వ్యాసాలు

సాహిత్య సౌరభానికి కాలం చెల్లుతోందా?

ఆగస్ట్ 2014

అసలెవరైనా పుస్తకాలెందుకు చదువుతారు?

ముఖ్యంగా ఫిక్షన్ ఎందుకు చదువుతారు” అనే ప్రశ్న ఎప్పుడూ వేసుకోవాలని తోచదు. కానీ రచయిత సొదుం రామ్మోహన్ దీనికి ఇలా చెప్తారు ఒక వ్యాసంలో!

“నా జీవితం సంగతి నాకెరుకే. ఇతరుల జీవితాలు ఎలా ఉన్నాయో? జీవితం, సమాజం పట్ల నాకు కొంత అవగాహన, కొన్ని అభిప్రాయాలు ఉన్నై. ఇతరులకెలా వున్నాయో? … ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు సమాధానాలు రాబట్టుకోడానికి చదువుతారు కొందరు.

ఒక పుస్తకం చదవటం మూలంగా, తమ విజ్ఞానం విస్తరిస్తే ఆ సాహిత్యానికి ప్రయోజనమున్నదని, అది చదవడం మూలంగా తామూ ప్రయోజనం సాధించామని అనుకుంటారు కొందరు. తనకు అంతకుపూర్వం తెలియని సామాజిక వాస్తవాలను కథలోనో, కవిత్వం లోనో గ్రహిస్తే అది ప్రయోజనం ఉన్న కథ, లేక కవిత్వం అనుకుంటారు ఇంకొందరు. పాఠకుని మెదడులోకి సామాజిక బాధ్యతని ఇంజెక్ట్ చేసేదే సరైన సాహిత్యమని మరికొందరనుకుంటారు. తమ సంస్కారం, చైతన్యం పెరగడానికి ఏమాత్రం దోహదం చేసినా అది ప్రయోజనాత్మకమైన సాహిత్యమే అనుకుంటారు ఇంకొందరు.”ఇన్ని కారణాలుంటాయన్నమాట చదవడానికి! ! భాషతో సంబంధం లేకుండా మన దేశంలో, ముఖ్యంగా మన దేశంలో, పుస్తకాలు…. ముఖ్యంగా కాల్పనిక సాహిత్యం , కవిత్వం చదివే వారి సంఖ్య బాగా తగ్గి పోయింది. అయితే మన పరిథిని కొంత కుదించి తెలుగు కాల్పనిక సాహిత్యం చదువరులు తగ్గి పోవడం గురించి చర్చించుకుందాం !

ఒకప్పుడు తెలుగు కాల్పనిక సాహిత్యాన్ని చదివే వాళ్ళు ఉండి ఉండవచ్చు కానీ క్రమ క్రమం గా ఆ పరిస్థితి కళ్ళ ముందే మారి పోయి కాల్పనిక సాహిత్యం చదివే పాఠకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
దీనికి సవాలక్ష కారణాలు. దానికి కారణమేంటి దీనికి కారణమేంటీ అని అన్నిటికీ కారణాలు వెదుక్కోడమే తప్ప పరిష్కారాలు ఆలోచించడం వదిలి పెట్టి, అదాటున ప్రవాహమెంట కొట్టుకెళ్ళి పోవడం మనకు అలవాటై చాలా రోజులైంది. కాబట్టి కొంతలో కొంత ఇప్పుడు నేను కూడా అదే పని చేయబోతున్నా!

రెండు తరాల మధ్య అంతరానికి 25 ఏళ్ళు వేసుకున్నా, ముందు తరంలో తెలుగు సాహిత్యానికి జన జీవనంలో ఒక ఉన్నతమైన స్థానం ఉండేది. సాహిత్యాభిమానాన్ని పెంచుకోవడం విద్యార్థులకు ఎవరూ గుర్తు చేయక్కర్లేని బాధ్యత గా ఉండేది. అలాగే ఎక్కువగా తెలుగు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఇతర సాహిత్యాభిమానులు సభ్యులు గా ప్రతి టౌన్ లోనూ సాహిత్య సంఘాలు ఉండేవి. అభ్యుదయ భారతి, కళా భారతి, యువ భారతి, , రస మయి, సాహిత్య దీపిక , ఫలానా సాహిత్య పీఠం వంటి పేర్లు విన్నపుడు 90 ల వరకూ ఉత్సాహంగా నడిచిన ఆ సాహిత్య సేవా సంఘాలు గుర్తొస్తాయి. సాహిత్య చర్చలు ప్రతి చోటా జరిగేవి. జిల్లా గ్రంథాలయ సంస్థలు కూడా అందుకు వేదికలు గా నిలుస్తూ గొప్ప పాత్రే పోషించాయి.

