పడుగు

ఒక కాలం కన్న కవి

ఏప్రిల్ 2014

ప్రాచీన కాలం నుంచి మొదలుకొని ఏ సమాజంలోనైనా కవులకు అత్యంత ప్రాధాన్యత వుంది. చాలా సందర్భాల్లో కవులు సమాజ గమనాన్ని నిర్దేశిస్తూ వస్తున్నరు. చరిత్ర పుటలు తిరగేస్తే కవులే తత్త్వవేత్తలు, తత్త్వవేత్తలే కవులుగా తీర్చిదిద్దబడ్డ వైనం గమనించవచ్చు. ఒక్క మినహాయింపును మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదే ప్లేటో గురించి – కవులని నిషేధించాలన డానికి ఆయన కారణాలు ఆయనకు వున్నయి. కాని కవిత్వం యొక్క ప్రాధాన్యత ఆయన తర్వాత కూడా కొనసాగింది. కారణం,

Poetry is simply the most beautiful, impressive and widely effective mode of saying things and hence its importance- Mathew Arnold

ఆధునిక వచన కవిత్వం గాని, చిత్రలేఖనంగాని అందరికీ అర్థమయ్యే స్థాయిలో వుండడం లేదనే అభియోగం వుంది. శుద్ధ వచనం నుంచి వచన కవిత్వాన్ని వేరు చేసేవి అందమైన గాఢముద్ర గల ప్రభావ పూరితమైన ప్రతిభా కారకాలే. వాటిని ఉపయోగించ డంలో కవి తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తే, పాఠకుడు దాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన శ్రమను, నైపుణ్యాన్ని వినియోగించాలి. ఎందుకంటే,

Poetry is the spontaneous overflow of powerful feelings it takes its origin from emotions recollected tranquility- William Wordsworth

గతానికి సంబంధించిన ఆవేశాలు శక్తివంతమైన ఆలోచనలుగా స్వతస్సిద్ధంగా వెలువడే క్రమంలో కవి తన స్థల, కాల, సామాజిక అవగాహనలోని మూర్తమైన ప్రతీకల ద్వారా అమూర్తమైన భావాలకు రూపమిస్తడు. వ్యక్తి నిష్ఠమైన ఆవేశాలను సామూహిక అనుభవాలుగా, ఆవేశాలుగా భ్రమింపచేయడంలో కవి కృతకృత్యుడైనప్పుడే, అది గొప్ప కవిత్వమౌతుంది. అందుకు వస్తువును తను దర్శించే పద్ధతి, దానికి మూర్తరూపాన్నిచ్చే పద్ధతి తనదైన ప్రత్యేకతను నవ్యతను, సృజనాత్మకతను కవి కలిగివుండాలి. ఎందుకంటే,

The way of expressing emotion in the form of art is by finding an objective correlative , in words, a set of objects, a situation, a chain of events which shall be the formula of the particular emotion, such that when the external facts, which must terminate in the sensory experience , are given , the emotion is immediately evoked- T.S. Eliot

ఒక సమాజము తనకు కావాల్సిన కవుల్ని అది తయారు చేసుకుంటది. ‘కాలం కడుపుతో వుండి’ కవుల్ని కంటనే వుంటది. కాని సమాజంలో ఉద్యమ ప్రాబల్య కాలంలో మాత్రం అనేక మంది కవులు, కళాకారులు పుట్టుకొస్తరు. తెలంగాణ సాహిత్యంలో తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కాని, ఇప్పటి మలిథ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమ కాలంలోగాని మనము ఆ విషయాన్ని స్పష్టంగా చూడొచ్చు. నాలుగు కోట్ల ప్రజల న్యాయమైన ఆకాంక్ష అర్థ శతాబ్ధ కాలంగా అణచివేయబడుతున్న సందర్భంలో సామాజిక స్పృహ కలిగిన ప్రతి వ్యక్తి తన కార్యాచరణ ద్వారా అందుకు తోడ్పడే మార్గాన్ని ఎంచుకుంటడు. ఇవాళ్ళ తెలంగాణలో అట్లా అనేక మంది అనేక విభిన్న కార్యక్రమాల ద్వారా ఉద్యమానికి దోహదం చేస్తున్నరు. సాహిత్యంతో పరిచయముండి, ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధమున్న అనేక మంది తెలంగాణ విద్యాధికులు కవితల ద్వారా, పాటల ద్వారా మనముందుకొస్తున్నరు. అట్లా ఈ ఉద్యమం మలిచిన కవే మన జోగు అంజయ్య ‘పల్లెలన్ని మల్లెలాయె’ అనే పాటల పుస్తకం ద్వారా తెలంగాణ సాహిత్యాకాశం మీద తళుక్కుమన్న ‘కంటిపాప కలగన్నది’ అనే కవితా సంకలనం ద్వారా స్థిరపడ్డడు.

