మన తెలుగు

భాషాసవ్యతకు బాటలు వేద్దాం – 6

ఆగస్ట్ 2014

[ క్రితం నెలలో ఈ వ్యాసం ద్వారా పాఠకులకు రెండు ప్రశ్నలు వేసాము. వాటిలో దేనికీ జవాబు రాలేదు. మొదటి ప్రశ్న ఈ విధంగా వుంది: తిలాపాపం అనే సమాసం / పదబంధం సరైనదేనా? అదేవిధంగా ఆరాధనభావం సరైనదా, లేక ఆరాధనాభావం కరెక్టా? అసలు రెండు పదాలతో ఒక సమాసాన్ని తయారు చేసేటప్పుడు మొదటి పదంలోని చివరి అక్షరానికి యెప్పుడు దీర్ఘం వస్తుంది, యెప్పుడు రాదు? దీనికి జవాబేమిటంటే, తిలాపాపం తప్పు, తిలపాపం సరైనది. ఒక సమాసం కోసం రెండు పదాలను వాడుతున్నప్పుడు, పూర్వపదం (మొదటి పదం) స్త్రీలింగమైనప్పుడు దాని చివరి అక్షరానికి దీర్ఘం వస్తుంది. అది పుంలింగమైతే దీర్ఘం రాదు. ఆ పదం ఒకవేళ నపుంసక లింగమైతే కూడా చాలా వరకు (దాదాపు అన్ని సందర్భాల్లో) దీర్ఘం రాదు.‘తిల’ స్త్రీలింగం కాదు, పుంలింగం. తిలభవం, తిలరసం అంటే (నువ్వుల) నూనె. తిలయంత్రం అంటే గానుగ. తిలకాష్టం అంటే నువ్వుల కట్టె. తిల అన్నది స్త్రీలింగమైతే ఇవన్నీ తప్పులు అవ్వాలి. అంటే వీటిలో ‘ల’ అనే అక్షరానికి దీర్ఘం వచ్చి ఆ పదాలు తిలాభవం, తిలారసం, తిలాయంత్రం, తిలాకాష్టం అవ్వాలన్న మాట. తిలాపాపం తలా పిడికెడు అన్న సామెతలో ‘తలా’కు సరిపోయే విధంగా ‘తిలా’ అని ప్రాస కూర్చి వుంటారెవరో! తర్వాతనుండి అందరూ ఆ ప్రయోగాన్నే అనుసరిస్తున్నట్టున్నారు. ఇక ఆరాధన నపుంసక లింగం కనుక, ఆరాధనభావం అనటమే సరైనది. పైగా ఆరాధనాభావం అని రాసినప్పుడు దాన్ని ఆరాధన + అభావం అని విడదీస్తే పూర్తిగా విరుద్ధమైన అర్థం వచ్చే అవకాశముంది. ఎందుకంటే అభావం అంటే లేకపోవుట అని అర్థం! ఏది స్త్రీలింగమో ఏది పుల్లింగమో తెలియాలంటే ప్రామాణిక నిఘంటువులను సంప్రదించక తప్పదు.

మేము అడిగిన రెండవ ప్రశ్న: వ్యభిచారం అన్న పదానికి ‘నల్ల మేక తప్పు’ పర్యాయ పదం యెందుకైంది? దీనికి జవాబు ఈ వ్యాసకర్తకు కూడా తెలియదు!
ఇక మన అసలు వ్యాసానికి వద్దాం.]

ఒకే పదంలో శ, ష , స లకు సంబంధించిన అక్షరాలు ఉన్నప్పుడు, ఆ పదం విషయంలో కొందరు గందరగోళానికి లోనవుతారు. సుశ్రూష , శుస్రూష , సుష్రూష ,సుస్రూస – ఇవన్నీ తప్పులే. సరైన పదం శుశ్రూష. సహాయముకు సాయము అని ఒక సమానార్థక పదం ఉన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఈ రెండు పదాలే కాక సాహాయ్యము అనే పదం కూడా అదే అర్థాన్నిస్తుంది. “నిత్య సుమంగళి లాగ నీ పాపిటలో ఎప్పుడూ సింధూరం నిండి ఉండాలి” అనే సినిమా డైలాగు ఉందనుకోండి. ఈ వాక్యంలో ‘పాపిట’ తప్పు. పాపట సరైన పదం. పాపట = కేశవీధి. కొందరు పాపెట అని కూడా అంటారు. అది కూడా తప్పే. ఇక ‘సింధూరం’ కూడా తప్పే. సిందూరము అన్నదే సరైన పదమని చాలా మందికి తెలియదు. సిందురము కూడా సరైనదే. సింధురము అని మరో పదం ఉంది. దానికి అర్థం ఏనుగు. సౌరభము – సౌరభ్యము, సౌగంధము -సౌగంధ్యము లాగ సోదరుడు – సోదర్యుడు అని రెండు సమానార్థక పదాలున్న సంగతి కొందరికే తెలుసుననుకుంటాను. ఇంద్రునికి ఉన్న పేర్లలో స్వరాట్టు, స్వారాట్టు రెండూ సరైనవే. కాని సమ్రాట్టు, సామ్రాట్టు – ఈ రెండింటిలో మొదటిదే సరైన పదం. సామ్రాట్టు తప్పు. ఒకేలాగ ఉండే జంటపదాలు మరికొన్ని ఉన్నవి. కాని వాటి అర్థాలు వేరువేరు. ఉదా: అనలుడు = అగ్నిదేవుడు. అనిలుడు = వాయుదేవుడు. నిర్దారణము = చక్కగా చీల్చుట. నిర్ధారణము = నిశ్చయము. రిక్తము = శూన్యము. రిక్థము = ధనము. నిద్ర లేకపోవటాన్ని నిర్ణిద్ర అని రాస్తారు కొంత మంది. కాని నిర్నిద్ర అనటమే సరైనది – ‘నిమిత్తం లేని’ ని నిర్నిమిత్తం అన్నట్టుగా. ఇక శీర్షికలోనే భాషాదోషాలుండటం సీరియస్ విషయమే.