అన్నింటిలోనూ మార్పు అనివార్యమైనట్లే ఈ పరిస్థితిలోనూ మార్పు వచ్చింది.

సాహిత్యాన్నిఆస్వాదించడం అనేది జీవితంలో తిండి, నిద్ర లాగా ఒక భాగం ఐతే తప్ప అందులోని ఆనందం అర్థం కాదు ! ఆకలి తీరినపుడు, సుఖమైన నిద్ర తర్వాత కలిగే సంతృప్తే మంచి పుస్తకం చదివినపుడు కలుగుతుంది. మీలో చాలా మందికి ఇది స్వానుభవమే!

అయితే పఠనాభిలాషలో వచ్చిన మార్పు వల్ల ఫిక్షన్ కి ఉన్న ఆదరణను తగ్గించేసింది. దీనికి కారణాలు అనేకం ఉన్నా, ఉరుకులు పరుగుల జీవితాల్లో “టైము లేక పోవడం”అనేది ప్రధాన కారణం. మిగతా కారణాల్లో ముఖ్యమైనవి

1.వాతావరణం చదివే వాతావరణం ఇంట్లోనో స్కూల్లోనో ఉంటే పిల్లలకు ఆ అలవాటు త్వరితంగా అబ్బుతుంది. అయితే ఇప్పుడు స్కూళ్ళలో ఉన్న పరిస్థితి ఏమిటంటే ఏది చదివినా అది కెరీర్ కి ఉపయోగపడేలా ఉండాలి. అయితే సబ్జెక్టు, లేదా వ్యక్తిత్వ వికాసం! రెండే ఆప్షన్లు
విద్యార్థుల జీవితాల్లో నవలలకు, కవిత్వానికి చోటు లేదు.అసలవేంటో వాళ్లకు తెలీదు.కొత్త ఊహలు రెక్కలు తొడగడానికి, మెదడులో మనసులో సృజన రేకెత్తడానికి అవకాశాలు పూర్తిగా మృగ్యం! ఇప్పుడు విద్యార్థులుగా ఉన్న వారి తల్లి దండ్రులు ఎంతో కొంత ఫిక్షన్ చదివి ఉన్నా, అది కాలక్షేపానికి తప్ప పనికి రాదనే అభిప్రాయంలో ఉంటున్నారు.కవిత్వం అంటే పిల్లలకు అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థంగా నిర్వచించి ఉంచిన తల్లి దండ్రుల్ని ఏమనాలో తోచదు. “అది నీకు అర్థం కాదు” అనో “అది నీ వయసుకు అర్థమయ్యే పుస్తకం కాదు” అనో వారి నోటివెంట వచ్చే మాటలు పిల్లల్లో దాని పట్ల ఆసక్తి మొలకెత్తుతున్న దశలోనే మాడి పొవడానికి ఉత్ప్రేరకాలు!

2.అనివార్య మైన సాంఘిక రాజకీయ వాతావరణం మారిన విద్యా విధానం వల్ల పదేళ్ళ వయసు నుంచే పిల్లలు వివిధ ఎంట్రన్స్ లకు, ఫౌండేషన్ కోర్సులకు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొని ఉంది ఇవాళ. ఆరో తరగతి నుంచి ఐ ఐ టీ ఫౌండేషన్ కొర్సు లేని ప్రైవేట్ స్కూళ్ళు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి! కెరీరిజం అనేది ప్రధాన దృక్కోణంగా మారింది. ఇతరత్రా పుస్తకాలు నిషేధం! సాహిత్యం పరిచయం కావలసిన వయసులో అది నిషేధమై కూచుంటున్నది ఇవాళ!

