సిలికాన్ లోయ సాక్షిగా

లివ్ ఎ లైఫ్

జూన్ 2014

(సిలికాన్ లోయ సాక్షిగా -14)

క్లాసులో అందరికంటే వయస్సులో పెద్దవాడైన ఇతన్ని మొదటి రోజు క్లాసు కాగానే ” ఎక్స్ క్యూజ్ మీ, నా పుస్తకం అమెజాన్ నించి రావడానికి మరో వారం పడుతుంది. మీ పుస్తకాన్ని ఇవేళ నాకు ఇవ్వగలుతారా. రేపు తీసుకొచ్చి ఇస్తాను.” అంది గౌరి.

పక్కనే ఉన్న నేను మొహమాటంగా “నా పుస్తకం తీసుకోండి” అన్నాను గౌరికి ఇస్తూ, పక్కనించి అతను కూడా పుస్తకం అందించడం చూడకుండానే.

ముగ్గురం నవ్వుకున్నాం.

అతని ముఖంలో కళ్లద్దాల నించి కింద వరకు ఉన్న ముడతలు వయస్సుని మించి ఇంకాస్త పెద్ద వాడిలా కనిపింపజేస్తున్నాయి.

పరిచయాల లో అతనికి “గౌరి” అనడం ఎంతకీ రాలేదు.

“జౌరి…జౌరి…” అన్నాడు.

అతని రష్యన్ ఏక్సెంట్ లో ఇంగ్లీషు అర్థం చేసుకోవడం బాగా కష్టమైంది మాకు.

“నా పేరు నికొలయ్ లెవాన్ద్వాస్కీ. అంతెందుకులే “లెవ్” అని పిలవండి. అందరికీ అదే చెప్తాను.
ఎందుకంటే నా పేరుని స్పష్టంగా పలకక పోతే నాకు నచ్చదు.”అన్నాడు.

“మరి నా పేరు సంగతేమిటో అంది” గౌరి తెలుగులో.

“ఎప్పుడొచ్చారీ దేశానికి లాంటి కామన్ ప్రశ్న అడక్కుండా నేనే చెప్తాను, మా అబ్బాయి ఇక్కడే ఉన్నా, అయిదేళ్ళ కిందట అంటే ..నాకు అరవై రెండేళ్ల వయస్సులో లాటరీ గ్రీన్ కార్డ్ తో అమెరికా వచ్చి స్థిరపడ్డాం.” అన్నాడు.

“అదేమిటి మీ అబ్బాయి ఇక్కడే ఉద్యోగరీత్యా ఉన్నాడన్నారుగా. ఈ లాటరీ ఎందుకు” అన్నాను.
మా అబ్బాయి ద్వారా అయితే ఇప్పటికి కూడా రాగలిగే వాళ్ళం కాదేమో.. లాటరీ ప్రయత్నం చేసేం కాబట్టే అప్పుడే రాగలిగేం. మరి… మీరు? అని అడగగానే
“మీలా మాకు లాటరీ ల వంటి అదృష్టం లేదు” అని తల నిరాశగా విదిల్చింది గౌరి.

“మేం ఉద్యోగాలకు అర్హులమైనా ఇక్కడ పనిచేసే వీసా లేని కారణంగా…” అని,
” ఎప్పటికైనా ఉపయోగపడుతుందని ఇలా చదువుకోవడానికి వచ్చాం.”అన్నాను.
“అన్నట్లు నా బస్సు సమయం కావస్తూంది నేను బయలుదేరుతాను.” అన్నాడు.

“అదేవిటి బస్సులో వెళ్ళడం? కష్టం కాదూ? బస్సు స్టాపు నించి దగ్గరేనా మీ ఇల్లు? నేను డ్రాప్ చెయ్యనా మిమ్మల్ని మిస్టర్ లెవ్ ? ” అన్నాను.

“వద్దు, వద్దు- నేను కారు తెచ్చుకోలేక కాదు. నేనీ వయసులో కారు సరిగా నడపలేనని మా ఆవిడ అనుమానం. ఆవిడ మాత్రం డ్రైవ్ చేస్తుంది. తమాషా ఏమిటో తెలుసా ఆవిడదీ ఇంచుమించు నా వయసే. ఏం చేస్తాం! వుమెన్ డామినేషన్. అయినా నడక మంచి వ్యాయామం కదా” అని అన్నట్లు “నాకు “మీరు” అని గౌరవ వాచకాలు వాడనవసరం లేదు. చక్కగా “నువ్వు” అనండి చాలు ” అని నవ్వేడు.
వడి వడిగా వెళ్తూన్న అతన్ని చూసి “ఇతనికి అరవై ఏడేళ్ళంటే నమ్మ బుద్ధి కావడం లేదు. ఎంత వేగంగా నడుస్తాడో”
అన్నాను.

