కవిత్వం

రాహిత్యం

ఏప్రిల్ 2014

అలా వదులుకుంటూ పోతున్నావ్, ఒక్కోక్కరిని.
మునిగిపోతున్నప్పుడు, చేయందించేవారు
దొరకరేమో, మరి నీకు మిత్రమా!
అంటూ హెచ్చరించాడో ఆప్తుడు.

కాస్తంత విరక్తితో కూడిన చిరునవ్వుని వదులుకుంటూ,
కూడదీసుకున్న పదాలను
వదిలేస్తు పెదాల చివరలనుండి,
ఇలా అంటానిక.

ఇంకాస్తా కూరుకొని పోలేక, పట్టుకున్న బరువులతో
ఇంకా లోతుల్లోకి వెళ్లలేక, కట్టుకున్న బంధాలతో
ఒక్కోక్కటి వదిలేసుకుంటున్నాను, తండ్రీ, ఇక.
పైకి తేలే మార్గాలు వెతుక్కుంటూ.

భవసాగర జలాల పై మనుషులుగా మిగలాలంటే,
తృణప్రాయంగా వదులుకోల్సిందే కదా, అన్నింటిని.
ఇంకేమీ దాచుకోకుండా,. లోపలి లోగిల్లలోన.

తేలికపడితే కాని తేలలేం కదా మరి.