తాజ్‌మహల్ అందాన్నిచూసి తన్మయులైపోయేవాళ్లని, దాని నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరో ఆలోచించమని శ్రీశ్రీ చెప్పారుగానీ, ఆ కట్టడంలోని అందంవెనుక బంధం మాత్రం ఎవరి ఆలోచనల్లోకీ అంత తొందరగా ప్రవేశించదు.
# # #
కనకధారాస్తవాన్ని వింటున్నప్పుడు ఫోన్ మోగడం వినిపించిందిగానీ, అది పూర్తి అయిన తరువాత మాత్రమే మా ఆవిడ నాతో సంభాషణ మొదలుపెట్టడం నా అదృష్టమనే చెప్పుకోవాలి. శంకరాచార్యుని సృజనాత్మకత నన్ను అబ్బురపరుస్తూంటుంది. ఆయన పుట్టిన కొన్నివేల ఏళ్ల తరువాత కూడా ఆయన స్తోత్రాల్లోని భాష సొబగులు, భావ సౌందర్యాలచేత ప్రభావితులయిన లక్షలమందిలో ఒకణ్ణయినందుకు గర్వపడుతుంటాను.
“సత్యనారాయణ గారమ్మాయి పెళ్లి లైవ్ చూపిస్తున్నార్ట కంప్యూటర్లో. ఆ పుస్తకాన్ని కాస్త పక్కనపెట్టి చూద్దురుగాని రండి!” అని అప్పుడే ఎవరో ఫోన్లో చేప్పిన సమాచారానికి తన ఆజ్ఞని జోడించింది నా సతీమణి శారద. ఆయన మాకు దగ్గరలోనే వుంటారు అమెరికాలో. అమ్మాయి పెళ్లి హైదరాబాద్‌లో జరిపిస్తున్నారు. ముహూర్తం రాత్రి పదకొండున్నరకి. శనివార మవడంవల్ల పొద్దున్న కొద్దిగా ఆలస్యంగానే లేచినా అక్కడికీ మాకూ దాదాపు పదిగంటల తేడావుండడంవల్ల తీరిగ్గా కాఫీ తాగుతూ పెళ్లికార్యక్రమాన్ని వీక్షించడం మొదలుపెట్టాం.
దాదాపు అర్థరాత్రి ముహూర్త మవడం వల్ల ముందు రిసెప్షనూ, తరువాత డిన్నరూ, ఆ తరువాతనే పెళ్లి. మేం కంప్యూటర్లో చూడడం మొదలుపెట్టేసరికి రిసెప్షనవుతోంది. “అదుగో, మా పెదనాన్న కొడుకు. మా అత్తయ్య కూతురు కూడా వచ్చిందండోయ్!” అంటూ వాళ్ళని ఎదురుగా చూసినట్లుగానే ఫీలవుతోంది శారద. సత్యనారాయణగారువాళ్లు శారదకి చుట్టాలు. అందుకని, తను వెళ్లలేకపోయినందుకు విడియోలో చుట్టాలని వెతుక్కుంటోంది. “మా అమ్మానాన్నల మీదకు ఈ కెమెరా మేన్ ఎప్పుడు ఫోకస్ చేస్తాడో?” అంటూ రెప్పలార్పితే వాళ్లనెక్కడ మిస్సవుతుందోనని ఆదుర్దాగా కళ్లు విప్పార్చుకునల్లా చూస్తోంది.
పెళ్లి జరుగుతున్న హాలుని బాగానే అలంకరించారు. రంగుల పట్టుచీరలు, ధగధగా మెరిసే నగలూ పెద్దవాళ్ల నలంకరిస్తుంటే, జీన్సు, టాంకు టాప్సులో కొందరు ఆడపిల్లలు కనిపిస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే ప్రపంచంలో బంగారం ధర ఇంతలా పెరగడానికిగల కారణం అక్కడ ఆనందంతో చిందులేస్తున్నట్లనిపించింది. అమెరికానుంచీ వెళ్లిన మగవాళ్లూ, ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నవాళ్లూ, ఆఫీసర్లూ గామోసు సూటు, బూట్లల్లో కనిపిస్తున్నారు.
“అడుగో సారథి,” కంప్యూటర్ స్క్రీన్‌మీద చూపించింది. ఏదో దూరపు చుట్టరికం. ఒకే ఊరుకూడా కాదు. కానీ, చిన్నప్పుడు పెళ్లిళ్లలో కలిసినప్పుడు పెనవేసుకుపోయాం. వాడు శారదక్కూడా గుర్తుండడానికి కారణం మా పెళ్లిలో వాడు చేసిన హడావుడి. ఎప్పుడయినా సారథి కనిపించగానే ఆలోచనలు వాడితోనే ఆగిపోవు. మా బృందంలోని ఇంకో పదిమందిని పట్టుకొచ్చి ముందు నిలబెడతాయి. ఆలోచనలతో అవసరంలేకుండా ఇప్పుడు వాళ్లు ఎదురుగా కనిపించారు – అదే కంప్యూటర్ మానిటర్లో. అంటే పెళ్లికొడుకు తరఫువాళ్లుకూడా మాకు చుట్టాలేనన్నమాట! అయితే, సారథిగానీ, మా బృందంలోని మిగిలినవాళ్లుగానీ అంత హడావుడేమీ చెయ్యట్లేదు. కుర్చీల్లో కూర్చొని కబుర్లాడుకుంటున్నారు.
