వ్యాసాలు

స్వప్నవాసవదత్తమ్ – మొదటి భాగం

అక్టోబర్ 2014

“జరిగినది స్వప్నమే అయితే మేల్కొనకపోవడమే బాగు. అలా కాక, అది మతిచాంచల్యమయితే ఆ మతిచాంచల్యమే నాకు ఎప్పుడూ ఉండుగాక!”

యది తావదయం స్వప్నః ధన్యమప్రతిబోధనమ్ |
అథాऽయం విభ్రమో స్యాద్విభ్రమోऽస్తు మే చిరమ్ ||

****

మనిషి అన్నవాడికి కలలు రావడం సహజం. కల ముగిసి నిద్ర లేచిన తర్వాత కల తాలూకు చివరి ఘట్టపు ఛాయ ఎదురయితే? ఇలాంటి సంఘటనలు జరగడం వింత కాదు.

ఉదాహరణకు – కలలో దేవాలయానికి వెళతాం. దేవుడి ఎదుట నిలబడి ఘంటకొట్టినట్టు కలగంటాం. ఇంటిపక్కనున్న బడి గంట వినబడి ఛప్పున మెలకువ వస్తుంది.

వర్షం పడినట్టు కల. లేచిన వెంటనే ఎక్కడి నుంచో నీటి తుంపర ముఖంపై పడుతుంది. పెద్ద ఎడారిలో వెళుతున్నట్టు, గొంతెండినట్టు కల! గదిలో వేడికి నిజంగానే గొంతెండిపోయినట్లై మెలకువ వస్తుంది! ఇలాంటివి ఎన్నో! పంచతంత్రంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మడు పగటికల కంటూ కలలో భార్యను కర్రతో కొడితే, అది చివరికి తను వెంట తెచ్చుకున్న పేలపిండి కుండకు తగిలి నేలపాలైన ఉదంతం ఉంది.

ఉదయనుడు వత్సదేశానికి రాజు. ఆయన అర్ధాంగి, ఆరవప్రాణం వాసవదత్తాదేవి మరణించి కొంతకాలమయింది. కలలో పలువరిస్తున్నాడు. కలలో కూడా నామీద కోపం చేసుకున్నావా అని అడిగాడు? నేను విరచికతో పరాచికాలాడ్డం జ్ఞాపకమొచ్చిందా అని అడిగాడు. (విరచిక ఒక అంతఃపురపరిచారిక. ఆమెతో ఉదయనుడు ఓ మారు చనువుగా మాట్లాడ్డం మొదలెడితే వాసవదత్త తలవాచేట్లు చీవాట్లు పెట్టింది. అది పాతకథ.) వాసవదత్త నిజానికి మరణించలేదు. జీవించి అవంతిక అన్న మారుపేరుతో అక్కడే ఉన్న ఆమె మనసు కరిగింది. కానీ సమయం కాదు. ఎవరైనా చూడకముందే అక్కడి నుండి తప్పుకోవాలి. వెళ్ళబోతూ చివరిసారి శయ్యపై నుండి పక్కకు జారిన రాజు చేతిని సుతారంగా పైకి జరిపింది. ఛప్పున మెలకువ వచ్చింది రాజుకు. ఎదుట చీకట్లో కనిపించీ కనిపించక ఒక స్త్రీమూర్తి. ఆ స్త్రీమూర్తి తన ప్రాణప్రదమైన వాసవదత్తాదేవియే. కాకపోవడానికి వీలు లేదు. ఆమె కాక మరెవరు? తన వాసవదత్త నిజంగానే మరణించిందా? మనసు ఒప్పుకోవట్లేదు. మరి ఇక్కడ కనబడినది ఎవరు???

స్పర్శ! ఆత్మీయమైన స్పర్శ తాకినప్పుడు మనిషి పొందే ఉద్వేగానికి భాష్యంలా నాటకకర్త ఆ సన్నివేశాన్ని కళ్ళకు కట్టిస్తాడు. ఇదే కవి “ప్రతిమ” అన్న మరో నాటకంలో ఒకచోట పలికిస్తాడు. “హస్తస్పర్శో హి మాతౄణాం అజలస్య జలాంజలిః” – “తల్లి చేతి స్పర్స పుత్రుడికి – నోరెండిన వాడికి జలధార లాంటిది.”

