ఈ మలయాళీ కవిత చదువుతుంటే మనకు నవ్వుగా అనిపించినా, కవి చూపిన చమత్కారం అందులోనే ఉంది. ఇందులో చాలా సున్నితమూ, సునిశితమూ అయిన విమర్శ ఉంది. ఆవుని ఒక ఆసరాచేసుకుని కవి సమాజాన్నీ, అందులో భాగస్వాములమైన మనలనందరినీ ఎంతఘాటుగా విమర్శిస్తున్నాడో గమనించండి.
మనందరికీ స్వాతంత్ర్యమంటే ఇష్టమే. వీరావేశముకూడా ఎత్తుతూంటుంది ఏడాదికి రెండుసార్లో మూడు సార్లో. మన ఆలోచనల్లో ఈ దేశానికి పట్టిన దరిద్రాన్ని వదిలించడానికి మనం కొన్ని వేల పథకాలు రచించి ఉంటాము కూడా. కానీ, మన స్వతంత్రేఛ్చకూడా పైన చెప్పిన ఆవు లాగే బంధనాలను ఎలాగైనా ఛేదించుకోవాలని ఉవ్విళ్ళూరుతుంది. మనం ఒకటిరెండు చిన్నపాటి ప్రయత్నాలు చేస్తాము. అదికూడా కాసేపే. వద్దన్న పని చెయ్యడం, ఒకరు తప్పన్నది రైటని వాదించడం, సిద్ధాంతమని ప్రకటించినదానిలో తప్పులు వెదకడం చేస్తుంటాం. మంచిదే. అసలు మార్పు అన్నది అటువంటి వాటిద్వారానే వస్తుంది. కానీ, మన స్వేచ్ఛాప్రకటన, కట్టుబాట్లని ఎదిరించడంలోనే తప్ప, దానివెనకగల తాత్త్విక చింతనలోని చెడు ఏదైనా ఉంటే దాన్ని ఖండించడానికో ఎదిరించడానికో చెయ్యం. ఈ లాంఛనప్రాయమైన తిరుగుబాటుతో మనకి సంతృప్తి వస్తుంది. మళ్ళీ మన పూర్వ జీవితానికి రాజీ పడిపోతాం. మనం ఏది తప్పుకాదని మన పెద్దలనీ, మన చిన్నప్పటి సమాజాన్నీ ఎదిరించేమో, బహుశా మనపిల్లలకి అవే తప్పులని చెబతాము కూడా. నిజాయితీగా ఎదిరించలేని సంప్రదాయపు శక్తి అలాంటిది. ఇది సంప్రదాయమే కానక్కరలేదు నిజానికి. అది సమాజం విధించిన కట్టుబాట్లు కావచ్చు, మతం, శాస్త్రం విధించిన కట్టుబాట్లు కావచ్చు, చివరకి విజ్ఞానం ప్రకటించిన పరిమితులు కావచ్చు. మనం చివరకి ఆ శక్తికి బానిసలుగా ఉండడానికే ఇష్టపడతాం. కొంతమంది మాత్రమే అన్ని రకాల భావదాస్యాలనుండి విముక్తులై జీవితాంతమూ నిజమైన స్వేఛ్ఛని అనుభవించగలరు.
సరిగ్గా ఇదే భావనని కవి చాలా సమర్థవంతంగా చెప్పాడు ఈ కవితలో. తర్వాత మనం మన బానిసత్వంలోనే అనందాన్ని వెతుక్కుంటాం. ఇంత సీను ఉందా ఈ కవితలో అని కొందరికి అనిపించవచ్చు. చతురుడైన కవి తన కవిత తాత్పర్యాన్ని వాచ్యం చెయ్యకుండా, Treasure Hunt ఆటలో లా కొన్ని గుర్తులు అక్కడక్కడ ఉంచి వదిలెస్తాడు.
మొట్టమొదటి వాక్యం చూడండి…”కనీసం ఒక్కరోజైనా… పొరబడే అవకాశం ఉంది” అంటే, మనది Token స్వాతంత్రేఛ్ఛ. నిజమైనది కాదు. మన బలహీనతల్లోంచి … మనకు అనిపించినపుడో, పక్కవాడు వెక్కిరించడమో, ఆక్షేపించడమో చేసినపుడో, ఒక్కసారి ఒళ్ళు విదుల్చుకుని కాసేపు మనకీ స్వాతంత్ర్యం ఉన్నట్టు ప్రకటించడానికి ప్రయత్నిస్తాము.
