అనువాద కథ

ప్రతీకారం

జూలై 2014

[చరిత్రలో మనం ఒక జాతి మరొక జాతినీ, ఒక మతం మరొక మతాన్నీ, ఒకే మతంలోనే ఒక వర్గం మరొక వర్గాన్నీ ద్వేషించుకుంటూ, చంపుకుంటూ, ప్రతీకారాన్ని తర్వాతి తరాలకి వారసత్వంగా అందించిన సందర్భాలు కోకొల్లలు. తమ దేశంకోసమో, తమ మతంకోసమో, తమ వర్గంకోసమో, ఇలా ప్రతీకారం తీర్చుకోవడంకోసం ప్రాణాలర్పించడం ఒక గొప్ప త్యాగంగా స్తుతించిన కవితలూ, కావ్యాలూ కూడా లేకపోలేదు. ఈ కథ ఏ రకమైన తాత్త్విక వ్యాఖ్యలూ, ఉపన్యాసాలూ లేకుండా, ప్రతీకారానికి మించినది ఒకటి ఉందని చెబుతుంది. అది ఎవరికి వారు తెలుసుకోవడంలోనే ఆనందం… అనువాదకుడు]

ఈ సంఘటన ఫ్రాన్స్ తూర్పు తీరంలో బూర్బకి (Charles Denis Sauter Bourbaki 22 ఏప్రిల్ 1816 – 27 సెప్టెంబర్ 1897) ఓటమి తర్వాత జరిగినది. భయంకరమైన “బెల్ఫోర్ట్ ముట్టడి (Siege of Belfort)” తర్వాత ఆతని సైన్యం సగానికి సగం నాశనమై, ముక్కచెక్కలై, శుష్కించి స్విట్జర్లాండుకి మరలిపోవలసి వచ్చింది; ఆ దండయాత్ర జరిగినది కొద్దికాలమే (3 రోజులు) కనక రక్షించి, లక్షా యాభై వేలమంది ఉన్న అతని పటాలం మేము మృత్యువాత నుండి తప్పించుకోగలిగాం. ఆకలి, విపరీతమైన చలి, కాళ్లకి బూట్లు లేకుండా మంచులో బలవంతంగా కవాతు చేసుకుంటూ రావడమూ, అదీ ఓ తీరూతెన్నూలేని కొండదారులవెంట, మాకందరికీ సూదులతో పొడిచినట్టనిపించి గొప్ప బాధకలిగించింది; ఎందుకంటే, మాకు విశ్రమించడానికి టెంట్లు లేవు, తినడానికి తిండి నిండుకుంది, బెల్ఫోర్ట్ వైపు వెళ్తున్నప్పుడు వేన్ కి ఎప్పుడూ ముందున ఉండే మేము, జ్యూరాకి తిరిగివస్తున్నప్పుడు ఎప్పుడూ వెనకే ఉండవలసి వచ్చేది. జవరి 1 వ తేదీకి 1200 మందిమి ఉన్న మా చిన్న దండు లో స్విట్జర్లాండు సరిహద్దుకి చేరుకునే వేళకి పాలిపోయి, చిక్కి, జీర్ణమైపోయి, చింపిరిగుడ్డలతో 22 మందిమి మాత్రమే మిగిలేం.

అయితే, అక్కడ మేము హాయిగా క్షేమంగా విశ్రాంతి తీసుకోగలిగాం. దురదృష్టం వెన్నాడిన ఫ్రెంచిసైన్యంపట్ల అందరూ ఎంత జాలికనబరచారో, మమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో అందరికీ అనుభవమే. మా అందరికీ ఒంట్లో మళ్ళీ జీవకళ వచ్చింది. యుద్ధానికి పూర్వమే సంపన్నులైనవారు, తమ సంపదవల్ల తాము సుభిక్షంగా ఉన్నామన్న భావన యుద్ధసమయంలో అనిపించినంతగా మునుపెన్నడూ అనిపించలేదని చెప్పారు: “ఒక్క సారి ఊహించండి… మాకు తినడానికి ప్రతిరోజూ ఏదో ఒకటి ఉండేది; ప్రతిరాత్రీ నిశ్చింతగా నిద్రపోగలిగాం.”

ఇంతలో, ఫ్రాన్సు తూర్పుతీరంలో మాత్రం, దాన్ని యుద్ధవిరమణ పరిధినుండి మినహాయించడం కారణంగా, అక్కడ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఫ్రోష్ కోప్టే (Franche Comte) రాజధాని బిసాజన్ (Besancon) శత్రువుని సమర్థవంతంగా నిలువరించింది, తర్వాత ప్రతీకారంగా వాళ్ళు ఫ్రోష్ కోప్టే (Franche Comte) ని ధ్వంసంచేసినప్పటికీ. వాళ్ళు సరిహద్దుకి చాలా సమీపంగా వచ్చేరని అప్పుడప్పుడు వార్తలు వినేవాళ్లం, స్విస్ సేనలు కనిపించేవి కూడా, వాళ్ళకీ మాకు మధ్య పరిశీలకులుగా కవాతు చేస్తూ.

మాకు మళ్ళీ ఆరోగ్యం కుదుటబడి పునర్జవం వచ్చినకొద్దీ ఈ విషయం మమ్మల్ని బాధిస్తుండేది: మాకు రెండు మూడు క్రోసుల దూరం లోనే జర్మనులు విజయం సాధించి గర్వంగా తిరగడమూ. మేము ఇక్కడ బందీలుగా ఏమీ చెయ్యలేని నిస్సహాయస్థితిలో ఉండిపోడం తలుచుకుంటే అవమానకరంగానూ, అసహనంగానూ ఉండేది.
ఒక రోజు మా కేప్టెన్ మాలో ఐదారుగురిని పక్కకు పిలిచి చాలా ఆవేశంతోనూ కోపంతోనూ ఊగిపోతూ చాలా సేపు ఈ విషయంగురించి మాటాడేడు. మా కేప్టెను చాలా మంచివాడు. జువాజ్ (Zouaves)లో ఉన్నప్పుడు అతను సబ్ లెఫ్టినెంట్ గా ఉండేవాడు. సన్నగా, పొడవుగా, ఉక్కులా బలిష్ఠంగా ఉంటాడు. యుద్ధంలో ఉన్నంతకాలమూ అతను జర్మనులని ఎలా ఎదిరించాలో ప్రణాళికలు వేస్తూనే ఉండేవాడు. అలాంటిది వ్యాపకం ఏమీ లేకపోవడంతో అతను చిరచిరలాడూతూ, పనిలేకుండా, బందీగా ఉండడానికి అలవాటుపడలేకపోయాడు.

“డామిట్! మీకు రెండుగంటలదూరంలో చాలా మంది శత్రు ఆశ్వికులున్నారని తెలిసి మీకు బాధకలగడం లేదూ? కృతనిశ్చయంతో ఉన్న ఇక్కడి ఆరుగురు సైనికులు ఏ రోజైనా కుప్పలుతెప్పలుగా వచ్చినా వాళ్ళని మట్టుపెట్టగల సమర్థులై ఉన్నప్పుడు, ఆ ముష్టి వెధవలు మన కొండల్లో దర్జాగా తిరుగుతూ పెత్తనం చలాయిస్తుంటే మీకు పిచ్చెక్కటం లేదూ? నే నిక ఎంతమాత్రమూ భరించలేను. నే నక్కడికి వెళ్ళి తీరాలి,” అని మాతో అన్నాడు.

“కానీ, అది ఎలా సాధ్యపడుతుంది కేప్టెన్?”

