కథ

డెడ్ మేన్ పేరడాక్స్

మే 2014


పత్రికలలో వచ్చిన వార్తలు ఏమయినాగానీ, సత్యాది ఆత్మహత్యకాదు అని నేననుకోవడానికి బలవత్తరమైన కారణాలున్నాయి. అందులో మొదటిది, నా యాభయ్యేళ్ల సాన్నిహిత్యంలో వాడిదగ్గర పిరికితనం నాకు కనిపించకపోవడం. పులి మీదకు దూకితే వాడేంచేసేవాడో తెలియదుగానీ, వెన్నుమాత్రం చూపించడని నేను కరాఖండీగా చెప్పగలగడానికి ఒక కారణం నేను పక్కనున్నప్పుడు జరిగిన ఒక సంఘటన. న్యూయార్క్ సబ్వేలో ఒక నల్లవాడు తుపాకీని వాడి నడుముకానించి వాలెట్ని ఇమ్మన్నప్పుడు, ప్రశాంతంగా దాన్నివ్వడమేకాక, “డబ్బులు తీసుకుని, వాలెట్ నాకు తిరిగిచ్చెయ్, అందులో డ్రైవర్స్ లైసెన్స్ కావాలి, అది లేకపోతే ఆ మోటార్ వెహికిల్స్ డిపార్ట్మెంటుకి వెళ్లడం కోసం అనవసరంగా ఒక వర్క్ రోజు వేస్ట్ చెయ్యాలి,” అని ఎంతమంది అనగలరు? వాడి పక్కనేవున్న నేను నోట మాట రాక నిలబడ్డాను మరి! తరువాత సబ్వే వయిపు వెళ్లడానికీ, ఏ వయసువాడయినా సరే, నల్లవాడి నీడని చూడడానికీ నేను భయపడ్డాను గానీ, వాడు న్యూయార్క్లో ఉన్నన్నాళ్లూ సబ్వేలోనే ప్రయాణంచెయ్యడమేగాక రోడ్డు మీద నల్లవాళ్లమధ్య నిలబడ్డా పట్టించుకునేవాడుగాదు.

లేకపోతే, ఇరవై నాలుగు గంటలూ లాబ్లోనే గడుపుతున్నాడంటూ వాణ్ణి వదిలి వెళ్లిన రంజని సామంత్దగ్గర చేరిందని తెలిసినప్పుడు ఆత్మహత్యచేసుకునుండాలి. “రోబో” సినిమాలో తనకెక్కువ సమయాన్నికేటాయించకపోయినా ఐశ్వర్య రజనీకాంత్ని వదల్లేదుగానీ, నిజజీవితంలోమాత్రం, ఐశ్వర్యని అనుకరించాలని రంజని ఏమాత్రం అనుకోలేదు. అయినాగానీ, కోపంమాట దేముడెరుగు, ఆఖరికి నిరాశకూడా వాడి ఛాయలకిరాలేదు. పైగా, లాబ్లోకొచ్చి ఆ విషయాన్ని మొహం మీదవున్న మాస్క్ని తొలగించి మొహంలో మొహం పెట్టల్లా “నేను నిన్ను వదిలి వెడుతున్నాను,” అని రంజని చెబితే, ఎమోషనేదీ లేకుండా “అలాగా” అన్నాడని వాడిమీదకి చేతికందిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్ని ఆమె విసిరెయ్యగా అది పగిలితే, “చచ్చాం, ఇప్పుడు దీన్ని మళ్లీ తెప్పించుకోవడానికి వారంరోజులు పడుతుంది,” అని తలపట్టుక్కూచున్నాట్ట! వాడే చెప్పాడు ఆ సంగతి!

నిజంగా నిరాశ వాడి నీడకు చేరగలిగివుంటే, అది, వాడు కనిపెట్టిన గాడ్జెట్మీద అన్ని హక్కులూ తనవేనంటూ పార్ట్నర్షిప్లో వాడి వాటా జీరో అని సామంత్ చెప్పినప్పుడు అది జరిగుండాలి. ప్రపంచంలో ఏ మారుమూలచూసినా మనుషుల చేతుల్లో వాడి రీసెర్చ్ ఫలం కనిపిస్తున్నప్పుడు, దాని వల్లవచ్చే లాభాలమాటటుంచి, అసలు దాన్ని కనుగొన్నవాడిగా వాడికి గుర్తింపే లేకపోతే ఆ పరిస్థితిలో వున్నవాళ్లల్లో ఎంతమంది ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యకుండా వుంటారు? వాడికసలాంటి ఆలోచనే లేనట్లు ఇంకేదో కనిపెట్టాలంటూ ముందుకి సాగిపోయాడు.

ఇంతకీ, ఇరవై నాలుగు గంటలూ సత్యా తనతో గడపడాన్ని గర్వపడిన ఆ లాబ్ – వాడు ఉండే ఇంటి కార్ గరాజే! మొదట్లో ఇన్వెస్టర్గా ప్రోగ్రెస్ చూడడానికి వస్తున్నానంటూ ఆ లాబ్కి వారానికి ఒకసారి వచ్చిన సామంత్ తరువాత రోజుకోసారి రావడం మొదలుపెట్టి, లాబ్లోకి అడుగుపెట్టకుండానే ఆ యింట్లో రాత్రంతా గడుపుతున్నాడన్న విషయంగూర్చి ఆలోచించే వ్యవధేవుంటే సత్యా చేసిన పరిశోధన అంత విజయవంతమయి వుండేదీకాదు, దానివల్ల సామంత్ కొన్ని మిలియన్లకి (డాలర్లల్లో) అధిపతి అయ్యేవాడూ కాదు. కొన్ని పెన్నీలు మాత్రమే సత్యాకి ఇచ్చాడు – తన కళ్లకి కనబడకుండా వెళ్లిపోవడానికి ఇచ్చిన లంచం అది. సామంత్ చేతినుండీ రాలినవి అతని ఆస్తితో పోలిస్తే పెన్నీలేగానీ, అవి మాత్రం సత్యా ఇండియా చేరి అక్కడ లాబ్ పెట్టడానికి తోడ్పడ్డాయి. ఆ పెన్నీలు దొరకడం సత్యా దురదృష్టమో లేక నా అదృష్టమో మీరే చెబుతారు. కానీ చెప్పొచ్చినదేమిటంటే, ఇలాంటి పరిణామాలని అర్భకులెలా ఎదుర్కొంటారో మనం రోజూ వార్తల్లో చూస్తూంటాం. కానీ, సత్యా అర్భకుడు కాడు మరి! కనీసం అటు దేవుణ్ణి దూషించడంగానీ, ఇటు బాబాలవెంట తిరగడంగానీ చెయ్యలేదు. ఇంకా ఉదాహరణలు చెప్పి మీ సమయాన్ని వృథాపరచడంగానీ ఆసక్తిని చంపడంగానీ చెయ్యను.

సత్యా ఇండియాకి వెళ్లిపోతున్నాడంటే నేనంతగా ఆశ్చర్యపోలేదు. ఒకప్పుడు రీసెర్చ్ లాబ్స్లో పనిచేసిన అనుభవంవున్నందువల్ల, ప్రతీ మూణ్ణెల్లకోసారీ లేకపోతే ఆర్నెల్లకోసారీ ప్రోగ్రెస్ చూపించలేని ప్రాజెక్టుల ఎత్తివేతని భరించగలిగే స్థితిలో వాడులేడు. అప్పటికే ఒకసారి అరుపులూ, కేకలతో పోలీసులచేత కంపెనీనించి బయటికి వెళ్లగొట్టించుకున్న ఖ్యాతి వాడిదయినప్పుడు వాణ్ణి ఆహ్వానించడానికి ఏ కంపెనీ ముందుకొస్తుంది? అలాంటి స్థితిలోనేగా వాడిమీద దాదాపు అయిదేళ్లు సామంత్ ఇన్వెస్ట్చేశాడు!

వాడి అదృష్టమల్లా పిత్రార్జితమైన ఇల్లొకటి ఇంకా వాడి స్వంత ఊళ్లోవుండడం, రియల్ ఎస్టేట్ బూం వల్ల అమెరికాలో వాడి ఇంటిని కొన్నధరకి రెండు రెట్లకి అమ్మెయ్యగల్గడం. ఏదో సామెత చెప్పినట్లు, వాడు ఏమీ చెయ్యకుండా ఇండియాలో ఎలా కూర్చోగలడన్న నా ప్రశ్నకు రెణ్ణెల్లలోనే జవాబుదొరికింది వాణ్ణించీ వచ్చిన ఫోన్కాల్వల్ల. ఏదో ఎక్విప్మెంట్ ఇండియాలో దొరకట్లేదు, ఫలానా ఆన్లైన్ కేటలాగ్నించీ కొని తెచ్చిపెట్టు అనేది దాని సారాంశం. సంవత్సరానికి అయిదారుసార్లు బిజినెస్ పనులవల్ల ఇండియా వెళ్లిరావడం నాకలవాటే.
మామూలుగా అయితే, ఇండియా చేరిన తరువాత హైదరాబాద్ తప్ప ఇంకోచోటికి వెళ్లాల్సిన అవసరం నాకుండదు. అలాంటిది, పుట్టి పెరిగిన ఊళ్లోని వీధుల్లో తిరగడానికి మళ్లీ వీడివల్ల అవకాశం దొరికింది గనుక, సంవత్సరానికి ఒకసారయినా, “అబ్బ, చంపుతున్నావ్రా!” అంటూనే వెళ్లి, వాణ్ణి కలిసి, వాడు తెమ్మన్నవాటిని స్వయంగా అందజేస్తుంటాను. వాడికి కావలసిన వస్తువులు అమెరికాలో అయితే ఇట్టే దొరికేవి – మహా అయితే ఒక వారంరోజులు ఆగవలసివచ్చేది. అలాంటిది, నేను తెచ్చి వాడికి ఇవ్వడం అంటే నెలలపాటు నిరీక్షణ. దీనివల్ల నీ పరిశోధన కుంటుపడట్లేదా అని అడిగాను. ఆశ్చర్యకరంగా, లేదన్నాడు. “కావలసింది తొందరగా దొరికినప్పుడు, దాన్ని తెచ్చి అమర్చిన తరువాతగానీ అది పనిచేస్తుందో లేదో తెలుసుకునేవాణ్ణిగాదు. ఉదాహరణకి ఎడిసన్ లైట్బల్బులో టంగ్స్టన్ ఫిలమెంట్ వేస్తే మాత్రమే అది పనిచేస్తుందని తెలుసుకునేముందర దాదాపు వంద వేరే ఫిలమెంట్లని వాడాడు. ఈ కాలంలో అలాంటి పరిశోధనలుచెయ్యాలంటే చాలా ఖర్చవుతుంది. ఇప్పుడు మనకి లభ్యమయ్యే ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువకాబట్టి, నేను సిములేషన్స్ చేసి, ఆ పార్ట్ కొనేముందరే అది పనిచేసే అవకాశం హెచ్చుగావుందని రూఢిచేసున్న తరువాతే ఆర్డరిస్తున్నాను. ఆ విధంగా ఈ నిరీక్షణ నాకు మేలేచేస్తోంది,” అన్నాడు వాడు.

వాణ్ణి కలవడానికి వెళ్లినప్పుడు ఆ యింటి చుట్టుపక్కలవాళ్లు నన్ను ఆసక్తిగా చూడడాన్ని నేను గమనించకపోలేదు. “మీరాయనకి చుట్టమా సార్?” అనడిగారు కూడా. కాదు, స్నేహితుణ్ణని చెప్పా. “ఆయన కెవరూ లేరా సార్, చూడ్డానికి ఎవరూ రారు?” అనికూడా అడిగారు. ఎందుకయినా మంచిదని ఆ అడిగినవాళ్ల ఫోన్నంబర్ తీసుకున్నా. ఇండియాకెళ్లినాగానీ, వాణ్ణి కలవడానికి కుదరని నాలుగయిదుసార్లూ వాళ్లకి ఫోన్చేసి వాడింకా బ్రతికేవున్నాడని నిర్ధారణ చేసుకునేవాణ్ణి. వాడికి ఫోనుందని నాకు తెలుసు. కానీ, నేను ఫోన్చేసినప్పుడెప్పుడూ దాన్ని వాడు ఆన్సర్ చేసిన పాపానపోలేదు.

