ఆనవాలు

ఇసుక మీద సముద్రం గీసిన స్కెచ్- ఈ కవిత్వం

జనవరి 2013

 

1

Jack Kerouac నన్ను వెంటాడే అమెరికన్ కవి. వచన రచయిత.

ఆ పేరు వినగానే అతనంటే వొక్కో సారి కేవలం కవి కాదనిపిస్తుంది నాకు. కవిత్వం రాసినా, వొట్టి వచనమే రాసినా, అతని వాక్యాల కింద వుండే చలనం వొక తాత్విక సారంగా ప్రవహిస్తుంది.

మొదట్లో కొంతకాలం ఆవేశంగా రాస్తాం కవిత్వం. అప్పుడు ఉద్వేగం ఉప్పెనై ముంచెత్తుతుంది. రాయకపోతే వొక రకమయిన వొంటరితనం బాధిస్తుంది. నిజమే! కానీ, ఆ ఆవేశం యెప్పుడో వొకప్పుడు ఆరిపోతుంది. ఆరిపోయిన తరవాత మనలోపలి నిప్పు కణమేదో రాలిపోయినట్టే వుంటుంది. వొక రాయలేనితనం లోపల గుబులు పుట్టిస్తుంది. Kerouac అలాంటి అనుభవాలెన్నో చూశాడు, అనుభవించాడు. అలాంటి సమయంలో అతనిలోపల చెలరేగే అలజడి –పులిపాటి గురుస్వామి వొక కవితలో చెప్పినట్టు- ‘కుతకుత వుడికే ఆ సముద్రం’ – అతన్ని చుట్టుముట్టేస్తుంది. అతనప్పుడు మన గురుస్వామిలాగే కచ్చితంగా ఇలా అనుకునే వుంటాడు:

సమాధానమొక సముద్రం లోపలి
అలజడే అయితే
లోలోపల కుతకుత లాడటమే
విస్ఫోటనం కంటే మేలు –

 అలాంటి వొక స్థితిలో Kerouac ని ఎడ్ వైట్ అనే చిత్రకారుడు, స్నేహితుడూ తన స్కెచ్ బుక్ చూపించి, అడిగాడట – “why don’t you sketch in the street like a painter, but with words? – అని.

Sketching- ఆ ఆలోచన బావుంది కదా అనుకున్నాడు Kerouac. తన లోపల ఉడికిపోతున్న సముద్రానికి వొక భాష దొరికిందనిపించింది. ఆ స్థితిలో అతని తక్షణ వాక్యం: “నా లోపలి సంగీతం మేలుకుంది.”

అతనంటాడొక చోట: the sound in your mind/is the first sound/that you could sing.

మామూలుగా ప్రతి కవీ తను రాసిన వాక్యాల్ని వొకటికి  పది సార్లు చెక్కుకుంటాడు. భావం పలికే దాకా వాక్యాల్ని తిరగరాస్తాడు. అలాంటి దశలో అతను కాసేపు కవి అనే స్థానం నించి పక్కకి తొలగి, పాఠకుడై, తనని తాని చదువుకుంటాడు. తన వాక్యాలలో తన ప్రతిబింబాన్ని తరచి చూసుకుంటాడు. తన భావనల  ప్రభావాన్ని పరీక్షించి చూసుకుంటాడు. ఇంకా ముందుకు వెళ్ళి తానే ఎడిటర్ అయి, వాటికి post-mortem చేసుకుంటాడు. మంచి కవిత తయారవడానికి ఇవన్నీ అవసరమే!  కానీ, కొన్ని వేళల్లో జీవితం అనుకూలించదు. కవిత్వ రూపం విసుగు పుట్టిస్తుంది. అలాంటి స్థితిలో ఏం చేస్తాడు కవి? తన పదాల్ని కూడదీసుకుంటాడు. తన భావాన్ని పరిమితమయిన/ తేలికపాటి రేఖల్లో వెతుక్కుంటాడు.

