సమీక్ష

అత్తర్ల గుబాళింపు ‘అధూరె’

మార్చి 2014

స్త్రీ, దళిత, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలకు లేని అనేక ప్రతిబంధకాలు ముస్లిం మైనారిటీ వాదానికి ఉన్నాయి. దేశ స్వాతంత్య్రోద్యమ నాయకులుగా చలామణీ అయిన భారత దళారీ పాలకవర్గం వలసవాదుల బాట నడిచి కొంత, కుట్రలకు తలొగ్గి కొంత ద్విజాతి సిద్ధాంతాన్ని తలకెత్తుకొని దేశవిభజనకు చేతులెత్తినరు. విభజన జరుగకూడదని కాదు, అది మతప్రాతిపదికగా జరగడం దారుణం.అప్పుడు చెలరేగిన హింస, మారణహోమం, అమానవీయ ఘటనలు మళ్లీ అదే పాలక వర్గాలకు ఓటు బ్యాంకుగా మారినవి. వలసవాదులనుంచి విస్తరణవాదాన్ని ఒంటవట్టించుకున్న భారత పాలకవర్గాలు అటు కాశ్మీర్‌, ఇటు హైదరాబాద్‌ ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కును భుక్తం చేస్తూ దురాక్రమణచేసి తమ అఖండభారతంలో కలుపుకోవడం జరిగింది. అట్లా ఇక్కడ మిగిలిపోయిన ముస్లింలను హిందూ మతోన్మాదులు పరాయి దేశస్థులుగానే పరిగణించసాగారు. దాన్ని తిప్పికొట్టాల్సిన ముస్లింలు కూడ కొండొకచో( భారత, పాకిస్థాన్‌ దేశాల మధ్య జరిగే క్రికెట్‌మ్యాచ్‌ల సందర్భంలో)పాకిస్థాన్‌ అనుకూల వైఖరి ప్రదర్శించి మధ్యేమార్గంగా వున్న లౌకికవాదులనుంచి కూడ దూరమైనరు.దీన్ని ఆసరాగా తీసుకున్న పాలకవర్గాలు ఇరువర్గాల్ని రెచ్చగొడ్తూ పబ్బం గడుపుకోవడం జరుగుతూ వుంది(1990లో మర్రి చెన్నారెడ్డిని సీయం కుర్చీ నుంచి దించడానికి ఒక జాతీయపార్టీ నాయకుడు స్థానిక మతతత్వ పార్టీతో మిలాఖతై చేయించిన మతఘర్షణల లాంటివి).

అట్లాంటి ఒక ప్లానే కాశ్మీర్‌ యుద్ధం, కొనసాగింపే బంగ్లాదేశ్‌ విభజన, బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్‌ మారణకాండ. చాలా చిత్రంగా మతతత్వం ప్రాతిపదికగా ఏర్పడ్డ ఆర్‌.ఎస్‌.ఎస్‌, దానికనుబంధంగా ఏర్పడ్డ బి.జె.పి.ని గాని, రజాకారు రాకాసి మూకల కొనసాగింపైన యం.ఐ.యం.ని గాని ఘతవహించిన లౌకికఘనతంత్ర రాజ్యం నిషేధించకుండా, కొండొకచో పొత్తులు పెట్టుకుంటూ మతానుబంధంగా రాజకీయపార్టీలు ఏర్పడడానికి లెజిటిమసీని కల్పించినవి. ఇక్కడ హిందూ మతోన్మాదులు కాని, మధ్యేమార్గంగా ఉన్నామని చెప్పుకునే పాలకవర్గ పార్టీలు కాని భారతదేశ ముస్లింలకు ఈ నేలమీద హక్కులున్నాయని కూడ భావించడం లేదు. మీ దేశానికి మీరు పోకుండా వున్నందుకు గాను,మా దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన జాతి మీది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన అస్తిత్వ ఉద్యమాలకు ముస్లిం మైనారిటీ అస్తిత్వ ఉద్యమానికి వున్న మౌలికమైన తేడా ఇదే.ముస్లిం మైనారిటీ అస్తిత్వ ఉద్యమం విస్త ృత ప్రజాబాహుళ్యపు ఆమోదం పొందకపోవడానికి ఇదొక కారణం. మెజారిటీ ముస్లిం ప్రజలు మతపెద్దల(ముల్లాల) చేతుల్లో బందీలై, మతమౌఢ్యపు చీకటి కొట్లల్లో మగ్గిపోవడం మరొక కారణం. కాబట్టి భారతదేశపు ముస్లింలు ఏక కాలంలో రెండు యుద్ధాలు చేయాల్సివుంటుంది. ఒకటి హిందూ మతోన్మాదాన్ని ఎదిరిస్తూ, మానవీయమైన సమాన హక్కుగల అస్తిత్వం కోసం పోరాడడం, మతం మత్తుమందును వదిలించుకొని, ముల్లాల బంధాలు ఛేదించుకొని లౌకికవాద దృక్పథాన్ని పెంపొందించుకోవడం, అట్లాంటి శక్తుల్ని పునరేకీకరణ చేయడం.