ఇంతలో, క్రిందకొస్తున్నానని రూంలోని డ్రంసెట్టుచేత తెలియజేసి, హడావుడిగా మెట్లుదిగి వచ్చాడు సిధ్ధూ. “మామ్, ఐ యామ్ గోయింగ్,” అంటూ వాడు కార్ కీస్ తీసుకొని బయటకు వెళ్లబోతుంటే, “శనివారంకూడా కొంచెమయినా రెస్టులేకుండా ఈ పరుగులెందుకో?” అని వాణ్ణాపబోయింది శారద. వెడుతున్నవాణ్ణి వెన్నంటే, “అవగానే వెంటనే ఇంటికొస్తావా లేక మళ్లీ ఎవరికో హెల్ప్‌చెయ్యాలంటూ రాత్రిదాకా కనపడవా? సాయంకాలం పార్టీ సంగతి మర్చిపోకు,” అనికూడా అన్నదిగానీ, ఇది మామూలేనన్నట్టు వాడు జవాబివ్వకుండా వెళ్లిపోయాడు.
“నువ్వేగా, వాణ్ణి వాలంటీర్ అవర్స్ కావాలని పోరి ఆ హాస్పిటల్‌కి పంపించావ్?” జవాబేమొస్తుందో తెలిసినా అడిగాను.
“సర్లే, అది కాలేజీ అడ్మిషన్‌కి హెల్ప్‌చేస్తుందనే కదా! అడ్మిషన్ వచ్చిందిగదా, ఇంకా దాని అవసరమేమిటి? సెప్టెంబర్నించీ కాలేజీకెడతాడు. అప్పుడెలాగో కుదరదు. ఈ నాలుగయిదు నెలలయినా హాయిగా రిలాక్స్ అవచ్చుగదా?”
రెండేళ్ల క్రితం, మెడికల్ కాలేజీ అడ్మిషన్లకి తోడ్పడుతుందని వేసంకాలం సెలవుల్లో హాస్పిటల్లో వాలంటీర్ వర్క్‌కి అప్లైచేస్తే, వృధ్దులుండే వింగ్‌లో వేశారు. ఆ సీనియర్ సిటిజెన్లకి వాళ్లు మాట్లాడితే వినడానికి ఒక వ్యక్తికావాలి. వాళ్లల్లో చాలామంది తెల్లవాళ్లు కావడంతో, అలాంటి “అంకుల్స్, ఆంటీ”లతో, లేక “గ్రాండ్‌పా, గ్రాండ్‌మా”లతో వాడికి పరిచయంలేదుగనుక సిధ్ధూకి మాత్రం వాళ్లు ఒక కొత్తలోకాన్ని పరిచయంచేశారు. వాళ్లల్లో, వియత్నాం వార్‌లో వికలాంగులైన ఒకళ్లూ, కొరియన్ వార్‌లో పోరాడిన ఇద్దరూ, మొదట వాడి స్కిన్ కలర్‌వల్ల అంతగా పట్టించుకోకపోయినా, మంచి శ్రోత దొరికాడని అర్థమయిన తరువాత ప్రతీ శనివారం వాడి రాకకోసం ఆత్రంగా ఎదురుచూసేవాళ్లు. సినిమాల్లోకూడా చూపించని యుధ్ధవివరాలని సిధ్ధూ బాగా ఆసక్తిగావిని వంటబట్టించుకున్నాడు. “హాస్పిటల్ చెప్పిన చిన్నచిన్న పనులని చెయ్యడానికి ఎక్కువ సమయం పట్టదు. మిగిలిన సమయంలో వీడిలాంటి టీనేజర్ వాలంటీర్లు ఒక పుస్తకం పట్టుకుని ఆ నాలుగ్గంటలూ గడుపుతారు. ఎంతోమంది వాలంటీర్లని చూశాంగానీ, మీ అబ్బాయిలాంటి వాణ్ణి చూళ్లే”దని ఆ హాస్పిటల్ స్టాఫ్ ఒకరు శారదకి చెప్పార్ట. ఒక ఇండియన్ గెట్‌టుగెదర్లో శారద ఈ విషయాన్ని గొప్పగా చెప్పడంతో, 1960 ప్రాంతాల్లో వచ్చిన ఇండియన్లకి కూడా అలాంటి సహాయం చెయ్యొచ్చుగదానని ఒకళ్లు సలహా ఇచ్చేసరికి, వాడు “ష్యూర్,” అన్నాడు. తరువాత శారద వాడితో పోట్లాడింది – “నీకు టైమెక్కడుందిరా?” అంటూ. “ఇట్స్ ఓకె మాం, ఐ కెన్ మేనేజిట్,” అని తేలిగ్గా ఆవిడ అబ్జెక్షన్ని తీసిపారేశాడు. ఇప్పుడు మేనిఛాయతో సంబంధంలేకుండా మేం చాలామందికి సిధ్ధూ తల్లిదండ్రులుగా పరిచయం.
“ఇంతాచేసి, వీడు జెరియాట్రిక్స్‌లో స్పెషాల్టీ అంటాడేమో! దానికి మాత్రం నేనొప్పుకోను. ఎప్పుడూ అలా ముసలాళ్లమధ్య తిరిగితే వాడికి పిచ్చెక్కడం ఖాయం!” అన్నది శారద నాతో కరాఖండీగా. మనమధ్యవుంటే చాలుననుకొనేలాగా ఒక డాక్టరు మసలుకోగలగడం ఆ వృత్తికే గర్వకారణం – అది ఏ స్పెషాలిటీ అయినా సరే! – అనేది నా అభిప్రాయం. “సర్లే, స్పెషాలిటీని ఎన్నుకోవడానికి ఇంకా చాలా కాలముంది,” అని దాటేశాను. పదిహేడేళ్లవాణ్ణి హాస్పిటల్లో వాలంటీర్ వర్క్‌చెయ్యనిచ్చారంటే “సర్జరీలు చెయ్యడానికి అసిస్టెంటుగా అని అర్థం కా”దని అందరికీ తెలుసు!
