కవిత్వం

తరణోపాయాలు

ఫిబ్రవరి-2014

ఇవి తెరిపినీయక కురిసే ఆర్ద్ర క్షణాలు
తడవక తప్పదు!
అనాదిది ఈ నిరంతర కాల జీవన ధార
తరించక తప్పదు!

నేను రోజూ పొద్దున్నే
నా పెరటి లోని పొదరింటి పందిరికి పూసిన
పూల తడిని కోసుకునేందుకు వెళ్తుంటాను
అప్పుడు, తొలి తెలి కిరణశరం తుహిన కణాన్ని ఛేదిస్తుంటుంది
రాలి పడుతున్న క్షతగాత్ర వర్ణాలను దోసిళ్ళలో పట్టుకొని
నేను ఏడు రంగుల సీతాకోక చిలుకలను ఎగిరేస్తుంటాను!
నా ఆకలి కళ్ళు అరుణ రాగాల కోసం
గులాబి గుండెను గుచ్చి గుచ్చి చూస్తుంటాయి
నా ముని వేళ్ళు చిందిన రక్త బిందువులను చూచుకుంటూ
రోజా మొక్క మొగ్గ తొడిగిందని మురిసిపోతుంటాను!
రాత్రంతా ఆనందభాష్పాలు వర్షించి ఉంటాయని
తొలి మసకలోనే ఇంటి లోగిలినంతా వెదుకుతుంటాను
రేయి కార్చిన నీలి అశ్రువులతో నేల తడిసి ఉంటుంది
నేను నా అరుగులను అలికి అందగించుకుంటాను!
నా వాకిళ్ళలో వరువాత చల్లిన తెలి ముగ్గులు
పొరుగిళ్ళ ముంగిళ్ళ లోకి ప్రవహించి ఉంటాయని
కన్వేగు వేళలో కదలి పోతుంటాను
అక్కడ, ముగ్గుబుట్ట విరిగిపడి ఉంటుంది
నేను చెదిరిన ముత్యాలను ఏరుకుంటాను!
సుప్రభాతాలు పాడే తరు శాఖలకు
కువకువ శ్లోకాలు కాసి ఉంటాయని
వేకువ చెట్ల గుండా నడచి వెళ్తుంటాను
కాకి ఈక ఒకటి నా నెత్తిన రాలి పడుతుంది
నేను హంస తూలికా మృదు స్పర్శలను భావిస్తుంటాను!
కాసిన్ని క్షణాల దూరంలో
ఏటి నీటి మీద నా పూల నావ తేలుతుంటుంది
తెడ్డు కనిపించదు, తెరచాప ఎగురదు
నేను పడవలో చిట్లిన పుపొళ్లు ప్రోగు చేస్తుంటాను!

ఓ వటపత్రశాయీ!
చేతిలో ఎన్ని మఱ్ఱాకులుంటే అంత మంచిది;
ఆకులు చిరు తరగ తాకిడికే చిరిగిపోతుంటాయి!