ఒరే అల్లుడా ! ఓ బకీట్నీలు ముంచియ్యిరా అంది నాగమణి బాప్ప. పెద్దగేది కాల్లోనే పడుకూనుంది. లేగదూడని కూడా కాల్లోకి దింపాను.
పెద్దగేదిలాగ అది కుదురుగా పడుకోదు. అవతల గట్టేక్కేసి హడావుడి సేత్తాది. దానిని అదుపు సేయ్యలేనని తాడు కాలుకింద తొక్కిబెట్టి నాగమణి బాప్ప దగ్గర బకీటందుకున్నాను. కాలవ పాంచాల మీదనుంచి నీలందుకోబోతుంటే మొలకున్న రుమాలూడిపోయింది. గబాల్న తాడూ, బకీటు వొదిలేసి, రుమాలట్టుకున్నాను. కుర్రనా గొల్లిగా డాయరేసుకోవేట్రా అన్నాది. ఇంతకీ సూసిందో లేదో గాని తిట్టడం బలే నచ్చింది నాకు నవ్వుకున్నాను. ఏ బాప్పా ఇప్పుడేమయ్యింది అన్నాను. ఇంతకీ నేను కడ్డాయిరేసుకున్నాను కదా అది కంగారులో సూసీ సూడకుండా సూడ్డం వల్ల అది కనపల్లేదేమో అని మళ్ళీ తీసి ఇదిగోనె బాప్పా డాయిరుంది సూడు అని రుమాలిప్పి సూపించాను.
ఓరి తింగర్నా గొల్లిగా అని తిడతా నీలట్టుకోడానికి ముందుకొచ్చి ఓ దెబ్బేసింది సరదాగ. ఈ లోపు మానాన ఊళ్లోనుండి సైకిల్ మీద వొత్తా కాలవరేవులో నన్ను సూసి ఆగాడు. మా బాప్పని సూసి “ఏంటి సెల్లే ఇంకత్తమాటూ ఆడితో ఎటకారం మీరందరూ ఆన్ని కుదురుగా ఉండనిత్తాలేదు” అంటూ నాయోంకు చూసి “ఒరేయ్ దూల్లని తొరగా తోలుకెల్లు అన్నాడు .
“నానా ఆగాగు అని మానాన్ని ఆపబోతుంటే చేతిలోతాడు గుంజుకుంది లేగదూడ. మళ్ళీ రుమాలూడిపోయింది. ఈసారి సూసేవోల్లు ఎవలూ లేరు కదా అని రుమాలి గట్టుమీదకిసిరేసి గేదుల్ని సుబ్బరంగా కడిగి గట్టెక్కాను. తడిసన కడ్రాయిరితో అటూ, ఇటూ సూసుకుని ఎవలూ లేరనుకున్నాక , అది మార్చుకుని రుమాలు సుట్టుకుని గేదులు ముందెలతుంటే నేను ఆటెనకాల ఇంటికెళ్ళాను.
నాన వాకట్లో సైకిల్ స్టేండేసి ఇంట్లోకెల్లి తవుడుమూట తీసుకొచ్చాడు. నేను గేదులు కడుకూనొచ్చేటప్పుడికి తమ్ముడు ఒట్టిగడ్డి ముక్కలు కోసాడు. తవుడు కలపాలి కదా, ఆ ముక్కలన్నీ గోలెంలో నీట్లో తడుపుకొచ్చి సంచిమీదరిసి తవుడు కలపమని మా తమ్ముడికి సెప్పాడు. పెద్ద గేదిని వొడుపు కొబ్బరసెట్టికి కట్టేసి , లేగదూన్ని కోడిగుంజకి తగిలించాను. మొలనున్న తడి రుమాలు సివర్లు పిండుకుంటుంటే సుబ్బయ్యమ్మొచ్చింది. సేతిలో ఓ లీటరుసెంబు ,సీర సెంగులో ఓమూట కనబడింది .