“ఎలాగా? అక్కడికి ఈ ఆరునెలల్లోనూ ఒకటి రెండుసార్లైనా వెళ్ళనట్టు… స్విస్ సైనికులు కాకుండా ఇంకెవరో అడవుల్ని కాపలాకాస్తున్నట్టు చెప్పకండి….అదేమంత కష్టం కాదు! మీరు ఇక్కడి నుండి ఫ్రాన్సులోకి దాటుదామని నిశ్చయించుకున్ననాడు నాకు చెప్పండి… మిమ్మల్ని అక్కడకు చేర్చే పూచీ నాది.”

“అది నిజమే గాని, చేతిలో ఆయుధాలు లేకుండా ఫ్రాన్సు వెళ్లి ఏం చేస్తాం?”

“ఆయుధాలు లేకపోవడమేమిటి? నేను మీకు మాటిస్తున్నా. ఒకసారి అక్కడికెళ్ళేక మనం సంపాదించుకోగలం.”

“మీరు మరిచిపోయినట్టున్నారు,” అని గుర్తుచేశాడు ఒక సైనికుడు, “హసో ఫం మంటోయిసీ (Hasso Von Manteuffel)కి గాని బందీలు తప్పించుకున్నారని తెలిస్తే మనం స్విట్జర్లాండుకి అపచారం చేసిన వాళ్లం అవుతాము.”

“చూడూ,” అన్నాడు కేప్టెన్, “అవన్నీ పనిచెయ్యకపోవడానికి చెప్పే కుంటిసాకులు. నేను వెళ్ళి కొందర్నైనా ప్రష్యన్లని చంపాలి; అదొక్కటే నేను లక్ష్యపెట్టేది. మీకు నే చేసినట్టు చెయ్యాలని అనిపించకపోతే, మంచిది. మీ ఇష్టం; కాకపోతే ఆ విషయం ఇప్పుడే స్పష్టంగా చెప్పండి. నేను ఒక్కణ్ణీ వెళ్ళగలను. నాకు ఎవరి తోడూ అక్కరలేదు.”

సహజంగానే, మేమందరం ఒప్పుకోలేదు, వాదించేం. కేప్టెన్ మనసు మార్చడం మా వల్ల కాక అతని బాటని అనుసరించడానికి మాట ఇవ్వక తప్పలేదు. అతనంటే మాకెంత ఇష్టమంటే, అతన్ని ఒక్కడినీ వదిలెయ్యడానికి మనసొప్పలేదు; అతను ఎంత విపరీత పరిస్థిలోనైనా మాకు ఇచ్చినమాట తప్పలేదు. దాంతో, ఆ సాహసం చెయ్యడానికే అందరమూ నిశ్చయించుకున్నాం.

II

కేప్టెన్ అప్పటికే ఒక ప్రణాళిక వేసుకుని దాని గురించి ఆలోచిస్తున్నాడు. మేమున్న ప్రాంతంలో అతనికి తెలిసిన ఒక వ్యక్తి అప్పటికే ఒక బండి, రైతుల్లా కనిపించడానికి 6 జతల బట్టలు ఎరువు ఇవ్వడానికి సిద్ధమయ్యేడట. ఫ్రాన్సులో అమ్మకానికి తీసుకెళుతున్న “గ్రూయేర్ ఛీజ్ (Gruyere cheese)”నింపిన బండిలో, క్రింద గడ్డిలో మేము తలదాచుకోవచ్చు. కేప్టెన్ తనతో పాటు ఇద్దరు మనుషుల్ని ఎవరైనా దారిలో తనని దోపిడీ చెయ్యడానికి ప్రయత్నిస్తే రక్షణగా తీసుకెళుతున్నానని సరిహద్దు కాపలాదార్లకి చెప్పేడు. అనుమానించవలసినంత ముందుజాగ్రత్తచర్యగా అది వాళ్ళకి కనిపించలేదు. అక్కడి స్విస్ ఆఫీసరు కూడా బండిని అక్కడున్న సైనికులకి తనకి బాగా తెలుసునన్న అభిప్రాయం కలిగించడానికి ఒకసారి పరిశీలనగా చూసినట్టు నటించేడు. ఒక్క మాటలో చెప్పాలంటే, అక్కడి ఆఫీసరు గాని, మిగతా సైనికులుగాని మమ్మల్ని పోల్చుకోలేకపోయారు.
“కదలండి,” అంటూ అదిలించేడు కేప్టెన్ గుర్రాలని కొరడా ఝళిపిస్తూ. తక్కిన ముగ్గురూ పొగాకుగొట్టాల్లోంచి చాలా ప్రశాంతంగా ఏ ఆందోళనా కనపరచకుండా పొగాకు పీలుస్తున్నారు. పెట్టెకి ముందుకి ఉన్న కన్నాల్లోంచి మాత్రమే గాలిచొరబడడానికి అవకాశం ఉండడంతో, లోపల నేను ఊపిరాడక ఒకపక్క ఉక్కిరిబిక్కిరవుతూ, రెండోపక్క చలి విపరీతంగా ఉండడంతో గడ్డకట్టుకుపోతున్నాను.

“కదలండి” అని మళ్ళీ అన్నాడు కేప్టెన్ గుర్రాలతో. గ్రూయేర్ ఛీజ్ తో నింపిన మా బండి ఫ్రాన్సులోకి ప్రవేశించింది శత్రువు స్విస్ కాపలాని బాగా నమ్మడంతో, ప్రష్యను సరిహద్దులవద్ద కాపలా అంత పటిష్టంగా లేదు. కాపలా పోస్టుదగ్గర సార్జంటు ఉత్తర జర్మను మాటాడితే, మా కేప్టను మధ్య స్విస్ జర్మను మాటాడడంతో, ఇద్దరికీ ఒకరి మాట ఒకరికి అర్థంకాలేదు. అయితేనేమి, సార్జంటు మాత్రం చాలా తెలివైనవాడిగా నటించేడు; తను మమ్మల్ని అర్థం చేసుకున్నట్టు నమ్మించడానికి మమ్మల్ని ముందుకి పోనిచ్చాడు. అలాగే మధ్యమధ్య ఆపబడుతూ, ఏడు గంటలపాటు ప్రయాణం చేసి చేసి చీకటిపడే వేళకి జ్యూరాలోని బాగా శిధిలావస్థలో ఉన్న ఒక గ్రామం చేరుకున్నాము.

ఇప్పుడు ఏంచెయ్యాలి? మాకున్న ఒకే ఆయుధం కేప్టెను చేతిలోని కొరడా, తినడానికి కేవలం గ్రూయెరే చీజూ, మా యూనిపాం రైతు దుస్తులూ… అంతే. మా అస్థి అంతా మేము పెద్దపెద్ద ఛీజ్ ముక్కలలో దాచిన తుపాకీ గుళ్ళు. అవి సుమారు ఒక వెయ్యి దాకా ఉండొచ్చు…. మనిషికి రెండువందల గుళ్ళు వచ్చేట్టు. కానీ మాకు తుపాకులు కావాలి, అవి కూడా షష్పో(chassepot)లు అయి ఉండాలి. అదృష్టం కొద్దీ మా కేప్టెను చాలా తెలివైనవాడూ, సాహసవంతుడూ అవడమేగాక సమయానికి తగిన పథకం వెయ్యగల సమర్థుడు. అతను వేసిన ప్రణాళిక ఇదీ:

ఆ నిర్మానుష్యమైన గ్రామంలో, భూగర్భంలో మాలో ముగ్గురు దాక్కోవాలి. తను మాత్రం బిసాజన్ (Besancon) వరకూ ఖాళీ బండితో ఒక మనిషి తోడుగా వెళతాడు.