“సమకాలీన కవితా రంగంలో సంఖ్యాపరంగా చూస్తే వచన కవులది ఒక రకంగా గుత్తాధిపత్యం” అన్నాడొక కవి మిత్రుడు. ఇక్కడ గుత్తా అనేది వైకృత విశేష్యము (Noun) కాగా ఆధిపత్యము సంస్కృత విశేష్యము. ఈ రెండింటి మధ్య కుదిరే సమాసం వైరి సమాసమే అవుతుంది. భక్తి ఫ్రధానమైన రేడియో, టీ.వీ. కార్యక్రమాల్లో ‘భక్తి రంజని’ అనేది ఒకటి ఉండటం గమనిస్తాం మనం. అయితే దీని వ్యుత్పత్తి ఏమిటి? ‘భక్తులను రంజింపజేసేది’ అయితే ‘భక్త రంజని’ అవ్వాలి. ‘భక్తిని రంజింపజేయడం’ అనేది అసంబద్ధమైన విషయం. ‘భక్తి చేత రంజింపజేసేది’ అవుతుందా? యథార్థము అనే పదాన్ని కూడా చాలా మంది యదార్థము అని తప్పుగా రాస్తారు. పత్రికల్లో కూడా ఆ పదం అలానే అచ్చు కావడం మనం గమనించవచ్చు.

ఒక పదం తాలూకు అర్థం మీద Stress (ఊనిక) ను ధ్వనింపజేయటం కోసం కొన్ని సార్లు ఆ పదంలోని ఒక అక్షరాన్ని ద్విత్వాక్షరంగా మార్చడం, లేక వత్తును ఇవ్వటం మామూలే. ఉదాహరణకు ‘ఒఖ్ఖడికీ’ సరైన అర్థం తెలియదు అంటాం. అదేవిధంగా ‘ఛస్తే’ మళ్లీ నీ ముఖం చూడను అన్న వాక్యం. ఆధునిక వచన కవితా సందర్భంలో ఇటువంటి ప్రయోగాలను శుద్ధ తప్పులు అని కొట్టి పారేసి వాటి వాడుకను మానెయ్యలేము.

ఇక కొంత మంది రచయితలు తమ రచనల్లో ఇంగ్లిష్ పదాలను పుష్కలంగా గుప్పిస్తారు. అయితే ఆ పదాల సరైన ఉచ్చారణ తెలియనప్పుడు వాటిని ఆంగ్లలిపిలో ఇవ్వక తెలుగు అక్షరాల్లో ఇస్తే ఇబ్బందే. ఆంగ్ల పదాల సరైన ఉచ్చారణ తెలియటం ఆషామాషీ విషయం కాదు. ఇంగ్లిష్ భాష మీద పట్టును కలిగి వుండక, ఆంగ్ల పదాలను తెలుగు లిపిలో రాస్తూ దోషభూయిష్ఠంగా రచనలు చేస్తున్న కథారచయితలు కొందరు మనకు అక్కడక్కడా తారస పడుతారు. అట్లాంటి వాళ్లకు కూడా ఉపయోగకరంగా ఉండేట్టు కొన్ని ఉదాహరణలతో వివరణలు ఇస్తాను. నోబెల్ ప్రైజ్ అనే బదులు నోబుల్ ప్రైజ్ అని రాస్తారు కొందరు. నోబుల్ (Noble) అంటే ఉదాత్తమైన అని అర్థం. ఇక నోబెల్(Nobel) అన్న పదం ఒక వ్యక్తి పేరును సూచిస్తుంది. కాబట్టి నోబుల్ ప్రైజ్ అనకూడదు, నోబెల్ ప్రైజ్ అనాలి. కౌన్సిలర్, కౌన్సెలర్ కూడా భిన్నమైన పదాలు. కౌన్సిలర్ (Councillor) అంటే కౌన్సిల్ లోని ఒక మెంబరు. కౌన్సెలర్ (Counsellor) అంటే సలహా ఇచ్చేవాడు. బిజినెస్ మాగ్నేట్ అని రాసే బదులు బిజినెస్ మాగ్నెట్ అని రాస్తారు కొందరు. మాగ్నేట్ (Magnate) అంటే పలుకుబడి, ప్రభావం బాగా ఉన్నవాడు (ముఖ్యంగా బిజినెస్ లో). మాగ్నెట్ (Magnet) అంటే అయస్కాంతం. కెరియర్, క్యారియర్ కూడా వేరువేరు. కెరియర్ (Career) ను మనం పని చేసే రంగంలోని అంశమని స్థూలంగా చెప్పుకోవచ్చు. ఇక క్యారియర్ (Carrier) అంటే టిఫిన్ క్యారియర్ లోని డబ్బా లేక డబ్బాల సముదాయం. సైకిలుకు వెనకాల ఉండే సీటును కూడా క్యారియర్ అంటాము. మోసే వాడు అని మరో అర్థం కూడా ఉంది. అదే విధంగా Chance కూ Choice కూ మధ్యన ఉన్న భేదాన్ని గుర్తించరు కొందరు. Chance అంటే అవకాశం, Choice అంటే ఎంపిక. “నేనూ మాట్లాడుతాను, నాకు చాయిస్ ఇవ్వండి” అనకూడదు. చాన్స్ ఇవ్వండి అనాలి. అదే విధంగా “ఎన్నో డిజైన్లలో ఉన్నాయి చీరలు. చాయిస్ నీదే” అనాలి తప్ప చాయిస్ కు బదులు చాన్స్ అన్న పదాన్ని వాడకూడదు. మెషీన్ గన్ (Machine gun) కు బదులు మిషన్ గన్ (Mission gun) అనడం కూడా తప్పే. Mission అంటే వేరే అర్థం ఉంది మరి! Alternate, alternative అన్న పదాలు కూడా తికమకను కలిగించేవే. Alternate days అంటే దినము విడిచి దినము. Alternative అంటే ప్రత్యామ్నాయం (మరో మార్గం). డిబాచెరీ (Debauchery) చేసేవాడు అనే అర్థంలో డిబాచెలర్ అనే పదాన్ని వాడుతారు కొంత మంది (బ్యాచెలర్ అంటే బ్రహ్మచారి కనుక, డిబాచెరీ చేసేవాణ్ని బ్రహ్మచారి లాగా ప్రవర్తించనివాడి లాగా భావించి, అలా రాయాలనుకుంటారేమో!). డిబాచెరీ చేసేవాడిని సూచించటానికి ప్రత్యేకమైన పదం ఆంగ్లంలో కనపడదు. ప్రామాణికం కాని నిఘంటువుల్లో డిబాచీ (Debauchee) అన్న పదమొకటి ఉంది. ఫిడేలును వైలిన్ అనాలి ఇంగ్లిష్ లో. వయొలిన్ అనకూడదు, దాని స్పెలింగ్ Violin అయినా కూడా! Pizza ను పీట్జ అని పలకాలని తెలిసినవాళ్లు కూడా (విదేశాల్లో ఉంటున్న వారిని మినహాయిస్తే) తక్కువ మందే వుంటారు. విడాకులు (Divorce) ను డివాస్ అనాలి. కనీసం డివోర్స్ అన్నా ఫరవా లేదు. కాని చాలా మంది డైవర్స్ అని రాస్తారు. డైవర్స్ అన్నదానికి Divers, Diverse అని రెండు భిన్నమైన పదాలున్నాయి ఆంగ్లంలో. Divers = డైవ్ చేసే వాళ్లు, Diverse = భిన్నమైన.