అలాంటి  స్థితిని Sketching అని పిలిచాడు Kerouac. అలా వొక మెరుపు లాంటి ఆలోచన తరవాత్తరవాత -Joyce Johnson అనే సాహిత్య చరిత్రకారిణి చెప్పినట్టు-  “a whole new movement of American literature (spontaneous prose and poetry)” అవుతుందని అతను వూహించనే లేదు. కానీ, వూహించనివి జరగడం వల్లనే కదా చరిత్రకయినా, జీవితానికయినా అంత అందం! అలాంటప్పుడు ఇలా కూడా అనిపిస్తుంది. మళ్ళీ గురుస్వామి మాటల్లోనే:

బహుళ ప్రేమల్లో
కలకలల వెలుగుల్లో
మెదలక పోతేనేమి?
అక్షరాల వెంట
చలనం ఉంటుంది
అది నీ ఆత్మ సారమే.

ఇటీవలి తెలుగు కవిత్వం చదువుతున్నప్పుడు మనం అలాంటి ఆకస్మిక క్షణాల spontaneous movement కి చేరువలో వున్నామని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు వినిపిస్తున్న కవిత్వ వాక్యాలలోని spontaneity నన్ను కాసేపు ఆశ్చర్యంలో పడేస్తుంది. ఈ spontaneity లోని అక్షరాల వెంట – ఆత్మ సారం – వినిపిస్తుందా అని వొకింత సందేహంగా వున్నా, ఈ స్వరాల్లో వొక నమ్మకమేదో నన్ను ఆ సందేహాల్ని గడ్డిపోచల్లా అవతలకి విసిరెయ్యమంటోంది.

2

Sketching, spontaneity – ఈ రెండు భావనలకి ఇంకా కొన్ని విశేషణాలు జోడిస్తే, ఇవి  సంకేతాల వంటి రేఖలు, మనసులోంచి పెల్లుబికిన సహజ వెల్లువ.

ఇప్పుడు వస్తున్న కొత్త కవిత్వానికి కొన్ని ఆనవాళ్ళు చెప్పమని ఎవరైనా అడిగితే నా మటుకు నాకు వెంటనే తట్టే రెండు లక్షణాలు ఇవి. ఈ రెండు మరీ కొత్త లక్షణాలా అంటే కాకపోవచ్చు. కానీ, ఎప్పుడూ పూర్తి కొత్తదనం అనేది వుండదన్నది నిజం. పాతలోంచి ఎంతో కొంత మనం అనుకునే కొత్తదనంలోకి తప్పక ప్రవహిస్తుంది.

ముందు ఈ spontaneity సంగతి చూద్దాం. చాలా కారణాల వల్ల తెలుగు కవిత్వం వొక అసహజమయిన “వృత్తి”గా మారింది. ముఖ్యంగా కవిత్వంలో భాష ఎలాంటి పని చేయాలన్న విషయం మీద మనకి కొన్ని అసహజమయిన భావనలు పేరుకుపోయాయి. అందులో వొకటి: కవిత్వ భాష అత్యంత గంభీరంగా వుండాలన్న భావన. కవిత్వపు తొలి మజిలీలో వున్న కవులు అనివార్యంగా ఈ భాషా బంధనాల్లో ఇరుక్కుపోయారు. మౌలికంగా బరువయిన పదాల సమూహమే కవిత్వ వాక్యం అనుకునే దాకా వెళ్లారు.

దీనికి భిన్నంగా, కవిత్వంలో శబ్దం కంటే నిశ్శబ్దం చేసే పనే ఎక్కువగా వుంటుందన్న విషయాన్ని ఇప్పుడిప్పుడే కొందరయినా గ్రహిస్తున్నారన్న నమ్మకం కలుగుతోంది – ఈ మధ్య కనీసం పది పదిహేను మంది కొత్త తరం కవుల్ని చదువుతున్నప్పుడు! ఆ పదిహేను మంది గురించి తరవాత మాట్లాడతాను.  ముఖ్యంగా ఇప్పుడు  కెక్యూబ్ వర్మ, వంశీధర్ లాంటి కవుల కవితల్లో కనిపిస్తున్న Sketching, spontaneity అనే రెండు లక్షణాల గురించి మాట్లాడ్తాను ఈ సారి.

