కృషి చేస్తున్న కాసుల ప్రతాపరెడ్డి తెలంగాణ సాహిత్య, సాంస్కృతికోద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన రెండు కథా సంపుటాలను, మూడు విమర్సనా గ్రంథాలను,ఓ కవితా సంకలనాన్ని వెలువరించారు. తెలుగు సాహిత్యోద్యమంలో భాగంగా ఆయన వివిధ రచయితల వ్యాసాలతో వెలువడిన తెలంగాణ తోవలు, తెలంగాణ కథ -దేవులాట, మే 31 వంటి పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమంలో వివిధ రంగాలపై 2001లో వెలువరించిన తెలంగాణ తోవలు వ్యాససంపుటి మలి ముద్రణను వెలువరించారు. ఈ సందర్భంగా కాసుల ప్రతాపరెడ్డితో ‘వాకిలి’ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడు డా. కాసుల లింగారెడ్డి చేసిన ఇంటర్వ్యూ:
1. ‘తెలంగాణ తోవలు’ మలి ముద్రణ సందర్భంగా దాదాపు పన్నెండు ఏండ్ల కిందటి మీ అనుభవాలు చెప్పండి. తెలంగాణ తోవలు నిర్వహించిన చారిత్రిక పాత్ర ఏమిటి?
తెలంగాణ తోవలు అనే పుస్తకం రావడానికి పెద్ద నేపథ్యమే ఉంది. తెలంగాణకు సంబంధించి అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్నదనే అవగాహన నుంచి తెలంగాణ సాంస్కృతిక వేదిక పుట్టింది. తెలంగాణ రచయితలు, మేధావులు వివక్ష గురించి మాత్రమే మాట్లాడుతున్నారనే విమర్శ తరుచూ వస్తుండేది. ఒక రకంగా అది నిజం కూడా. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక, చారిత్రకాంశాలను మూల్యాంకనం చేయడానికి అప్పటి వరకు ఉన్న కొలమానాలు సరిపోవని, కోస్తాంధ్ర కొలమానాలతో వాటిని చూడడం సాధ్యం కాదని తెలంగాణ మేధావులు, రచయితలు ఒక్క అవగాహనకు వచ్చారు. రెండు అసమసమాజాలకు సంబంధించిన సాహిత్యాన్ని అంచనా వేయడానికి ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత పాటిస్తూ వచ్చిన కొలమానాలు సరిపోవని అంటూ వచ్చాం. అయితే, ఆ కొలమానాలు ఎలా ఉండాలి, తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక పరిణామ క్రమాలు ఏమిటి అనేవి చూడాల్సి వచ్చింది. వాటికి సంబంధించిన అవగాహనకు మాకు మేం కల్పించుకోవడానికి ప్రయత్నించాం. అందులో భాగంగానే ఒక్కో అంశాన్ని తీసుకుని ఒక్కో రచయిత వ్యాసాలు రాశాడు. ఒక రకంగా తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక, చారిత్ర, సామాజిక అంశాలకు సంబంధించిన విస్తృతమైన కృషి జరగడానికి మార్గదర్శనం చేసే వ్యాసాలు ఇందులో చోటు చేసుకున్నాయి. మేం 2001లో ఆ పుస్తకం వెలువరించడానికి ప్రయత్నించినప్పుడు వివిధ కారణాలతో వ్యాసాలు రాయించడానికి ముందుకు రానివాళ్లున్నారు, దాన్ని త్వరగా తేవాలనే ఉద్దేశంతో మేం కొంత మందిని సంప్రదించలేకపోయాం. రాసినవాళ్లే చాలు అనే ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని 18 మంది రచయితల వ్యాసాలతో నేనే పని కట్టుకుని రాయించి, సాంస్కృతిక వేదిక తరఫున వెలువరించాను. దానికి అనూహ్యమైన స్పందన లభించింది. వ్యాసాల్లోని వాదనలకే కాకుండా తెలంగాణ పేరు మీద వెలువరించిన పుస్తకానికి ఆమోదం లభిస్తుందా, లేదా అనే సందేహం అప్పుడు ఉంది. కానీ ఆ పుస్తకం వెలువడిన నెల రోజుల్లో ప్రతులన్నీ అయిపోయాయి. దాంతో తెలంగాణకు ఆమోదం తెలంగాణ అంతటా ఉందనే అభిప్రాయానికి తెలంగాణ సాంస్కృతిక వేదికలో ప్రధాన పాత్ర పోషించిన నందిని సిధారెడ్డి, కె. శ్రీనివాస్, అల్లం నారాయణ, సురేంద్ర రాజు, సుంకిరెడ్డి నారాయణ, మల్లేపల్లి లక్ష్మయ్య, స్కైబాబ, కాసుల లింగారెడ్డి వంటి వాళ్లందరికీ స్పష్టంగా అర్థమైంది. తెలంగాణ ఉద్యమానికి ఆమోదం ఉండదనే సందేహంతో అప్పటి వరకు దూరంగా ఉంటూ వచ్చినవాళ్లు కూడా ఉద్యమంలోకి వచ్చారు.
ఆ పుస్తకంలోని వ్యాసాలు చాలా మంది యువరచయితలకు, సాహిత్యకారులకు స్ఫూర్తినందించాయి. సవాళ్లకు సమాధానాలు చెప్పడానికి అవసరమైన హేతుబద్దమైన కొత్త కొలమానాలు రూపొందించడానికి వీలైంది. తెలుగు సాహిత్యంలోని భిన్న సమాజాలనుంచి వెలువడిన రచనల తులనాత్మక అధ్యయనానికి కూడా ఇది మార్గం చూపింది.
