సిలికాన్ లోయ సాక్షిగా

అమీగాస్

అక్టోబర్ 2014

(సిలికాన్ లోయ సాక్షిగా-18)

సూర్య ఉదయానే నిధిని వేసవి స్కూలుకి దిగబెట్టి ఆఫీసుకి వెళ్ళిపోయేడు.

బైట ఎండ వేయి విద్యుద్దీపాల్ని ఒక్క సారి వెలిగించినట్లు, కాంతి వంతంగా ఉంది. జూలై నెల ఉదయం కావడం వల్ల నును వెచ్చగానూ, హాయిగానూ ఉంది.

ఇక్కడి ఎండకీ, ఇండియాలో ఎండకీ తేడా ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. ఇక్కడ కిరణాలు సూటిగా కాకుండా ఏటవాలుగా పడ్తున్నట్లూన్నా ఒక గొప్ప ప్రకాశం ఉంటుందిక్కడి వెల్తురులో. కాలుష్యం గాలిలో ఎక్కడా లేక పోవడం వల్లనో, లేదా ఉత్తర అయన రేఖలకు దగ్గరగా ఉండడం వల్లనో, నాకు హఠాత్తుగా కాంతివంతమైన అలీసియా ముఖం గుర్తుకొచ్చింది.

మా ఇంటికి రమ్మని ఫోన్ చేసేను.

“నీకు తెల్సిందేగా, కారు లేదు నాకు” అంది అట్నించి.

“అయ్యో! అలీసియా, మా ఇంటికి నిన్ను ఏదో రకంగా రమ్మని అనడం లేదు, నేను వచ్చి పికప్ చేసుకుంటాను” అన్నాను.

వస్తూనే “ఎంత బావుంది ప్రియా మీ ఇల్లు!!” అని ముచ్చటపడింది.

కొత్తగా కొన్న రిక్లైనర్ మీద తనని రిలాక్స్డ్ గా కూచోమని రిక్లైనర్ ని వెనక్కి పడక కుర్చీలాగా వాల్చి, కాఫీ కలుపుకొచ్చేను.

“ప్రియా! నువ్వు కొంచెం కూడా మారలేదు సుమా! ఆరేళ్ల నించీ.” అంటూ
నా చెయ్యి పట్టుకుని “నీదగ్గిరికి వచ్చినపుడల్లా మా అమ్మ జ్ఞాపకం వస్తుంది.” అంది గద్గదంగా.

“హాయిగా ఇలా మీ ఇంట్లో రాజభోగాలనుభవిస్తూ ఉంటే నీ స్నేహితురాలిగా గడిస్తే చాలు ఇక జీవితం అనిపిస్తూంది.” అంది కళ్ళు మూసుకుని.
“నీకెప్పుడు కావాలన్నా వచ్చి ఎన్నాళ్లయినా ఉండొచ్చు నా దగ్గర” అన్నాను.

“అలా కాదు గానీ, నాకో ఉద్యోగం ఇవ్వరాదూ, మీ హౌస్ క్లీనర్ గానో, మీ పిల్లలకి నానీ గానో” అంది.

నేను చిర్నవ్వు నవ్వి “ఈ వయసులో ఇంకా పని చెయ్యాలని తపనెందుకు? అయినా నువ్వు నా స్నేహితురాలివి. నీతో పని చేయించుకోవడం ఏవిటి?” అన్నాను.

“పోనీ ఇంకెక్కడైనా పని చూసి పెట్టు. నాకు వచ్చిన పనులు నీకు చెప్పేను కదా. నాకా సరిగ్గా ఇంగ్లీషు రాదు. ఇక ఈ వయసు, ఆ వయసు అనేవి అమెరికాలో ఏవున్నాయి. ఎప్పుడైనా ఎవరి పాట్లు వాళ్లు పడాల్సిందే కదా” అని నవ్వింది.

ఇంతలో జీనా ఫోన్ చేసింది.”నేను మీ గరాజు బయట ఉన్నాను, తలుపు తీస్తావా” అని.

జీనా మా హౌస్ క్లీనర్. నెలకి రెండు సార్లు వచ్చి ఇంటిని అద్దంలా మెరిసేటట్లు చేసి వెళ్తుంది.

