సిలికాన్ లోయ సాక్షిగా

చైల్డ్ కేర్

జూలై 2014

(సిలికాన్ లోయ సాక్షిగా-15)

ఉదయం అలీసియా చిన్న కూతురు మరియా ఫోన్ చేసింది.

“ఇక్కడ ఎలిమెంటరీ స్కూలు ఆవరణలో పేరొందిన కాలేజీ నించి “చైల్డ్ కేర్” గురించిన అవగాహన కోసం ఉచిత క్లాసు నిర్వహిస్తున్నారు. నువ్వూ వస్తావా?” అంది.

“చైల్డ్ కేర్” అంటే? అన్నాను.

“పిల్లల పెంపకం, ఆలనా పాలనా, అంతే కాదు ఈ దేశంలో కొన్ని ఉద్యోగాలకి అది క్వాలిఫికేషన్ కూడానూ”

“పిల్లల పెంపకాన్ని కూడా కోర్సులాగా చదవాలని తెలీని దేశం నించి వచ్చిన నాకు చాలా ఆసక్తిగా ఉంది” అన్నాను. కానీ నిజానికి చివరి మాట నన్ను బాగా ఆకర్షించింది.

“అయినా పూర్తి వివరాలు కనుక్కుందామనే నేనూ వెళ్తున్నాను.” అంది అటు నించి.

సాయంత్రం ఆరు గంటల నించి ఏడున్నర దాకా అయిదు వారాల ఉచిత కోర్సు అది. ఒక్క వారం కాదు. సర్టిఫికేట్ వంటివి ఇవ్వరు కానీ, నిజంగా ఆ కాలేజీలో కోర్సులు ఎలా ఉంటాయో వాటికి ఇంట్రొడక్షన్ వంటిది ఇది.

మొదటి రోజు క్లాసు మొదలవుతూనే “ఎందుకు ఈ కోర్సు కు వచ్చారు” అంది చక్కని నవ్వు ముఖంతో ఇన్స్ ట్రక్టరు.

దాదాపుగా అంతా “ఉద్యోగరీత్యా” అనే సమాధానం ఇచ్చారు.

నేను మాత్రం నాకెలాగూ ఇక్కడ ఉద్యోగం చేసే అర్హత లేదు కాబట్టి “పిల్లల పెంపకం” గురించి తెలుసుకోవాలని వచ్చానని చెప్పాను.

ముందు ఇలాంటి కోర్సుల వల్ల ఎటువంటి ప్రొఫెషనల్ అవకాశాలు ఉంటాయో చెప్పుకొచ్చింది టీచరు.

” మీకు తెలుసా , ఇక్కడి చాలా స్కూళ్లు, కాలేజీల టీచరు ఉద్యోగాలకి ఈ కోర్సులు తప్పని సరి ప్రీరిక్విజెట్స్. అంతే కాదు ఇందులో సర్టిఫికేషన్ వరకు పూర్తి చేస్తే, మీకు ఉద్యోగం చేసే ఇష్టం లేక పోయినా స్వంతంగా హోం బిజినెస్ లాగా చిన్న రిజిస్టర్డ్ బడి పెట్టుకోవచ్చు. ఇక డిగ్రీ వరకు చదివి, రెండు సంవత్సరాల అనుభవం కూడా జోడిస్తే పెద్ద సైజు ప్రీ స్కూలు కం డే కేర్ పెట్టుకోవచ్చు. ఇందులో పీజీ, పీహెడీలు చేస్తే ఇలా నాలా ఈ కోర్సులకే ఇన్స్ ట్రక్టరు కావచ్చు, నేనూ మీలానే ప్రారంభమయ్యాను ఒకప్పుడు” అంది కాఫీ సిప్ చేస్తూ.