అప్పుడప్పుడూ మా ఇంటికి మజ్జిగసుక్కల కోసమోస్తాది. ఆ సెంబు సూసి అందుకే వచ్చుంటుందని అర్ధమయ్యిందిగానీ ఆసీర సెంగులో మూటేంటో తెలీలేదు. “ ఒలేయ్ శేంతొదినా అని మాయమ్మని కేకేసి , నిన్న ఈదిలో జరిగిన గొడవ గురించి ఏంటో సెప్తా ఉంది. ఈలోపు పాత గుడ్డతో మానాన సైకిల్ తుడిసి, సెక్రాల్లో ఎర్రాయిలేసి దాన్ని మాపంచన ఎక్కించేసి కోళ్ళగూడు సర్దుతా ఉన్నాను . తవుడు కలపడం పూర్తయిపోయి పాలితకడానికి అన్నీ తెచ్చుకుంటున్నాడు మానాన “సుబ్బప్పా! ఏమట్టుకొచ్చావే “ అనడిగాడు నిన్న సేలో తోరాలేసేసాక సింతకాయలట్టుకొచ్చాడు మీబాయ , మొన్న శేంతొదిన అడిగితే లేవన్నాను . ఇప్పుడున్నాయి కదాని పట్టుకొచ్చాను తమ్ముడా అన్నాది. పాలితికేసి తపేలా, నీలసెంబు అరుగుమీదేట్టాడు మానాన. ఇంటికాడ ఇంక నేను సేసే పనేమీ లేదని , అమ్మా నూతికాడికెల్లి స్నానం సేసొత్తాను అన్నాను. సప్పెట్టీ , ఒళ్ళు తుడుసుకోడానికి రుమాలి పట్టుకూనెల్లి తానం సేసోచ్చేసాను. నేను తిరిగొచ్చేసరికి మానాన మరకాల్ల బయ్యమ్మ దగ్గర ఓ దాకడు మెత్తల్లు బేరమాడతున్నాడు.
మరకాల్ల బయ్యమ్మ గురించి మా పక్కన ఎవల్నడిగినా సెప్తారు. ఎంతమంచిదంటే, గంపతో సేపలట్టుకుని ఊళ్ళో కొచ్చిందంటే ఎలాగైనా అమ్మేసే ఎల్తాది. అదీ ఎలాగనుకుంటున్నారు? ఎవల్నైనా ఒలేయ్ పిల్లా పిత్తపరిగిలున్నాయి , బూరామలున్నాయి చందువాచుక్కలున్నాయి ఏమొండు కుంటావ్, ఇది సింతకాయేసి వొండు. ఇది మామిడి కాయేసి వొండు అనుకుంటా పిలుస్తాది. ఎవరన్నా వొండుకుందామని ముందుకొచ్చి డబ్బుల్లేక ఆగిపోతే బయ్యమ్మ ఊరుకోదు. డబ్బులున్నపుడు ఇద్డురులే లేపోతే మా కోల్లకి ఓ అడ్డ్డుడు ఒడ్లుగింజలుంటే పెట్టండి అనడిగి ఆ సేపలాల్లకి ఇచ్చిపోతాది. అందరి ఇళ్ళ దగ్గర సేపలగంప దించి నాలుగైదు ముచ్చట్లు చెప్పి ఎవరన్నా కాతంత టీసుక్క ఇత్తే తాగేసి పోతాది. సేపల గంపట్టుకూని ఊళ్ళోకొచ్చిందంటే గోలగోలగా అందర్నీ పలకరిస్తాది. ఈ మధ్య ముసలదయ్యింది కదా! సందామాట్లే వొస్తుంది సేపలట్టుకూని, ఇంతకముందు పొద్దన్న కూడా ఒచ్చేదంట. “ మొత్తానికి ఎంతకో కొంతకి పెట్టేల్లు అని మానాన పాలు కొలుసుకోడానికి గుమ్మాలోకెలిపోయాడు. మూడు లీటర్లు రాయిదొడ్డు పేట్లో ఇచ్చిరావాలి. మూడు లీటర్లు అమ్మేసి, ఇంట్లోకి ఇంకో రెండు లీటర్లు ఉంచేవవోడు. అన్నట్టు సెప్పడం మర్చిపోయాను రేపు రాములోరి కల్యాణం కదా ఊరంతా బెల్లం దండుకోడానికి ఎల్లాలి. పాలట్టుకెలడానికి తమ్మున్ని పంపేదాం అనుకున్నాను.