ప్రియురాలిని మరుగున ఉంచి ఆమె తాలూకు స్పర్శను లేదా సమక్షాన్ని ప్రియుడికి కలిగించి తద్వారా కలిగే ఆనందోద్వేగాలను చిత్రీకరించటం ఒక ఆహ్లాదకరమైన సృజన. ఆ అందమైన భావన స్వప్నవాసవదత్తం అన్న నాటకంలో ఒక ప్రముఖ సన్నివేశంగా మలచబడింది. ఈ నాటకానికి కర్త భాసుడు. తదనంతరకాలంలో కుందమాల అనే నాటకంలో దిజ్ఞాగుడు అన్న కవి ఈ ప్రక్రియను సమర్థవంతంగా ఉపయోగించుకున్నాడు. కాళిదాసు విక్రమోర్వశీయంలో రసవద్ఘట్టానికి ఈ ప్రక్రియ ప్రేరణ. నాయిక ఊర్వశి ప్రియుని సమక్షంలోనే ఉంటుంది. అయితే ప్రియునికి కనిపించదు. అలా అదృశ్యంగానే ప్రియుడు పురూరవునికి భూర్జపత్రంపై ప్రేమలేఖ లిఖిస్తుంది!

స్వప్నవాసవదత్తమనే నాటకం భారతీయనాట్యకళకు కాణాచి. కాళిదాసుతో మొదలుకుని దిజ్ఞాగుడు, భవభూతి, హర్షవర్ధనుడు ప్రభృతులైన ప్రసిద్ధ నాటకకర్తలకు స్వప్నవాసవదత్తమ్ ప్రేరణ కలిగించినట్లు తెలుస్తుంది. భారత నాట్యకళను పరిపుష్టం చేసి, మార్గనిర్దేశకత్వం చేసిన ఘనుడు భాసకవి. భాసుని నాటకాలన్నింటినీ కలిపి భాసనాటకచక్రంగా వ్యవహరిస్తారు. ఈ భాసనాటకచక్రాన్ని అనుశీలనం చేసిన అనేకులు స్వప్నవాసవదత్తాన్ని అత్యుత్తమ నాటకంగా పేర్కొన్నారు. భాసనాటకాలన్నిటిలోకి ఏది గొప్పదని పరీక్షించడానికి అన్నిటినీ నిప్పులో వేస్తే స్వప్నవాసవదత్తమ్ ఒక్కటీ ఆ నిప్పుల్లో కాలిపోలేదని రాజశేఖరుడనే లాక్షణికుడు ఉత్ప్రేక్షించాడు. ఇది ఆరంకాల నాటకం. నాయకుడు ఉదయనుడనే చంద్రవంశపు రాజు. ధీరలలితుడు. ధీరలలితుడంటే – నిశ్చింతుడు, కళాసక్తుడు, సుఖి, మృదువర్తనుడు. శృంగారనాయకపరంగా దక్షిణ నాయకుడు. నాయికలిద్దరిపట్లా సమానప్రేమ. నాటకపు అంగి రసం – విప్రలంభశృంగారం. పోషకాలుగా హాస్యం, అద్భుతం, వీరం, కరుణ కనిపిస్తాయి.

భాసనాటకాలను విశ్లేషిస్తూ అనేకులు వ్యాసాలు పుస్తకాలు కూడా వ్రాశారు. ఇందుకు కారణం – నాటకాలలో సరళత్వం, పాత్రల మనస్తత్వాన్ని, సన్నివేశకల్పనలనూ వాచ్యంగా (కవిత్వరూపంలో) కాక, దృశ్యనిక్షిప్తం చేసే ప్రతిభ, సహజమైన సంభాషణలు, పాత్రౌచితి, అక్కడక్కడా జాలువారే సుందరమైన కవిత్వం, సన్నివేశనిర్వహణలో క్లుప్తత…ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈ Multi-dimensionality కారణంగా భాసుని నాటకాలు పండితులను అలరించినంతగా సామాన్యుని కూడా అలరిస్తాయి. నాటకం చదువుతున్నప్పుడు, కవి శబ్దచాతుర్యంకన్నా, నాటకపు దృశ్యం కంటి ముందు కదులాడడం ఈయన నాటకాలలో కనిపించే విశేషం. తెలుగులో స్వప్నవాసవదత్తాన్ని వ్యాఖ్యానించిన వారు, అనువదించిన వారు ఉన్నారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారిది ఒక అందమైన అనువాదం.