చివరి వాక్యం చూడండి: “ఆ రెండు కిలో మీటర్ల పరుగునే స్వేఛ్చ అని నెమరువేసుకుంటుంటుంది ఎప్పుడూ”. మన స్వాతంత్ర్యప్రకటనకూడా పదిమందితో కలిసి నినాదాలివ్వడంతొనో, రాస్తారోకోలుచెయ్యడంతొనో, ముగుస్తుంది. అంతకుమించి ఎక్కువగా ప్రయత్నించం. ప్రయత్నించడానికి మన ఉద్యోగాలూ, మన అవసరాలూ అడ్డొస్తాయి మరి.
*** * ***
కర్రి ఆవు
కనీసం ఒక్క రోజుకైనా బంధనాలు విదిల్చుకుని పారిపోకపోతే
మనం స్వేఛ్ఛాకాముకులం కాదని
పొరపడే అవకాశం ఉంది…
అందుకనే నేమో
మా మేనత్త పెంచుకునే కర్రావు
కొబ్బరిపీచు పలుపు తెంచుకుని
అప్పుడప్పుడు పారిపోతుంటుంది
ముందు కర్రావూ,
వెనక మా అత్తా
పరిగెడుతుంటే, చూడాలీ!
ఎదురొచ్చినదేదైనా
రెండుముక్కలయిపోతుందేమోనని
అందరూ పక్కకి ఒక్కటే పరుగుతీస్తారు.
“బాబాయ్ దాన్ని పట్టుకో!
ఒరే అబ్బాయ్ దాన్ని ఒకసారి అందుకో”
అంటూ మా అత్త కేకలేస్తుంటుంది.
అసలు సంగతేమిటో అర్థమయేలోగా
అత్తా ఆవూ ఇద్దరూ సుడిగాలిలా పారిపోతారు.
ఒక రెండు కిలో మీటర్లు
అలా పరిగెత్తిన తర్వాత
ఆవుకి దాని స్వాతంత్రేఛ్ఛ తీరుతుంది.
చివరకి రొప్పుతూ, రోజుతూ అది ఆగుతుంది,
“ఎంత ఏడిపించావే”
దాని వీపుమీద దెబ్బ పడుతుంది
తర్వాత ఇద్దరూ ఇంటిదారి పడతారు.
అచ్చప్ప దుకాణం దగ్గర
టీ చప్పరిస్తున్న వాళ్లంతా
ఈ సాధు జంతువులను
ఆశ్చర్యంతో
కళ్ళప్పగించి మరీ చూస్తారు
“రెండు క్షణాలక్రింద
అంత హాడావుడిగా పరిగెత్తింది
వీళ్లిద్దరేనా?” అని
బహుశా, ఆ పశువు
ఈ రెండు కిలోమీటర్ల పరుగునే “స్వేఛ్ఛ”గా
నిరంతరం నెమరువేసుకుంటోందేమో!
విష్ణు ప్రసాద్ (మలయాళీ కవి)
*** * ***
The Cow
Unless it breaks free and scoot
At least for a day,
it could be mistaken for a
total lack of
desire for freedom
Aunt’s cow
Escaped from the coir noose
And ran away occasionally
just for that!
The cow in the front …
The aunt running behind
As if everything else on the way
Will be forked down!
And all give way …
‘Stop it please
Catch it please’
The aunt blares.
By the time you make it out
both would have whizzed past.
A scamper just for two kilometers!
The cow’s liberaton requirement is met!
The cow halts wheezing and panting.
‘Damn the cow!’
a blow strikes its back.
And then….
Both begin the journey back home
Lazily at their own pace
Onlookers
Sipping hot tea at
Achuettan’s
Tea stall
Roll the eyes in
Astonishment
at the gentle beings -
‘Are they the same as
those who stormed past
a while ago?’
It could be the two kilometre lap to freedom
that the cow for ever seems to chew like cud.
Malayalam Original: Vishnu Prasad
English Translation: Jayashree Thottekkat
అద్భుతమైన కవిత మూర్తిగారూ. మీరనట్టు, పాఠకుడికి మొదటి వాక్యం మీద ఆఖరు వాక్యం మీదా సరైన గురి కుదరలేదో, ఇది కేవలం మన పల్లెటూళ్ళల్లో నిత్యమూ చూసే ఓ మామూలు సంఘటనై పోతుంది. అలా చూసినా కవిత ఆహ్లాదంగానే ఉందనుకోండీ..కానైతే, మన స్వేఛ్ఛా కాంక్ష మూలాలను కుదిపే సునిశితమైన విమర్శా ధోరణిలో సాగిన కవితగానే ఇది మరింత అర్థవంతమైనదనడం నిస్సందేహం.