ఆ పుస్తకం కావాలంటూ సాహిత్య విద్యార్థులు అడుగుతూ వస్తున్నారు. అది తెలంగాణ సాహిత్యాన్ని, చరిత్రను, సంస్కృతిని మూల్యాంకనం చేసి, విశ్లేషించడానికి మార్గం చూపింది. అందుకే దాని అవసరం తీరలేదు, తీరదు కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకుని, చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యా మార్పులేమీ చేయకుండా అలాగే రెండో ముద్రణగా వెలువరించాలని అనుకున్నాం. ఇప్పటికి అది సాకారమైంది.
2. తాత్విక నేపధ్యం లేని ఉద్యమాలు ఇటీవలి జాస్మిన్ విప్లవాల లాగా దారుణంగా విఫలమైన పరిస్థితి చూశాము కదా. తెలంగాణ ఉద్యమానికి ఏ తాత్విక నేపధ్యం ఉందంటారు? ఆకుపచ్చ,నీలి, బంగారు,ప్రజా ట్యాగ్ లైన్ లతో హంగామా జరుగుతున్నప్పుడు కేవలం భౌగోళిక తెలంగాణ గురించి మాత్రమే మాట్లాడాలని మీరు పదే పదే అంటుండేవారు. ఆ తొలి నాళ్లలో మీరు ఆ నిర్ణయం ఎందుకు చేసారు?
నిజానికి, ఉద్యమాలేవి విఫలం కావు. తాత్విక నేపథ్యం అనే పెద్ద మాటను పక్కన పెడితే, వివక్షలనూ ఆధిపత్యాలనూ వ్యతిరేకించే ఉద్యమాలు ఫలితాలు తప్పకుండా సాధిస్తాయి. ఒక్క గంతుతో కొండను ఎక్కడం సాధ్యం కాదు. ఒక్కో మెట్టు ఎక్కి పోవాల్సిందే. బహుశా, అస్తిత్వ ఉద్యమాలను దృష్టిలో పెట్టుకుని తాత్విక నేపథ్యం లేని ఉద్యమాలు విఫలమయ్యాయనే మాట వాడినట్లు అనిపిస్తున్నది. కానీ, అవి సమాజంలో చూపిన ప్రభావాలను మరిచిపోరాదు. ఆధిపత్యాలను ధక్కిరించి, ఉనికిని చాటుకుని, అస్తిత్వాన్ని ప్రకటించుకునే క్రమంలో అవి పెద్ద ముందడుగు వేశాయి. నిజానికి, పాలకవర్గాలు చేసే చట్టాలు కూడా మంచినే కోరుతాయి. కానీ, వాటిని దుర్వినియోగం చేసేవారు, వాటిని స్వార్థం కోసం వాడుకునేవారు ఎప్పుడూ ఉంటారు. వాటిని చూసి ఉద్యమాలు విఫలమయ్యాయని అనడం సరి కాదు. అంతేకాకుండా, వాటికి తాత్విక నేపథ్యంలో లేదని చెప్పలేం. దళిత ఉద్యమం అద్భుతమైన ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమంగా రూపు దాల్చడానికి అవకాశం ఉంది. అదే విధంగా తెలంగాణ ఉద్యమానికీ అవకాశమూ ఉంది. దళిత, తెలంగాణ ఉద్యమాల కలయిక ఫలవంతమైన ప్రపంచీకరణ వ్యతిరేకోద్యమంగా ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ప్రజాస్వామిక చట్రంలో అది మహత్తరమైన పాత్ర పోషించే అవకాశాలూ ఉన్నాయి. ప్రస్తుత వ్యవస్థలో ప్రజాస్వామిక ఉద్యమాలు చేయడానికి తగిన వెసులుబాటు ఉంది. 1990 దశకంలో హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య కూడా ఆ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రజాస్వామిక ఉద్యమాలు భవిష్యత్తు ఉద్యమానికి పాదులు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదెలాగో చెప్పడానికి ఇది సందర్బం కాదు.
సమాజం మొత్తం చైతన్యవంతమైనప్పుడు చెప్పాల్సిన మాటలకు, చేసే ఆచరణకూ – సమాజం ఒక విప్లవాత్మకమైన ఉద్యమానికి సమాయత్తం కావడానికి అవసరమైన చైతన్యం లేనప్పుడు చెప్పే మాటలకు, చేసే ఆచరణకు తేడా ఉండాల్సిందే. భౌగోళిక తెలంగాణ నినాదం అనేది ఓ పెద్ద ప్రజాస్వామిక ఉద్యమానికి మార్గం వేసే అవకాశాన్ని కల్పించింది. తెలంగాణలో ప్రజాస్వామిక చట్రంలో, రాజ్యాంగ పరిధిలో ఉద్యమం వస్తే తప్ప ఈ ప్రాంతంలోని యువత స్వేచ్ఛావాయువులు పీల్చడానికి వెసులుబాటు లభించదనే నా అవగాహన కూడా అందుకు కారణం. రెండు పెత్తనాలు, ఆధిపత్యాలు అనే మాటతో కూడా పూర్తి స్థాయిలో ఏకీభవించలేను. ఓ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి ప్రజాస్వామిక చట్రం, రాజ్యాంగ పరిధి తప్ప మార్గాలన్నీ మూసుకుపోయిన పరిస్థితి. ప్రజాస్వామిక ఉద్యమాల అవసరాన్ని, ఆవశ్యకతనే కాకుండా అనివార్యతను కూడా తెలియజేసిన మొదటి ఉద్యమం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిది అయితే, రెండోది తెలంగాణ నినాదంతో జరిగింది. ఇటువంటి ఉద్యమాల వల్ల సమాజంలో గుణాత్మకమైన మార్పు సంభవించి, ప్రజల చైతన్య స్థాయి మరో మెట్టుకు చేరుకోవడానికి అవకాశం కల్పిస్తాయి.