ఆ నగరం ఇప్పుడు ముట్టడిలో ఉంది. అయినప్పటికీ, కొండలూ, మైదానాలు దాటుకుంటూ, ఊరిపొలిమేరకి పదిమైళ్ళవరకు వెళ్ళి, అక్కడనుండి లోయల్లోంచీ, కనుమల్లోంచీ నడుచుకుంటూ, ఎవరైనా ఎప్పుడైనా ఊర్లోకి చేరుకోవచ్చు. వాళ్ళ బండిని జర్మనుల మధ్య ఒమాన్స్(Omans) లో వదిలేసి, రాత్రివేళ కాలినడకన అక్కడనుండి జారుకున్నారు డూ(Doubs) నది ఒడ్డున ఉన్న కొండశిఖరాలు వేళగలగా చేరుకుందికి; మరునాడు వాళ్ళు బిసాజన్(Besancon) చేరుకున్నారు. అక్కడ లెక్కలేనన్ని షష్పో(chassepot)లు అందుబాటులో ఉన్నాయి. నిజానికి అక్కడ ఆయుధగారంలో 40 వేలకి పైగా వదిలేసి ఉన్నాయి. జనరల్ రోలండ్, గొప్ప నావికుడు, మా కేప్టెన్ చేసిన సాహసానికి చాలా సంతోషించి, 6 తుపాకులు మాత్రం ఇచ్చి మా ప్రయత్నం సఫలమవాలని శుభకామనలు అందించేడు. అక్కడే మా కేప్టెను భార్యకూడా ఉంది. మేం ప్రయత్నించిన తూరుపు దండయాత్ర వరకూ, యుద్ధం జరిగినంతకాలం మా తోనే ఉండి, అనారోగ్యం కారణంగా బూర్బకి సేనని అనుసరించలేకపోయింది. ఆమె బాగానే కోలుకుంది… రాను రాను చలి బాగా ముదిరినప్పటికీ, చెప్పలేనన్ని అసౌకర్యాలు ఎదురుచూస్తున్నప్పటికీ, ఆమె తన భర్తతో వస్తానని భీష్మించుకుంది. చివరికి అతను ఒప్పుకోకతప్పలేదు. దానితో వాళ్ళు ముగ్గురూ… అతనూ, అతని భార్య, మా మిత్రుడూ మళ్ళీ తిరుగుప్రయాణం ప్రారంభించేరు.

తిరిగిరావడంతో పోల్చినపుడు వెళ్ళడం అసలు కష్టమే కాదు. వాళ్ళు రాత్రిపూటే ప్రయాణం చెయ్యవలసి వచ్చింది ఎవరికంటా పడకుండా ఉండడానికి; ఎందుకంటే వాళ్ళదగ్గర ఉన్న తుపాకులు అనుమానానికి తావిస్తాయి. అయినా, మమ్మల్ని విడిచి వెళ్ళిన వారంరోజులకి మా కేప్టెనూ, అతనితో ఇద్దరూ మమ్మల్ని మళ్ళీ కలుసుకున్నారు. మా ప్రయత్నం ప్రారంభం కానున్నది.

III

అతను వచ్చిన మొదటి రాత్రి, చుట్టుపక్కలప్రాంతాన్ని పరీక్షించే నెపంతో మా కేప్టెన్ తనొక్కడే ఎగుడు రోడ్డు వెంబడి వెళ్ళేడు.

మీకు ఒక విషయం చెప్పాలి. ఎప్పుడో అందరూ విడిచిపెట్టి, పాడుబడి, మాకు కోటలా నిలిచిన ఆ పల్లెటూరులో ఇళ్ళు అన్నీ సవ్యంగా నిర్మించినవి కాదు. బాగా లోతుగా ఉండే కొండవాలులో ఉన్న ఈ ఊరు, ఎక్కడ సమతలంగాఉండి అడవి ప్రారంభమవుతుందో అక్కడ అంతమవుతుంది. అక్కడి ప్రజలు అడవిలో కలప అమ్ముకుని బ్రతికేవారు. దానికి వాళ్ళు ఆ కొండవాలునుండి (ఇక్కడ వాటిని ఖూలీ లని అంటారు) కలప దుంగలు క్రిందకి తోసెస్తారు. అవి క్రింద సమతలంగా ఉన్నచోటువరకు జారిపోతాయి. వాటిని అక్కడ గుట్టలుగా పేర్చి, ఏడాదికి మూడుసార్లు కలపవర్తకులకి అమ్ముతారు. ఎక్కడైతే ఈ కలపని వర్తకులకి అమ్ముతారో అక్కడ ఎత్తుగా ఉన్న రోడ్డుపక్కన రెండు చిన్న ఇళ్ళు ఉంటాయి. అవి అక్కడ అందరూ బసచెయ్యడానికి సత్రంలా ఉపయోగిస్తాయి. కేప్టెను అలాంటి ఒక ఖూలీ గుండా జారి క్రిందనున్న సత్రం దగ్గరకి చేరుకున్నాడు.
అతను వెళ్ళి ఒక అరగంట గడిచిందో లేదో, మేము ఆ లోయ మీదనుండి పర్యవేక్షిస్తుంటే, మాకు ఒక తుపాకిగుండు పేలిన చప్పుడు వినిపించింది. మా కేప్టెను మమ్మల్ని అక్కడనుండి కదలొద్దనీ, తను కొమ్ము ఊదేదాకా (అది గొర్రె కొమ్ముతో చేసింది) మమ్మల్ని బయటకి కదలొద్దని శాశించాడు. ఆ కొమ్ము ఊదితే కోసెడు దూరం వినిపిస్తుంది; అలాంటిది తుపాకిగుండు చప్పుడు వినిపించిన తర్వాత మాకు ఏ ధ్వనీ వినిపించలేదు. మాకు ఆందోళనగా ఉన్నా,చెంతనే తుపాకులున్నా, ఉత్కంఠతో మౌనంగా ఎదురుచూడాల్సి వచ్చింది.

ఈ ఖూలీలవెంట దిగడం అంత కష్టమేమీ కాదు; మనిషి తనని తాను జారడానికి అనువుగా వదులుకోవాలి అంతే!; కానీ, అసలు కష్టమల్లా పైకి రావడంలోనే ఉంది… ఒక్కోసారి వేలాడుతున్న చెట్టుకొమ్మలుపట్టుకునీ, ఒక్కోసారి పాకురుకుంటూ, శక్తిని పరీక్షకి పెడుతూ సంఘర్షణ చెయ్యాలి. ఒక గంట గడిచిపోయింది, అతను రాలేదు; పొదల్లో ఏ కదలికా వినిపించలేదు. కేప్టెను భార్య పాపం చాలా అసహనంగా కదలాడుతోంది. అతను ఏం చేస్తున్నట్టు? మమ్మల్ని ఎందుకు పిలవలేదు? కొంపదీసి మేము విన్న గుండు చప్పుడు శత్రువు పేల్చినదై, ఆమె భర్త, మా నాయకుడు అయిన కేప్టెన్ చంపబడడం గాని, గాయపడడం గాని జరుగలేదు కద! ఎవరికీ ఏమీ పాలుపోలేదు. నామట్టుకు నాకు… అయితే అతను మరణించయినా ఉండాలి, లేదా, అతని ప్రయత్నం సఫలమైనా అయి ఉండాలి… అనిపించింది. నాకు అతను ఏమిటి చేశాడా అన్న కుతూహలం మాత్రం ఎక్కువ అవసాగింది.

