తెల్లారితే వసంతుడొచ్చేస్తాడు
సంతసాన్నీ, రంగులేరుకుంటున్న ఆమనినీ
ఒళ్లంతా కప్పుకుని మరీ వచ్చేస్తాడు…..
ఉగాది పురుషుడిగా! యుగపురుషుడిలా
లేతలేత తడిచేతులారా ఆమనీ అతన్నాహ్వానిస్తుంది
రంగులంటుకున్న కురులు సరిచేసుకుంటూ
కొత్త లంగాకుచ్చెళ్లలో ఊహలన్నీ దాక్కున్నాయని ఊరిస్తూ
ఆమని…ఆమెదే ఊరింపంతా!
ఆమెదే పండగ సంరంభమంతా!!
ఈ ఒక్కరోజూ గడవనీ, తెల్లారితే వసంతుడొచ్చేస్తాడు!
బూరెల్ని కాల్చుకుంటున్న నూనె వాసనా
గచ్చుపై కారిపోయిన కొబ్బరినీళ్ళ సువాసనా
ముక్కునపెట్టుకుని మరీ వసంతుడొస్తాడు…
మల్లెల మత్తునీ, వెన్నెల తావినీ మోసుకుని మరీ వస్తాడు
వసంతుడు…. తెల్లారగట్లే!
పచ్చదేహం, పసుప్పచ్చ స్వప్నం
కల్సిమెల్సిన క్షణంలో ఓ ఉగాది పిలుపు
ఓ కొత్త కౌగిలింత…. కాలస్సమాగమంలో
తెల్లారితే వసంతమొస్తోంది
వసంతుడితో!
గోరింటాకు లతలతో ఆమనీ
పొదరింటి అత్తరులతో వసంతుడూ
వచ్చేస్తారు…తెల్లారగానే
* * *
అరిసెల వాసనతో పండగొస్తాది
కొత్త బట్టల చివర్నంటించిన పసుపూ పలకరిస్తాది
పైకప్పుపై దాచిన వెన్నగిన్నె కొత్త పంచాంగాన్నిస్తాది
తెల్లారగానే వసంతమొస్తాది…వసంతుడితో!
తెల్లారెలుగు చీకట్లలో వేపపువ్వు పలకరింపులూ
మామిడితీపి గర్వమూ….ప్రతెడాదీ కొత్తర్ధమూనూ
తెల్లారగానే వసంతుడొస్తాడు–కొత్తకోర్కెలమూటతో
ఒక్కరోజు గడవనీ– కొత్తరేఖల వసంతుడొస్తాడు
కొత్తపావడాల ఆమనీ వస్తాది
March 25, 2014 1:00 PM
(జయభేరి మొదటి భాగం – కవిత 7)
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్