చలం గారి 117వ జయంతి, బుద్దపూర్ణిమ నాడు, సౌరిస్ ఆశ్రమం, స్నేహకుటి, భీమిలి లో చలం గారి అభిమానుల, ఆశ్రమ వాసుల , భీమిలి, విశాఖ, హైదరాబాదు నుంచి వచ్చిన వారి మధ్య ఆత్మీయంగా జరిగింది. ఆసందర్భం గా చాలా సార్లు చదివినా చలం గారి సుధ ను వుటంకిస్తూ చేసిన ఒక ప్రసంగానంతర భావనలకు ఇది అక్షర రూపం. అంతే కాదు, ముద్రణ వత్సరం ద్రుష్ట్యా (1961) ఈ ఏడాది చలం గారి సుధ కు స్వర్ణోత్సవ వత్సరం. 1949 – 50 మధ్య కాలంలో విజయవాడ నుంచి అరుణాచలానికి ప్రధానంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా సకుటుంబం గా తరలి వెళ్ళిన చలం గారు, ఆంధ్ర దేశం ద్రుష్టి లో హఠాత్ గా ఆధ్యాత్మికతను, దైవ భావనను ఆలింగనం చేసుకున్న వాడూ, తన సామాజిక పరిణామ దురంధర రచనా శీలత ను వదిలి వెళ్ళిపోయిన వాడూ అయ్యాడు. అలానే కొన్ని వర్గాల నుంచి దశాబ్దాలు గా దురుసు ప్రస్తావనలు కొనసాగుతూ వచ్చాయి కూడా.
తన ముందరి రచనల్లో సైతం చలం గారు ఈశ్వరుడి ప్రస్తావన తెస్తుండేవారు. ఆంతర్యామి, సర్వాంతర్యామి అన్న వివేకవంతమైన భావనను ఆయన ఎక్కడా నిరసించినట్టు కనబడదు. మానవుల పట్లా, ఇతర ప్రాణుల పట్లా చలం గారి వింత ప్రేమే, చిన్నప్పుడు సౌరిస్, గాడిదను కొనిమ్మంటే, ఆమె ముద్దు తీర్చేలా చేసింది. ఇంకా పెంచుకున్న ప్రాణులు చలం గారి జీవన అస్తిత్వ వైశాల్యం లో విడదీయరాని అంశాలు. ఇటువంటి విశాల ప్రేమను చెప్పడానికి, పోతన ప్రహ్లాదుడి గురించి చేసిన ఒక శీల వర్ణన సరిగ్గా సరిపోతుంది.
-2-
“తన యందు అఖిల భూతములయందు సమ హితత్వంబున బరగు వాడు” అని పోతన విశేషించి చెప్పిన లక్షణం చలం గారిలో పుష్కలంగా వుంది. నూటా పద్దెనిమిది వచన కవితల కూర్పుగా సుధ తొలిసారిగా 1961 లో వెలు
గు చూసింది. లోపల ప్రతి పేజీలో సాక్షాత్తూ రమణమహర్షి వేసిన అరుణాచలం స్కెచ్ పలకరిస్తుండగా, చలం గారి సుధ చారుదరహాస కాంతులు వెలారుస్తూ, అక్షరాలై మనల్ని నిలువరిస్తుంది. అతీతం పట్ల ఆసక్తి, జరుగుతున్న అన్యాయాలను ఆ ఈశ్వరుడు ఎట్లా సహిస్తున్నాడు లేక ఆ ఈశ్వరుడే వీటన్నిటికీ కారణమా అన్న సంశయ సౌందర్యం, చలం గారి రచనల్లో ఎలా కొట్టవస్తూ కన్పించిందో, అలాగే అరుణాచల వాసి చలం గారిని అధ్యాత్మికత, మతాల రీతి రివాజులకు అనువర్తనుడై నడచుకోవడం లాంటి మూఢ పధ్ధతి కాక, అతీతం పట్ల ఆందోళిత జిజ్నాసువు గా మలిచింది. అందుకే చలం గారు తన రచనల్లో ఎలా సమాజపు కట్టుబాట్లను ముందు నుంచీ నిరసిస్తూ వచ్చారో, అదే మాదిరిగా అరుణాచల వాసి గానూ మతాల మూస నియమాలను ప్రశ్నల, నిరసనల చెర్నాకొలతో చెళ్ళూమనిపిస్తూ వచ్చారు. సుధ లోని అనేక కవితల్లో ఈ దాడి స్పష్టం.