ఆ అయిదు వారాలూ పిల్లలు ఎలా ప్రవర్తిస్తే మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? పిల్లల మనోభావాల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అనే విషయాల గురించిన సదస్సుల్లాగా జరిగాయి. అనుభవాలు పంచుకోవడం, సరియైన సందర్భానికి సరియైన పద్ధతిలో రెస్పాండ్ కావడమూ అన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకునే సరికి నాకు గొప్ప ఆశ్చర్యం వేసింది. ఇవన్నీ తెలుసుకోకుండానే నిధిని ఎలా పెంచుతున్నా అని ఆలోచన, ఇప్పటి వరకు పిల్ల నన్ను విసిగించినప్పుడు నేను ప్రవర్తించిన తీరు తల్చుకుని సిగ్గుగా అనిపించింది.
ఈ క్లాసుల పట్ల బాగా గౌరవం బాగా పెరిగింది.

“ముఖ్యంగా పిల్లల పెంపకంలో నేర్చుకోవలసింది “పేషన్స్” అన్న మాటలు చెవుల్లో మార్మోగుతున్నాయి అయిదు వారాలు అయిపోయినా.

***

“కాలేజీలో చేరి చైల్డ్ కేర్ కోర్సులో కనీసం సర్టిఫికేషన్ చేయాలనుకుంటున్నాను.” అన్నాను సూర్యతో.

తనేదో అనేలోగానే “పెద్దగా ఖర్చేమీ కాదు, కనుక్కున్నాలే. ఇది కమ్యూనిటీ కాలేజీ” అన్నాను మళ్లీ.

“అదికాదు నేనాలోచిస్తున్నది, ఈ కోర్సు వల్ల నీకు ఉపయోగం ఏవిటి?”

“నిజానికి నువ్వు కూడా నాతో కలిసి చదివితే మంచిదేమో” అన్నాను.

నా వైపో సారి అనుమానంగా చూసాడు. మరేదైనా ఆలోచనలో పరధ్యానంగా ఉన్నానేమోనని.
నేనసలు తనని పట్టించుకోనట్టే “అవును, పిల్లల్ని కనడం తో సరి కాదు, ఎలా పెంచాలో నేర్చుకోవాలి. ఈ కోర్సుల వల్ల వచ్చే ఉద్యోగాలు వగైరాలు మనకు వర్తించక పోయినా పేరెంటింగ్ లో మెలకువలు నేర్చుకోవడం కోసమైనా నువ్వూ, నేనూ చేరడం అవసరం అనిపిస్తూంది.” అన్నాను.

నా సీరియస్ నెస్ గమనించి నిధిని దగ్గిరగా తీసుకుని “బంగారు తల్లిని పెంచడం ఎలాగో నేర్చుకోవడం కోసం ఇద్దరం కాలేజీలో చేరితే ఇంట్లో పాపని ఎవరు చూస్తారట?”

“అయినా పేరెంటింగ్ కాలేజీలో నేర్చుకోవలసినంత కష్టమంటావా?” అన్నాడు.

“అదే నేను మొదటి క్లాసులో అనుకున్నది. కానీ పిల్లల పట్ల పెద్దల ఆలోచనలు ఎలా ఉండాలో, క్రమశిక్షణ పిల్లలకి ఎంత అవసరమనుకుంటామో, పెద్ద వాళ్లక్కూడా అంతటి పేషన్సు అవసరమని గుర్తించడానికి ఇలాంటి క్లాసులు అవసరం. తెలుసుకునే కొలదీ ఇంకాస్త తెలుసుకోవాలని అనిపిస్తూంది సూర్యా” అన్నాను.
నా గొంతులో నిజాయితీ ధ్వనిని కాదనలేక “నీకు నచ్చితే, టైము పెట్టగలననుకుంటే నాదేముంది చెప్పు, ఎలాగూ సాయంత్రం క్లాసులు అంటున్నావు కాబట్టి ఆఫీసు నించి త్వరగా వచ్చి నిధిని నేను చూసుకుంటాను ” అన్నాడు.