ఇండియాకెళ్లిన అయిదారేళ్లకనుకుంటా, ఫోన్చేసి, విస్కీ పట్రమ్మన్నాడు. అంతే. ఏ ఎలక్ట్రానిక్ పరికరమూ తెమ్మనమని చెప్పలేదు. షాకయ్యా. క్వాలిటీ సరుకు పట్టుకుని రెణ్ణెల్లల్లో వాడిముందున్నాను.

“దేనికి ఈ సెలబ్రేషన్?” కుతూహలాన్ని ఎంతసేపని కప్పెట్టగలను?

“గతాన్ని – ముఖ్యంగా బాల్యాన్ని ఎంజాయ్ చెయ్యగలుగుతున్నందుకు,” అన్నాడు.

తరువాత వాణ్ణేమడిగానో గుర్తులేదుగానీ, వాడి లాబ్ టూరిచ్చాడు. లాబ్ అంటే, వాడి పాత ఇంట్లో నాలుగయిదు గదులు. రకరకాల బాక్సులూ, వైర్లూ, లైట్లతో నిండిపోయున్నాయి. కంట్రోల్ పానెల్ రకరకాల డిస్ప్లేలతో విమానంలో ఫ్లైట్డెక్ని గుర్తుకుతెచ్చింది. కరెంటు సప్లై ఎప్పుడూ అంతంతమాత్రమే గనుక జనరేటర్ పెట్టుకున్నాడు. అక్కడున్న పెద్ద బాక్సులన్నీ – రేకులతో చేసినట్లుగా వున్నవి – అన్నీ ఇండియా సరుకే. కొన్నింటిని స్పెషల్గా ఆర్డరిచ్చి చేయించుకున్నానన్నాడు. “చాకులాంటి కుర్రాళ్లున్నారు మెషీన్షాపుల్లో,” అన్నాడు.

“ఏం చేస్తుందీ మెషీన్?” అడిగాను.

“టైంతో ఆడుకుంటుంది,” అంటూ ఒక బటన్ని నొక్కాడు. ఒక రాక్షసుడు నోరు తెరిచి నాలుకని బయటికి పెట్టినట్లు నాకు అనిపించడానికి కారణం, ఇంట్లో తయారుచేసినందువల్ల కొద్దిగా క్రూడ్గా ఉన్నట్లనిపించడం అయ్యుంటుంది. లేకపోతే, సినిమాల్లో అప్పుడప్పుడూ కనిపించే ఎమ్మారై మెషీన్ బెడ్లాగేవుంది ఆ నాలిక.

“ఎలా?”

“కాలాన్ని వెనక్కి నెట్టి,” అని, అర్థంకాని నా మొహాన్నిచూసి, “టైం ట్రావెల్ని సాధ్యపరిచే మెషీన్లగూర్చి వినలేదా? ఎన్నేళ్లబట్టీ అమెరికాలోవున్నావ్?” చిరాకుపడ్డాడు.

అప్పుడు నాకర్థమయింది. గతంలోకి వెళ్లి ఆ అనుభవాలని పొందగలిగేలా చెయ్యగలిగే టైం మెషీన్లగూర్చి సైన్స్ ఫిక్షన్ కథల్లో చదివాను. డైనోసార్లని వేటాడ్డంగూర్చి, రోమన్ల, గ్రీకుల గతవైభవాలని ప్రత్యక్షంగా సందర్శించడంగూర్చీ, మొహంజోదారో నాగరికతని స్వయంగా కళ్లతో చూడగలగడంగూర్చీ రాసిన కథలు చదవడం నాకు గుర్తుంది. అలాంటి అనుభవాలని ఈ మెషీన్ సాధ్యపరుస్తుందా!

“డైనోసార్ల దగ్గరకి తీసుకెడుతుందా?”

“తెలీదు,” అన్నాడు అనాసక్తతతో. ఆశ్చర్యపోవడం నావంతయింది.

“తెలియనప్పుడు దీన్ని టైం మెషీన్ అని ఎలా అనగలవ్?”

“ఒక రోజుని వెనక్కెళ్లేలా చెయ్యగలిగినా అది టైం మెషీనే అవుతుంది.”

“నిన్నటి అనుభవాలూ, జ్ఞాపకాలూ షార్ట్ టర్మ్ మెమరీలో నిక్షిప్తమవడంవల్ల వాటిని నెమరేసుకోవడానికి ఏ మెషీనూ అవసరంలేదు.”

“కరక్టే. ఈ మెషీన్ టైం ట్రావెల్ని సాధ్యపరుస్తుందని నిన్ను నమ్మించవలసిన అవసరంలేదు. ఏం చేస్తుందని అడిగావ్ గనుక చెప్పాను. దీనిద్వారా నా చిన్నతనాన్ని – శిశువుగా ఉన్నప్పుడు కాళ్లమీద పడుకోబెట్టి మా అమ్మమ్మ నీళ్లుపొయ్యడాన్ని, మా నాన్న పొట్టమీద పడుకుని నిద్రపోవడాన్ని, రెండేళ్ల వయసులో మా అమ్మ నా పొడుగాటి జుట్టుకు కొప్పెనిపెట్టి దానికి పూలదండ నమర్చడాన్నీ, ఎలిమెంటరీ స్కూల్లోవున్నప్పుడు నువ్వూ, నేనూ, రాఘవా కలిసి సుబ్బారాయుడిగారింట్లో దొంగతనంగా జామకాయలని కొయ్యడాన్నీ – అరవయ్యేళ్లు ఇంటూ 365 రోజులూ – ఆఖరి ఊపిరి పీల్చేదాకా గుర్తుతెచ్చుకోవడానికి జ్ఞాపకాలు అనంతం. వాటికి ఇంద్రధనుస్సు మెరుగులని అద్దుతోంది, అప్పుడు చుట్టుపక్కల మనుషుల్లో చూసినా అర్థంకాని భావాలని ఇప్పుడు ప్రేక్షకుడిగా చూడగలగడం – అద్భుతంగావుంది!”

“ఉదాహరణకి, రంజని నాతోనే ఉండేలా చెయ్యడం? దానికి నేనెందరి రాతలు మార్చాలి!”"టైం మెషీన్లగూర్చి రాసిన కథల్లో గతంలోకి వెళ్లి, అప్పుడు జరిగిన సంఘటనని ఏమయినా మారిస్తే భవిషత్తు – గతానికి వర్తమానం భవిష్యత్తే గదా – మారుతుందని రాస్తారు గదా, నువ్వలా వర్తమానాన్ని మార్చేలా చెయ్యడానికి ఏమీ నీ టైం ట్రావెల్స్లో ప్రయత్నించలేదా?”

“నువ్వు కనిపెట్టిన గాడ్జెట్వల్ల సామంత్ అంత లాభపడ్డాడు కదా, పోనీ, నీకు లభించాల్సిన ఆ క్రెడిటయినా -”

“ఆ గాడ్జెట్ ఎవరిద్వారా సాధ్యమయిందో, వాడికీ, నీకూ, నాకూ తెలుసు. అది ప్రస్తుతం ఇక్కడకూడా రోడ్డుమీదకెడితే కనిపిస్తుంది. సాంకేతిక ప్రగతికి సహాయపడ్డందుకు నాకు గర్వంగానేవుంది. దాన్ని నానించీ వేరుచెయ్యడం ఎవరికీ సాధ్యంకాదు. నువ్వు ట్రై చేస్తావా? కావాలంటే డైనోసార్ల కాలానికి వెళ్లు,” అన్నాడు.
వాడు మాటమార్చాడని అర్థమవుతూనేవుంది. ట్రై చెయ్యకపోతే, “కథల్లో చదివినది ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం దొరికినప్పుడు జారవిడుచుకున్నావా?” అని ఎవరయినా నన్ను ప్రశ్నించవచ్చునేమోగానీ, ఆ మెషీన్ నాలికమీద పడుకుని దాని లోపలికి వెడితే బయటికి తిరిగొస్తానా అన్న విషయంగూర్చే నా భయం. రెండేళ్ల క్రితం ఎమ్మారై మెషీన్లో కెళ్లిన అనుభవంవుందిగానీ, అది ఒక అమెరికన్ కంపెనీ తయారుచేసింది. అమెరికన్ హాస్పిటల్లో ఉపయోగించబడుతోంది. దానికి సర్టిఫికేషన్లన్నీవున్నాయ్. ఏమయినా హెచ్చుతగ్గులొస్తే, ఓ పట్టుపట్టడానికి లాయర్లు లైన్లుకడతారు. కోర్టుకేసు మాటటుంచి వీడి మెషీన్కి ఎలాంటి సర్టిఫికేషన్లనీ ఆశించడంకూడా తప్పే. నా ఇంజనీరింగ్ పరిజ్ఞానం, ఈ మెషీన్లో నా శరీరం భరించే శక్తికిమించి మాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయినా, హై ఎనర్జీ ఎలక్ట్రాన్లో, లేక ఎక్స్-రే రేడియేషనో ప్రొడ్యూస్ అయినా, వాటివల్లకలిగే దుష్పరిణామాలకి బాధ్యత ఎవరిది అన్న ప్రశ్నని లేవనెత్తింది.

నా ఆలోచనలని పసిగట్టినట్లున్నాడు. “ఓ పది నిముషాలపాటు నేను వెళ్లొస్తాను, నీ కళ్లముందరే. తరువాతే నువ్వెడుదువుగాని,” అన్నాడు. సరేనని తల ఆడించాను.

సత్యా ఆ మెషీన్ కంట్రోల్ పానెల్మీదనున్న బటన్లనేవో నొక్కాడు. పది నిముషాలు సెట్చేశాడు. “ఇది అలారం లాగే. సమయం అయిపోగానే వర్తమానానికి తెచ్చేస్తుంది,” అని వివరించి, “నువ్వేం చెయ్యనక్కర్లేదు, చూస్తూవుండు,” అని ఆ రాక్షసుడి నాలుకమీద పడుకున్నాడు. ఒక పదిసెకన్లల్లో ఆ నాలుక ఆ మెషీన్లోకి వెళ్లిపోయింది. అప్పుడు, ఆ కంట్రోల్ పానెల్మీది డిస్ప్లేలోవున్నఅంకెలని చూశాను – 1960, సెప్టెంబర్ 6, పొద్దున్న పదిగంటల అయిదు నిముషాలు. ఆ తారీకునీ, ఆ సమయాన్నే ప్రత్యేకంగా ఎందుకు ఎన్నుకున్నాడా అని అనుమానమేసింది. డిస్ప్లేలో టైం మారడం గమనించాను. పదినిముషాల తరువాత ఆ మెషీన్ ఆటోమేటిగ్గా నాలికని వెళ్లబెట్టింది. బయటకొచ్చిన తరువాత చెప్పాడు – “నేనున్న స్కూల్లో నువ్వు జాయిన్ అయింది ఆ సంవత్సరమేనని గుర్తుందిగానీ తేదీ గుర్తులేదు. సెప్టెంబర్ 6కే స్కూల్లోవున్నావ్. ”

వాణ్ణి నమ్మాలో లేదో తెలియలేదుగానీ, ఆ మెషీన్లో పదినిముషాలసేపుంటే ప్రమాదంలేదనిపించింది. ఎందుకయినా మంచిదని, అయిదు నిముషాలు సేఫ్టీ మార్జిన్క్రింద ఉంచుకుని, “ఒక్క అయిదు నిముషాలు మాత్రం,” అన్నాను. అంతే కాక వాడు అయిదునిముషాలే సెట్చెయ్యడం చూశానుకూడా.”ఏ సంవత్సరాన్ని డయల్చెయ్యమంటావో చెప్పు.”

“డైనోసార్ల యుగానికి.”

“అంటే, మిలియన్ల సంవత్సరాల వెనక్కి. నేను ఎప్పుడూ ఈ మెషీన్లో అంతవెనక్కి వెళ్లాలనుకోలేదుగనుక అన్ని డిజిట్లని ప్రోగ్రాంచెయ్యలేదు – ఇరవయ్యవ శతాబ్దంలో సాఫ్ట్వేర్ ప్రోగ్రాముల్లో సంవత్సరానికి రెండంకెలే కేటాయించినట్లుగా. మరి, ఇందాక డైనోసార్ల యుగానికి వెడతావా అనడిగావెందుకు, అని నువ్వడగొచ్చు. కాసేపు కూర్చుంటే సాఫ్ట్వేర్ మారుస్తాను.”