“ఊ! మొత్తానికి భలే పెద్ద మనిషి పరిచయమయ్యాడు.” అంది గౌరి.

“అతన్ని చూసి మనమెంతో నేర్చుకోవాలి. ఈ వయసులో ఏదో సాధించాలన్న పట్టుదల, తపన .. ఇవన్నీ భలే ఎంకరేజింగ్ గా లేవూ!” అన్నాను.

గౌరి చేతుల్లో అతనిచ్చిన పుస్తకం మొదటి పేజీలో చక్కని దస్తూరీ.

“వాళ్ల భాషలో అతని పేరనుకుంటా!” అంది గౌరి.

***

“ఓహ్! ఓవెర్ కాస్టింగ్ వెదర్” నిట్టూరుస్తూ అన్నాడు లెవ్.

అదేమిటీ ఆకాశం మేఘావృతమై ఇంత బావుంటేనూ! అంది గౌరి.

“ఇక్కడ ఉన్నానన్నమాటే గానీ నా చుట్టూ నా చిన్నప్పటి జ్ఞాపకాలు పరుగెడుతూ ఉంటాయి.” అన్నాడు మళ్లీ ఎటో చూస్తూ-
నిజమే- అతని కళ్లు ఇక్కడి ప్రపంచాన్ని చూస్తున్నట్టు ఉండవు.

“అవునుగానీ అడగడం మర్చిపోయాను. “క్లియోపత్రా ఎ లైఫ్” ఎంత వరకు వచ్చింది?” అన్నాడు నా వైపు చూసి.

“ఏవిటీ! అట్ట కూడా తిప్పలేదు ఇంకా. ఈ ప్రై డే కు పేపర్ సబ్మిట్ చెయ్యాలి కదా మనం. అదేదో నువ్వు చదివేస్తే కథ చెప్పెయ్యరాదూ!” అన్నాను.

“ఊ. నేనూ చదవలేదు. నువ్వే చెప్పెయ్యరాదూ” అంది గౌరి కూడా అతనితో.
“పుస్తకం తీయకుండా అంత బిజీగా ఏం చేస్తున్నారు?” అన్నాడు మా ఇద్దరి వైపు చూస్తూ.
“ఇంకేముంది వంట” అంది గౌరి నవ్వుతూ నా వైపు చూసి.

“ఏమిటీ వంట, వంట. ఇంట్లో ఉన్నంతసేపూ వండుకుని తినడమేనా మీ పని” అన్నాడు నవ్వుతూ.
“నీకేం తెల్సు మా వంట పాట్లు. వంటొక్కటే అయితే పర్లేదు. కాయగూరలు తెచ్చే దగ్గర్నుంచి, రాత్రి డిష్ వాషర్ వేసే వరకు “తినే పళ్లెం వెనక కథ” ఎంత ఉంటుంది! ఎవరు చేస్తారనుకుంటున్నావివన్నీ” అని
“మా అమ్మకి చిన్నతనం లో వంట నేర్పించొద్దు అనేవారట వాళ్ల నాన్న. మా అమ్మ పెద్దయ్యేసరికి “కమ్యూనల్ వంటిళ్లు” వచ్చేస్తాయని ఆయన నమ్మకం. ఏదీ, ఇప్పుడు మా తరానికి ఇక అటువంటి ఆశ కూడా లేదు. అయినా కమ్యూనిస్టు ప్రపంచం లో పుట్టి పెరిగిన వాడివి నీకేం చెప్పనవసరం లేదులే ఇవన్నీ.” అంది గౌరి.

తల విదిలిస్తూ ఒక చిత్రమైన నవ్వు నవ్వాడు లెవ్.

“అరవై ఏడేళ్ల వయసులో నాకీ ఇంగ్లీషు లెర్నింగ్ క్లాసెందుకు? కసి. నాకూ అందరిలా చక్కగా ఆంగ్లంలో మాట్లాడాలన్న కసి.” అని

“అవునేమన్నావ్? కమ్యూనల్ వంటిళ్లు. అవి నాకు తెలిసి ఇజ్రాయిల్ లోని కిబుజ్ ల సంస్కృతి లో తప్ప ఇంకెక్కడా లేవు. మీరంతా కమ్యూనిస్టు దేశాల గురించి పుస్తకాల్లో చదివి అధికంగా ఊహించుకున్నవివన్నీ. నీకు తెలుసా? మాకు ప్రభుత్వం ఇచ్చిన వంద గజాల జాగాలో మా చిన్న ఇంటి సందులో బంగాళాదుంపలు తవ్వుకుని తిండానికి కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసే వాళ్ళం. కాయగూరలు, మంచి ఆహారం ఎరగం మేం. కమ్యూనిటీ సెంటర్లలో దుమ్ముల మాంసం తప్ప ఏమీ దొరికేది కాదు. మంచి మాంసం వంటివి ముందుగా కమ్యునిస్టు అధికారులే పంచుకునే వారు.”