(చలం)
ప్రవక్తల అపూర్వ క్రుషి, మానవ ప్రేమ, వ్రుధా అయ్యాయే అని దుఖిస్తాడు. శ్రీక్రుష్ణుడు, బుద్దుడు, జీసస్, మహమ్మద్, వాళ్లందరీ నాడు మతాలలో, కలహాలలో, కవిత్వములో, గొప్పతనాలలో వుత్త పేర్లు ( సుధ – 17) అని వర్తమాన సంక్లిష్టత ను ప్రశ్న గా వేస్తాడు. ‘కలడు కలండనెడి వాడు కలడో లేడో అనే సదసత్సంశయం శ్రీ శ్రీ దే కాదు, చలం గారిది కూడా. ఆందువల్లనే మానవాతీత శక్తి కి మంగళ గీతాలు పాడే వాడిగా కాక, ఆ శక్తి కి తమ తమ విశ్వాసాల ముసుగులు తొడిగిన మానవ సమాజాన్ని ఎదురు ప్రశ్నిస్తాడు.
-3-
మనం పర మతస్తుల్ని కాలుస్తామని, ఇతర దౌర్జన్యాలకు దిగుతామని వూహించాడో, లేక వేల ఏళ్ల మానవ పరిణాహంలో మతాల పరివ్యాప్తి ఎలా హింసాత్మకంగా అమలవుతూ వచ్చిందో గమనించాడో గాని చలంగారు మతాల ఆచార వ్యవహారాలపై ఎద్దేవా చేస్తాడు “ముక్కు చెవులు మూసుకో, మౌనం పట్టు, కళ్లు ముయ్యి, వూపిరాపు, రాళ్ల మీద పూలు రాల్చు, పర మతస్తుల్ని కాల్చు, కొండనెక్కి కూచో, నదుల్లో దిగి మునుగు, ఏకాంతంలో నిలు, తీర్థాలన్నీ తిరుగు, తిండి మానెయి, సంతర్పణలు చేయి, లోకాన్ని వదులు, లోకాల్ని మింగు, ఇట్లా అంతం లేని గ్రంథాలు, బోధలు, శాస్త్రాలు, మతాలు!”
ఇందులో భక్తి పారవశ్యం ఏముంది? ప్రశ్నించే తత్వం తప్ప. చలం పరిసరాలు మారాయే గానీ, చలం లోని దేనితో కుదరని స్వభావం మారలేదు. బుద్దుడి వలె, ఇతర మహితత్ముల వలె జ్ఞానోదయం పొందిన వాడిగా రమణ మహర్శి ని భావించాడే తప్ప భక్తుల వలె సర్వశ్య శరణాగతి గల, అడియేన్ దాసన్ తీరు మనిషి గా చలం గారు ఎప్పుడూ లేరు.
మత వ్యవస్థల్లో వుండే దబాయింపు పద్దతి ( ప్రశ్న ను అంగీకరించని అసహన తత్వం) చలం గారికి సుతరామూ నచ్చదు. ధీన్ని గురించి రాస్తూ “ ఇదంతా కర్మ, నాది సత్కర్మ, నీది దుష్కర్మ, చేశావు, అనుభవించు, చేసి పైగా ప్రశ్నలా? నోరెత్తకు! ( సుధ – 48) అంటారు చలం. అలాగే “మరణాంతాని వైరాణి” అనే మన ఉదార భావన మరణం తో అన్ని వైరాలూ సమసిపోతాయని ఎలా తెలుపుతుందో, అనేది వుమర్ ఖయ్యాం రుబాయీల విలక్షణ ఛాయతొ ఇలా వెలువరించారు కవి. “ లలనా! ఈ లోకమింతే! ఏ సత్యమూ లేని దూరమూ, కాలమూ అనే పడుగు పేకలపై జ్ఞానకాంతి మెరిపించే తళుకు రూపాలు, ఇదో బొమ్మలాట!. ఇంతసేపూ తెర మీద దెబ్బలాడిన కర్ణార్జునులు కాల పేటిక లో కావలించుకు పడుకున్నారు”.
