అడవులు అంతరిస్తున్న కారణంగా
కౄరమృగాలేవో కొన్ని
మానవాకారంలో
మనమధ్యనే మసలుతూ ఉండి ఉండవచ్చు
శిధిలభవంతులు,ఊడలమర్రిలు
మిగలని కారణంగా
భూతాలో దెయ్యాలో నిజంగానే ఉండి
బట్టలు కట్టుకొని మనలోనే తిరుగాడుతూ ఉండవచ్చు
రాతి యుగానికి తాతయుగం నాటి
నరమాంస భక్షకుల డి.ఎన్.ఎ ను
ఏశిలాజం లోనో కనిపెట్టిన
శత్రుదేశపు శాస్త్రవేత్త ఎవడో తిరిగి వారిని సృస్టించి
రహస్యంగా మనమధ్య వదిలివుండవచ్చు
మనం తెలుసుకోలేకపోతున్నాము గాని
మనమధ్యలోనే అమానవులు ఎందరో ఉండి ఉండవచ్చు
బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ కన్నా ప్రమాదకర వ్యాధి
లవ్ ఫ్లూ
యువ తలల ఆకాశమంతా
నాచు పట్టినట్టు పట్టి ఉండవచ్చు
కారణం ఏమైతే నేమి
ప్రతిరాత్రి పులులు కొండదిగుతున్న వాస్తవం
సగం ఆకాశాన్నిచప్పరిస్తున్న నెత్తుటివాసన
మణిపూరా,అస్సామా,ఆంధ్రప్రదేశా
వాకపల్లి..ఢిల్లీ
ఒక చోటేమిటి
దేశమంతా…
పులుల పాదముద్రల జాడలే
గొడ్డలా
బ్లేడా
యసిడ్ బాటిలా
లాఠీనా..మిలటరీ తుపాకినా
పులికోరకు ఏదోరూపం
ప్రేమికుడా
మొగుడా
ఆగంతకుడా
తండ్రా..కొడుకా
మృత్యువుకు ఏదోవేషం
రాజ్యం అండదండలతో
చెలరేగిన
రాక్షసత్వమో
మతహంకారుల మూఢత్వపు పొగరో
ప్రపంచీకరణచే ఉన్నతీకరించబడిన
అధమత్వపు ఆనవాళ్ళో
ఏవైతేనేం
మరణవాజ్మూలంపై మరకలు మరకలుగా కానవస్తున్నై
నిజం
ప్రజలకు రక్షణలేదు
ప్రభుత్వాలకు దక్షత లేదు
మాఫియానుంచి ప్రజలనకు
మృగాళ్ళ నుంచి స్త్రీలకు
అగ్రవర్ణాలనుంచి దళితులకు
అధికసంఖ్యాకులనుంచి అల్పసంఖ్యాకులకు
ఎప్పుడూ భయం వెంటాడుతునే ఉంటుంది
అదను కోసం మృత్యువు వెంటాడినట్టు
బైకుమీదొచ్చి
బంగారు గొలుసు లాక్కుపోయినంత సుళువుగా
మనుషుల్ని అమాంతంగా ఎత్తుకు పోతున్న మానవదొంగలు
కార్లు బస్సులు
మనిషిని మానప్రాణాల్నిసరుకులుల్ని చేసి మోసుకు పోతున్న ఘటనలు
మా నవ మస్థిష్కాలు ముదిరి ముదిరి బండరాళ్ళవుతున్న స్థితి
దేశం నిండా
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను
అయితే
దేశమేదన్నదే ప్రశ్న
దేశమంటే మనుషులేనని తెలుసుకున్నాక
నేను మనుషుల్లో దేశాన్ని వెతుకుతున్నాను
సరిహద్దులు నదులు కొండలు దేశం కానట్టే
శరీరాలు బట్టలు బంగారాలు మనుషులు కాలేవు కదా
దేశమంటేఅంతరాత్మ అంత:సారం
పోలీసులు మిలటరీయే దేశమని చూపెడుతుంది రాజ్యం
దామిని సాక్షిగా
నేనిపుడు
ఆత్మవిస్వాసమే దేశమని నమ్ముతున్నాను
నగరంలోహఠత్తుగా ఏర్పడిన సముద్రమే దేశమని నమ్ముతున్నాను
నలుమూలలనుంచి ఉప్పొంగిన ప్రవాహం
చలిచీమలు
బతుకు తేనెపట్టు ధ్వంసమైతే
చెలరేగిన సమూహం
తేనెటీగలు
దేశంకాక ఏమవుతాయి