అకస్మాత్తుగా అతని కొమ్ము ఊదుడు వినిపించింది. కానీ, అది మేం ఊహించినట్టు కిందనుండి కాకుండా, మేమున్న గ్రామం వెనకనుండి రావడం మమ్మల్ని ఆశ్చర్యపరచింది. దాని అర్థం ఏమై ఉంటుంది? అదొక చిక్కుప్రశ్న. కాని అందరికీ ఒకలాంటి ఆలోచనే వచ్చింది … అతను మరణించి ఉంటాడనీ, ప్రష్యన్లు మమ్మల్ని మా రహస్య స్థావరం నుండి బయటకి రప్పించడానికి కొమ్ము ఊదుతున్నారనీ. అందుకని మేము మళ్ళీ మా గుడిశలోకి వెళ్ళిపోయాము… కొమ్మలచాటున దాక్కొంటూ, మా వేళ్ళు సిద్ధంగా తుపాకీ ట్రిగ్గరుమీద ఉంచి. కానీ మా కేప్టెన్ భార్య మేం ఎంత బ్రతిమాలినా వినకుండా, ఆడపులిలా ముందుకి ఉరికింది. ఆమె తన భర్తకి జరిగినదానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుని తన తుపాకికి బాయ్నెట్ తగిలించి బయలు దేరింది. మళ్ళీ మేము కొమ్ము ఊదిన చఫ్ఫుడు వినేదాకా ఆమె జాడలేదు; కొన్ని క్షణాల తర్వాత, ఆమె మమ్మల్ని పిలవడం విన్నాము:

“రండి, రండి! అతను జీవించే ఉన్నాడు. ఆ కొమ్ము ఊదింది అతనే!”

మేం పరిగెత్తాం. కేప్టెను పైపు తాగుతూ, గ్రామం మొదల్లో కనిపించేడు; చిత్రంగా అతను గుర్రం మీద కనిపించేడు.

“ఆహా! చూశారా!” అని ప్రారంభించేడు, “మనం చెయ్యవలసిన పని ఒకటుంది ఇక్కడ. అప్పుడే నేను గుర్రం మీద స్వారీ చేస్తున్నాను. అల్లంత దూరంలో ఒక శత్రువుని మట్టుపెట్టి వాడి గుర్రాన్ని లాక్కున్నాను. బహుశా వాళ్ళు ఈ అడవికి కాపలాకాస్తూ ఉండి ఉండొచ్చు. తప్పతాగి పొర్లుతూ ఉండడంవల్ల వాళ్ళల్లో కావలి కాస్తున్నవాడికి ఒకడికి, నేను డొక్కలో ఒక పోటు పొడిచేదాకా నన్ను చూసే అవకాశం ఇవ్వలేదు; మిగతావాళ్లు వచ్చేలోపు నేను అతని గుర్రంమీదకి దూకి, తుపాకి గుండులా స్వారీచేస్తూ వచ్చేను. ఎనిమిది, పదిమంది దాకా నన్ను వెంబడించి ఉంటారుగాని, నేను ఆడవిలో అడ్డదారులంట వచ్చేను. అక్కడక్కడ చిన్నచిన్నగా గీరుకుపోతే గీరుకుపోయింది గాని, ఇదిగో నేను ఇలా క్షేమంగా రాగలిగేను.. కాబట్టి మిత్రులారా, జాగ్రత్తగా వినండి. జాగరూకులై ఉండండి. మనల్ని పట్టుకునేదాకా వాళ్లు నిద్రపోరు. మనం వాళ్ళకి తుపాకీగుళ్లద్వారా స్వాగతం చెప్పాలి. రండి. మనం మన మన స్థావరాల్లో కాపు కాద్దాం,” అన్నాడు.

మేం బయలు దేరాం. మాలో ఒకరు గ్రామంలోని నాలుగురోడ్లకూడలికి తగినంత దూరంలో తన స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు; నన్ను చదునుగా ఉన్న ప్రాంతం గ్రామంతో కలిసే కూడలి దగ్గర, అంటే గ్రామప్రధానవీధి మొదట్లో ఉండమన్నారు; మిగతా ఇద్దరూ, కేప్టెనూ అతని భార్యా, గ్రామం మధ్యలో… చర్చికి దగ్గరగా, దాని గోపురం వాళ్లకి రక్షణగానూ, నిఘాకి అనువుగానూ ఉండేచోట… వాళ్ల స్థావరం ఏర్పరచుకున్నారు.

మేము ఇంకా మా స్థానాల్లో కుదురుకోనే లేదు, మాకు ఒక తుపాకిగుండుపేల్చిన శబ్దం వినిపించింది. దాని తర్వాత మరొకటి, తర్వాత రెండోది, తర్వాత మూడోదీను. మొదటి గుండు షష్పో(chassepot)నుండి వెలువడిందని ఇట్టే తెలుస్తోంది — ఆ చప్పుడు కొరడా ఝళిపించినట్టు చాలా సునిశితంగా ఉంటుంది— కానీ తర్వాత వచ్చిన మూడూ ఆశ్వికుడి చిన్న తుపాకీ నుండి వెలువడ్డాయి.

కేప్టెనుకి బాగా కోపం వచ్చింది. ఊరిమొదట్లో ఉన్నవానికి ఇచ్చిన ఉత్తర్వు శత్రువుని తనని దాటి పోనివ్వమనీ, ఒక వేళ వాళ్లు గ్రామంలోకి జొరబడుతుంటే వాళ్ళని దూరంనుండి అనుసరించమనీ, వాళ్ళు ఇళ్ళకి మధ్యగా తగినంత దూరం రాగానే నాతో కలవమనీని. అప్పుడు వాళ్ళు అకస్మాత్తుగా ఎదురుపడి, అందులో ఒక్కడుకూడా పారిపోలేకుండా రెండుపక్కలనుండి గుళ్ళవర్షంకురిపించాలనీని. మేము పన్నిన వ్యుహంలో అవసరమైతే పదిమందినైనా ఇట్టే మట్టుపెట్టగలిగే వాళ్ళం.

“ఆ పీడిలాట్ గాభరాపడి వాళ్ళని అనవసరంగా రేపెట్టాడు,” అన్నాడు మా కేప్టెన్, “మరి వాళ్లు రెండో సారి అంత అజాగ్రత్తగా రారు. అంతే కాదు, ఎక్కడో గుండుదెబ్బకూడా తిని ఉంటాడు. అందుకే అతనిదగ్గరనుండి మనకు ఏ సమాచారం లేదు. ఇదొక గుణపాఠం అతనికి. నా ఆజ్ఞని ఎందుకు ఖాతరు చెయ్యలేదు?” అని అన్నా, మరో నిమిషం పోయినతర్వాత గడ్డం సవిరించుకుంటూ ఇలా గొణిగేడు: “పాపం అతన్ని తలుచుకుంటే జాలేస్తోంది. మహా ధైర్యశాలి; మంచి గురికాడు.”

కేప్టెన్ అనుమానాలు నిజమయ్యాయి. మేము సాయంత్రం దాకా నిరీక్షించేము గానీ, ఒక్క జర్మనూ కనిపించలేదు; మొదటిదాడి తర్వాత వాళ్లు వెనక్కి తగ్గేరు; అయితే దురదృష్టవశాత్తూ మాకు పీడిలాట్ కూడా కనిపించకుండా పోయాడు. తను చనిపోయాడా? లేక బందీగా తీసుకుపోయారా? చీకటి పడనిచ్చి మేము అతనికోసం వెదకాలని కేప్టెన్ ప్రతిపాదించేడు. అందుకని మాలో ముగ్గురం బయలు దేరాం. నాల్గురోడ్ల కూడలిలో ఒక విరిగిపోయిన తుపాకీ, కొన్ని రక్తపుమరకలూ కనిపించేయి; నేలంతా తొక్కినట్లు ఉందిగానీ, మేము పొదలన్నీ ఎంత గాలించినా గాయపడ్డ వ్యక్తిగానీ, శవంగాని దొరకలేదు. అర్థరాత్రి అయినతర్వాత దురదృష్టవంతుడు మా సహచరుడి జాడ కనుక్కోలేక తిరిగి వచ్చేశాం.

