సిలికాన్ లోయ సాక్షిగా

ఫీనిక్స్

సెప్టెంబర్ 2014

సిలికాన్ లోయ సాక్షిగా-17

ఆగస్టు నెల మొదటి వారం ఆహ్లాదపు  ఉదయం. పార్కులో కొమ్మల చేతులు పెకెత్తి సూర్యుడి వైపు తిరిగి ప్రార్థిస్తున్నట్లున్నాయి రెడ్ వుడ్  చెట్లు. నిలువెత్తు చెట్ల  మధ్య ఉన్న కాలిబాట పార్కు చుట్టూ పాము చుట్టలా ముడుచుకునుంది.

పెద్ద టొపీ పెట్టుకుని, పూల చొక్కా, బెర్ముడాపాంటు తొడుక్కుని దూరంగా నా వైపే వస్తున్న “లీ” నన్ను చూస్తూనే పలకరింపుగా చేతులూపింది.

“నీ- హౌ- మా”  చైనీస్ భాషలో “హౌఆర్ యూ”  అన్నాను దగ్గరగా వస్తూనే.

“ ఒ హేన్ హావ్, సిశ్యే, నీనా?” అని ఏదేదో అని

“నా కోసం నేర్చుకున్నావా మాండరీన్ ని! అందుకే నువ్వంటే ఇష్టం రియా” అంది.

“నా పేరుని పలకడానికి తనకి  కష్టం గా ఉందని, “రియా” అని నేనే పిలవమని  చెప్పేను”  అన్నాను నా వైపు ప్రశ్నార్థకంగా చూస్తూన్న నిధితో.

నా చెయ్యి పట్టుకుని నిధి “అటు అటు” అని ఉయ్యాలల వైపు నన్ను లాక్కెళ్లడాన్ని చూస్తూ

“నిధికి ఇంకా వేసవి సెలవులేనా?” నా పక్కనే వేగం తగ్గించి నెమ్మదిగా నడుస్తూ అడిగింది లీ.

“నువ్వెళ్ళి ఆడుకోమ్మా” నిధితో అని,

“లీ, నిన్న ఏమైందో తెలుసా?…….” అని హుషారుగా మాట్లాడుతున్న నా వైపు ప్రశంసా పూర్వకంగా చూసి

“ఎప్పుడూ నవ్వుతూ అందరితో కళకళ్ళాడే నీ ముఖం ఉంది చూసేవా? అది లాఫింగ్ బుద్ధా కంటే మంచి శుభాన్ని కలిగించేదిగా అనిపిస్తుంది నాకు. అందరికీ నువ్వు సంతోషాన్ని సమానంగా ఎలా పంచగలుగుతావు?” అంది.

“మరీ అంత పొగిడెయ్యకు లీ, నేను వొట్టి సామాన్యురాలిని” అన్నాను.

అన్నట్లు నీ పేరు “సుప్రియ” కదూ అంది తడబడుతూ.

“ఊ..సుప్రియా దేవి, మీలా మాకూ ఒక్క అక్షరం పేర్లు ఉంటే ఎంత బావుణ్ణో” అన్నాను.

తను నాపేరుని మొత్తం పలకడానికి ప్రయత్నించి సరిగా పలకలేక గట్టిగా నవ్వింది.

డెబ్భై అయిదేళ్ళ తన మెడ చర్మం మీద నవ్వు, గాలికి కదిలే కోనేటి అలల్లా పొరలుగా కదిలింది.

చప్పున నాకు మా ఊరు జ్ఞాపకం వచ్చింది.

“నేనొక అరగంట లో వస్తానూ…”

అని కాస్త దూరంగా వెళ్లి చేతిలో చిన్న అందమైన విసన కర్ర ని తీసి నిదానంగా చేతులు చాపి “థాయ్ చీ” వ్యాయామ నృత్యాన్ని ప్రారంభించింది లీ.