ఇక ప్రజెంటేషన్ (ప్రెజెంటేషన్), కాన్సంట్రేషన్ (కాన్సెంట్రేషన్), సెలబ్రిటీ (సెలెబ్రిటీ), జనరేషన్ (జెనరేషన్),జీసెస్ (జీసస్), సిజర్ (సిజర్స్), డ్రస్సింగ్ టేబుల్ (డ్రెసింగ్ టేబుల్), అర్జంట్ (అర్జెంట్), మొమెంటో (మెమెంటో), ఫోర్ లైన్స్ రోడ్ (ఫోర్ లేన్ రోడ్), హానెస్టీ (ఆనెస్టీ), డిస్ట్రబ్ (డిస్టర్బ్), గార్డన్ (గార్డెన్), డెకరేషన్ (డెకొరేషన్), సింబాలిజమ్ (సింబలిజమ్), జండర్ (జెండర్), సిటిజన్ (సిటిజెన్), కరంటు (కరెంటు), రడీ (రెడీ) – ఇలా కుప్పలుతెప్పలుగా తప్పులు చేస్తుంటాం. గూడ్సు, స్పాంజి అనే పదరూపాలు మన భాషలో యెంతగా పాతుకుపోయాయంటే, రోడ్డు, రైలు, కాలేజిలలాగా అవి దాదాపు తెలుగు పదాలైపోయాయి. అయితే సామాన్లు లేక వస్తువులను ఆంగ్లంలో గుడ్స్ (Goods) అనీ, వాటిని మోసుకెళ్లే రైలును గుడ్స్ ట్రెయిన్ (Goods train) అనీ పలకుతారు. అదేవిధంగా Sponge ను స్పంజ్ అని ఉచ్చరిస్తారు. మరి అర్జంట్, జండర్, సిటిజన్ మొదలైన పదాలు కూడా తెలుగులో పాతుకుపోలేదా అంటే పాతుకుపోయాయి, నిజమే. అందుకే ఇటువంటి పదాలను వర్గీకరించేటప్పుడు ఇదమిద్ధమైన విభజనరేఖను నిర్ణయించటం కష్టం.

ఒకే అక్షరం రెండు సార్లు పక్కపక్కన వచ్చినప్పుడు దాని ఉచ్చారణలో ద్విత్వం రాదు. ఉదాహరణకు yellow = యెలో (యెల్లో కాదు), illicit = ఇలిసిట్ (ఇల్లిసిట్ కాదు), cherry = చెరి (చెర్రీ కాదు), sitting = సిటింగ్ (సిట్టింగ్ కాదు), rubber = రబర్ (రబ్బర్ కాదు), shimmer = షిమర్ (షిమ్మర్) కాదు. H అన్న అక్షరం వచ్చినప్పుడు కూడా వత్తును పలక కూడదు. ఉదాహరణకు ghost = గోస్ట్ (ఘోస్ట్ కాదు), thousand = తౌజెండ్ (థౌజెండ్ కాదు), channael = చానెల్ (ఛానెల్ కాదు) మొదలైనవి. తెలుగులో మనం ఉపయోగించే ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ వంటి ఉచ్చారణలు ఆంగ్లభాషలో లేవు. దీనికి ఏమైనా మినహాయింపులున్నాయో ఏమో తెలియదు నాకు. అయితే ఇటువంటి అంశాలు చాలా చిన్నవి కనుక వీటిని పాటించకపోయినా ఫరవా లేదు.