చక్కని తెల్లని, పరిశుభ్రమైన బట్టలతో అందమైన బ్రిటిష్ లేడీ లా ఉంటుంది జీనా. నిజమైన స్పానిష్ సంతతికి చెందిన ఈవిడ ఏ దేశపు రాజకుమారో ఇలా ఇక్కడెక్కడో తప్పపుట్టిందన్నట్లు ఉంటుంది.

వస్తూనే “ఓలా, కొమస్తాజ్” అంది నన్నూ, అలీసియాని.

ఇద్దరూ త్వరత్వరగా స్పానిష్ భాషలో గలగలా మాట్లాడుకున్నారు.

“ఇంట్లో మెక్సికన్ ఆవిడని చూడగానే నా ఉద్యోగం పోతుందిక మీ ఇంట్లో అనుకున్నాను. కానీ తను మీ బేబీ సిట్టర్ అని చెప్పేక నా మనసు కుదుటపడింది.” అంది జీనా.

నేను అలీసియా వైపు ప్రశ్నార్థకంగా చూసి “తను నాకు….” అనేదో చెప్పబోతూండగా అలీసియా అడ్డొచ్చి”అదేలే, ఎప్పటి నుంచో పరిచయం” అని,
జీనా మేడ పైకి వెళ్లగానే “నేను నీ మిత్రురాలినని చెప్పినా నమ్మదులే, అందుకే బేబీ సిట్టర్ అని చెప్పేను.” అని నవ్వి
“ఈ అమ్మాయి సౌత్ అమెరికన్ అనుకుంటా. స్పానిష్ సంతతికే చెందినదైనా, మాలాగా నేటివ్ ఇండియన్ పోలికలు లేవు, మంచి స్పానిష్ భాష మాట్లాడుతూంది.” అంది.

“అమ్మాయి ఏమీ కాదు, యాభై ఏళ్లట తెలుసా తనకి” అన్నాను.

ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి”అవునా! ఎంత ఆరోగ్యంగా, అందంగా ఉందో, ముప్ఫై అయిదుకి మించవనుకున్నాను, నేనూ యాభైలలో ఉన్నాను, ఏమి లాభం గున్న ఏనుగులా” అని నిట్టూర్చింది.

“నా గురించేనా” అంది జీనా నవ్వుతూ పై నించి వస్తూ.

“అవునవును” అంది అలీసియా కూడా నవ్వుతూ.

“నువ్వు చదువుకున్న దానిలా ఉన్నావు, హౌస్ క్లీనింగులెందుకు?” అంది అలీసియా.

“నీకు తెలీనిదేవుంది? హైస్కూలు దాకా చదూకున్నాను, ఆ తర్వాత కాలేజీకి వెళ్లి చదూకునే స్థోమత ఈ దేశంలో ఉందా చెప్పు? అదీగాక నాకప్పటికే మా పెద్దబ్బాయి కడుపున పడ్డాడు.”

“టీనేజ్ మామ్ వన్న మాట” అని అడ్డు తగిలింది అలీసియా.

“అవును” అని తల ఊపి “వరసగా నలుగురు పిల్లలు, మూడు పెళ్లిళ్లు, అలిసిపోయాను జీవితంలో” అని నిట్టూర్చింది.

“పిల్లల బాధ్యతలు వాళ్ల నాన్నలు సమంగా పంచుకుని చూసుకున్నారు, ఇక ఇప్పుడు పిల్లలకీ రెక్కలొచ్చాయి, గత ఏడాది నించీ ఒంటరిగా మిగిలేను. ఇలా పదిళ్ళలో పని చేయడం వల్ల నాకూ పొట్ట గడిచిపోతుంది, ఒంటరినన్న బాధా ఉండదు.” అంది గబగబా మాట్లాడుతూ జీనా.

అయిదు పదుల వయసులోనూ చురుకు తగ్గని తన కళ్లలోకి చూస్తూ “అయ్యో జీనా అయాం సారీ, నీ గురించి నేనెప్పుడూ అడిగి తెల్సుకోలేదు” అన్నాను.

“ఫర్వాలేదులే” అని చిర్నవ్వు కళ్ళ తో చూసింది నా వైపు.