పిల్లలందరూ సొంటి పొడుంకొట్టి మిరియాలు నూరి బెల్లం పానకం సేత్తాం మా రాములోరి కళ్యాణానికి. ఆ పనంతా సేయడం భలే సరదాగా ఉంటాది మాకు . ఒక పిలమెంటు లైటు రాములోరి గుడిముందు బిగించుకుని బరకాలరుసుకుని కుచ్చుంటాం. బెల్లం సిదగ్గొడుతూ తెల్లారాక సేయాల్సిన సిలిపి పనులన్నీ సెవుల్లో సెప్పుకుంటా బలే సరదాగా గడుపుతాం . ఎక్కడ పాలట్టుకుని ఎల్లమంటాడో అనే భయం నాది . మళ్ళీ ఓ అరగంటలో ఒచ్చేతాననుకో కానీ అందర్నీ పోగేయడం. అందరింటికీ సెలాగ్గా తిరగడం నేను మాత్రం బాగా సేత్తానని అందరూ అంటారు. ఆ పొగడ్తకేం కాదుగాని నాకదో సరదా అన్నిల్లూ తిరిగి అందర్నీ పోగేసేవోన్ని. పాలు కొలిసాక నేను ఆకున్నట్టే పాలట్టుకెల్లి రాయిదొడ్డు పేట్లో ఇచ్చేసిరా అన్నాడు మానాన. నేనేమో మాటాడకుండా ఇంట్లోకెళ్ళి అమ్మా, నాన్ని పట్టికెల్లమని సెప్పన్నాను. అందుకు మాయమ్మ ఒప్పుకోలేదు నాకా పాలుట్టుకెల్లడం తప్పేట్టు లేదు. బుల్రాజు గాడు , సేతికర్ల ఈరబాబు గాడు, సాంగాడు అందరూ గుడికాడ టెంటేస్తున్నారు రమ్మని కబురట్టుకూని అరేల్లోడు కన్న్నబాబుగాడొచ్చాడు. పాలు ఊళ్ళో ఇచ్చోత్తానుండరా అన్నాను. ఎవల్తోనన్నా పంపెయ్ నువ్వోచ్చేయ్రా అంటుంటే ఒరేయ్ కన్నయ్యా నీ కాల్లిరగొడతాను ఆన్ని ఎల్లనియ్యి అన్నాడు మానాన. ఇంక తప్పదని పాలకేను సైకిలుకు తగిలించుకుని సిద్దమయ్యాను .
పాలట్టుకెల్లాలన్న కంగారుతో సైకిలేక్కితే “ ఒరేయ్ పద్దులసీటి మర్చిపోయావ్ “ అన్నాది మాయమ్మ. పాలు ఏరోజు ఎన్ని పోస్తామో ఆ కార్డుమీద రాయించుకూని వొచ్చేవాన్ని. ఎప్పుడన్నా కార్డు పట్టికెల్లడం మర్చిపోయినా ఆ తర్వాతి రోజు రాయించుకునేవోణ్ని మాయమ్మ ఆపకపోతే ఇప్పుడూ అలాగే సేద్దును కంగారుగా పోతున్నానని అపేసరికి సైకిల్ కుదేసి స్టాండేసాను. స్టాండేసి అలా కదులుతున్నానంతే సైకిల్ పడిపోయింది . పాలకేను మూతూడిపోయి బళ్ళున పాలన్నీ నేలపాలయ్యాయి. వీదిలో నడుస్తున కిట్టయ్యతాత “అరెరే” అనడంతో అమ్మా నాన్న ఇద్దరు సూసారు. అపుడు నాన నా వైపు సూట్టం జాలిగానే సూసాడు గాని, ఒక రొండు,మూడు సెకన్లాగి పళ్ళు గిట్టగరుసుగుంటూ పాలతెపేలట్టుకొచ్చాడు నన్ను కొట్నాకి. అంత కోపంగా ఇసురుగా దగ్గరకొచ్చేసరికి భయమేసింది నాకు . బుజాలు దగ్గరకు ముడుసుకుని బయంతో కళ్ళు మూసుకున్నాను. దబేల్మని ఓ దెబ్బేస్తాడనుకున్నాను. ఎందుకో ఆగాడు. పో, పోరా పోయి ఆ గుడికాడపడేడు అనేసి సైకిల్ లెగదీసి పాలకేను తీసుకుని నాబుజంమ్మీద సెయ్యేసి తోసాడు . నేనేం మాటాడలేక గుడికాడకి పోదామని మాయమ్మొంకు సూత్తే అసలు నాకేసి సూత్తాలేదు మాయమ్మ . మళ్ళీ కాసేపుండి ఇంటికొద్దులే అని గుడికాడికెళ్ళిపోయాను . గుడి కాడ టెన్టేసారు. కొంతమంది బరకాలు అరిసేటప్పటికి నేనెల్లాను. “ ఒరేయ్ లైటు బిగించాల్రా అన్నాడు చినబుజ్జిగాడు .