3.మరణిస్తున్న మాతృభాష: తెలుగుని ద్వితీయ భాషగా ఎంచుకోవడం విద్యార్థులు మానేసి చాలా రోజులైపోయింది. ఇందులో కూడా తల్లి దండ్రుల ప్రమేయం అనివార్యం! అయితే సంస్కృతం, లేదా మరేదైనా విదేశీ భాష. అవైతే స్కోరింగ్ సబ్జెక్టులు కాబట్టి పర్సెంటేజ్ పెరగడానికి ఉపయోగపడతాయి! చదువులో వెనక పడిన పిల్లలే తెలుగు తీసుకుంటారన్న ఉపాధ్యాయులే చేసే దుష్ప్రచారం మరో వైపు.ప్రాథమికాంశాలు నేర్చుకుని మార్కులు ఎక్కువ స్కోర్ చేస్తారు తప్ప ఆయా విదేశీ భాషల్లో విద్యార్థులకు ఎలాటి ప్రావీణ్యమూ అబ్బక రెంటికీ చెడటం ఇక్కడ అప్రస్తుతం!

4.సాహిత్య పరిచయం నిల్: ఎలాగో ముందడుగు వేసి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ గా తీసుకున్న కొద్ది పాటి విద్యార్థులకూ సిలబస్ చెప్పి సరి పుచ్చడం తప్ప, సందర్భానుసారంగా చమత్కార పద్యాలు, శతకాలు,చాటువులు,సమస్యా పూరణలు వంటివి పరిచయం చేసేంత కళా హృదయంతో ఉపాధ్యాయులు, అధ్యాపకులు లేరు కూడా. అధ్యాపకులై ఉండి వారికే సాహిత్యం మీద అభిరుచి లేక అదొక వృత్తిగా మాత్రమే స్వీకరించిన వారు, ఇక విద్యార్థులకు ఏ విధంగా ఆసక్తి కల్గించగల్గుతారు?

5. ఆర్ట్స్ గ్రూపులు అదృశ్యం : హ్యుమానిటీస్, అనగా ఆర్ట్స్ గ్రూపులు కాలేజీల్లోంచి నెమ్మదిగా నిష్క్రమించడం మొదలయ్యాక ఒక ఊహాత్మక సౌందర్య జీవన విధానం జీవితాల్లోంచి తెలీకుండానే ఆవిరై పోయింది. సాహిత్యం , సాహిత్య చర్చలు ఇవన్నీ విద్యార్థులకు దూరంగా జరిగాయి. తెలుగుని ప్రత్యేక సబ్జెక్ట్ గా తీసుకుని బియ్యే చదివే విద్యార్థులెవరూ ఇపుడు లేరు.సాహిత్యం వల్ల కలిగే మానసిక వికాసానికి ఎలాటి వస్తు విలువా లేనందు వల్ల దాన్ని పనికి మాలిన విషయంగా, “టైం వేస్టు” పనిగా చూడటం అందరికీ చక్కగా వంట బట్టింది.

6.దృశ్య మాధ్యమం కుట్ర : సాహిత్యానికి మహ రాజ పోషకులుగా ఉన్న మధ్య తరగతి ఇంట్లోకి టీవీ ప్రవేశించడం మరో పెద్ద విఘాతం. చదవడం కంటే చూడటానికి శ్రమ తక్కువ కావడమూ, దృశ్యాలను ఊహించుకునే పాటి శ్రమ కూడా లేక పంచ రంగుల్లో కళ్లముందు ఆవిష్కృతం కావడమూ,టీవీ పట్ల ఆకర్షణ పెంచి పారేశాయి.

7. పిల్లలకు తెలుగు మీద ఆసక్తి కల్గించే కార్య క్రమాలు తెలుగు దేశంలో కంటే విదేశాల్లో ఎక్కువగా జరుగుతున్న స్థితిని ఇవాళ కళ్ళారా చూస్తున్నాం. దీన్ని ఒక పక్క మెచ్చుకుంటూనే మరో పక్క విచారించాల్సిన స్థితి! మాతృ భాష మీద ఆసక్తికల్గించాల్సిన పెద్దలే పిల్లని కనీసం మాతృభాష లో మాట్లాడొద్దని నిర్బందిస్తున్న వాతావరణంలో ఈ నేరానికి బాధ్యత ఎవరిని తీసుకోమందాం?

8. పిల్లలు పెద్దయాక ఏ ఉద్యోగాలు చేయాలో తల్లి దండ్రులే నిర్ణయించి అందుకు తగ్గ కోర్సులు,వెతికి వాటిలో చేర్చడం ఒక రొటీన్ గా మారింది. దీంట్లోంచి బయట పడేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు. ఇంటర్నెట్ మీద ఎక్కువ టైము గడుపడానికి , అలవాటు పడిన పిల్లలకు మంచి సాహిత్యం వైపు మళ్ళించ లేక పోవడం తల్లి దండ్రుల వైఫల్యమే !అక్కడ దొరికే తాత్కాలిక ఉల్లాసం కంటే పుస్తకాల్లో శాశ్వత వికాసం ఎక్కువ దొరుకుంతుందని వాళ్ళు పిల్లలకు చెప్పడం లేదంటే అది పిల్లల తప్పు కాదు!

