అనువాదం చేయడమంటే చేతిలో కర్రకు బదులు మూల కథను ఒకచేతిలో అనువాద కథను మరో చేతిలో పట్టుకుని తీగమీద నడవడం. విభిన్న శైలులతో ఉండే కధలను ఆయా మూలకథల ఆత్మ ఏమాత్రం ధ్వంసం కాకుండా తెలుగు భాషలోకి అనువదించటం నిజంగా కత్తిమీద నడవడం లాంటిదే! అలాంటి అనువాదాలు ఒక్కటి కాదు రెండు కాదు.. పూర్తిగా నూరు కథలను తెలుగులోకి అనువదించిన కొల్లూరి సోమ శంకర్ గారికి అభినందనలు తెలియజేస్తూ వాకిలి ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ:
1. సోమ శంకర్ గారు, ముందుగా మీకు వంద కథల అనువాదం పూర్తయిన సందర్భంగా అభినందనలు!
థాంక్యూ. నమస్కారం. ముందుగా, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు, నా వందో అనువాద కథను ప్రచురిస్తున్నందుకు వాకిలి బృందానికి ధన్యవాదాలు.
2. ఏ భాష నుండి ఎక్కువ కథలు అనువదించారు. ఎందువల్ల?
ఇంగ్లీషు నుంచి 75 కథలు, హిందీ నుంచి 21 కథలు అనువదించాను. ఇంగ్లీషు నుంచి అనువదించిన కథల్లో ఇతర భారతీయ భాషలవీ, విదేశీ భాషలవీ కూడా ఉన్నాయి. తెలుగు నుంచి హిందీలోకి 4 కథలని అనువదించాను.
ఇంగ్లీషు నుంచే ఎక్కువగా ఎందుకు అంటే.. ఇంటర్నెట్లో ఎక్కువగా అందుబాటులో ఉన్నవి ఆంగ్ల సాహిత్యపు వెబ్జైన్లే. ఇంటర్నెట్ కూడా ఎక్కువగా ఆంగ్ల మాధ్యమం ద్వారా ఉపయోగించబడుతుండడంతో, తమ రచనలను వెబ్‌లో ప్రచురించుకోడం కోసం ఆంగ్లంలో రాస్తున్నారు. భారతీయ భాషా రచయితలు కూడా తమ కథలని ఇంగ్లీషులో రాయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది కాలంగా అంటే యూనికోడ్ అభివృద్ధి చెందిన తర్వాత భారతీయ భాషలలోనూ అనేక వెబ్జైన్లు వస్తున్నా… ఆయా భారతీయ భాషలలో రాసిన కథలు.. ఆ భాష తెలిసిన వాళ్ళకే పరిమితం అవుతాయి. అదే ఇంగ్లీష్ అయితే ఏ ప్రాంతపు లేదా విదేశీ కథలనైనా చదువుకోగలం.
3. అసలెలా కలిగింది ఈ ఆసక్తి. ఎప్పటినుండి? మొదటి అనువాద కథ గురించి అప్పటి ఇబ్బందులు, అనుభవాల గురించి?
చిన్నప్పటి నుంచి బాగా చదివే అలవాటు.. బాల్యంలో చందమామ, బాలమిత్రల నుంచి… కాలేజీ రోజులలో వారపత్రికలు, నవలలు చదవడం వరకు ఆ అలవాటు పోలేదు.
