కవిత్వం

తీపి ఆకలి

సెప్టెంబర్ 2014

ఖరీదైనవేవీ వద్దు, సుదూరమైనవి, విచిత్ర
మైనవి, సచిత్రమైనవి కూడా వద్దు.

బెల్లం కలిపిన నువ్వుల పిండి కూరిన కొన్ని
పచ్చ జొన్న కుడుములు చాలు

మందపు గోధుమ రేకుల మధ్య శనగ పప్పు
బెల్లం ఫూర్ణం కూర్చినవైతే, వావ్

పండగ చేసుకోవాలి, కాసేపైనా

మిద్దె మీద చింత కొమ్మలు వుత్సవ జెండాలై
ఎగిరి ఎగిరి నవ్వాలి, పల్చని
ఆకులు గాలి నోటి బూరాలై

ఏముంది? ఇక్కడ ఏదేదే వున్నట్లు రంగు రంగుల
భాషలతో పెంధూళి చల్లి కళ్లు
కప్పొద్దు, ఉన్న దిగులు చాలు

తెల్లారడానికి బాగా ముందు పెట్రొమాక్స్ లైటు కాంతిలో
వూరుమ్మడి రుబ్బు రోలు పక్క మీంచి లేచి గల గల
కల కల వుదయించే వేయి కిరణాల రుబ్బుడు గుండు

లోపలి సూర్యుడికి చాల చాల అసలైన అకలేసి, చీకటి
తల్లి పైట చాటు నుంచి గుప్పెడు తీపి శనగ పూర్ణం లేదా
నువ్వుల పిండి దొంగిలించి కిలకిల పరిగెట్టాలి దొంగనా
కొడుకా అంటున్న అమ్మ మురిపాలు తొక్కుకుంటూ

ఆ పొద్దుటి పూట దొంగతనం కోసం రాత్రంతా మేల్కొని
వుంటుంది తీపి కలలు మూస్తూ తెరుస్తూ ఆకలి కన్ను

బహుశా మేల్కొనే వుంటుందిక ఎప్పటికీ ఇంతే ఆర్తిగా