అలీసియా కల్పించుకుని “ప్రియ ఇంట్లో పనిచేయడం నీ అదృష్టం, తను నిన్ను బ్రహ్మాండంగా చూస్తుంది నీకే కష్టమొచ్చినా” అంది.

“అందుకేగా, వీళ్లు ఇల్లు కొన్న దగ్గిర్నించీ నెల నెలా నేనే క్లీనర్ గా వస్తూ ఉన్నాను.” అంది.

“మా ఆయన, నేను పొట్ట చేత బట్టుకుని ఇరవై ఏళ్ల కిందట ఈ దేశానికి వచ్చేం. మా పిల్లలు ముగ్గురూ చిన్న వాళ్లు అప్పటికి. ఇక్కడికొచ్చేక మరొకడు పుట్టేడు. ఎవరూ హైస్కూలు దాటి చదువుకోలేదు, కాదు కాదు చదూకునే అవకాశం లేదని చెప్పాలి. ఇక ఇక్కడా మా లాగే పనుల్లో వాళ్లూ స్థిరపడ్డారు. రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలు. గుడ్డిలో మెల్ల ఏవిటంటే మా ఆయన నాతోనే కలిసి ఉన్నాడు. అతనికి నేను, నాకు అతను తోడుండడం వల్ల ఏ కష్టమైనా పెద్ద కష్టమనిపించదు ఒక్కోసారి.” అంది అలీసియా.

“రోజు వారీ బతుకులని అంత నిరాశ పడకు, ఉన్న దాంట్లో నేను సంతృప్తిగా బతకడం లేదూ, అయినా మన లాంటి వాళ్లకి ప్రతీ రోజూ ఎంత సంతోషంగా గడిపేమన్నదే ముఖ్యం” అంది జీనా.

“మీ లాంటి వాళ్లకు, మా లాంటి వాళ్లకూ కాదు. ప్రతీ ఒక్కరికీ అదే ముఖ్యం. ఈ రోజు ఎంత సంతోషంగా గడుస్తుందన్నదే.” అన్నాను నేను మధ్యలో.
“అదే కాదు, నా జీవితంలో నేనే విషయానికీ ఎక్కువ సేపు మథన పడను, ఎప్పుడూ సంతోషంగా, ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నిస్తాను, సాధ్యమైనంత వరకూ ఎదుటి వారికి సాయం చేస్తాను.” అంది జీనా.

అలీసియా నవ్వుతూ, “మరో ప్రియ వన్న మాట నువ్వు” అని
” ఇక్కడి ఆర్థిక స్థితి కన్నా బాధించేది ఇక్కడి సంస్కృతి, మా పిల్లలు ఇక్కడే పెరిగేరు కదా, ఇక్కడి పరిస్థితులకీ, ఈ దేశపు సంస్కృతికీ అలవాటు పడిపోయేరు, పెద్ద వాడు అమ్మా, నాన్నా అనే తలంపు లేకుండా తన జీవితం తను చూసుకుని వెళ్లిపోయేడు, పెద్దమ్మాయి డైవర్సు తీసుకుని ఇద్దరు పిల్లలతో తన పాట్లు తను పడుతూంది. చిన్నది పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లల తల్లయ్యింది. ఇద్దరికీ తండ్రులు వేరు. ఒక్కడూ నిలవలేదు. సింగిల్ మామ్ గా నానా కష్టాలూ పడుతూంది. చిన్నవాడు మొన్నీ మధ్యే గర్ల్ ప్రెండుని, ఉద్యోగాన్నీ చూసుకుని ఇల్లు వదిలి వెళ్లిపోయేడు.” అని నిట్టూర్చింది అలీసియా.