గాలిలో తేలే విహంగంలా చేతులు సాచి, అతి నెమ్మదిగా కాళ్లు  కాస్త పెకెత్తి దించుతూ, ఉండుండీ చప్పున చేతుల్ని ఊపి తీక్షణంగా చూసి మరల తనలో తను లీనమై “లీ” చేసే ఆ నృత్యాన్ని చూడడం కోసమైనా పార్కుకి రావాలనిపిస్తుంది నాకు. తనని అలా చూడడమే మనసుకి హాయి కలిగించే విషయం.

లీ నృత్యాన్ని చూస్తూంటే కోనేటిలో  మోకాటి లోతుకు దిగి తామరాకుల మీది నీటి బొట్లని తాకినప్పటి అనుభూతి నా మనస్సు నిండా.

నిధి పరుగున వచ్చి “మామీ, నా వైపే చూడు, నేను ఈ చివరి నుంచి ఆ చివరికి మంకీ బార్స్ ఎలా చేస్తున్నానో” అంది.

ధ్యానం పూర్తి చేసినట్లు వెలిగిపోతున్న ముఖంతో వచ్చి కూర్చుంటూ “రియా, నువ్వెంత అదృష్టవంతురాలివి” అంది లీ.

“ఎందుకు?” అన్నాను.

“ఇప్పుడిప్పుడే జీవితాన్ని ప్రారంభిస్తున్న ఇటువంటి స్టేజ్ లో మీరిక్కడ  స్థిరపడ్డారు. మీ పిల్లలు ఇక్కడే పుట్టి పెరుగుతారు. బహుశ: మీకు కూడా కొత్త జీవితం కొన్ని సంవత్సరాల తర్వాత అలవాటు అయిపోతుంది.”

“ఇప్పటికే అలవాటు అయిపోయింది. అందుకే ఇల్లు కూడా కొన్నాం. ” అని  నవ్వాను.

“చూసేవా, ఇక్కడికి వచ్చిన కొత్తలో బాగా దిగులుగా అనిపించేదని నువ్వే చెప్పావు,  ”

“అవన్నీ, అప్పుడు” అన్నాను.

“కానీ నాకలా కాదు, నా  జీవిత మూలాలన్నీ అక్కడే ఉండి పోయాయి.” అంది తను చెయ్యి గాల్లో చూపుతూ.

“భూగోళానికవతల  చిన్న పల్లెటూళ్లో పుట్టి, పెరిగిన నేను జీవితమంతా కష్ట జీవినే. మా పిల్లాణ్ణి మేం రెక్కల కష్టమ్మీద పెంచుకొచ్చేం. నాకు మొదట్నించీ పట్టుదల ఎక్కువ. ఏదైనా సాధించాలనుకుంటే అది జరిగి తీరవలసిందే. అలాగే పట్టుదలగా ఇంగ్లీషు కూడా నేర్చుకున్నాను. నా లక్షణాలే వచ్చాయి మా అబ్బాయికి.

ఆ పట్టుదల వల్లే అమెరికా అంత దూరం వచ్చాడు.

మా దేశపు పద్ధతి పటించక్కరలేకుండా ఎంత మంది పిల్లలనైనా కనే మంచి అవకాశం ఉంది ఇక్కడ. అయినా  వాళ్ళేమిటో ఇద్దరు పిల్లలతో ఆపేసేరు.

‘అదృష్టం కొద్దీ ఈ దేశానికి వచ్చి ఉద్యోగంలో కుదురుకున్నాను.’ అంటుంటాడు మా అబ్బాయి.

కానీ వాళ్ళ అదృష్టం నాకు దురదృష్టంగా మారుతుందని ఎప్పుడూ అనుకోలేదు.” అంది చిన్నగా నవ్వుతూ.

“ఇంత ప్రశాంతంగా  ఉండే నీకు దురదృష్టమా?” అన్నాను.

“ఎటో చూస్తూ, చూడు పిల్లలు ఎంత చక్కగా ఉయ్యాలలూగుతున్నారో ఎటువంటి భవిష్యదాలోచన లేకుండా.