* * *

కేవలం ఆధునిక వచన కవిత్వాన్నీ మామూలు వచనాన్నీ మాత్రమే రాస్తూ భాషాసవ్యత పట్ల ఎంత మాత్రం పట్టింపు లేనివాళ్లకు ఈ వ్యాసం వృథా అనిపించటంలో ఆశ్చర్యం లేదు. అయితే దీనికి భిన్నమైన కోణం కూడా వుంది. ‘భాషాపరంగా సవ్యమైనవి’ అంటూ ఇందులో చెప్పిన పదాలనన్నింటినీ ఆధునిక రచనల్లో తప్పక ఉపయోగించాలని చెప్పలేము. ఉదాహరణకు ఒత్తిడి అన్న పదం తప్పు ‘ఒత్తడి’ మాత్రమే సరైనది అని నిఘంటువులు చెప్పినంత మాత్రాన, “మానసిక ఒత్తడితో నా మనసు క్రుంగిపోయింది” అని ఒక ఆధునిక వచన కవితలో గాని, కథలోపలి వాక్యంలో గాని రాస్తే అదంత బాగుండదు. ‘మానసిక ఒత్తిడితో’ అనే రాయాల్సి ఉంటుంది – స్ట్రిక్టుగా చూస్తే అది భాషాదోషమైనప్పటికీ (అసలు ‘మానసిక ఒత్తిడి’ వైరి సమాసమౌతుందనుకోండి, అది వేరే విషయం). కాని ఏవి భాషాదోషాలో క్షుణ్ణంగా తెలిసి ఉంటే మనకు భాష మీద పట్టు దొరికి, అన్ని సందర్భాలకు తగిన సవ్యమైన రచనలు చేయడానికి అవసరమైన గట్టి పునాది ఏర్పడుతుంది. ఛందోబద్ధమైన పద్యాలను రాసేటప్పుడు మాత్రం భాషాపరమైన శుద్ధతను తప్పక పాటించాల్సి ఉంటుంది. అయినా కనీసం మాతృభాషలోనైనా పరిపూర్ణతను సాధించే ప్రయత్నం చేయలేకపోతే పరాయి భాషలో ఆ దిశగా ప్రయత్నం చేయగలమా మనం?

కథలు, వ్యాసాలు, నవలలు మొదలైన వచన రచనలు చేయాలనుకునేవాళ్లకు చక్కని వాక్యం రాయటమెలా అన్నది మొదట తెలిసి ఉండాలి. ఎందుకంటే వాక్యాలు బాగున్నప్పుడే ఆ రచన చదివింపజేస్తుంది. విడవకుండా చదివింపజేయలేని రచన నిరర్థకం కనుక కథల్లో, నవలల్లో, వ్యాసాల్లో చక్కని వాక్యం యెంతో అవసరం. చక్కని వాక్యమంటే కేవలం భాషాదోషాలు లేకపోవటం మాత్రమే అని భ్రమ పడకూడదు. భాషాదోషాలు లేకపోవడంతో పాటు, వాక్యంలో నిర్దిష్టత ఉండటం చాలా అవసరం. అంటే సరైన స్థానాల్లో సరైన పదాలు పడాలన్న మాట. ఒక వాక్యంలో పది పదాలు ఉన్నాయనుకోండి. వాటి స్థానాలను తారుమారు చేస్తూ ఆ వాక్యాన్ని ఎన్నో రకాలుగా రాయవచ్చు. కాని ఎన్ని రకాలుగా రాయడానికి వీలున్నా వాటిలో the best possible ఐనటువంటి వాక్యాలు ఒకటో రెండో మాత్రమే ఉంటాయి. అట్లాంటి వాక్యాల్ని రాసే నైపుణ్యాన్ని వశం చేసుకోవాలి. కొడవటిగంటి కుటుంబరావు గారి వాక్యాల్లో అటువంటి నిర్దిష్టత కనపడుతుంది. సోమర్సెట్ మామ్ (Somerset Maugham) అనే ఆంగ్ల రచయిత, కొన్నిసార్లు ఒకే ఒక్క పెద్ద వాక్యాన్ని చాలా నిర్దిష్టంగా, పూర్తి సంతృప్తికరంగా రాయటానికి తనకు పదిహేను రోజులు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకున్నాడు!

కథల్లో, నవలల్లో, కవిత్వంలో మాండలికాన్ని రాసినప్పుడు, ఆ మాండలికం సంపూర్ణంగా కాక పాక్షికంగా వుంటే, అది యెంతమాత్రం సహజంగా, సమంజసంగా అగుపించదు. కేవలం పాత్రలే మాండలికం మాట్లాడేవి ఐనప్పుడు, ఆ పాత్రల సంభాషణలు పూర్తిగా (each and every word wherever applicable) మాండలికంలోనే వుండి, మిగతాది శిష్టవ్యావహారికంలో వున్నా ఫరవా లేదు. కథ చెప్పే రచయిత ఒకవేళ మాండలికంలో చెప్తే, ఆయన/ఆమె చెప్పేదంతా కూడా మాండలికంలో వుండటం సాధారణంగా న్యాయం. అయితే దీన్ని కచ్చితంగా పాటించే వాళ్లు చాలా అరుదు. రాయలసీమ నుండి నామిని, తెలంగాణ నుండి తెలిదేవర పూర్తిగా మాండలికంలో రాస్తారు. ఈ మధ్య ఒకరిద్దరు ఇతర కొత్త రచయితలు కూడా మాండలికాన్ని బాగానే రాస్తున్నట్టున్నారు. పాత్ర మాట్లాడే వాక్యంలో కొన్ని పదాలు మాత్రమే మాండలికంలో వుండి వేరే చోట్ల మాండలిక పదానికి అవకాశం వున్నా శిష్టవ్యావహారికమో సంస్కృత పదమో వుంటే, అది సహజత్వమెలా అవుతుంది? ముఖ్యంగా వాక్యం చివర్లో మాత్రమే మాండలిక పదం వుండి, మిగతా పదాలన్నీ శిష్ట వ్యావహారిక పదాలైనప్పుడు గుర్రం శరీరానికి గొర్రెతోకను తగిలించినట్టుగా వుంటుందని చెప్పాల్సివస్తుంది. అయితే మాండలికాన్ని చదవగానే చాలామంది పాఠకులు ఒక రకమైన పారవశ్యానికి లోనై, ఆ రచనను బాగా మెచ్చుకుంటారు. మాండలికమే కవిత్వం అని భ్రమపడే పాఠకులు యీ రోజుల్లో చాలా మంది వుండటం విచారకరం. మాండలికం రాసినా మళ్లీ అందులో కవిత్వం ఉండాలని మరచిపోకూడదు.