అని కాస్త ఆగి-
“అయినా మీరు కొత్త ప్రపంచంలో పుట్టిన వాళ్లు. నాకు తెలిసినంత వరకు కొత్త ప్రపంచం కొత్త జీవితాలకు తలుపు తెరిచింది. మళ్లీ పాత ప్రపంచపు ఆలోచనలు మీకెందుకు” సాలోచనగా అన్నాడు.
“ఓహ్! కమాన్ లెవ్, నా ఉద్దేశ్యం లో కమ్యూనిస్ట్ ప్రపంచం అనేది ఒక గొప్ప కల. ఎంత బావుంటుంది! ధనికులు, పేదలు లేని సమ సమాజం!” అన్నాను.

గట్టిగా నవ్వాడు “సమ సమాజం….ఊ.. ప్రియా! నువ్వు చెప్పినట్లు కమ్యూనిస్టు సమాజంలో ధనికులు, పేదలు ఉండరనుకుందాం. అంతకంటే దారుణంగా అధికారులు, నిరధికారులు మాత్రం ఉంటారు. ఈ నిరధికారులని మనం “సామాన్యుల”ని అందాం. ఈ సామాన్యులకి ఎటువంటి ఉన్నతీ ఉండదు. ఒక వ్యక్తిగా ఆలోచించు. జీవితంలో ఎంత కాలం నువ్వు ఎటువంటి ఉన్నతీ కాంక్షించకుండా ఉంటావు? నిరాశకు గురి కాకుండా ఉండగలుగుతావు? అంతెందుకు నీ పై నీ భర్త అధికారాన్ని సహించ గలవా? లేదు కదూ. ఇక దేశం పెత్తనాన్ని ఊహించగలవా!” అన్నాడు.

గౌరి, నేను నిరుత్తరంగా చూస్తూండగా
” మా అమ్మా, నాన్నా యూదులు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బతికి బట్ట కట్టిన అతి కొద్ది మందిలో ఒకరు. మా నాన్న, అమ్మ వాళ్ల కుటుంబాలు, బంధుత్వాలు, స్నేహితులు ఒకటేమిటి అన్ని బంధాలు యుద్ధానికి బలైపోయాయి. నాజీల ఊచకోతలో మాయమైపోయాయి. వీళ్లిద్దరూ గుండె దిటవు చేసుకుని ఒక కొత్త ప్రపంచంలో బతకాలనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు ఎలాంటి ప్రపంచం కావాలి? ఎలాంటి సమాజం కావాలి? వాళ్లిద్దరూ డాక్టర్లు. వాళ్ల జీవితాల్లో ఆనందకరమైన సంఘటనేదైనా ఉందంటే అది నేను పుట్టడం ఒకటే. మా అమ్మ తరచూ అనేది “నాన్నా! యూదులను మనుషులుగా బతకనిచ్చే ప్రపంచంలో బతుకు ఎప్పటికైనా” అని. నా చెవుల్లో ఇప్పటికీ మారు మోగుతూంది ఆ వాక్యం.” అని
చెమ్మ గిల్లిన కళ్ళతో “ఇక అప్పటికి మేమున్న కమ్యూనిస్టు ప్రపంచంలో మాకు మతం ఉండకూడదు. విశ్వాసాలు ఉండకూడదు. నీకు నచ్చిన ఉద్యోగాన్ని ఎన్నుకునే హక్కు ఉండదు. నీకు ఎంత జీతం కాంక్షిస్తావో, నీ శక్తి సామర్థ్యాలకు ఎంత డబ్బుని కొలమానంగా అనుకుంటావో అది నీకు ఎప్పటికీ దరి చేరదు.” అన్నాడు.

” అందరూ సమానమైన సమాజంలో మనం డబ్బు గురించి, స్వలాభాల గురించి ఆలోచించడమే తప్పేమో లెవ్ ..” అన్నాను సాలోచనగా.

“ఎగ్జాక్ట్ లీ. కానీ అది నిజంగా అన్నీ సమానమైన సమాజం లో. కానీ కమ్యూనిస్టు సమాజంలోనూ యూదుల పట్ల వివక్ష ఉండేది. మాకు ఉద్యోగాల్లో ఇతరులతో సమానమైన అవకాశాలు ఉండేవి కావు. ఎంత చదువుకున్నా లభించే ఉద్యోగాలన్నీ గ్రామీణ ప్రాంత ఉద్యోగాలు మాత్రమే. కమ్యూనిస్టు వ్యవస్థలో అంతర్లీన దోపిడీ బయటి ప్రపంచానికి తెలియజేసే ఇప్పటి మీడియా వంటివి లేవు. పైగా ఆ సమాజంలో మనస్సులో మాట ఎక్కడ బహిర్గతపరచినా శిక్ష తప్పదు.”

