నిజంగానే
స్వప్నాలు లేని ప్రయాణాలు ఉండనే ఉండవు
జీవితాన్ని
స్వప్న దూరాలలో మాత్రమే
కొలవడం సాధ్యమని తెలిశాక కూడా
స్వప్నాలు లేకుండా ఎలా ఉంటాయి?
మనిషి త్రోవలని ఎన్నిసార్లు తడిమినా
మిణుకు మిణుకు మిణుగురుల్లా
స్వప్నాలు ఆశగా కనిపిస్తూనే ఉంటాయి
ఒక్కోసారి
కొన్ని స్వప్నాలు కిందనపడి రాలిపోవచ్చును
మరికొన్ని అమాంతంగా పగిలి ముక్కలైపోవచ్చును
చేతికంతనంత దూరాలకు చెల్లాచెదురైపోవచ్చును
అంత మాత్రం చేత కొత్తవి మొలకెత్తడం మానేయకూడదు.
స్వప్నాల సేధ్యం లో ప్రతినిత్యం
మనిషి
ఆరితేరి పోవాలి
మైమరచి పోవాలి
మొక్క మొక్కకూ ప్రయాణిస్తూ
నీరు పోసినట్టూ, ఎరువు వేసినట్టూ
చీడపీడలని పరికించి పారద్రోలినట్టూ
స్వప్న స్వప్నానికి మధ్య
మనిషి నిరంతర ప్రయాణం సాగిపోతుండాలి
ఆకుపచ్చని పత్రహరితాలు లిఖించే
కిరణజన్య సం-యోగ క్రియలలా
స్వప్నాలు మనిషిని పునరుజ్జీవింప జేస్తూనే ఉండాలి.
(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)
Painting: జావేద్
నారాయణ గారూ మీ కవిత బాగుంది .గొప్ప ఆశావాదం కనిపిస్తోంది..అబ్దుల్ కలాం గారు నిత్యమూ అదే చెప్తుంటారు..కలలు కన్నది.ఆకలలను సాకారం చేసుకోండి అని యువతకు మార్గ నిర్దేశము చేస్తుటారు.అదే భావనను మీరు కవిత్వీకరించారు.చాలా బాగుంది .అభినందనలు
రామకృష్ణ గారు, ఈ కవిత యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని మీరు స్పష్టంగా చెప్పి, అభినందించినందుకు ధన్యవాదాలు.
నారాయణ.
మనిషి త్రోవలని ఎన్నిసార్లు తడిమినా
మిణుకు మిణుకు మిణుగురుల్లా
స్వప్నాలు ఆశగా కనిపిస్తూనే ఉంటాయి.
- నిజమే కదా!
కవిత బావుంది.కానీ, భాషే మరీ పట్టేస్తోంది.
అభినందనలతో..