‘పల్లెలన్నీ మల్లెలాయె’ పది జిల్లాల ఉద్యమ ఆకాంక్షల పాట. ఐదు థాబ్దాలుగా కోటి కళ్ళతో ఎదురు చూస్తున్న ఆకాంక్షను, తెలంగాణ పదములోని మాధుర్యాన్ని, జెండా నీడలోని ధైర్యాన్ని వినిపించిన మంచి మనసులున్న నేల పాడుకున్న పాట. ఈ పాటలో విద్యార్థి దండు కదులుతుంది. పల్లెలు ఎర్ర మల్లెలై రాజీలేని పోరుతో నడుం బిగించాయి. రాజ్యహింసని ధిక్కరించి ఢిల్లీల గెలిచి వస్తమని, ద్రోహాలకు, దోపిడీలకు చరమగీతం పాడుతమని వాగ్ధానం చేస్తున్నవి.

”అగ్గిపిడుగులాంటి వీరపుత్రులున్నరమ్మ నీకు
శ్రీకాంతాచారి మా చూపులోన ఉన్నాడమ్మా
వేణుగోపాలరెడ్డి వేగుచుక్క అయినాడు
కృష్ణయ్య యాదయ్య యాదిలోన ఉన్నారు” అంటూ అమరుల తల్చుకుంటడు.

తెలంగాణ పట్ల, తెలంగాణ దార్శనికుల పట్ల విపరీతమైన అభిమానమున్న కవి ఒక్కక్కరినే పలవరిస్తున్నడు. కానికాలంలో కాలం చేసిన వాళ్ళను స్మరించుకున్నడు. బియ్యాల జనార్ధన్‌రావు, బాలగోపాల్‌, బుర్ర రాములు, కన్నాభిరన్‌, జయశంకర్‌, బెల్లి లలితల మీద ఎలిజీలు రాస్తున్నడు.

”మీ ఉపన్యాసాల ప్రేరణతో
ఊర్లన్ని ఉద్యమిస్తున్నవి
పట్నాలకు పౌరుషము వచ్చి
యాస భాషను బతికుంచుకుంటున్నవి” (తెలంగాణ జాతి రత్నం)

అంటూ ‘నేలమ్మ ఒడిని చేరిన తెలంగాణ జాతి రత్నాన్ని’ యాది జేసుకుంటున్నడు. ‘జీవితాంతం కడగండ్ల బతుకుల విముక్తికై పోరాడిన తెలంగాణ శక్తి’ అని గద్దర్‌ను కీర్తిస్తున్నడు. తెలంగాణ గొప్పదనాన్ని జనరంజకంగా పాడిన బెల్లి లలిత అమరత్వాన్ని మరువకూడదంటున్నడు. ‘చైతన్యకారుడి ఆదర్శ జీవితం వెలకట్టలేనంత వెలుగును ఇస్తుంద’ని అంజయ్యకు తెలుసు. అందుకే తను కూడా ఆ బాటలో పయనించాలనుకుంటున్నడు.