“ఈ విషయం లో మీ దేశానికీ, మా దేశానికీ పోలికలున్నాయి, నువ్వూ మా దేశపు సగటు స్త్రీ లాగే ఆలోచిస్తున్నావు అలీసియా” అన్నాను.
అంతలో జీనా అందుకుంది.”నాకు మరే దేశమూ తెలీదు, నాకు ఊహ తెలీక ముందే మా అమ్మా, నాన్నా కాలిఫోర్నియాకి వచ్చేరట. ఇక్కడే నా తొమ్మండుగురు అక్క చెల్లెళ్లూ, అన్నదమ్ములూ పుట్టేరు. నేను పూర్తిగా ఈ దేశపు అమ్మాయిని, అయినా మా అమ్మ నీ లాగే ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోలేదు. మా అమ్మా, నాన్న లకి దాదాపు ఎనభై ఏళ్లుంటాయి. ఇద్దరూ ఆరోగ్యం గానే ఉన్నారు. మేం ఇక్కడి సంస్కృతిలో పెరిగి జీవితాలు గడుపుతున్నామేమో కానీ మా అమ్మా, నాన్నల్ని వృద్ధాప్యంలో బైటికి వదిలేయలేదు, నేను మా అక్కచెల్లెళ్ళూ, అన్నదమ్ములూ అందరం ఒక్కోనెలా ఒక్కొళ్ళ ఇంట్లో ఉంచుకుంటాం వాళ్లని.

ప్రియా! మీ దేశంలోనూ ఇలాగే ఉంటుందా?” అంది.

నేను సమాధానం చెప్పేలోగా “నిన్ను చూస్తే ఒరిజినల్ స్పానిష్ యువతివనుకున్నాను, నువ్వు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీ పద్ధతులన్నీ మా లోకల్ అమెరికన్ ఇండియన్ పద్ధతిలే, అని మెచ్చుకోలుగా చూస్తూ
“అయినా నేను బాధపడ్తూన్నది తల్లిదండ్రుల్ని చూడడం, చూడకపోవడం అనే దాన్ని గురించి కాదు. అమెరికా ఎంతో సంపన్న దేశమని అంటారు, కానీ మన లాంటి వాళ్ల బతుకులు ఎప్పటికీ గొర్రె తోక బెత్తెడు గానే మిగిలిపోతున్నాయి కదా. ఇక పిల్లల భవిష్యత్తు అనే పదమే హాస్యాస్పదంగా తయారైంది. నాకు తెల్సి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ అందరి పిల్లలూ షాపింగ్ మాళ్ల లోనో, రెస్టారెంట్లలోనో, ఇంటి క్లీనర్లు గానో, బేబీ సిట్టర్ లు గానో పనిచేసే వాళ్లే. మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డ వాళ్లు నూటికీ, కోటికీ కూడా కనబడరు. మంచి చదువు చదివించే స్థోమత మనకెలా లేదో, రేప్రొద్దున్న మన పిల్లల పిల్లలకూ ఉండదు. మా పిల్లలకి మంచి భవిష్యత్తు నిద్దామని మేమీ దేశానికి వచ్చాం. ఏదీ? ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇక్కడ సంపాదించుకున్నది ఇంటి అద్దె కట్టడానికే సరిపోదు. ఇక కాలేజీ చదువులు, మంచి ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి. అదీగాక కాలేజీ వయస్సుకే వేరు కాపురాలు పెడ్తున్నారు పిల్లలు, ఇక జంజాటం లో కొట్టుకుపోవడానికి తప్ప జీవితంలో ఎదిగే ఆసక్తి, అవకాశం ఎక్కడున్నాయి వీళ్లకి? ” అంది అలీసియా.

“మా దేశంలో మీరన్నట్లు అన్నీ ఉన్నాయి గానీ ఉన్నత విద్య మరీ ఇక్కడంత భారం కాదు, కాబట్టే చాలా మంది విద్యావంతులు కాగలుగుతారు, అవకాశం, అదృష్టం అంది వస్తే మాలా విదేశాలకూ రాగలుగుతారు. ఇక ఉద్యోగం వచ్చేలోగా జీవితంలో స్థిరపడడం, పసి వయసుల్లోనే పార్ట్నర్లని వెతుక్కోవడం వంటివి మా సమాజంలో హర్షణీయం కాదు” అన్నాను.

“అవును, ఇక్కడి సమాజం స్పాయిల్డ్ సమాజం, పైకి కనిపించే మెరుగులు లోపల లేని దుష్ట సమాజం” అంది అలీసియా.