కమ్యూనిటీ కాలేజీ లు రెండు సంవత్సరాల అసోసియేటివ్ డిగ్రీ మాత్రమే ఆఫర్ చేస్తాయి. మరో రెండు సంవత్సరాలు వేరే డిగ్రీ కాలేజీలకు ట్రాన్స్ఫర్ చేసుకుని మొత్తానికి నాలుగు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేయొచ్చు. నాలా కేవలం సర్టిఫికేషన్ కోర్సులు చేయడానికి బెస్ట్ ప్లేస్.

కావడానికి కమ్యూనిటీ కాలేజీయే కానీ స్టూడెంట్సు ఇబ్బడి ముబ్బడిగా ఉంటారు. పైగా జాయిన్ అయ్యి స్వంత ఎకవుంట్ వచ్చే వరకూ ఎన్నో స్టెప్స్ ఉంటాయి. ముందు కౌన్సిలింగని ఒక అప్పాయింట్మెంటు తీసుకుని అరపూట లైను లో గడపడం, అప్లికేషను పుచ్చుకుని లైను లో నిలబడడం, ఎటువంటి సహాయమూ లేకుండా కంప్యూటర్లో అకౌంట్ స్వయంగా క్రియేట్ చేసుకోవలసి రావడం, సర్టిఫికేట్ల చెకింగ్, వీసా స్టేటస్ వగైరా చెకింగులు, చివరగా ఫీజు కట్టడం వరకూ రెండు రోజులు కాలేజీ చుట్టూ తిరిగేక గానీ కాలేజీ లో చేరడం అంత సులభమేమీ కాదని అర్థం కాలేదు నాకు.

ఇంట్లో నిధిని సూర్య దగ్గిర వదిలి క్లాసులకి వెళ్లడం కొంచెం బాధాకరమైన విషయమే కానీ, క్లాసుకి వెళ్లేక సమయం ఎలా గడిచిపోతూందో తెలీదు. పైగా కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల ప్రవాహంలాగా ఎప్పుడూ ఉత్సాహంగా అనిపించడం మొదలు పెట్టింది.

పుస్తకాల్లో పాఠాలు గంటల తరబడి చదివినా, చదవక పోయినా, సంవత్సరానికి ఓ సారి మొక్కుబడి పరీక్షకి కష్టపడి కంఠతా పట్టి ఏదో రాసి వచ్చేయడం లాగా ఇక్కడి చదువు ఉండదు.

ముఖ్యంగా ఇక్కడి చైల్డ్ కేర్ క్లాసుల్లో టెక్స్టు పుస్తకంలోని విషయాలతో సమానమైన నిత్య జీవితాల్లోని సంఘటనలను టీచర్లు ఆసక్తిగా అడిగి తెలుసుకోవడం, ప్రతీ విషయమూ గ్రూపులుగా చర్చించడం, కలిసి ఆసక్తి దాయకమైన ప్రాజెక్టులు చేయడం, వారం వారం ఎసైన్ మెంట్లు, కాగితాల్లో రాసేదానితో సమానంగా క్లాసు పార్టిసిపేషన్ కు ప్రాధాన్యత నివ్వడం మొదలైన వాటివల్ల రోజూ క్లాసు లో ఇన్వాల్వ్ అయ్యినట్లనిపిస్తుంది. నిజానికి అసైన్ మెంట్ల రూపంలో పేజీలకు, పేజీలు టైపు కొట్టడం, ప్రతీ విషయానికీ గంటల తరబడి రీసెర్చి ల వల్ల, ప్రాజెక్టులకోసం స్థానిక స్కూళ్ల లోను, తెలిసిన కుటుంబాల తోనూ ఇంటర్వ్యూలు, రిపోర్టులు తయారు చెయ్యడం వంటి నిమిషం తీరిక లేని పనుల వల్ల బాగా అలిసిపోయినా సెమిస్టర్ చివర తరగతి లో నుంచి బయటకు వచ్చేసరికి అకడమిక్ గా ఎంతో కొంత నేర్చుకున్న భావన కలిగింది. నా వరకు నాకు ఈ విద్యా విధానం బాగా నచ్చింది.