ఈ నాటకాన్ని, ఈ నాటకానుశీలనం ద్వారా నాట్యశాస్త్రపు అంశాలను, మరి కొన్ని అనుబంధవిషయాలను గురించి విహంగవీక్షణం చేయడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.

****

కథాసంగ్రహం
————-

వత్సదేశాన్ని ఉదయనుడనే రాజు కౌశాంబి పట్టణం రాజధానిగా పరిపాలిస్తున్నాడు. ఈతని భార్య వాసవదత్త. వత్సరాజు వాసవదత్తతోడిదే లోకంగా అంతఃపురంలో గడుపుతూ, శత్రురాజయిన ఆరుణి చేతిలో రాజ్యాన్ని కోల్పోయాడు. వత్సరాజును సరి అయిన దారిలో పెట్టడానికి, మంత్రి యౌగంధరాయణుడు ఒక చిన్న పన్నాగం పన్నుతాడు. తనూ, రాణి వాసవదత్త ఒక అగ్నిప్రమాదంలో మరణించినట్లు కల్పించి, అజ్ఞాతంగా వాసవదత్తను అవంతిక అన్న మారుపేరుతో మగధ యువరాణి పద్మావతి పర్యవేక్షణలో ఉంచుతాడు. పద్మావతి అన్న దర్శకుడు మగధరాజ్యాధిపతి. మగధ రాజ్యం బలమైన రాజ్యం. వత్సరాజుకు కోల్పోయిన తన రాజ్యం తిరిగి లభించాలంటే, ఉదయనుడు వాసవదత్తను మరవడంతో బాటు మగధ యువరాణి పద్మావతిని వివాహమాడాలి. ఇది యౌగంధరాయణుని సంకల్పం.

పద్మావతి, ఆమె పర్యవేక్షణలో ఉన్న అవంతిక (వాసవదత్త) ఒకరికొకరు దగ్గరవుతారు. అవంతిక భర్త విరహంతో దిగులు పడుతూ ఉంటుంది. ఇటుపక్క ఉదయనుడూ వాసవదత్తను మర్చిపోలేక పోతుంటాడు.

ఉదయనుని గుణగణాలు విని, మగధ రాజు దర్శకుడు అతనికి పద్మావతినిచ్చి వివాహం చేయడానికి ఒప్పుకుంటాడు. ఉదయనుడు ఈ వివాహానికి పూర్తిగా సుముఖుడు కాకపోయినా ఎలానో అంగీకరిస్తాడు. వివాహం జరుగుతుంది. ఆ తర్వాత ఉదయనునికి తన మొదటి భార్య వాసవదత్తపై అనురాగం తగ్గలేదని పద్మావతికి తెలుస్తుంది. ఆ కలవరపాటుతో ఆమెకు తీవ్రమైన తలనొప్పి వస్తుంది.

సముద్రగృహకంలో పద్మావతి తలనొప్పితో బాధపడుతూ పడుకుని ఉందని కబురందడంతో ఉదయనుడు ఆమెను చూడడానికి విదూషకుడితో బాటు వస్తాడు. అక్కడ ఆమె లేకపోవడంతో శయ్యమీద కాసేపు మేనువాలుస్తాడు. . ఇంతలో అక్కడికి అజ్ఞాతంగా ఉన్న అవంతిక (వాసవదత్త) పద్మావతి కోసం వస్తుంది. చీకట్లో మంచంపైన ఉన్నది పద్మావతి అని అనుకుంటుంది. ఇంతలో వత్సరాజు నిదురలో వాసవదత్తను పలవరిస్తాడు. పక్కనే ఉన్న అవంతిక (వాసవదత్త) ఖంగారు పడి భర్త చేతిని పక్కపై సర్ది అక్కడినుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ స్పర్శకు రాజు లేచి కూర్చుని, వాసవదత్తను చూస్తాడు. కానీ అతనికి జరిగినది కలా, నిజమా అని అనుమానంగా ఉంటుంది.