జనగామలో ఒక సాహిత్య సంఘాన్ని ఏర్పాటు చేసుకుందామని ప్రయత్నిస్తున్న సమయంలోనే నాకు జోగు అంజయ్య పరిచయమయ్యిండు. తన పని రాక్షసత్వం ద్వారా, నిబద్ధత ద్వారా సౌమ్యుడైన అంజయ్య నన్ను ఆకట్టుకున్నడు.’పల్లెలన్ని మల్లెలాయె’ ఆవిష్కరణ సభలో పాల్గొన్న నాటి నుంచి మా అనుబంధం మరింత పటిష్టమౌతూ వస్తున్నది. ‘జరసం’ కార్యదర్శిగా ఈ సంవత్సర కాలంలో తాను సాహిత్యం పట్ల ఎంత సీరియస్‌గా వున్నడో నిరూపించుకున్నడు. ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తూ తెలంగాణ రాజకీయ నాయకులు ప్రదర్శిస్తున్న దళారీతనానికి ఆగ్రహం చెందుతున్నడు.

‘రోజుకో వేషంతో
పూటకో మాటతో
ఉద్యమాలను ముంచాలనుకుంటే
తోలు తీస్తారు జాగ్రత్త (ఉద్యమం ఏమంటున్నది)

అంటూ హెచ్చరిస్తున్నడు. ‘పోరాడే జనం ఉన్నచోట ముందడుగు వేసే నాయకులు వుండాలి’. కాని ప్రపంచంలో ఎక్కడా చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని తెలంగాణ ఈ సంవత్సర కాలంలో చవిచూసింది. ప్రజలు స్వచ్ఛందంగా పోరాట రూపాలు ఎన్నుకొని ఉద్యమం నిర్వహిస్తుంటే ఎక్కడ వెనుకబడిపోతామోనని, ప్రజలకు దూరమైతే వచ్చే ఎన్నికల్లో ఎక్కడ చెత్తకుప్పల్లో చేరిపోవాల్సివస్తుందోనని తెలంగాణ రాజకీయ నాయకులు ప్రజల వెంట నడిచిండ్రు, లేదా నడిచినట్టు నటించిండ్రు. సోనియాగాంధీ పాదాల చెంత మోకరిల్లుతూ, సీమాంధ్ర పెట్టుబడిదారులనుంచి సబ్‌ కాంట్రాక్టులు పొందుతూ చేవచచ్చిన దద్దమ్మల్లా కాంగ్రెస్‌ నాయకులు, పచ్చకళ్ళ రోగి ఆంధ్రాబాబునాయుడు కుట్రల, కుయుక్తుల కబంధ హస్తాల నుండి విడివడక లొంగిపోయి వంగిన తెలుగుదేశం నాయకులు, ఆంధ్ర పెట్టుబడిదారులకు, కమ్మకుల ఆధిపత్య వర్గాలకు పార్టీని తాకట్టుపెట్టిన మార్క్సిస్టులు తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహానికి మూల్యం చెల్లించక తప్పని రోజు తప్పకుండా వస్తుంది. అందుకే,

”బలమైన ఆకాంక్షను
అంగట్లో పెట్టినందుకు
రాజకీయ ద్రోహానికి
వేయిమంది బలైనందుకు
చరిత్ర పుటల నుండి
మీ పేర్లు తొలగిస్తు” న్ననని కవి తన నిరసన ప్రకటిస్తున్నడు.