1998లో ఓ చిన్న వ్యాసాన్ని అనువదించడంతో ప్రారంభమైంది. కాకపోతే ఆ పత్రిక వారు అనువాదానికి అనుమతి నిరాకరిండంతో ఆ వ్యాసం తెలుగు వెర్షన్ వెలుగు చూడలేదు. చదివించేలా నేను రాయగలననే నమ్మకం కలిగించిందా అనువాదం. అనువాదాల కన్నా ముందుగా, సెప్టెంబర్ 1998 నుంచి ఫిబ్రవరి 1999 వరకు Indian Express దిన పత్రిక లోని Career Express అనే పేజిలో “జనరల్ అవేర్నెస్” అనే శీర్షిక నిర్వహించాను. ఈ ఫీచర్ అచ్చవడంతో నా మీద నాకు ధైర్యం ఏర్పడింది. నా మొదటి అనువాద కథ కన్నా ముందే నేను రాసిన సొంత కథలు రెండు ప్రచురితమయ్యాయి. 9 నవంబర్ 2002 నాటి ఆంధ్రప్రభ వారపత్రికలో “విశ్వకదంబం” శీర్షికన నా మొదటి అనువాద కథ “బాకీ” ప్రచురితమైంది. దీనికి మూలం “ది లెర్నింగ్ స్టాంప్” అనే అమెరికన్ కథ. ఆ కథలో ప్రస్తావించిన Mustang కారుని నేను పొరపాటుగా ముస్తాంగ్ అని రాసాను. కాని దాన్ని మస్టాంగ్ అనాలని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఈ కథలో ఓ కుర్రాడు తనకి బాగా ఇష్టమైన ఓ పాతకారుని బాగు చేయించుకోవాలనుకుంటాడు. దాని రిపేర్‌కి అయ్యే డబ్బులు అతని దగ్గర ఉండవు. ఆ గారేజ్ లోనే పార్ట్ టైం పని చేసి, కారుని బాగు చేయించుకుంటాడు. మనిషిని బాహ్యంగా అంచనా వేసేకన్నా, అతడి ప్రవర్తన, నడవడి ద్వారా అతడిని గురించి తెలుసుకోవాలని, అలా అర్థం చేసుకుంటూ, ఎదుటివారికి మనమూ సాయం చేసి, మానవత్వపు పరిమళాన్ని మనమూ కాస్త అంటిచ్చుకోవచ్చని ఈ కథ చెబుతుంది. కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించడం కాదు, చేసే ఏ పనైనా నిజాయితీగా చేసి సక్రమ పద్దతిలో డబ్బు సంపాదించాలని ఈ కథ చెబుతుంది. పనిచేసే చోట తమ వ్యక్తిగత విషయాలు ప్రస్తావించకుండా, పనిని ఏకాగ్రతతో చేయాలని ఈ కథ సూచిస్తుంది.
అయితే నేను మనసులో భావించినంత స్పష్టంగా ఈ కథని అనువదించలేకపోయాను. బహుశా అమెరికా పని సంస్కృతితో అప్పటివరకూ పరిచయం లేకపోవడం, సరైన పరిశోధన చేయకపోవడం కారణం కావచ్చు. నాకు నచ్చిన కథని, తొందరగా తోటి పాఠకులతో పంచేసుకోవాలన్న తపన, అచ్చులో నా పేరు చూసుకోవాలన్న ఆతృత… ఇవన్నీ ఆ కథలో కొంత అస్పష్టతకి తావిచ్చాయి. ఒక కథని చదవగానే బాగుందనిపిస్తుంది. వెంటనే అనువాదానికి పూనుకోకుండా, రెండు మూడు సార్లు మళ్ళీ మళ్ళీ చదివితే, ఇంకో కోణంలో అర్థమవుతుందా కథ. నా మొదటి రెండు మూడు అనువాదాలలో ఈ జాగ్రత్తలేవీ తీసుకోలేదు.
4. అనువదించేటప్పుడు బాగ సులభంగా అయిపోయే పని, చాల కష్టంగా అయ్యే పనీ ఏంటి. అసలెలా చేస్తారు? అంటే ప్రతీ వాక్యాన్ని తిరగరాయడం, లేక సారాంశం రాసుకుని స్వేచ్ఛగా అనువదించడం.
అనువదించేడప్పుడు బాగా సులువుగా అయిపోయేది తెలుగులో రాయడమే. కథని చదువుతున్నప్పుడే, అది తెలుగులో ఉంటే ఎలా ఉంటుందో ఊహిస్తాను. అలా చదువుకోడమే నాకు మొదట్నించి అలవాటు. అనువదించాలని నిర్ణయించుకుని, రచయిత అనుమతి తీసుకునే నాటికి ఆ కథని ఎలా రాయాలన్నదానిపై ఒక స్పష్టత వచ్చేస్తుంది. కష్టంగా అయ్యేదీ అంటే… ఆ కథలో ఏదైనా అంతరార్థం ఉందా? పాత్రలు ఏవైనా అవ్యక్తంగా చెబుతున్నాయా? జాగ్రత్తగా చదివితే గాని స్ఫురించని విశేషాలు!