అట్లాంటి దృక్పథాన్ని స్కైబాబ కలిగివున్నాడని చెప్పడానికి ఆధారమైన కథలు ‘అధూరె’ లో వున్నయి. అయితే,అది అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, సమాజంనుంచి,రాజ్యాంగ వ్యవస్థనుంచి కొన్ని పాక్షిక ప్రయోజనాలు పొందడానికిపనికొస్తుంది కాని, అంతిమంగా ఆ జాతి విముక్తికి కావాల్సిన ప్రత్యేక రాజకీయార్థిక దృక్పథాన్ని అందిస్తుందా అన్నదే ప్రశ్న.అస్తిత్వ ఉద్యమాలు అనివార్యంగా విశ్వజనీన విముక్తి ఉద్యమాలల్లో అంతర్భాగంగా పనిచేయాల్సి వుంటుందా అనేది చర్చించాల్సిన విషయమే. అయితే, ముస్లింలవే ముఖ్యంగా ముస్లిం స్త్రీలవే అయిన సమస్యల్ని చర్చకు పెట్టడంలో ‘అధూరె’ ద్వారా స్కైబాబ కృతకృత్యుడయ్యిండు. అయితే, ‘అధూరె’ ముస్లిం కథలు అన్నడు గాని, ప్రాంతీయ నిర్దిష్టతను ఎందుకు విస్మరించిండో అర్థం కావడం లేదు. సార్వజనీన సమస్యలే అయినా, వాటికి ఒక స్థల,కాల నిర్దిష్టత అవసరమని స్కైకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా.అట్లా చూసినప్పుడు ‘అధూరె’ తెలంగాణ ముస్లిం కథలు అని వుండాల్సిందేమో?