9. సాహిత్య సమావేశాలు: సాహితీ సభలు ఎక్కడైనా జరిగితే ఆ సభ నిర్వాహకులు, కొద్ది సంఖ్యలో ఆహ్వానితులూ తప్ప జనరల్ పబ్లిక్ వచ్చి సమావేశాన్ని ఆనందించే పరిస్థితి లేనే లేదు. రేడియో ఆర్టిస్టు, రచయిత సుధామ గారేమంటారంటే “యువతను సాంస్కృతిక సమావేశాల వైపు ఆకర్షించే పరిస్థితే లేదు. ఏ మీటింగ్ చూసినా అవే మొహాలు, అవే భట్రాజు పొగడ్తలు. ఇహ నేటి కవులు ఎవరికీ అర్థం కాకుండా జటిలంగా తయారు చేసి పాఠకులకు దరి దాపుల్లోకి రాకుండా తరిమేస్తున్నారు.” సుధామ గారి మాటల్ని కాదనగలమా?

సాహిత్యం చదవడం వల్ల కలిగే మానసిక వికాసానికి ఎలా విలువ కట్టగలం? ఇవాల్టి ధన ప్రయోజనాల మీటర్ తో దాన్ని ఎలా కొలవగలం??

దీన్ని ఇల్యా ఎహ్రెన్ బర్గ్ తన “రచయితా-శిల్పమూ” పుస్తకంలో ఇలా వివరిస్తాడు.

ఉదాహరణకు ఒక నవల ఇవనోవ్ అనే అతన్ని గురించి అనుకుందాం! ఇవనోవ్ పాఠకుడి పొరుగింటివాడే అనుకుందాం. ఈ పాఠకుడికి ఇవనోవ్ జీవన విధానం కానీ, ఆకృతి కానీ ఏమీ రహస్యం కాదు.పాఠకుడు చాలా సార్లు చూసి ఉంటాడు, ఎన్నో సార్లు అతను మీటింగుల్లో మాట్లాడ్డం విని ఉంటాడు.ఇంట్లో కూడా ఎన్నో సార్లు మాట్లాడి ఉంటాడు. ఇవనోవ్ ఎంతో పరిచితుడే అయినా అపరిచిత భూమి లాంటి వాడే ! తన పొరుగింటి ఇవనోవ్ ఆలోచనలను, దుఃఖాన్ని, ప్రేమను, పనిని రచయిత చూప గల్గితే పాఠకుడు ఆ పుస్తకాన్ని ముగించగానే తానెంతో తెలుసుకోగలిగానని పాఠకుడు అనుకుంటాడు. ఇవనోవ్ ని తానెంతో అర్థం చేసుకోగలిగానని, ఈ విధంగా తనను తాను కూడా అర్థం చేసుకోగలిగాననీ భావిస్తాడు” ఇదే సాహిత్య ప్రయోజనం!

దీన్ని వినిమయ వస్తు ప్రయోజనంగానో ,వినిమయ సేవ తాలూకు ప్రయోజనం గానో మార్చి చూపిస్తే తప్ప అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఇవాళ మన విద్యార్థులున్నారు. ఇది వారికి అర్థమయ్యేలా వివరించి ఎలా చెప్పగలం? సాహిత్యాన్ని ముట్టుకోక పోవడం వల్ల ఒక చరిత్రను తెలుసుకునే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నామని వారికి తెలీదు.