వీలైనంత వరకూ మూలాన్ని యథాతథంగానే రాస్తాను. ప్రతీ వ్యాక్యాన్ని తిరగరాస్తాను, అవసరమైన చోట్ల స్వేచ్ఛగా అనువదిస్తాను. తెలుగులో చదివితే, అనువాదం అనిపించేలా కాకుండా, తెలుగు కథనే చదువుతున్న అనుభూతి కలిగేలా వీలైనంత వరకూ జాగ్రత్తపడతాను.
5. ఏ భాష కథనైనా ఇంగ్లీష్ నుండే తీసుకుంటారా? నేరుగా చదివి అర్థం చేసుకోగల భాషలేంటి? అలా నేరుగా చదవగల ఇతర భాషలుంటే వాటి సాహిత్యంలో మీకు రుచించే ప్రత్యేకతలేంటి? (భాషాపరంగా, అభివ్యక్తి పరంగా)
తెలుగు కాకుండా నాకు చదవడం రాయడం వచ్చినవి హిందీ, ఇంగ్లీషు మాత్రమే. కాబట్టి ఆ రెండు భాషల నుంచే అనువాదాలకి తీసుకుంటాను. హిందీలో భాషా ప్రవీణ పాసయ్యాను. హిందీ పేరుకి ఒకటే భాష అయినా, ఒక్కో ఉత్తరాది రాష్ట్రానిదీ ఒక్కో మాండలీకం. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే అవధీ, బ్రజ్, కన్నౌజీ, బగేలీ.. ఇలా పలురకాల హిందీ ఉంది.
భాషాపరంగా, అభివ్యక్తి పరంగా ఆయా సాహిత్యాలలోని ప్రత్యేకతలను విశేషంగా చెప్పలేను. తెలుగులో వస్తున్నట్లే, హిందీలోనూ జండర్, ప్రైవేటైజేషన్, అర్బనైజేషన్, ఎక్స్‌ప్లాయిటేషన్.. లాంటి వస్తువులతో కథలొస్తున్నాయి. మీరడిగిన కోణంలోకి వస్తుందో రాదో కాని, నేను బాగా గమనించిన విషయం ఒకటుంది – హిందీలో నగరం/పట్టణాల నేపథ్యం కంటే గ్రామీణ నేపథ్యం కథలు ఎక్కువగా ఉన్నాయి.
నా అనువాదాలకి నేను అనుభూతి ప్రధానమైన కథలను ఎన్నుకున్నాను, మనసుకి తాకే ఇతివృత్తాలను ఎంచుకున్నాను.
6. పదాల అర్థాలకి డిక్షనరీలుంటాయి. కానీ కొన్ని ప్రాంతాలకి మాత్రమే తెలిసే ప్రత్యేకమైన వాడుకలు, నుడికారాలు, జాతీయాలను గమనించడం వాటికి సరైన తెలుగు భావం తీసుకురావడం గురించి కొన్ని ఉదాహరణలు చెప్పగలరా?
నిఘంటువులు చెప్పని అర్థాలున్న వాడుకలు/ప్రయోగాలు/నుడికారాలు/జాతీయతల గురించి తెలుసుకోడానికి ఇంటర్నెట్నే ఎక్కువగా ఆశ్రయించేవాడిని. ఇంటర్నెట్లో సమాచారం దొరకనప్పుడు నా హిందీ స్నేహితులని సంప్రదించేవాడిని, మరీ అవసరమైతే మూల రచయితనీ అడిగేవాడిని. ఆయా వాడుకలు/ప్రయోగాలు/నుడికారాలు/జాతీయతలకు ఒక్కోసారి సందర్భాన్ని బట్టి అర్థాలు మారిపోతూంటాయి. కాబట్టి మూల కథలో ఏ సెన్స్‌తో ఉపయోగించారో తెలుగులో కూడా అదే విధంగా ప్రయోగించాలి. అటువంటి అర్థమిచ్చే తెలుగు నుడికారాలు, పలుకుబడులు ఉంటే అవే ఉపయోగిస్తాను. లేదా ఆ సందర్భానికి తగినట్లుగా ఆ వాక్యలను సమ్మరైజ్ చేయడమో లేదా అర్థం స్ఫురించేడట్లు తెలుగులో రాయడమో చేసేవాడిని.