డిస్పోసబుల్ కాఫీ కప్పుని పైకెత్తి పట్టుకుని అద్దాల లోంచి రోడ్డుని, ఈదురు గాలిని చూస్తూ అన్నాడు.
“జౌరీ, ప్రియా మీరు చాలా చిన్న వాళ్లు. మీకు గతించినవన్నీ ఎందుకు? అమెరికా లాంటి స్వేచ్ఛా ప్రపంచంలో మనకీ ఆలోచనలెందుకు?” అని నవ్వాడు.

టెక్స్టు పుస్తకంలో అతని భాషలో పేరుని చూపిస్తూ “నీ పేరులో ఇన్ని అక్షరాలున్నాయా?” అంది గౌరి.
“కాదు. అది మా అమ్మ పేరు. ఆవిడ కలకు అనుగుణంగా నా జీవితాన్ని మలచుకోవాలనుకునే నేను ఇంత దూరం వచ్చాను జీవితంలో. చదువు తర్వాత ఇజ్రాయిల్ కు ఇమ్మిగ్రేషన్ వచ్చేసాను. అక్కడే మరియా ను కలిసాను. తను మా కంపెనీలోనే రిసెప్షనిస్టుగా పనిచేసేది. మా పెద్దబ్బాయి పుట్టేక ఉద్యోగం మానేసింది. మళ్లీ ఇప్పుడు చేస్తోంది. ఈ దేశం లో నాకు నచ్చేది ఇదొకటి. ఇక్కడ మనకు ఓపిక ఉన్నన్నాళ్లూ పని చేసుకోవచ్చు. నాకు ఇక్కడ మరో నచ్చే విషయం ఇక్కడి మనుషుల్లోని ఫ్రెండ్లీనెస్…
మీకొకటి తెలుసా! ఇజ్రాయిల్ యూదుల స్వర్గమని నేను అక్కడికి ఇమ్మిగ్రేషన్ కు వెళ్ళానా! అక్కడ ఎప్పుడూ ప్రాణ భయమే. బయటికి వెళ్లిన వాడు సాయంత్రానికి తిరిగి ఇంటికి వస్తాడన్న నమ్మకం ఏ రోజూ ఉండదు. మా రెండో అబ్బాయి ఇంకా ఆ దేశంలోనే ఉన్నాడు. ఆ విషయంలో మాకు ఎప్పుడూ బెంగే.” అని ఆగి
“ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానో అని నాకే ఆశ్చర్యం గా అనిపిస్తుంది. నేను ఎంత నోస్టాలజిక్కో తెలుసా! రాత్రి నిద్రపోతే మా అమ్మ జ్ఞాపకం వస్తుంది. టమాటాలు ఎప్పుడెప్పుడు కాస్తాయో అని మొక్క ముందు తపస్సు చేయడం జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ రష్యన్ బ్రెడ్డు తినే ప్రతిసారీ మొదటి లోఫ్ తుంచగానే మా అమ్మ గొంతు వినిపిస్తుంది. “బ్రెడ్డు ముక్కలు ఇలా కింద పడెయ్యకురా నాయనా! ఇలాంటి చిన్న ముక్క ఎక్కడో ఎవరికో ఆకలి తీరుస్తుంది.” అన్నాడు.

“రాత్రుళ్ళు నిద్రపోయినప్పుడు నాకు ఎప్పుడూ ఈ దేశపు కల రాదు అదేమి విచిత్రమో. ఎప్పుడూ నీ చిన్న నాటి కలలేనా అంటుంది నా భార్య. మనం ఏదో కావాలని కలలు కంటామా? మీకొకటి తెలుసా, అసలు కలల్లో ఎవరికైనా ఒకప్పుడు గుచ్చుకున్న, పగిలిన గతపు ముక్కలే వేరు వేరు గా ఎక్కడెక్కడో అతుక్కుని కనిపిస్తాయి.”

బాగా చలిగాలి వీస్తోంది. గలగలా ఎండుటాకులు అడుగడుక్కీ జ్ఞాపకాల్లా కాళ్ల ముందు పడ్తూ ఉన్నాయి.
చీకట్లు ముసురు తున్నాయి. ఎక్కడో దూరంగా ఆకాశంలో ఒక హఠాత్తు వెలుగు కనిపించి క్షణాల్లో మాయమైంది.

“గౌరీ! మనం ఎక్కడ జీవించాలి? నడిచిన చోటా? నడుస్తున్న చోటా? నడవాల్సిన చోటా?” అన్నాను.
“ఎక్కడ జీవించినా అదిగో అలా ఉత్సాహంగా నడవాలి ” దూరంగా బస్టాపు వైపు వడిగా నడుస్తున్న లెవ్ ని చూపిస్తూ, నవ్వుతూ అంది.