సాఫ్ట్వేర్లో చేసే చిన్నచిన్న మార్పులు అసలు ప్రోగ్రాంకే ఎంత ఎసరుపెట్టవచ్చో స్వయంగా అనుభవంవున్నవాణ్ణి గనుక “వద్దులే,” అన్నాను. పైగా, ఇప్పుడు సాఫ్ట్వేర్ మారిస్తే, దాని తరువాత ఆ మెషీన్ సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి వాణ్ణి మళ్ళీ నాకన్నాముందు కాలయాత్ర చేయించాలి.
“క్రీస్తుశకంలో ఏ రోజయినా సెలెక్ట్ చేసుకోవచ్చు.”

“నేను పుట్టకముందరి ఏ రోజయినా ఫర్లేదు,” అన్నానుగానీ, అయిదున్నర నిముషాల తరువాతగానీ నేనెంత తప్పుచేశానో అర్థంకాలేదు.

నాకళ్లముందరే అయిదునిముషాలు సెట్చేశాడు. కాలయంత్రం తన నాలుకని వెనక్కు లాక్కున్న దాదాపు ముఫ్ఫై సెకన్ల తరువాత నేనొక మైదానం మధ్యలో నిలబడివున్నాననీ, నాచుట్టూ వేలకొద్దీ జనమున్నారనీ అర్థమైంది. నా శరీరంమీద రెండు పెదవుల స్పర్శ తెలిసిన తరువాతగానీ నేనొక పసికందుకి స్తన్యమిస్తున్నానని తెలియలేదు. ఉలిక్కిపడ్డాను. చేత్తో తడుముకుని రెండు రొమ్ముల ఉనికినీ నిర్ధారణచేసుకున్నాను. లంగా సర్దుకుంటూ నేను పూర్తిగా స్త్రీరూపంలోవున్నానని గ్రహించాను. ముక్కుకి పోగు, చెవులకి కమ్మలూ, లంగా, దుప్పట్టా, పాలుతాగుతూ నన్నంటిపెట్టుకున్న పసికందూ నన్ను శిలావిగ్రహంలా నిలబెట్టాయి. “హే భగవాన్!” అని పైకిచూసిన తరువాత చుట్టూ చూస్తే నేను పంజాబీలమధ్యలో నిలబడ్డానని అర్థమైంది. మైక్లో ఎవరిదో ఉపన్యాసం వస్తోందిగానీ ఒక్కముక్క అర్థం కావడంలేదు. ఇంతలో వెనకనించీ తోపిడి మొదలయ్యింది. “బ్రిటిష్ పోలీసులు!” అని వెనకనించీ వచ్చిన వార్త ఆ సభలో మధ్యలోవున్న నన్ను చేరడానికి ఎంతోసేపు పట్టలేదు. దూరంగా స్టేజీమీదవున్న వక్త ఇంకాసేపు అలాగే ప్రసంగించాడు. అసలే ఈ జెండర్ ఛేంజ్తో స్టన్అయివున్నాను. ఇప్పుడీ తోపులాట. అప్పుడే ఏంచూశావ్ అన్నట్టు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. తోపుడుకాస్తా తొక్కిసలాటలాగా మారింది. ఎక్కడకని వెళ్లేది? అందరిలాగా చెల్లాచెదరై పరుగెట్టి ముందుకుచూద్దునుకదా, నుయ్యి! వెనక్కిచూస్తే కొందరు తుపాకీగుళ్లు తగిలి పిట్టల్లా నేలకురాలడం కనిపించింది. నా పక్కనించీ కొందరు వెళ్లి ముందున్న బావిలో దూకారు. ఒకళ్లు నాకేదో చెప్పారుకూడా. భాష రాక అర్థంకాలేదు. ఇంకొకళ్లు నా చెయ్యిపుచ్చుకొని లాగి వాళ్లతోబాటు దూకించినప్పుడు అర్థమైంది – వాళ్లు నన్నుకూడా దూకమంటున్నారని. దూకాను సరే, ఈత రాదే! నా రొమ్ముని కరచుకొనివున్న పిల్లతోసహా నేను మునుగుతున్నాను. నీళ్లు నోట్లోకి పోతున్నాయి. ఊపిరి అందడంలేదు. ఇంతలో ఎవరో ఒకరు సరిగ్గా నా నెత్తిమీదకి దూకారు. అప్పుడర్థమైంది – నేనున్నది జలియన్వాలాబాగ్లోనని!

ప్రాణంపోయిందని నిర్ధారించబడ్డవాడు, లేదు, బతికేవున్నాను అని నిరూపించేటప్పుడు తీసే మొదటి శ్వాసలా పెద్ద శబ్దంచేస్తూ ఊపిరి పీల్చుకున్నతరువాత కొన్ని సెకన్లకి ఆ రాక్షస నాలికమీంచి బయటపడి లేచినిల్చున్నాను.

సత్యా నవ్వాడు – పట్టలేని కోపంతో ఆ నాలికమీంచి లేచి నిల్చున్నవాణ్ణికాస్తా, ఒళ్లంతా చెమటలతో నిండిపోయినాగానీ, నోరుతెరిచేముందరే నేను ఆడదాన్నికాదని నిర్ధారించుకోవడంకోసం తడుముకోవడాన్ని చూసినప్పుడు. నేనుకూడా ఫక్కుమని నవ్వాను.

“ఈ మెషీన్ నన్ను నిజంగా కాలయాత్రచేయించిందనీ, నువ్వా అనుభవాన్ని ప్రోగ్రాంచెయ్యలేదనీ ఋజువేంటి?” ప్రశ్నించాను.

“నీ జీవితంలోని అనుభవాలనే నీకు చూపిస్తే జ్ఞాపకాలలోతుల్లోంచి తవ్వితీశానని అనేవాడివి. ఈ తారీకుతో నయితే, పుస్తకాలల్లో చదువుకోవడంవల్ల ముందరే కొద్దిగానయినా పరిచయముందిగానీ, దాని వివరాలు నీకు ఇప్పుడు తెలిశాయి!”

ఒక్క క్షణమాలోచించిన తరువాత వాడు చెప్పినది లాజికల్గానే ఉందనిపించింది. “ఇంకేం, అమ్మెయ్!” అన్నాను.

“ఎందుకూ?” అన్నాడు అమాయకుడిలా.

“పిచ్చోడిలా మాట్లాడతావేంటి? ఎంత డబ్బు చేసుకోవచ్చో అస్సలు అయిడియా లేదా?”

“నాకెందుకు, డబ్బు?”

“పోనీ, ప్రపంచానికి నూతన టెక్నాలజీని అందిస్తున్నాని అనుకునైనా సరే – ఎడిసన్ లైట్ బల్బుని అందించినట్లుగా.”

“ఇది నాకోసం నేను చేసుకున్నది – అంతే.”

“నేనీసారి వచ్చేసరికి ఆ డైనోసార్ల కాలందాకా వెళ్లొచ్చేలా మార్చు. నీకు బ్రహ్మాండమయిన కాంట్రాక్టులని తెచ్చే బాధ్యత నాది!”

“చూద్దాంలే,” అన్నాడు. వెంటనే “నో” అననందుకు సంతోషించాను. మాట మార్చి, “రాఘవ ఈ ఊళ్లోనే ఉన్నాడు తెలుసా?” అన్నాను.

“అలాగా,” అని నిరాసక్తంగా ఊరుకున్నాడు.

“క్రితంసారి వచ్చినప్పుడు కలిశాను. నిన్నీపాటికే కలిసుంటాడని అనుకున్నానే!” ఇందాక రాఘవ ప్రసక్తిరావడం మీరు గమనించేవుంటారు. కలిసున్నట్లున్న పోజులతోవున్న బొమ్మలలో తప్ప పురాణాల్లో త్రిమూర్తులెప్పుడూ కలిసి తిరిగినట్లు ఆధారాలేవీ లేవు. గుళ్లేలేని బ్రహ్మసంగతి పక్కనపెట్టినా మిగిలిన ఇద్దరికీ కలిపి కట్టిన గుళ్లుకూడ ఎక్కడా లేవు – ఈ మధ్యలో అమెరికాలాంటి దేశాల్లో ప్రవాస భారతీయులు కొత్తగా కడుతున్నవాటిని మినహాయిస్తే. హైస్కూల్లోవున్నప్పుడు మాకుమాత్రం త్రిమూర్తులన్న పేరొచ్చింది. ఎక్కడికెళ్లినా కలిసివెళ్లేవాళ్లం. పొరబాటున ఇద్దరమే ఎక్కడయినా కనిపిస్తే, మాకు తెలిసినవాళ్లెవరయినాగానీ, మూడోవాడేడని వెంటనే అడిగేవారు. రాఘవ మెడిసిన్లో సీటొచ్చి కాకినాడ వెళ్లిపోయాడు. నేనూ, సత్యా వేరేకాలేజీల్లో ఇంజనీరింగ్ చదివినా, అమెరికా చేరిన తరువాత మా స్నేహాన్ని కొనసాగించాం. పెళ్ళయిన తరువాత రాఘవగూర్చిన విశేషాలు ముందు మాకు జాలినీ, బాధనీ కలిగించడంవల్ల వాణ్ణి ఓదార్చబోయాంగానీ, తరువాత వాడికి దూరంగావుండడమే మంచినదన్న నిర్ణయానికి నేనొచ్చాను. సత్యా సరే – వాడిలోకంలో వాడుంటాడుగదా! ఇంట్లోనే వేరేగదిలోవున్న పెళ్లాన్నే పట్టించుకోనివాడికి పదివేల మైళ్లవతలవున్నవాడేం గుర్తుంటాడు? ఇప్పుడయినా రాఘవ ప్రసక్తి తేవడానికి కారణం, దాదాపు అరవయ్యోపడిలో పడుతున్నాంకదా, వాడి సమస్యలు సర్దుకొనివుండకపోతాయా, ఇప్పుడయినా మళ్లీ ముగ్గురం హాయిగా కలవవచ్చునన్న ఆశతో. అందుకే రాఘవని కలిసి, ఎలాగయినా సరే సత్యాని కలవమని మరీ మరీ చెప్పాను.

అదెంత తప్పో ఆర్నెల్ల తరువాత సత్యానించీ వచ్చిన ఫోన్కాల్వల్ల తెలిసింది. వాడిచ్చిన చాంతాడంత లిస్ట్ని చూసి, “ఇవన్నీ డైనోసార్ల కాలానికి తీసుకెళ్లడానికే?” అన్నాను. “డైనోసార్లని చూడాలంటే అంత వెనక్కి వెళ్లక్కర్లా. నా చుట్టూకూడ ఉన్నారు. ఈసారొచ్చినప్పుడు చూద్దువుగాని,” అన్నాడు.

తరువాత తెలిసిందిదీ -
రాఘవ జీవితం వాడిపెళ్లితోనే అంతమయిందని వాడి పెళ్లయిన మూణ్ణాళ్లకే నాకూ, సత్యాకీ నిర్ధారణ అయిందిగానీ, వాళ్లకి ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత మేం పొరబడ్డామేమో ననుకున్నాం. వాడి భార్యకి శూర్పణఖ అని కాకుండా సీత అని పేరుపెట్టినందుకు ఆవిడ తల్లిదండ్రులమీద నాకు ఎప్పటినించోవున్న కోపమివాళ తారాస్థాయికి చేరుకుంది – సీత అనగానే నాకు రాముడిభార్యకాదు, రాఘవ భార్య గుర్తుకు రావడం గురించికాదు నేను మాట్లాడేది. సత్యా ఎంతో శ్రమపడి తయారుచేసిన కాలయంత్రాన్ని గునపాలతోనూ, గొడ్డళ్లతోనూ నాశనంచేయించడంగూర్చి.