ఒక జీవిత కాల జీవన సౌందర్యాన్ని తిరస్కరిస్తున్నామని,ఒక ఆనంద మయ జీవన విధానానానికి మొహం చాటేస్తున్నామని,
ఒక అద్భుత ఊహా ప్రపంచపు కిటికీ తలుపులు మూసి వేసి మేకులు దిగ్గొడుతున్నామని, ఒక వాస్తవ ప్రపంచానికి దారి తీసే మార్గం నుంచి పక్క దారి పడుతున్నామని, ఒక ఇనప్పెట్టెలో దూరి తలుపు గడియ వేసుకుంటున్నామని, మెదడు లో ప్రవేశించబోయే ఒక సూర్య కిరణాన్ని అడ్డుకుంటూ తల తిప్పేసుకుంటున్నామని గ్రహించలేని స్థితిలో ఉన్నారు విద్యార్థులు!
వారి కళ్ళ ముందు మెరిసే రంగుల ప్రపంచపు హంగులు, విదేశీ ప్లాస్టిక్ కరెన్సీ తప్ప మరేమీ కనిపించని అంధత్వం కమ్మేసింది.
ఎండమావుల వెంట పరుగులు తీసి, పిల్లలని ఎటూ తేల్చుకోలేని కన్ ఫ్యూజన్ లో పడేసి, తెరవ బోతున్న వారి గొంతుల్ని నొక్కేసి, వికసిస్తున్న ఆలోచనల్ని తొక్కేసి, కోచింగ్ సెంటర్ల వెంట పరుగులు తీయించి డాలర్లో మరోటో (రూపాయలు మాత్రం కాదు) లేక్కేసుకోమంచేప్పేసి, తరిమేసి , ఇప్పుడు తెలుగు ఎక్కడా కనిపించడం లేదనో వినిపించడం లేదనో వాపోతే కనీసం అంతరాత్మ సానుభూతి కూడా దక్కదు!
అసలు రాసే వాళ్ళు, చదివే వాళ్ళే లేరా?

ఈ ప్రశ్నకు జవాబు “ఉన్నారు” అనే!! ఇప్పుడు రాస్తున్న వాళ్లంతా 30 లు దాటి నలభైల్లో ఉన్న వాళ్ళు! అంటే ఎంతో కొంత తెలుగు పూర్తిగా స్కూళ్ళలోంచి మాయం కాని రోజుల్లో చదువుకున్న వాళ్ళన్నమాట!
రచయితలు జీవితాన్ని యధాతధంగా ప్రతిబింబించే రచనలు మానేసి వర్గాల వారీగా వాదాల వారీగా చీలి, ఆయా వర్గాల వాదాల కళ్ళతో సమాజాన్ని పరిశీలిస్తూ ఆ పరిథుల్లోనే సాహిత్య సృష్టి చేస్తుండటం వల్ల ఈ చీలిక పాఠకుల్లో సైతం అనివార్యంగా మారింది. అసలే తక్కువ సంఖ్యలో ఉన్న పాఠకుల్లో చీలిక రావడమే కాక వీరు కొత్త పాఠకుల్ని ఆకర్షించడం లో విఫలమయ్యారు. కొద్దో గొప్పో రాయాలని తపన పడే కొత్త తరాన్ని ప్రోత్సహించే వారు లేరు. సాహిత్యం చదవాలని వచ్చే కొత్త పాఠకులకు ఇలాటి వాతావరణం స్వాగతించడం అభిలషణీయం కానే కాదు!

వెబ్ పత్రికలు కొంత వరకూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నా వారి రచనలకు పాఠకులు పరిమిత సంఖ్యలోనే ఉంటున్నారు. అవే పత్రికలు వారే రచయితలు, వారే పాఠకులు… వెరసి ఇదంతా ఒక లిమిటెడ్ సర్కిల్ లా తయారైంది తప్ప కొత్త పాఠకుల్ని, రచయితల్ని తయారు చేసే అంశాలు ఈ సర్కిల్లో పరిమితంగానే చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి!

ఏదో ఒక వాదాన్నో వర్గాన్నో సమర్థించే రచనలు , లేదా కథ చివర్లో ఒక నీతినో మానవీయ విలువలనో చొప్పిస్తూ ముగించే కథలు .. ఎక్కడ చూసినా ఇవే స్వైర విహారం ! ప్లెయిన్ గా , ఒక జీవన కోణాన్ని ఏ రంగులూ లేకుండా, ఏదో ఒక వర్గనీతో వాదమో అద్దకుండా ఆవిష్కరించే సాహిత్యమే లేదు ఉత్తమ సాహిత్యాన్ని విరివిగా చదవని వారికి అంతకంటే కథా వస్తువు దొరకడం అసాధ్యమే! ఇలాటి పరిస్థితుల్లో అంతంత మాత్రంగా ఉన్న పాఠకులకు ఉత్తమ సాహిత్యం ఎలా పరిచయం అవుతుంది? ఉద్యోగానికి , చెంచాడు భావ సాగరాలు ఈదడానికి పోగా మిగిలిన కొద్ది సమయంలో తేలిక పాటి కథలు చదవడానికి సమయం కేటాయించడమే గొప్ప అనుకునే రోజుల్లో ఈ తరం యువత పాత తరం సాహిత్యం చదవాలని ఆశించడం అత్యాశ కాదా?