అన్నిటికంటే ముఖ్యంగా ప్రతీ క్లాసు తర్వాతా నిధితో నేను మాట్లాడే పద్ధతి దగ్గర్నించి, ఓపిగ్గా తన విషయాలు పట్టించుకోవడం మొదలైన విషయాల్లోని మార్పులు సూర్య గమనించినట్లున్నాడు. రెండు మూడు సందర్భాల్లో నా వైపు ప్రశంసాపూర్వకంగా చూడడం గమనించాను.

***

ఆ ఆదివారం ఇండియా నించి పోన్ వచ్చింది. సూర్య ఇంటి నించి. ఒక డిస్టర్బెన్స్ మామధ్య పొడసూపింది.
తనకు తోచినదే గొప్ప అని తనూ, నాకు మంచి అనిపించినదనీ నేనూ పోట్లాడుకున్నాం.
అలాంటప్పుడు నాకు తెలిసిన మధ్యేమార్గం ఒకటే. మనసుని మళ్ళించుకుని మరేదైనా విషయమ్మీద దృష్టి పెట్టడం.

మనసులో బాధ మెలిపెడుతూంది. దానిని అధిగమించడానికి క్లాసు ఎసైన్ మెంట్ చేద్దామని ఇలా కూర్చున్నానో లేదో నిధి వచ్చి నా చెయ్యి పట్టుకు లాగడం మొదలు పెట్టింది.
అసలే భారంగా ఉన్న మనసుని మళ్లించుకునే మార్గాంతరాన్వేషణలో సతమతమవుతున్న నాకు భలే విసుగ్గా అనిపించింది.

మామూలుగా అయితే “గయ్యి” మని ఒక్క అరుపు అరిచేదాన్నేమో.

“మన మనసుల్లోని భావాలు చిన్న పిల్లలకు అర్థం కావు, మనం పైకి చూపించే చేతలు మాత్రమే అర్థమవుతాయి.” అన్న మా క్లాసు లో ఇన్స్ ట్రక్టరు మాటలు జ్ఞాపకం వచ్చాయి.

“ఏంటమ్మా” అన్నాను వీలైనంత శాంతంగా.

“నా పుట్టిన రోజుకి గిప్టులుగా వచ్చిన బొమ్మలన్నీ ఇవ్వు నేను ఆడుకోవాలి.” అంది.

“అవన్నీ బీరువా పై అరలో సర్ది పెట్టేను. ఇప్పుడు కాదు. నేను పనిలో ఉన్నాను.” అన్నాను.

“కాదు, ఇప్పుడే, అయినా అవన్నీ నేను ఆడుకోవడానికా, నువ్వు దాచుకోవడానికా” అని వాదన మొదలు పెట్టింది.

“నిధీ, నాకు ఒంట్లో బాగో లేదు, విసిగించకు” అన్నాను.

“నీకు కంప్యూటర్ ముందు కూచోవడానికి ఒంట్లో బావుంటుందా?గాష్…..” అంది అసహనంగా.
కోపాన్ని ఆపుకోవడంతో నాకు తలపోటు వచ్చేయడం మొదలు పెట్టింది.

” పోనీలే చిన్న పిల్లవి అని ఊరుకుంటున్నాను. ఇప్పుడింకేమీ మాట్లాడకుండా వెళ్ళు, బొమ్మలు ఇప్పుడు కాదు, రేపు కూడా ఇవ్వను.” అన్నాను ఆగకుండా.

పక్క గదిలో కెళ్ళి “డాడీ, చూడు మమ్మీ నా బర్త్ డే గిప్ట్ లన్నీ దాచేసి, ఇవ్వనంటుంది.” అని కంప్లైన్ చేసింది.