రాఘవ చేసిన తప్పేమిటి? వాడు జీవించివున్నప్పటి క్షణాలని గుర్తుచేసుకోవాలనుకోవడం. పెళ్లి కాకముందు వాడి ప్రేమ వ్యవహారానికి అడ్డంకొట్టింది వాడి తండ్రి – గోడకేసి రక్తంవచ్చేలా తలకాయని కొట్టుకుని, ఆ ప్రేమ పెళ్లేగనుక జరిగితే రైలుక్రింద తలకాయ పెడతానని బెదిరించి, వాడి తల్లిచేత, “నీ కాళ్లు పట్టుకుంటాను నాయనా, నాకు పతిభిక్షని పెట్టు,” అని చెప్పించీను. తాళికి తలవంచింది సీతకాదు రాఘవ. పెళ్లిముందరి వాడి ప్రేమ వ్యవహారాన్ని పెళ్లిలోనే ఆమెచెవిలో వూదిన ఆమె చుట్టానికి బుధ్ధిలేకపోతే సరే, నిమిషనిమిషానికీ, “నువు దాన్నయితే ప్రేమగా చూసుకునివుండేవాడివి కాబోలు. నారాత ఇలా తగలడ్డది,” అని ముక్కుచీదడానికి ఆమెకి సిగ్గుండక్కర్లా? ఇద్దరు పిల్లలుకూడా పుట్టిన తరువాత కలిగిన సిగ్గువల్ల కాబోలు, వాడు పడగ్గదులు వేరుచేయించినా (రాఘవ పోయిన తరువాత ఈ సంగతిని ఆమె నోటిద్వారానే విన్నార్ట చెవులున్నవాళ్లందరూను) వాడు హాస్పిటల్లోవున్నా, డిస్పెన్సరీలోవున్నా క్షణక్షణం ఎక్కడవున్నదీ ఆమెకు చేరుతూనేవుండాలట!

ఆ పరిస్థితిలో వాడు కాలయంత్రంలో ప్రేమరోజులని తిరిగి అనుభవించాలనుకోవడంలో తప్పేముంది? నా ప్రోద్బలంతో నయితేనేం, మొత్తానికి వాడు సత్యాని కలిసిన తరువాత సాయంత్రం డిస్పెన్సరీలో వున్నాడని అబధ్ధం చెప్పించి, ఆ కాలయంత్రంలో దూరితే, కనీసం చెప్పినచోట లేడనే విషయం ఆ శూర్పణఖకి చేరడానికి ఎన్నాళ్లు పడుతుంది? రాఘవని ఏ రావణుడూ ఎత్తుకునీ పోలేదు, వాడు వెళ్లింది లంకకీ కాదు. ఉన్నవూళ్లో ఎంతసేపు వాణ్ణి పట్టుకోవడం! ఆవిడ జులుంచేసి, సత్యా ఇంటికి వెళ్లి, రాఘవ టైం మెషీన్లోవున్న సమయంలో, కాసేపట్లో తలుపులు తెరుచుకుంటాయి, ఆగమంటూ అడ్డంపడిన సత్యాని పక్కకుతోసి, ఎమర్జెన్సీ స్టాప్ బటన్ నొక్కిందట. అయినా, కాలయంత్రంగూర్చి ఆవిడకు చెప్పడానికి సత్యాకి బుద్ధుండొద్దూ? పైగా, గతంలో కెళ్లి ఆనందాన్ననుభవిస్తున్నాడు అని చెబితే ఆవిడకి తిక్క రేగకుండా ఎందుకుంటుంది? చేరి మూర్ఖుని మనసు – అంటూ భర్తృహరి ఏనాడో చెప్పాడు.

ఆవిడ రాఘవని బలవంతంగా ఇంటికి లాక్కెళ్లిన తరువాత, ఆవిణ్ణీ, కూతురినీ (కొడుకు అమెరికాలో వున్నాడు) కలిపి మీరెవరు, నేనిక్కడ ఎందుకున్నాను?” అని రాఘవ అడిగితే, వేషాలేస్తున్నాడని శూర్పణఖ గట్టిగా తిట్టిపోసిందట. మరునాడు రాఘవ అసలు హాస్పిటల్వైపుగానీ, డిస్పెన్సరీవైపుగానీ వెళ్లకపోతే నటనే ననుకుందట. మళ్లీ రాఘవదగ్గరికి ఎక్కడ చెక్కేస్తాడోనని ఇంటి బయటకు వెళ్లడానికి వీల్లేకుండా గట్టి కాపలా పెట్టిందట. వారంరోజుల తరువాత కూడా వాడావిణ్ణి నువ్వెరంటుంటే, తిక్కపుట్టి, పెళ్లి ఫోటోచూపించిందట. అదిచూసి వాడు, “నాకెప్పుడు పెళ్లయ్యింది?” అనేసరికి, లబోదిబోమని మొత్తుకుంటూ వాణ్ణి పట్టుకెళ్లి ముందు డాక్టర్ల చుట్టూతా, తరువాత పూజలు, శాంతుల పేరిట గ్రహాలచుట్టూతా తిప్పిందట. అప్పటిదాకా ఇంటిగడప తొక్కనివ్వని రాఘవ అన్నా చెల్లెళ్లని ఇంటికి పిలిపిస్తే వాళ్లని గుర్తుపట్టినట్లేవున్నాట్ట కానీ, “ఇంత ముసలాళ్లలాగా కనిపిస్తున్నారేంటీ?” అనడిగాట్ట. అతని చెల్లెలి మొగుణ్ణికానీ, ఆమె పిల్లలని కానీ, అన్నయ్య పిల్లలనికానీ ఎవరినీ వాడు గుర్తుపట్టలేదట. అప్పుడుగానీ వీడు చెల్లెలి పెళ్లికి ముందుకాలంలోవున్నాడని వాళ్లకి అర్థంకాలేదట. ఆమెకి పెళ్లేకాని కాలంలో వాడున్నప్పుడు, ఆ తరువాత తరువాత వచ్చిన ఆమె మొగుడిగూర్చిగానీ తన పెళ్లిగూర్చిగానీ వాడికి తెలియకపోవడంలో వింతేముంది?

అప్పుడు మొదలుపెట్టిన సీత శోకం రాఘవతోబాటు అందరినీ సత్యా ఇంటికి లాక్కెళ్లేలా చేసింది. టైం మెషీన్లో ఎమర్జెన్సీ స్టాప్ నొక్కడం ఏ ఫలితాలకి దారితీసిందోనని ముందుగా సత్యా ఆదుర్దా పడ్డాట్టకానీ అప్పటికి ఆమె తాకిడికి గురై రెణ్ణెల్లు దాటినందువల్ల ఏమీ అయ్యుండదన్న నిశ్చయానికి వచ్చాట్ట. వాళ్ల దగ్గరనుంచీ వివరాలని సత్యా రాబట్టిన తరువాత, “ఎలాగోలా ఆయన్ని మామూలుగా చెయ్యా”లన్న ఆజ్ఞని జారీచేసిందట ఆ శూర్పణఖ. సత్యా ఏదో ఒకటి పెద్దగా వ్యాఖ్యానం లేకుండా చేస్తే సరిపోయేది. అలా కాకుండా, వాళ్లతో, “ఇప్పుడు వాణ్ణి కాలయంత్రంలో పడుకోబెట్టి కాలాన్ని మళ్లీ వెనక్కుతిప్పితే, తిరిగొచ్చిన తరువాత వాడు ఆ యాత్ర చేసేముందరి స్థితిలోవుంటాడా లేక వేరే ఏదయినా స్థితిలోవుంటాడా? వెళ్లే ముందరి స్థితి అయితే, మీకు కావలసిన పరిణామాలేవీ సంభవించవు. కానీ, తరువాతి స్థితిలోకి వస్తాడనుకోవడానికి మనకు ఆ స్థితిగూర్చి ఏమీ తెలియదే?” అన్నాట్ట.

“కాకమ్మ కబుర్లు చెబుతున్నాడు. ఆ మెషీన్లో పడుకోబెట్టి, కొన్నేళ్లు కాలచక్రాన్ని వెనక్కి తిప్పిన తరువాత తిరిగివచ్చేటప్పుడు రెణ్ణెల్ల క్రిందటి తేదీదగ్గర ఆపుజేస్తే సరి!” అన్నాట్ట రాఘవ చెల్లెలి కొడుకు. ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్న ఆ కుర్రాడికి ఇంటలిజెంట్ అని అప్పటికే బిరుదుండడంచేత, ఆ అయిడియాని మెచ్చి ఆఖరికి శూర్పణఖకూడా వాణ్ణి ముద్దుపెట్టుకున్నదట.

సత్యా అంత తేలిగ్గా కుదరనిస్తాడా? “కాలచక్రంలో వెనక్కి వెళ్లి తిరిగిరావచ్చుగానీ మధ్యలో ఆపడానికి వీల్లేదు. అలాకాక మధ్యలో ఆపితే వచ్చే పరిణామాలను ఎదురుగా చూస్తూనేవున్నారు. కాలచక్రమనేది ఎప్పుడూ ముందుకు తిరుగుతూనేవుంటుంది కాబట్టి, ఈ యంత్రంలోకి వెళ్లిన తరువాత తిరిగివచ్చేటప్పటి సమయం వెనక్కివెళ్లేటప్పుడున్న సమయాన్ని దాటివుండాలి. అంటే, పదిగంటలప్పుడు ఈ యంత్రంలోకి అడుగుపెట్టేటట్లయితే, తిరిగివచ్చేటప్పటి సమయం, కనీసం పదిగంటల ఒక్క నిముషం అయివుండాలి. వెనక్కి వెళ్లడానికి ముఫ్ఫై సెకన్లు, తిరిగి రావడానికి ముఫ్ఫై సెకన్లూ పడతాయి,” అన్నాట్ట.

“అయితే ఒక పనిచేద్దామత్తా. ఈ మెషీన్లో తిరిగివచ్చే సమయంక్రింద ఒక ఆరునెలల కవతలి సమయాన్నెన్నుకుందాం. ఈ మెషీన్వల్ల కాకపోయినా, ఎలాగోలా మామయ్య మామూలు మనిషవుతాడని నాకు నమ్మకముంది,” అన్నాట్ట ఆ ఇంటలిజెంటు.

శూర్పణఖ మురిసిపోయిందట వాడి ఆప్టిమిజానికి. “ఎందుకయినా మంచిది, ఒక సంవత్సరం తరువాతి కాలాన్నిసెలెక్టుచేసుకో. మీ మామయ్య నాకు నా వచ్చే పుట్టినరోజుకి రవ్వల నెక్లెస్ కొనిపెడతానన్నారు. కొంటారో లేదో ఈ దెబ్బతో తెలిసిపోతుంది,” అన్నదట.

లిఫ్టులో ఎక్కిన తరువాత నాలుగో అంతస్తు చేరాలంటే, “అది సరిగ్గా పనిచేస్తుందో, లేదో ఎందుకయినా మంచిది, అయిదవ అంతస్తు బటన్ నొక్కితే?” అన్న ఆలోచనని రానివ్వనివాళ్లు ఆమెని సమర్థించారట.
నలుగురు మనుషులు సత్యాని చేతులు విరిచి పట్టుకున్న తరువాత ఆ ఇంటెలిజెంటు కంట్రోల్ పానెల్లో డేట్లని సెలెక్టుచేసుకున్న తరువాత రాఘవని ఆ మెషీన్లోకి పంపించారట. రాఘవ దాన్లోంచి బయటకు వచ్చిన తరువాత వాళ్లందరినీ – సీతనీ, కూతుర్నేగాక చెల్లెలిమొగుణ్ణీ, వాళ్ల పిల్లలనీగూడా గుర్తుపట్టి, పేరుపేరునా పలకరించేసరికి అందరూ ఆనందపడ్డార్ట.

అయితే, మరునాడు రాఘవ హాస్పిటల్కి వెళ్లే ప్రయత్నాలేమీ చెయ్యకుండా ఇంట్లో కూర్చునుంటే, కొద్దిగా జంకుతూనే శూర్పణఖ, “ఏమిటీ, ఇవ్వాళ హాస్పిటల్కి వెళ్లట్లేదా?” అనడిగిందట. రాఘవ, “నేను రిటయిరయ్యాగదే, నన్నెవడు రానిస్తాడు హాస్పిటల్కి?” అన్నాట్ట. ఆ క్రితం రెణ్ణెల్ల హడావిడిలోపడి మర్చిపోయిందిగానీ ఆవిడకి తెలిసినంతవరకూ తరువాత దాదాపు రెండువారాల్లో అతను రిటయిరవుతాడు. “అప్పుడే రిటయిరయ్యానంటాడేమిటీ?” అని ముందు ఆశ్చర్యపోయినా అప్పటికి రెట్టించకుండా ఊరుకుందటగానీ, ఆవిడకి మతిపోగొట్టిన విషయం మాత్రం, కొడుకు ఈశ్వర్నిచూసినప్పుడు రాఘవ చేసిన సీను. అమెరికాలోవున్న ఈశ్వర్కి రాఘవ గొడవని కొద్దిగా చెప్పినా, ఎలాగో రాఘవ రిటరయ్యేసమయానికి తండ్రిపక్కనవుండేందుకని కొనుక్కున్న ఫ్లైట్ టిక్కెట్టు వుందికదా, అప్పుడే రావచ్చులే అని అతనికి నచ్చచెప్పారు. కానీ, రాఘవ మామూలు మనిషయ్యాడని సంబరపడుతున్నవేళలో, కొడుకునిచూసి రాఘవ ఏడుస్తాడని – అదికూడా, చాలాకాలం తరువాత చూసినందువల్లకాక దయ్యాన్ని చూసినట్లుగా – ఎవరయినా ఎలా ఊహిస్తారు? సీత తలబాదుకుంటూ ఈశ్వర్ని పక్కకు తీసుకెళ్లి అంతకుముందు రెణ్ణెల్లూ జరిగిన భాగోతమంతా వాడికి వివరించిందట.