ఇటీవలే అనువదించిన ఓ హిందీ కథలో ఉర్దూ సామెత ఒకటి ఉపయోగించారు రచయిత్రి. ना खुदा ही मिला ना विसाले सनम ना इधर के रहे ना.. అనే ఆ ప్రయోగం సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది. “I found neither faith, nor union with my lover/And now I belong neither there nor here” అని సాధారణ అర్థం. కొంతమంది సనమ్ అనే పదానికి ప్రియురాలు/దేవీప్రతిమ అనే అర్థాన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ కథలో అవేవీ సరైనవి కావనిపించింది. సందర్భానికి తగ్గట్టుగా “పరమూ పోయిందీ, ఇహమూ పోయింది. అక్కడికి వెళ్ళలేకపోయాను, ఇక్కడ ఉండలేకపోతున్నాను” అని రాసాను.
అలాగే, నేను అనువదించిన ఓ విదేశీకథలో (“ఏడు గంటల వార్తలు”, ఈమాట జూలై 2009) వేరే దేశంలో పర్యటిస్తున్న నెరేటర్ కుటుంబం వెడుతున్న కారుని వెతకడానికి సైనికులు ఆపుతారు. ఓ సైనికుడు అంటాడు “I’ll need to look in the boot.” అని. దీన్ని నేను పొరపాటుగా అర్థం చేసుకుని కాలికి ధరించే బూట్లుని వెతకాలి అన్నట్లు రాసాను. అయితే, ఎడిటర్ గారు నాకు మెయిల్ చేసారు, బూట్ అంటే కారు డిక్కీ అనే informal meaning ఉందనీ, ఆ సందర్భంలో వాడాల్సిన పదం అదేనని. వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈ అనుభవం దృష్ట్యా, ఇలాంటి ప్రయోగాలు కథానుగుణంగా వచ్చినప్పుడు వాటికున్న అన్ని రకలా అర్థాలు తెలుసుకుని, సరైన అర్థం ఉపయోగించడం నేర్చుకున్నాను.
ఇటువంటి సమస్యే నాకు తెలుగులో కన్నా, హిందీలో బాగా ఎక్కువగా ఎదురైంది. శ్రీ కె.వి. నరేందర్ గారి కథ “చీపురు”ని నేను హిందీలోకి అనువదించేడప్పుడు.. కొన్ని వాక్యాలను హిందీలో యథాతథంగా రాయలేకపోయాను. ముఖ్యంగా “తల్లిలేని కోడిపిల్లలు వడ్ల గింజల కోసం దుమ్ము లేపుతున్నట్లు….” ఈ వాక్యం హిందీలోకి తర్జుమా చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఈ అర్థం రావడానికి చాలా పెద్ద వాక్యం రాయల్సొచ్చింది.
7. ఏ రచయిత కథల మీద ఎక్కువ పని చేశారు? ఎందుకు?
మలయాళ రచయిత శ్రీ ఎం.కె. చాంద్రాజ్ గారి ఆరు కథలను తెలుగులోకి అనువదించాను. అలాగే హిందీ నుంచి శ్రీ జైనందన్ కుమార్. వీరివి మూడు కథలు అనువదించాను. మా భావాలు బాగా కలిసాయి. వీరు ఎంచుకునే కథాంశాలు నాకు బాగా నచ్చుతాయి. ఈ కథలన్ని నా ఆలోచనా ధోరణికి దగ్గరగా ఉన్నవే. నేను నా సొంతంగా రాస్తే ఎలాంటి కథ రాస్తానో, అలాంటి కథలనే వీళ్ళూ రాసారు. వ్యక్తిగత సమస్యలూ, సామాజికాంశాలను మిళితం చేస్తూ, కథా రూపంలో చెప్పడం వీరి ప్రత్యేకత. వీళ్ళ కథలని చదువుతున్నప్పడు అవి ఏదో పరాయి భాష కథల్లా అనిపించవు. మన కథలనే, మరో భాషలో చెబుతున్నారనిపిస్తుంది.