మీ వివరణ , విశ్లేషణ కవితను మరింత విపులీకరించిందండి. మంచి కవిత!
మంచి చమత్కారంగా ఉంది.
ఈ సాధు జంతువులను
ఆశ్చర్యంతో
కళ్ళప్పగించి మరీ చూస్తారు
“రెండు క్షణాలక్రింద
అంత హాడావుడిగా పరిగెత్తింది
వీళ్లిద్దరేనా?” అని
ఆవు మనకు ఉదాహరణగా చూపెడితే మరి అత్త ఈ వ్యవస్థా! కానీ రొండు సాదువులే అయితే స్వేఛ దేని నుంచి? ఎందుకు?
మంజరి గారూ,
మంచి అబ్జర్వేషను చేశారు. ఇక్కడ “రెండు సాధుజంతువు”లన్న ప్రయోగం ఆ క్షణంలో అవి ప్రశాంతంగా పోతున్న సందర్భానికి వర్తిస్తుంది. అంతవరకే. అది అంతకుముందు వర్ణించిన స్థితికీ ఇప్పటికీ వ్యత్యాసాన్ని చూపడానికే. వాటి సహజలక్షణాన్ని సూచించే విశేషణం కాదు.
నిజానికి వ్యవస్థ అత్త లాంటిది. సందేహం లేదు. అందుకే కొన్ని సందర్భాలలో ప్రజలు కొన్ని సమస్యలపట్ల తీవ్రంగా స్పందించినపుడు దాని కన్నుసలలో, అదుపు ఆజ్ఞలలో ఉండేటట్లు బంద్ లకీ, రాస్తా రోకోలకీ తను తీవ్రంగా స్పందించకుండా అనుమతులుకూడా ఇస్తుంటుంది. దానికి తెలుసు ఆవులాంటి సాధుజంతువులమైన మనకందరికీ ఈ ఆవేశం క్షణకాలమని. అందుకే సామాన్యులపట్ల దాని స్పందన ఒక లాగ ఉంటుంది. [అదే నక్సలైట్లవంటి వారి విషయం తీసుకొండి. వాళ్ళ లక్ష్యాలూ, వాళ్ళ ఆవేశ తీవ్రతా స్థిరంగా ఉంటాయి]. పలుపుతాడు మెడకు బిగించి ఆవుని రాటకి కట్టి ఒక వృత్తపరిధిలోనే, అందులోనూ తను అనుమతించిన రీతిలోనే ఉంటూ, తను వేసిన (అందించిన పథకాల) మేత తింటూ, తిరిగి తనకు అధికారం అనే పాలు ఇవ్వడానికి అత్తలా, వ్యవస్థకూడా (అంటే ఇక్కడ కేవలం రాజ్యాధికారమే, అది ఏ పార్టీదయినా) ప్రయత్నిస్తుంది. ఆ వృత్త పరిధిలో మసలుతున్నప్పుడు అప్పుడప్పుడు వ్యవస్థమీద చిరాకు వేస్తుంటుంది. అదిగో ఆ చిరాకు వేసినపుడు స్వాతంత్ర్యంకోసం చిన్నపోరాటం మొదలవుతుంది. కానీ, బయటకు పోతే, అన్నీ తనే సంపాదించుకోవాలి. గడ్డీ కుడితీ, నీరూ అంత స్వేచ్ఛగా దొరికేవి కావు. మీదుమిక్కిలి ఇంటిదగ్గర పడి ఉండడంలో ప్రాణరక్షణ ఉంది. బయటకిపోతే తన్ను తనే రక్షించుకోవాలి. దానికి కొంత సాహసం, ఆత్మస్థైర్యంతో పాటు, సుఖాన్ని త్యాగంచేయగల మానసిక సంసిద్ధత కావాలి. అందుకే మళ్ళీ వ్యవస్థకే దాసోహం అని మనలాంటి వాళ్ళం తాత్కాలిక ఆవేశాలు చల్లారిన తర్వాత రాజీ పడిపోతాం.
మీ స్పందనకు ధన్యవాదాలు.
మీరు ఇచ్చిన వివరణ చాలా, చాలా నచ్చింది.
కవితపై మీ విశ్లేషణ, మంజరి గారి ప్రశ్నకి ఇచ్చిన వివరణా రెండూ చాలా అర్ధవంతంగా ఉన్నాయండీ.