ఈశ్వర్ అక్కడున్న వారంరోజులూ అతను కనబడితే ఏడిచే రాఘవని భరించలేక, “ఏమిటి నీ ప్రాబ్లం?” అని గట్టిగా అతణ్ణి గసిరితే, “వీడు దయ్యమయ్యాడే,” అని బావురుమన్నాట్ట. “నీ బొంద! వీడు మనిషే. నువ్వే మమ్మల్ని బతికుండగానే పీక్కుతింటున్నావ్,” అని సీత మొగుణ్ణి తిడితే, వాడు కాస్తా,”వాడు పోయిన తారీకు నీకు ఎందుకు గుర్తులేదో నాకు అర్థం కావట్లేదు,” అని తలబాదుకున్నాట్ట.

సీతకి వళ్లు మండిపోయి, “నిక్షేపంలావున్న నా కొడుకుని చంపుతావెందుకు?” అని చేతికందినవాటిని రాఘవమీదకి విసిరిందట. రాఘవ, “వాడు పోయిన తారీకు,” అంటూ దాదాపు ఆర్నెల్ల తరువాతి తేదీని చెప్పి, “న్యూస్ పేపర్లో వచ్చిందిగా, వాడు పోయిన విషయమూ, చూపిస్తానుండు,” అని ఋజువులకోసం ఇంట్లో వెతకడం మొదలుపెట్టేసరికి, వాణ్ణి గదిలోపెట్టి తాళం వేశార్ట.

“నెల్లాళ్ల తరువాత రాఘవ పోయేదాకా వాడి మకాం అక్కడే,” అన్నాడు సత్యా. ఈశ్వర్ నిష్క్రమణ దినంగూర్చిన రాఘవ మాటలు సత్యాకి చేరెయ్గానీ, “తన కాలయంత్రంద్వారా భవిష్యత్తులోకి వెళ్లడం సాధ్యమా?” అన్న ప్రశ్నకి పెద్దగా తన మైండ్లో చోటివ్వకుండా, రాఘవతోబాటే దాన్ని పూడ్చిపెట్టాట్ట. అయితే, రాఘవ చెప్పిన తారీకునాడే ఈశ్వర్ అమెరికాలో మరణించడం రాఘవ కుటుంబాన్నేకాక సత్యానికూడ దిగ్భ్రాంతికిలోనుచేసింది. ఆ దిగ్భ్రాంతినుండీ ముందు తేరుకున్నది సీత. అదుగో, అప్పుడు – మనుషుల్ని పట్టుకొచ్చి గునపాలతోనూ, గొడ్డళ్లతోనూ వాడి కాలయంత్రాన్ని ధ్వంసంచేయించింది.

ఆ విధ్వంసానికి కారణమేమిటో వాడి చుట్టుపక్కలవాళ్లకి తెలియడానికి ఎంతోకాలంపట్టలేదు. అప్పటినించీ వాళ్లల్లో కొంతమంది, సత్యా తన మెషీన్ని ఎప్పుడు బాగుచేస్తాడా అని కాచుక్కూర్చున్నారు. నా రాకపోకలు చూసిన తరువాత ఎంతోకాలంపట్టలేదు వాళ్లు కాలయంత్రంలో ప్రయాణంచేద్దామని క్యూ కట్టడానికి!
“డైనోసార్లుండే గతంలోకి ప్రయాణించడానికి మనిషి పుట్టుక అనేది అడ్డమయినా, బొందితోనే, అదే వయసులోనేవుంటూ ఎన్నోవేలయేళ్ల వెనక్కి ప్రయాణించడం సాధ్యమేనని నమ్ముతున్నారు ప్రపంచవ్యాప్తంగా. భవిష్యత్తులోకి ప్రయాణించడంగూర్చే సామూహిక ఒప్పందమేమీ ఇంకా కుదర్లేదు. భవిష్యత్తుని గూర్చిన సైన్స్ ఫిక్షన్ అంతా అది క్రీ.శ. 2050 అనో, లేక ఇరవైఅయిదవ శతాబ్దమనో మొదలుపెట్టి, అప్పటి సమాజం ఎలావుంటుందోనని ఊహాగానాలు చేస్తున్నారుతప్ప, ఈనాటి మనిషి ఆనాటి సమాజంలో తేలడమేగాక మళ్లీ వర్తమానంలోకి రావడం అన్న అంశంగూర్చి ఆలోచించడంలేదు. అంతెందుకూ? నేనే ఇన్నిసార్లు టైం మెషీన్లో 5 నిముషాలతో మొదలుపెట్టి కొన్నిగంటలబాటు ప్రయాణం చేశాగదా, ఆ గంటలు వర్తమానంలోనేకదా నడుస్తున్నాయి? నేను ఆ మెషీన్ని గంటసేపు సెట్ చేస్తూ, ఆ గంట తరువాత బతికేవుండి, దాన్లోంచి బయటపడతాను అన్న ధీమాతో వుండగలగడమే ఆశ్చర్యకరం. దాన్నే ఇంకా కొనసాగించి, ఆర్నెల్ల తరువాతి కాలానికి వెళ్లి ఓ గంట గడుపుదామనుకుంటే – అది ఒక్క పదినిముషాలైనాగానీ – ఆ భవిష్యత్ కాలంలో ఈ టైం ట్రావెలర్ అసలు బ్రతికేవుంటాడని గ్యారంటీ ఏమిటి?” అని చెప్పి, తన యింటిముందు లైను కట్టినవాళ్లందరినీ వాళ్ల ప్రయాణాలు మానుకొమ్మనమని చెబుతూ వాళ్ల ప్రయత్నాలని అడ్డంకొట్టడానికి సత్యా శతవిధాలా ప్రయత్నించాడట.

కొంతమంది రాఘవ, ఈశ్వర్ల ఉదంతాన్ని విని వెనక్కి తిరిగినమాట నిజమే! ఇంకొంతమంది, మరునాడో, లేక నెల తరువాతో రాబోయే పదో తరగతి లేక ఇంటర్మీడియెట్ ఫలితాలని తెలుసుకుందామని ప్రయత్నించారటగానీ, సత్యా కావాలనే పెట్టిన ఆకాశన్నంటే ధర విని వెనుదిరిగారట. అయితే, ఎంత కర్సయితేనేం, ఒక రాయివేసి చూద్దాం అనుకున్న ఒక రాజకీయ నాయకుడు సత్యాని చేతులు వెనక్కి విరిచికట్టేసి తన భార్యని భవిష్యత్తులోకి ప్రయాణం చేయించాడు. (అప్పుడు ఆ శూర్ఫణఖచేత, ఇప్పుడీ రాజకీయ నాయకుడిచేత – ఇలా చేతులు వెనక్కి విరిచి కట్టించుకోవడం న్యూసెన్స్గా వుంది. ఇంక ఎవడు తొయ్యమంటే వాణ్ణి ఆ మెషీన్లోకి తోస్తానన్నాడు, కథ చెబుతూ సత్యా మధ్యలో. ఇంకా, ఆయనకి ఈ మెషీన్ని చూస్తే భయమేసినట్టుంది, అందుకే భార్యచేత ప్రయాణం చేయించాడు. భార్య డిస్పోజబుల్లా వుంది! అని జోడించాడు.) ఎమ్మెల్యే భార్యగా తనను తాను చూసుకున్నాని ఆవిడ తిరిగొచ్చి చెప్పినప్పటికన్నా, అది నిజంకూడా అయిన తరువాత మొదలయ్యాయి సత్యా ఇక్కట్లు.

ఒకావిడ ముఫ్ఫయ్యేళ్లొస్తున్న వాళ్లమ్మాయికి అసలు పెళ్లియోగం వున్నదో లేదో తెలుసుకోవాలని సత్యా పాదాలమీదపడి ఏడిస్తే దయార్ద్రహృదయంతో ఆమెని ప్రయాణించేయించాడు. రెండేళ్ల తరువాతే మనవణ్ణి ఆడిస్తున్న తనని చూసుకొని ఆనందపడ్డది. తరువాత రెణ్ణెల్లలోనే ఆ అమ్మాయికి పెళ్లయ్యిందిటగూడా.

ఇంక చిలకజోస్యాలనీ, కంప్యూటర్ జాతకాలనీ పక్కనపడేసి సత్యాని చుట్టుపక్కల ప్రజలు చుట్టుముట్టారు. తన మెషీన్ వల్ల నిజంగా భవిష్యత్తులోకి ప్రయాణం చెయ్యడం జరుగుతోందని సత్యాకూడా మెల్లగా నమ్మడం మొదలుపెట్టాడు. దానికి తగ్గట్టుగా, ఆ రాజకీయ నాయకుడిలాగే, ఆ పెళ్లికాని కూతురి తల్లిలాగే ఆ యాత్రలు చేసివచ్చినవాళ్లు తమ జీవితంలో ప్రత్యక్షంగా ఋజువులని చూపించారు. దానితో, సత్యా మెషీన్ పవర్ గొప్పదనం కార్చిచ్చులాగా వ్యాపించింది. “ఆ మెషీన్కి దైవత్వాన్ని ఆపాదించి, పూలూ పండ్లూ సమర్పించుకోవడానికీ, కొబ్బరికాయలని కొట్టడానికీ రెడీ అయి వచ్చేవాళ్లని చూస్తే మతిపోయింది,” అన్నాడు సత్యా.

ఆ పవర్ని ఉపయోగించుకోవాలన్న ఆశ పదవతరగతి చదువుతున్న పిల్లల తల్లిదండ్రులతో మొదలుపెట్టి ఆరవ తరగతి పిల్లల తల్లిదండ్రులదాకా పాకి, చివరికి, ఎల్కేజీ చదువుతున్న పిల్లల తల్లిదండ్రులని జేరడంలో వింతేమీ లేదు. ఆ తల్లిదండ్రులు, అయిదు, పదీ, పన్నెండేళ్లు భవిష్యత్తులోకి ప్రయాణించి వాళ్ల పిల్లలకి ఐఐటీలో లేక మెడికల్ కాలేజీలో సీటొస్తుందో రాదో తెలుసుకున్నారు. రాదని తెలుసుకున్నవాళ్లేకాక, వస్తుందని తెలుసుకున్నవాళ్లుకూడా వాళ్ల పిల్లలకి కోచింగులు మానిపించేసి డబ్బుని ఆదా చేసుకున్నారు. అమెరికన్లయితే భవిష్యత్తుని మారుద్దాం అని ప్రయత్నించేవారేమోగానీ, రక్తంలో జీర్ణించుకున్న కర్మ సిధ్ధాంతం వాళ్లెవరినీ అలా ఆలోచించనివ్వకుండా చేసింది.