3.హరిత విప్లవం, నూతన ఆర్ధిక విధానాల కారణంగానే తెలంగాణ ఉద్యమం ఆవిర్భవించిందని మీరు భావిస్తున్నారా తెలంగాణ సమాజంలో వాటి పాత్ర ఏమిటి?
దాని గురించి నేను పెద్దగా ఆలోచన చేయలేదు గానీ తప్పకుండా ప్రజాస్వామిక ఆకాంక్షల పరిధి పెంచడంలో అవి పాత్ర పోషించాయనే అనుకుంటాను. సమాజంలో చదువుకున్న ప్రజాస్వామిక వ్యక్తుల సమూహం పెరగడంలో అవి ప్రధాన పాత్రనే పోషించాయి. అందులో భాగంగానే తెలంగాణ ఉద్యమం కూడా ఆవిర్భవించింది. నూతన ఆర్థిక విధానాల ఫలితాలను, దానివల్ల కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కూడా తెలంగాణ ఉద్యమం రావడానికి కారణం. కానీ, అదొక్కటే కారణం కాదు. తెలంగాణలో దశాబ్దాలుగా అమలవుతూ వస్తున్న నిర్బంధం దానికి కారణం. తెలంగాణ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవకాశాలను నిరాకరించడానికి నిర్బంధం ఓ ఆయుధంగా పనిచేస్తూ వచ్చింది. దాని మూలంగానే ప్రస్తుత తెలంగాణ ఉద్యమం unsaid అవగాహనతో పూర్తి ప్రజస్వామిక పద్ధతిలో జరిగింది. హింసకు తావు ఉంటుందని భావించినప్పుడు వెనక్కి తగ్గి, సరిచేసుకుని ముందుకు సాగింది. పాలకవర్గాలు అవకాశం దొరికితే పెద్ద యెత్తున నిర్బంధం ప్రయోగించడానికి వెనకాడి ఉండేది కాదు. కానీ, తెలంగాణలో మొదటిసారి పార్లమెంటరీ రాజకీయాలకు, ప్రత్యామ్నాయ రాజకీయాలకు పొత్తు కుదిరి, సాగిన ప్రజాస్వామ్య ఉద్యమంగా నేను దీన్ని చూస్తాను.
4. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుక పోవడంలో కవులు, రచయితల పాత్ర సంతృప్తికరంగానే ఉందంటారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ పాత్ర ఎట్లా ఉండాలంటారు?
భౌగోళిక తెలంగాణను సాధించే వరకు అది సక్రమంగా జరిగినట్లే. కానీ, ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ప్రజాస్వామిక చట్రంలో ఓ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని రూపొందించడంలో విఫలమయ్యారు. తప్పకుండా కవి, రచయితలది సమాజంలో ప్రతిపక్ష పాత్రే, ప్రజల గొంతే.
5. లాటిన్ అమెరికా దేశాల్లోని సామాజిక ,రాజకీయ పరిస్థితులకు తెలంగాణాకు చాల సారూప్యముంది కదా ! మీరు అక్కడి సాహిత్యాన్ని చదువుతారా? యువ కవులకు చదవని recommend చేస్తారా?
మార్క్వెజ్ వంటి లాటిన్ అమెరికా రచయితలను చదివిన తర్వాతనే తెలంగాణ పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలో తెలిసి వచ్చింది. ఇక్కడి మేధావులు, రచయితల పాత్ర ఎలా ఉండాలో అర్థమైంది. నేను ఈ గడ్డ మీద పుట్టాను కాబట్టి నేను ఏది మాట్లాడినా రాజకీయంలాగే ఉంటుందనే మార్క్వెజ్ మాటలు తెలంగాణకు వర్తిస్తాయి. తప్పకుండా లాటిన్ అమెరికా సృజనాత్మక రచనలనే కాదు, అక్కడి ఉద్యమాలను కూడా చదివి తీరాలి.
6.భౌగోళిక తెలంగాణ ఏర్పడడం ఖాయమైనట్లే కదా! ఇంతటితో తెలంగాణ సమాజంలో ఏరకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రజాస్వామ్యపు మేడి పండులో పురుగులు పూర్తిగా తొలిగిపోతాయా? నయావలసవాదపు వనరుల దోపిడీ, శ్రమ దోపిడీ అరికట్టడడం ఎట్లా?
సమూలమైన మార్పులు ఏమీ ఉండకపోవచ్చు. కానీ మార్పులు తప్పకుండా జరుగుతాయి. సామాజిక, సాంస్కృతిక రంగాల్లో మార్పులు వస్తాయి. ప్రభుత్వాలు తప్పకుండా ఏదో ఓ పని చేయాలి కాబట్టి ప్రాజెక్టులు రావచ్చు. వాటివల్ల సమాజంలో మార్పులు తప్పకుండా వస్తాయి. అయితే, వచ్చే మార్పులు ఎంత మేరకు ప్రజానుకులంగా ఉంటాయనేది కాలం నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్యం అనేదాన్ని పూర్తిగా నిరాకరించాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం కావడం వల్లనే చాలా వెసులుబాట్లు కూడా ఉన్నాయి. మంచిని కోరే శక్తులు వాటిని వాడుకోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ముందే చెప్పినట్లు ఒకే గంతుతో కొండను ఎక్కలేం.