రాజారాం బాలాజీ అని తమిళనాడుకి చెందిన రచయిత ఆంగ్లకథలని అయిదు అనువదించాను. ఈయన కథల్లో అంతర్లీనంగా వ్యంగ్యం ఉంటుంది, మధ్య తరగతి మనుషులని ప్రభావితం చేస్తున్న మార్కెట్ మాయాజాలంపై అధిక్షేప ధోరణిలో చెణుకులు వేస్తారు.
8. కథల అనుమతుల కోసం, సందేహ నివృత్తి కోసం మూల రచయితలతో మాట్లాడ్దం వల్ల కథ కంటే ఎక్కువ విషయాలు తెలిసినవి, బాగా గుర్తున్నవీ సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
నేను ఎక్కువగా సమకాలీన రచయిత కథలు అనువదిస్తాను కాబట్టి, రచయితలతో ఈ-మెయిల్లో సంప్రదిస్తూంటాను. ఒక్కోసారి కథకన్నా, ఆ కథకి నేపథ్యం తెలుసుకోడం ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగులో అమృతవర్షిణి అనే పేరుతో నేను అనువదించిన కథకి సంబంధించిన నేపథ్యం గురించి, రచయిత శ్రీ ఎం.కె. చాంద్రాజ్ గారిని సంప్రదించడం వల్ల కొన్ని విషయాలు తెలిసాయి. కేరళలో ఎండోసల్ఫాన్ని విచక్షణా రహితంగా వాడడం వల్ల పిల్లలు జన్యులోపాలతో పుట్టడం, ఎదిగిన పిల్లలు హఠాత్తుగా పక్షవాతానికి లోనవడం వంటి సంఘటనల గురించి తెలుసుకున్నాను. కథకి ప్రత్యక్ష్యంగా సంబంధంలేకపోయినా, ఆయన కొన్ని స్టాటిస్టిక్స్ పంపించారు. వాటిని పరిశీలిస్తే, ప్రమాదకరమైన రసాయనాలను నిషేధించడంలో మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో అర్థమైంది. అలాగే ఆయన రాసినదే మరో కథ చదివినప్పుడు… (ఈ కథని తెలుగులోకి అనువదించలేదనుకోండి.. అది వేరే విషయం), ఆ కథకి సంబంధించిన నేపథ్య సమాచారం సాప్ట్ డ్రింక్స్ తయారీలో మంచి నీటి వాడకం గురించి, భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం గురించి తెలిసింది. ఈ సమాచారాన్ని నా సొంత కథలో కాస్త ఉపయోగించాను.
9. ఇతర భారతీయ భాషలు మాత్రమేనా, విదేశీ కథలు కూడా చేశారా? ఈ రెండిటి మధ్యా ఇతివృత్తాల పరంగా, వ్యక్తీకరణ, శైలి పరంగా మీకనిపించిన తేడాలేంటి?
ఇందాక చెప్పినట్లు, నా మొదటి అనువాద కథే విదేశీ కథ. మొత్తం 12 విదేశీ కథలను అనువదించాను. ఇందులో 4 కథలు యుద్ధం/తీవ్రవాదం నేపథ్యంలో ఉంటాయి. 2 కథలు మానవత్వంపై; గాంధీ గారి గురించి ఒక కథ; అమెరికన్ సివిల్ వార్ గురించి ఓ కథ; అమెరికాలోని వర్ణవివక్షపై ఓ కథ; వాన దొంగ, విషవలయం కథలు మానసిక విశ్లేషణలపైన ఉన్నాయి. విదేశీ కథల ఇతివృత్తాలూ, మన ఇతివృత్తాలకీ మూలం ఆయా దేశాలలోని సామాజిక, వ్యక్తిగత సమస్యలే అయినా, మన కథలకి భౌగోళిక పరిమితులుంటే… విదేశీ కథలకి ఆ పరిమితి ఉన్నట్లు అనిపించదు. విదేశీ కథలలో, మన కథలతో పోలిస్తే, నాటకీయత తక్కువగా ఉంటుంది.