కుమార్ వర్మ (కెక్యూబ్ వర్మ) కవిత్వం కనీసం మూడేళ్ళ నించి చదువుతున్నా. ఈ మూడేళ్లలో వర్మ కవిత్వం చాలా మారింది. ముఖ్యంగా మొదట్లో అతని కవిత్వం కొంచెం గరుకుగా వుండేది. వొక విధమయిన భావజాలం పునాదిగా పెరిగిన తరంలో ఆ గరుకుతనం కొంత తప్పదు.  చాలా తక్కువ మంది కవులు ఆ గరుకు పదాల బారి నించి తప్పించుకోగలిగారు.  వర్మ చాలా విజయవంతంగా ఆ అడ్డంకిని దాటుకుంటూ తన వాక్యాలకు వొక కొత్త సునిశితత్వాన్ని నేర్పాడు. ఉదాహరణకి వేరే ఎన్నో కవితలు చూపించవచ్చు. కానీ, ఇప్పుడు మాత్రం  ‘గాలి గోపురం’ కవిత తీసుకుంటా.

ఓ చిన్న పొరపాటో తడబాటో

ముక్కలై గుచ్చుకుంటుంది….

 

తీరం చేరనీయని

ఆవేదన మిగులుతుంది….

 

ఉబకని కన్నీరు ఎద సంద్రంలో

తుఫాను సృష్టిస్తుంది….

 

నిలిచిన గాలి గోపురం

ఒక్కసారిగా ఒరిగి పోతుంది….

 

దిగులుతనం దీపపు సమ్మె క్రింద

నీడలా మిగులుతుంది….

 

కాలికింద నేల ఊబిలా

లోలోపలికి ఇంకిపోతుంది….

 

చినిగిన తెరచాపను అంటిన

కలల రెపరెపల రంగుల కాగితం…

 

ఎద తడపని వాన చినుకు

ఇగిరి పోయి బీడవుతుంది….

 

మళ్ళీ నీ చిరునవ్వే కదా

                                           నాలో వెన్నెల కురిపించేది నేస్తం…

ఈ కవితలో భావాన్ని గురించి నేనేమీ విడమరచి చెప్పక్కర్లేదు. వొక బరువయిన భావానికి అతి తేలికయిన స్కెచ్ గీస్తున్నాడు వర్మ. నాకు బాగా నచ్చిందేమిటంటే ముందుగా: ఎక్కడా భావ గాంభీర్యాన్ని భాషా గాంభీర్యంగా మార్చకపోవడం; తరవాత: ‘అలా’, ‘ఇలా’ అని బోలెడు ‘లా’లు పోలికలూ లేకుండా సూటిగా చెప్పడం. ఈ కవితని ఎంత పొడిగించినా ఎంతో కొంత అదనపు అందాన్ని, భారాన్ని  సంతరించుకునే అవకాశం వుంది. కానీ, ఉద్దేశపూర్వకంగానే ఆ మాయకి దూరంగా రాయగలగడం వర్మ సాధించిన శిల్ప విజయం.

ఇదే వరసలో ఇంకా కొంచెం ధైర్యంగా నిలబడ్తాడు వంశీధర్. వంశీ కవిత్వం వొక షాక్ ట్రీట్మెంట్.  కవిత్వ పరంగా ఎలాంటి మొహమాటాలూ లేవు తనకి- తను రాయాలనుకున్నది ఎట్లా అయినా సరే రాసేస్తాడు. తను రాయాలనుకున్నదే రాస్తాడు ఎవరెన్ని చెప్పినా! మనసుని disturb చేసే వొక అందమయిన నిట్టూర్పు వుంటుంది అతని వాక్యాల్లో! అదే వొక అనూహ్యమయిన spontaneity కి దారి తీస్తుంది.  వొక మంచి స్నేహితుడు మన ముందు కూర్చొని మన మనసు లోతులు  తరచి చూస్తూ మాట్లాడుతున్నంత సహజంగా వుంటాయి వంశీ  ఆలోచనలు. అతనివి నిజానికి ప్రతి కవితా ఇక్కడ కోట్ చేయాల్సిందే కానీ, ఈ వొక్క ఉదాహరణ చూడండి.

