అనువాద కథ

పలక కావాలి

అక్టోబర్ 2014

కవిత తమ డాబా మీద కూర్చుని గచ్చు మీద చాక్‌పీసులతో ఏదేదో గీస్తోంది. బడిలో వాడి పాడేసిన చాక్‌పీస్‌లను ఏరుకుని జాగ్రత్తగా రుమాలులో చుట్టుకుని ఇంటికి తెచ్చుకుంటుంది కవిత. రెండు పిలకలున్న ఓ పాప బొమ్మ గీయడం ఇప్పుడే పూర్తి చేసింది. ఈ బొమ్మ తల మీద కూడా, సగటు భారతీయ విద్యార్థుల బుర్రల్లో తిరిగే అంకెలు, అక్షరాలు గుండ్రంగా తిరుగుతున్నాయి.

మావయ్య తమ ఇంటికి రావడం ఉన్నట్లుండి గమనించింది కవిత. చప్పట్లు కొడుతూ, గెంతడం ప్రారంభించింది. కవితా వాళ్ళదీ, మావయ్యదీ ఒకే ప్రహరీ గోడలో ఉండే రెండు వేర్వేరు ఇళ్ళు. కవితకీ, అక్కలకీ మావయ్య శాంతాక్లాజ్ వంటివాడు. ఎప్పుడూ ఏవో బహుమతులు, ఊహించని కానుకలు తెచ్చి ఆశ్చర్యపరుస్తుంటాడు. ఊరెళ్ళిన తమ శాంతాక్లాజ్ తిరిగొచ్చేసాడని అందరికి చెప్పడానికి గబగబా కిందకి పరిగెత్తింది కవిత.

***

ఆ సాయంత్రం కవిత టీ లో నంచుకుని బ్రెడ్ తింటూంటే మావయ్య కవిత వాళ్ళింటికి వచ్చాడు. హడావుడిగా బ్రెడ్‌ని టీ లో ముంచడంతో, అదేదో సైన్సు సంఘటనలా, టీ బల్ల మీద, కవిత గౌను మీద విరచిమ్మింది. బంకగా ఉన్న చేతులతోనూ, మరకలైన నోటితో అలాగే వెళ్ళి మావయ్య కాళ్ళకి నమస్కరించింది. మావయ్య పెద్దగా నవ్వేసి, కవిత భుజం తట్టాడు.

నలుగురు అక్కచెల్లెళ్ళు వరుసగా నిలబడి మావయ్య ఇచ్చే కానుకల కోసం ఎదురుచూస్తున్నారు. ఉన్నట్లుండి కవిత దృష్టి మావయ్య సంచిలోని ఓ వస్తువుపై పడింది.. అంతే అక్కడ్నించి చూపు మరల్చుకోలేకపోయింది. తన కానుకల సంచీలో ఓ చక్కని నల్లని పలక తెచ్చాడు మావయ్య. దాన్ని ఎలాగైనా పొందాలని అనుకుంది కవిత. ఎప్పుడు రంగురంగుల గాజుల కోసం లేదా చెప్పుల కోసం పట్టుబట్టే కవితకి ఆ నల్ల పలకతో పోలిస్తే, అవెందుకు పనికిరావనిపించింది. ఆ పలకని ఏ విధంగా ఉపయోగించుకోవాలో అని ఆలోచిస్తోంది.

ముందుగా పలక మీద అమ్మ పేరు రాసి, అమ్మకి చూపించాలనుకుంది. అమ్మకి చదువురాదు, ఎంత ఆనందిస్తుందో అనుకుంది. కాని ఇంతలోనే ఆ ఆలోచనను విరమించుకుంది. ఎందుకంటే, అమ్మ పేరు రాస్తే నాన్నకి అసూయ కలగొచ్చు, అందుకని ఆ ఆలోచనని విరమించుకుంది. తన పేరు రాసుకుని, తన పడుకునే మంచం పక్కన ఆ పలకని తగిలించుకోవాలనుకుంది. ఎన్నెన్నో ఆలోచనలు కవితని స్థిమితంగా ఉండనీయలేదు. చివరికి కుటుంబంలోని ఆరుగురు పేర్లూ రాసి, ఆ పలకని ఇంటి గడపకి తగిలిద్దాం అనుకుంది.

ఇలా కవిత ఊహల్లో తేలిపోతుండగా, మావయ్య తను తెచ్చిన కానుకలు పంచడం మొదలెట్టాడు. “మావయ్య పలకని పెద్ద అక్కకి ఇచ్చేస్తే…? అయినా అక్కకి నేనంటే ఎంతో ఇష్టం.. నేను వాడుకుంటానంటే కాదనదు…” అనుకుంది కవిత. “అమ్మో…అప్పుడు నేను అక్క చెప్పినట్లు వినాలి… రోజూ పొద్దున్నే లేవాలి… శుభ్రంగా ఉండాలి… అమ్మో చాలా షరతులు పెడుతుందక్క…” అనుకుంది. కానీ మావయ్య ఓ ఆకుపచ్చని, చమ్కీల చున్నీ తీసి కవిత పెద్దక్క చేతిలో పెట్టాడు. ఆ అమ్మాయి మురిసిపోయింది. మిగతా వాళ్ళిద్దరూ అసూయపడ్డారు… కవిత మాత్రం ఎంతో సంతోషించింది.