ఇది మరి ఈ కోచింగ్ సెంటర్ల, రెసిడెన్షియల్ కాలేజీవాళ్ల నోళ్లల్లో మట్టికొట్టదూ? అలాగే స్పెషాలిటీ హాస్పిటల్స్ పనికూడా. ఆపరేషన్ చేసినా చెయ్యకపోయినా మనిషి బ్రతికేటట్లయితే, ఆపరేషన్ ఎందుకు చేయిస్తారు? ఆ ఆపరేషన్ అయినతరువాత పేషెంట్ బ్రతక్కపోతే ఇంక ఆపరేషన్కి ఖర్చెందుకు పెట్టాలి? ఆనాడయితే సత్యా ఇంకా ఒక్క కాలయంత్రంతోనే కుస్తీపడుతున్నాడుగానీ అతను అలాంటివాటిని మరికొన్నింటిని మార్కెట్లోకి వదిలితే తప్పనిసరయ్యే సునామీ ఫలితాలని ఆకళింపుచేసుకున్న ఈ కోచింగ్ సెంటర్ల వాళ్లకీ, హాస్పిటల్స్వాళ్లకీ ఎవరికయినా సత్యాని లేపెయ్యడం చిటికెలో పని. అయితే, అలా చేసిన తరువాత ఆ మెషీన్ని ఎవరు దొరకబుచ్చుకొంటారో తెలుసుకోవాలన్న ఆతృత వాళ్లకుంది. ఆ బంగారుకోడిపెట్టని ఎవరికి వాళ్లే చేజిక్కించుకోవాలనుకోవడం అంత ఆశ్చర్యకరమయిన విషయమేమీ కాదుగదా! అప్పటిదాకా ఒకే మెషీన్తో కుస్తీ పడుతున్న సత్యా అలాంటివే ఇంకో రెండో మూడో తయారుచెయ్యబోతున్నాడని అతనిదగ్గర కొత్తగా చేరిన ఇద్దరు కుర్రాళ్లు ఇంటిబయటవున్న లైన్ని కంట్రోల్ చెయ్యడానికి చెప్పారు. ఆ వార్త బయటికి పొక్కిపోయి, అలా జరిగడంవల్ల సంభవించే సునామీ ముంపుకి గురయ్యే సంస్థల్లోనూ, వ్యక్తుల్లోనూ ఆందోళనని కలిగించింది.
అలాంటి ఆందోళనకి గురయినవాళ్లల్లో సామంత్ బావమరిది ఒకడు. చట్టం గుర్తించిన సామంత్ భార్యకి తమ్ముడు. రంజనిని కంపేనియన్గా ఉంచుకున్నాడని సామంత్ భార్యకి తెలిసికూడా కావలసినవన్నీ అమరుతున్నాయని సర్దుకుని తనకి నచ్చే మార్గాన్ని ఎప్పుడో ఎన్నుకుంది. ఆ మార్గాలేవో తెలిసికూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి సామంత్ది. ఎందుకంటే, అమెరికాలో విడాకులు తీసుకోవాలంటే, సామంత్ ఆస్తిలో సగం ఆమెకి సమర్పించుకోక తప్పదు. అతను ఆమె అక్రమ సంబంధాలని కారణాలుగా చూపిస్తే రంజనిని వేలెత్తి చూపించడానికి ఆమె లాయర్ ఎప్పుడో సిధ్ధంగా వున్నాడు. అందుకని స్టేటస్ కో కొనసాగించారు ఆ ముగ్గురూను.

బావమరిది ద్వారా ఆ టైం మెషీన్గూర్చి విన్నతరువాత దాన్లో సామంత్ స్వయంగా ప్రయాణాన్ని కోరుకోవడానికి కారణం ఈశ్వర్ – అమెరికాలో చనిపోయినవాడు, రాఘవ కొడుకు. అతడు చనిపోయింది కార్ ఏక్సిడెంట్లో. దాన్లో పేర్కొనబడిన రెండవ కార్ని డ్రైవ్ చేస్తున్న సామంత్ తాగివున్నాడనడానికి సాక్ష్యాధారాలున్నాయన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఏక్సిడెంట్ అయినచోటే సామంత్ బ్లడ్ని పరీక్ష చేసినప్పుడు, చట్టపరిమితిని మించి చాలా అధికంగా అతని రక్తంలో ఆల్కహాల్ వుందని తేలిందన్నాడు. లేదు, ఈశ్వర్ తాగివుండడమేగాక నైట్క్లబ్లో తగాదాపడి బయటికొచ్చి, కోపంగా డ్రైవ్చేసి రెక్లెస్గా వుండడంవల్ల ఫలితాలని అనుభవించాడు, తన క్లయింట్ నిమిత్తమాత్రుడన్నాడు సామంత్ లాయర్. డబ్బున్నవాడవడంచేత కేసు విచారణ అయ్యేదాకా బెయిల్ తీసుకుని సామంత్ మామూలుగానే తనపనులని చేసుకుంటున్నాడు.

ఈ కేసు ఎలా ముగుస్తుందో అతను తెలుసుకోవాలనుకోవడంలో తప్పులేదు. దానికోసం టైం మెషీన్లో ప్రయాణించాలని ఆశపడడంలో కూడా ఆశ్చర్యమేమీలేదు. అయితే, అతనికి దేశం వదిలి బయటకుపోవడానికి అనుమతిలేనందువల్ల రంజనిని పంపించాడు సత్యా దగ్గరికి. సత్యాని కలిసినప్పుడు రంజని కొద్దిగా తొట్రుపడినమాట నిజమేగానీ, సత్యామాత్రం ఆమెని పట్టించుకోలేదన్నారు చూసినవాళ్లు. “లైన్లో ముందుకు రావడానికి, రంజని తనని నా భార్యగా చెప్పుకుంది,” అని నాతో చెప్పి పడీ పడీ నవ్వాడు సత్యా. “ముందుగా నెలతరువాతి భవిష్యత్తుతో మొదలుపెట్టి, ఆపైన రెణ్ణెల్లకి వెళ్లిందిగానీ, ఆమె వచ్చిన పనికిమాత్రం అంతకన్నా ముందుకి వెళ్లవలసిన పనిలేకపోయింది. టైం మెషీన్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆమెకీ, సామంత్కీ నచ్చేలా కోర్టులో తీర్పువచ్చిందని తెలిసినట్లుగా ఆమె మొహంలో పెద్ద రిలీఫ్ కనిపించింది. అయితే, అంతటితో ఆగవలసింది, అనవసరంగా మళ్లీ మెషీన్లో దూరి ఆర్నెల్ల ముందుకెళ్లింది. నచ్చనిదేదో కనిపించింది. బయటికొచ్చినప్పుడు మొహం మాడిపోయివుంది” అన్నాడు సత్యా నాతో.

వాడీ కథ చెప్పినప్పుడు నేను వాడిదగ్గరేవున్నాను. ఈ కథాకమామీషూ నాకుకూడా కొద్దిగా భవిష్యత్తులోకి ప్రయాణించాలన్న కోరికని కలిగించడంలో తప్పేంలేదని మీరూ ఒప్పుకుంటారు. వాడడిగితే, ఏదో ఉజ్జాయింపుగా భవిష్యత్తులో ఒక తేదీ చెప్పాను. నాకేదో నోబెల్ ప్రైజువస్తుందనిగానీ, లాటరీలో వందల మిలియన్ల డాలర్లు కొట్టేస్తానేమోననీ తెలుసుకుందామనిగాదు. ఏదో, చిన్న కుతూహలంతో – అంతే. అయితేనేం, ఎదురయిన అనుభవంమాత్రం మళ్లీ హార్ట్రేట్ని అధికంగా పెంచేసి చెమటలుపోయించేదే.

వెల్లకిలా మంచంమీద పడుకునివున్నాను – అమెరికాలోని మాయింట్లో, నా బెడ్డుమీదనే. అయితే, నిద్రపోవడంలేదు. రంజనిగూర్చీ, సామంత్గూర్చీ, రాఘవగూర్చీ ఏవో అస్పష్టంగా ఆలోచననలు. ఇంతలో క్రింద కాలింగ్బెల్ శబ్దమవడం, మా ఆవిడ తలుపు తియ్యడం లీలగా వినిపించింది. ఆవిడ అడ్డుపడుతున్నా వినకుండా, “రెండు నిముషాలే మేడం,” అంటూ హైదరాబాద్ తెలుగు ఏక్సెంటులో వినిపించిన మాటల తరువాత ఆ వచ్చినవాళ్లు పైకి వస్తున్నట్లుగా మెట్లమీద అడుగుల చప్పుడు వినిపిస్తుంటే, ఎందుకో గుండె వేగం కొద్దిగా పెరగసాగింది. వాళ్లు బెడ్రూంలోకి రావడానికి ఎంతోసేపుపట్టలేదు. వాళ్లు ఇద్దరు. వాళ్లని చూడగానే నాకు కోపమొచ్చింది. “ఆవిడ వద్దంటున్నా వినకుండా ఇక్కడికి రావడానికి మీకు ఎటికేట్ లేదా?” కోపంగా ప్రశ్నించాను.

“కోపం తెచ్చుకోకండి సార్. మేమడిగిన ప్రశ్నలకి సమాధానమిస్తే అందరం ఎవరిదారిన వాళ్లం త్వరగా వెళ్లిపోవచ్చు. మేమిక్కడికొచ్చిన పనికూడా త్వరలోనే అయిపోతుంది,” వాళ్లలో ఒకడన్నాడు.
“నా ఇంట్లోకొచ్చే కోన్కిస్కాగాళ్లకి నేనెందుకు జవాబు చెబుతాను?” నాకు కోపం పెరిగిపోతోంది. వాళ్ల మొహాలని అప్పటిదాకా చూడలేదుమరి!

“మీ ఇండియా పోలీసులకి ఇక్కడికొచ్చి ప్రశ్నించడానికి అధికారమెవరిచ్చారు?” మా ఆవిడ కోపంగా ప్రశ్నించింది. యూనిఫాం వేసుకోకపోయినా, ఆమెకి తామెవరో క్రిందనే చెప్పినట్టున్నారు. వాళ్లు పోలీసులన్న మాటని విని నేను స్టన్ అయ్యానుగానీ, వెంటనే తేరుకున్నాను. “జానకీ, నువ్వు 911కి ఫోన్ చెయ్యి,” ఆమెనాదేశించాను. అమెరికా పోలీసులొచ్చిన తరువాత ఈ వెధవల సంగతి తేలిపోతుంది.

“అలా చేస్తే మీకే నష్టం. మీ అమెరికన్లు దేశసరిహద్దులని దాటనీయరాదని ఆంక్ష విధించిన వస్తువులని మీరు ఇండియాకి చేర్చారని వాళ్లకి సాక్ష్యాధారాలని మేమందజెయ్యాలని కోరికగావుందా? ఆ తరువాత అమెరికాలో కటకటాలు లెక్కపెట్టుకుంటూ కూర్చుంటారు,” వాళ్లలో ఇంకొకడన్నాడు.

వాళ్లు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు క్లియర్గా తెలుస్తోంది. నేను ఇండియాకి పట్టుకువెళ్లినవాటిలో వేటికీ నేను పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరమేమయినా ఉంటుందేమోనన్న ఆలోచనకూడా నాకు రాని మాట నిజమే. కానీ, అందరు ఇండియన్లకన్న నేనెక్కువ ఏం పట్టుకెళ్లానని? ప్రతీ వస్తువూ ఓపెన్ మార్కెట్లో కొన్నదే! అయినా, నా నుదుటిమీద చెమటలు పట్టడం మొదలయింది. గుండెవేగం పెరగడం తెలుస్తోంది. “నేను ఏ చట్టమూ ఉల్లంఘించలేదు. ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో, ఫో!” గట్టిగానే అరిచినట్లున్నాను.

చేతికందినదాన్ని వాళ్లమీదకి విసురుదామని ప్రయత్నించబోయానుగానీ, చెయ్యి కదలనంటోంది. నా వాలకాన్ని చూసిన జానకి “అయ్యో, ఇవాళే హాస్పిటల్నించీ వచ్చింది. ఆయనకి స్పృహతప్పు …” అనడం లీలగావినిపించింది. టైం మెషీన్లోంచి బయటికొచ్చేటప్పటికి మళ్లీ వంటినిండా చెమటలే. ఈసారిమాత్రం నన్నుచూడగానే సత్యాకి నవ్వేమీ రాలేదు. నా అనుభవాన్నిగూర్చి వాడేమీ అడగలేదు. నేనుకూడా బాగా డిస్టర్బయ్యాను. వాడికికూడా ఏమీ చెప్పాలనిపించకపోవడంవల్ల చెప్పలేదు.

