శ్రీనివాస్ వాసుదేవ్ గారి కవిత్వ సంపుటి, ఆకుపాట చదవటం ఇప్పుడే పూర్తి చేసాను. ఒక వర్షగోళం ఆహ్లాదంగా తాకి, నిర్ప్లిప్తంగా ఆవిరయ్యే క్షణంలో, ఒక అందమైన పాట, ఏకాంతం నుండి మార్మిక లోకంలోకి వెళ్ళే ప్రయాణంలో, అందీ అందని అనుభూతికి ఏదో ఫత్వా విధించినట్లు.. అక్షరం తాలూకు నిట్టూర్పు కూడా అందమైనదే సుమా.. అదీ సున్నితత్వ’మో, మార్మికత్వమో, మానవత్వమూ నింపుకున్న కవి కలల గళంలో నుంచి జాలువారితే ..!! మనః తొలకరి ఆకుపాట అనే చెప్పాలి.
కవి మాటల్లో చెప్పాలంటే, “అది ఆర్టా, హార్టా అని నిలదీస్తే మాత్రం, వొళ్ళంతా విచ్చుకున్న ఆకాశ గోడలపై, గుండెని ఆరబెట్టినవే నని చెప్పుకుంటాం ..” ఎంత నిజం కదూ.. ఈ కవితల్లో, ఒక జోగిని వ్యధ ఉంది, ఆకాశమంత ఆవేశంతో పాడనివ్వని కోకిలల ఆర్తనాదపు సంగీతమూ ఉంది . ఖ్మెర్ రోజ్ క్రూరత్వంపై ఆర్ధ్ద్రతా ఉంది …మార్మిక దేహాల మౌన రోదనా ఉంది ..కాలానికి అందని ఒక ఆకుపాట కూడా ఉంది ..!
కవిగా శ్రీనివాస్ గారి కవిత్వ విస్తృతి నాకెంతో సంతోషం కలిగించే విషయం … సరదా పంకిణీ పంక్తులనే కాదు, అమ్మతో శిధిల గుడిమెట్ల సంచికలనీ అంత అలవోకగా అవిష్కరించగలరు . కవిగా, రచయితగా, అధ్యాపకునిగా , విదేశాల్లో చాలాకాలం పని చేయటం , ప్రవాసంలో మనగలిగినా , మరచిపోతున్న ఎన్నో పదాల ప్రయోగం శ్రీనివాస్ వాసుదేవ్ కవిత్వం ప్రత్యేకత . ఉదాహరణ – “ రవీ కౌముదుల జుగల్బందీ విన్యాసానికి , నీ జమిలి నేత్రాలు వేదికయ్యాయనుకుంటా ..”
“ నీ కోసమేం చెప్పలేకపోతున్నానని మనసు చివుక్కుమన్నపుడల్లా .. గుండె చుట్టూ నీహార నివురు “
“ నగ్నత్వం ఎంత బావుంటుందనీ నిజాయితీలా … నీ కవితల్లా “
“ ఆ గతకాలపు కుప్పలోంచి .. ఏ ఫీనిక్స్ లేస్తుందో నీ ప్రేమని చూపిస్తూ
‘ కొన్ని క్షణాలకి మాటలుంటేనా అని అనుకోని క్షణముండదా? … ?”
“ నేను నీచుట్టూ ఉంటాననే నీ ప్రేమ .. వో అద్భుత సున్నా .. నిహిలిజాన్ని నువ్వూ వొప్పుకుంటావుగా ..”
“ గాజుపూల బోత్తాములతో.. వెన్నెలని తొడుక్కున్న సూర్యుడిలా “ అంటూ ట్రాన్స్ జెండర్ వ్యక్తిని వర్ణించటం ..నాకెంతో ఇష్టమైన పద ప్రయోగం ..!!
మూడు భాషల పదాలు ఈ సంపుటిలో అలవోకగా , వొద్దికగా .. సన్నజాజుల మిస్చీఫ్ అంత మధురంగా వచ్చి వెళ్తుంటాయి, అంతే కాకుండా ..సామాజికంగా కవి అనుభూతించిన కొన్ని, సాంఘిక జాడ్యాల మీద ఎక్కుపెట్టిన ఒక బాణం లాంటి పద్యం .. ది ..షో.. మరో ఇష్తమైన కవిత .. ఛాయా గీత్.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ కవిత తెలీని మౌనంలోకి , అంతర్మధనంలోకి మనల్ని బదలాయించటమే మంచి కవిత్వ లక్షణమైతే , ఇది నిస్సందేహంగా మంచి కవిత్వం .
ఎక్కువగా దొర్లే కాఫ్కాలూ, హార్న్ బిల్ , పర్గేషన్ లాంటి పదాలు కొంచం తెలీని ఇబ్బంది పెడతాయి , మామూలు చదువరికి .. ఒక సింఫనీ అర్ధమవటం నిజానికి ఉటోపియా కాదు … మదిని దాగిన ఉటోపియాలకు వేదిక , కవిత్వం కాక మరొకటి ఉంటుందా ?
ఈ తెలుగు ఇంగ్లీషుల జుగల్బందీ లో .. చీర కుచ్చెళ్లపై అంచులా .. అక్కడక్కడా హిందీ కూడా మెరవటం .. ఒక అందమైన తన్హాయీ కావటం బీతొవెన్ సంగీతానికి సితార నాదం తోడవటం లాంటిదే ..!!
జే వీ పబ్లిషర్స్ ద్వారా ఈ పుస్తకం ప్రచురితం… ప్రతులకు శ్రీనివాస్ వాసుదేవ్ గారిని గానీ, జ్యోతి వలబోజు గారిని గానీ సంప్రదించాలి ..!!
చివరగా .. కవి మాటల్లో చెప్పాలంటే .. ఏ వాక్యమూ మరణించదు… ఏ భావమూ అక్షరానికి అందకుండా తటపటాయించదు.. కావలసిందల్లా .. పరిణితి, తనలోని మనిషిని సున్నితంగా ఆవిష్కరించటం .. అంతే ..!!
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్