కవిత్వం

అనుక్షణికాలు-10

జనవరి 2013

For last year’s words belong to last year’s language
And next year’s words await another voice. (T.S. Eliot).

1
వెళ్లిపోతున్నప్పుడు
తనేమీ చెప్పలేదు
‘సరే, ఇక వుంటాన్లే’ అని కూడా!

2
ఎన్ని సార్లు అలా వచ్చి
ఇలా వెళ్లిపోలేదని!
వచ్చిన ప్రతిసారీ అనుకున్నానా
అలాగే ఇక్కడే వుంటావని!

వెళ్ళిన ప్రతిసారీ అనుకున్నానా
ఇలాగే ఎక్కడికో వెళ్లిపోతావని!

3
ఆశ్చర్యం కాని క్షణం
వొక్కటంటే వొక్కటి
వుందా చెప్పు!
ప్రతీ క్షణం సతమతమే
ఇంకో కొత్త క్షణాన్ని
అర్థం చేసుకోడానికి!
లేదంటే సొంతం చేసుకోడానికి!

4
ఈ వొక్క క్షణం దాటేశానా,
ప్రతి దిగులూ
కొండ దిగి వెళ్లిపోతుందిలే, ఎటో!