కవిత్వం

ఈ ఒక్క రాత్రి గడవనీ

ఏప్రిల్ 2014

ఈ ఒక్క రాత్రి గడవనీ
తెల్లారితే వసంతమొచ్చేస్తుంది
అదిగో,
ఆ మలుపు చివర చెట్టు మొగ్గేస్తుంది
పొద్దుటి కిటికీలో కోయిల కూస్తుంది
గుబురుమావిడిచెట్టు
గుబులొదిలి పచ్చనిపూతేసుకొస్తుంది
రేపు తూరుపెక్కొచ్చే సూరీడుకి
ఇంటికప్పు తడి ఆవిర్లద్దుతుంది

కప్పడిపోయిన గుర్తులన్నీ
గుత్తుల గుత్తుల అత్తర్లవుతాయిక

ఈ ఒక్క రాత్రి గడవనీ
తెల్లారితే వసంతమొచ్చేస్తుంది
చిన్నప్పటి పరికిణీ
లేతగాలి ఎండల్లో రెపరెపలాడుతుంది
ఇంటెనక జామచెట్టులోని జ్ఞాపకాల గూడు
నన్నే తలచుకుంటుంది
అప్పుడెప్పుడో
సందెరుపుల్లో రాసి చెరిపేసిన ఓపేరు
నిబ్బరంగా వానమబ్బై తడుపుతుంది

కొత్త సరుకుల్కి చుట్టిన
పురుకూస వాసనలాంటి పండగొస్తుందిక

ఈ ఒక్కరాత్రీ గడవనీ
తెల్లారితే వసంతమొచ్చేస్తుంది
వెళ్ళిపోయిన సుఖమో, దుఃఖమో
వంతులవారీగా వెన్నెలకాపు కాస్తుంది
కనుగుడ్డులో ఎన్నో వృత్తాలు తిరిగిన గడియారం
ఒకేఒక్క ఆనవాలు చాలంటుంది
చూరుకేలాడుతున్న ఆఖరి మంచుబొట్టులోకి
మల్లెమొగ్గ తొంగిచూసుకుంటుంది

ఈ ఒక్కరాత్రీ గడవనీ

వెనక్కెళ్ళిపోయే సముద్రపు ప్రతి అల
ముందుకొస్తూ అందమైన గవ్వల్ని తెస్తుందిక

ఈ ఒక్కరాత్రీ గడవనీ
తెల్లారితే…..తనొచ్చేస్తాడు!

March 21, 2014 10:49 AM
(జయభేరి మొదటి భాగం – కవిత 3)