ఆలోచనల్లోంచి బయటపడి చూసేసరికి కెమేరా మెల్లిగా డిన్నర్ జరుగుతున్నవైపు మళ్ళింది. అక్కడ బఫే టేబుల్ దగ్గర లైన్ మొదలయ్యింది. వాచీ చూసుకున్నాను. హైదరాబాద్‌లో ఎనిమిదయ్యింది. ఇప్పుడు భోజనాలు మొదలయితే తొమ్మిదిన్నరకల్లా పూర్తి చేసి, హైదరాబాద్‌లో మూలమూలల వున్నవాళ్ళు అర్థరాత్రి అయ్యేలోగా ఇళ్లకు చేరుకోవచ్చు. తాళికట్టే టైముకి బాగా దగ్గరవాళ్లు – దూరంలోనూ, చుట్టరికంలోనూ కూడా – మాత్రమే అక్కడ మిగులుతారు. అది పాతికేళ్లక్రితమే మా పెళ్లిలో తెలుసుకున్నాను గదా!
కెమేరా టేబుల్ మీద వరుసగా ట్రేలల్లో వున్న పదార్థాలను చూపించింది. చాలానే వున్నాయి. టేబుల్ వెనక కాంట్రాక్టు సర్వర్లు యూనిఫాంలు వేసుకుని ప్లేట్లల్లో పదార్థాలని వడ్డిస్తున్నారు. అతిథులు ప్లేట్లు పట్టుకుని, ” వెయ్యి,” “వద్దు” అంటూ లైన్లో ముందుకు కదుల్తున్నారు. ఇండియాలో పెళ్లిళ్లు నేను చూసి చాలా కాలమైంది. కానీ, నాకు తెలుగువాళ్ల పెళ్లి అనగానే ఠక్కున గుర్తుకొస్తాడు మామయ్య. ఈ దృశ్యాన్ని చూసుంటే మాత్రం తప్పకుండా, “ఏవిటది, ఏదో దానధర్మం చేస్తున్నట్లుగా భోజనానికి లైన్లో అలా నిలబెట్టడం?” అనేవాడు. మొగలిపువ్వు సువాసనలా మామయ్య ఆలోచనలు మదినిండా కమ్ముకున్నాయి.
# # #
ఆయన పేరు శంకరమని చాలా కొద్దిమందికి తెలుసుండాలి – ఆయన్ని మామయ్య అనే పిలిచేవారు అందరూను పిల్లా, పెద్దా తేడాలేకుండా. ఆయన నాన్నకంటే వయసులో మరీ పెద్ద అయినట్లు నాకు అనిపించలేదు. మామయ్య మా యింటికి తరచుగా వచ్చేవాడు. ఆయనంటే నాకు ప్రత్యేకంగా అభిమానం వుండడం ఆయనకి నామీద వుండే ప్రేమ వల్లనే కావచ్చేమో! ఆయనతో బజారుకెడితే అయిదు పైసల చాక్‌లెట్లు మాత్రమే నాన్న కొనిపెట్టే రోజుల్లో ఆయన రూపాయ చాక్‌లెట్ నేనడిగితే కాదనకుండా కొనిపెట్టేవాడు. “ఎందుకండీ మావయ్యగారూ అంత డబ్బుపోసి?” అనేది అమ్మ. ఆయన మా చుట్టాలందరి యిళ్ళకీ వెడతాడనీ, నాకులాగా వాళ్ళపిల్లలకీ చాక్‌లెట్లు కొనిపెడతాడనీ పెళ్లిళ్లల్లో కలిసినప్పుడు తెలిసింది. అయితే, ఆ పిల్లల్లో ఆయనమీద అభిమానాన్ని వ్యక్తపరచినవాళ్లు నాకు కనిపించలా. కొందరు ఆయనగూర్చి అవహేళనచేస్తూ మాట్లాడేవాళ్లు. ఇప్పుడనిపిస్తుంది – నచ్చినవాళ్లుగానీ మెచ్చుకునేవాళ్లుగానీ సాధారణంగా నిశ్శబ్దంగా వుంటారనీ, నచ్చనివాళ్లూ, తప్పుపట్టేవాళ్లూ మాత్రం పెద్దనోటితో మిగిలినవాళ్లని మాట్లాడనియ్యకుండా చేస్తారనీ నేను జీవితంలో మొదటిసారి తెలుసుకున్నది అప్పుడేనని!
ఆయన అందరికీ అన్ని విషయాల్లోనూ సలహాలిచ్చినా, పదేళ్లు దాటిన మగపిల్లలకి ప్రత్యేకంగా ఇచ్చే సలహామాత్రం ఆ పిల్లలకి వినడానికి సిగ్గుపడేలా వుండేది. అసలే మూడు, నాలుగు గదుల ఇళ్ళు. తుమ్మినా, దగ్గినా చుట్టుపక్కల అందరికీ వినిపిస్తుంది. పైగా, చుట్టుపక్కల ఇళ్ళల్లో హైస్కూలుకేకాక కాలేజీలకికూడా వెళ్లే ఆడపిల్లలుండేవారు. అలాంటిచోట్ల వాకిట్లో గుమ్మంబయట నిలబడి, “మగపిల్లలు నీళ్లుపోసుకునేటప్పుడు ప్రత్యేకంగా శిశ్నాన్ని వెనక్కు లాగి, సబ్బుతో రుద్దాలయ్యా” అని చెబుతుంటే వినడానికి ఏ మగపిల్లాడికి సిగ్గుగా వుండదు?