పొట్టోల్లెవరికీ అందదుకదా లైటు నేను బిగించాలి. గుడి పక్కన చంటమ్మ వోకట్లో రోలు దొర్లించుకొచ్చి దాని మీదెక్కి లైటు కట్టాను. తర్వాత బెల్లం సిదగ్గొట్టడం, మిరియాలు నూరడం ఎవరి పనులాల్లు సేసుకున్నారు. గణపతి గాడు తెల్లపంచి పట్టుకొచ్చాడు అది పెద్దగూనకి కట్టి నీలు మోసుకొచ్చి ఆ గుడ్డతో వొడకట్టి గూన నింపాము. తర్వాత కొందరు గుల్లసెనగ పప్పు పట్టుకొచ్చారు. పానకంలో ఎంత పడతాదో అంత తీసుకుని మిగతాది ఎవడి జేబుల్లో వాడు నింపుకునే వాడు.తెల్లవార్లూ గుడిముందు కర్రలతో లైన్లు కడతాం కదా ఆ పనులన్నీ సేత్తుంటే ఊసుపోక జేబులో ఏసుకున్న గుల్ల సెనగపప్పు తినే అలవాటు మాయందరిదీ, పానకానికి అన్నీ సిద్దం సేసేసి రాములోరి గుడి అరుగుమీద కుచ్చున్నాం. బిటీసు పంతులు గాడు ఒరేయ్ రాజు బాయా మీయమ్మ అన్నం తినడానికి రమ్మంటుందన్నాడు.
“తిన్నన్నాడని సెప్పరా “ అన్నాను. ఆడేఅడావుడిలో ఉన్నాడోగానీ “ ఏ ఎందుకు తినవు” అని అడక్కుండా ఎలిపోయాడు . అలాగే కుచ్చూని మాటాడు కుంటున్నాం. కళ్యాణానికి వొచ్చిన సందాల్లో ఎవడెంత నొక్కేసారు లెక్క కావాలని అడిగాను. నిజాయితీ గా ఉన్నోళ్ళు మూసుకుని ఉన్నారు నొక్కేసినోళ్ళు నవ్వుతున్నారు వాళ్ళ నవ్వు అర్ధమయిపోయి. ఎదవలింతే మారర్రా కాసోడా అని బుల్రాజుగాడన్నాడు. ఈ లోపు మక్కిసేసు గాడు మళ్ళీ కబురట్టుకొచ్చాడు. అమ్మ అన్నానికి రమ్మందనిసెప్పాడు మళ్ళీ నేను తిననన్నానని సెప్పరా అన్నాను. దానికాడు , మెత్తల్ల సింతపులుసు వొండానని సెప్మంది మీయమ్మ అన్నాడు. కాసేపాగి అయినా తిననన్నానని సెప్పు అన్నాను .