“చిత్రంగా ఉందే,” అంటూ మా కేప్టెన్ గురగుర లాడేడు. “బహుశా వాళ్ళు అతన్ని చంపేసి ఎక్కడో పొదల్లోకి విసిరేసి ఉంటారు; అతన్ని బందీగా తీసుకెళ్ళే అవకాశం తక్కువ ఎందుకంటే అతను సహాయం కోసం అరిచి ఉండేవాడు. అసలు నాకేమీ అర్థం కావటం లేదు.” ఇలా అంటున్నాడో లేదో, క్రింద గుట్టమీద ఉండే సత్రం దిక్కున పెద్ద మంటలు కనిపించాయి ఆకాశాన్ని దేదీప్యమానం చేస్తూ.

“నీచులు! పిరికి వెధవలు!” అని అరిచేడు. “వాళ్ళు తమ ప్రతీకారం తీర్చుకుందికి బజారులోని సత్రవులుగా ఉపయోగించే రెండిళ్ళకీ మంటపెట్టేరని పందెమేసి చెప్పగలను. మారుమాటలేకుండా వాళ్లు పారిపోదలుచుకున్నారు. ఒక మనిషినిచంపి రెండిళ్ళు తగలెయ్యడంతో వాళ్ళకి సంతృప్తి కలిగింది. సరే కానీ! నేను అలా ఊరుకునేది లేదు. మనం వాళ్ళని వెంబడించాలి; పోరాడాలనుకుంటే వాళ్ళు ఇలా మంటపెట్టి ఉండేవాళ్లు కాదు,” అన్నాడు.

ఇంతలో ఎవరో, “ఇదే సమయంలో పీడిలాట్ ని విడిపించుకో గలిగితే అదృష్టవంతులమే,” అన్నారు.
మేము ఐదుగురమూ కోపంతోనూ, ఆశతోనూ బయలు దేరాం. 20 నిమిషాల్లో మేము ఖూలీ అడుగుకి జారుకోగలిగేం. సత్రానికి వందగజాల దూరం చేరుకున్నప్పటికీ మాకెవరూ కనిపించలేదు. ఆ మంట సత్రానికి వెనకనుండి వస్తోంది. మేం చూసింది కేవలం పైకప్పునుండి దాని ప్రతిబింబం. అయితే మేము మామీద అకస్మాత్తుగా దాడి జరగవచ్చునేమో భయంతో మెల్లగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాం. ఇంతలోనే మాకు బాగా పరిచయమైన పీడిలాట్ గొంతు వినిపించింది. కానీ ఆ శబ్దం చాలా చిత్రంగా ఉంది… అది చాలా పేలవంగా, వణుకుతూ వినిపించింది, స్పష్టంగా ఉన్నప్పటికీ హీనస్వరంలో ఉంది… అతని నోట్లోకి ఏదో గుడ్దకుక్కేస్తే అతను తనకి చేతనైనంత గట్టిగా అరుస్తున్నట్టు. అతని గొంతు బొంగురుపోయి ఊపిరికోసం అవస్థ పడుతున్నట్టుంది. పాపం, ఆ దురదృష్టవంతుడు, “సాయం! సాయం!” అని అరుస్తూనే ఉన్నాడు.
మా జాగ్రత్తలన్నీ గాలికి ఒదిలేసి రెండు దుముకుల్లో సత్రం వెనక్కి చేరుకున్నాం. అక్కడ మా కళ్ళకి ఒక భీభత్సమైన దృశ్యం కనిపించింది.

IV

పీడిలాట్ సజీవదహనం చెయ్యబడుతున్నాడు. ఒక రాటకి కట్టబడి, మంటలు తమనాలుకలు చాచి అతన్ని అందుకుంటుంటే, మండుతున్న కట్టెలమధ్య అతను గిజగిజలాడుతున్నాడు. మమ్మల్ని చూడగానే అతని గొంతులో నాలుక అడ్డుపడినట్టయింది. తల ఒకపక్కకి వాల్చేసేడు. అతను చనిపోతున్నాడేమో ననిపించింది. ఆ మండుతున్న కట్టెల్ని చెల్లాచెదరు చేసి, నిప్పుకణికల్ని దూరం చేసి, అతన్ని బంధించిన తాళ్ళు తెంపడానికి నిమిషం పట్టలేదు.

పాపం పీడిలాట్! అతన్ని ఆ స్థితిలో చూడడం చాలా భయమేసింది. ఆ ముందురోజు సాయంత్రమే అతని ఎడంచెయ్యి విరిగింది. ఆ తర్వాత అతన్ని బాగా కొట్టినట్టున్నారు ఎందుకంటే అతని ఒంటినిండా గాయాలూ, గీర్లూ, రక్తమూ కనిపిస్తున్నాయి. మంటలు కూడా అప్పుడే వాటి ప్రభావం అతని శరీరంమీద చూపెట్టసాగేయి. అతని వొంటిమీద రెండు పెద్ద కాలిన గాయాలున్నాయి… ఒకటి అతని కుడితొడమీదా, రెండోది నడుం దగ్గరా. అతని జుత్తూ, గడ్డమూ రెండూ కాలిపోయేయి. పాపం పీడిలాట్!

మేం అతన్ని అలా చూడగానే మాకు ఎంతకోపం వచ్చిందో ఎవరూ ఊహించలేరు. మాకు ఎదురుగా లక్షమంది జర్మనులు ఉన్నప్పటికీ ఉన్నపళంగా వాళ్ళని ఢీ కొనేవాళ్లం; మాకు ప్రతీకారం తీర్చుకుందికి అంత కసి రేగింది. కానీ ఆ పిరికిపందలు అప్పటికే పారిపోయారు, వాళ్ల నేరాన్ని వెనక విడిచిపెట్టి. ఇప్పుడు మాకు వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఇంతలో కేప్టెను భార్య పీడిలాట్ గాయాలకి కట్లు కడుతూ, తనకి చేతనైనంతలో సేవ చేస్తోంది; కేప్టెన్ స్వయంగా అతన్ని అభినందిస్తునాడు ఆవేశంతో చేతులుకలుపుతూ. కొన్ని నిముషాల్లో అతను కొంత తేరుకున్నాడు.

“శుభోదయం కేప్టెన్! మీకందరికీ కూడా శుభోదయం,” అన్నాడతను. “ఆహ్! పిరికి వెధవలు! ఇరవై మంది వచ్చేరు మనమీద అకస్మాత్తుగా దాడిచెయ్యడానికి.”

“ఏమిటీ? ఇరవై మందా?”

“అవును. ఇరవై మంది. ఒక దళం దళం వచ్చేరు. అందుకే కేప్టెన్, మీ ఆజ్ఞ మీరి వాళ్లపై కాల్పులు జరపవలసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అందరినీ చంపేసి ఉండేవాళ్లు. వాళ్లని అక్కడే ఆపదలుచుకున్నాను. దానితో వాళ్లకి భయమేసి, నాలుగురోడ్లకూడలి దాటి మరి ముందుకి సాహసించలేకపోయారు. అంత పిరికివాళ్ళు. ఇరవైగజాలదూరంనుండి నలుగురు నామీద కాల్పులు జరిపారు, నేనేదో వాళ్ళు కాల్పులు నేర్చుకునే లక్ష్యం లాగ. వాళ్లు కత్తులతో గాయంచేశారు. నా చెయ్యి విరిగిపోవడంతో, నేను ఒకచేత్తోనే బాయ్ నెట్ ఉపయోగించవలసి వచ్చింది. ”

“అలాంటి పరిస్థితిలో మమ్మల్ని ఎందుకు పిలవలేదు?”

“అసలు వాళ్ళు నిన్ను బందీగా తీసుకెళ్ళె అవకాశమే ఇచ్చిఉండేవాళ్లం కాదు”

“కనిపించటం లా? నేను ఒక్కణ్ణీ చనిపోయినా ఫర్వాలేదనుకున్నాను. మిమ్మల్ని ఇక్కడికి రప్పించదలుచుకోలేదు. వచ్చిఉంటే అంతా ఒక్కసారి దొంగదెబ్బతీసి ఉండేవాళ్ళు.”