వాసవదత్త బ్రతికే ఉందన్న ఉత్సాహంతో వత్సరాజు యుద్ధోన్ముఖుడై, శత్రువును జయించి కోల్పోయిన తన రాజ్యం దక్కించుకున్నాడు. అంతలో అవంతి దేశం నుండి వాసవదత్త బంధువులు, వాసవదత్త చిత్రపటాన్ని ఉదయనునికి బహూకరించటానికి తీసుకు వస్తారు. ఉదయనుని పక్కన ఉన్న పద్మావతి ఆ చిత్రపటాన్ని చూసి, ఆమే అవంతిక అని గుర్తు పడుతుంది. దేశాంతరం నుండి మారువేషంలో ఉన్న యౌగంధరాయణుడూ అక్కడికి చేరుకున్నాడు. వాసవదత్తని, మంత్రి యౌగంధరాయణుని ఉదయనుడు గుర్తుపట్టి ఆశ్చర్యానందాలకు లోనవుతాడు. తన రాజ్యలాభం, కన్యాలాభం కోసం మంత్రి ఆడిన నాటకమని గ్రహించి మంత్రిని మెచ్చుకుంటాడు వత్సరాజు. రాజు, మంత్రి, వాసవదత్త, పద్మావతి అందరూ కలిసి కౌశాంబికి మరలడంతో ముగింపు.

****

సన్నివేశనిర్వహణ:
——————-

నాటకం అన్నది ’దృశ్య’ కావ్యం. దీన్నే visual media అంటున్నారు నేడు. చెవికన్నా, ముక్కుకన్నా, కంటి ద్వారా మెదడుకు ఎక్కువ సమాచారం చేరుతుందని నేటి శాస్త్రవేత్తలు నిర్ణయించి ఉన్నారు. అంతే కాక సమాచారం వచనం కన్నా, దృశ్యం ద్వారా ప్రభావవంతంగా చేరుతుందని మనకు తెలిసు. అందరికీ తెలిసిన ఈ చిన్న సూత్రాన్ని నాటకప్రక్రియలో సూక్ష్మనేర్పుతో ఉపయోగించడంలో భాసకవి సిద్ధహస్తుడు. ఈ ప్రక్రియ ఎంతో సహజంగా నిర్వహించడం భాసుని రోచకమైన ప్రతిభ.

నాల్గవ అంకంలో ఉదయనుడు విదూషకునితో ప్రమదవనానికి వచ్చే ఘట్టంలో ఆకాశంలో కొంగలబారు వర్ణన ఉన్నది. అక్కడ విదూషకుడు, రాజు, చేటి కొంగలబారును వేరువేరుగా చూస్తారు. రాజు కొంగలబారును రాజ్యసీమరేఖగా చూస్తే, విదూషకుడు తన స్వభావానికనుగుణంగానూ, చేటి తన ప్రవృత్తికి సరిపడినట్లు ఒక పూలమాలగా ఊహిస్తారు. వెంటవెంటనే జరిగే సన్నివేశాలలో కవి విభిన్నమైన పాత్రలలోనికి పరకాయప్రవేశం చేసి ఔచిత్యం చెడకుండా సన్నివేశాన్ని రక్తికట్టించడం అంత సులువు కాదు. ఇది భాసుని సూక్ష్మతరమైన నేర్పు.