7. ప్రపంచీకరణ సాంస్కృతిక ఏకీకరణను రుద్దుతోంది కదా! ఈ Americanaisation ను మీరు ఆహ్వానిస్తారా? లేదు గుస్తావో ఎస్తేవ అన్నట్టు స్థానికీకరణను pramote చేస్తారా? స్థానికీకరణను ముందుకు తీసుక పోయేపని అయితే అది ఎట్లా జరగాలంటారు?
గుస్తావో ఎస్తేవ గురించి తెలియనప్పుడే సాంస్కృతిక వేదిక ప్రపంచీకరణ వ్యతిరేకోద్యమంగా స్థానిక ఉద్యమాన్ని గుర్తించి, తన అవగాహనా పత్రంలో రాసుకుంది. అమెరికనైజేషన్‌ను వ్యతిరేకించడానికి రాజకీయ ఉద్యమం కన్నా సాంస్కృతికోద్యమం పెద్ద స్థాయిలో జరగాలనేది నా ఉద్దేశం. ప్రపంచీకరణను వ్యతిరేకించడంలో భాగంగానే, అంటే సాంస్కృతిక ఏకీకరణను వ్యతిరేకిస్తూ, సాంస్కృతిక భిన్నత్వాన్ని కాపాడుకోవడంలో భాగంగానే స్కాట్లాండ్ వంటి ప్రాంతాల్లో ఎథ్నిక్ ఫుడ్స్‌కు ఆదరణ పెరిగింది. తెలంగాణ విషయంలో ఇది మరింతగా అన్వయం చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో ఇది ప్రధాన పాయగానే సాగుతూ వస్తున్నది.
8. అన్ని సాహిత్య సంఘాలకు మీరు దూరంగా ఉంటూ వచ్చారు కదా ! విరసం ,ప్రజా రసం లలో కూడా మీరు సభ్యత్వం తీసుకోలేదు. ’గోదావరి లోయ’ నమ్ము తో మీ సాన్నిహిత్యం కూడా మిమ్మల్ని సంఘం వైపు నడిపించలేదు కదా! కారణం ఏమంటారు?
సృజనాత్మక రచయితకు సంకెళ్లు ఉండకూడదని భావిస్తూ వచ్చాను. నా వ్యక్తిత్వం సంఘాల్లో ఒదిగేది కాదు. నమ్ము నాకు ప్రజాసాహిత్యం గురించి చాలా నేర్పారు. కానీ నేను ప్రజారసలో ఒదిగిపోలేకపోయాను. నాది తప్పుడు అభిప్రాయమే కావచ్చు గానీ అనవసరమైన విషయాల మీద ఎక్కువ చర్చ జరిగి, రచనలకు సంబంధించిన విషయాల మీద తక్కువ చర్చ జరగడాన్ని రచయితల సంఘాల్లో కూడా చూశాను. ఇందుకు మినహాయింపులు ఉండవచ్చు. నేను స్వేచ్ఛగా రాసుకోవడానికి వీలు కల్పించుకోవడానికే అలా ఉండిపోయాను. నా అమాయకత్వం, ముక్కుసూటి పద్ధతి కూడా అందుకు నిరోధం కలిగించాయి. అయితే, వాటికి వ్యతిరేకంగా నేను ఎప్పుడూ లేను. కొన్ని పెడధోరణులను (కాకపోవచ్చు కూడా) ప్రశ్నించాను కూడా. అది కూడా వాటి పట్ల సానుకూలత కారణంగానే చేశాను. బద్ధవ్యతిరేకిగా చేయలేదు. కానీ, ఆ సంఘాల్లో పనిచేసినవారే నన్ను తప్పుదోవ పట్టించిన సందర్భాలున్నాయి. వాటి గురించి అప్రస్తుతం కూడా.
9.ఇవ్వాళ్ళ తెలంగాణ సాహిత్య సంఘాలు ఇన్ని చీలికలు ,పేలికలు గా కొనసాగుతుండడా నికి కారణమేమంటారు? సాహితీవేత్తల్లో కారిరిజం,ఈగో ,స్వార్థం పెరిగిగిపోవడమేనంటారా?
ఎక్కడైనా ఇది తప్పదు, ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాల్లో పరిస్థితి ఇలాగే ఉంటుంది. దీన్ని వ్యతిరేక దృష్టితో కాకుండా సానుకూల దృక్పథంతోనే చూడాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఈగోలు, కెరీరజం, స్వార్థం ఉంటాయి, అవి ప్రత్యేకంగా తెలంగాణవారికే అంటగట్టడం సరికాదు. అవి ఉన్నా అసలు సిసలైన సృజనాత్మక రచనలకు కాకుండా ఇతరేతక కారణాల వల్ల సృజనాత్మకత కొరవడిన రచనలకు గుర్తింపు రావడం తెలంగాణ సాహిత్యానికి, సమాజానికి నష్టం.
9. మీరు ఒక్క కవిత్వాన్నే కాకుండా కథ, విమర్శ మీ భావాల ప్రచార మాధ్యమంగా ఎన్నుకున్నారు. ప్రధానంగా మిమ్మల్ని మీరు ఎట్లా ప్రాజెక్ట్ చేసుకుంటారు? తొలి నాల్లల్లో మిమ్మల్ని సాహిత్యం లోకి తీసుకొచ్చిన సామాజిక, రాజకీయ, తాత్విక పరిస్థితులు ఏమిటి? ప్రభావితం చేసిన రచయితలు ఎవరు?
