కథ

అరచేతి చాటు సూర్యుడు

ఆగస్ట్ 2014

“ఆ ఫైల్ పని పెండింగ్ ఉండిపోయిందన్నారు కదా. నేను ఖాళీగానే ఉన్నాను సార్. చేసెయ్యనా?!” దివాకర్ అడిగాడు.

నాకు అతని ప్రశ్న ఆనందం కలిగించడానికి బదులుగా చికాకు కలిగించింది. పైకి నా ముఖ కవళికల్లో మార్పు కలిగించకుండా, “థ్యాంక్స్ దివాకర్!” అంటూ పెండింగ్ ఫైల్ అతని చేతికి అందించాను.

అగ్నికి ఆజ్యం తోడవ్వడం అంటే ఏమిటో నాకు స్వయంగా ఈ మధ్యనే అనుభవం అవుతోంది.

నేను మా ఆఫీసులో గుమాస్తాగా చేరి ఏడేళ్ళు కావస్తోంది. అంతో ఇంతో బాగానే పని చేస్తాడన్న పేరు కూడా సంపాదించుకున్నాను. కానీ అందరిలాగే నాకు కూడా జూనియర్ ఆఫీసర్ కావాలనే కోరిక కూడా ప్రబలంగా ఉంది. రెండేళ్ళ సర్వీసు దానికి అర్హత కావడంతో గత అయిదేళ్ళుగా నా పదోన్నతి కోసం నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. ప్రతి ఏడాదీ తప్పకుండా నేను ఎక్కాలనుకున్న మెట్టు ఎక్కెయ్యడం ఖాయం అనుకోవడం, ఫలితాలు ప్రకటించేటప్పటికి నా పేరు జాబితాలో లేకపోవడం రివాజుగా మారింది.

అందని ద్రాక్ష పుల్లనిదేలే అని ఎంతగా సరిపెట్టుకుందామన్నా ఆ వ్రేలాడే ద్రాక్షను అలానే చూస్తూ ఉండలేం కదా. అందుకే అందని ద్రాక్షలా ఉన్న ఆ ప్రమోషన్ను ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న కోరిక నాలో మరింతగా పెరిగిపోతున్న దశలో తిరుపతినుండి బదిలీపై ఏడు మాసాల క్రితం వచ్చాడు దివాకర్. వస్తూనే అందరినీ ఆకట్టుకునే మాటతీరు, చకచకా చక్కబెట్టే పనితీరు, అంతకు మించి అందరి దగ్గరా నమ్రతగా ఉండే ప్రవర్తన అతన్ని ఆఫీసులో అందరి మన్ననలు పొందేలా చేసాయి. పైగా ఏ విషయానికి సంబంధించిన విషయాన్నైనా అతను అవలీలగా చెప్పెయ్యడం, కేవలం మూడేళ్ళ సర్వీసుకే అతని అపారజ్ఞానం నాలో అతని  పట్ల మొదట్లో కలిగిన అభిమానం స్థానంలో అసూయను పెంచుతూ వచ్చాయి. అంతకు ముందు వరకూ మా పెద్ద సారుకు అతి దగ్గరివాడిగా ఉన్న నా స్థానాన్ని దివాకర్ క్రమంగా భర్తీ చేస్తూ ఉండడం కూడా నా ఈర్ష్యను మరింత పెంచింది.

పైగా దివాకర్ ప్రభుత్వ నియమాలననుసరించి ఉద్యోగం పొందిన తక్కువ కులం వాడు. అన్నీ కలిసి వస్తే ఈ ఏడాది తప్పకుండా పదోన్నతి సాధించడంలో ఏ మాత్రం అనుమానం కూడా లేదు. ఇవన్నీ అగ్నికి ఆజ్యం తోడవడం కాక మరేమిటి?

“సార్!” దివాకర్ పిలిచాడు.

ఫైల్లో తలదూర్చి ఈ ఆలోచనల్లో మునిగిపోయి చాలా పరిశీలనగా దాన్ని చూస్తున్నట్టు నటిస్తున్న నేను, విసుగ్గా ముఖం పెట్టి నోరు విప్పకుండానే ‘ఏమిటి?’ అన్నట్టుగా చూసాను.

“నిన్న మనకో సర్క్యులర్ వచ్చింది చూసారా?” దివాకర్ అడిగాడు.

“లేదు దివాకర్. చూడలేదు. ఈ మధ్య పని ఎక్కువగా ఉంటోంది కదా!” నిజానికి నా పనిలో సగభాగం అతనే పంచుకుంటున్నా ఏదో ఒకటి చెప్పాలి కదా!