‘అధూరె’ సంకలనంలో మొత్తం పన్నెండు కథలున్నయి. ఇందులోని పాత్రలైన ముస్లిం స్త్రీలకు దీన్ని అంకితమివ్వడంబట్టి చూస్తే , అవి ఆ స్త్రీలకు సంబంధించిన కథలే అని తెలుస్తుంది. అంటే, తన కుటుంబ సభ్యుల, మిత్రుల వైయక్తిక అనుభవాల్ని స్కై కథలుగా మలిచాడని తెలుస్తుంది. దీన్ని “objectification of subjective experiences”గా పరిగణించాల్సివుంటుంది. ‘ఛోటీ బహన్‌’ ,’మొహబ్బత్‌ 1421 హిజ్రి’ అనే రెండు కథలు కూడ ముస్లిం మత సాంప్రదాయమైన బుర్ఖా పద్ధతినినిరసిస్తూ రాసినవే. ఇంటి చాకిరీ చెయ్యనని, బుర్ఖా వేసుకోనని, ఉన్నత చదువులు చదువుకుంటానని తల్లిదండ్రులతో, సమాజంతో పోరాడుతున్న చెల్లెకు అండగా నిలబడ్డ అన్న , ఆమె పెళ్లి తర్వాత చెల్లెతో పాటు తను కూడ వ్యవస్థ కట్టుబాట్లకులొంగిపోయిన విషాదాన్ని చిత్రించిన కథ ‘ఛోటీ బహన్‌’. సున్నితమైన మానవ సంబంధాల్ని హృద్యంగా చిత్రించిన కథ. నెట్‌లో పరిచయమైన అమ్మాయితో ప్రేమలో పడ్డ అబ్బాయికి ఆమె బుర్ఖాతో దిగిన ఫోటో పంపడం ‘మొహబ్బత్‌ 1421 హిజ్రి’లోని కథ. ఒక సాదాసీదా వస్తువుకు ఫ్లాట్‌ పాత్రలతో నడిపిన సాదాసీదా కథనం.
పేదముస్లిం కుటుంబాల్లో( నిజానికి ఏ పేదకుటుంబంలోనైనా) ఆడపిల్లల పెళ్లి ఎంత విషమసమస్యో తెలియజెప్పేవి ‘కబూతర్‌’ ‘ఖిబ్లా’ కథలు. భర్తను పోగొట్టుకున్న పేద ముస్లిం స్త్రీ ఆడపిల్లల పెళ్లిల్ల కోసం పడే యాతన ‘కబూతర్‌’లో కనిపిస్తది. కథ చదువుతున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరగడం నాకు గర్తుంది. అయితే, ముగింపు చాలా కృతకంగా తెలుగు సినెమాలో లెక్క వుంది. చెల్లెల్ల పెళ్ళిల్లకు డబ్బులు సంపాదిద్దామని దుబాయ్‌ పోయి మాయమైన పేద ముస్లిం కథ ‘ఖిబ్లా’.

మంచి కథా వస్తువుతో అద్భుతంగా నడిచి గొప్ప ముగింపును చూపిన కథ ఇది. గరీబు ముస్లిం యువకుడి విఫల ప్రేమల సఫల వ్యక్తీకరణ ‘మజ్బూర్‌’ , ‘ఉర్సు’ కథలు. ఇవి రచయిత వైయక్తిక అనుభవాలని చెప్పడానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు. అయితే, ఉర్సు కథలో ఇద్దరి ముస్లింల మధ్య కాకుండా, హిందూ ముస్లింల ఉమ్మడి సాంస్క ృతిక ప్రతీకగా నిలిచిన ఉర్సును దృష్టిలోవుంచుకొని ఇద్దరిని చెరొకమతానికి చెందినవాళ్ళుగా చిత్రించివుంటే మరింత గొప్పగా వుండేది. ఏ గొప్ప కళ అయినా వాస్తవానికి దగ్గరగా వుండాల్సిందే. కాని యధాతథంగా వుండాల్సిన అవసరం లేదు. సత్యం, సంభావ్యతల ఆధారంగా వాస్తవానికి ఒకింత కల్పన జోడించినప్పుడే అది అద్భుతమైన కళ అవుతుంది. పేదరికం ముస్లిం యువకుల్ని దుబాయి పోవడం ఎట్లా అనివార్యం చేసినవో చెప్పిన కథలు ‘భడక్తా చిరాగు’ , ‘వతన్‌’. ఆర్థిక సమస్యలు, భార్యకు దూరంగా
వుండాల్సి రావడం పురుషున్ని పరస్త్రీ వ్యామోహంలో పడేస్తే, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని తెలిసిసప్పుడు అతను తన తప్పును సరిదిద్దుకోవడం భడక్తా చిరాగు లో కనిస్తుంది. వస్తుపరంగా,శిల్పపరంగా సమతూకంలో వున్న మంచికథ ఇది. తను దుబాయి పోవడాన్ని నిందించిన హిందూ మిత్రుడు అమెరికా పోవడం మీద ఆగ్రహం చెందిన ముస్తిం యువకుడి కథ ‘వతన్‌’. రచయిత దీన్ని మాతృదేశం మీద ప్రేమ కోణంలో వ్యక్తీకరించిండు. కాని, బారతదేశ పౌరులు దుబాయికో లేదా ప్రపంచంలోని ఇతర దేశాలకో బతుకు దెరువు కోసం పోవడానికి, అమెరికాకు పోవడానికి మధ్యవున్న మౌలికమైన తేడాను విస్మరించిండు. ఆర్థిక, సాంస్క ృతిక సామ్రాజ్యవాద ప్రపంచీకరణతో తృతీయ ప్రపంచ ప్రజల మూలుగపీల్చే అమెరికా చేతిలో ఆయుధమవ్వడానికి బతుకు దేరువుకోసం ఇంకో దేశానికి పోవడానికి వున్న తేడా పెట్టుబడి, దోపిడీకోణంలోంచి చూడాల్సి వుంటుంది.