విసవిసా వచ్చి “నేను పనిలో ఉన్నపుడు పిల్లని ఏడిపించొద్దని నీకు వంద సార్లు చెప్పేను. ఏం చేసుకుంటావు ఆ బొమ్మలన్నీ పిల్లని ఆడుకోనివ్వకుండా? చైల్డ్ కేర్ క్లాసులకి వెళ్లి నేర్చుకుంటూన్నది ఇదేనా? ” అన్నాడు.
నాకు దు:ఖం ముంచుకొచ్చింది. విసుగూ వచ్చింది.

ఇక అక్కడ నేను ఏం మాట్లాడినా సిట్యువేషన్ ఎలా మారిపోతుందో తెలుసు.

లాప్ టాప్ మీంచి దృష్టి మరల్చకుండా మౌనంగా కూచున్నాను.

సూర్య బొమ్మలన్నీ తీసి ఇవ్వడం, ప్రతీ బొమ్మనీ పాక్ చింపి, నిధి పీకి పాకం పెడుతూ నా వైపు గెలిచినట్లు చూడడం నాకు ఇష్టం లేదు.

***

” సూర్య అలా అన్నీ తీసి ఇవ్వకుండా రోజుకొక బొమ్మ తీసి ఇస్తే బావుణ్ణు. లేదా అక్కడా విషయంలో తను కల్పించుకోకుండా ఉన్నా బావుండేది. నిజానికి రోజుకొక కొత్త బొమ్మ ఆడుకోవడానికి ఇస్తే పిల్లకి సర్ప్రైజ్ గా ఉంటుందనే నేనవన్నీ పైన భద్రంగా పెట్టేను.” అన్నాను సౌమ్యతో.

సౌమ్యకి నిధి కంటే పెద్ద పిల్లలు ఉన్నారు.

“ప్రియా, ఈ దేశం లో పిల్లల పెంపకం కత్తి మీద సాము లాంటిదే. నిధి ఇంకా చిన్న పిల్ల. ఏడో తరగతి లో ఉన్న మా పెద్దమ్మాయి అసలు నాకు ఏ విషయం లోనూ నాలెడ్జి లేదనుకుంటుంది. పైగా మాట్లాడడం లో కరుకుదనం.”

అంటూ పార్కులో నవ్వుతూ ఆడుకుంటున్నవాళ్ళ చిన్నమ్మాయిని, నిధిని చూస్తూ మొన్నిలాగే మేం పార్కుకి వచ్చినపుడు

“ఇక చాల్లేమ్మా, వెళ్దాం ఇవేళ్టికి” అన్నాను.

“గాష్…స్టాపిట్ మాం, ఎప్పుడూ ఇల్లు, ఇల్లు.” అంది.

దారిలో నా సెల్ ఫోను తీసుకుని ఇక్కడి గందర గోళం మ్యూజిక్ స్పీకర్ లో ఆన్ చేసింది.

“ఏంటిది?” అని గట్టిగా అన్నాను. అసలే ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ పని చెయ్యక రోడ్డంతా జామ్ అయ్యింది.
నాకు ఈ దేశపు మ్యూజిక్ అంటే తెలీని మొద్దువు నువ్వు అన్నట్లు

“ఇటీజ్ కాల్డ్ మ్యూజిక్ ” అంది రూడ్ గా.

మరో సారి లెక్కల్లో మార్కుల గురించి నేనేదో గట్టిగా చెప్పబోతే,

“ఆహా… ఏదీ మీన్, మీడియన్, మోడ్ అంటే చెప్పు” అని ఎదురు ప్రశ్న వేసి

“జస్ట్ షటప్ మామ్, నీ ఇండియన్ పేరెంటింగ్ నా దగ్గిర చూపించకు.” అని విసుగ్గా అంది.