ఈ ఆధునిక రచనా యుగంలో కొన్ని పదాలను రెండు రకాలుగా రాయవచ్చు. వాటిలో దేన్నీ అసమంజసం అనలేము – స్ట్రిక్టుగా చూస్తే వాటిలో ఒకదాంట్లో వ్యాకరణపరమైన దోషం వున్నప్పటికీ. ఉదాహరణకు కొందరు ఒక్క, ఉదయం, ఉత్పత్తి, ఉధృతి మొదలైన పదాలను వొక్క , వుదయం, వుత్పత్తి, వుధృతి అని రాస్తారు. అదేవిధంగా ఎక్కడ, ఇష్టం, ఎలా, ఇల్లు మొదలైన పదాలను యెక్కడ, యిష్టం, యెలా, యిల్లు అని రాస్తారు. చదవడం, పలకడం అని కొందరు రాస్తే, మరి కొందరు చదవటం, పలకటం అని రాస్తారు. ఇట్లా రాసేవారిలో మళ్లీ రెండు రకాలవాళ్లను మనం గమనించవచ్చు. కొందరు అప్పుడప్పుడు మాత్రమే ‘ఉ’కారానికి బదులు ‘వు’కారాన్ని,‘అ’కారానికి బదులు ‘య’కారాన్ని రాస్తే, మరికొందరు ప్రతిసారీ అట్లానే రాస్తారు. అందులో మనం ఏ విధానాన్ని పాటించబోతున్నాం అనే విషయంలో స్పష్టతను కలిగి ఉండాలి ఎవరికి వారు. మరొక్క విషయం: ఒక formలో, ఒక modeలో రాయటం మొదలు పెట్టింతర్వాత వ్యాకరణానికి గట్టిగా అతుక్కోకుండా సందర్భానికి తగినట్టుగానే – అంటే ఆ form లో, ఆ mode లో ఒదిగిపోయేట్టుగానే – రాయడం సమంజసం (ఉదాహరణకు అన్ని వాక్యాల్లో వచ్చాడు, లేచాడు, తిన్నాడు మొదలైన పదాల్ని వాడుతూ, మధ్యన వొకచోట అకస్మాత్తుగా వచ్చెను అని కాని, వచ్చిండు అని కాని రాయటం). కొన్ని పదాలను రెండు మూడు విధాలుగా రాయవచ్చునని చెప్పినంత మాత్రాన, ప్రాథమిక భాషా సూత్రాలను కాలదన్ని మన ఇష్టమొచ్చిట్టుగా పదాలను వాడొచ్చునని కాదు దాని అర్థం.

భాషాపరులెవరైనా ఒక సూచనను చేసినప్పుడు, బల్లిలాగా దానికి మరీ గట్టిగా అతుక్కుపోవాల్సిన అవసరం లేదేమో. ఉదాహరణకు ‘బడు’ ప్రయోగం వద్దని యెవరో అన్నారు. కాని ‘బడు’ ప్రయోగాన్ని మానుకుంటూ ఏ రకమైన అపసవ్యతా లేకుండా వాక్యాన్ని రూపొందించటం అందరికీ అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చును. మరికొన్ని సార్లైతే అట్లా ప్రయత్నించినప్పుడు పూర్తిగా విరుద్ధమైన అర్థం ఉత్పన్నం అయ్యే అవకాశం కూడా వుంది. ఉదాహరణకు ‘ఆహ్వానింపబడిన వారు’ అనటానికి బదులు ‘బడు’ ప్రయోగాన్ని మానుకుంటూ ‘ఆహ్వానించిన వారు’ అని (‘నిర్వాహకులు ఆహ్వానించిన వారు’ అనే అర్థంలో) వాడితే పూర్తిగా విరుద్ధమైన అర్థం వస్తుంది. ఇట్లాంటి సంఘటన వొకటి నిజంగా జరిగింది కూడా! ఒక అపసవ్యతను లేక ఎబ్బెట్టుతనాన్ని లేక భిన్నమైన అర్థాన్ని తప్పించుకునే ప్రయత్నంలో మరింత అపసవ్యత లేక ఎబ్బెట్టుతనం లేక విరుద్ధమైన అర్థం కలిగిన వాక్యాన్ని రూపొందించడం కంటె, తక్కువ అపసవ్యత వున్న ఆ మొదటి వాక్యాన్నే రాయటం నయం కాదా? వీలైన చోట ‘బడు’ ప్రయోగాన్ని మానుకుంటే ఫరవా లేదు. ‘యొక్క’ అన్న ప్రయోగం కూడా యిటువంటిదేనని అనిపిస్తుంది ఒక్కొక్కసారి.

