ఈ ఒక్క రాత్రి గడవనీ
తెల్లారితే వసంతమొచ్చేస్తుంది
అదిగో,
ఆ మలుపు చివర చెట్టు మొగ్గేస్తుంది
పొద్దుటి కిటికీలో కోయిల కూస్తుంది
గుబురుమావిడిచెట్టు
గుబులొదిలి పచ్చనిపూతేసుకొస్తుంది
రేపు తూరుపెక్కొచ్చే సూరీడుకి
ఇంటికప్పు తడి ఆవిర్లద్దుతుంది
కప్పడిపోయిన గుర్తులన్నీ
గుత్తుల గుత్తుల అత్తర్లవుతాయిక
ఈ ఒక్క రాత్రి గడవనీ
తెల్లారితే వసంతమొచ్చేస్తుంది
చిన్నప్పటి పరికిణీ
లేతగాలి ఎండల్లో రెపరెపలాడుతుంది
ఇంటెనక జామచెట్టులోని జ్ఞాపకాల గూడు
నన్నే తలచుకుంటుంది
అప్పుడెప్పుడో
సందెరుపుల్లో రాసి చెరిపేసిన ఓపేరు
నిబ్బరంగా వానమబ్బై తడుపుతుంది
కొత్త సరుకుల్కి చుట్టిన
పురుకూస వాసనలాంటి పండగొస్తుందిక
ఈ ఒక్కరాత్రీ గడవనీ
తెల్లారితే వసంతమొచ్చేస్తుంది
వెళ్ళిపోయిన సుఖమో, దుఃఖమో
వంతులవారీగా వెన్నెలకాపు కాస్తుంది
కనుగుడ్డులో ఎన్నో వృత్తాలు తిరిగిన గడియారం
ఒకేఒక్క ఆనవాలు చాలంటుంది
చూరుకేలాడుతున్న ఆఖరి మంచుబొట్టులోకి
మల్లెమొగ్గ తొంగిచూసుకుంటుంది
ఈ ఒక్కరాత్రీ గడవనీ
వెనక్కెళ్ళిపోయే సముద్రపు ప్రతి అల
ముందుకొస్తూ అందమైన గవ్వల్ని తెస్తుందిక
ఈ ఒక్కరాత్రీ గడవనీ
తెల్లారితే…..తనొచ్చేస్తాడు!
March 21, 2014 10:49 AM
(జయభేరి మొదటి భాగం – కవిత 3)
“రేపు తూరుపెక్కొచ్చే సూరీడుకి
ఇంటికప్పు తడి ఆవిర్లద్దుతుంది”
“వెనక్కెళ్ళిపోయే సముద్రపు ప్రతి అల
ముందుకొస్తూ అందమైన గవ్వల్ని తెస్తుందిక”
Just beautiful!
తులసిగారూ: కవిత గురించి మళ్ళీ రాస్తాను, ఇంకో సారి చదువుకోవాలి.
ఈలోపు ఈ లింక్ ఇక్కడి మిత్రుల కోసం:
http://teluguanuvaadaalu.wordpress.com/2014/04/09/just-let-this-night-pass-ramineni-mohanatulasi-telugu-indian/
ఆ కవితకి మీ కవితకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఎందుకో శిలాలోలిత గారి ‘ఈ రాత్రి గడిస్తే’ కవిత గుర్తుకొచ్చింది. బహుశా మీ కవితలో ‘ఈ ఒక్క రాత్రి గడవనీ’ అన్న పునరుక్తి వలన అనుకుంటా.
తులసి గారూ:
ఇప్పుడయ్యింది చదవడం!
చదవడం అంటే రెండు మూడు సార్లు మననం చేసుకోవడం! వాక్యాలలో నా ప్రతిబింబాన్ని వెతుక్కోవడం! ఈ కవిత మీరు ఉగాదికి రాసారని ఆలస్యంగా అర్థమైంది. ఉగాదిని ఒక సందర్భం చేసుకొని ఇలాంటి మాటలు అనగలగడం ఆశ్చర్యంగా అనిపించింది.
“అప్పుడెప్పుడో
సందెరుపుల్లో రాసి చెరిపేసిన ఓపేరు
నిబ్బరంగా వానమబ్బై తడుపుతుంది”
“వెళ్ళిపోయిన సుఖమో, దుఃఖమో
వంతులవారీగా వెన్నెలకాపు కాస్తుంది
కనుగుడ్డులో ఎన్నో వృత్తాలు తిరిగిన గడియారం
ఒకేఒక్క ఆనవాలు చాలంటుంది”
“వెనక్కెళ్ళిపోయే సముద్రపు ప్రతి అల
ముందుకొస్తూ అందమైన గవ్వల్ని తెస్తుందిక”
ప్రస్తుతం ఈ పంక్తుల దగ్గిర నిలిచి వున్నాను.
” కొత్త సరుకుల్కి చుట్టిన
పురుకూస వాసనలాంటి పండగొస్తుందిక ” loved this !
ఇక రాయాలని లేదు
ఆ అక్షరాల దగ్గర ఆలోచనల ప్రవాహం ఆగిపోతోంది
పరిగెడుతూ పరిగెడుతూ
రాయి తగిలి బోర్లా పడిన చంటి పాపల్లా ఈ వేళ్ళు
అసలెందుకు రాయాలి
చదివితేనే నిండి పొర్లి పోతుంటే
మనసులో ఖాళీ లేదు
అంతా మరువాల గుబాళింపు లా
అదేదో పులకరింతో పలకరింపో !!!
“తెల్లారితే వచ్చే అతని కోసం నేను తయారవ్వాలిక” (అని ఉంటే బావుండేదా అని నేననుకున్నాను) బావుంది మోహన తులసి గారూ, మిస్ అయ్యాను ఈ కవితను ఏప్రిల్ లో….. పోన్లే ఇప్పుడు దొరికిందిగా భవాని గారి వల్ల.