కొద్దో గొప్పో పేరు పొందిన రచయితలు సోషల్ మీడియాలో విపరీత ప్రచారం చేసుకోడం, రాసిన పుస్తకాలు సెలబ్రిటీల చేతుల్లో పెట్టి ఫొటోలు తీసి వాటితో వూదర గొట్టేయడం! అంతగా పేరు పొందని నూతన రచయితలను ప్రోత్సహించే విషయం అలా ఉంచి , వారి వర్గానికో వాదానికో చెందని పక్షంలో విమర్శలతో నిరుత్సాహ పరచడం మామూలై పోయింది.
మరేం చేయాలి? ,మనమేం చేయాలి?

ఒక్కోసారి సమస్యలు మొదలవడమే తప్ప వాటిని సమూలంగా పరిష్కరించే పరిష్కారాలు దొరకవు. ఎందుకంటే అవి సమస్యల రూపం దాటి ముదిరి పోయిన రోగాల రూపాలు ధరిస్తాయి కాబట్టి. సాహిత్య పఠనాన్ని కూడా తిరిగి పూర్వ స్థాయిలో పునరుద్ధరించడం అలాంటిదే! రోగం ఎంత ముదిరి పోయిందని తెల్సినా అంతో ఇంతో చికిత్స చేయకుండా చూస్తూ వదిలేయలేం కాబట్టి ఈ పరిస్థితిని కొద్దిగా అయినా మెరుగు పరిచే దిశగా కనీసం పై పూత ప్రయత్నాలకు తల్లి దండ్రులు, రచయితలూ పూనుకోవాలి.

అసలు డబ్బు పాత్ర జీవితం లో పరిమితమైతే ఎంత బాగుండు!! తల్లి దండ్రులు డబ్బు వెనక పరిగెత్తడం మానేస్తే ఎంత బాగుండు!! అమెరికా వెళ్ళిన మేనత్త కొడుకు తోనో, ఆస్ట్రేలియా లో సెటిల్ అయిన పిన్ని కూతురితోనో పిల్లల కెరీర్లను భవిష్యత్తును పోల్చి తీర్చి దిద్దే కార్య క్రమాలకు ఫుల్ స్టాప్ కాక పోయినా కనీసం కామా పెట్టి, వారికిష్టమైన సబ్జెక్ట్ తీసుకుని చదివేలా ప్రోత్సహిస్తే ఎంత బాగుంటుంది?
తెలుగులో తక్కువ మార్కులొస్తే? “మార్కులొచ్చేలా కష్ట పడి చదవండి. లేదా మరో సబ్జెక్ట్ లో కవర్ చేయండి”అని ప్రోత్సహించో చీవాట్లేసో, తెలుగుని తెలుగు సాహిత్యాలను పద్యాలను శతకాలను పిల్లలకు పరిచయం చేయలేమా? చందమామ వంటి అతి సరళ మైన తెలుగులో నడిచే పత్రికలకు వాళ్ల బాల్యానికి బహుమతిగా ఇవ్వలేమా?మనం చదువుకున్న శతకాలూ, చరిత్రలూ, పురాణ కథలూ, భువన విజయ కవి సమ్మేళనాలూ ఏమై పోయాయి?

వ్యక్తిత్వ వికాస పుస్తకాలే కాదు, వాటి అవసరం లేకుండానే వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలిగే శక్తిని ఇచ్చే గొప్ప సాహిత్యాన్ని వాళ్ళకి పరిచయం చేయలేమా? పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు పంపే టైములో కొద్ది కాలాన్ని అనేక జీవితాల్ని అలవోకగా విశ్లేషించిన పుస్తకాలకు కేటాయించలేమా?

భాషలు ఎన్నైనా నేర్చుకో, కానీ మాతృభాషలో చదవడం రాయడం మర్చిపోకు అని చెప్పలేమా?
సాయంకాలం అవుతూనే టీవీలకు అతుక్కు పోతున్న అనేక మంది బామ్మలూ తాతయ్యలూ వాళ్ళకి పద్యాలను వెన్నెల్లో కాక పోయినా గదిలో కూచుని అయినా అందంగా వివరించే పరిస్థితి మరిక రాదా?
మీడియా పాత్రేంటి?
వినోదాల ఛానెళ్ళు పక్కన పెట్టి అత్యథికంగా చూసే వార్తా ఛానెళ్ళు తెలుగు భాషకు చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదు. ఏ వార్తా చానెల్ లోనూ తెలుగు మాట్లాడరు. తల్లి దండ్రులు అనే మాటని వాళ్ళు మర్చిపోయి చాలా కాలమైంది.