కొందరు ‘కాళ్ళు’ అని రాస్తారు. కొందరేమో ‘కాల్లు’ అని తప్పుగా రాస్తారు. మరికొందరు తమ విచక్షణను ఉపయోగించి ‘కాళ్లు’ అని రాస్తారు. అదేవిధంగా అతన్ని, అతణ్ణి, అతణ్ని – ఈ మూడు రకాలుగా పదాలను రాతలో, అచ్చులో చూస్తాం మనం. ఈ వ్యాస రచయిత కాళ్లు, అతణ్ని అన్న రూపాల వైపే మొగ్గు చూపుతాడు. లేకపోతే ‘అతడిని’ అని రాయొచ్చు, ఆ సందర్భం అనుకూలంగా వుంటే. ‘అతడ్ని’ అని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ రాయాలనిపించదు. ఎందుకంటే దాని ఉచ్చారణ ఎంత మాత్రం శ్రావ్యంగా ఉండదు. నిజానికి అందులో అపశ్రుతి ధ్వనిస్తుంది. కాని, దీనికి కూడా వొక భిన్నమైన కోణం వుంది. అదేమిటంటే ‘మో’ కవిత్వం వంటి సందర్భాల్లో వ్యాకరణ సూత్రాలు తమ ప్రసంగయోగ్యత (Relevance) ను కోల్పోతాయి కనుక వాటికి చెల్లుబాటు వుండదు. అటువంటి సందర్భాల్లో ‘అతడ్ని’ వంటి ప్రయోగాలు కూడా చక్కగా ఒదిగిపోతాయి. ఒకే అక్షరం రెండు సార్లు వరుసగా (అంటే పక్కపక్కన) రావడం చాలా సందర్భాల్లో ఉచ్చారణపరంగా బాగుండదు. ఉదాహరణకు పాడడం, వాడడం, వండడం మొదలైనవి. వీటికన్న పాడటం, వాడటం, వండటం అన్న రూపాలే బాగుంటాయి. కాని నిర్మించటంను ‘కట్టటం’ అనక తప్పదు. ఎందుకంటే ‘కట్టడం’ అన్నామనుకోండి. అప్పుడది వేరే అర్థాన్నిచ్చే విధంగా ఒక నిర్మాణాన్ని (Structure ను / Building ను) సూచిస్తుంది – ‘తాజ్ మహల్ వొక గొప్ప కట్టడం’ అనే వాక్యంలో మాదిరిగా. ఇక సొంత విషయం గురించి చెప్తూ రాసే వాక్యాల్లో చివర్న కాదు లేక కాను అన్న పదం వచ్చే సందర్భాలుంటాయి కొన్ని. ఉదాహరణకు నేను పండితుణ్ని కాదు అనవచ్చు, లేదా నేను పండితుణ్ని కాను అనవచ్చు. అప్పుడు ‘కాను’ తో ముగించిన వాక్యమే ఒకవిధంగా బాగుంటుందనిపిస్తుంది. ఇవన్నీ చాలా చిన్న విషయాలన్నది వాస్తవం.

కొన్ని సార్లు ఒక సమాసంలోని రెండు పదాలను కలిపి (వాటి మధ్యన ఖాళీ లేకుండా) రాయకపోతే పూర్తిగా భిన్నమైన అర్థం వచ్చే ప్రమాదం ఉంది. ఉదాహరణకు “అశాంతిపెనం మీద అటూయిటూ కదిల్తేనే / అందమైన కవిత్వపు కుందనపు బొమ్మ వెలుస్తుంది” అనే కవితాపంక్తులు ఉన్నాయనుకోండి (ఇవి స్వీయ కవితా పంక్తులు). ఇక్కడ అశాంతిపెనం అంటే అశాంతి అనే పెనం అని అర్థం. కాని అశాంతిపెనం అని కాక అశాంతి పెనం అని విడివిడిగా రాస్తే అశాంతి అన్నది విశేషణం అవటానికి బదులు విశేషణం కాని మామూలు నామవాచకంగా మారి వేరే అర్థాన్నిస్తుంది. అంటే విడివిడిగా రాసినప్పుడు అది సమాసం కాకుండా పోయి భిన్నమైన అర్థానికి దారి తీస్తుందన్న మాట. అదే విధంగా ‘రాత్రిలోయ అంచున నిలబడ్డాను’ అన్నప్పుడు, ‘రాత్రి అనే లోయ అంచున’ అనే అర్థం వస్తుంది. అలా కాక, రాత్రి లోయ అంచున నిలబడ్డాను అని మొదటి రెండు పదాలను విడివిడిగా రాసినప్పుడు, ‘రాత్రివేళలో లోయ అంచున నిలబడ్డాను’ అనే భావం స్ఫురిస్తుంది! పొగమంచులా (ఏదో ) వ్యాపించడం వేరు, పొగ మంచులా వ్యాపించడం వేరు. ప్రేమ సంకెళ్లు వేయడం వేరు, ప్రేమసంకెళ్లు (ఎవరో) వేయడం వేరు. ఈ విధంగా సమాసంలోని రెండు పదాలు విడివిడిగా వున్నప్పుడు పూర్తిగా భిన్నమైన అర్థం వచ్చే ఉదాహరణలను ఎన్నైనా చూపవచ్చు. ఈ యిబ్బందంతా రెండు అచ్చతెలుగు పదాలతో సమాసాన్ని ఏర్పరచినప్పుడే వస్తుంది. ‘నిశాగాధంలో (నిశ + అగాధంలో)’ అని రెండు సంస్కృత పదాలతో సమాసాన్ని తయారు చేసి ప్రయోగిస్తే ఏ తికమకా వుండదు. ఎందుకంటే ఆ సమాసంలోనే ‘నిశ అనే అగాధంలో’ అన్న అర్థం వస్తుంది తప్ప వేరే అర్థం వచ్చే అవకాశం దాదాపు లేదు. అయితే అటువంటి సంస్కృత పద ప్రయోగం ఆధునిక వచనకవితా సందర్భాల్లో చాలాసార్లు నప్పదనేది వాస్తవమే. ఇక అవసరమైన చోట కామా లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం ఏర్పడుతుందో తెలుసుకోవడానికి ఉపయోగపడేలా కొన్ని ఉదాహరణలిస్తాను. జి. ఎస్. శివ రుద్రప్ప రాసిన కన్నడ కవితకు ఈ వ్యాస రచయిత చేసిన అనువాదంలో
ఇది నిద్రా? మరణమా?
లేక ఒక కొత్త పుట్టుకా?
ప్రతిదీ పరిచితం కానిది
కొత్తది, సందేహాస్పదమైనది