గడిచిన చరిత్రను గుర్తు చేసుకుంటూ ‘గడీల ప్రభువుల గోళీలాటలో వీర తెలంగాణ విగ్రహమయ్యిందని’ అంగలారుస్తున్నడు. దొడ్డి కొమురయ్య వర్ధంతి సభలో భారతీయ జనతా పార్టీ, టి.ఆర్‌.ఎస్‌. నాయకులు స్టేజిని ఆక్రమించుకున్న ఘటన చూసినప్పుడు సహజంగనే వారసత్వపు సమస్య చర్చకు వస్తది. సావర్కర్‌ ప్రస్థానంలో భగత్‌సింగ్‌ సహచరుడిగా వున్న స్థితినుంచి ఆర్‌.ఎస్‌.ఎస్‌. శిబిరంలో చేరి పోయాక, ఆ శిబిరం గత రెండు థాబ్దాలుగా భగత్‌సింగ్‌ వారసులమని చెప్పుకుంటున్న వైనం తెలిసిందే. తెలంగాణ సాయుధపోరాటానికి నేటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మధ్య అభేదాన్ని పాటించడం ద్వారా పాలకవర్గాలు ఒక సంక్లిష్ట, గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నరు. ‘ పోరుజెండకు ప్రాణం పోస్తూ రక్తం చిందించే కమ్యూనిస్టులూ, వారి అభిమానులూ వున్న దేశంలో డెబ్భై ఏళ్ళు గడిచినా ఏడుపాయలుగా చీలిపోయింది, గాని జీవనదిగా మారలేకపోయింది. ఐక్యంగా ఉండలేక పోయింది’ అని వ్యధ చెందుతున్నడు కవి. క్విట్‌ ఇండియా ఉద్యమ సందర్భంలోగాని, అంబేద్కర్‌ జీవితంలోని రాడికల్‌ థ (1936-42)లో అంబేద్కర్‌తో వ్యవహరించిన సందర్భంలోగాని, 1969లో తెలంగాణ ఉద్యమ వ్యతిరేకిగా సమైక్యవాదపు ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ ముసుగులోగాని, మలిథ ఉద్యమంలో మార్క్సిస్టుల వైఖరిగాని ఈ దేశంలో మనువాద బ్రాహ్మణ భావజాలం కమ్యూనిస్టు ఉద్యమాన్ని దారితప్పించిందని తెలుస్తుంది. ఇవ్వాళ్ళ అస్తిత్వ ఉద్యమాలుగా ముందుకొచ్చిన స్త్రీ, దళిత, మైనారిటి, ప్రాంతీయ సమస్యలను అర్థం చేసుకోవడంలో బ్రాహ్మణ భావజాలం అడ్డుపడి ఆయా వర్గాల అణచివేతకు దారితీసిందని అర్థమౌతుంది.

స్వతహాగా పాటగాడైన (గాయక రచయిత) జోగు అంజయ్య జార్ఖండ్‌ రాష్ట్ర ప్రజాకళాకారుడు జీతన్‌ మరాండికి ఉరిశిక్ష విధించబడడం పట్ల కలత చెందిండు. ‘భూమి పుత్రులను కాపాడే కోపాగ్నిలో అక్కడి నేలతల్లి మృత్యు శకటాన్ని ముద్దాడుతుంది’ అని చెప్తూ,

‘పాటను బతికిస్తే
ఆదివాసిని గుర్తిస్తే
అడవి గెలిచిందనీ
ప్రజాస్వామ్యం నిలిచిందనీ’ ప్రకటిస్తనంటడు (ఉరిశిక్ష మరణిస్తే)

పీడిత కులం నుంచి, అట్టడుగు వర్గం నుంచి వచ్చిన కవి వనరుల విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతున్న అంతర్జాతీయ పెట్టుబడిదారులను, వారి కొమ్ముకాస్తున్న భారత దళారీ పాలకవర్గాలను ఎదిరించి పోరాడుతున్న ఆదివాసీల పక్షాన నిలిచిన జీతన్‌ మరాండీని ఆలింగనం చేసుకోవడం ద్వారా మన హృదయాల్ని గెలుచుకొని మనకు ప్రీతిపాత్రమైతడు. ‘అంతర్జాతీయుడి ఆర్థిక సంస్కరణ అనుకరణ ఫలితాల’ పట్ల అవగాహన వున్న కవి ప్రభుత్వాల, మార్కెట్‌ శక్తుల గుట్టును రట్టు చేస్తానంటుంది తెలంగాణ’ అంటూ భరోసా ఇస్తడు. స్థానికీకరణే ప్రజల ఆత్మ గౌరవానికి, స్వావలంబనకు, అభివృద్ధికి మార్గమన్న ఎరుకను కనబరుస్తడు.