“సరే, ఇక ఆ విషయం మాటాడొద్దు గాని, ఇప్పుడు ఎలా ఉంది వంట్లో? కాస్త నెమ్మదించిందా?”

“లేదు, నాకు ఊపిరి ఆడటం కష్టంగా ఉంది. నాకు తెలుసు నేను ఇక అట్టే సేపు బతకను. దుర్మార్గులు! నన్ను చెట్టుకుకట్టేసి నేను సగం చచ్చేదాకా చితకగొట్టేరు, తర్వాత నా విరిగిన చెయ్యిని కుదిపేసేరు; అయినా నేను బాధ బయటకి వ్యక్తం చెయ్యలేదు. నేను నా నాలికయినా కోసేసుకుంటాను గాని మిమ్మల్ని బయటపెట్టేవాడిని కాదు సహాయం పేరుతో. ఇప్పుడు నా బాధని వ్యక్తం చేసుకుని తనివితీరా ఏడ్వగలను; దానివల్ల కొంత బాధతీరుతుంది. మిత్రులారా! మీకు నా కృతజ్ఞతలు.”

“అయ్యో, పీడిలాట్! నిన్నుపెట్టిన హింసకి మేము తగిన ప్రతీకారం తీర్చుకుంటాం. నువ్వు సందేహించే పని లేదు.”

“అవును. నేనూ అదే కోరుకుంటున్నాను. వాళ్ళల్లో ముఖ్యంగా ఒక స్త్రీ ఉంది. ఆమె నిన్న కేప్టెన్ చంపిన ఆశ్వికుడి భార్యనని చెప్పుకుంటోంది. ఆమె ఆశ్వికుడులాగ దుస్తులు వేసుకుని నిన్న నన్ను ఎక్కువగా హింసించింది; నన్ను సజీవంగా కాల్చమని సలహా ఇచ్చింది ఆమే. స్వయంగా కర్రలకి నిప్పుపెట్టింది ఆమే. అబ్బా! పరమఘాతకి, దుర్మార్గురాలు! అబ్బా! మంట! నా నడుము… నా చేతులు!” అంటూ అలసిపోయి, ఎగఊపిరితో, భరించలేని బాధతో కిరకిర చుట్టుకుపోతూ వెనక్కి వాలిపోయాడు. కేప్టెను భార్య అతని నుదిటిమీద చెమట తుడుస్తుంటే, బాధతో, కోపంతో మా కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి… చిన్నపిల్లల్లా. అతని అంతిమ ఘడియలని మీకు చెప్పను. మరో అరగంట తర్వాత శత్రువులు ఏ దిక్కున వెళ్ళేరో చెప్పి తుదిశ్వాశ విడిచాడు. అతన్ని ఖననం చెయ్యడానికి కొంత సమయం తీసుకుని, మనసులు పట్టలేని కోపంతో, అసహ్యంతో నిండిపోగా, శత్రువుల్ని పట్టుకుందికి బయలుదేరాం.

“అవసరమైతే, శత్రుసేన అంతటిమీదా విరుచుకు పడదాం,” అన్నాడు కేప్టెన్; “మనం మాత్రం పీడిలాట్ కి ప్రతీకారం తీర్చుకోవాలి. మనం ఎలాగైనా ఆ నీచుల్ని పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకోలేకపోతే, మనం ప్రాణాల్ని త్యజించడానికైనా సిద్ధమని ప్రమాణం చేద్దాం; ఈ ప్రయత్నంలో ఒక వేళ నేను ముందు చనిపోతే ఇదే నా ఆజ్ఞ: మీరు బందీలుగా పట్టుకున్న వాళ్లనందరినీ తక్షణం కాల్చి చంపాలి. ఆ ఆశ్వికుడి భార్యని మాత్రం చంపడానికి ముందు చిత్రవధకి గురిచెయ్యాలి.”

“ఆమె స్త్రీ కనుక ఆమెని తుపాకితో చంపకూడదు,” అంది కేప్టెన్ భార్య. “నువ్వు జీవించినంతకాలమూ, స్త్రీని కాల్చి చంపవని నాకు తెలుసు. చిత్రహింసకి గురిచెయ్యడం వరకు చాలు; కానీ ఈ ప్రయత్నంలో నువ్వు గాని చనిపోతే, నాది ఒక కోరిక; ఆమెని నేను నా చేతులతో స్వయంగా చంపాలి. ఒక వేళ ఆమే గనక నన్ను చంపితే మిగిలిన వాళ్ళు వాళ్ళకి తోచినది చెయ్యొచ్చు.”

“ఆమె శీలాన్ని చెరుస్తాం! ఆమెని సజీవంగా తగలేస్తాం! ఆమెని ముక్క ముక్కలుగా నరుకుతాం! పీడిలాట్ కి జరిగినదానికి ప్రతీకారం తీర్చుకోవలసిందే!”

“ఒక కన్నుకి మరో కన్ను, ఒక పంటికి మరో పన్ను!”

V

మర్నాడు ఉదయం పన్నెండు మైళ్ళ దూరంలో మేము జర్మనుల పహరా స్థావరం మీద దాడి చేశాం. మేము అకస్మాత్తుగా దాడి చెయ్యడంతో, వాళ్ళు గుర్రాలు ఎక్కలేకపోవడమేగాక, తమనితాము రక్షించుకో లేకపోయారు. ఫలితంగా కొద్దినిముషాల్లోనే మాకు మా మగవాళ్ళ సంఖ్యకి సరిపడా 5గురు బందీలుగా చిక్కారు. మా కేప్టెన్ వాళ్లని ప్రశ్నించేడు. వాళ్ళు ఇచ్చిన సమాధానాలబట్టి మాకు ముందురోజు కొద్దిలో తప్పించుకున్న వాళ్లు వాళ్ళే అని నిర్థారణ అయింది. మాలో ఒకరికి వాళ్ళ లింగనిర్థారణ చెయ్యవలసిందిగా ఉత్తరువు ఇవ్వబడింది. మా మిత్రుడిని చిత్రహింసకి గురిచేసిన స్త్రీ అందులో ఉందని మాకు తెలిసినపుడు మా ఆనందానికి అవధులు లేవు.

మా తుపాకులకి అతి చేరువలో, వాళ్ళు మాకు వెన్ను చూపించేట్టు నిలబెట్టి, మిగతా నలుగురినీ అక్కడికక్కడే కాల్చిపారేశాము. అప్పుడు మా దృష్టి ఆ స్త్రీ మీదకి మరల్చేము. ఆమెను ఏమి చెయ్యాలి? అందరమూ ఆమెని కాల్చిచంపడానికి సుముఖంగా ఉన్నామన్న విషయం చెప్పకతప్పదు. అసహ్యమూ, పీడిలాట్ కి ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరికా, మాలో ఉన్న జాలి దయ పూర్తిగా ఇగిర్చేశాయని చెప్పాలి; మరో స్త్రీ, కేప్టెన్ భార్య, గుర్తుచేసేదాకా, మేము ఒక స్త్రీని కాల్చబోతున్నామన్న విషయమే మరిచిపోయాం. ఆమె పదేపదే బ్రతిమాలిన మీదట ఆమెని బందీగా తీసుకెళ్ళడానికి నిశ్చయించుకున్నాం.