అన్నప్పుడు చివరి పంక్తిలో కామా వుంటే ‘కొత్తది మాత్రమే కాకుండా సందేహాస్పదమైనది కూడా’ అనే అర్థం వస్తుంది. కామా లేకపోతే మాత్రం ఏదైతే కొత్తదో అది సందేహాస్పదమైనది అన్న భావం సూచితమౌతుంది. అదేవిధంగా ‘అమ్మ , నాన్న యిచ్చిన కానుక’ అన్నప్పుడు తల్లీ తండ్రీ యిద్దరూ కలిసి యిచ్చిన కానుక అని అర్థం. కామాను ఎగరగొడితే మాత్రం అమ్మ యొక్క నాన్న (తాత) యిచ్చిన కానుక అవుతుంది! మరో ఉదాహరణ చూడండి. “నా భార్య చికిత్స కోసం ఇరవై వేలు, అవసరమైతే ముప్ఫై వేలు అప్పు చేస్తా” అనే వాక్యముందనుకోండి. ఇది సూచించే అర్థమేమిటి? అవసరమైతే ఇరవై వేలే కాదు, ముప్ఫై వేల రూపాయలైనా అప్పు చేస్తాను అనే కదా? కాని ఈ వాక్యంలో కామాను పెట్టకపోతే “ఇరవై వేలు మాత్రమే అవసరమయినా అంతకంటె పది వేలు యెక్కువగా అప్పు చేస్తాను” అనే భిన్నమైన అర్థం రాదా?!

ఆధునిక వచన కవితా పంక్తుల్లో కామా, ఫుల్ స్టాప్, ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం మొదలైన చిహ్నాలను పెట్టకపోవటమే మంచిదనే వొక అభిప్రాయం స్థిరపడిపోయింది. కాని కొన్ని సార్లు అవసరమైన చోట కొన్ని గుర్తుల్ని పెట్టకపోతే భావం అర్థం కాక, గందరగోళం నెలకొనే ప్రమాదం వుంది. ఉదాహరణకు ఈ కవితా పంక్తుల్ని పరిశీలించండి.
బయట వొక చెట్టు
బాగా కురుస్తున్న వెన్నెల్లో
వేడి నిట్టూర్పుల వడగాడ్పులు
కలత చెందే మనసు లోపల
ఒక అసంబద్ధ సమ్మిశ్రణం మనసును చిత్రవధ చేస్తూ –

ఇందులో మొదటి పంక్తిలో ఒక భావం, తర్వాతి రెండు పంక్తుల్లో ఒక భావం, చివరి రెండు పంక్తుల్లో మరో భావం ఉందనుకోవాలా, లేక మొదటి రెండు పంక్తుల్లో ఒక భావం, తర్వాతి రెండు పంక్తుల్లో ఒక భావం, చివరి పంక్తిలో ఒక భావం ఉందనుకోవాలా? ఎందుకంటే ఆధునిక వచన కవితా శిల్పం యెన్నో కొత్త పుంతలు తొక్కి, వాక్యాలను వ్యతిరేక క్రమం (Reverse order) లో రాయటం ఈ రోజుల్లో మామూలు అయిపోయింది. మొదటి పంక్తిలోనే ఒక భావం అయిపోతే ఆ పంక్తి చివర, అంటే ‘చెట్టు’ తర్వాత ఒక అడ్డుగీత – రెండు హైఫన్లంత నిడివి ఉన్నది – పెట్టాలి. అట్లా కాదంటే రెండవ పంక్తిలోని ‘వెన్నెల్లో’ తర్వాత ఒక అడ్డుగీత, నాలుగవ పంక్తిలోని ‘లోపల’ తర్వాత ఒక అడ్డుగీత, లేక చుక్క పెట్టాలి. గందరగోళానికి తావిస్తాయనిపించే పంక్తుల చివర ఫుల్ స్టాప్ పెట్టకుండా కవిత్వం రాసినప్పుడు అయోమయం చోటు చేసుకోవటానికి అవకాశముంది. ఇంగ్లిష్ కవితలలో ఒక భావం ముగిసింతర్వాత ఫుల్ స్టాప్ పెడుతున్నారు. అదే విధంగా తెలుగు వచన కవితలలో కూడా అవసరమైన కొన్ని చోట్ల ఫుల్ సాప్ (చుక్క) పెట్టే పద్ధతి రావాలని ఈ వ్యాసకర్త అభిప్రాయం. కవిత్వం పూర్తి స్పష్టంగా ఉండకూడదు కనుక చుక్క పెటట్టకపోవటమే మంచిది అని వాదించే వాళ్లూ వుంటారు. అటువంటి వాళ్లకు ఓ నమస్కారం.