అలాగే ఉండాలనే నా  తాపత్రయమూను. పార్కుకి వచ్చేనంటే  మనసు గాల్లో తేలుతున్నట్లు  శరీరం ఉత్సాహ పడుతుంది. ఇంటికి వెళ్లేనంటే గదుల గోడలన్నీ నా మీద దండయాత్ర చేస్తాయి. నన్ను నన్ను గా ఉండనివ్వవు. జ్ఞాపకాల తేనటీగలు కుడుతూ నిరంతరం బాధిస్తాయి.” అంది.

“ముఖమ్మీద చిన్న ముడుతలు చూపిస్తూ  చూసేవా, నాకిక్కడ ఉన్నన్నాళ్లూ ఇలా ముడుతలు పెరిగిపోతాయి.” అని

అబ్బాయి వాళ్లు నాకు గ్రీన్ కార్డు కిందటేడాది అప్ప్లై చేసారు.

అది వచ్చేందుకు ఒక సంవత్సరం పట్టింది. ఒకసారి అప్లై చేసాక ఇక్కడే ఉండాలన్న నిబంధన ప్రకారం అప్పుడంతా ఇక్కడే ఉండక తప్పింది కాదు. ఇప్పుడిక గ్రీన్ కార్డు వచ్చేక మా దేశం వెళితే ఆర్నెల్లలో తిరిగి రావాల్సిందే. అక్కడే ఉండిపోవడానికి ఆస్కారం కూడా లేదు. ఇంకా సిటిజన్ షిప్ కి అప్లై చేస్తారట. అదింకో అయిదేళ్ళట. అయిదేళ్ళు… ఎన్ని సుదీర్ఘమైన రోజులు! అయినా నేనుంటానా అన్నాళ్ళు? ఏమో… నాకస్సలు ఇక్కడుండడం ఇష్టం లేదు” అంది.

“మరి ఇష్టం లేనప్పుడు మొదటే మీ అబ్బాయితో చెప్పకపోయావా గ్రీన్ కార్డు  చెయ్యొద్దని” అన్నాను.

“మొదట్లో వీళ్ళు ఇలాంటి విషయాలేవీ పట్టించుకోలేదు. అసలిదంతా వీళ్ల నాన్న పోయేక మొదలైంది. తండ్రి చివరి చూపు దక్కలేదనే బాధో, అపరాధ  భావనో వెంటాడడం మొదలు పెట్టిందనుకుంటా వీడికి,అప్పట్నించి ‘తప్పని సరిగా నువ్వు నా దగ్గిర ఉండవలసిందే’  అని పట్టుబట్టి ఈ అప్లికేషన్లన్నీ పెట్టేడు. నా శేష జీవితం వీళ్ల దగ్గిర గడవాలన్న ఆలోచన వీళ్ళకి ఉండడం మాటకేం గానీ, నాకైతే జైలులో ఉన్నట్లుంది. నాకిక్కడ  స్నేహితుల్లేరు, బంధువుల్లేరు. అసలు ఉదయం వీళ్లంతా ఇంటి నించి వెళ్లిపోయేక సాయంత్రం వరకూ నా గురించి పట్టించుకునే దిక్కు లేదు.”

“ఇవన్నీ అందరి జీవితాల్లో తప్పని సరి కదా లీ, ఉద్యోగాలు చేసే వాళ్ల కుటుంబ సభ్యులకి తప్పని బాధలివి. అయినా  సాయంత్రానికి  అంతా ఇంటికి వచ్చేస్తారుగా” అన్నాను.

“ఆ… వస్తారు. ఒక మాటా, మంతా? ఎవరి కంప్యూటర్ల ముందు వాళ్లు అర్థ రాత్రి దాకా గడుపుతారు. పిల్లలూ అంతే. గదుల్లో దూరి డివైజుల్లో తలదూర్చి గడుపుతారు. వీళ్లకి  కలిసి తినడానిక్కూడా  సమయం లేదు. డెస్కుల దగ్గిరే తినే కప్పులు పెట్టుకుని ఎవరి ప్రపంచం వారిదన్నట్లు ఉంటారు.”

“టీవీ లేదా” అన్నాను.