* * *

రంజని అమెరికాకి తిరిగివచ్చిన తరువాత రెణ్ణెల్లు కాకుండానే సామంత్ని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. టైం మెషీన్ సంగతి తేల్చుకోవడానికి సామంత్ ఇండియా వెళ్లాడు. తేల్చుకోవడానికి – అని ఎందుకన్నానంటే, సత్యా సృష్టించిన కాలయంత్రం ఈ రెణ్ణెల్లల్లో ఎంతమంది సామాన్య ప్రజానీకంచేత విపరీతమయిన ఖర్చులని పిల్లల కోచింగులకోసం లేక ఖరీదయిన వైద్యాలకోసం భరించవలసిన భారాన్ని తొలగించిందో, దానివల్ల ఎంతమంది అతని సంగతి తేల్చుకోవడానికి రెడీగా కూర్చున్నారో మీరూహించగలరు. ఆ బాధ్యతని సామంత్ తన భుజాలమీద కెక్కించుకున్నాడని అతని బావమరిదిద్వారా విని కష్టకాలం గట్టెక్కే సమయం ఆసన్నమయిందని వాళ్లు కుదుటపడ్డారు.

సామంత్, “అయిందేదో అయింది,” అని మొదలుపెట్టి, ” ప్రతీ ఇంట్లోకి ఒక టీవీని చేర్చగలిగినట్లే ఇంటింటికీ ఒక టైం మెషీన్ని అమర్చగలిగితే, వెలనిబట్టీ భవిష్యత్తులో ఎంతదాకా చూడవచ్చో నిర్దేశించేలా ఎన్నో రకాల మోడల్స్ని తయారుచేసి అమ్మితే, వాటివల్ల ప్రపంచంలోని అన్ని మూలలనుండీ వచ్చే లాభాలకి అంతేవుండదనీ, ఇంత దివ్యమయిన టెక్నాలజీని అప్పటికే అయిదేళ్లపాటు సొమ్ముచేసుకోవడానికి వినియోగించకుందా వృథాచేశాడనీ, తన కంపెనీ వాటి తయారీని, అమ్మకాలనీ చేబడితే యాభైశాతం వాటా సత్యాదేననీ,” ఇంకా ఎన్నో చెప్పాడు. అయితే, సత్యా మాత్రం అవేమీ పాటించడానికి సిధ్ధంగాలేడు. ఈ టెక్నాలజీని వినియోగించి, భవిష్యత్తులో సాంకేతిక అభివృధ్ధి ఇంకా ఎంత జరుగుతుందో తెలుసుకుందామని అతని ఆశయం. ఈ ప్రజల తాకిడికి అది సాధ్యంకావడంలేదు. పైగా, అప్పటిదాకా ప్రజలకి ఒనగూరుతున్న లాభాలనిచూసి, అసలు తన మొదటి ఆశయం సమంజసమేనా అన్న మీమాంసలోవున్నాడు.

“నీ ఆశయం సమంజసమైనదే. ఈ ప్రజలు నిన్ను అనవసరంగా తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ మెషీన్ సంగతీ, ఈ ప్రజల సంగతీ నాకు వదిలెయ్. నువ్వు నీ రీసెర్చ్ సంగతి చూసుకో,” అన్నాడు సామంత్.
“నువ్వు నన్ను సరిగ్గా అర్థంచేసుకోలేదు. ఏ రీసెర్చ్ చేసినా అది ఎంతో కొంత సామాజిక అభివృధ్ధిని ఆకాంక్షించే చెయ్యాలి. ఇలాంటి మెషీన్లు ఇంకొన్ని వుంటే ఇంకా ఎక్కువమందికి ప్రయోజనం ఒనగూరేమాట నిజమే. కానీ, నువ్వు పెట్టే ధరలు వీటిని ఎక్కువమంది ప్రజలకి అందుబాటులోలేకుండా చేస్తాయ్. ఇవాళ ఖరీదయిన హాస్పిటళ్లని నడుపుతున్నవాళ్లు ప్రస్తుతం వాళ్ల దగ్గరున్న పరికరాలన్నింటినీ చెత్తకుప్పలో పడేసి ఈ కాలయంత్రాలతో డబ్బుచేసుకోవడం మొదలెడతారు. ఒకపక్కనించీ సామాన్య ప్రజలకి మేలుచెయ్యాలనుకుంటూ, ఇంకోపక్కనుంచీ ఇలాంటి పరిస్థితిని వాళ్లకి ఎలా కల్పించగలను? ఎడిసన్ కనిపెట్టిన లైట్ బల్బు ఈనాటికీ ప్రపంచమంతటా సామాన్య మానవులకికూడా ఎంతో ఉపయోగపడుతోంది. నా రీసెర్చ్కూడా అంతటి ప్రయోజనాన్ని చేకూర్చాలనేది నా ఆకాంక్ష. కానీ, అది ఎలాంటి రీసెర్చ్వల్ల సాధ్యమవుతుందన్నదే నాకు అవగాహనకు రానివిషయం. ప్రస్తుతానికి ఇలాంటివాటిని తయారుచెయ్యడమే నాకు ఉత్తమమార్గంగా కనిపిస్తోంది. అదికూడా నేనే చేస్తేతప్ప నేనాశించినంత ప్రయోజనముండదనికూడా నాకు తెలుసు. అలా చెయ్యడానికే చాకులాంటి కుర్రాళ్ల సహాయంతీసుకున్నాను,” అన్నాడు సత్యా.

సామంత్ మెదడులో జరగాల్సిన కార్యక్రమం రూపుదిద్దుకున్నది. పైకి మాత్రం, నిరాశగా మొహంపెట్టి, “నీ సంగతి తెలిసిందేగా, కానీయ్. అయితే, నన్నుకూడా కొద్దిగా భవిష్యత్తులోకి తొంగిచూడనిస్తావా?” అన్నాడు. అయితే, ఆ మెషీన్లోకి వెళ్లేముందర, “ముందు నువ్వెళ్లి రాకూడదూ? ఈ డొక్కు రేకుల్ని చూస్తే భయమేస్తోంది,” అన్నాడు.

సత్యా నవ్వేసి, కాలచక్రాన్ని ఒక నెలతరువాతకి (కాలయంత్రంతో పనిలేకుండానే, భవిష్యత్తుని ఊహించడంవల్ల నయ్యుండాలి!) సెట్చేసి, ఆ మెషీన్లో పదినిముషాలున్నాట్ట. తరువాత సామంత్ అందులోకెళ్లాట్ట. అతను బయటికొచ్చిన తరువాత, గర్వంగా, “నువ్వు రెండ్రోజుల్లో ఫినిష్. కేలండర్మీద రాసుకో,” అన్నాట్ట. సత్యా నవ్వి, “ఆ తరువాత వారంరోజులకే నువ్వు,” అని తలపక్కకు వాల్చేసి ఏక్షన్చేశాట్ట. సామంత్ తలనెగరేస్తూ వెళ్లాట్ట.

* * *

ఇదంతా దీర్ఘంగా ఈమెయిల్లో రాశాడు. హఠాత్తుగా హార్ట్ బైపాస్ సర్జరీ చేయించుకోవలసివచ్చి, హాస్పిటల్లో పదిరోజులు గడిపి ఇవాళ ఇంటికి వచ్చేటప్పటికి ఈ ఉత్తరం. ఇంకా ఏదో రాశాడుగానీ, ఈ అంతిమదినాలగూర్చిన సంభాషణగూర్చి తెలుసుకోగానే స్టన్అయి చదవడం ఆపాను. ఇంతకుముందు ఇలాంటిది ఒకదానిగూర్చి వినివున్నానుగదా! సత్యా రాసినదాని ప్రకారం సామంత్కి నూకలు చెల్లాల్సినది ఈ రోజే. నిన్ననే రంజనితో మాట్లాడాను హాస్పిటల్లో వున్నానని తెలిసి నన్ను చూడడానికి ఆమె వచ్చినప్పుడు. “రేపేగదా, సామంత్ వస్తానన్నది?” “రావాలి మరి,” ఉదాసీనంగా జవాబిచ్చింది. “ఇస్తాంబుల్లో ఆగుతానన్నాడు,” అని జోడించింది.

వెల్లకిలా పడుకుని చదువుతున్న ఐపాడ్ని పక్కనపెట్టి టీవీ ఆన్చేసి సీఎన్ఎన్ పెట్టాను. “ఇస్తాంబుల్ కాల్పుల్లో మరణించినవారి సంఖ్య,” అంటూ చెబుతున్నాడు రిపోర్టర్. అయిదునిముషాల్లో అప్డేట్ చేస్తూ, మరణించినవారిలో సామంత్ పేరుతో ఒక అమెరికన్ వున్నాడని జోడించాడు.

అదిరిపోయాను. అంటే, సత్యా? టైం మెషీన్ సునామీలాంటిది. టోర్నడోలాంటిది. ఆ సునామీ, టోర్నడోలగూర్చి వినడం వేరు, వాటి తాకిడి అనుభవంలోకి రావడం వేరు.

రంజనికి ఫోన్చేశాను. హార్ట్ బైపాస్ ఆపరేషన్ అయి ఇవాళే ఇంటికొచ్చానని గుర్తుచేస్తూ మాటదాటెయ్యబోయింది. సామంత్గూర్చిన వార్తని విన్నానని చెప్పిందిగానీ ఆమె గొంతులో కొద్దిగాకూడా అనుకోనిదేదో జరిగిందన్న షాకు తాలూకు చిహ్నాలేవీ నాకు వినిపించలేదు. “రెణ్ణెల్లు ముందుకెళ్లడంతో ఆగితే బావుండేది. అనవసరంగా ఆర్నెల్లు ముందుకెళ్లింది,” అని ఆమెగూర్చి సత్యా చెప్పడం గుర్తొచ్చింది. “సత్యా ఇంట్లో టైం మెషీన్లో ఇది నువ్వు తెలుసుకున్నావుగదూ?” ప్రశ్నించాను. “ఇవాళ పోతాడని తెలుసు. ఎలా పోయాడో మాత్రం ఇప్పుడే తెలుసుకున్నాను,” అన్నది. “సత్యా పోతాడన్న రోజేదో సామంత్ నాకు ఫోన్చేసి చెప్పాడు. ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వార్తల్లో వచ్చింది. తెలుగు పత్రికల్లో వచ్చిన వార్తలకి లింకులని ఈమెయిల్లో పంపిస్తాను,” అన్నది.

ఆమె పంపేదాకా ఆగకుండా నేనే ఇంటర్నెట్లో సెర్చ్చేసి పట్టుకున్నాను. “సైంటిస్టునని చెప్పుకుంటూ కొంతకాలంగా భవిష్యత్తుని చూపెడతానంటూ ప్రజలని మోసంచేస్తున్న ఒక వ్యక్తి ఉదంతం నేడు వెలుగులోకి వచ్చింది. ఇప్పటిదాకా బాబాలూ, సన్యాసులూ ఇలా అమాయకులని మభ్యపెట్టడంగూర్చి విన్నాం. కానీ, సైంటిస్టునని చెప్పుకుంటూ మోసంచెయ్యడంగూర్చి మాత్రం ఈనాడు మొదటిసారిగా చూస్తున్నాం – అదిగూడా, అమెరికానుండీ వచ్చానని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి! అసలు సైంటిస్టో కాదో, అమెరికానుంచీ వచ్చాడో లేదో నిర్ధారించేందుకు పోలీసు బలగాలు అమెరికా వెడుతున్నాయి. కానీ, ప్రతీ మనిషిలోనూ అంతరాత్మ అనేది వుంటుందనీ, అది ఎప్పుడో ఒకప్పుడు నాగుపాములా బుసకొడుతుందనీ, దానికి ఆ మనిషే తట్టుకోలేడనీ ఈ సత్యా అనే వ్యక్తి నిరూపిస్తున్నారు. తన మరణానికి వేరెవరూ బాధ్యులు కారనీ, ఇంతకాలం తను కొంతమంది విద్యార్థులని కోచింగ్ సెంటర్లలో చేర్చనీకపోవడాని కారణభూతుడై వాళ్ల భవిష్యత్తుని నాశనం చేసినందుకూ, ప్రాణాపాయస్థితిలోవున్న వ్యక్తులకి అత్యవసరమైన ఆపరేషన్లకి అడ్డుపడి కొందరిని అల్పాయుష్కులని చేసి వారి కుటుంబాలకి తీవ్రమైన మనస్తాపాలకు గురిచేసినందుకూ ఎంతో చింతిస్తున్నాననీ, వారినందరినీ క్షమించమని వేడుకుంటున్నాననీ ఆయన తన ఉత్తరంలో పేర్కొన్నారని ఎస్సై సయ్యద్ కమ్రుద్దీన్ చెప్పారు. సత్యా జనాలని మోసగించడానికి ఉపయోగించిన మెషీన్ని కోర్టులో ఎవిడెన్స్కింద ప్రెజెంట్చేందుకు చాలా జాగ్రత్తగా ఆ ఇంటినుండీ తరలించారు.” ఇవీ వార్తలు!