ఇంక కావ్యాల ప్రసక్తి పొరబాటున ఎప్పుడయినా వచ్చిందా, ఆయన విజృంభణ హనుమంతుడి లంకా దహనాన్ని గుర్తుచేస్తుంది. అయితే, ఒకటే తేడా – హనుమంతుడు కావాలని చేశాడు. ఆయన వివరణ అధికంగావుంది అని ఎవరన్నా అంటే మాత్రం, అసలు అలాంటి పాఠ్యాంశాన్ని ఆ వయసు పిల్లలకు నిర్దేశించిన వాళ్ళను నిలదియ్యమనాలి. ఉదాహరణకి, కిష్కింధకాణ్డలోని శరత్కాలవర్ణనని తీసుకుందాం. నాకు ఇంటర్మీడియెట్లో అది పాఠ్యాంశం. హార్మోన్ల తాకిడికి రెచ్చిపోయున్న కుర్రకారుకి అర్థమయ్యేలా ” దర్శయన్తి శరన్నద్యః పులినాని శనైః శనైః, నవసఙ్గమసవ్రీవాడా జఘనానీవ యోషితః ” అన్న శ్లోకానికి అర్థం చెప్పడం యాభయ్యేళ్ల పంతులికి కష్టమే. అదే మామయ్యని అడిగితే –
“నీ వయసుకి నాకు పెళ్లయిందిరా. అందుకని దానికి అర్థాన్ని ప్రాక్టికల్స్‌లో తెలుసుకున్నాను. కుర్రదాని కంటిచూపు కోసమే తహతహలాడే మీకు మొదటి రాత్రి స్త్రీ జఘన సౌందర్యాన్ని చూపడంగూర్చి ఊహించుకొమ్మంటే ఎలా కుదుర్తుంది? ఎంత వాల్మీకిరామాయణంలోవుంటే మటుకు, ఈకాలంలో మీలాంటి కుర్రాళ్లకి దీన్ని పాఠ్యాంశాన్ని చెయ్యడం ఏమీ బాగోలేదు,” అని అన్నాడు. మామయ్యలో వున్న గొప్పదనమే అది. సంస్కృతం పంతుల్లాగా, “మీవరకు వచ్చినప్పుడు తెలుస్తుందిలే” అని తప్పించుకోడు. అందరు పెద్దల్లాగా, “కుర్రకుంకవి నీకేం తెలుస్తుందిప్పుడు? పెద్దయ్యాక ఎవరూ చెప్పకుండానే తెలుసుకుంటావు,” అని దాటెయ్యడు.
దాటెయ్యడు సరిగదా, కొన్నింటిని ఛాలెంజ్‌గా తీసుకుంటాడు. కాకపోతే, యాభయ్యేళ్ల వయసులో స్కూటర్ నడపడం నేర్చుకోవడమేమిటి, వాళ్లావిడ వద్దంటున్నా వినకుండా? ఒక పెళ్లిలో ఒక ఆకతాయివాడి మాటని పట్టించుకుని, ఆ స్కూటర్‌ని నడుపుతూ క్రిందపడి కాలు విరగ్గొట్టుకున్నాడు. అయితే, దానివల్ల ఎక్కువగా ఇబ్బంది పడ్డవాళ్ళుమాత్రం మా చుట్టాలు – అదీ పెళ్లిళ్ల సీజన్‌లో.
ఈ కాలంలో చిన్నచిన్న గ్రామాల్లోకి కూడా అవుట్‌సోర్సింగులొచ్చాయిగానీ, ఆ కాలంలో అయితే పట్టణాల్లో తప్పితే కాంట్రాక్టు కంపెనీలే కాదు, మారేజీ హాళ్ళుకూడా వుండేవి కాదు. అప్పటిదాకా ఒక్కపెళ్లి కూడా చేతులమీదగా జరపని ఆడపిల్ల తండ్రికి పెళ్లంటే హడావుడి అంతా ఇంతా కాదు. అట్లాంటివాళ్లని ఆదుకోవడానికే మామయ్య అవతారమెత్తాడా అనిపించేది. ఎందుకంటే, ఎక్కడ పెళ్లి జరిగినా అందులో ఆయన ముందుండేవాడు. పందిరి వేయించడానికి ఎన్ని గుంజలు, తాటాకులు కావాలీ, గాడిపొయ్యికి ఎన్ని మణుగుల కట్టెలు తెప్పించాలీ, అదికూడా ఏ అడితిలో అయితే కట్టెలు పొడిగా వుంటాయి, ఎన్ని బస్తాల బియ్యం, ఎంత కందిపప్పు వగైరాలు కావాలీ, ఏ వంటవాళ్ళయితే ఢోకా లేకుండా సరిగ్గా వండుతారూ, ఏ భజంత్రీలు బాగా వాయిస్తారూ, పెట్రొమాక్స్ లైట్లు ఎక్కణ్ణించీ తెప్పించాలీ – ఆఖరికి కూరలో ఉప్పెంత వెయ్యాలీ కూడా ఆయన చెప్పకుండా జరిగేవి కాదు. ఇక భజంత్రీలకయితే, “సీతాకళ్యాణ వైభోగమే” వాయించమనో, “ఎంత నేర్చినా” సరిగ్గా సరిపోతుందనో, “శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండీ” కావాలనో, “ఎంచక్కా కళ్యాణిలో ఏ తావునరా నిలకడ నీకు వాయించకుండా ఆ పాడు సినిమా పాటలెందుకయ్యా, శుభకార్యం జరుగుతున్న పూట” అనో వాళ్లను సతాయించకుండా వదిలేవాడు కాదు. కాలు విరగ్గొట్టుకున్న తరువాత ఆయన అటెండయిన పెళ్లిళ్లలో, అప్పటిదాకా ఆయన్ను విమర్శించినవాళ్లు కూడా ఆయన వచ్చి అక్కడ కుర్చీలో కూర్చున్నాగానీ, ఆయన చేసే హడావుడిలేక పెళ్ళి బోసిపోయిందని ఒప్పుకోక తప్పలేదు – మామూలుగా అయితే వంటదగ్గర చేసే హడావుడికన్నా, వడ్డిస్తూ చేసే హడావుడి అందరికీ సెవెంటీ ఎమ్మెం స్క్రీన్‌మీద లాగా కొట్టొచ్చినట్టు కనిపించేది గనుక.