“అబ్బా, టీవీ ఎంతకని చూస్తాం? మా అబ్బాయి నాకోసం చైనీస్ ఛానల్సు పెట్టించాడు. టీవీ చూస్తూ సోమరిపోతులా తయారవ్వడం నాకు ఇష్టం లేదు. మా ఊర్లో అయితే ఎంత పని చేసినా ఇంకా తరగని పనెంతో  మిగిలిపోతుంది. అక్కడ వస్తువుల మీద మాకెంతో మమకారం కూడా ఉంటుంది. ఇక్కడ మిషన్లతో  పని చేయిస్తూ ఉన్నా మనుషులకి అటాచ్ మెంట్ లేదు వేటి పైనా.” అని నవ్వింది.

నవ్వినప్పుడు ముందు పలు వరసలో వెండి పన్ను మెరుస్తుంది.

“మీకూ, మాకూ చాలా విషయాల్లో దగ్గిర పోలికలున్నాయనిపిస్తుంది లీ, అన్నాను.”

“ఏదీ, ఇలా వెండి పళ్లు కట్టించుకోవడంలోనా?” అని మళ్లీ నవ్వింది.

***

“లీ తో పరిచయం భలే తమాషాగా జరిగిందిలే” అన్నాను సూర్యతో.

ఇక్కడి చైనీయులెవ్వరూ అంత సులభంగా బయటి వాళ్ళతో మాట్లాడరు సరికదా, కొత్త వాళ్ళని చూసినప్పుడు ఇక్కడి అమెరికన్సులాగా నవ్వను కూడా నవ్వరు.

కానీ లీ అందులో తప్ప పుట్టినట్లు నన్ను చూడగానే పరిచయంగా నవ్వింది.

తనలో ఆకర్షించే ఆ చిర్నవ్వు కి ప్రతి చిర్నవ్వు నవ్వకుండా ఉండలేరెవ్వరూ.

“నేను ఇవేళ చైనీ భాషలో తనని పలకరించేసరికి ఆశ్చర్య పోయింది తెలుసా” అన్నాను.

“అవునూ, వాళ్ళ భాష నాకెలా తెల్సూ? అని నీకు డౌటు వచ్చుండాలే” అన్నాను మళ్ళి.

నా వైపు చిర్నవ్వుతో చూస్తూ, “ఊ.. నేనడిగే అవకాశం ఎక్కడిది?” అన్నాడు.

“అదే… విషయమేమిటంటే … నా చిన్నప్పుడు నాకు భాషలంటే పిచ్చి అని చెప్పాను కదా. అప్పట్లో ఎక్కడో పత్రికలో అన్ని భాషలలోను, “హౌ ఆర్ యూ”  అనడం ఎలాగో రాసేడు. అవన్నీ నోటు పుస్తకం లో రాసుకుని రోజూ కంఠతా పట్టేదాన్నన్న మాట. అది ఇప్పుడిలా పనికి వచ్చింది” అన్నాను.

“పాపం తనకి ఇక్కడ చాలా ఒంటరిగా ఉన్నట్లుంది” అన్నాను అంతలోనే మ్లానమైన తన ముఖం గుర్తొచ్చి.

“నువ్వు ప్రతీ ఒక్కరి బాధా పట్టించుకుని ఇలా వర్రీ కాకు” అన్నాడు అనునయంగా సూర్య.

***

“ఇక్కడి వాతావరణం మరీ దారుణం, ఉన్నట్లుండి ఒక్కసారిగా మబ్బు పట్టేసి ప్రపంచం స్తంభించిపోయినట్లు అయిపోతుంది, ఎండ రోజు మొత్తమ్మీద మచ్చుక్కూడా రాదు విచిత్రంగా” అన్నాను.

“నువ్వు చైనా రావాల్సిందే. ” అని నవ్వింది లీ.

“నా పూర్తి పేరు “ఫోంగ్ లీ ” , మీ ఇంగ్లీషులో #feng# అంటారు. అంటే ఏవిటో తెలుసా?- ఫీనిక్స్”

“అంటే తన పిల్లల కోసం తను దహనమయిపోయే ఉదాత్త పక్షిరాజం”  కదా  అన్నాను.