ముస్లింవాద రాజకీయ కార్యాచరణను, దానికి కావాల్సిన తాత్విక భూమికను వ్యక్తీకరించే కథలు ‘వెజిటేరియన్స్‌ ఒన్లీ’ ‘దస్తర్‌’.ఈ రెండు కథలు కూడ సమాజంలో వేళ్ళూనుకుపోయిన నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ మీద ధిక్కారాన్ని ప్రకటిస్తూ, ఈ దేశంలో ముస్లింలకు అసలైన మిత్రుడు దళితుడే అని చెప్తవి. బహుశ, తెలంగాణకు సంబంధించినంత వరకు గతంలోకింది కులాలే ఎక్కువగా మతం మార్చుకొని ముస్లింలుగా మారడం వల్ల కావచ్చు. రాజ్యహింసకు సంబంధించిన కథ’దావా’

అయితే, ఇందులో స్థల కాల వాతావరణ ఐక్యత లోపించింది. గొడవల్లో ముస్లిం యువకున్ని పోలీసులు నిర్భంధించి స్ఠేషన్‌లో పెట్టడం, అతని కోసం తల్లి రావడం ఇందలి కథ. అయితే, గొడవలు ఎక్కడ,ఎందుకు, ఎలా జరిగాయో తెలుపడు.వామపక్షతీవ్రవాద భావజాలం కలిగివున్నరన్న కారణంగా అనేక మంది యువకులు తెలంగాణలో అదృశ్యమైతున్న వాస్తవం వుంది. కాబట్టి సంఘటనేదో బ్యాక్‌డ్రాప్‌లో చెప్పివుండాల్సింది. సాధారణం బదులు నిర్దిష్టతను వర్ణించాలి. అమూర్తమైన దాన్ని మూర్తంగా చిత్రించాలి. ప్రతీక కోసం కాకి, కుక్కలను వాడుకున్నడు. కథలో తుపాకి గోడకు వేలాడుతున్నదంటే, దాన్నిఖచ్చితంగా పేల్చాలి అన్నట్టున్నది. ప్రయోగం కోసమే చేసిన ప్రయోగం ‘జీవం’ కథ. స్కై లాంటి ఉద్యమ కార్యకర్తనుంచి ఇట్లాంటి కథ రావడం వల్ల పెద్ద ప్రయోజనమేమీ వుండదు.