“పేరెంట్స్”! అంటారు!
“అమ్మాయి, అబ్బాయి తరఫు వారిద్దరూ కూచుని సామరస్యంగా సమస్యను పరిష్కరించుకున్నారు అనడానికి “బాయ్ అండ్ గర్ల్ టూ సైడ్స్ పీపుల్ మీటై, ప్రోబ్లెం ని కూల్ గా సాల్వ్ చేసుకున్నారు” అని చెప్తారు. ఇందులో తెలుగు అక్షరాలెన్నో లెక్కెట్టండి! దీనికి తెలుగు మీడియా అని పేరెందుకో !!
ఇలాగే ఎన్నో వేల పదాలను తెలుగు నుంచి తొలగించేశారు. పూర్తిగా వ్యాపారాత్మక ధోరణిలో నడిచే ఆ ఛానెల్స్ అరకొరగా రూపొందించే సాహిత్య కార్య క్రమాల ప్రభావం ఏ మూలకి! అసభ్యమైన భాషతో మసాలా కార్య క్రమాల మధ్య వాటి ఉనికి ఏ మాత్రం?ఒక పక్కన మాతృభాషను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మరో పక్క ఒకటీ అరా కార్యక్రమాలు అదీ ఎవరూ చూడని, ప్రకటనలు ఎక్కువగా రాని సమయంలో ప్రసారం చేస్తూ భాషోద్ధరణకు నడుం కట్టామని ప్రకటించుకోవడం పెద్ద ఐరనీ!
భాష ఏదైనా, అసలు చదవడం అనేది ఒక వ్యసనంగా పిల్లలకు అలవాటు కావాలి. అలా కావాలంటే పిల్లలతో పాటు మనమూ చదవాలి. కథల్ని చర్చించాలి. వీలైతే ఇద్దరూ కలిసి చదవాలి. ఇలాటి వాతావరణం ఉన్న చోట పుస్తక పఠనం అలవాటు త్వర త్వరగానే అల్లుకు పోతుంది

గ్రంథాలయాలేవి? : కొన్నాళ్ల కిందట ఒక వార్త వచ్చింది. జిల్లా గ్రంథాల శాఖలన్నిటినీ మూసి వేస్తారని. వాటిని మూసి వేయక పోయినా, పరిథితి ఏమీ మెరుగ్గా లేదు. కొత్త పుస్తకాలకు ఫండ్స్ ఉండవు, పాత పుస్తకాలకు ముందూ వెనకా ఉండవు! “ఫలానా పుస్తకం వచ్చిందా” అంటూ ప్రదక్షిణలు చేసే పరిస్థితి ఉండేది. కొత్త పాత సాహిత్యాలను గ్రంధాలయాలు అందరికీ అందుబాటులో ఉంచే స్థితి వస్తే పరిస్థితి కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. తెలుగు చదవడం తెలిసిన ప్రతి వారూ పుస్తకాలను “కొని” చదవాలంటే సాధ్యమయ్యే విషయం కాదు!

కవులూ రచయితలూ:
సాహిత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత, చదువరుల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత వీళ్ల మీదే ఎక్కువగా ఉంది.కొత్త వారికి ప్రోత్సాహం ఇవ్వడం, వారి లోపాలను తెలియజెప్పి వారు మరింత ఎక్కువగా రాసే వాతావరణాన్ని కల్పించడం ముఖ్యం! ఉన్న నలుగురూ ఒక గ్రూప్ గా తయారై, పొగడ్తలకే విలువ ఇస్తూ విమర్శల మీద దుమ్మెత్తి పోయడం వంటి చర్యలు , కొత్తగా రాయాలనుకున్న వారికి, తెలుగు సాహిత్యం చదవాలని సంకల్పించిన వారికి కూడా వెగటు పుట్టించే వాతావరణాన్ని సృష్టించ గలదు. సాహితీ సమావేశాలు కవులు రచయితల వర్గానికే పరిమితం చేయక కాలేజీ విద్యార్థుల్ని కూడా ఆకర్షించేలా చూడాలి.. ఔత్సాహిక రచయితలు, కవులు ఇలాటి సాహితీ సమావేశాల్లోనే పుడతారు.అస్పష్టమైన సంక్లిష్టమైన భావాలతో కవిత్వాన్ని సాహిత్యాన్ని సృష్టించి పాఠకుల మీదకు వెదజల్లడం అన్యాయం