“మా అమ్మా, నాన్నా ఆ పేరు ఎందుకు పెట్టేరో తెలీదు కానీ, నేను జీవితమంతా స్వేచ్ఛా విహంగం లాగే జీవించేను. నాకు నచ్చినట్లే బతికేను. ఒక్కొక్కప్పుడు నాకే అనిపిస్తుంది, అప్పుడంతా అలా బతికేను కాబట్టే చివరి రోజుల్లో ఇలా నచ్చని  చోట ఉండాల్సి వచ్చేట్లు చేసాడా భగవంతుడు అని” అని నిట్టూర్చింది.”

“మాటిమాటికీ నచ్చని చోటు అని ఎందుకు బాధపడతావు లీ, నీ కుటుంబం అంటే నీ కొడుకే కదా , ప్రతీ రోజు కొడుకుని చూస్తూన్నా అని సంతోషంగా ఉండచ్చు కదా, చక్కగా మనవలతో ఆడుకుంటూ రిలాక్స్డ్ గా గడపొచ్చు కదా..” అని,

“ఆ మాటకొస్తే నాకు మాత్రం దిగులు లేదనుకుంటున్నావా? పుట్టి బుద్ధెరిగాకా ఉన్న అన్ని బంధాల్ని వదిలేసుకుని కేవలం మా కుటుంబం మాత్రమే ఇక్కడికి వచ్చేసేం. అమ్మా, నాన్నా, అన్నదమ్ములూ స్నేహితులూ , బంధువులూ అందరినీ వదిలిపెట్టి ఇంతలేసి  దూరాల్లో ఉండడం  ఎవరికైనా బాధాకరమే, కానీ ఎప్పుడూ ఎక్కడా ఆగి పోకుండా నిరంతరం ప్రవహించేదే జీవితం కదా. వలస తప్పనప్పుడు జీవితం బరువెక్కడమూ తప్పుదు.” అన్నాను అనునయంగా.

“అవును, నీకు భర్త తోడిదే లోకం అనుకున్నావు గనుక వచ్చేసేవు, నేనూ అలాగే అనుకున్నాను.  కానీ నా భర్త అస్థికలు అక్కడే ఉన్నాయి కదా ” అంది చెమర్చిన కళ్ళతో.

ఒక్క నిమిషం కళ్ళు ఒత్తుకుని “కొడుకు నాలో భాగమే, కానీ నా వాడు కాదని నిరంతరం ఇంట్లో గుర్తు చేస్తుంది వాడి భార్య. ఇక పిల్లలంటావా, ఇక్కడి పద్ధతిలో పెరిగిన వాళ్ళు గాబట్టి అనుబంధాలు లేనట్లే ఉంటారు. వీళ్ళంతా యంత్రాలతో పనిచేస్తున్నామని అనుకుంటున్నారు, కానీ యంత్రాలుగా మారిపోయారు, మధ్యలో నీలాంటి ఒయాసిస్సు దొరకడం నా అదృష్టం. కష్టం, నష్టం చెప్పుకోవడానికో మనిషి ఆసరా దొరికిందన్న సంతోషం నాకు రియా” అని ”సి శ్యే” ,”తంగ్ చూ” అని చైనీ భాషలోనూ, చైనీ యాసలో ఇంగ్లీషులోనూ  థాంక్స్ చెప్పి లేచింది.

గరుడ పక్షి నేల వాలి నట్లు విశాలమైన రెక్కలు సాచి “థాయ్ చీ” నృత్యం ప్రారంభించింది లీ.

తనలో తను లీనమై ప్రసన్న వదనంతో ఎక్కడో గానం వినిపిస్తున్నట్లు అనుగుణంగా పాదాలు కదుపుతూంది. జ్ఞాపకాలే జీవనం గా బతకాల్సిన అమెరికాలో తనతో పాటూ నాట్యం చేయడానికి మేమున్నామని చెట్ల కొమ్మలు  ఊగుతున్నట్లు గాలి మంద్రంగా వీస్తూంది.

*** * ***