ఇక రెండో అక్క వంతు. ఈ అక్క అంటే కవితకి పడదు. ఇద్దరికీ ఎప్పుడూ గొడవలే.. నిన్న రాత్రి కూడా ఇద్దరికీ తగవయితే, కవిత అక్కని గోళ్ళతో రక్కింది. ఈ అక్కతో సామరస్యం సమస్యే లేదు. పలకని కవితకి ఇవ్వనే ఇవ్వదు. పైగా వెక్కిరిస్తుంది కూడా. కవిత దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టింది. ఏం చేసైనా సరే, ఆ పలకని సొంతం చేసుకోవాలనుకుంది కవిత. అయితే మావయ్య రెండో అక్క చేతిలో రంగురంగుల గాజుల సెట్‌ని ఉంచడంతో కవిత ఊహల్లోంచి బయటపడింది. కవితకి గాజులంటే ఇష్టమని తెలిసిన రెండో అక్క, కవితకేసి గర్వంగా చూసింది. అయితే కవిత కళ్ళలోని మెరుపు ఆమెకి ఆశ్చర్యం కలిగించింది.

ఇంకొక్క అడ్డంకి మిగిలి ఉంది అంతే… మూడో అక్క కూడా కవిత తరగతే. ఇద్దరికీ పలక అవసరం ఉంది. తన ఆలోచనలను రాసుకోడానికి అవకాశాలు తక్కువే అయినా, కవితకీ పలక కావాలి… హృదయం రాజీ పడలేకపోతోంది. సీతాకోకచిలుక బొమ్మలున్న చెప్పుల జతని మావయ్య మూడో అక్క చేతిలో పెడుతుండడం చూసిన కవిత మనసు గాల్లో తేలిపోయింది. పెదాలపై చిరునవ్వు వెలిసింది. ‘ఇక పలక నాదే, ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు’ అనుకుంది. ‘పగలంతా ఇంటికి నామఫలకంలా ఉంటుంది, రాత్రి నా పలకగా మారిపోతుంది… లెక్కలు చేస్తాను, బొమ్మలేస్తాను, ఏమైనా చేసుకుంటాను…’ అనుకుంది. ‘దాన్ని ఎవరితోనూ పంచుకోను. తడిగుడ్డతో జాగ్రత్తగా తుడుస్తూంటాను…’ అనుకుంది.

కానీ కవిత అంచనా దారుణంగా తప్పిపోయింది. మావయ్య కవితకి రిబ్బన్ల సెట్ ఇచ్చాడు. అందులో రంగురంగుల రిబ్బన్లు పన్నెండున్నాయి. వేసుకున్న గౌను రంగుల్ని బట్టి దానికి నప్పే రిబ్బన్లు జడకి పెట్టుకోవచ్చు. అక్కలెవరికీ అన్ని రిబ్బన్లు లేనేలేవు. సంతోషించడానికి ఎన్నో ఉన్నాయి, కాని కవిత ఆనందంగా లేదు. కలవరపడింది. పలక ఇంకా మావయ్య సంచీలోనే ఉంది, మావయ్య ఇప్పుడు శాంతాక్లాజ్‌లా అనిపించడం లేదు. కవిత వాళ్ళమ్మ ఇచ్చిన టీ ఆఖరి గుక్క తాగుతూ, “అక్కా, చూసావా, ఈ పలకని నేను మా అమ్మాయి కోసం తెచ్చాను. కాని రాత్రి ఇవ్వడం మరిచిపోయాను. అడగాలని దానికీ తోచలేదు… అయినా ఈ కాలం పిల్లలకి ఆటవస్తువులిస్తే ఎంతో సంతోషిస్తారు… పలక, పుస్తకాలు, పెన్నుల వంటి వాటి విలువ తెలుసుకోలేరు…” అన్నాడు.

కవిత వాళ్ళమ్మ తలూపి, తమ్ముడికి వీడ్కోలు పలికింది. మావయ్య వెళ్ళిపోయడు. కవిత కన్నీరుమున్నీరయింది. ఓ నీటి చుక్క కవిత కంటి నుండి జారి నేలరాలింది. వెక్కిళ్ళు పెడుతూ, గబగబా మేడ మీదకి పరిగెత్తి, అంతకు ముందు తాను గీసిన రెండు పిలకల పాప బొమ్మ కళ్ళనుండి కారుతున్నట్లుగా నీటి బొట్లని గీసింది కవిత.

*** * ***

ఆంగ్లం: శతాక్షి ఆనంద్
తెలుగు: కొల్లూరి సోమ శంకర్

మూలకథ “Black and Dull Slate” అనే పేరుతో ఇండస్ ఉమన్ రైటింగ్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్ లో ప్రచురితమయ్యింది.
మూలకథని ఈ లింక్‌లో చదవవచ్చు. http://www.induswomanwriting.com/black-and-dull-slate.html