ఎందుకంటే, వడ్డనలో ఆయన కొసరి కొసరి తినిపిస్తుంటే ఆయనకి తెలియనివాళ్ళు లేరనిపించేది. “ఏమిటయ్యా, వంకాయ కొత్తిమీర వేసి చేస్తే నీకిష్టమేగా, ఇంకాస్త వేసుకో” అనో, “ఇదుగో, అరటికాయ పులుసుపెట్టి చేసిన కూర. తిని చూసి, నువ్వు చేసినట్టుగా వుందో లేదో చెప్పమ్మా, నువ్వు చేసే పధ్ధతి చెప్పల్లా ప్రత్యేకంగా చేయించాను” అనో, “అదుగో, ఆ మామిడికాయ పప్పునలా వదిలేస్తారేమిటండీ, అందులో ఈ ఊరుమిరపకాయల్ని నంచుకుంటూ తినండి, ఎంత బ్రహ్మాండంగా వుంటుందంటే, మీరింక దాన్ని వదిలిపెట్టరు” అనో, “వేసుకో బాబూ ఇంకో లడ్డూ” అని అంటూనే, పక్క విస్తరి ముందు కూర్చునివున్న వాళ్ళతో “నీకు ఒక్కటి కూడా లడ్డూ వెయ్యను – అసలే షుగర్ పేషెంటువి. నీవల్ల నేనెందుకు బాబూ ఆ డాక్టరు గారి దగ్గర తిట్లు తినడం? ఇంతకీ నేను చెప్పిన ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళావా లేక ఈయనకి చాదస్తంలే అని తీసిపారేశావా?” అనో చేసే హడావుడి అంతా ఇంతా కాదు. కుర్రవాళ్లని పోగేసి వడ్డన చేయించేవాడు. పదేళ్ల పిల్లలనీ వదిలేవాడుకాదు – వాళ్లకి తగ్గట్టుగానే పనులుచెప్పేవాడు. ఆ వయసులోనే, “అడ్డంరాకం”డని కోప్పడకుండా పనులప్పగించాడని నాకు ఆయనంటే బాగా గౌరవంకలిగింది, తరువాత ఆయనతో చనువెక్కువైంది. అప్పటి మా పెళ్లిళ్ల సహాయకబృందం ఇప్పటికీ ఇంకా టచ్‌లోనేవుందంటే దానికి కారణం ఆయనకాక మరెవరవుతారు? అలాంటి వడ్డనలవల్లనే వడ్డించే కుర్రాడు తినే అమ్మాయితో కళ్లుకలపడంజరిగి వాళ్లిద్దరూ తరువాత పెళ్లిలో ఏకంగా పీటలమీద కూర్చున్నారని చెప్పుకునేవాళ్లు. ఆప్యాయతలనేవి భోజనం దగ్గర వడ్డిస్తూ కొసరి కొసరి తినిపించడంలో వ్యక్తం అయినంతగా ఇంకే పధ్ధతిలోనూ బయటపడవని అనిపించేది ఆ వడ్డనలని చూస్తే.
పెళ్లిళ్లవద్ద కన్నా అంతిమయాత్రల దగ్గర మాత్రం ఆయన సహాయాన్ని నిశ్శబ్దంగా, నిస్సంకోచంగా అంగీకరించడమేకాక ఆయనకోసం వెంటనే కబురుపెట్టేవాళ్లు. పెళ్లితంతుగూర్చి మూడుకాళ్ల ముసల్దయినా చెప్తుంది అంటారుగానీ, అంతిమకార్యక్రమ వివరాలను తెలుసుకోవడం గూర్చి ఎవరికిమాత్రం ఇష్టం వుంటుంది మరి? పైగా, మాలో ప్రత్యేకత ఏమిటంటే, విమానాన్ని చేయించి దాన్లో భౌతికకాయాన్ని తీసుకెళ్లాలి. ఆ పనికి ఎవరిని పిలవాలో, ఎలా చేయించాలో ఆయనకు మాత్రమే తెలుసు. వింతేమిటంటే, ఇది ఒక వూళ్లో అని ప్రత్యేకంగా కాదు. మా చుట్టాలున్న చిన్నా, పెద్దా వూళ్లక్కూడా వర్తిస్తుంది. తన సంతానం కాని నాలుగు నెల్ల పసివాణ్ణి ఆయన భుజాన వేసుకుని రుద్రభూమికి పట్టుకెళ్లడం నాకు తెలుసు.
ఆయన మాటలకి పెడర్థాలు తీసేవాళ్లని చూసి ఆయనకి విచారం కలిగేది. ఒకసారి ఆయన అల్లుడే కోపగించుకుని ఆయనతో మాట్లాడ్డం మానేసి, ఆయన ఇంట్లో అడుగుపెట్టనన్నాడు. “అది కాదండీ, రిక్షా ఇంకా దొరకలేదు, ట్రైనుకి ఆలశ్యమవుతోంది అని అల్లుడు కంగారు పడుతున్నాడు. ఎంతదూరం? మహా అయితే నాలుగు ఫర్లాంగులుంటుంది. అందుకని, ‘నా సైకిలుమీద వెనక కూర్చోవయ్యా, చిటికెలో దింపేస్తానూ,’ అన్నానంతే. అందులో తప్పేముంది?” అని వినేవాళ్లని అడిగాడు.