తెలుగు సాహిత్యంలో విప్లవోద్యమంతో సహా, ఉద్యమ సాహిత్యంలో కళాత్మక నిర్మాణం పట్ల తక్కువ శ్రద్ధచూపించారు. ఇప్పుడైతే కళాత్మక విలువల గురించి మాట్లడితేనే నేరంగా పరిగణిస్తున్నారు. ఇట్లాంటి స్థితిలో, “What wedemand is the unity of politics and art, the unity of content and form, the revolutionary political conent and the highest possible perfection of artistic form. works of art which lack artistic quality have no force, how ever progressive they are politically. Therefore, we appose both the tendency to produce works of art with a wrong political view point and the tendency towards the “postar and slogan style” అన్న మావో సేటుంగుమాటల్ని గర్తుచేసుకోవాలి. అట్లా అని చెప్పి ప్రతి కథ మపాసా ‘నెక్లెస్‌’ లాగనో, గొగోల్‌ ‘క్లోక్‌’ లాగనో, టాల్‌స్టాయ్‌ ‘గాడ్‌ సీస్‌ది ట్రూత్‌ బట్‌ వెయిట్స్‌’ లాగనో, ఓహెన్రీ ‘లాస్ట్‌ లీఫ్‌’ లాగనో వుండాలని కూడ నేనేం అనడం లేదు.కాని, వస్తువు,ఇతివృత్తం ఎత్తుగడ, ముగింపు, సంఘటన, సంఘర్షణ, నడక, పట్టు, విడుపుల సమతూకం, స్థల కాల వాతావరణాల ఐక్యత మాత్రంకథకు కచ్చితంగా అవసరమౌతుంది. ఇక రెండో విషయం భాష. ఏ మాత్రం పరిచయమున్నా ఈ కథల్లో వాడిన భాషనుబట్టి రచయిత నల్లగొండ పట్టణం, ఆ పరిసర ప్రాంతాల వాడని ఇట్టే చెప్పొచ్చు. అట్లా ఆ ప్రాంత ముస్లిమేతరుల భాషను అద్భుతంగా వాడుకున్నడు. భాష ఒక కమ్యూనికేట్‌ చేసే సాధనమే. కాని, అది ఆ కర్తవ్యం నేరవేర్చాలి కదా! ఈ మధ్య కాలంలో ఒక పేషంట్‌ నాతో ‘సార్‌! పాపకు బెడ్డు పడుతుంది’ అని చెప్పింది. చాలా సేపటి వరకు ఆమె ఏం చెప్తుందో నా కర్థంకాలేదు. ముక్కులోంచి రక్తం పడుతుంది అని ఆమె చెప్పాలనుకుంది. ఈ వక్రీకరణ (బ్లడ్‌కు బదులు బెడ్డు) అంగీకారమేనా? అట్లాంటి భాషనే స్కై ఈ కథల్లో ఉపయోగించిండు. పొయ్‌నయ్‌, లేషిన,నౌక్‌రీ, బాదనిపించింది, సంబందం, విజా, కూసానున్నది ఇట్లాంటివే ఇంకొన్ని. తెలంగాణ తనదే అయిన భాషను స్థిరీకరించుకుంటున్నప్పుడు ఈ ప్రయోగం ఎక్కడ తేలుతేందో?అఫ్సర్‌ ముందుమాటలో అన్నట్టు ఇది ‘సాహిత్య భాష వైఫల్యాన్ని చెప్పే ప్రయత్నమా?’

‘ఎక్కడన్నా విన్నారా, కవులు తమ సొంత పుస్తకాలు కాక, సంకలనాలు వేయడం’ అంటూ కె.శ్రీనివాస్‌ స్కైమీది ప్రేమతో రాస్తున్నాడు గాని, ‘గోలకొండ కవుల సంచిక’ వేసిన సురవరం ప్రతాపరెడ్డి తను చనిపోయే వరకు కూడ తనకవిత్వాన్ని వేసుకోలేదని, 2012 లో సంగిశెట్టి పూనుకునే దాకా సురవరం కవిత్వం వెలుగు చూడలేదని శ్రీనివాస్‌కు తెలుసు కదా!

అయితే, షాజహాన అన్నట్టు ‘తెలుగు సాహిత్యంలో అచ్చం ముస్లింల జీవితాల పై ముస్లిం వెలువరించిన”అధూరె’ కథలు ముస్లింల పేదరికాన్ని, జీవన సంఘర్షణను చిత్రికపట్టి చూపుతయి. సాంస్క ృతిక అత్తర్ల గుబాళింపును వ్యాపింప చేస్తయి. ముస్లిం మైనారిటీ అస్తిత్వవాదాన్ని మరింత ముందుకు తీసుకపోవడానికి ఉపకరిస్తయి. అట్లా స్కై కృతకృత్యుడైనట్లే. ఆకాశమే హద్దుగా స్కై సాగిపోవచ్చు.