నాల్గవ అంకం చివరన ఉదయనుని స్వభావంలో, తీరులో ఉత్సాహం కనిపిస్తుంది. కంచుకి యుద్ధవార్త చెప్పగానే అంతవరకూ ఉద్విగ్నంగా ఉన్న రాజులో యుద్ధోన్ముఖత్వం కనిపిస్తుంది. ఇది నాటకంలో ఆకర్షణీయమైన మలుపు. ఆ ఉత్సాహానికి కారణం – “వాసవదత్త బ్రతికి ఉందని రాజు మనసులో బలంగా కలిగిన భావన”గా ప్రేక్షకుడికి కవి ప్రత్యేకించి చెప్పకపోయినా తెలుస్తుంది.

సముద్రగృహంలో పద్మావతి శిరోవేదనతో విశ్రాంతి తీసుకుంటూ ఉందని ఆమెను చూడడానికి విదూషకుడూ, వత్సరాజూ అక్కడకు వచ్చారు. గృహద్వారం దగ్గర చిమ్మచీకటి. ఇక్కడ కవి అనుకుంటే – చీకటిని వత్సరాజు మనసులో మెదిలే వాసవదత్తావిరహభావశూన్యతతో పోల్చి ఒక అందమైన పద్యాన్ని “పాఠకుల” ముఖాన కొట్టి ఉండవచ్చు. కానె భాసునివంటి నిజాయితీపరుడైన కవి సామాన్యుని విస్మరించలేదు. ఈ “దృశ్యాన్ని” కవి తీర్చిన విధానం ఇదీ.

సముద్రగృహం లోనికి మొదట విదూషకుడు ప్రవేశించాడు. వెంటనే వెనకడుగు వేసి, “ఆగండి మహారాజా పాము. దీపం వెలుగులో తిరుగుతోందిక్కడ” అంటాడు. రాజు చూచి నవ్వుతూ, “మూర్ఖుడా, సర్పభ్రాన్తి” అంటాడు. పొడుగ్గా బారుగా ఉన్న ముఖతోరణమాల క్రిందికి పడి గాలికి కదులుతోందని వివరిస్తాడు. ఇక్కడ ఇదంతా ఎందుకు? అంటే – సముద్రగృహం చీకటిగా ఉంటేనే ఆ తర్వాత ఘట్టం రక్తికడుతుంది. అందువల్ల ఆ విషయాన్ని దృశ్యనిక్షిప్తం చేశాడు కవి. అంతే కాదు. ’రజ్జుసర్పభ్రాంతి’ ద్వారా తర్వాత సన్నివేశంలో నాయకుని ’వాసవదత్తాభ్రాంతిని’ underplay చేస్తాడు కవి.

చివరి అంకంలో పద్మావతి – చిత్రపటంలోని వాసవదత్తను తన సఖి అవంతికగా గుర్తుపట్టి భర్త ఉదయనునికి చెబుతుంది. ఆమెను పిలుచుకురమ్మంటాడు రాజు. ఆమె రాగానే – ఆమెను వాసవదత్తాదేవిగా ఉజ్జయిని నుండి వచ్చిన దాది గుర్తుపడుతుంది. రాజు ఉదయనుడు వెంటనే, ” ఎలాగా! మహాసేనపుత్రియా! దేవి! పద్మావతి, ఆమెతో సహా అభ్యన్తరమందిరానికి ప్రవేశించు!” అంటాడు. అభ్యన్తరానికి ఎందుకంటే ఆమె మేలిముసుగు తొలగించి ముఖం చూడటానికి – ఇది బయటకు అర్థం. జరుగుతున్న సంఘటన కలా? నిజమా? అని తెలుసుకోవాలంటే పద్మావతి కూడా తోడు ఉండాలన్న అపనమ్మకం, అవిశ్వాసం, తీవ్రమైన విస్మయం. ఆమె వాసవదత్తయే ఐతే ఉద్వేగంలో ఆమెను కౌగిలించుకుంటానేమో, అది అందరి ఎదురుగా జరిగితే బావుండదని అభ్యన్తరమందిర ప్రస్తావన. ఇలా అనేకమైన అర్థాలు ప్రేక్షకునికి గోచరిస్తాయి. అంతే కాదు అంతకు ముందు ఘట్టంలో – కల నుండి మేల్కొన్నప్పుడు వాసవదత్తను చూచినా ఉదయనునికి జరిగినది కలా నిజమా అన్న ఊగిసలాట ఉంటుంది. ఈ సారి వాసవదత్తను చూడబోతున్నప్పుడు – ఇది కల కాకూడదు అన్న రాజు ఆకాంక్షిస్తున్న ఊహ పాఠకునికి చేరుతుంది. సూటిగా ఒక విషయాన్ని చెప్పటంకన్నా పాఠకుని ఊహ ద్వారా వస్తువును ఉద్యోతించడంలోని అరుదైన నేర్పు భాసమహాకవిది.