అందుకే, అలాంటి విపరీతార్థాలని తీసేవాళ్లను ఆయన ఏమాత్రం సహించడు. అన్నయ్య మొదటిసారి అమెరికానుండీ ఇండియా వస్తూ పెదనాన్నకోసం జిల్లెట్ రేజర్ బహుమతిగా తెచ్చిచ్చాడు. ఆయన ఏ కళనున్నాడో, “గొరుక్కోమని తెచ్చిచ్చాడు” అన్నాట్ట తెలిసినవాళ్లతో. వాళ్లు అవకాశాన్ని జారవిడుచుకోకుండా దాన్ని నాన్న చెవిని వెయ్యనే వేశారు. నాన్న బాధపడి మామయ్యతో అంటే ఆయన వెంటనే “ఇంకానయం, నాలుక గీసుకోవడానికి తెచ్చిచ్చాడనుకోలేదు – అది తెగి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూండే వా”డని ఒకటే నవ్వు.
షామియానాలూ, గాస్‌పొయ్యిలూ వచ్చినప్పుడు కాదు మామయ్య నీటి బయట చేపలా గిలగిల్లాడడం మొదలు పెట్టింది – మారేజీ హాళ్లూ, కాంట్రాక్టు భోజనాలూ, వడ్డనలూ మొదలయిన తరువాత. “మొన్న చూశావా, ఆ పెళ్లిలో వండినదాంట్లో సగం పైగా వృధాఅయింది. ఓ రుచా, పచా? ఎవడో వచ్చి ప్లేట్లల్లో వడ్డించిపోతాడు. నువు తింటే ఎంత, తినకపోతే ఎంత?” అని వాపోయాడు. ఆయన ఉద్దేశంలో పెళ్లిళ్లు అయిదురోజుల సమారాధనల్లాంటివి; ఉమ్మడిగా చేసే వనభోజనాల్లాంటివి. అంతే తప్ప, వచ్చి రెండుగంటలపాటు మాత్రం కూర్చుని, భోజనంచేసి, తాళికట్టడం అయినా అవకపోయినా ఆటోలు దొరకవని వెళ్లిపోవాల్సినవి కావు.
ఏ పనిమీద ఆయన తిరిగేవాడో నాకెప్పుడూ తెలియలేదుగానీ, పెళ్లిళ్ల విధానాలు మారడం, చుట్టాలకి ఆయన తాకిడి ఎక్కువకావడం దాదాపు ఒకే క్రమంలో జరిగెయ్యంటారు మావాళ్లు. మామయ్య ఒక ఊళ్లో అడుగు పెడితే, ఆ ఊళ్లోని చుట్టాలందరినీ పలకరించిగానీ వెళ్లేవాడు కాదు. “ఇక్కడి మాటలు అక్కడ చెబుతాడు” అన్న ముద్ర తేలిగ్గా పడిపోయింది.
అదే, మాకెవరికీ ఫోన్లు కూడా లేని కాలంలో ఆయన తెచ్చే వార్తల వల్లనే చుట్టాలందరి విషయాలూ తెలిసేవి. ఉత్తరాలు రాయాలని ఎవరికి అనిపించేది గనుక? ఫలానా వాళ్లమ్మాయి సమర్తాడిందనో, ఇంకోళ్ల అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారనో, ఒక పిల్లాడికి ఉద్యోగంవచ్చిందనో, లేకపోతే ఫలాన పెద్దాయన ఆరోగ్యం అంతగా బాగుండట్లేదనో ఆయనవల్లే అందరికీ తెలిసేది. ఆ కాలంలో ఆయనొస్తే చుట్టాల వార్తలు తెలిసేవనుకునేవారు అమ్మా, నాన్నాను. ఆ వార్తలు చేరెయ్యడం అన్నది కాస్తా మారే కాలంలో చెడుగా మారింది.
“అది కాదమ్మా, ఇదేమన్నా దాస్తే దాగేదా? ఆ శంకరంగారబ్బాయి పదో తరగతి తప్పాడన్న సంగతి ఇవాళ కాకపోతే రేపు మాత్రం తెలియదా? ఆ రామంగారమ్మాయి సంగతి తీసుకో! మనవాళ్లు కానబ్బాయితో తిరుగుతోందన్న సంగతి ఆ పేటలోని వాళ్లందరికీ తెలుసు. మరి ఈ పేటవాళ్లకి తెలిస్తే తప్పేమిటి? నేనెవరి కొంపలూ కూల్చట్లేదే!” అన్నాట్ట అమ్మతో.
నేను హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ పెళ్లై కాపురం పెట్టిన తరువాత మామయ్యను చూడడం చాలా కాలంపాటు కుదర్లేదు. ఒకసారి మంగళగిరిలో మాయింటికెళ్లినప్పుడు ఆయన అక్కడికొచ్చాడు. “హైదరాబాదువచ్చి మా యింట్లో వుండు మామయ్యా,” అన్నాను.
“నేను మీ యింటికొచ్చి ఏం చెయ్యాల్రా? నువ్వు ఆఫీసుకెడతావు, మీ ఆవిడ బాంకుకెడుతుంది. నేను ఒంటరిగా కూర్చోవాలి! పోనీ ఎవరింటికయినా అడ్రస్ పట్టుకుని చచ్చీచెడీ వెడితే, వాళ్లింటికి తాళం వేసివున్నా వుండచ్చు. అదే, ఈ మంగళగిర్లో అయితే, మీ అమ్మో, నాన్నో వచ్చేదాకా ఈ పక్కవాళ్లతో మాట్లాడొచ్చు” అన్నాడు.
అప్పటికే నా వయసున్న మా చుట్టపక్కాలు కొందరిలో ఆయనగూర్చి వున్న నిరసననీ, ద్వేషాన్నీ తెలిసున్నవాడినవడంవల్ల, సూటిగా చెప్పకుండా, “ఎందుకు మామయ్యా, ఈ వయసులో అన్ని వూళ్లు వూర్కేనే తిరుగుతుంటావ్?”అనడిగాను.