నిజానికి నేను సాహిత్యకారుడిగా గుర్తింపు పొందాలని ఏ పనీ చేయలేదు. ఇతరులు స్పృశించని కోణాలు, అంశాలు ఎదురైనప్పుడు మాత్రమే అనివార్యంగా నేను రాశాను. ఒక్కో విషయం చెప్పడానికి ఓ ప్రక్రియ పనికి వస్తుంది. అన్నింటికీ ఒకే ప్రక్రియ సరిపోదు. సమాజాన్ని, సమాజంలోని ఉద్యమాలను ప్రత్యక్షంగా చూస్తూ ఉండడం వల్ల నాకు పలు సందేహాలు పుడుతూ వచ్చేవి. ఉదయం పత్రికలో చేరిన తర్వాత నేను డెస్క్‌లో కాకుండా ఫీల్డ్‌లో పనిచేయడం వల్ల నాకు అన్ని రకాల సంఘటనలకు, విషయాలకు యాక్సెస్ ఉండేది. ఫస్ట్ హ్యాండ్ ఇన్‌ఫర్మేషన్ ఉండేది. దానివల్ల ఒకేసారి వివిధ ప్రక్రియలను, నా ఆలోచనలకు తగినట్లు ఎన్నుకున్నాను.
అత్యంత పేదరికమైన రైతు కుటుంబం నుంచి రావడం వల్ల పైకి ఎదగాలనే వ్యక్తిగత ఆకాంక్ష కాకుండా ఇలా కొంత మంది ఎందుకున్నారనే ఆలోచన నన్ను వేధిస్తూ ఉండేది. లింకన్, గాంధీ వంటి ఆదర్శపురుషుల ప్రభావం పాఠశాల స్థాయిలో ఉంది. మా అటెండర్ నన్ను లాల్ బహదూర్ శాస్త్రితో పోల్చేవాడు. అనుకోకుండానే, సామూహికమైన ఆలోచనకు పాదులు పడ్డాయి. నేను రాయడాన్ని కాకుండా చదవడాన్ని ప్రధానంగా ఎంచుకున్నాను. నాకు దొరికిన ప్రతి రచననూ ఆబగా చదువుతూ ఉండేవాడిని. పాఠశాల స్థాయిలో నేను చదివిన రచనలకు లెక్కలేదు. అవి నాకు అర్థమయ్యాయా, కాదా అనేది ప్రధాన కాదు. వాటిని చదవడంలో దాహమేదో తీరుతున్నట్లుండేది.
డిగ్రీ స్థాయికి వచ్చిన తర్వాత రాజకీయాలు తెలుస్తూ వచ్చాయి. ఈ పీడనకంతటికీ ఉన్నవాళ్లు, లేనివాళ్లు అనే సమాజ సృష్టి అని అర్థమైంది. చదువుతున్న క్రమంలోనే రాయాలనే తపన కూడా ఉండేది. అలా నేను కవిత్వంతో నోటు బుక్కులన్నీ నింపేసేవాడిని. ఇంటర్మీడియట్ చదవడానికి హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు సాహిత్యంలో చదవదగిన రచనలేవో మిత్రుల ద్వారా అందుతూ వచ్చాయి. ఆ స్థాయిలోనే నేను కోస్తాంధ్ర సాహిత్యన్నంతా చదివేశాను. కవిత్వం, కథ, నవల, వ్యాసం అనే తేడా ఉండేది కాదు. కోఠీ ఫుట్‌పాత్ మీద దొరికే కవిత్వం పుస్తకాలన్నింటినీ మంచీచెడు అనే తేడా లేకుండా కొనేసేవాడిని. అలా సాహిత్యంలోకి రాజకీయాల పరిచయం లేకుండా అడుగు పెట్టినప్పటికీ ఎస్పీ కాలేజీలో మాత్రం ఒక తాత్వికపరమైన ఆలోచనలు నాలో నాటుకుంటూ వచ్చాయి. అదే నేను మూడేళ్లు ఎడిట్ చేసిన ఎస్పీ కాలేజీ మ్యాగజైన్, ఓ ఏడాది ఎడిట్ చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం
మ్యాగజైన్ ప్రతిఫలిస్తాయి. తిరుమల శ్రీనివాసాచార్య గారి సాహచర్యం నన్ను సాహిత్యం వైపు మరింతగా ముందుకు నడిపింది. ఆయన ప్రజాస్వామిక దృక్పథం, కాలేజీ మ్యాగజైన్ ఎడిటింగ్‌లో, రచనల ఎంపికలో నాకు ఇచ్చిన స్వేచ్ఛ నేను మరిచిపోలేను.
ప్రభావం చూపిన రచయితలు ఒకరని చెప్పలేం. చలం ఉర్రూతలూగించేవాడు. శ్రీశ్రీ రక్తాన్ని ఉడికెత్తించేవాడు. బుచ్చిబాబు, గోపీచంద్ ఆలోచనలు రేకెత్తించేవారు. కరుణకుమార, తదితరులు వస్తువులు ఎక్కడ దొరుకుతాయే నేర్పారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి కంఠతా వచ్చేవాడు. ఎంఎలో చేరిన తర్వాత శ్రీనాథుడు, తిక్కన, పోతనల రుచి తెలిసి వచ్చింది. తెలుగు వాక్యం రాయడం మాత్రం ఉదయం దినపత్రికలో చేరిన తర్వాతనే అలవడింది. ఆలోచనలు స్పష్టంగా ఉన్నప్పుడు వాక్యం స్పష్టంగా వస్తుందని అర్థమైంది. ఆ స్పష్టతే నా వచన రచనల్లో ఉంటుంది. ఎక్కడైనా వాక్యం సరిగా లేదంటే నాలో అయోమయమో, అనిష్టతో ఉన్నట్లు. త్రిపుర విపరీతంగా కలవరపెట్టాడు. సమాజంలో ఉంటూనే ఏకాకిగా ఉండే నాకు రచనలు తోడుగా నిలిచాయి.