అంతలో జీనా “ఇది నా దేశం కాబట్టి నువ్వలా మాట్లాడడాన్ని నేను సహించను, కానీ ఒక విషయం చెపుతాను. నువ్వు, మీ పిల్లలు ఇప్పుడు ఇక్కడి సమాజంలో భాగ స్వాములు, మీకిది కష్టమైనా , నష్టమైనా తిరిగి మీరిక మీ దేశానికి వెళ్లలేరని అనుకుంటున్నాను. కాబట్టి ఈ సమాజాన్ని అంగీకరించడం తప్ప నీకు వేరే మార్గం లేదు, మనశ్సాంతీ లేదు” అని లేచింది జీనా.

ఉదయం సూటిగా ఇంట్లోకి పడిన ఎండ మాయమై పదకొండు గంటల వేళ బైటి వాకిట్లో చెట్ల సందుల్లోంచి ముక్కలు ముక్కలు గా పడ్తూంది.
ఆకుల నీడల్లో దోబూచులాడుతూ వెల్తురు కుంచెతో గొప్ప చిత్రాలు అదే పనిగా గీస్తున్నట్లు గాలి కదలికలకి నేలమీద రకరకాల వెల్తురు నీడల చిత్రాలు మారుతున్నాయి.

అన్నట్లు జీనా”అలీసియా మా బేబీ సిట్టర్ కాదు, నా ప్రాణ మిత్రురాలు” అన్నాను అలీసియాని కౌగలించుకుంటూ.

నా చేతుల్లోకి ఒదిగి పోయి “ఎటు చూసినా అంధకారం లో నా జీవితం లోకి పక్కింటి అమ్మాయి గా ఆరేళ్ల కిందట అడుగు పెట్టి, నా జీవితంలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమించింది ప్రియ. తనతో చెప్పుకుంటే నా బాధలన్నీ తీరిపోతాయి. మేమిద్దరం “అమీగాస్ పారా సియంప్రే”, అని స్థిమితంగా నవ్వింది అలీసియా.

“అంటే, మీరేనా “ప్రెండ్స్ ఫరెవర్!” నన్నూ చేర్చుకోరూ మీ ప్రెండ్ షిప్పు లోకి” అంది జీనా మా ఇద్దరినీ ప్రశంసా పూర్వకంగా చూస్తూ.

**** ** ****

వీడ్కోలు-
కథలు రాయడం బొత్తిగా రాదనో, రాయడం కష్టమనో చాలా అరుదుగా కథలు రాసే నాతో తప్పనిసరిగా కథలు రాయాలనిపింపజేసాయి అమెరికాలో నాకెదురైన బడుగు జీవితాల అంతర్గత సమస్యలు.
“సిలికాన్ లోయ సాక్షిగా” కథలు రాయడానికి తొలి ప్రోత్సాహం కలిగించిన ఈ కథల లోని సజీవ పాత్రలైన అందరికీ,
ప్రతి కథనీ ఓపికతో విని అడుగడుగునా సూచనలిచ్చిన మా అమ్మ శ్రీమతి కె. వరలక్ష్మి కి ఈ కథలు అంకితం-
తప్పకుండా రాయమని ప్రోత్సాహం కలిగించిన అఫ్సర్ గారికి, ప్రచురించిన రవి వీరెల్లి, వాకిలి సంపాదక వర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు-
సిలికాన్ లోయ సాక్షిగా కథలు ఇంతటితో సమాప్తం-
నిజానికి కథలు ముగించడానికి ఒక గొప్ప వ్యథా వేదన గుండెనంటింది. బహుశా: కథలు రాస్తున్నంతసేపూ నేను పాత్రల్లో లీనమై సంభాషించడమో, సన్నివేశాల వెనుక జ్ఞాపకాలు నిరంతరం కళ్లముందు కదలాడడం వల్లనో. ఈ కథల్లోని పాత్రలైన నా మిత్రులందరినీ దూరం చేస్తున్న మెలి తిప్పే బాధ. అయినా ప్రతీ కథ మొదలు వెనుకా ముగింపు సిద్ధమై ఉంటుందనే కఠోర వాస్తవాన్నీ యథాతధంగా స్వీకరిస్తూ పాఠకులందరికీ వీడ్కోలు-
-కె.గీత