“మన ఆఫీసు కార్యకలాపాల పైన, ప్రభుత్వ ఉత్తర్వులపైన గుమాస్తాలకు క్విజ్ పెడుతున్నారట.” ఉత్సాహంగా చెప్పాడు దివాకర్.

“అయితే ఏమిటి? దానివల్ల మనకు పెద్ద ఉపయోగం లేదు కదా. అది ప్రమోషన్ లాంటిదేమీ కాదు కదా!” కొంచెం విసుక్కుంటూ చెప్పాను, అదేమీ గొప్ప వార్త కాదన్నట్టు.

“లేదు సార్. అది మనకు పనికొచ్చే విషయమే! ఆఫీసు పనిలో మునిగిపోయి మనం ప్రమోషన్ పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్ కాము కదా. కానీ ఈ క్విజ్ లో పాల్గొనేందుకు మనం చదువుకోవడం వల్ల అది సాధ్యపడుతుంది. జిల్లా స్థాయిలో మనం గెలిస్తే రాష్ట్రస్థాయికి ఎంపిక అవుతాం. అక్కడ గెలిచి క్విజ్ ప్రారంభించిన తొలిసంవత్సరమే కప్పు సాధించామనుకోండి. మనకు ఎంత సంతోషంగా ఉంటుందో ఆలోచించండి. ఎలాగూ మన ఆఫీసు కూడా గెలవాలని కోరుకుంటారు కాబట్టి బాస్ కూడా మనకు చదువుకునే సమయం ఇవ్వకపోరు. దీని వల్ల దెబ్బకు రెండు పిట్టలు. మన ప్రమోషన్ ప్రిపరేషన్ కూడా ఒకేసారి అయిపోతుంది.”
రెట్టించిన ఉత్సాహంతో చెప్పిన దివాకర్ మాటలకు ఆశ్చర్యంతో నివ్వెరపోయాను.

నిజానికి నేను కూడా నిన్న ఆ క్విజ్ కి సంబంధించిన సర్క్యులర్ చూసినా ఎందుకు పని చేస్తుందిలే అని పక్కన పెట్టేసాను. ఎంత దూరాలోచన దివాకర్ ది!

“కానీ ఇప్పుడు ఆ సర్క్యులర్లు, జీ ఓ లూ అన్నీ తిరగెయ్యాలంటే కష్టం కదా దివాకర్!” అయిష్టాన్ని ప్రకటించాను.

“సార్, మీకెంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు. తెలివైన వారు. ఈ ఆఫీసులో మనమిద్దరమే గుమస్తాలం. ఆఫీసుకు ఇదరు చొప్పున ఒక జట్టుగా వెళ్ళాలి కాబట్టి మనమిద్దరం వెళితే మన ఇద్దరికీ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. జీ ఓ లు, సర్క్యులర్ల లోంచి ముఖ్యమైన విషయాలను నేను ఎప్పటికప్పుడు నా పుస్తకంలో రాసుకుంటున్నాను. అది చదువుకుంటూ కొత్తగా వచ్చే విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ ఉంటే చాలు. మనకు విజయం ఖాయం!”
అప్పుడే ప్రణాళిక రచించేసాడు దివాకర్.

“ఏమైనా నీ అంత చాకులాంటి వాడిని కాదు కదా దివాకర్! నేను నీ అంత బాగా చదవకపోతే నా వల్ల నీకూ ఇబ్బందేమో!” ఇలా ముందే చెప్పేస్తే ఆ తర్వాత క్విజ్ లో ఓడిపోయినా నెపం అతని పైన తోసెయ్యవచ్చు కదా!

“అలా ఏమీ లేదు సార్. ఇద్దరం కలిసే విషయాలను చర్చిద్దాం. మన జీ ఓ లకు, ఆఫీసుకు సంబంధించిన విషయాలను దాటి వాళ్ళు కొత్తగా అడిగేవి ఏమీ ఉండవు కదా. పైపెచ్చు మీ సీనియారిటీ కూడా మనకు ఎంతో లాభిస్తుంది. వచ్చే ప్రమోషన్ టెస్టుకు కూడా చాలా ఉపయోగపడుతుంది.” నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తూ చెప్పాడు దివాకర్.

“సరే మరి. చిన్నవాడివి. నీకు బాగా పనికొస్తుందని ఒప్పుకుంటున్నాను దివాకర్.” నా పెద్ద మనసు చూపించేసాను!