‘విజన్‌ 2020 పుస్తక విమానం విలేజీలో దిగలేదు.

వీధికొక్కటైనా ఇవ్వకుండానే విదేశీ కంపెనీలకు పంచింది’ అంటూ ప్రపంచ బ్యాంకు మోజులో చంద్రబాబునాయుడు వెలగబెట్టిన సంస్కరణలను, వ్యూహాల్ని ఎండగడుతున్నడు. భారతదేశంలో చదువురాని మామూలు రైతుకు వున్న ఇంగిత జ్ఞానం కూడా లేని పాలకులు (ముఖ్యంగా చంద్రబాబు) ప్రథమ, ద్వితీయ ఆర్థిక రంగాలను నిర్వీర్యంచేసి (బాహాటంగా ప్రకటిస్తూనే) తృతీయ రంగమైన సేవారంగం అభివృద్ధి ఒక్కటే అభివృద్ధి మార్గంగా నిర్వచించడం, ఈ దేశపు గుండె కాయగా వున్న భూమి హక్కు పట్ల మెసలి కన్నీరు కార్చడం, కుహనా సంస్కరణల్ని ప్రవేశపెట్టడం కవి లోతుగా గమనిస్తున్నడు.

‘బీదల కోసం భూ సంస్కరణల చట్టమంటరు
అమలు చేసి భూములు ఇస్తమంటరు
పదుల ఎకరాలు పంచుడాయె
లక్షల ఎకరాలు మింగుడాయె’ (బహుజనులూ బాగున్నారా)

తెలంగాణలో ఒక అగ్రకుల పాలకవర్గాన్ని నిర్వీర్యం చేయడానికి 1971లో పి.వి. నర్సింహారావు (ముఖ్యమంత్రి) సీలింగ్‌ చట్టం తెచ్చిండు. ఫలితంగా మిగులు భూములు తెలివి మీరి బినామీలుగా పెంపుడు కుక్కల, పిల్లుల, జీతగాండ్ల సంకల చేరినవి. 1983లో అధికారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ మండలాధీశుడి అవతారమెత్తింది. తెలంగాణ పాలకవర్గాన్ని బలహీన పరచడం ద్వారా ఆంధ్రుల ఆధిపత్యాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్ది అది కమ్మకుల ప్రయోజాల్ని నెరవేర్చింది. ఫలితాలు తెలంగాణ కళ్ళెదుట ఇవ్వాళ్ళ సినిమా స్కోపులో దర్శనమిస్తున్నయి. కాని ‘పాలకులు దోపిడీ చేస్తున్నమని చెప్పలేక, అభివృద్ధి పేరిట ఆర్భాటాలు చేస్తారని, సంస్కరణ ఫలితాలు సంపన్నులకేనని’ ఈ కవికి ఖచ్ఛితంగా తెలుసు. అందుకనే ఉపాధ్యాయ వృత్తిలో వున్న కవి

”సామాజిక చరిత్రను చదివితేనే కదా
సమాజంలో చైతన్యం వచ్చేది
సోషల్‌ సైన్సెస్‌ చదివితేనే కదా
సామాజిక విలువలు రక్షించబడేది
మరి కంప్యూటర్‌ మాత్రమే చదవాలంటారేమిటి?” అంటూ అమాయకంగా ప్రశ్నిస్తున్నట్టే వుంటడు. కాని,

”అద్దం పలిగినప్పుడు
అతుకుడు తాత్కాలికమే

రాష్ట్ర విభజన ఒక అవసరం” అని చెప్పి నిర్ద్వంద్వంగా ప్రకటించడం ద్వారా తన ఆలోచనా విధానంలోని సమగ్రతని వ్యక్త పరుస్తడు. డిసెంబర్‌ 9, 2009 ప్రకటనకు వెన్నుపోటు పొడుస్తూ డిసెంబర్‌ 23, 2009 ప్రకటన రావడం, శ్రీకృష్ణ కమిటీ డబ్బు సంచులకు అమ్ముడుపోయి తెలంగాణకు వ్యతిరేకమైన రిపోర్టు ఇవ్వడం, తెలంగాణ రాజకీయ నాయకుల దళారీతనం, ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలలో నిలిచిపోయే సకల జనుల సమ్మె ఏ ప్రయోజనం పొందకుంటనే విరమించబడడం లాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కవి గొప్ప ఆశాజీవిగా దర్శనమిస్తడు.