న్యాయం కావాలని నినదిస్తున్న ప్లేకార్డులు
ఆసేతు హిమాచలం
పిడికిళ్ళెత్తిన తరంగాల హోరు
ప్రతి గుండెలోప్రతిద్వనిస్తున్న ఝాంకారం
దేశంకాక ఏమవుతాయి
తీరం గుండెలపై ప్రశ్నిస్తున్న అలలు
ఏక్..దో..తీన్..చార్ బందుకరో అత్యాచార్
పదమూడు రోజులుగా చేసిన పోరాటం
ఫలించక పోవచ్చుగాక
ఒక్కోసారి ఆత్మవిశ్వాసమే ఓడిపోవచ్చుగాక
స్పూర్థినిచ్చిన వ్యక్తులే కనుమరుగు కావచ్చుగాక
స్పూర్థి మాత్రం నిలచే ఉంటుంది కదా
“అమ్మా.. నాకు బతకాలనుంది”అన్న ఆవేదన వెనుక
అమ్మా.. ఈదేశం బతకాల్సిఉంది అన్న ఆశ వినిపించడం లేదా
పులులను నిరోధించాలి
నిర్వ్యాపారమే ఏకైక వ్యాపారం చేసి
మనిషిని వస్తువుగా మార్చిన పాలకుల కపటత్వాన్ని నిరోధించాలి
స్వార్ధపు స్వాముల్నిభూస్వామ్యపు భావజాలాన్ని నిరోధించాలి
మనలోపల వలవేసిమానవత్వాన్ని మొత్తంగా
లాగేస్తున్న విదేశీ కుట్రలను నిరోధించాలి
ఎందుకంటే
ఈదేశం బతకాలి
సమానత్వపు పునాది మీద సహజీవనం వర్ధిల్లాలి
రామకృష్ణ గారు,
‘అట్టుడికించిన అత్యాచారాన్నీ మీ కవిత విస్తృతమైన కోణంలో చర్చించింది.
ఇప్పుడు, మృగాలేవో, ఎక్కడున్నాయో అందరూ తెలుసుకోగలగడం చాలా అవసరం.
క్రింది వాక్యాలు బాగా కదిలించాయి.
దామిని సాక్షిగా
నేనిపుడు
ఆత్మవిస్వాసమే దేశమని నమ్ముతున్నాను
“అమ్మా.. నాకు బతకాలనుంది”అన్న ఆవేదన వెనుక
అమ్మా.. ఈదేశం బతకాల్సిఉంది అన్న ఆశ వినిపించడం లేదా
-నారాయణ.
నారాయణ గారు ,మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను
అయితే
దేశమేదన్నదే ప్రశ్న
దేశమంటే మనుషులేనని తెలుసుకున్నాక
నేను మనుషుల్లో దేశాన్ని వెతుకుతున్నాను
సరిహద్దులు నదులు కొండలు దేశం కానట్టే
శరీరాలు బట్టలు బంగారాలు మనుషులు కాలేవు కదా
దేశమంటేఅంతరాత్మ అంత:సారం……
//దామిని సాక్షిగా
నేనిపుడు
ఆత్మవిస్వాసమే దేశమని నమ్ముతున్నాను
నగరంలోహఠత్తుగా ఏర్పడిన సముద్రమే దేశమని నమ్ముతున్నాను
నలుమూలలనుంచి ఉప్పొంగిన ప్రవాహం
చలిచీమలు
బతుకు తేనెపట్టు ధ్వంసమైతే
చెలరేగిన సమూహం
తేనెటీగలు
దేశంకాక ఏమవుతాయి…..// sir I really appreciate you for such a wonderful poem … its like a note for me to learn about writing a poem too .. great sir …
బావుంది రామక్రిష్ణ గారు …బహుకోణాల్లో చూయించారు …కాని అవిపులులే కాదు ..పిశాచాలు …అనవసరంగా ..హింసచేసే …మనిషినీడలే …మన దౌర్భాగ్యానికి ….ముర్తీభవించిన నిదర్శనం
కాంతి శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు సార్
మార్గరేట్ గారు మీ స్పందన నాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది.ధన్యవాదాలు