ఆడెనకాలే మాయమ్మ కూడా వొచ్చింది . ఆ మాట ఇనే ఉంటాది. గుడరుగుమీద కుచ్చున్నోల్లతోటి అందరితోనూ రాజుగాడికి అన్నమెట్టి మళ్ళీ పంపుతానుండండర్రా అన్నాది మాయమ్మ . ఆల్లందరూ ఏమీ సేప్పకుండానే నేను దిగేసి ఇంటికెళ్ళాను. నాన కంచంలో అన్నమెట్టుకుని కుచ్చున్నాడు. అమ్మ గిన్నిలో అన్నమేసి కలిపి తినకుండా అలాగే సూత్తుంది. తమ్ముడేమో నిద్దరోయాడు . “నేను తినను “ అనేసి ఇంట్లోకెళ్ళి పెద్ద మంచంమ్మీద పడుకున్నాను కానీ , ఓ పక్కన ఆకలేస్తుంది. మెత్తల్లూ సింత పులుసు కూర వాసన వల్ల ఇంకా ఆకలేస్తున్నట్టుంది లెగిసెల్లి కూరదాక వొంకు సూసి మంచినీలు తాగొచ్చి పడుకున్నాను . నీలకోసం ఓసారి , తలగాడి కోసం ఓసారి అటూ ఇటూ తిరుగుతూ ఉంటే, అమ్మా, నానా ఇద్దరూ గిన్నెల్లో అన్నం కలుపుతున్నారు గానీ ఎంతకీ ముద్దలు సుట్టట్లేదు తినట్లేదు. నాకు జాలేసింది. అయినా మంకుపట్టుతో పడుకున్నాను. ఇద్దరికీ కళ్ళు మండుతున్నాయని తెలుస్తున్నాయి గాని నిద్దర్రావట్లేదు. ఆకలేసి కామోసు .
మొత్తానికి అన్నం అటూ,ఇటూ కలిపేసి ఇద్ద్దరూ సెయ్యి కడిగేసుకున్నారు గానీ ఎవలూ తినలేదు. దీపమార్పేసి నాన పక్కనొచ్చి పడుకున్నాడు . అమ్మ అవతల గదిలో తమ్ముడి పక్కన పడుకుంది. నాన మంచమ్మీద అటేపుకీ, ఇటేపుకీ తిరుగుతా ఉన్నాడు. నాతోని మాటాడట్లేదు నేను కోపమించానని తెలిసి నానా కోపమించినట్టున్నాడు. ఉలుకూ పలకూ లేకుండా పడుకున్నాడు . నాకు ఆకలి దంచేస్తుంది. మళ్ళీ పైకి లెగిసి నీలు తాగొచ్చాను . ఈసారి అమ్మ మళ్ళీ దీపమెలిగించుకూని మా గదిలోకొచ్చింది. ఆ మసక సీకట్లో మాయమ్మ సేతిలో అన్నంగిన్ని కనపడతానే ఉంది. తిన్నగా మంచంకాడకొచ్చి “ లెగరా ఎదవ నాటకాలొద్దు లెగిసి తిను “ అన్నాది .
నేను మాటాడలేదు . మా నాన పైకిలెగిసి “ఇటియ్యే నేను తినిపిత్తాను” అని గిన్నందుకున్నాడు. అమ్మ దీపం సేత్తో పట్టుకూని అన్నం గిన్నెని నాన సేతికిచ్చింది నాన ముద్దకలిపి “ ఎదవకొడకా పాలు వొలగబోసావని ఏదో కోపంతో కొట్టడానికి వొచ్చాను గానీ, నిన్ను కొడతానంట్రా, నీ తింగరిముకం సూత్తే ఎవరి కోపమన్నా మాయమైపోతాదిరా” అన్నాడు. “మీయమ్మ నీ కోసం సరింగా తినలేదు” అన్నాడు. “మీ నానా తినలేదు” అన్నాది మాయమ్మ . తిడితే మాత్రం కూడు తినకుండా పడుకోవాలా ? తిను రేపోద్దున్నే తినడానికుండదు.