కవిత్వంలో భావం చాలా గొప్పదైనప్పుడు పదాలు ప్రాధాన్యం కోల్పోతాయన్నది పరిశీలన తర్వాత యేర్పడ్డ భావన. ఒక సార్వజనీనమైన ప్రపంచస్థాయి కవితా భావాన్ని వ్యక్తీకరించేటప్పుడు ప్రత్యేకమైన పదాలను గుప్పించకపోయినా అంతిమ ప్రభావంలో అంత తేడా రాదు. కాని దీన్ని ఒప్పుకుంటూనే పదాల క్రమం మాత్రం ఏ సందర్భంలో కూడా ప్రాధాన్యాన్ని అసలే కోల్పోదు అని చెప్పాల్సి వుంటుంది. కేవలం కవిత్వంలోనే కాదు, వచన రచనల్లో కూడా ఈ పదాల క్రమం చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఈ పదాల సరైన క్రమం రచనకు నిర్దిష్టతను ఆపాదిస్తుంది.

ఒక వాక్యంలో కేవలం ఒక అక్షరానికి కొమ్మును తగిలించటంతోనే ఆ వాక్యం లోని అర్థం పూర్తిగా మారిపోయే సందర్భాలూ వుంటాయి. ఉదాహరణకు “ఆ యింటికి ఒక్కడూ పోడు” అన్నప్పుడు ఒక్కడు కూడా (Not even one person) వెళ్లడు అని భావం. కాని ఆ యింటికి ఒక్కడు పోడు అన్నప్పుడు ఇతరులు పోతారు కాని ఒక్క వ్యక్తి మాత్రం వెళ్లడు అని అర్థం. ‘క్క’ ను ఒత్తి పలుకుతూ ‘ఒక్కడు పోడు’ అనే వాక్యాన్ని ‘ఒక్కడు కూడా పోడు’ అనే అర్థం వచ్చేలా చెయ్యొచ్చును. దీన్నే కాకువు అంటారు. కాని రాయటం ద్వారా అట్లాంటి అర్థాన్ని స్ఫురింపజేయలేము.

సంభాషణకి, భావనకి, ప్రణాళికకి – ఇట్లా దాదాపు ప్రతి పదానికీ ‘కి’ అనే అక్షరాన్ని తగిలించడం, అదేవిధంగా మనసుని, పడవని, గడపని, అంటూ ‘ని’ అన్న అక్షరాన్ని తగిలించటం సుమారు రెండు మూడు దశాబ్దాల క్రితంనుండే ఎక్కువగా గమనిస్తున్నాం మనం. సాధారణంగా అకారాంత, ఉకారాంత పదాలకు కు, ను (ఉదా: సంభాషణకు, భావనకు, మనసును, పొడవును), ఇకారాంత పదాలకు ని, కి (ఉదా: ఆర్తిని, మనిషిని, మనవికి, ధరణికి) వాడాలనేది నియమంగా ఉండేది. కాని ఈ నియమాన్ని ఉల్లంఘిస్తూ కొత్త రకంగా రాయడం పట్ల ఈ వ్యాసకర్త అసంతృప్తిని వెలిబుచ్చటానికి, వ్యాకరణపరమైన అపసవ్యత కంటె ఉచ్చారణలో ధ్వనించే ఎబ్బెట్టుతనమే ఎక్కువ బలమైన కారణం. ఒక పదాన్ని పలుకుతున్నప్పుడు లేక వింటున్నప్పుడు అది శ్రవణ సుభగంగా, హాయిగా లేకపోతే, ఆ పదం వ్యాకరణపరంగా ఎంత దోషరహితమైనదైనా దాన్ని తలమీద పెట్టుకుని ఆదరించవలసిన అవసరం లేదనిపిస్తుంది. ఉదాహరణకు, ఛందోబద్ధమైన పద్యాల్లో అప్డు అనే పదాన్ని వాడుతారు పద్య కవులు (‘అప్పుడు’కు రూపాంతరంగా). ఇదేం పదంరా బాబూ అనుకుంటూ ప్రామాణిక నిఘంటువుల్లో వెదికితే, వాటిలో అది కాలరెత్తుకుని దర్జాగా దర్శనమిస్తుంది. శాస్త్రం అనుమతించినంత మాత్రాన అటువంటి వికృతమైన పదాలను – నిఘంటువుల్లో ఉన్నా సరే – ఎట్లా వాడుతాం?!

ఇంత చిన్నచిన్న విషయాలకు ప్రాధాన్యమివ్వవలసిన అవసరముందా? ఆ విధంగా రాయకపోతే వచ్చే పెద్ద నష్టమేమిటి? అనే ప్రశ్నలు ఉదయించవచ్చు. దీనికి సమాధానమేమంటే, నిజంగానే అంత పెద్ద నష్టమేమీ ఉండకపోవచ్చు కాని, భాష బాగా తెలిసినవాళ్లు లోలోపలే చిన్నగా నవ్వుకోవటం జరగవచ్చు!అది చాలదా? ఈ వ్యాసంలో చెప్పిన జాగ్రత్తలన్నిటినీ పాటిస్తే కవిత్వంలో కానీయండి వచన రచనల్లో కానీయండి స్పష్టత, సవ్యత, సూటితనం చోటు చేసుకోవటానికి అవకాశముంటుంది.

భాషాసవ్యతను సాధించడానికి ఒక పరిమితి అంటూ లేదేమో. ఆ దిశలో ఎంతగా ప్రయత్నం చేసినా ఏదో ఒక పదం తాలూకు కచ్చితత్వం గురించి అనుమానం వస్తూనే ఉంటుంది. నిఘంటువుల సహాయం, భాష బాగా తెలిసినవాళ్ల సహాయం తీసుకోవడమే దీనికి సరైన మార్గం. ఇక వ్యాకరణం కూడా సముద్రమంత విస్తారమైనది. ప్రసిద్ధులైన మహామహా పండితులకే భాషాదోషాలు తప్పని సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనా భాషాసవ్యత పట్ల ఆసక్తినీ శ్రద్ధనూ చూపడం వల్ల రచనారంగంలో ఉన్నవారికి మేలే జరుగుతుంది తప్ప హాని జరగదు.

(అయిపోయింది)

***