తనే, నిజంగా, తనే..నా…
ఎనిమిదేళ్ళ క్రితం వొదిలి పోయిన
మంచువర్షం తిరిగి కురుస్తూ,
మంచిముత్యం మరల మెరుస్తూ,

ప్రేమలన్నింటికీ పెళ్ళవదు, అలాగే,
అన్ని పెళ్ళిళ్ళూ ప్రేమల్ని మరిపించలేవేమో,
ఎలా ఉన్నావ్, పిల్లలూ? ఆయన?”
ఇలాంట్రోజొకటొస్తే చావాలనుకున్నా, కానీ,
తన్తో మాట్లాడాకా బ్రతకాలన్పిస్తూ,

దిగులు మొహంతో, వొణికే వేళ్ళతో,
నిన్నటి నా దేవత, శవంలా నేడు
-”
బావున్నాను, పిల్లల్లేరు”
కాల్చిన గాయాల చేతిని చీరతో కప్పేస్తూ,
కూలిన ఆశల చెట్టుని, రాని నవ్వుతో, చిగురించేందుక్కష్టపడ్తూ,
నిజమేనా అన్న నా చూపుకి,
నిజంచెప్పాలనుకుంటూ,
-”
వాడో శాడిశ్ట్, ఇంపొటెంట్,
పరిస్థితులకు భయపడి నిన్నొదులుకున్నందుకు…..”
ఎప్పుడూ ఏడవన్నన్నేడిపిస్తూ,
కురిసిన తన కళ్ళు,
-”
చేసిన తప్పుకు, నన్ను చూడలేక,
జారిన నా కలల్ని తిరిగివ్వలేక,
అమ్మ, నాన్న, కాలంతో ఓడి పో..యా..రు..
నాకంటూ మిగిలింది నా నీడ, నాటి నువ్వు,
ఇన్నాళ్ళకు రాగలిగాను బంధాల బందీలోంచి,
నిన్ను నమ్మించాలని కాదు, నిజం నమ్ము,”
నల్లకోటు లేని న్యాయంలా నా తను,

నాన్నా” పరిగెత్తుకొస్తూ, నాలుగేళ్ళ నా కూతురు
అమ్మ దగ్గరికెపుడు తీస్కెళ్తావ్ అన్నన్నడుగుతూ,
ఆశ్చర్యంగా, ఏమైందని కళ్ళతో అడుగుతున్న “తన”కి,
చూపులాకాశానికి చేర్చి బదులిస్తూ,
అదిగోరా అమ్మ అంటూ , “తన”ని చూపించిన్నేను..,

పాపని హత్తుకుని వెచ్చగా విచ్చుకున్న తన నవ్వు,
పాప బుగ్గ మీదుగా నా నుదుటిని తాకి వేడి చెమ్మ మిగిల్చి…
రాదనుకున్న వసంతం వరించినట్టు,
లేదనుకున్న సమస్తం స్వాగతించినట్టు…

ఈ కవితలో భావం స్పష్టమే. కానీ, ఈ కవిత నిర్మాణంలోకి వొక సారి చూడండి. అతి క్లిష్టమయిన విరోధాభాసని (paradox) చూపిస్తూ ఈ కవితలో వంశీ ప్రతి వాక్యాన్నీ వొక అనూహ్యమయిన కథనశక్తితో నిలబెట్టాడు. అసలు ఇలాంటి ఆలోచన ఎలా పుడ్తుందన్న విస్మయం కలిగించేలా భాషకీ, భావానికీ మధ్య లంగరేశాడు. మొదటి కవితలో వర్మ పదునయిన వాక్యాలతో సాధించిన శక్తిని, ఈ కవితలో వొక కథ ద్వారా, సంభాషణ ద్వారా సాధిచాడు వంశీ.