-4-
2011 లో స్వర్ణోత్సవ వత్సరం లోకి అడుగు పెడుతున్న ఈ ప్రశ్నల వెన్నెల ‘సుధ’ , 1990 లో ఆంగ్లం లోకి జె.ఎస్.ఆర్.ఎల్. నారాయణ మూర్తి, సౌరిస్ ప్రమోద, జాల్లీ వెల్లింగ్స్, ఎలియట్ రాబర్ట్స్ అనే పాశ్చత్య సహవాసులు ఒక బ్రుందం గా అనువాదం చేసారు. ముఖ్యంగా ‘సుధ’ లో మానవాతీత శక్తి ని అంగీకరిస్తూనే, ఆ దిశ గా పయనించడానికి వ్యవస్థీక్రుతమైన మతాల కట్టుబాట్ల సంకుచితత్వాన్ని ఈ అమ్రుతాక్షరాల శర పరంపర తో ఢీ కొంటాడు చలం. మిథ్యావాదుల ప్రమేయం, జొక్యం, ఇవేవీ భగవత్ శక్తి ని అనుభూతం చేయడనికి అవసరం లేదన్నది చలం గారి మౌలిక తత్వం. ఆయనే చారిత్రాత్మకమయిన ముందు మాట రాసిన ‘మహాప్రస్థానం’ లో మిథ్యావాది కవిత లో ఎలా శ్రీ శ్రీ “ మాయంటావూ అంతా మిథ్యంటావూ, నా ముద్దుల వేదాంతీ ఏమంటావు?” అని చరాచర జగత్తు యొక్క భౌతిక వాస్తవాల జాబితా తో నిలదీసిన రచన వలె చలం గారి ‘సుధ’ ప్రత్యేకమైన రచన.
ఈ అనంత కాల ప్రవాహంలో జీవితం ఒక్కసారి గుప్పుమని వెలిగి ఆరిపొయే వెలుగు అన్నది సనాతన భారతీయ చింతన. అదే సూఫి తాత్వికులు అందుకున్నారు. ఈ క్షణభంగురతను చలం గారు చెప్పిన తీరు ఒక తాత్విక పరాకాష్ఠ. “గడిచిన అనంతంలో మనం లేము, గడవబొయే అనంతం లో వుండబోము. ఈ అగాథ ఆద్యంత రహిత శూన్యంలో ఒక్క క్షణం ఈ నేననే వెలుగు” (సుధ – 36).
‘కోహం” “సోహం” ల తాత్విక చర్చ వ్యవస్థీక్రుత మతాలకు అతీతమైన అనాది మానవ జిజ్ఞాస కు చెందింది. నేను అనే ప్రాతిపదికను ‘సుధ’ జాగ్రుతం గా చర్చిస్తుంది. ‘సుధ” లో తెలుగు కవిత్వానికి కొత్త అందాలు అద్దారు నిరంతర సౌందర్య సాధకుడు చలం గారు.
-5-
“యామినీ శిరొజ దీప్త జ్వాలా కుసుమాలు” “మనో మోహ వ్యూహం” “ప్రేమ విఘాత దారుణేశ్వరుడు” ఇలా. “కాల గుహాంతరళం లోంచి పొంచి వెంబడించే మరణ వ్యాఘ్రం” అంటే చలానికి భయం లేదు.
“మరణమా! ఏం చేస్తుంది
ఏమిస్తుంది మరణం
ఆలిసిన దేహన్నే కానీ
మండే మనసుని మంట పెట్టని మరణం” అంటూ చక్రాల కుర్చీ లో కూచుని స్మశానానికి వెళ్లి పోయాడు. జ్వలించే చలం గారిని సేద దీర్చగల తాపిన్యుపనిషద్ దొరక లేదనే అనుకోవాలి. జీవితం గురించి చలం వెన్నెల బుసలు వినండి. “ఊపిరాడని వ్యథ లో అనంతంగా కొట్టాట్టం తప్ప దిక్కు లేదు. బతుకంటే అర్థం అంతే” అని సుధ – 49 లో ముగిస్తూ సుధ – 50 లో ఇలా రాస్తారు చలంగారు.
“ధిక్కు లేదు, ఆశ లేదు, విని ఓదార్చే జాలి లేదు, తప్పించుకునే తోవ లేదు, ఈ జనన మరణ తమో నిర్మిత పైశాచిక నిర్భంధ పరిభ్రమణానికి”.
వెన్నెల లోనూ, వేసవి అసౌకర్యాలను తనలో దాచుకున్న చలంగారి సుధ, ఆయనదే కాదు, ఒక విశ్వ వ్యాప్త మానవకోటి అస్తి నాస్తి సంబంధిత ఆనందమయ వ్యథ. ఆ వెన్నెల కొంగు, ఆ అమ్రుతపు పదును సుధాంచలం.
చాలా బాగుంది
Nice article to read about Chalam’s poetry Ramatheertha garu
Interesting. దీన్ని గురించి ఇంతకు మునుపు తెలియదు.
Excellent Ramateerthagaru.
వ్యాసం శైలీ, భాషా, నడిపించిన తీరూ చాలా ఆదర్శవంతంగా ఉన్నాయి…ఈ పత్రికకీ ఈ ఆర్టికల్ ఓ హైలైట్..అభినందనలూ రామతీర్ధ గారూ
chalaa…chaa….laaaaa bavundi
It is good
మీరు చలంగారి గురుంచి రాసిన ఆర్టికల్స్ అన్నీ చదివాను చాలా బాగున్నాయి