****

సంభాషణలలో నాటకీయత:
—————————-

నాటకం – అంటే ఒక కథను సంభాషణలు, సన్నివేశకల్పనల ఆధారంగా వ్యక్తీకరించే ప్రక్రియ అని అనుకుంటే – ఆ సంభాషణలు, సన్నివేశాలు జీవచైతన్యంతో తొణికిసలాడాలి. మహాకవి భాసుడు వక్రోక్తిని చాలా నేర్పుతో ఉపయించుకోవడం అడుగడుగునా కనిపిస్తుంది. ఒక్క వాక్యంతో చెప్పగలిగిన కథకు తిరుగులేని నాటకీయత కల్పించటం ఒక ఎత్తు అయితే అడుగడుగునా సామాజికుడిని పట్టినిలిపి ఉంచే వక్రోక్తి (irony)ని పాత్రల స్వభావానికి ముడిపెట్టి ఉపయోగిస్తాడు కవి. ఈ నాటకంలో అడుగడుగునా వాసవదత్త – తన భర్త గురించి వచ్చే ప్రస్తావనల్లో తను మారుపేరుతో ఉన్నానన్న మాట మర్చిపోతూ ఉంటుంది. ఉదయనుడు వికారరూపుడైనా అతణ్ణి వరిస్తావా? అని చేటి పద్మావతిని అడిగినప్పుడు అక్కడే ఉన్న వాసవదత్త ఛప్పున అతడు చాలా అందగాడు అంటుంది. అతను అందగాడు అని నీకెలా తెలుసు అంటే – ఉజ్జయినిలో అలా చెప్పుకుంటారు అని మాట మారుస్తుంది. ఇలా రెండుమూడు సందర్భాలు ఉన్నాయి.

నటుడు/నటి మాట్లాడేప్పుడు అతడు చెప్పిన విషయంలోని విశేషార్థం ఇతరనటులలో ఒకరికి మాత్రమే అర్థమవడం మరొక విధమైన వక్రోక్తి.

ఇవి కూడా భాసుడికి కొట్టిన పిండి. మొదటి అంకంలో పద్మావతి ఆశ్రమానికి వచ్చే సందర్భంలో పరిచారికలు “తొలగండి”, “తొలగండి” అని ఆశ్రమవాసులను, అతిథులను హెచ్చరిస్తుంటారు. అప్పుడు అక్కడే ఉన్న వాసవదత్తాదేవి “నేను కూడా తొలగించబడినాను కదా” అంటుంది. ఈ మాటకు – మహారాణి అయిన నన్నూ పరిచారికలు అడ్డుతొలగమంటున్నారని, వత్సరాజుకు భార్యగా నన్ను తొలగించారని రెండు అర్థాలు ధ్వనిస్తాయి.

యౌగంధరాయణుడే స్వయంగా నియమించిన బ్రహ్మచారి అతని ఎదుటనే అబద్ధపు కల్పనలో భాగంగా – “యౌగంధరాయణుడు అన్న మంత్రి కూడా మంటల్లో పడినాడు” అంటాడు. సరిగ్గా అక్కడ యౌగంధరాయణుడు క్లుప్తంగా – “సత్యం పతిత ఇతి.” అంటాడు. నిజంగా పతితుడైనాడని, నిజంగానే పడ్డాడని, “నిజంగా పడ్డాడూ?” అని రకరకాల అర్థాలు స్ఫురిస్తాయి. అంతేకాక తన ప్రభువుకు విరుద్ధంగా తను ఆడుతున్న నాటకానికి మంత్రి పడుతున్న వేదనను ఈ క్లుప్తమైన మాట ద్వారా కవి ధ్వనింపజేస్తాడు.