“రాములోరి గుడికెల్లాలి అని గుర్తుచేసింది నవ్వుతానే. ఓ పక్క అన్నం కలిపున్నగిన్నిలో పచ్చి సింతకాయేసి సేసిన మెత్తల్ల కూర, ఓ పక్క తెల్లారితే తినకూడదన్న రాములోరి సరతూ, అదీ కాక సేపలకూరంటే నాకున్న ఇష్టమూ … అన్నీ కలిపి తెల్లారితే సరతులెక్కడ వర్తిస్తాయో అన్న బయంతో ఆ పదిగంటల రేతిరికాడ తినడానికి నోరు తెరిస్తే మాయమ్మ కడుపు నిండుతున్నట్టూ, మానాన కళ్ళు మెరుస్తున్నట్టూ ఆ మసకసీకట్లో కనబడ్డాయి. అది గుర్తొచ్చి తెల్లారాక రాములోరి గుళ్ళో సేతులు మొక్కుతూ కుచ్చుంటే , ఎదురుగా పీటలమీద సీతారాములు మాయమ్మా, నానలాగే నవుతున్నారు.
కాశీ, నీ కథలు చదువుతుంటే కళ్ళముందు దృశ్యం కనపడుతూ ఉంటుంది,, నువ్వు సూపర్ హె. నీకు తిరుగు లేదు,
..
కాసింతే అయినా “సింత పులుసు” భలేగా వుంది కాశీ!
చాలా బాగుంది కాశి గారు చిన్నపటి రొజులు గుర్తుకువస్తున్నాయి.
కొన్ని వీలైనపుడు మాతో పంచుకోండి మరి రవి గారూ
చాలా బాగుంది ..కాశీ
సింత పుసులు రుచి కి నోట్లో నీల్లురాయి .. అమ్మ ,నాన్న ల ప్రేమకు కళ్ళు చెమర్చాయి… రాజు గారు.
ధన్యవాదాలు లోకనాథ్ గారూ
సింత పులుసు భలే రుచిగా ఉంది.
ధన్యవాదాలు
తప్పు చేసి కూడా అలగడం పిల్లల హక్కు.
అప్పుడు పెద్దల బుజ్జగింపులోనే ఉంటుంది మజా!
అవును గురూ జీ
సాలా బాగుంది కాశీ నీ సీకూ సింత లేని సింత పులుసు కధ… బాల్యం లో అలకలు గమ్మత్తుగా ఉంటాయ్..అదంతా సక్కగా సూపించావ్..నీ కధనంలో ఎదో సెమత్కారం ఉంటది …సొచ్చింగా ఉంటది.. … దాన్ని అలాగే లాగించు మరి….
సరే సారూ
రాములోరి గుడికెల్లాలి అని గుర్తుచేసింది నవ్వుతానే. ఓ పక్క అన్నం కలిపున్నగిన్నిలో పచ్చి సింతకాయేసి సేసిన మెత్తల్ల కూర, ఓ పక్క తెల్లారితే తినకూడదన్న రాములోరి సరతూ, అదీ కాక సేపలకూరంటే నాకున్న ఇష్టమూ … అన్నీ కలిపి తెల్లారితే సరతులెక్కడ వర్తిస్తాయో అన్న బయంతో ఆ పదిగంటల రేతిరికాడ తినడానికి నోరు తెరిస్తే మాయమ్మ కడుపు నిండుతున్నట్టూ, మానాన కళ్ళు మెరుస్తున్నట్టూ ఆ మసకసీకట్లో కనబడ్డాయి. అది గుర్తొచ్చి తెల్లారాక రాములోరి గుళ్ళో సేతులు మొక్కుతూ కుచ్చుంటే , ఎదురుగా పీటలమీద సీతారాములు మాయమ్మా, నానలాగే నవుతున్నారు.
చాల బాగుంది కాశీ గారు….
చాలా బాగుంది ………….సిన్తపులుసు ……….అలక తర్వాతా ఆ రుసు వేరు
చాల బాగుంది కాసి…
చాల రోజుల తర్వాత మేత్తల్లు సిన్తపులుసు విన్నాను.. అప్పుడెప్పుడో మాయమ్మ ఉన్నప్పుడు వండెట్టేది..