“థ్యాంక్ యూ సర్. మన ఇద్దరి పేర్లూ పంపించమని బాస్ కి చెప్దాం!” సంతోషంగా చెప్పాడు దివాకర్.

ఆ తర్వాత మూడు నెలలూ యంత్రంలా పని చేసాడు దివాకర్. అటు ఆఫీసులో పని త్వరత్వరగా పూర్తి చేస్తూ, మధ్యలో నాతో మాట్లాడేటపుడు క్విజ్ కి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ, జీ ఓ ల గురించి చర్చిస్తూ ఉండేవాడు. నిజం చెప్పాలంటే ఈ మూడునెలల కాలంలోనూ నాకు తెలియని ఎన్నో విషయాలు అతనినుండి నేర్చుకున్నాను.  ఆఫీసుకు సంబంధించి ఇన్ని రూల్స్ ఉన్నాయా అని అచ్చెరువు కూడా చెందేవాడిని.  అయినా కూడా దివాకర్ ధోరణి మాత్రం ఎప్పుడూ వినయంగానే ఉండేది. అందుకు తగ్గట్టుగా నేనూ నా దర్పాన్ని బాగానే ప్రదర్శిస్తూ ఉండేవాడిని.

తెలియకుండానే గడిచిపోయిన మూడు నెలల కాలం ఆఫీసుకు సంబందించిన అన్ని విషయాలలోనూ నాకు ఎంతో జ్ఞానాన్ని సమకూర్చి పెట్టడంతో పాటు, మా ఆఫీసుకు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని కూడా క్విజ్ లో దక్కేటట్టుగా చేసింది. రాష్ట్రం నలుమూలలనుండి అభినందిస్తూ వచ్చే ఫోన్లు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని చవి చూపించాయి. గెలుపులో ఉండే మజా ఏమిటో తెలియజేసాయి.

అలా ఆనందిస్తుడగా ఒక రోజు బాస్ మా ఇద్దరినీ తన రూంలోకి పిలిచాడు.

“పృథ్వీరాజ్ గారూ, దివాకర్! మీ ఇద్దరినీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులనుండి నన్ను అభినందిస్తూ ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. మీ కారణంగా ఈ సారి నా ప్రమోషన్ ఖచ్చితంగా ఖాయమే అని నమ్మకం వచ్చేసింది. ఈ రోజు సాయంత్రం గ్రీన్ పార్క్ హోటల్లో మీ ఇద్దరికీ డిన్నర్ పార్టీ ఇస్తున్నాను. మీ కుటుంబాలతో తప్పకుండా రండి!” సంతోషం ఉప్పొంగుతున్న ముఖంతో చెప్పాడు బాస్.

ఆనందంగా నవ్వుకుంటూ దివాకర్ తో పాటు బైటకు వచ్చానే కానీ  ఇదంతా అతని వల్లనే అని నా మనసు మాత్రం ఒప్పుకోలేకపోయింది. నా అనుభవం కూడా తోడవ్వడం వల్లనే మేము గెలిచామనే నా అహంకారం ఆ క్షణమే కాదు, ఆ తర్వాత కూడా ఎప్పుడూ నన్ను వదిలేది కాదు.

ఒక వారం తర్వాత మరో వార్త మోసుకొచ్చాడు దివాకర్. “సార్ ప్రమోషన్ టెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది! మీరు ఈసారి తప్పకుండా బాగా ప్రిపేర్ కావాలి.” ఉత్సుకతతో చెపుతూ నా చేతినందుకుని ఊపుతూ చెప్పాడు.

“ఏమో దివాకర్. నీకైతే రావడం ఎలానూ ఖాయం. ‘మాకు ‘ రావాలంటే కొంచెం కష్టమయ్యా!” అన్నాను నర్మగర్భంగా.

నా ధ్వనిని అర్థం చేసుకోలేనంత అమాయకుడేమీ కాదు దివాకర్. “తెలివైన వారు. మీరు కూడా అలా అనుకుంటే ఎలా సార్, తప్పకుండా బాగా ప్రిపేర్ అవ్వండి. ఈసారి మీకు పదోన్నతి తథ్యం!” అని నవ్వుతూ ఎలా అనగలిగాడో నన్ను ఆశ్చర్యపరుస్తూ.