10. మీ ‘గుక్క’ నేపథ్యం చెప్పండి. reader’s text లో వున్న లాంగ్ పోయెమ్ గా విమర్శకులు గుర్తించారు కదా! చాల మంది లబ్ద ప్రతిష్టులైన తెలంగాణ కవులు మీ శైలిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు కదా! మీ సుదీర్ఘ సాహిత్య ప్రస్థానం లో ఒకే ఒక్క సంకలం వేయడంలో అంతరార్థం ఏమిటి?
నాకు కవిత్వం మీద వైముఖ్యం ఉండేది. కవిత్వం రాయకూడదనే నిబంధనను కూడా నేను చాలా కాలం పాటించాను. కవిత్వం కన్నా వచనరచనల అవసరం, ముఖ్యంగా కథల అవసరం ఉందని భావించేవాడిని. అంతేకాకుండా ప్రయోజనకరమైన రచనలు కొరుకుడు పడవని, పఠనయోగ్యం కావనే చర్చ జరుగుతూ ఉండేది. నాకు కూడా ఆ వాదనలో ఏకీభావం ఉందేమో తెలియదు గానీ ప్రయోజనకరమైన రచనలను కూడా పఠనయోగ్యంగా ఎలా రాయవచ్చునో తేల్చుకోవడానికి నేను కథలు రాశాను. వ్యాపారనవలలపై ఎంఫిల్ చేయడం వల్ల కూడా నాకు అందులో కొంత స్పష్టత వచ్చింది.
గుక్క నా ప్రమేయం లేకుండానే వచ్చింది. నాకు అనుభవంలో లేనిది రాయడం చేత కాదు. ఇతరులను ఉద్ధరించడానికి, ఇతరుల కోసం రాయడం కూడా నా వల్ల కాదు. నాకోసం నేను రాసుకోవడానికి, నాలోని ఆలోచనలను, ఉద్వేగాలను పంచుకోవడానికి మాత్రమే నేను రచనలు చేశాను. అందులో భాగంగానే గుక్క వచ్చింది. ఆ లాంగ్ పోయెం అయిపోయేంత వరకు నేను ఓ ట్రాన్స్‌లో ఉన్నాను.
తెంపు లేని ఆలోచనలు, భావాలు మెదడును పురుగులా తొలుస్తుంటే వాటికి కవిత్వ రూపం ఇచ్చాను. నా ఆలోచనలను, భావాల తీవ్రతను, ముఖ్యంగా పరిష్కారం కనిపించని వేదన కవిత్వానికి ఓ కొత్త డిక్షన్‌ను తీసుకునివచ్చింది. ఆ డిక్షన్ తెలంగాణ కవులకు అనుసరణీమైందిగా కూడా మారింది. మిగతా అందరు కవుల కన్నా భిన్నంగా నేను రాయడం వల్లనే, నాదంటూ సొంత శైలి ఉండడం వల్లనే అది అంతగా ఆదరణ పొందింది. వైరుధ్యాల మధ్య సమన్వయం కుదర్చమెలాగో అంతర్లీనంగా గుక్కలో వ్యక్తమైందనే అనుకుంటూ ఉంటాను. ముందే, చెప్పాను నేను ప్రాథమికంగా కవిని కాదు. గుక్క సంకలనం తర్వాత మళ్లీ కవిత్వం రాస్తానని అనుకోలేదు. కవిత్వం రాయడంలోని బాధేమిటో అనుభవించి శక్తులన్నీ ఉడిగిపోయినట్లు అనిపించింది. శరీరాన్ని, మనసును, అత్మను కష్టపెట్టుకోలేని స్థితి వల్లే నేను ఎక్కువగా కవిత్వం రాయడం లేదు. ఆ వేదనను భరించడం నా వల్ల కాదనిపిస్తుంది. గుక్క సంకలనం తర్వాత కూడా కొంత కవిత్వం రాశాను కానీ ఎక్కువగా రాయలేదు. నన్ను బ్రేక్ చేసుకోవడానికి నేను అనంత పురుటి వేదనను భరించాల్సిన దశను ఊహించుకోవడం నా వల్ల కాదు.
11. మిమ్మల్ని మీరు ఎట్లా define చేసుకుంటారు ? అనార్కిస్టా? మార్క్సిస్టా ? ఆధునికాంతరవాదా?