10. సమకాలీన కథల్నే ఎక్కువగా ఎంచుకుంటారు కదా? గత పదిపదిహేనేళ్లలో తెలుగు కథలకి ఇతర భాషా కథలకి మీరు గమనించిన తేడాలేంటి?
నేను అకడమిక్ దృష్టితో పరిశీలించకపోయినా, అనువాదాల కోసం కథలు ఎక్కువగానే చదువుతాను. నేను గమనించినదేంటంటే.. తెలుగులో వస్తున్నట్లే, ఇతర భాషలలోనూ జండర్, ప్రైవేటైజేషన్, అర్బనైజేషన్, ఎక్స్‌ప్లాయిటేషన్.. లాంటి వస్తువులతో కథలొస్తున్నాయి. గత అయిదారేళ్ళుగా తెలుగులో అస్తిత్వవాద కథలు ఎక్కువయ్యాయి. ఇతర భాషల్లోనూ ఈ ధోరణి ఉన్నా, తెలుగులో చాలా ఎక్కువగా వచ్చినట్లు అనిపిస్తుంది. అలాగే కథల్లో స్థానికత చోటు చేసుకోడం తెలుగులో ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనబడుతుంది. హిందీ కథల్లో వ్యంగ్యానికి మంచి ఆదరణ ఉంది, వ్యంగ్య రచనలు బాగా ప్రచురితమవుతాయి. మన దగ్గర వ్యంగ్య కథలకి ఆదరణ తక్కువేమో అనిపిస్తుంది. వ్యంగ్యం ఉన్నా అది రాజకీయాలకు, సినిమాలకే పరిమితమైపోయింది.
11. నవల్లేవీ అనువదించలేదా? అలా చెయ్యాలనిపించిన నవల్లేమైనా ఉన్నాయా?
అనువదించాను. 1999లో “The Adventures of Pinocchio” అనే పిల్లల నవలని చదివిన తర్వాత, ఆ ఇతివృత్తం, పాత్రల ప్రవర్తన ద్వారా పిల్లలకి మంచి చెప్పడానికి ప్రయత్నించడం నాకు బాగా నచ్చాయి. ఆ పుస్తకం ప్రచురణకర్తలను సంప్రదిస్తే, అది కాపీరైట్ పరిధిలో లేదని, తెలుగులోకి అనువదించుకోవచ్చని తెలిపారు. ఆ పిల్లల నవలని. “కొంటెబొమ్మ సాహసాలు” పేరిట పీకాక్ క్లాసిక్స్ వారి అనుబంధ సంస్థ పీచిక్స్ ప్రచురించింది.
వర్ధమాన రచయిత శ్రీ వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన Warp and Weft అనే నవలని తెలుగులోకి “నారాయణీయం” అనే పేరుతో అనువదించాను. ఈ నవల కినిగెలో లభిస్తుంది. తెలుగు అనువాదానికి రాసిన ముందుమాటలో “అనువాదకుడి గురిచి చెప్పకుండా ముగిస్తే అది అతడికి అన్యాయం చెయ్యటమే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే: చెప్తే తప్ప ఇది అనువాదం అని తెలీదు. అంత బాగా వ్రాసాడు.” అన్నారు యండమూరి వీరేంద్రనాథ్ గారు. అభిమాన రచయిత నుంచి ఓ చిరు ప్రశంస అందుకోడం మరింత ఉత్సాహాన్నిచ్చింది.
ప్రస్తుతం ఓ సైన్స్ ఫిక్షన్ అనువాదంలో రచయితకి సహకరిస్తున్నాను.
చేతన్ భగత్ నవల “ఫైవ్ పాయింట్ సమ్‌ఒన్” చదివినప్పుడు దాన్ని తెలుగులోకి అనువదిస్తే బాగుంటుందనిపించింది. కాని నేను రచయితని సంప్రదించేసరికే తెలుగు అనువాదం సిద్ధమైపోయిందని తెలిసింది.
12. మీ సొంత కథల గురించి చెప్పండి?
చాలా తక్కువే రాసాను. పిల్లల కథలతో కలుపుకుంటే సుమారుగా నలభై ఉంటాయోమే. అనువాదాలు చేసినంత వేగంగా సొంత కథలు రాయలేను. అది నా బలహీనత.