ఇద్దరు సన్నిహితుల మధ్యా జరిగే సంభాషణల్లో కొంత వచనమూ, కొంత కవిత్వమూ కలిసి వుంటాయి. ఉద్వేగంతో సాగే వాక్యాల్లో తెలియని వొక లోతు వుంటుంది. అలాంటి సంభాషణని ఆసరా తీసుకుని, అసలు కవిత్వ వాక్యాన్ని కొత్తగా వూహిస్తాడు వంశీ. భావాన్ని ఎటు నించి నరుక్కు వస్తాడో తెలియనివ్వని వొక ఉత్కంఠని సృష్టిస్తాడు. ఆ కథనాత్మక ఉత్కంఠలోనే అతని కవిత్వ రహస్యం వుంది.

ఇలాంటి కవితల్ని వర్ణనలూ, అలంకారాలూ పెట్టి ఎంత దూరమయినా సాగదీయవచ్చు. కానీ, ఈ ఇద్దరు కవులూ అలా చేయలేదు. వాటిని అంత సాగదీయలేదు. కొద్ది పదాలలో లోతయిన భావాల స్కెచ్ గీశారు. ఆ స్కెచ్ లోనే  అనేక వర్ణాల అనుభవ చాయల్ని చూపించారు.

3

 

పైన నేను చెప్పిన రెండు లక్షణాలు- Sketching, spontaneity- కవిత్వంలో సాధించడానికి జీవితాన్ని దగ్గిరగా  చదవగలిగే సహనం వుండాలి. వొక తాజా కంటితో వాస్తవికతని చూసే ధైర్యమూ వుండాలి. అన్నిటికంటే ముందు, క్లిష్టమయిన భాష పట్ల వుండే విపరీతమయిన ఆకర్షణ తొలగిపోవాలి. లేకపోతే, రెండో వాక్యం పుట్టే లోగా మొదటి  వాక్యం జారుకుంటుంది. వొక భావం చెప్పేలోగా  ఇంకో భావం దారి తప్పుతుంది.

ప్రతి కవీ మనకి వొక శిల్ప రహస్యం చెప్తాడు,ఆ వాక్యాల వెంట నడిచే తీరిక మనకి వుంటే!

ఇతరుల అనుభవాల నించి నేర్చుకునే నిర్మలమయిన మనసు కవికి చాలా అవసరం. వాళ్ళ బలాల్నీ, బలహీనతల్నీ సమానంగా ప్రేమించే సమహృదయమూ అవసరం. ఎందుకంటే, మన అనుభవాల్లో ఎన్ని నిజంగా కవితలుగా మార్చగలమో గ్యారంటీగా చెప్పలేం. కొన్ని అనుభవాలు అవ్యక్తంగానే మిగిలిపోవచ్చు. కొన్ని వ్యక్తమయినా సంతృప్తి మిగలకపోవచ్చు. అన్నిటికీ మించి, మనసులోని ప్రతీదీ వాక్యం చేయడానికి జీవితం వొప్పుకోకపోవచ్చు. జీవితంలోకి వెళ్ళే కొద్దీ మనం ముడుచుకుపోతాం. అనుభవాలు కొన్ని తలుపుల్ని మూసేస్తాయి. బంధాలు కొన్ని భావాల్ని బంధించేస్తాయి. వాస్తవం విపరీతంగా బాధిస్తుంది.  అప్పుడు కవి చేయగలిగింది వొక స్కెచ్ గీసుకోవడం! మొత్తం అనుభవంలోని సాంద్రతని వ్యక్తం చేయలేని నిస్సహాయత్వంలో రేఖామాత్రంగా ఆ అనుభవం చెప్పడం! అదే స్కెచింగ్ అని నేను అంటున్నాను.

అటు వంశీ గానీ, ఇటు వర్మ గాని ఇన్ని అరుదయిన వాక్యాల సమూహంలోకి మనల్ని తీసుకువెళ్తున్నారంటే దానికి కారణం- ఆ ఇద్దరూ అటు జీవితాన్ని, ఇటు సాహిత్యాన్ని సహనంగా చదువుతున్నారు కనుకనే!

(వచ్చే “ఆనవాలు” – Abstract ని concrete చేస్తున్న ఆ ముగ్గురు కవయిత్రులు!)