ఇండియాలో కొన్ని ఆత్మహత్యలు ఎలా సృష్టింపబడతాయో నాకు తెలుసుగనుక సత్యా చివరి నిముషాలనీ, వాటిల్లో సామంత్ భాగాన్నీ, పాత్రనీ ఊహించగలను. లేకపోతే, సత్యా ఆత్మహత్యచేసుకోవడమా! వాడి ఈమెయిల్ని మళ్లీ చదవడం మొదలుపెట్టాను.

“సామంత్ నా చివరి రోజేదో చెప్పివెళ్లిన తరువాత ఒకరోజంతా ఆలోచించాను. తరువాతే ఇది నీకు రాయడం మొదలుపెట్టాను. ఈ కాలయంత్రంద్వారా ప్రజలు భవిష్యత్తులోకి చూడగల్గడం రెండువందల శాతం నిజమని నమ్ముతున్నాను. అలాంటప్పుడు సామంత్ చెప్పిన మాట నిజమవాలి. అయితే, నేను రేపు పోతానని చెప్పాడుగానీ, ఎలా పోతానో వాడు నాకు చెప్పలేదు. నా అనుమానం నిజమయితే, వాడికి కూడా ఆ విషయం తెలిసుండదు. అలాగే, వాడు పోయే రోజేదో నాకు తెలుసుగానీ, ఎలా పోతాడో మాత్రం తెలియదు. సామంత్ పోతాడని రంజనికికూడా తెలుసుగానీ ఎలా పోతాడో తెలియదు. ఈ విషయాన్ని టైం మెషీన్ దాస్తున్నట్లుగా నాకు అర్థమవుతోంది. ఎలాపోతారన్న వివరాలుగనుక తెలిస్తే అలా జరగకుండా జాగ్రత్తపడి భవిష్యత్తునే మార్చేస్తే తన అస్తిత్వానికే ముప్పొస్తుందన్న భయంకాబోలు దానికి! (ఆనాడు పరీక్షిత్తు మహారాజుకీ తానెలా పోతాడో తెలియలేదు, ఈనాడు మేమెలా పోతామో మాకూ తెలియదు.) దానికి మరీ అంత తెలివితేటలని ఆపాదించక్ఖర్లేదనుకుంటే, మేథమేటిక్స్ టర్మినాలజీని ఉపయోగించి దానికి “సింగులారిటీ” అని నామకరణం చేద్దాం! నువ్వూ ఇంజనీర్వేగనుక, నీకున్న విలువలగూర్చి నమ్మకమున్నవాణ్ణిగనుక ఈ యంత్రంగూర్చిన వివరాలని నీకు అందజేసే ఏర్పాట్లుచేశాను. నువ్వే తయారుచేస్తావో, ఇంకొకళ్లచేత చేయిస్తావో, లేక ఇంకా రీసెర్చ్చేసి సింగులారిటీని తొలగించడానికి కృషిచేస్తావో నీ ఇష్టం. (నిన్ను నిరాశపరిచేందుకని కాదుగానీ, ఒక్కవిషయాన్ని గుర్తుచేస్తాను – మనకి కనిపిస్తున్న విశ్వాంతరాళమంతా బిగ్బేంగ్వల్ల – అదే, సింగులారిటీ వల్ల – ఏర్పడిందన్న నిర్ణయానికొచ్చారుగానీ, దానిముందర సృష్టి ఎలావుండేది అన్నవిషయాన్ని ఈనాడుకూడా ఎంతగొప్ప సైంటిస్టులూ చెప్పలేకపోతున్నారు!) ఇవాళ రాత్రి కాలయంత్రానికి పవళింపుసేవ చేసేసమయంలో దీనిలోని కీలకమైన రెండుమూడు పార్ట్లని తొలగించి ధ్వంసంచేస్తాను. రేపు నేనెలా పోతానో తెలియకపోవచ్చుగానీ, నేను పోగానే సామంత్ ఈ మెషీన్ని చేజిక్కించుకుంటాడని నాకు ప్రత్యేకంగా ఏ భవిష్యద్వాణీ తెలియజెప్పాల్సిన అవసరంలేదు. ఇప్పటికి మాత్రం నీకు తెలిసిన భాషలో – గుడ్బై మై ఫ్రెండ్!”
సామంత్, సత్యా ఒకళ్ల చావుదినాలని ఇంకొకళ్లు చెప్పడం సరే – రాఘవకూడా ఈశ్వర్ విషయంలో ఈ సంగతి చెప్పాడుకదా! అయితే, ఈ రెండు కేసుల్లోనూ సత్యాకి ఆకళింపుకిరానిదీ, నాకు అర్థమవుతున్నదీ ఒక వింతవున్నది. ఆ వింతకి నేనివ్వాళే “డెడ్మేన్ పేరడాక్స్” అని నామకరణం చేస్తున్నాను. దీనికి వివరణనిచ్చేముందర ప్రపంచవ్యాప్తంగా తెలిసిన గ్రాండ్ఫాదర్ పేరడాక్స్ని ఒకసారి గుర్తుకుతెచ్చుకోండి. “ఒకళ్లు గతంలోకివెళ్లి తమ తాతని చంపితే, ఈనాటి వాళ్ల జీవితం ఉండకూడదుకదా, కానీ వున్నాడు. ఇదెలా సాధ్యం?” – అన్నదేకదా గ్రాండ్ఫాదర్ పేరడాక్స్?

ఇక్కడ రాఘవ విషయంలోనూ, సత్యా విషయంలోనూ జరిగింది ఒకటే – భవిష్యత్తులోకి వెళ్లి, వాళ్లు ఇంకొకళ్ల మరణంగూర్చి తెలుసుకోగలిగారు. కానీ, అప్పటికి తాము మరణించారన్న సంగతి వాళ్లకి తెలియలేదు. పైగా, మళ్లీ వర్తమానంలోకి వచ్చిన తరువాతకూడా గుర్తుంచుకున్నారు. ఇదెలా సాధ్యం? దీనికే నేను “డెడ్మేన్ పేరడాక్స్” అని నామకరణం చేసింది.

నాగూర్చే నాకిప్పటికీ అర్థంకాని విషయమొకటుంది. అది, నేను మొదటిసారి టైంమెషీన్లో కూర్చున్నప్పటి అనుభవం. నేను నిజంగా ఆ పంజాబీ స్త్రీలోకి పరకాయప్రవేశంచేశానా, లేక ఆ కాలంలో ఆమే నేనా? నేనా మెషీన్లో కూర్చునేముందర సత్యా నాకు చెప్పినది తన బాల్యపు అనుభవాలని. ఆ మెషీన్ద్వారా గతంలోకెళ్లగలిగినా, అది గతంలో ఉన్నప్పటి దృశ్యాలనే, అనుభవాలనే తిరిగి పొందగలగడాన్ని మాత్రమే సాధ్యంచేసిందా, లేక తన కాలయాత్రలని సత్యా అలాంటి అనుభవాలకే పరిమితంచేసుకున్నాడా? ఆ కాలంలో ఆమే నేను అయ్యుంటే, మళ్లీ గతంలోకి వెళ్లగలిగితే ఆ క్షణాన బావిలోకి దూకకుండా ఆగగలనా? పరకాయప్రవేశమే చేసుంటే, సత్యా మరణించిన క్షణంలోకెళ్లి, దానికి కారకులైనవాళ్లని చూడగలను. కాకపోతే మాత్రం, వాడి చావుకి కారకులెవరో ఎప్పటికీ తెలియదు. రెండు శరీరాలూ కాలగమనంలో ఒకే క్షణంతో ముడిపడివుంటే పరకాయ ప్రవేశం చెయ్యగలగడం సాధ్యమా? రెండు శరీరాల్లో ఒకేసారి నేనుండగలగడం మాటటుంచి, ఆ రెండో శరీరంలో అప్పటికే తిష్ఠవేసివున్న జీవంసంగతేమిటి? అంటే, సత్యా మరణించే క్షణంముందు నేను అమెరికాలోవున్నాను. కాలయంత్రంలో గతంలోని ఆ క్షణానికి ప్రయాణించగలిగితే, ఇక్కడ హాస్పిటల్ బెడ్పైన నా శరీరం, అక్కడ ఇండియాలో చావబోతున్న సత్యా శరీరంలోకి ప్రవేశించబోతూ నేనూ – ఇది సాధ్యమేనా?

ఇంతలో క్రింద కాలింగ్బెల్ శబ్దమవడం, మా ఆవిడ తలుపు తియ్యడం లీలగా వినిపించింది. ఆవిడ అడ్డుపడుతున్నా వినకుండా, “రెండు నిముషాలే మేడం,” అంటూ హైదరాబాద్ తెలుగు ఏక్సెంటులో వినిపించిన మాటల తరువాత ఆ వచ్చినవాళ్లు పైకి వస్తున్నట్లుగా మెట్లమీద అడుగుల చప్పుడు వినిపిస్తుటే, ఎందుకో గుండె వేగం కొద్దిగా పెరగసాగింది. వాళ్లు బెడ్రూంలోకి రావడానికి ఎంతోసేపుపట్టలేదు. వాళ్లు ఇద్దరు. వాళ్లని చూడగానే నాకు కోపమొచ్చింది. “ఆవిడ వద్దంటున్నా వినకుండా ఇక్కడికి రావడానికి మీకు ఎటికేట్ లేదా?” కోపంగా ప్రశ్నించాను.

“కోపం తెచ్చుకోకండి సార్. మేమడిగిన ప్రశ్నలకి సమాధానమిస్తే అందరం ఎవరిదారిన వాళ్లం త్వరగా వెళ్లిపోవచ్చు. మేమిక్కడికొచ్చిన పనికూడా త్వరలోనే అయిపోతుంది,” వాళ్లలో ఒకడన్నాడు.
“నా ఇంట్లోకొచ్చే కోన్కిస్కాగాళ్లకి నేనెందుకు జవాబు చెబుతాను?” నాకు కోపం పెరిగిపోతోంది. వాళ్ల మొహాలని అప్పటిదాకా చూడలేదుమరి!

“మీ ఇండియా పోలీసులకి ఇక్కడికొచ్చి ప్రశ్నించడానికి అధికారమెవరిచ్చారు?” మా ఆవిడ కోపంగా ప్రశ్నించింది. యూనిఫాం వేసుకోకపోయినా, ఆమెకి తామెవరో క్రిందనే చెప్పినట్టున్నారు. వాళ్లు పోలీసులన్న మాటని విని నేను స్టన్ అయ్యానుగానీ, వెంటనే తేరుకున్నాను. “జానకీ, నువ్వు 911కి ఫోన్ చెయ్యి,” ఆమెనాదేశించాను. అమెరికా పోలీసులొచ్చిన తరువాత ఈ వెధవల సంగతి తేలిపోతుంది.

ఈ సంభాషణ ఇంతకుముందే జరిగినట్లు– కాదు కాదు, ఇంతకుముందే జరగబోతుందని తెలియడం – హఠాత్తుగా గుర్తొచ్చింది. రెండవసారి రాఘవ టైంమెషీన్లో యాత్ర చేసినప్పటి మాటగదూ ఇది? అలాగయితే, ఇలా గుర్తొచ్చిందని అప్పుడు తెలిసిందా? ఇప్పుడు జరుగుతుందని అప్పుడు తెలియడంగూర్చి ఇప్పుడు తెలుస్తుందని … – ad infinitem – అంటే, అనంతంగా – అనిగదూ అంటారు ఇలాంటి లంకెలని? అమెరికాలో కటకటాలని లెక్కబెట్టడంగూర్చి వాళ్లేదో అంటున్నారు. నా హార్ట్రేట్ పెరగడం తెలుస్తోంది.
“అయ్యో, ఇవాళే హాస్పిటల్నించీ వచ్చింది. ఆయనకి స్పృహతప్పు …” అని జానకి అనడం లీలగా వినిపించింది. కాలయంత్రంలోంచి అప్పుడు చెమటలు కక్కుతూ బయటకొచ్చాను. ఇప్పుడేమవబోతోందో తెలియదు.

### — ###

Photo/Artwork Credit:
Michael Lee-Graham (http://www.mleeg-art.co.uk/)