సిన్నప్పుడు రాములోరి కళ్యాణం ముందురోజు మాకు మంచి అనుభవాలు ఉన్నాయి కాని అవి కొంచెం వేరు …
బాగ్గుర్తుసేసావ్ … ఈ కథలో చమత్కారాలు లేవు కాని బాష మీద పట్టు ఉండటం మూలాన బాగా రక్తి కట్టింది …
మీ లాంగ్వేజ్ , రెండు మూడు పదాల్ని కలిపి రాసిన పధ్ధతి, అది చదువుతున్నప్పుడు, అచ్చంగా నాలుక అలాగే తిరుగుతున్నప్పుడు భలే గమ్మత్తుగా , మేము కూడా ఆ కధా ప్రదేశంలో వున్నట్టే ఉంది. చాలా నచ్చింది.
ఎపుడైనా ఆ ప్రదేశాలకు వెళదాం లెండి మోహన గారు .,… ధన్యవాదాలు
జీవితాన్ని పక్కన నిలబెట్టి పరిచయం చేయ గల సత్తా కాశి గారి సొమ్ము. ఆయన రచనల్లో ‘బతుకు గోరే తండ్రి’ చిరునవ్వులు చిందిస్తూ కనబడతాడు.
అమ్మా నాన్నా ఓ కాశి కథ చాలా బాగుంది.ప్రతి ఇంటి అమ్మా నాన్నా కాశి కథ.
చాల బాగుందండి,,,గోదావరి భాష చాల బాగుంది
నీ మాటలు అన్నీ బాగున్నా………నీ చివరి వాక్యాలు మరింతగా నచ్చేసాయి తమ్ముడు!
“రాములోరి గుడికెల్లాలి అని గుర్తుచేసింది నవ్వుతానే. ఓ పక్క అన్నం కలిపున్నగిన్నిలో పచ్చి సింతకాయేసి సేసిన మెత్తల్ల కూర, ఓ పక్క తెల్లారితే తినకూడదన్న రాములోరి సరతూ, అదీ కాక సేపలకూరంటే నాకున్న ఇష్టమూ … అన్నీ కలిపి తెల్లారితే సరతులెక్కడ వర్తిస్తాయో అన్న బయంతో ఆ పదిగంటల రేతిరికాడ తినడానికి నోరు తెరిస్తే మాయమ్మ కడుపు నిండుతున్నట్టూ, మానాన కళ్ళు మెరుస్తున్నట్టూ ఆ మసకసీకట్లో కనబడ్డాయి. అది గుర్తొచ్చి తెల్లారాక రాములోరి గుళ్ళో సేతులు మొక్కుతూ కుచ్చుంటే , ఎదురుగా పీటలమీద సీతారాములు మాయమ్మా, నానలాగే నవుతున్నారు.
నీ రచన అద్భుతం…………! మీ ఊరుని మీ వాళ్ళని చూడాలని ఉంది కాశీ…….
———నాగేంద్ర వర ప్రసాద్, రాజమండ్రి
చూస్తారు అన్న కచ్చితంగా తీసుకెలతాను….
సింతపులుసు సానాబాగున్నాది కాశీ …కూత నాక్కూడా ఎడతావా ? చదువుతాంటే నోరూరిపోనాది ఏటిసేయను ?
మీకు నేనే వండిపెడతాను సారూ ! కలుద్దాము ఓ చోటనే ఉంటున్నాం కదా!
సింత పులుసు పుల్లగా కాకుండా పానకంలా ఇంత తియ్యగా వుందేంటి!
కథ మొదట్లో కాస్తా సాగదీసినట్లనిపించింది. కానీ ముగింపు ఎప్పట్లాగే మధురంగా వుంది.
మాయమ్మ కడుపు నిండుతున్నట్టూ, మానాన కళ్ళు మెరుస్తున్నట్టూ ఆ మసకసీకట్లో కనబడ్డాయి. అది గుర్తొచ్చి తెల్లారాక రాములోరి గుళ్ళో సేతులు మొక్కుతూ కుచ్చుంటే , ఎదురుగా పీటలమీద సీతారాములు మాయమ్మా, నానలాగే నవుతున్నారు.