ప్రభుత్వ పరంగా :
ప్రైవేట్ విద్యా సంస్థల మీద ప్రభుత్వం నియంత్రణ లేక పోవడం వల్ల జరిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు! వాటిలో ఒకటి మాతృభాష నేర్చుకోవడం నిర్బంధం కాక పోవడం. ఇంటర్మీడియెట్ వరకూ తెలుగు ఒక నిర్బంధమైన సబ్జెక్ట్ గా ఉండి తీరాలి. తెలుగు చదవడం రాయడం తెలియని పిల్లలు ఏ తెలుగింట్లోనూ ఉండరాదనే గట్టి నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలి. అంతరించి పోతున్న ఆర్ట్స్ గ్రూపుల్ని తిరిగి పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే! ఆర్ట్స్ గ్రూప్స్ అంతరిస్తే , నశించేది భాష ఒక్కటే కాదు, సంస్కృతి, చరిత్ర, కళలు కూడా అంతరించి పోతాయి.
ఆర్ట్స్ గ్రూప్స్ లో చదివిన వారికి ప్రత్యేక ఉద్యోగావకాశాలు ఉండాలి. కెరీరిజం ప్రధాన ఎజెండాగా మారిన ఈ విద్యా విధానంలో ఇలాటి మార్పు తెస్తే అయినా ఆర్ట్స్ గ్రూపులు, లింగ్విస్టిక్స్ పరిస్థితి కొంత మెరుగు పడుతుంది.

స్వఛ్ఛంద సంస్థలు కూడా : స్వఛ్చందంగా భాష, సాహితీ వికాసం కోసం పని చేసే వ్యక్తులూ సంస్తలూ ఈ దిశగా మరిన్నివిస్తృతమైన ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. మాతృభాషను అభ్యసిస్తున్న విద్యార్థులెంత మంది ఉన్నారో తెలుసుకుని వారిని మరింత ప్రోత్సహించే చర్యలు చేపట్టాలి. సాహితీ క్విజ్ లు ,పుస్తకాల మీద వ్యాస రచనలు రచనలు, వక్తృత్వ పోటీలు నిర్వహించడం పిల్లల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. వాళ్ళకి సిలబస్ లో లేని శతకాలను, పద్యాలను పరిచయం చేయాలి.

చివరగా ఇది మన చేతుల్లో లేనిదైనా సరే.. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు కొంత లాభ దృష్టిని తగ్గించుకుని , పూర్తిగా పిల్లలను మాతృభాషకు కాకుండా చేయక కొంత బాధ్యత గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తెలుగుని ద్వితీయ భాషగా తీసుకోమని విద్యార్థుల్ని ప్రోత్సహించే దిశగా మాత్రమే కాక, మంచి సాహిత్యాన్ని లైబ్రరీల్లో అందుబాటులో ఉంచాలి. సాహిత్య పఠనానికి ప్రత్యేక సమయాన్ని వారికి కేటాయించాలి.
ఇదంతా ఒక్క ఏడాదిలోనో రెండేళ్ళలోనో పూర్తయ్యే ప్రక్రియ కాదు. అందరూ పూనుకుని చిత్త శుద్ధితో పని చేస్తే, ఒక దశాబదమో, రెండు దశాబ్దాలో పట్టినా ఆశ్చర్యం లేదు.
సాహిత్య వైభవాన్ని పునరుద్ధరించి చదువరులను పెంచి, మానసిక వికాసానికి బాటలు వేసే ఆ రోజు త్వరలో కాకపోయిన కొన్నాళ్ళకో కొన్నేళ్ళకో అయినా సరే వస్తుందని ఎదురు చూడ్డం లో తప్పు లేదు.
ఎందుకంటే ఎదురు చూపులు ఏవైనా సరే,ఎప్పుడూ ఆశావహంగా ఉంటాయి! ఏదో మంచి జరుగుతుందనే గొప్ప నమ్మకాన్ని కల్గిస్తాయి.
ఎదురు చూద్దాం!