నా మనసు తెలిసినట్లుగా గుంభనగా నవ్వాడు. “నాకు మనుషులు కావాల్రా. నేను మీ యింటికి వచ్చినందుకు నాకు ఆనందంగా వుంటుంది. మీక్కూడా ఆనందమైతే నాకు మరీ సంతోషం. కొంతమంది నా వెనుక ఏమనుకుంటారో నాకు తెలుసు. మీ యింట్లో నా రాక ఆనందాన్ని కలిగిస్తే వేరే కొందరి యిళ్లల్లో నా పోక ఆనందాన్నిస్తుంది. ఎలాగైనా నేను అందరికీ ఆనందాన్ని చేకూరుస్తున్నాను గదా!” అన్నాడు.
# # #
మేం అమెరికా వచ్చి ఇరవయ్యేళ్లు దాటింది. దగ్గరయినవాళ్లందరూ ఇక్కడికొచ్చిన తరువాత పరిచయమయినవాళ్లేగానీ చుట్టాలెవరూ కాదు. ఇండియా వెళ్లినప్పుడల్లా శారద ఒకటే నసపెడుతుంది – అందరికీ వుంటారు చుట్టాలు! కానీ, మీలాగా ఎవ్వరూ అందరిళ్లకీ వెళ్లడంతోనే వెకేషనంతా గడిపెయ్యరు – అని. అలా చుట్టాలని కలిసినప్పుడు మా మాటల్లో మామయ్య ప్రసక్తిరాకుండావుండదు. కొంత సంభాషణ గడిచిన తరువాత, అయినవాళ్ళందరికీ దూరంగా వుంటున్నానని నేనంటే వాళ్లిచ్చే జవాబు, “మేం హైదరాబాద్‌లోనే వుంటున్నాం, కానీ ఎన్నిసార్లు కలుస్తున్నాంలే?” అని.
బ్రతుకు బాధలు ఎప్పుడూ వుంటూనే వున్నాయి. నేను ఆఫీసుకెళ్ళాలంటే గంటసేపు పడుతుంది, నలభైమైళ్లు వెళ్లడానికి అంటే, సారథి, నాకు అయిదుమైళ్లకే గంట పడుతుంది అన్నాడు. ఇక్కడ మాకు తెలిసినవాళ్లు వున్నా, చటుక్కున ఒకరోజు డిన్నర్‌కి పది నిమిషాలలో చేరగలిగే దూరంలో మాత్రం లేరు. హైదరాబాదులో సారథి ప్రతీరోజూ ఆలస్యంగా ఇంటికి రావడమే కాకుండా ఒక్కోసారి అర్ధరాత్రి కూడా అవుతుందంటాడు. మా ఇద్దరి బాధలూ కూడా తరువాతి పూట ఒకముద్ద అన్నం ఎక్కడ దొరుకుతుందోనని ఆలోచించే వాళ్లముందు దిగదుడుపే. కానీ, తరువాతి పూటగూర్చి కాకుండా తరువాతి తరాలకి కూడా సరిపడేలా వెనకెయ్యాలన్న తపనవల్లనో లేక, తమ సంతానం తమకన్నా ఇంకా పైస్థానంలో వుండాలన్న కోరికవల్లనో ఆ ఆశయాలని నెరవేర్చుకునే తొందరలో మనుషులు తమ చుట్టూ తమకు తెలియకుండానే గోడల ఎత్తుల్ని పెంచుతున్నారు. టీవీలో, టెక్స్టింగులు చేసే సెల్‌ఫోన్లో, లేక ఇంటర్నెట్ లాంటి టెక్నాలజీలో వచ్చి మానవసంబంధాలని త్రుంచేస్తున్నయ్ అని ఎవరైనా అంటే, ఇవేవీ లేని కాలంలోకూడా మామయ్య అందరి ఇళ్లనీ చుడుతున్నప్పుడుకూడా ఆయనలాగా ఎంతమంది మనుషులకోసం తపించారు?
“వ్యక్తులు, ఆర్థిక రాజకీయ పరిస్థితులకి లొంగిపోయి, కీలుబొమ్మలైన పక్షంలో వారి ప్రవర్తనకు వారు బాధ్యులు కారు; సమాజం అవుతుంది. అట్లాంటప్పుడు మంచిచెడ్డలకూ నైతిక విలువలకూ సమాజంలో స్థానమే వుండదు. బాహ్యప్రపంచంలో శక్తులకు లొంగిపోకుండా వాతావరణానికి అతీతం కాగలిగినప్పుడే, వ్యక్తిగతమైన నీతి ప్రస్తావనకు తావుంది,” అంటారు బుచ్చిబాబు.
బ్రతకడమే పరమావధిగా పెట్టుకోవడంవల్ల జీవించడం మరుగున పడిపోయిన వాతావరణంలో మామయ్యలాంటివాడు అక్కడక్కడా ఒక్కడు మిగలడంకూడా ఆశ్చర్యకరమే! అదికూడా మామూలుగా కాదు – అందమైన కట్టడానికి వెన్నుపూసలా నిలబడి!! వెన్నుపూస వున్నదని శ్రమపడకుండానే తెలుస్తుందిగానీ, మామయ్య ఏర్పరచిన బంధపు ఉనికిమాత్రం అంత తొందరగా తెలిసేదికాదు. తెలిసిన తరువాత మాత్రం దాన్ని తాజ్‌మహల్ కట్టడంలోవున్న బంధంతో పోల్చక తప్పదు. మామూలు కట్టడాలకీ, తాజ్‌మహల్‌కీ వున్న తేడా ఒక్క ఇటుకల్లోనేకాదు, వాటిని ఒక కట్టడంలా నిలపగిలిగే నేర్పూ, శక్తీ వాటిని కలిపివుంచే మోర్టార్ (సిమెంటు, ఇసుక మిక్స్ లాంటిది) లో కూడా వుంది. ఆయన నిర్మించినది తాజ్‌మహల్ అనీ, దానికి వాడిన ప్రత్యేకమయిన మోర్టార్ మనుషులు కావాలన్న ఆయన తపన అనీ నాకిప్పటిదాకా తెలియలేదంటే పెద్దగా ఆశ్చర్యంకలగలేదు. గాలి ఉనికినిగూర్చికూడా ఆలోచించంగదా! ఇప్పుడు నాకు అర్థమైన ఇంకో విషయం – ఈ కట్టడపు గొప్పదనమేమిటంటే, ఇది దూరంగా నిల్చుని చూడాల్సిందికాదు – అంతర్భాగమై అనుభవించగలిగేది. కాకపోతే, ఒకేవూళ్లో ఉండడంకూడా కారణంకాని సారథిలాంటి దూరపు చుట్టాలతో నాకు అంత క్లోజ్ కిన్‌షిప్ ఎలా వస్తుంది?