”నూనూగుమీసాల పోరడు
తొలిప్రేమను మించిన సంబరాన్ని ప్రకటిస్తూ
విముక్తి దారులు వెదుకుతున్నడు
కాలజ్ఞానం తెలిసిన వాడిలా
తూర్పు దిక్కున పొద్దు పొడుపుగా
తెలంగాణ ఉదయిస్తుంది” (తోటమాలి అడ్డుపడితే)

అంటు గొప్పనమ్మకాన్ని వ్యక్త పరుస్తడు.’ నా తెలంగాణ ఒక బంగారు రాష్ట్రంగా వచ్చినట్లు నా కంటిపాప కలగన్నది’ అంటూ నిద్దురలోనే కలవరిస్తడు.

”నా కలానికి ప్రజల ఆకాంక్షలను బలపరిచే పోరాటం వుంది.
నా కంటిపాపకు కుల వివక్షతలేని సమాజ నిర్మాణ కలవుంది
నా భాషకు తోటివారిని ఆప్యాయంగా పలకరించే వ్యవహారం వుంది.
నా రాగానికి మట్టి మనుషులు పాడుకునే స్వరం వుంది”
అని ప్రకటిచుకున్నప్పుడు నాకు బాలగంగాధర్‌ తిలక్‌ గుర్తుకు వచ్చిండు.

‘కవిత్వంలో ప్రజల సమస్యలు అక్షరీకరింపబడుతాయని తెలుసుకొని కలం పట్టాను. కవి కావాలని మాత్రం కాదు’ అన్నప్పుడు అంజయ్యలోని modesty అర్థమౌతుంది.

”కవిత్వం ఒక ఆల్కెమీ
దాని రహస్యం కవికే తెలుసును
కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకి తెలుసు
కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు” – బాలగంగాధర్‌ తిలక్‌

మరి, కవిత్వం ఆల్కెమీ అని అంజయ్య కూడా తెలుసుకోవాలి.వస్తువు ఎంత బలమైనదైనా, నిర్మాణ రూపం కూడా అంతే ముఖ్యమని గ్రహించాలి. సాధన ద్వారా, వ్యుత్పత్తి ద్వారా ప్రతిభను మెరుగు పరుచుకుంటూ తనదైన అభివ్యక్తిని, తనదైన శైలిని వృద్ధి చేసుకోవాలి. కవిత్వం ఒక ప్రత్యేకమైన భాష. అది కవి గ్రహించాలి.

‘’ Poets are the nierophants of unapprehended inspiration; The mirrors of the gigantic shadows which futirity casts upon the present ; The words of which express what they understand not; The trumpets which sign to battle and feel not what they inspire, the influence which is moved not,but moves; Poets are the unacknowledged legislators of the world- P.B.Shelly

ఇది అర్థం చేసుకొని, dilectolgy ని జీర్ణించుకొని అంజయ్య తెలంగాణ సాహిత్య లోకంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఆశిస్తూ, అట్లా చేసుకునే శక్తి అతనికుందని విశ్వసిస్తూ..

బయోడేటా

పేరు: జోగు అంజయ్య

పుట్టిన తేది: 04-04-1967
స్వస్థలము: వడిచర్ల, లింగాల ఘనపురము. వరంగల్లు (జిల్లా)
విద్యార్హతలు: ఎం.ఏ. బి.ఇ.డి.
వృత్తి: ప్రభుత్వ ఉపాధ్యాయుడు
రచనలు: పల్లెలన్నీ మల్లెలాయె (పాటల సంపుటి)
కంటిపాప కలగన్నది(కవితా సంపుటి)