“లోపలి నించి జమ్మని కోపం తన్నుకు వచ్చింది నాకు. పళ్ల బిగువన ఆపుకున్నాను. ఇలా ఆపుకోవడం వల్ల తల పగిలిపోతుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. వీళ్ళని ఓపిగ్గా పెంచే సరికి మనకు బీ.పీ.గేరంటి. ఈ అమెరికాలో పిల్లలతో పరుషంగా మాట్లాడకూడదు, ఒక దెబ్బ వేయకూడదు. అన్నీ నవ్వుతూ ఓపిగ్గా చెప్పాలి. దీనిని వీళ్ళు ఎడ్వాంటేజ్ గా తీసుకుని మన మాట లెక్క చెయ్యరు. టైం అవుట్ లు ఇద్దామంటే పిల్లలు పదేళ్ళు రాగానే మనమిచ్చే చిన్న చిన్న టైం అవుట్ లకి అసలు భయపడరు.” అంది.

“అదే నాకు అర్థం కావడం లేదు. నిధితో నా బిహేవియర్ ని సరిచేసుకోవడానికి నేను చైల్డ్ కేర్ కోర్సులు చదువుతున్నాను. కానీ పిల్లలు ఇల్లా పెడసరం గా తయారైతే ఎలా మార్చాలో అర్థం కావడం లేదు. టైం అవుట్ల కి నిధి ఇప్పుడే భయపడడం లేదు. నిజానికి ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇక్కడి వాళ్ళు మాటకి ముందు, చివర మర్యాదలు జోడించడం విని మన పిల్లలూ ఇలా తయారవుతారనుకున్నాను.” అన్నాను.

“ఇక్కడి సమాజంలో తలిదండ్రుల్ని గౌరవించడం అనే మాట లేదు. ఇక్కడి పిల్లలు చుట్టూ ఉన్న పిల్లల్ని చూసి నేర్చుకునేది ఎక్కువ. అందుకే మనం ఇంట్లో మరో విధంగా పెంచాలని చూసినా వీళ్ళకు తిరుగుబాటు తప్ప మరొకటి రావడం లేదు.” అంది నిట్టూరుస్తూ సౌమ్య.

***

“డాడీ, అయాం లెర్నింగ్ హెచ్.టీ.ఎం.ఎల్ ఇన్ స్కూల్” అంది నిధి సూర్య దగ్గిరికి పరుగెత్తి.

“ఓహ్, అప్పుడే నేర్పించేస్తున్నారా?, ఏం చెప్తున్నారు?” అన్నాను ఆసక్తిగా.

“మామ్ , ఇట్స్ హెచ్ .టీ .ఎం .ఎల్ ” అని ఒక్కో అక్షరాన్నీ విడి విడిగా పలికి

“యు కాంట్ అండర్ స్టాండ్ ” అంది నిధి రూడ్ గా.

పక్క నించి సూర్య నవ్వు.

“సాప్ట్ వేర్ ఇంజనీర్ కాబట్టి నాన్నకి ప్రపంచం లోని అన్ని విషయాలు తెలుసు. ఎప్పుడూ ఇంట్లో వంట చేస్తూ కనబడతుంది కాబట్టి మమ్మీకేమీ తెలీదు. అదేనా నీ ఆలోచన? నువ్వు హెచ్.టీ.ఎం.ఎల్ నేర్చుకోకపోయినా నష్టం లేదు కానీ, మాట్లాడడం నేర్చుకోవాలి. రేపట్నించి నీకు నా దగ్గిర స్పెషల్ క్లాసులు.” అని నిధి తో అని,
“పిల్లలతో ఒక పేరెంట్ మాట్లాడుతున్నపుడు రెండో పేరెంట్ ఎలా నడుచుకోవాలో ఎక్కడా ఎవ్వరూ నేర్పరు. అర్థం చేసుకుని మనమే నడుచుకోవాలి.” అన్నాను సూర్య కి వినబడేలా.