ఫోన్ మోగడం వినిపించలేదుగానీ, “వాళ్లతో నీకున్న పరిచయం మాకు లేదుగదా! నువ్వు రాకపోతే మేమెందుకు వెళ్లడం?” శారద కోపంగా ఫోన్లో మాట్లాడుతూండడంతో ఈ లోకంలోకి వచ్చాను. తను చెప్పేవేవో కాసేపు చెప్పింది. విసురుగా ఫోన్‌పెట్టేసి వచ్చి టీవీముందు కూర్చుంది.
“ఎవరితో పోట్లాడుతున్నావ్?” మెల్లిగానే అడిగినా అది గిల్లినట్టుంటుందని నాకు తెలుసు.
“మీ పుత్రరత్నంతో!” వ్యంగ్యంగానే వచ్చింది జవాబు.
“ఏవిట్ట?”
“సాయంకాలం వాడు మనతో గోల్డ్‌బర్గ్‌వాళ్లింటికి రాడట!”
“ఏమట?”
“అయ్యగారికి కాలేజీకి వెళ్లేముందర ఆ ముసలాళ్లకి ఒక కాన్సర్ట్ ఇవ్వాలని అయిడియా వచ్చిందట, వాళ్ల బాండ్ గ్రూప్ వాళ్లు సరేనన్నార్ట. ఇవాళ సాయంత్రంనించీ ప్రాక్టీస్ మొదలెడతార్ట! గోల్డ్‌బర్గ్‌వాళ్లింటికి వచ్చేవాళ్లందరూ తెల్లవాళ్లు. తెలిసినవాళ్లెవరూ వుండరు. నేను రాను. మీరెళ్లండి,” కోపంగా అని మళ్లీ పెళ్లి కవరేజ్ చూడడంలో నిమగ్నమైంది.
ఈ బాండ్ గ్రూపే, వాడి స్కూల్‌కోసం ఫండ్స్ రెయిజ్ చెయ్యడానికి టికెట్టుపెట్టి కాన్సర్ట్ యిస్తే తెలిసినవాళ్లందరికీ తను టిక్కెట్లుకూడా అమ్మింది. ఇది టికెట్టులేని వ్యవహారం. ఎవరూ నిర్దేశించడంవల్ల జరగబోతోందికాదు. శ్రోతల ఆనందాన్ని మాత్రమే ఆశించి తలపెట్టినది. హృదయపు అట్టడుగులోతుల్లోంచి బయటకు పెల్లుబికిన ఆప్యాయతవల్ల.
“మామయ్య పర్మనెంట్‌గా మాయింటికొచ్చేశాడా?” అన్న అనుమానం క్షణకాలంమాత్రం నా మదిలో కదలాడింది. తరువాత, శంకరంగారి – అదే, మామయ్య కుటుంబాన్నడిగితే ఆయన ఎవరికీ పర్మనెంట్ కాదని చెప్పేవాళ్లనిపించింది. మామయ్య జీవితంలోని ఒక పార్శ్వం హఠాత్తుగా కళ్లకి కట్టినట్లైంది. సిధ్ధూ శారద నెగెటివిటీని పట్టించుకోనట్లే మామయ్యగూడా ఆయన భార్య అబ్జెక్షన్లని లెక్కచేసుండడని అనుకొంటే అక్కడక్కడయినా ఇలాంటి “ఒక్కళ్లు” వుండడం ఆశ్చర్యకరమేననిపిస్తుంది. ఇదే గామోసు, బుచ్చిబాబు అన్నట్లు వాతావరణానికి అతీతంగా వుండగల్గడం! “ఒక్కడు” అనికాక “ఒక్కళ్లు” అని ఎందుకన్నానంటే, సిధ్ధూ ఇంకా పిల్లాడే అయినా వాడు అంతర్భాగమయ్యే అందమైన కట్టడమేదో నా కళ్లముందు లీలగా కదలాడుతోంది.
@ @ @
(ఎప్పుడో చదివిన ‘దర్శయంతి శరన్నద్యః ‘ అన్న ప్రారంభాన్నిమాత్రం ఇవ్వగానే పూర్తి శ్లోకాన్ని అందించిన శ్రీ తాడేపల్లి పతంజలిగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను – శివకుమార శర్మ)
చాలా బాగుంది.
శర్మ గారూ చాలా చాలా నచ్చిందండీ మీ కథ!
చివరి పేరా గ్రాఫ్ మరింత అందంగా అమరింది. చక్కని ఫీలింగ్ ఇచ్చింది కథ!
శివకుమార శర్మ గారు,
కథా, కథనం రెండూ చాలా బాగున్నాయి. “బ్రతకడమే పరమావధిగా పెట్టుకోవడంవల్ల జీవించడం మరుగున పడిపోయిన వాతావరణంలో…” లాంటి కొన్ని వాక్యాలు మనసుకు హత్తుకున్నాయి.