పాపం, కేప్టెను భార్య! తను పెట్టిన ఈ క్షమాభిక్షకి ఆమె దారుణమైన మూల్యం చెల్లించవలసి వచ్చింది.
మరునాడు, ఫ్రాన్సు తూర్పు తీరానికి కూడా యుద్ధవిరామం పొడిగించబడింది అని తెలియడంతో, మా ప్రయత్నాన్ని అక్కడతో ముగించవలసి వచ్చింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలకే చెందినవారవడంతో మాలో ఇద్దరు ఇంటికి వెళ్లిపోయారు. అంతా కలిపి నలుగురం మిగిలేం, కేప్టెనూ, అతని భార్యా, నేనూ, మరొకరూ. మాది బిసాజన్ (Besancon). యుద్ధవిరామం ప్రకటించినఫ్ఫటికీ ఆ పట్టణం ఇంకా ముట్టడిలోనే ఉంది.
“మనం ఇక్కడ ఆగుదాం,” అన్నాడు కేప్టెన్. “ఈ యుద్ధం ఇలా ముగియనుందంటే నాకు నమ్మకం కుదరడంలేదు. ఫ్రాన్సులో ఇంకా మగవాళ్ళు బ్రతికే ఉన్నారు; వాళ్ళేమిచెయ్యగలరో చూపించవలసిన సమయం వచ్చింది. వసంతం వస్తోంది; బహుశా, ఈ యుద్ధవిరమణ జర్మనులని వంచించడానికి ఒక వ్యూహం అయి ఉండొచ్చు. ఇదెన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళూ, మరికొంత సైన్యాన్ని సమకూర్చుకుని, ఓ మంచిరోజు చూసి వాళ్ళమీద విరుచుకుపడొచ్చు. మనం సిద్ధంగా ఉందాం, మనదగ్గర ఒక బందీకూడా ఉంది. … కనుక మనం ఇక్కడే ఉందాం.”

మేము మా నివాసం అక్కడ ఏర్పరచుకున్నాం. చలి విపరీతంగా ఉండడంతో మేము బయటకి పెద్దగా వెళ్ళలేదు; హమేషా మా ఖైదీ ఎవరో ఒకరి దృష్టి పరిధిలో ఉండేలా గమనిస్తూనే ఉన్నాము.
ఆమె ముభావంగానే ఉండి ఏదీ మాటాడేది కాదు; మాటాడితే మా కేప్టెను చంపిన తన భర్తగురించి మాటాడేది. అతని వంక ఎప్పుడూ వాడి చూపులతో చూసేది; ఆమె తీవ్రమైన ప్రతీకార కాంక్షతో రగిలిపోతోందని మాకు అర్థమయింది. పీడిలాట్ కి ఆమె పెట్టిన హింసకి అదే తగిన శిక్ష అని మాకు అనిపించింది; ఎందుకంటే తీర్చుకోలేని ప్రతీకారకాంక్ష అంత తీవ్రమైన బాధ!

ప్చ్! మా సహచరుడికి ఎలా ప్రతీకారం తీసుకోవాలో తెలిసిన మాకు, ఆమెకు కూడా ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో తెలుస్తుందన్న ఆలోచన మాకు వచ్చి ఉండాల్సింది; మేము మరింత జాగ్రత్తలో మేము ఉండాల్సింది. మాలో ఎవరో ఒకరు ప్రతిరోజూ రాత్రల్లా కాపలా కాస్తుండేవాళ్లమి, మొదట్లో గోడకి అతికిన ఓక్ బల్లకి ఆమెని పొడవాటి తాడుతో కట్టేసి. కానీ, ఎన్నడూ తప్పించుకుని పారిపోవడానికి ఆమె ఎలాటి ప్రయత్నమూ చెయ్యకపోవడంతో, మా అతి జాగ్రత్తని సడలించి, ఆమెని బెంచీ మీద కాకుండా దూరంగా ఎక్కడో పడుక్కోనిచ్చేవాళ్ళమి ఏ కట్లూ లేకుండా. మాకు భయపడడానికి ఏముంది? ఆమె గదికి ఒక మూలనుంటుంది, తలుపుకి దగ్గరగా ఒకరు కాపలా ఉంటారు, ఆమెకీ కాపలాదారుకీ మధ్య కేప్టెను భార్యా, మరో ఇద్దరూ పడుక్కుని ఉండేవాళ్ళు. ఆమె ఒక్కతె, ఏ ఆయుధమూ లేనిది; మేము నలుగురం, కనుక ఏ ప్రమాదమూ లేదనుకున్నాం.

ఒకరోజు రాత్రి మేమంతా నిద్రపోతున్నాం. కేప్టెను కాపలా ఉన్నాడు. ఆమె మామూలుకన్నా ప్రశాంతంగా ఓ మూలకి ముడుచుకు పడుక్కుంది. ఆ సాయంత్రం, మాకు బందీగా చిక్కిననాటినుండి ఇప్పటివరకు మొదటిసారిగా చిరునవ్వు నవ్విందికూడా. అర్థరాత్రివేళ ఒక భయంకరమైన కేకకి అకస్మాత్తుగా మేమంతా ఒక్కసారి మేలుకున్నాం. చుట్టూ చిమ్మ చీకటి. మేము లేచి, తడుముకుంటూ చూసేసరికి నేలమీద ఇద్దరు పోట్లాడుకుంటూ దొర్లుతూ కనిపించేరు. ఒకరు కేప్టెనూ, రెండవది ఆశ్వికుడిభార్యా. మేము వాళ్ళమీదపడి ఇద్దరినీ ఒక్క నిముషంలో విడదీశాము. ఆమె వికటాట్టహాసం చేస్తోంది. అతను మృత్యువుతో పోరాడుతున్నట్టున్నాడు. మాలో ఇద్దరం ఆమెని గట్టిగా పట్టుకున్నాం. దీపం వెలిగించగానే మా కళ్ళకి ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. మా కేప్టెను తుపాకీనుండి తీసిన బాయ్ నెట్ కత్తి అతని గొంతులో దిగబడి, గొంతుమీద పెద్ద గాయంతో, రక్తపు మడుగులో కొట్టుకుంటున్నాడు. కొద్దినిముషాలతర్వాత అతను చనిపోయాడు… ఒక్క మాటైనా మాటాడలేకుండా.

అతని భార్య ఒక్క కన్నీటిబొట్టు రాల్చలేదు. ఆమె కళ్ళు ఎండిపోయాయి. ఆమె గొంతు బిగుసుకుపోయింది. ఆమె ఆశ్వికుడిభార్యవైపు దీక్షగా నిశ్చలమైన క్రౌర్యంతో భయంపుట్టించేలా చూసింది.
“ఈమె ఇప్పుడు నాకు చెందుతుంది,” ఆమె ప్రకటించింది అకస్మాత్తుగా ఒక్కసారి. “ఆమె నా భర్తని గనక చంపితే, ఆమెని నా ఇష్టం వచ్చినట్టు చంపడానికి మీరందరూ అంగీకరించి నిండా వారం రోజులు కాలేదు. మీరు మీ మాట నిలబెట్టుకొండి. ఆమెని పొయ్యి వెనకన నిటారుగా గట్టిగా కట్టేసి, ఇక్కడికి దూరంగా మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపొండి. ఆమెమీద ప్రతీకారం నేను తీర్చుకుంటాను. కేప్టెను భౌతిక కాయాన్ని అలాగే ఉండనీండి. ఇక్కడ మేము ముగ్గురమే… అంటే అతనూ, ఆమె, నేనూ మాత్రమే ఉండాలి.”
ఆమె మాట మన్నించి మేము అక్కడనుండి నిష్క్రమించాం. మేము జినీవాకు పోతున్నాం గనుక అక్కడికే ఉత్తరం రాస్తానని మాట ఇచ్చింది.