కొద్ది రోజుల ముందే క్విజ్ కి వెళ్ళి రావడం వల్ల ఈసారి ప్రమోషన్ టెస్ట్ కి సిద్ధపడడం నాకు నల్లేరు మీద బండిలానే అనిపించింది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలనూ దివాకర్ చర్చిస్తూ కూడా ఉండడం నాకు చాలా ఉపయోగపడింది.

మరో పదిరోజుల్లో పరీక్ష జరుగుతుందనగా నాలో అదో విధమైన అసూయ మళ్ళీ పెచ్చరిల్లిపోయింది.  నాకన్నా వయసులో, అనుభవంలో చిన్నవాడైనా  నాకంటే దివాకర్ కే ప్రమోషన్ వచ్చేందుకు అవకాశముందన్న సత్యం నన్ను మరింత దహింపచేసింది. అందుకే ఆ రోజు దివాకర్ తో చెప్పాను, “దివాకర్ నాకు కొంచెం వేరే పని ఉంది. నువ్వు బయల్దేరు.”

“ఇవ్వండి సార్. చేసేద్దాం.” అన్నాడు ఎప్పటిలా దివాకర్.

“వద్దులే. నువ్వు వెళ్ళు.” నేను ముక్తసరిగా అనెయ్యడంతో దివాకర్ వెళ్ళిపోయాడు.

ఆఫీసు స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. బాస్ ఒక్కడే పని చేసుకుంటున్నాడు. ఇదే అవకాశం. లోపలికి వెళ్ళాను.

తలెత్తి చూసిన బాస్ నవ్వుతూ “కూర్చోండి పృథ్వీరాజ్! ఎలా సాగుతోంది మీ ప్రిపరేషన్?!”

“ఏదో అలా అలా సాగుతోంది సార్. ఆ విషయమే మీతో మాట్లాడదామని వచ్చాను.” నెమ్మదిగా విషయాన్ని చెప్పాను.

“సరే, ఏమిటో చెప్పండి.”

“కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఇవాళ పంపిస్తున్నారు కదా సార్!”

“అవును.”

“మీకు తెలియనిదేముంది సార్. గత అయిదేళ్ళుగా కుస్తీలు పడుతున్నా నా ప్రమోషన్ ఎప్పటికప్పుడు నన్ను ఊరిస్తూనే ఉంది. ఈసారి మీరు కొంచెం సహాయం చేస్తే గట్టెక్కిపోతాను.” దీనమైన స్వరంతో చెప్పాను.

“అయ్యో. మీరంతగా చెప్పాలా? మీకు మంచి మార్కులే వేసాను.” భరోసా ఇచ్చాడు బాస్.

కానీ నాకు ఆ భరోసా ఎలా సరిపోతుంది?

“అది కాదు సార్. దివాకర్ ఎలానూ చాకులాంటి కుర్రాడు. తనకి ఈసారి కాకపోతే మరోసారి ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుంది. పైపెచ్చు కుర్రాడికి ‘కోటా’ కూడా ఉంది కదా. అందుకని మీరు రిపోర్టులో వేసే మార్కుల్లో అతని కంటే ఓ పదిహేను మార్కులు నాకు ఎక్కువ వేస్తే… మీ ఋణం ఉంచుకోను!” విషయాన్ని బైట పెట్టేసాను.

ఒక్క క్షణం బాస్ నిస్తేజుడై చూసాడు. మరుక్షణంలోనే తేరుకుని చెప్పాడు “కానీ పృధ్వీరాజ్ గారూ. అది అంత సబబు కాదేమో కదండీ!”

“అలా అనుకోకండి సార్. ‘వాళ్ళు ‘ ఇలానే అడ్డూ అదుపూ లేకుండా పైకొచ్చేస్తూ ఉంటే రేపు మనకే బాసులై కూర్చుంటే ఎంత తలవంపులుగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి! పైగా ఎంతైనా ‘మనం మనం’ ఎప్పుడైనా ఒక్కటే కదా సార్.” మాటలతోనే బాసును గిల్లాను.

నా ఎత్తుగడ ఫలించింది. ఋణం ఉంచుకోనని అని భరోసా ఇవ్వడం, మనం మనం ఒకటే అని చెప్పడం బాస్ మీద బాగానే ప్రభావం చూపించాయి. అప్పటికప్పుడే మా ఇద్దరి రిపోర్ట్స్ నాకు చూపించి మరీ కవర్లను పైకి పంపించాడు.