విమర్శకుడిగా నన్ను మార్కిస్టు అని సుజాతారెడ్డి గారు నిర్వచించారు. అదేమిటనే నవ్వుతూ నేను అడిగితే కాదని నువ్వు చెప్పగలవా అని ఎదురు ప్రశ్న వేశారు. యాకూబ్ నన్ను ఆధునికాంతర విమర్శకుల్లో చేర్చాడు. సిద్ధాంత చర్చల్లోకి వెళ్లడం, ప్రతి దాన్నీ ఓ మూసలో కట్టిపడేయాలని చూడడం నాకు నచ్చదు. అది మొత్తంగా బాధితుల, పాలితుల ప్రయోజనాలకు ఉపయోగపడుతుందా, లేదా అనే చూస్తాను. నన్ను ఎవరు ఏ విధంగానైనా పిలువవచ్చు. నాకు అభ్యంతరం లేదు. నేనేమిటో నాకే తెలియదు. తెలియనప్పుడు నన్ను నేను నిర్వచించుకోవడం అసలే కుదరదు. తెలంగాణ సమాజంలో ఉన్న వైరుధ్యాలన్నీ నాలోనూ ఉన్నాయి. నాకు గాయం, గాయానికి కారణమైన శక్తులు మాత్రమే కనిపిస్తాయి. రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటం జరుగుతున్నప్పుడు అగ్రవర్ణాలకు చెందిన ప్రగతిశీల విద్యార్థులు కూడా రోడ్లు ఊడ్చడాన్ని, బూట్ పాలిష్ చేయడాన్ని ఓ అవమానకరమైన పనిగా భావిస్తూ పోరాట రూపాలను ఎంచుకున్నప్పుడు అది శ్రమశక్తిని కించపరచడమేనని మొట్టమొదట మాట్లాడినవాడిని నేనే.
14. తెలంగాణ సాంస్కృతిక వేదిక చాలా దారుణమైన ఆరోపణలకు, దాడులకు గురైంది కదా! దీనికి కారణాలేమిటంటారు? ఇవ్వాళ్ళ దాన్ని పునరుధ్ధరించే ఆలోచనలేమైన ఉన్నాయా?
అదంతా ఇప్పుడు అప్రస్తుతం. నాకైతే సాహిత్య సంస్థల పట్ల ఏ విధమైన ఆసక్తి లేదు. మొదలు పెట్టి వదిలేసినవి చాలా ఉన్నాయి. అలా పట్టుకుని ఎప్పుడూ వేలాడలేదు. దాని నుంచి ఏదీ ఆశించలేదు. నేను మంచి అనుకున్నది చెప్పినప్పుడు దాన్ని ఎవరైనా అంది పుచ్చుకున్నప్పుడు దాని గురించిన ఆలోచన మానేయడం నాకు నా ప్రవృత్తిలో భాగంగా వచ్చింది. నేను మాత్రమే చేయగలను అనుకున్నదాన్ని మాత్రమే చేశాను. మిగతా వాళ్లు చేయడానికి ముందుకు రానప్పుడు నేను ముందు పడ్డాను.
15.అనేక నూతన ప్రతిపాదనలతో అత్యంత బలమైన విమర్శగా ముందుకొచ్చిన ‘ఇరుసు ’ పట్ల తెలుగు సాహిత్య విమర్శకులు ఒక వ్యూహాత్మక మౌనం పాటించడం ద్వారా మిమ్మల్ని negate చేసే ప్రయత్నం చేశారనిపిస్తుంది. మీరేమంటారు?
ఇరుసు వ్యాసాల సంకలనంలో నేను చాలానే సూత్రీకరణలు, ప్రతిపాదనలు చేశాను. భౌగోళిక తెలంగాణ ఏర్పాటుకు ముందుకు వెళ్లి మాట్లాడాను. తెలంగాణ సాహిత్య దృక్పథం గురించి కూడా మాట్లాడాను. తెలంగాణ సాహిత్యం ప్రాపంచిక దృక్పథాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో చెప్పాను. స్థానిక ఉద్యమాల ఆవశ్యకతపై చెప్పాను. అయితే, విమర్శకులు మౌనం పాటించారో లేదో తెలియదు గానీ పాఠకులు, సాహిత్య విద్యార్థులు మాత్రం దాన్ని సరిగానే అందిపుచ్చుకున్నారు. అది ఇతోధికమైన పాఠకలోకాన్ని చూసింది.
16.మాట్లాడుతున్నప్పుడు మృదు స్వభావులైన మీరు విమర్శలో చాల దూకుడుగా కనిపించడానికి కారణమేమిటి?
దానికి కారణం స్పష్టంగా తెలియదు. కానీ, నాలో విపరీతమైన అంతర్ముఖత్వం ఉందని అనుకుంటాను. దానివల్ల ఎవరైనా ఎదురుగా నిలిచినప్పుడు అది మృదువుగా వ్యక్తమవుతూ ఉండవచ్చు. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి నన్ను రారా, త్రిపురనేనిలతో పోల్చాడు. నేను ఆ స్థాయిలో రాశానని అనుకోవడం లేదు. కానీ స్పష్టత వల్ల వాక్యాలు సూటిగా దూసుకువస్తాయి.
తెలుగు సాహిత్యంలో విమర్శ thankless job అని, విమర్శ వల్ల చాల నష్టపోయానని డా// కాసుల లింగా రెడ్డి ‘ఇరువాలు’ ముందుమాటలో రాసారు కదా. కొంచం వివరించండి .
విమర్శ అనేదాన్ని నేను వ్యక్తిగత సోపానంగా ఎప్పుడూ భావించలేదు. అపసవ్యతను సవ్యంగా చూపించడానికి, నాలోని సందేహాలను తీర్చుకోవడానికి నేను విమర్స చేశాను. అలాంటి విమర్శ నన్ను చాలా మందికి శత్రువును చూసింది. ఆ శత్రుత్వం వ్యక్తిగత స్థాయిలోకి కూడా వెళ్లింది. విమర్శను సహృదయతతో అర్థం చేసుకోనప్పుడు తెలుగుసాహిత్యంలో విమర్శ చేయడమంత పనికిమాలిన పని మరోటి ఉండదు. దానికితోడు, విమర్శ చేయడం వల్ల ఆ విమర్శకుడి సృజనాత్మక రచనలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. నేను రాసిన వెంటాడిన అవమాన కథ గత ఐదేళ్లుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎంఎ సిలబస్ దళిత సాహిత్యం విభాగంలో పాఠ్యాంశంగా ఉంది. ఇప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా అది ఎంఎ విద్యార్థులకు పాఠ్యాంశం. ఆ కథలోని నవ్యతను, కొత్త కోణాన్ని సాహిత్యకారులు పట్టించుకోలేదు. నా కథల పట్ల ఉదాసీనతను ప్రదర్శించారు. విమర్శ కఠినంగా చేయడం వల్ల నా కథలకు జరిగిన నష్టం అది.