విశేషమైన అర్థంలో చెబితే సామాన్యార్థంలో ఎదుటి వ్యక్తికి అర్థమవడం మరొక విధానం.

చివరి అంకంలో వాసవదత్తను చిత్రపటాన్ని చూచిన పద్మావతి – “ఈమె అవంతిక కదూ!” అంటుంది. ఆమె ఉద్దేశ్యంలో అవంతిక అంటే తన వద్ద సంరక్షణలో ఉన్న తన చెలి. ఈ సంజ్ఞార్థాన్ని వత్సరాజు అవన్తిక అంటే – అవన్తి రాజ్యపు యువరాణి అని లక్షణార్థంగా అనుకొని, “అవును ఆమె అవంతికయే!” నంటాడు. ఈ సంభాషణ కొంతసేపు ఈ పద్ధతిలో సాగుతుంది. వాసవదత్త బ్రతికే ఉందన్న ఒక అద్భుతాన్ని ఆవిష్కరించబోయే ముందు కవి కాస్త శబ్ద శ్లేషను ఉపయోగించి ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దుతాడు.

నటుడు/నటి మాట్లాడేప్పుడు అతడు చెప్పిన విషయంలోని విశేషార్థం ఆ ఘట్టంలో ఇతరనటులకు తెలియకుండా ప్రేక్షకులకు మాత్రమే అర్థమవడం వక్రోక్తికి పరాకాష్ట. ఇది సంభాషణనూ, సన్నివేశాన్ని కూడా రక్తి కట్టించే సంవిధానం. పరోక్షంగా ప్రేక్షకుడు కూడా నాటకంలో భాగంగా పరిణమింపజేసే ఒక ప్రక్రియ ఇది. కావ్యాలలో “ధ్వని” కి దృశ్యపరమైన Treatment గా ఈ సంవిధానాన్ని చెప్పుకోవచ్చు. Dramatic irony అన్న ఈ ప్రక్రియకు సంస్కృతంలో పతాకాస్థానకమని పేరు. (జరుగబోతున్న) కథను సూచించటం కూడా ఈ పతాకాస్థానకంలో ఒక అంశం.

ఆరవ అంకంలో కంచుకి వత్సరాజుతో “మహారాజా! బాధను దిగమ్రింగు. నీవు ఇంతగా ప్రేమిస్తున్న వాసవదత్త మరణించినప్పటికీ జీవించే ఉంది” అంటాడు. ఆ ఘట్టంలో వాసవదత్త దాది, పద్మావతి, కంచుకి, మహారాజు ఉంటారు. వారెవ్వరికీ, ఆ మాట చెప్పిన కంచుకికి కూడా తెలియని ఒక చమత్కారమైన నిజం అక్కడ ప్రేక్షకుని మనసును సుతారంగా తడుతుంది.

ఇలాంటి మాటను మొదటి అంకంలో బ్రహ్మచారి చెబుతాడు.

“భర్తృ స్నేహాత్ సా హి దగ్ధాऽపి న దగ్ధా” – “భర్త ప్రేమ వల్ల ఆమె దగ్ధమైనా దగ్ధం కాలేదు” అంటాడు. అక్కడ ఆ మాట – వాక్యవక్రోక్తి. ఎందుకంటే బ్రహ్మచారి కూడా యౌగంధరాయణుడు ఆడిన నాటకంలో పాత్రధారి. అతడికి వాసవదత్త బ్రతికి ఉందని తెలుసు.

(అభిషేకనాటకంలోనూ ఇలాంటి సందర్భం ఒకటి ఉంది. మధ్యమవ్యాయోగంలో భీముడు ఘటోత్కచుడితో తను మధ్యముడని చెప్పే ఘట్టం భాసుని వక్రోక్తినైపుణ్యానికి మకుటాయమానం.)

**************  ఇంకా ఉంది  ***************

స్వప్నవాసవదత్తమ్ – రెండవ భాగం వచ్చే నెల వాకిలిలో చదవండి.