మరో నెల తర్వాత ఫలితాల కోసం ఆత్రుతగా  ఎదురుచూస్తున్నాం. ఆఫీసు ఫోన్ మ్రోగింది! శుభవార్త వచ్చేసింది అనుకుంటూ నా మనసు ఆనందంతో గంతులు వేసింది. పక్కనే కూర్చున్న దివాకర్ కూడా ఫొన్ ఎత్తిన బాస్ వైపే చూస్తున్నాడు! ఉద్వేగం అణచుకోలేక ఇద్దరమూ ఆయన దగ్గరకు వెళ్ళిపోయాం.

“ఓ అలానా! చెప్తాను సార్! ఓకే సార్ పిలుస్తున్నా! దివాకర్, కంగ్రాట్స్! హెడ్డాఫీస్ బాస్ లైన్లో ఉన్నారు. రండి.” అన్న బాస్ మాటలు నా నెత్తిన పిడుగులు పడ్డట్టుగా తోచాయి.

దివాకర్ వెళ్ళి ఫోన్లో మాట్లాడాడు. ఆనందంతో అతని ముఖం వెలిగిపోతోంది. ఫోన్ పెట్టాక అతను బాసును అడిగిన మొట్టమొదటి మాట- “సార్, పృథ్వీ సార్ గారికి కూడా తప్పకుండా ప్రమోషన్  రావాలి. ఏం చెప్పారు వాళ్ళు?”

“సీనియర్స్ వి వచ్చేందుకు సాయంత్రం వరకూ టైముందట. సరే, మీ శుభవార్తను మాకు సెలబ్రేట్ చెయ్యరా?” చెయ్యి చాచి అందించి దివాకర్ చేతిని పట్టుకుని అబినందిస్తూ అడిగాడు.

“కంగ్రాట్స్ దివాకర్!” హీనమైన స్వరంతో చెప్పాను.

“థ్యాంక్ యూ సార్. మీవి కూడా కాసేపాగి తెలిసిపోతాయిలెండి.{ అని నాకు ధైర్యం చెప్పి బాస్ వైపు తిరిగి, “ఎంత మాట! ఉండండి సార్, స్వీట్స్ తీసుకొస్తాను.” అని బైటకు సంతోషంగా పరుగు పెట్టాడు దివాకర్.

“మీరు చెప్పింది నిజమేనా సార్?” నా ఆశ ఇంకా చచ్చిపోలేదు!

“చిక్కుల్లో పడ్డాం పృథ్వీరాజ్ గారూ! కాన్ఫిడెన్షియల్  రిపోర్ట్ లో మీకు ఇచ్చినట్టుగా అన్ని ఎక్కువ మార్కులు ఎవ్వరికీ పడలేదట. ఎంక్వైరీ పెడుతున్నారు!” నీరసంగా చెప్పాడు బాస్.

నా కళ్ళ ముందు చీకటితెరలు నాట్యం చేస్తున్నాయి.

*** * ***

(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)6 Responses to అరచేతి చాటు సూర్యుడు

 1. G.S.lakshmi
  August 1, 2014 at 10:54 pm

  మనుషులు పైకి ఒకలాగ, లోపల ఒకలాగ వుంటారన్న విషయాన్ని బాగా చూపించారు రాజేష్.. అభినందనలు.

 2. Rajesh Yalla
  August 2, 2014 at 7:43 am

  ఆటా “అక్షర” వార్షిక సంచికలో ప్రచురితమైన ఈ కథను “వాకిలి” పత్రికలో కూడా అందరూ చదివేందుకు వీలుగా ప్రచురించినందుకు ధన్యవాదాలు.

 3. August 2, 2014 at 10:03 am

  రాజేష్ గారూ, కథాంశం తెలిసినదే. అయితే మీ కథనం, శిల్పం చాలా బాగుంది. అభినందనలు.

 4. janakipadhuka
  August 6, 2014 at 4:32 pm

  చాలా బాగుంది.. రాజేష్

 5. Rajesh Yalla
  August 15, 2014 at 10:44 pm

  ధన్యవాదాలు సుబ్బలక్ష్మి గారూ, రాధ మండువ గారూ, జానకి గారూ!

 6. ఆర్.దమయంతి
  August 28, 2014 at 10:21 am

  మనలో మనకే తెలీని అనేకానేక భేదాలుంటాయన్న గుట్టుని రట్టు చేసారు రాజేశ్..
  :-)
  బావుంది కథ. బహుమతి కొట్టేసినందుకు అభినందనలు .

మీ అభిప్రాయం రాయండి

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)