16. ‘శిలువకు తొడిగిన మొగ్గ’ ‘ఎల్లమ్మ ఇతర కథలు’ ద్వార మీరు కథకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యారు కదా. ‘ఎల్లమ్మ ‘ కథ మీద చాలా చర్చ జరిగింది కదా! మీరు ఎల్లమ్మ కథ ద్వారా ఏమి చెప్పాలనుకున్నారు?
ఎల్లమ కథ ద్వారా ఏం చెప్పాలని నేను అనుకున్నానో చెప్పడం సరి కాదు. పాఠకులు ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. కానీ దార్ల వెంకటేశ్వర రావు తప్ప అంపశయ్య నవీన్, కాసుల లింగారెడ్డి కూడా దాన్ని సరిగా అర్థం చేసుకోలేదనే అనుకుంటాను. దానికి నేనేమీ నొచ్చుకోలేదు. కానీ, ఆ కథను ఇప్పటికీ కొన్ని ఇళ్లలో చదివిస్తున్నారు. మూఢనమ్మకాలతో ఇబ్బంది పడుతున్న అత్తాకోడళ్లకు సామరస్యం కుదర్చడానికి ఆ కథ కావాలని అడిగినవాళ్లు చాలా మంది ఉన్నారు. తాజాగా, కరీంనగర్ జిల్లాలో నేరెళ్ల శ్రీనివాస గౌడ్ తీసుకుని ఓ కుటుంబానికి చెందిన సభ్యులతో చదివించారు. నేను ఉద్దేశించిన లక్ష్యాన్ని ఆ కథ నెరవేరుస్తున్నదనే అనుకుంటున్నాను.
17. ‘తెలుగు నవల –వ్యాపార ధోరిణి’ అన్న మీ M. Phil సిద్ధాంత గ్రంథం ద్వారా మీ సామాజిక దృక్పథం స్పష్టంగా వ్యక్తమయ్యింది కదా. మీ నుంచి అటువంటి స్పష్టత వున్న నవలను expect చెయ్యొచ్చా?
తెలుగు నవల – వ్యాపార ధోరణి అప్పుడో సంచలనం. కృష్ణుడు, ప్రసేన్ పని కట్టుకుని దాన్ని ఉదయం సాహిత్యం పేజీలో సీరియలైజ్ చేశారు. ఆ సమయంలోనే నాకు వివి పరిచమయ్యారు. సికింద్రాబాద్ కుట్ర కేసును రిపోర్టు చేయడానికి మాడభూషి శ్రీధర్‌తో పాటు నేను వెళ్లాను. నాకు శ్రీధర్ వివిని పరిచయం చేశారు. అప్పుడు ఆ వ్యాసాల గురించి అడిగారు. అది ఎంఫిల్ థీసిస్ అని చెప్తే ఆయన కాపీ అడిగారు. నేను జైలుకు ఆ ఎంఫిల్ థీసిస్‌ను పంపించా. దాంట్లో ఆయన పెన్సిల్‌తో మార్క్ చేశారు. ఆ కాపీ ఇప్పటికీ నా వద్ద ఉంది. అయితే, పల్ప్ లిటరేచర్ గురించిన పొడగింపు చేయలేకపోయాను. మరెవరూ దాన్ని అందుకోలేదు. హిందూ పత్రికలో మాత్రం నన్ను కోట్ చేస్తూ ఓ వ్యాసం రాశారు. పొడగింపుగా అప్పుడే వస్తున్న టీవీ సీరియళ్ల గురించి ప్రస్తావించారు.
ఓ నవల రాయాలనే ప్లాన్ మాత్రం ఉంది. తెలంగాణ గ్రామాల నుంచి హైదరాబాదుకు జరిగిన వలసలు, హైదరాబాదులో రియల్ ఎస్టేట్, పౌల్ట్రీ అభివృద్ధి చెందిన తీరు, అది బడా వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన వైనం గురించి, ఆ తర్వాత హైదరాబాదు నుంచి, తెలంగాణ పల్లెల నుంచి అమెరికాకు వలసపోవడానికి సహకరించిన సాఫ్ట్‌వేర్ వ్యవహారం గురించి రాయాలనే ప్లాన్ అది. ఓ మూడు రోజులు నిద్ర మానేసి 30 పేజీల దాకా టైప్ చేశా. వెంటనే జ్వరం వచ్చేసింది. భయపడి దాన్ని నాలుగైదేళ్లుగా అలాగే ఉంచేశాను. అది పూర్తి చేయాలనేది నా కోరిక.
ప్రతాప్ గారూ:
విమర్శ కఠినంగా వుండడమే మనకి కావాలి. వూరికే పొగడడం వల్ల నేర్చుకునేది సున్నా. మీలాంటి వారు కూడా నిరాశ పడి, వెనక్కి తగ్గితే ఇంకా కొత్త తరం విమర్శకులు ఏమనుకోవాలి? ఆలోచించండి.