13. అనువాదం మొదలెట్టి చెయ్యలేక వదిలేసినవి ఉన్నాయా? ఎందుకు ఆగిపోయాయి?
లేవు. కమర్షియల్ పబ్లిషర్ల కోసం అనువాదాలు చేయడం మొదలుపెట్టినప్పుడు – నాకొచ్చిన మొదటి పుస్తకమే చాలా కష్టమైన పుస్తకం. అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం తీసుకున్నా, ఆపేయలేదు. అలాగే అమర్త్యసేన్ గారి “The Idea of Justice”ని ఎమెస్కో బుక్స్ కోసం అనువదించినప్పుడు కూడా కొంత ఇబ్బందిపడ్డాను. కానీ పూర్తి చేయగలిగాను. కాకపోతే, అనివార్య కారణాల వల్ల ఈ అనువాదం ఇంకా ప్రచురితమవలేదు.
దాని తర్వాత ఇంకో నాలుగు నాన్ ఫిక్షన్ అనువాదాలు చేసాను.
14. ముందు ముందు రాయలనుకున్నవి, అనువదించాలనుకున్నవి ఏమైనా ఉన్నాయా?
ప్రస్తుతానిని ఏమీ అనుకోవడం లేదు. అయినా వంద కథల అనువాదాలు పూర్తయ్యాక, నా సొంత నవల ఒకటి రాద్దామని ఆలోచన. నవలకి కావల్సిన బాక్గ్రౌండ్ సమాచారం సేకరించాను. పాత్రల స్వభావ చిత్రణ కూడా సిద్ధం చేసుకున్నాను.
15. మీరు రాసిన అనువదించిన కథల్లో మీకు బాగా ఇష్టమైనది? బెస్ట్ అనిపించేది ఏది?
నేను అనువదించిన కథల్లో నాకు బాగా నచ్చినది – “ఓ మనిషీ, ఎందుకిలా?” అనే కథ. తర్వాతి రెండు స్థానాల్లో “అమ్రికావాలా”, ” బొమ్మ” కథలు.
నా సొంత కథల్లో ” దేవుడికి సాయం”, “ముసుగు వేయద్దు మనసు మీద” కథలు నాకు నచ్చుతాయి.
ఓ అనువాదకుడిగా ఇతరుల కథలను అనువాదం చేయడం నాకు ఆత్మసంతృప్తి కలిగిస్తే, నా కథలను వేరే రచయితలు అనువాదానికి ఎంచుకోడం గొప్ప అనుభూతి. నా కథ “పాపులర్ సుబ్బారావ్”ని అదే పేరుతో కన్నడంలోకి అనువదించారు సుప్రసిద్ధ కన్నడ మాసపత్రిక “ఉత్థాన” సంపాదకులు. నేను ఆంగ్లానువాదం ద్వారా తెలుగులోకి “బొమ్మ” పేరిట అనువదించిన తమిళ కథ “టెడ్డీబేర్”ని, నా తెలుగు అనువాదం ఆధారంగా “టెడ్డీబేర్” పేరుతో కన్నడంలోకి అనువదించారు శ్రీ. కె. కృష్ణమూర్తి.
సాహితీయాత్రలో ఓ చిన్న మైలురాయిని దాటిన ఈ సందర్భంగా, తమ కథలను తెలుగులోకి అనువదించేందుకు అనుమతించిన మూల రచయిత/త్రులకు, ఆయా కథలను ప్రచురించిన పత్రికలకు, వాటిని చదివి ప్రోత్సహించిన పాఠకులకు, సాహితీ మిత్రులకు నా కృతజ్ఞతలు.
ఆదానప్రదానాలు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తాయని విశ్వసిస్తూ…. సెలవు తీసుకుంటున్నాను.
**** * ****
సోమ శంకర్ గారి నూరవ అనువాద కథ “పలక కావాలి” ఈ నెల వాకిలిలో చదవండి!
“పరమూ పోయిందీ, ఇహమూ పోయింది. అక్కడికి వెళ్ళలేకపోయాను, ఇక్కడ ఉండలేకపోతున్నాను”
ఇది అనువాదం కాదు ఆత్మావిష్కరణ.
జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి గారు
ధన్యవాదాలు.
కొల్లూరి సోమ శంకర్