VI

రెండు రోజులుపోయిన తర్వాత, మేము వదిలిన తర్వాతి తేదీ తో అక్కడ రాజమార్గం మీది వసతిగృహం చిరునామాతో ఈ క్రింది ఉత్తరం వచ్చింది:

“మిత్రమా,
ఇచ్చిన మాట ప్రకారం నేను నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ప్రస్తుతానికి నేను ఈ విడిది గృహంలో ఉంటున్నాను, ఇక్కడే ఒక జర్మను ఆఫీసరుకి ఆమెని అప్పజెప్పి.
“మిత్రమా, నేను నీకో విషయం చెప్పాలి. పాపం ఈ స్త్రీ జర్మనీ లో ఇద్దరు పిల్లల్ని వదిలేసి వచ్చింది. ఆమె పిల్లలు వాళ్ళ తాతగారింట్లో ఉండడంతో, యుద్ధంలో రాగల అపాయాలకి భర్తని ఒక్కణ్ణీ వదిలెయ్యడం ఇష్టం లేక అతన్ని అనుసరిస్తూ వచ్చింది ఆమె. నిన్నటినుండీ నేను ఈ విషయాలన్ని ఆమె నోటినుండి వింటూ వస్తూండడంతో, నా మనసులోని ప్రతీకారవాంఛ మానవీయ భావనగా మారిపోయింది. పీడిలాట్ ని సజీవంగా తగలేసిన విషయాన్ని గుర్తుచేసి, ఆమెకు అదే క్రూరమైన చిత్రహింసలు పెడతానని బెదిరిస్తూ, అవమానకరంగా మాటాడి ఆనందిస్తున్న తరుణంలో ఆమె నావంక నిర్వికారంగా చూస్తూ ఇలా అంది:

“‘ఓ ఫ్రెంచి వనితా, నన్ను నిందించడానికి నీదగ్గర తగిన కారణం ఏముంది? నీ భర్త మరణానికి ప్రతీకారం చేస్తూ న్యాయంగా ప్రవర్తించేనని అనుకుంటున్నావు. అంతేనా?’

“‘అవును,’ అన్నాన్నేను.

“‘మంచిది. నువ్వు నన్నుకాల్చి నీ భర్తకి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నట్టే, నా భర్తని చంపేడు గనుక, నీ భర్తని చంపి ప్రతీకారం తీర్చుకున్నాను.’

“‘ఎలాగూ ఈ ప్రతీకారానికి నువ్వు ఒప్పుకున్నావు గనుక, దాన్ని అనుభవించడానికి కూడా సిద్ధపడు,’ అన్నాన్నేను.

“‘నా కేమీ భయం లేదు.’

నిజంగా ఆమె ధైర్యాన్ని కోల్పోయినట్టు ఎక్కడా కనిపించలేదు. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది, నా వైపు ఏమీ తొణకకుండా బెణకకుండా చూసింది, నేను చితుకులూ, ఎండుటాకులూ ఏరుకువచ్చి, వాటిమీద కోపంతో కొన్ని తూటాలనుండి మందుగుండు పొడి వాటిమీద జల్లి ఆమె చితి ఇంకా దారుణంగా ఉండాలని ప్రయత్నిస్తుంటే.

“ఆమెను హింసించడం గురించి ఆలోచనలలో ఒక్క సారి తటపటాయించేను. కానీ, పాలిపోయి రక్తంతో తడిసిన కేప్టెను మృతదేహం, తన విశాలమైన గాజు కళ్ళతో ఎదురుచూస్తున్నట్టనిపించి మళ్ళీ నా పనికి ఉద్యుక్తురాలనయాను అతని వాడిన పెదాలు చుంబించి. తల ఎత్తి చూసేసరికి ఒక్కసారి భోరున ఏడుస్తూ ఆమె కనిపించేసరికి ఆశ్చర్యం వేసింది నాకు.

“‘అంటే నువ్వు భయపడ్డావా?’ అని అడిగేను.

“‘లేదు, కానీ నువ్వు నీ భర్తని ముద్దు పెట్టుకున్నప్పుడు నేను అన్నిటికన్నా మిన్నగా ప్రేమించిన నా భర్త గుర్తుకొచ్చాడు.’

“ఆమె వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. ఒక్క సారి ఆపేసి, తడబడుతున్న మాటలతో సన్నగా ఇలా అంది:

“‘నీకు పిల్లలున్నారా?’

“అనగానే నాకు వెన్నులో వణుకుపుట్టుకొచ్చింది. ఈమెకి పిల్లలున్నారని ఊహించేను. ఆమె ఛాతీకి దగ్గరగా జేబులో ఉన్న ఒక పాకెట్ బుక్ తియ్యమంది. అందులో రెండు ఫొటోలున్నాయి… ఒక అబ్బాయిదీ, ఒక అమ్మాయిదీ … ముద్దుగా, బూరిబుగ్గలతో, ప్రసన్నంగా ఉన్న లేలేత ముఖాలతో. అందులో రెండు ముంగురులూ, పెద్ద పెద్ద అక్షరాలతో, జర్మనులో చిన్నపిల్లల చేతిరాతలో
“‘ప్రియమైన అమ్మకి.’ అని రాసి ఉంది.

“‘మిత్రమా, నాకు కన్నీళ్ళు ఆగలేదు. ప్రతీకారం తీర్చుకోలేని నా ముఖాన్ని ప్రియమైన నా భర్తకి చూపించ సాహసించ లేక, అటువైపు తిరగకుండా, ఆమె కట్లు విప్పి దూరంగా బసదాకా ఆమెతో వచ్చేసేను. ఆమె ఇప్పుడు స్వేచ్ఛాజీవి. ఇప్పుడే విడిచిపెట్టేను. ఆమె కన్నీళ్ళతో నా చేతులు ముద్దాడింది. మేడమీద ఉన్న నా భర్తదగ్గరికి నేను వెళుతున్నాను. మా ఇద్దరి శరీరాలనీ చూడడానికి సాధ్యమైనంత త్వరగా రా మిత్రమా.’”
ఉరుకులూ పరుగులమీద బయలు దేరాను నేను. అక్కడ ఒక కుటీరం దగ్గర ఉన్న జర్మను కాపలాదారుల్ని ఏమిటి సంగతి అని అడిగినప్పుడు, లోపల ఒక ఫ్రెంచి కేప్టెనూ, అతని భార్యా మరణించి ఉన్నారని చెప్పేరు. వాళ్ల పేర్లు నేను చెప్పేను. వాళ్ళు నాకు తెలుసునని అర్థమయ్యేలా చెప్పి, వాళ్ళ అంతిమ క్రియలు చెయ్యడానికి అనుమతి ఇవ్వమని ప్రార్థించేను.

“కానీ ఎవరో అప్పుడే ఆ పనిమీద నిమగ్నమై ఉన్నారు,” అని సమాధానం ఇచ్చేరు. “మీకు తెలుసునంటున్నారు గనుక లోపలికి వెళ్ళి చూడండి. ఈ కార్యక్రమం జరుపుతున్న స్నేహితులతో మీరు మాటాడి ఎవరు చేస్తారో మీలోమీరే నిర్ణయించుకొండి.”

నేను లోపలికి వెళ్ళేను. ఒకే పక్క మీద కేప్టెనూ అతని భార్యా పక్కపక్కన పడుక్కోబెట్టి ఉన్నారు. వాళ్ళమీద ఒక దుప్పటి కప్పిఉంది. ఆమె భర్త చనిపోయిన రీతిలోనే గొంతుకు కత్తితో గాయం చేసుకుందామె.
ఆ మంచం ప్రక్కన వాళ్లవంకచూస్తూ ఏడుస్తూ వాళ్ళకి అత్యంత ఆప్తస్నేహితురాలని కాపలాదారులు చెప్పిన స్త్రీ కూర్చుని ఉంది.

ఆమె వేరెవరో కాదు.
ఆశ్వికుడి భార్య.

*** ** ****

అనువాదం: నౌడూరి మూర్తి
మూలం: Guy de Maupassant (The Lancer’s Wife)
Painting: జావేద్
(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)